123. నూట ఇరువది మూడవ అధ్యాయము
నకుల సహదేవుల పుట్టుక - పాండవుల నామకరణము.
వైశంపాయన ఉవాచ
కుంతీపుత్రేషు జాతేషు ధృతరాష్ట్రాత్మజెషు చ ।
మద్రరాజసుతా పాండుం రహోవచనమబ్రవీత్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. కుంతికి (ముగ్గురు) కొడుకులు పుట్టారు. ధృతరాష్ట్రునకు (నూర్గురు) కొడుకులు పుట్టారు. ఆ తరువాత మాద్రి ఏకాంతంలో పాండురాజుతో ఇలా అన్నది. (1)
న మేఽస్తి త్వయి సంతాపః విగుణేఽపి పరంతప ।
నావరత్వే వరార్హాయాః స్థిత్వా చానఘ నిత్యదా ॥ 2
గాంధార్యాశ్పైవ నృపతే జాతం పుత్రశతం తథా ।
శ్రుత్వా న మే తథా దుఃఖమ్ అభవత్ కురునందన ॥ 3
పరంతపా! కురునందనా! నీవు పిల్లలను కనలేని స్థితిలో ఉన్నా నేను బాధపడటంలేదు. నేను కుంతీదేవి కన్న మిన్న అయిన దానను. కాని మహారాణి కాలేకపోయాను. దానికి కూడా నేను బాధపడటం లేదు. రాజా! గాంధారికి వందమంది కొడుకులు పుట్టారు. అది వినికూడా నేను బాధపడలేదు. (2,3)
ఇదం తు మే మహద్ దుఃఖం తుల్యతాయామపుత్టతా ।
దిష్ట్యా త్విదానీం భర్తుర్మే కుంత్యామప్యస్తి సంతతిః ॥ 4
అయితే నన్ను బాగా బాధిస్తున్న విషయమిది. నేను, కుంతీదేవి పత్నులమయినా నాఖు సంతానం లేకపోవటం మాత్రం దుఃఖకారణ మవుతోంది. అయితే భాగ్యవశాన నాభర్తకు కుంతిగర్భంనుండి సంతతి కలిగింది. (4)
యది త్వపత్యసంతానం కుంతిరాజసుతా మయి ।
కుర్యాదనుగ్రహో మే స్యాత్ తవ చాపి హితం భవేత్ ॥ 5
కుంతి దయతలచి నాకు కూడా పిల్లలను కనే అవకాశం కల్పిస్తే అది నాకు ఎంతో మేలు చేసినట్లవుతుంది. నీకు కూడా అది హితకరమే కాగలదు. (5)
సంరంభో హి సపత్నిత్వాద్ వక్తుం కుంతిసుతాం ప్రతి ।
యది తు త్వం ప్రసన్నో మే స్వయమేనాం ప్రచోదయ ॥ 6
కుంతి నాకు సవతి కాబట్టి ఈ విషయాన్ని నేను ఆమె నడగటానికి అభిమానం అడ్డువస్తోంది. నాపై మీకు ఆ ఆదరముంటే నాకోసం కుంతీదేవిని మీరే ప్రోత్సహించాలి. (6)
పాండురువాచ
మమాప్యేష సదా మాద్రి హృద్యర్థః పరివర్తతే ।
న తు త్వాం ప్రసహే వక్తుమ్ ఇష్టానిష్టవివక్షయా ॥ 7
పాండురాజిలా అన్నాడు. మాద్రీ! నామనస్సులో కూడా ఈ భావం నిరంతరంగా మెదులుతూనే ఉంది. అయితే నీకిష్టమున్నదో లేదో అని సంశయించి నీకు నేను ఈవిషయం చెప్పలేదు. (7)
తవత్విదం మతం మత్వా ప్రయతిష్యామ్యతః పరమ్ ।
మన్యే ధ్రువం మయోక్తా సా వచనం ప్రతిపత్స్యతే ॥ 8
నీ అభిప్రాయం కూడా ఇదే అని తెలిసింది కాబర్రి ఇకపై నేను ప్రయిత్నిస్తాను, నేను చెపితే కుంతి తప్పక నామాట వింటుందని అనుకొంటున్నాను. (8)
వైశంపాయన ఉవాచ
తతః కుంతీం పునః పాండుః వివిక్త ఇదమబ్రవీత్ ।
కులస్య మమ సంతానం లోకస్య చ కురు ప్రియమ్ ॥ 9
మమ చాపిండనాశాయ పూర్వేషామపి చాత్మనః ।
మత్ప్రియార్థం చ కళ్యాణి కురు కళ్యాణముత్తమమ్ ॥ 10
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ తరువాత పాండురాజు ఏకాంతంలో కుంతితో ఇలా అన్నాడు - కళ్యాణీ! నా వంశానికి సంతానాన్నీ, నా ప్రజలకు ప్రియాన్నీ నీవు కల్పించాలి. నాకు, నా పూర్వీకులకు పిండంలేని స్థితి కలుగకూడదు. నా కోసం నీవు ఒక కళ్యాణకరమైన మంచిపని చేయాలి. (9,10)
యశసో-ర్థాయ చైవ త్వం కురుకర్మ సుదుష్కరమ్ ।
ప్రాప్రాధిపత్యమింద్రేణ యజ్ఞైరిష్టం యశోఽర్థినా ॥ 11
నాయశస్సును విస్తరింపజేయటానికి నీవు దుష్కరమయిన పని ఒకటి చేయాలి. ఇంద్రుడు కూడా స్వర్గాధిపత్యాన్ని పొందిన తర్వాత కుడా కీర్తికోసం ఎన్నో యాగాలు చేశాడు. (11)
తథా మంత్రవిదో విప్రాః తపస్తప్త్వా సుదుష్కరమ్ ।
గురూనభ్యుపగచ్ఛంతి యశసోఽర్థాయ భావిని ॥ 12
భావినీ! మంత్రవేత్తలయిన బ్రాహ్మణులు కూడా ఘోరతపస్సులను చేసిన తర్వాత కూడా కీర్తికోసం గురువుల నాశ్రయిస్తున్నారు. (12)
తథా రాజర్షయః సర్వే బ్రాహ్మణాశ్చ తపోధనాః ।
చక్రురుచ్చావచం కర్మ యశసోఽర్థాయ దుష్కరమ్ ॥ 13
అదేవిధంగా రాజర్షులందరూ, తపోధనులయిన బ్రాహ్మణులూ కీర్తికోసం, పెద్దవో, చిన్నవో-దుష్కర కార్యాల నెన్నింటినో చేశారు. (13)
సా త్వం మాద్రీం ప్లవేనైవ తారయైనామనిందితే ।
అపత్యసంవిభాగేన పరాం కీర్తిమవాప్నుహి ॥ 14
దోషరహితా! అదేవిధంగా నీవు కూడా ఈ మాద్రిని పడవనెక్కించుకొని గట్టుకు చేర్చు. ఆమెకు కూడా సంతానాన్ని కల్గించి ఘనకీర్తిని పొందు. (14)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వాబ్రవీత్ మాద్రీం సకృచ్చింతయ దైవతమ్ ।
తస్మాత్ తే భవితాపత్యమ్ అనురూపమసంశయమ్ ॥ 15
వైశంపాయనుడిలా అన్నాడు. పండురాజు ఇలా అన్న తరువాత కుంతి మాద్రితో ఇలా అన్నది - ఒక్కసారి ఏ దేవతనయినా మనస్సులో తలచుకో. దానితో నీకు తగిన సంతతి కలుగుతుంది. సందేహించ నవసరం లేదు. (15)
తతో మాద్రీ విచార్యైవం జగామ మనసాశ్వినౌ ।
తావాగమ్య సుతౌ తస్యాం జనయామాసతుర్యమౌ ॥ 16
ఆపై మాద్రి బాగా ఆలోచించి మనస్సులో అశ్వినీ దేవతలను తలచుకొన్నది. వారు వచ్చి ఆ మాద్రికి కవలపిల్లలను అనుగ్రహించారు. (16)
నకులం సహదేవం చ రూపేణాప్రతిమౌ భువి ।
తథైవ తావపి యమౌ వాగువాచాశరీరిణీ ॥ 17
వారు నకులుడూ, సహదేవుడూ. లోకంలో అందంతో వారికి సాటిరాగలవారు లేరు. ఆ కవలపిల్లలను గురించి కూడా అశరీరవాణి ఇలా పలికింది. (17)
సత్త్వరూపగుణోపేతా భవతోఽత్యశ్వినావితి ।
భాసతస్తేజసాత్యర్థం రూపద్రవిణసంపదా ॥ 18
ఈ కవలలు బుద్ధి, రూప, గుణాలలో అశ్వినీ దేవతల్ను కూడా మించిపోగలరు. తమ తేజస్సు, రూపసంపదలతో ఎంతో ప్రకాశిస్తారు. (18)
నామాని చక్రిరే తెషాం శతశృంగనివాసినః ।
భక్త్యా చ కర్మణా చైవ తథాశీర్భిర్విశాంపతే ॥ 19
రాజా! శతశృంగనివాసులయిన మహర్షులు వారికి నామకరణం చేశారు. వారిని ఆశీర్వదిస్తూ వారి భక్తినీ, చేష్టలనూ అనుసరించి పేర్లు పెట్టారు. (19)
జ్యేష్ఠం యుధిష్ఠిరేత్యేనం భీమసేనేతి మధ్యమమ్ ।
అర్జునేతి తృతీయం చ కుంతో పుత్రానకల్పయన్ ॥ 20
కుంతి పెద్దకొడుకు యుధిష్ఠిరుడు, మధ్యముడు భీమసేనుడు, మూడవవాడు అర్జునుడు అని కుంతిపుత్రులకు పేర్లు పెట్టారు. (20)
పూర్వజం నకులేత్యేవం సహదేవేతి చాపరమ్ ।
మాద్రీపుత్రావకథయన్ తే విప్రాః ప్రీతమానసాః ॥ 21
ప్రీతమనస్కులయిన ఆ విప్రులు మాద్రి కొడుకులలో పెద్దవాడిని నకులుడనీ, రెండవవాడిని సహదేవుడనీ వ్యవహరించారు. (21)
అనుసంవత్సరం జాతా అపి తే కురుసత్తమాః ।
పాండుపుత్రా వ్యరాజంత పంచ సంవత్సరా ఇవ ॥ 22
కురుశ్రేష్ఠులైన ఆ పాండవులు సంవత్సరానికి ఒక్కొక్కరుగా పుట్టారు. అయినా దేవతారూపులు కాబట్టి అయిదు సంవత్సరాలవలె సమానంగానే శోభించేవారు. (22)
మహాసత్త్వా మహావీర్యాః మహాబలపరాక్రమాః ।
పాండుర్దృష్ట్వా సుతాంస్తాంస్తు దేవరూపాన్ మహౌజసః ॥ 23
ముదం పరమికాం లేభే ననంద చ నరాధిపః ।
ఋషీణామపి సర్వేషాం శతశృంగనివాసినామ్ ॥ 24
ప్రియా బభూవుస్తాసాం చ తథైవ మునియోషితామ్ ।
కుంతీమథ పునః పాండుః మాద్ర్యర్థే సమచోదయత్ ॥ 25
ఆ పాండవులంతా గొప్పధైర్యం, గొప్ప వీర్యం, గొప్ప బలపరాక్రమాలూ కలవారు. మహాతేజస్వులూ, దేవస్వరూపులూ అయిన ఆకొడుకులను చూచి పాండురాజు ఎంతో ఆనందాన్ని పొందాడు. శతశృంగనివాసులయిన మహర్షులకూ, మునిపత్నులకూ కూడా ఆ పాండవులు ఎంతో ముచ్చట గొలిపేవారు. ఆ తర్వాథ పాండురాజు మరలా మాద్రికి సంతానాన్ని కల్గించాలని కుంతిని ప్రేరేపించారు. (23-25)
తమువాచ పృథా రాజన్ రహస్యుక్తా తదా సతీ ।
ఉక్తా సకృద్ ద్వంద్వమేషా లేభే తేనాస్మి వంచితా ॥ 26
రాజా! ఏకాంతంలో పాండురాజు కుంతిని అడగగానే ఆమె ఇలా అన్నది - రాజా! నేను ఒక్కబిడ్డను కనమని ఆమెను నియోగించాను. కానీ ఆమె ఇద్దరిని పొందింది. నన్ని మోసగించింది. (26)
బిభేమ్యస్యాః పరిభవాత్ కుస్త్రీణాం గతిరీదృశీ ।
నాజ్ఞాసిషమహం మూఢా ద్వంద్వాహ్వానే ఫలద్వయమ్ ॥ 27
తస్మాన్నాహం నియోక్తన్యా త్వయైషోఽస్తు వరో మమ ।
ఏవం పాండోః సుతాః పంచ దేవదత్తా మహాబలాః ॥ 28
సంభూతాః కీర్తిమంతశ్చ కురువంశవివర్ధనాః ।
శుభలక్షణసంపన్నాః సోమవత్ ప్రియదర్శనాః ॥ 29
నాకు భయం కలుగుతోంది. ఆమె నన్ను పరాభవించే అవకాశమున్నది. అశ్వినీదేవతలను ఇద్దరిని ఆహ్వానించటంవలన ఇద్దరు కొడుకులను పొందగలదని నేను ఊహించలేకపోయాను. కాబట్టి మరలా నన్ను ఆపనికై నియోగించవద్దు. నాకు ఆ వరమివ్వండి. ఈవిధంగా పాండురాజుకు అయిదుగురు కొడుకులయ్యారు. వారు దేవతలు అనుగ్రహించి ఇచ్చినవారు. మహాబలులూ, కీర్తిమంతులూ, కురువంశ వివర్ధనులూ, శుభలక్షణ సంపన్నులూ, చంద్రునివలె చూడముచ్చటైనవారు. (27-29)
సింహదర్పా మహేష్వాసాః సింహవిక్రాంతగామివః ।
సింహగ్రీవా మనుష్యేంద్రాః వవృధుర్దేవవిక్రమాః ॥ 30
వివర్ధమానాస్తే తత్ర పుఞేహైమవతే గిరౌ ।
విస్మయం జనయామాసుః మహర్షీణాం సమేయుషామ్ ॥ 31
వారు సింహాలవలె పౌరుషం, కంఠం, గంభీరగమనం గలవారు. మహాధనుర్ధరులు. దేవపరాక్రములు. మనుజశ్రేష్ఠులు. ఆ పవిత్రహిమలయపర్వతంపై ఎదుగుతూ అక్కడున్న మహర్షులకు అందరకూ ఆశ్చర్యాన్ని కల్గించారు. (30,31)
(జాతమాత్రానుపాదాయ శతశృంగనివాసినః ।
పాండోః పుత్రానమన్యంత తాపసాః స్వానివాత్మజాన్ ॥
తతస్తు వృష్ణయః సర్వే వసుదేవపురోగమాః ।
పాండుః శాపభయాద్ భీతః శతశృంగముపేయివాన్ ।
తత్త్రైవ మునిభిః సార్ధం తాపసోఽభూత్ తపశ్చరన్ ॥
శాకమూలఫలాహారః తపస్వీ నియతేంద్రియః ।
ధ్యానయోగపరో రాజా బభూవేతి చ వాదకాః ॥
ప్రబ్రువంతి స్మ బహనః తచ్ఛ్రుత్వా శోకకర్శితాః ।
పాండోః ప్రీతిసమాయుక్తాః కదా శ్రోష్యామ సత్కథాః ॥
ఇత్యేవం కథయంతస్తే వృష్ణయః సహబాంధవైః ।
పాండోః పుత్రాగమం శ్రుత్వా సర్వే హర్షసమన్వితాః ॥
సభాజయంతస్తేఽన్యోన్యం వసుదేవం వచోఽబ్రువన్ ।
శతశృంగనివాసులయిన తాపసులు పాండుకుమారులు పుట్టినప్పటి నుండీ వారిని సొంత బిడ్డలవలె భావించి లాలించసాగారు. ఆ తర్వాత ద్వారకలో వసుదేవుడు మొదలయిన వృష్ణివంశజులు పాండురాజును గురించి ఇలా అనుకోసాగారు- పాండురాజు మునిశపంవలన భయపడి శతశృంగాన్ని చేరాడు. అక్కడ్ తాపసులతో కలిసి తపస్సు చేస్తూ తాపసి అయ్యాడు. శాకమూల ఫలాలను ఆహారంగా స్వీకరిస్తూ, నియతేంద్రియుడై, ధ్యానయోగపరాయణుడైన్ సాధకుడుగా రూపొందాడని వార్తాహరులు అంటున్నారు. ఆమాటలు విని యదువంసస్థులు ఎందరో పాండురాజు మీద గల ఆదరంవలన ఖిన్నులయ్యారు. ఆయనను గురించి శుభసమాచారాలను ఎప్పుడు వినగలమా అని ఎదురు చూడసాగారు. ఈవిధంగా వృష్ణివంసజులు అనుకొంటున్న సమయంలోనే పాండురాజుకు సంతానం కలిగిన విషయం తెలిసింది. వారంతా ఆనందమగ్నులై ఒకరినొకరు అభినందించుకొంటూ వసుదేవునితో ఇలా అన్నారు.
వృష్ణయ ఊచుః
న భవేరన్ క్రియాహీనాః పాండోః పుత్రా మహాయశః ।
పాండోః ప్రియహితాన్వేషీ ప్రేషయ త్వం పురోహితమ్ ॥
వృష్ణి వంశజులు ఇలా అన్నారు - కీర్తిమంతా వసుదేవా! పాండుకుమారులు బాలసంస్కారాలను కోలుపోరాదు. పాండురాజుకు ఇష్ణుడవు, హితకాంక్షివి అయిన నీవు పురోహితుని పంపించు.
వైశంపాయన ఉఽఅచ
వసుదేవస్తథేత్యుక్త్వా విససర్జ పురోహితమ్ ।
యుక్తాని చ కుమారాణాం పారిబర్హాణ్యనేకశః ॥
కుంతీం మాద్రీం చ సందిశ్య దాసీదాసపరిచ్ఛదమ్ ।
గాశ్చ రౌప్యం హిరణ్యం చ ప్రేషయామాస భారత ॥
వైశంపాయనుడిలా అన్నాడు - వసుదేవుడు అలాగే అని అంగీకరించి పురోహితుని పంపించాడు. కుమారులకు తగిన వస్త్ర భూషణాలనూ, కుంతికీ, మాద్రికీ అవసరమయిన దాసదాసీ జనాలనూ ఆభరణాలను, గోవులనూ, వెండినీ, బంగారాన్నీ కూడా పంపించాడు.
తాని సర్వాణి సంగృహ్య ప్రయయౌ స పురోహితః ।
తమాగతం ద్విజశ్రేష్ఠం కాశ్యపం వై పురోహితమ్ ॥
పూజయామాస విధివత్ పాండుః పరపురంజయః ।
పృథా మాద్రీ చ సంహృష్టే వసుదేవం ప్రశంసతామ్ ॥
వాటినన్నింటినీ వెంటతీసికొని పురోహితుడు వెళ్ళాడు. పరపురంజయుడైన ఆ పాండురాజు తన దగ్గరకు వచ్చిన ఆ పురోహితుని-ద్విజశ్రేష్ఠుడైన కాశ్యపుని - శాస్త్రోక్తంగా అర్చించాడు. కుంతి, మాద్రి కూడా ఆనందించి వసుదేవుని ప్రశంసించారు.
తతః పాండుః క్రియాః సర్వాః పాండవానామకారయత్ ।
గర్భాధానాదికృత్యాని చౌలోపనయనాని చ ॥
కాశ్యపః కృత్వాన్ సర్వమ్ ఉపాకర్మచ భారత ।
చౌలోపనయనాదూర్ధ్వమ్ ఋషభాక్షా యశస్వినః ॥
వైదికాధ్యయనే సర్వే సమపద్యంత పారగాః ।
ఆ తర్వాత పాండురాజు తన కొడుకులకు గర్భాధానం నుండి చౌలోపనయనాల వరకు సర్వసంస్కారాలనూ జరిపించాడు. పురోహితుడైన ఆ కాశ్యపుడే అంతా జరిపించాడు. పెద్ద పెద్ద కన్నులు గలవారూ, కీర్తిమంతులూ అయిన ఆ పాండవులు చౌలోపనయనాల తర్వాత ఉపాకర్మను ముగించుకొని వేదాధ్యయనం ప్రారంభించి దానిలో పారంగతులయ్యారు.
శర్యాతేః పృషతః పుత్రః శుకో నామ పరంతపః ॥
యేన సాగరపర్యంతా ధనుషా నిర్జితా మహీ ।
అశ్వమేధశతైరిష్ట్వా స మహాత్మా మహామఖైః ॥
ఆరాధ్య దేవతాః సర్వాః పితౄనపి మహామతిః ।
శతశృంగే తపస్తేపే శాకమూలఫలాశనః ॥
తేనోపకరణశ్రేష్ఠైః శిక్షయా చోపబృంహితాః ।
తత్ప్రసాదాత్ ధనుర్వేదే సమపద్యంత పారగాః ॥
భారతా! శర్యాతివంసస్థుడైన ఒకరాజు పృషత్కుడు. ఆయన కొడుకు సుకుడు. పరంతపుడైన ఆ శుకుడు విలువిద్యతో సాగరపర్యంతమయిన ఈ భూమిని
జయించి, వంద అశ్వమేధయాగాలను చేసి, ఆ యాగాలతో సమస్తదేవతలనూ, పితరులనూ ఆరాధించి శాకమూలఫలాశనుడై శతశృంగపర్వతంలో తపస్సు చేశాడు. ఆ తాపసి శ్రేష్ఠమయిన ఉపకరణాలతోనూ, అధ్యాపనతోనూ పాండవులను వృద్ధిపొందింపజేశాడు. ఆయన అనుగ్రహం వలన పాండవులు ధనుర్విద్యాపారంగతులయ్యారు.
గదాయాం పారగో భీమః తోమరేషు యుధిష్ఠిరః ।
అసి చర్మణి నిష్ణాతౌ యమౌ సత్త్వవతాం వరౌ ॥
ధనుర్వేదే గతః పారం సవ్యసాచీ పరంతపః ।
శుకేన సమనుజ్ఞాతః మత్సమోఽయమితి ప్రభో ।
అనుజ్ఞాయ తతో రాజా శక్తిం ఖడ్గం తథా శరాన్ ॥
ధనుశ్చ దదతాం శ్రేష్ఠః తాలమాత్రం మహాప్రభమ్ ।
విపాఠక్షురనారాచాన్ గృధ్రపత్రానలంకృతాన్ ॥
దదౌ పార్థాయ సంహృష్టః మహోరగసమప్రభాన్ ।
అవాస్య సర్వశస్త్రాణి ముదితో వాసవాత్మజః ॥
మేనే సర్వాన్ మహీపాలాన్ అపర్యాప్తాన్ స్వతేజసః ।
భీముడు గదాయుద్ధంలోనూ, ధర్మరాజు తోమరాలు విసరటంలోనూ సత్త్వసంపన్నులయిన నకులసహదేవులు కత్తి,డాలూ పట్టడంలోనూ, పరంతపుడయిన అర్జునుడు ధనుర్విద్యలోనూ పారంగతులయ్యారు. శుకుడు తన అంతటివానిగా అర్జునుని భావించాడు. ఆపై మహాదాత అయిన ఆ శుకుడు ఆనందించి శక్తినీ, ఖడ్గాన్నీ, బాణాలనూ, తాటిచెట్టువలె ఉన్నతమై మెరిసిపోయే ధనుస్సునూ, విపాఠినీ, చురకత్తినీ అర్జునునకిచ్చారు. ఆ బాణాలు గ్రద్ద ఈకలు గలవి. అలంకరింపబడినవీ. పెద్దపెద్ద పాములవలె ప్రకాశించేవి. ఆ శస్త్రాలన్నీ పొంది అర్జునుడు ఆనందించాడు. రాజులందరూ కూడా తన తేజస్సుకు చాలరని భావించాడు.
ఏకవర్షాంతరాస్త్వేవం పరస్పరమరిందమాః ।
అన్వవర్ధంత పార్థాశ్చ మాద్రీపుత్రౌ తథైవ చ ॥)
అరిందములయిన ఆ కుంతీ పుట్ర్హులు ఒక్కొక్క యేడు తేడా గలవారు. ఆ కౌంతేయులూ, మాద్రేయులూ కూడా వర్ధిల్లసాగారు.
తే చ పంచశతం చైవ కురువంశవివర్ధనాః ।
సర్వే వవృథురల్పేన కాలేనాప్స్వివ నీరజాః ॥ 32
ఈ విధంగా కురువంశవర్ధనులయిన నూట అయిదుగురు బాలురు కూడా నీటిలో తామరలవలె స్వల్పకాలంలోనే వృద్ధిపొందారు. (32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పాండవోత్పత్తౌ త్రయోవింశత్యధిక దశాధిక శతతమోఽధ్యాయః ॥ 123 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున పాండవోత్పత్తి నూట ఇరువది మూడవ అధ్యాయము. (123)
(దాక్షిణాత్య ఆధికపాఠం 23 శ్లోకాలతో కలిసి మొత్తం 55 శ్లోకాలు)