126. నూట ఇరువదియారవ అధ్యాయము

పండురాజు అంత్యక్రియలు.

ధృతరాష్ట్ర ఉవాచ
పాండోర్విదుర సర్వాణి ప్రేతకార్యాణి కారయ ।
రాజవద్ రాజసింహస్య మాద్రాశ్పైవ విశేషతః ॥ 1
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. విదురా! రాజశ్రేష్ఠుడయిన ఈ పాండురాజుకూ, విశేషించి మాద్రికి రాజోచితంగా ప్రేతకార్యాలను నిర్వహింప జేయవలసినది. (1)
పశూన్ వాసాంసి రత్నాని ధనాని వివిధాని చ ।
పాండోః ప్రయచ్ఛ మాద్ర్యాశ్చ యేభ్యో యావచ్చ వాంఛితమ్ ॥ 2
యథా చ కుంతీ సత్కారం కుర్యాన్మాద్రాస్తథా కురు ।
యథా న వాయుర్నాదిత్యః పశ్యేతాం తాం సుసంవృతామ్ ॥ 3
మాద్రీపాండురాజులకొరకు పశువులనూ, వస్త్రాలనూ, రత్నాలనూ, వివిధధనాలనూ దానంచేయి. ఎవరు ఎంత కోరితే వారికంత ఇవ్వు.
కుంతి మాద్రికి చేయవలసిన సత్కారాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయించు. మాద్రి అస్థికలను వాయువూ, ఆదిత్యుడూ కూడా చూడలేనివిధంగా చక్కగా కప్పి ఉంచు. (2,3)
న శోచ్యః పాండురనఘః ప్రశస్య స నరాధిపః ।
యస్య పంచ సుతా వీరాః జాతాః సురసుతోపమాః ॥ 4
పాపరహితుడైన పాండురాజును గూర్చి జాలిపడనవసరం లేదు. అతడు గొప్పరాజు. దేవతాసమానులయిన వీరులను - అయిదుగురు కొడుకులను పొందాడు. (4)
వైశంపాయన ఉవాచ
విదురస్తం తథేత్యుక్త్వా భీష్మేణ సహభారత ।
పాండుం సంస్కారయామాస దేశే పరమపూజితే ॥ 5
వైశంపాయనుడిలా అన్నాడు. భారతా! విదురుడు 'అలాగే' అని ధృతరాష్ట్రునితో పలికి భీష్మునితో కలిసి పరమ పవిత్ర ప్రదేశంలో పాండురాజుకు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయించాడు. (5)
తతస్తు నగరాత్ తూర్ణమ్ ఆజ్యగంధపురస్కృతాః ।
నిర్హృతాః పావకా దీప్తాః పాండో రాజన్ పురోహితైః ॥ 6
వెంటనే పాండురాజదహన సంస్కారం కోసం పురోహితులు నగరం నుండి నేయి, గంధం మొదలయిన సామాగ్రితో పాటు జ్వలిస్తున్న అగ్నిని కూడా తీసికొనివచ్చారు. (6)
అథైనామార్తవైః పుష్పైః గంధైశ్చ వివిధైర్వరైః ।
శిబికాం తామలంకృత్య వాససాఽఽచ్ఛాద్య సర్వశః ॥ 7
ఆ తరువాత ఆ (వసంత) ఋతువులో పూచిన వివిధ శ్రేష్ఠ పుష్పాలతోనూ, గంధాలతోనూ ఒక పల్లకిని అలంకరించి దానిని నాలుగు వైపులా వస్త్రాలతో కప్పివేశారు. (7)
తాం తథా శోభితాం మాల్యైః వాసోభిశ్చ మహాధనః ।
అమాత్యా జ్ఞాతయశ్చైనం సుహృదశ్చోపతస్థిరే ॥ 8
ఆ విధంగా విలువయిన వస్త్రాలతోనూ, పూలదండలతోనూ ప్రకాశిస్తున్న ఆ పల్లకి దగ్గరకు మంత్రులూ, జ్ఞాతులూ, మిత్రులూ అందరూ వచ్చి చేరారు. (8)
నృసింహం నరయుక్తేన పరమాలంకృతేన తమ్ ।
అవహన్ యానముఖ్యేన సహ మాద్య్రా సుసంయతమ్ ॥ 9
దానిలో మాద్రీపాండురాజుల అస్థికల నుంచారు. అందంగా అలంకరింపబడి మనుష్యులచే మోయబడుతున్న ఆ పల్లకిలోనికి వాటిని చేర్చారు. (9)
పాండురేణాతపత్రేణ చామరవ్యజనేన చ ।
సర్వవాదిత్రనాదైశ్చ సమలంచక్రిరే తతః ॥ 10
తెల్లని గొడుగుతోనూ, వింజామరలతోనూ, వివిధ మంగళ వాద్యాలతోనూ దాని శోభను వర్ధిల్లజేశారు. (10)
రత్నాని చాప్యుపాదాయ బహూని శతశో నరాః ।
ప్రదదుః కాంక్షమాణేభ్యః పాండోస్తస్యౌర్ధ్వదేహికే ॥ 11
పాండు రాజునకు ఆ విధంగా ఔర్ధ్వదైహిక క్రియను నిర్వహిస్తున్న ఆ వేళలో వందల మంది ప్రజలు ఎన్నో రత్నాలను తెచ్చి, కోరినవారందరికీ ఇచ్చారు. (11)
అథచ్ఛత్రాణి శుభ్రాణి చామరాణి బృహంతి చ ।
ఆజహ్రుః కౌరవస్యార్థే వాసాంసి రుచిరాణి చ ॥ 12
ఆపై ఆ పాండురాజు కోసం శుభ్రమయిన గొడుగులనూ, పెద్ద పెద్ద చామరాలనూ, అందమయిన వస్త్రాలను తీసికొని వచ్చారు. (12)
యాజకైః శుక్లవాసోభిః హూయమానా హుతాశనాః ।
అగచ్ఛన్నగ్రతస్తస్య దీప్యమానాః స్వలంకృతాః ॥ 13
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చైవ సహస్రశః ।
రుదంతః శోకసంతప్తాః అనుజగ్ముర్నరాధిపమ్ ॥ 14
ఆ పల్లకి ముందు తెల్లని బట్టలు ధరించిన యాజకులు అగ్నిహోత్రంలో ఆహుతులను వేస్తూ నడవసాగారు. ఆ అగ్నిహోత్రాలు చక్కగా అలంకరింపబడి ప్రజ్వరిల్లుతున్నాయి. శోక సంతప్తులయిన బ్రాహ్మణులూ, క్షత్రియులూ, వైశ్యులూ, శూద్రులూ వేలకొలదిగ చేరి విలపిస్తూ పాండురాజు అస్థికలున్న పల్లకిని అనుసరించారు. (13,14)
అయమస్మానపాహాయ దుఃభే చాధాయ శాశ్వతే ।
కృత్వా చాస్మాననాథాంశ్చ యాస్యతి నరాధిపః ॥ 15
'ఈ మహారాజు మనలను విడి, మనలను శశ్వత దుఃఖంలో ముంచి, అనాథులను చేసి ఎక్కడికి వెళ్తున్నాడు?' అని ఆక్రోశిస్తున్నారు. (15)
క్రోశంతః పాండవాః సర్వే భీష్మో విదుర ఏవ చ ।
రమణీయే వనోద్దేశే గంగాతీరే సమే శుభే ॥ 16
న్యాసయామాసురథ తాం శిబికాం సత్యవాదినః ।
సభార్యస్య నృసింహస్య పాండోరక్లిష్టకర్మణః ॥ 17
పాండవులందరూ, భీష్ముడూ, విదురుడూ ఆక్రోశిస్తూ పల్లకి వెంట నడిచారు. గంగాతీరంలోని ఒక సమతల శుభ ప్రదేశంలో అందమయిన తోటలో సత్యవాదియై, అనాయాసకార్యసాధకుడైన ఆ పాండురాజు, మాద్రుల అస్థికలున్న ఆ పల్లకిని నిలిపారు. (16,17)
తతస్తస్య శరీరంతు సర్వగంధాధివాసితమ్ ।
శుచికాలీయకాదిగ్ధం దివ్యచందనరూషితమ్ ॥ 18
పర్యషించన్ జలేనాశు శాతకుంభమయైర్ఘటైః ।
చందనేన చ శుక్లేన సర్వతః సమలేపయన్ ॥ 19
కాలాగురువిమిశ్రేణ తథా తుంగరసేన చ ।
అథైనం దేశజైః శుక్లైః వాసోభిః సమయోజయన్ ॥ 20
ఆ తరువాత ఆ పాండురాజు అస్థికలను సర్వవిధ సుగంధాలతో అలంకరించి బంగారు కలశాలతో తెచ్చిన నీటితో అభిషేకించారు. ఆపై పసుపు తుంగరసం కలిపిన గంధాన్నీ, శ్వేత చందనాన్నీ వాటిపై పూశారు. ఆపై తెల్లని స్వదేశవస్త్రాలతో వాటిని కప్పారు. (18-20)
సంఛన్నః స తు వాసోభిః జీవన్నివ నరాధిపః ।
శుశుభే స నరవ్యాఘ్రః మహార్హశయనోచితః ॥ 21
గొప్ప గొప్ప పడకలపై శయనించదగిన ఆ నరశ్రేష్ఠుడైన పాండురాజు అస్థికలు వస్త్రాచ్ఛాదనచేత సజీవ మనుష్యుని వలె శోభిల్లసాగాయి. (21)
(హయమేధాగ్నినా సర్వే యాజకాః సపురోహితాః ।
వేదోక్తేన విధానేన క్రియాశ్చక్రుః సమంత్రకమ్ ॥)
యాజకైరభ్యనుజ్ఞాతే ప్రేతకర్మణ్యనుష్ఠితే ।
ఘృతావసిక్తం రాజానం సహ మాద్య్రా స్వలంకృతమ్ ॥ 22
యాజకులూ, పురోహితులూ అందరూ సమంత్రకంగా వేదోక్తవిధానంతో అశ్వమేధాగ్నితో సర్వక్రియలనూ ముగించారు. ప్రేతకర్మను ప్రారంభించే సమయంలో యాజకుల అనుమతితో చక్కగా అలంకరింపబడిన ఆ మాద్రి పాండురాజుల అస్థికలను నేతితో అభిషేకించారు. (22)
తుంగపద్మకమిశ్రేణ చందనేన సుగంధినా ।
అన్యైశ్చ వివిధైర్గంధైః విధినా సమదాహయన్ ॥ 23
తుంగపద్మకంతో కలిసి పరిమళిస్తున్న గంధంతోనూ, తదితరమయిన అనేక గంధద్రవ్యాలతోనూ విధ్యుక్తప్రకారంగా దహన సంస్కారం జరిపించారు. (23)
తతస్తయోః శరీరే ద్వే దృష్ట్వా మోహవశం గతా ।
హాహా పుత్రేతి కౌసల్యా పపాత సహసా భువి ॥ 24
ఆ సమయంలో ఆ ఇద్దరి అస్థికలనూ చూచి అంబాలిక 'అయ్యో కుమారా'అని అంటూ మూర్ఛిల్లి నేలపై పడిపోయింది. (24)
తాం ప్రేక్ష్య పతితామార్తాం పౌరజానపదో జనః ।
రురోద దుఃఖసంతప్తః రాజభక్త్యా కృపాన్వితః ॥ 25
ఆర్తయై ఆ రీతిగా పడిపోయిన అంబాలికను చూసి పురజనులూ, గ్రామీణులూ అందరూ రాజభక్తితో, జాలితో శోకసంతప్తులై రోదించసాగారు. (25)
కుంత్యాశ్చైవార్తనాదేన సర్వాణి చ విచుక్రుశుః ।
మానుషైః సహభూతాని తిర్యగ్యోనిగతాన్యపి ॥ 26
కుంతి ఆర్తనాదంతో పశుపక్ష్యాదులకు సంబంధించిన సమస్త ప్రాణులతో సహా మనుష్యులు అందరూ ఆక్రోశించారు. (26)
తథా బీష్మః శాంతనవః విదురశ్చ మహామతిః ।
సర్వశః కౌరవాశ్చైవ ప్రాణదన్ భృశదుఃఖితాః ॥ 27
తతో భీష్మోఽథ విదురః రాజా చ సహపాండవైః ।
ఉదకం చక్రిరే తస్య సర్వాశ్చ కురుయోషితః ॥ 28
ఆ తరువాత భీష్ముడా, విదురుడూ, ధృతరాష్ట్రుడూ, పాండవులు, కౌరవకుల కాంతలూ అందరూ పాండురాజుకు ధర్మోదకాలను సమర్పించారు. (28)
చుక్రుశుః పాండవాః సర్వే భీష్మః శాంతనవస్తథా ।
విదురో జ్ఞాతయశ్చైవ చక్రుశ్చాప్యుదకక్రియాః ॥ 29
ఆ సమయంలో పాండవులంతా ఆక్రోశించారు. శంతనుసుతుడైన భీష్ముడూ, విదురుడూ ఇతర జ్ఞాతులూ విలపించి, జలాంజలిని సమర్పించారు. (29)
కృతోదకాంస్తానాదాయ పాండవాన్ శోకకర్శితాన్ ।
సర్వాః ప్రకృతయో రాజన్ శోచమానా న్యవారయన్ ॥ 30
రాజా! జలాంజలిని సమర్పించి శోకంతో బలహీనపడిన పాండవులను అమాత్యాదిప్రజలందరూ తాము దుఃఖంలో ఉండి కూడా ఓదార్చారు. (30)
యథైవ పాండవా భూమౌ సుషుపుః సహ బాంధవైః ।
తథైవ నాగరా రాజన్ శిశ్యిరే బ్రాహ్మణాదయః ॥ 31
తద్గతానందమస్వస్థమ్ ఆకుమారమహృష్టవత్ ।
బభూవ పాండవైఃసార్థం నగరం ద్వాదశ క్షపాః ॥ 32
రాజా! పండ్రెండు రాత్రుల వరకూ పాండవులు బంధువులతో పాటు నేలమీదనే నిద్రించారు. అదేవిధంగా నాగరికులయిన బ్రాహ్మణాదులు కూడా నేలమీదనే నిదురించారు. పాండవులతో బాటు హస్తినాపురమంతా ఆనందానికి దూరమైంది. చిన్నా పెద్దా అందరూ దుఃఖంలో మునిగిపోయారు. నగరమంతా అస్వస్థతకు లోనయింది. (31,32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పాండుదాహే షడ్వింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 126 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున పాండుదాహమను నూట ఇరువది యారవ అధ్యాయము. (126)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి మొత్తం 33 శ్లోకాలు)