127. నూట ఇరువది యేడవ అధ్యాయము

పాండవ ధార్తరాష్ట్రుల బాల్యక్రీడలు.

వైశంపాయన ఉవాచ
తతః కుంతీ చ రాజా చ భీష్మశ్చ సహ బంధుభిః ।
దదుః శ్రాద్ధం తదా పాండోః స్వధామృతమయం తదా ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ తరువాత కుంతి, ధృతరాష్ట్రుడూ, భీష్ముడూ, ఇతర బంధువులూ కలిసి పాండురాజుకూ అమృతమైన స్వధామయమయిన శ్రాద్ధాన్ని పెట్టారు. (1)
కురూంశ్చ విప్రముఖ్యాంశ్చ భోజయిత్వా సహస్రశః ।
రత్నౌఘాన్ విప్రముభ్యేభ్యః దత్త్వా గ్రామవరాంస్తథా ॥ 2
ఆ సంధర్భంలో కౌరవులకూ, వేలకొలది బ్రాహ్మణులకూ భోజనం పెట్టి రత్మాలరాసులను పంచిపెట్టారు. విప్రులలో ప్రధానమైన వారికి మంచి గ్రామాలను దానం చేశారు. (2)
కృతశౌచాం స్తతస్తాంతు పాండవాన్ భరతర్షభాన్ ।
ఆదాయ వివిశుః సర్వే పురం వారణసాహ్వయమ్ ॥ 3
భరతశ్రేష్ఠులైన పాండవులు మృతాశౌచం నుండి బయటపడి శుద్ధిస్నానం చేసిన తరువాత పాండవులను తీసికొని అందరూ హస్తినాపురికి చేరారు. (3)
సతతం స్మానుశోచంతః తమేవ భరతర్షభమ్ ।
పౌరజానపదాః సర్వే మృతం స్వమివ బాంధవమ్ ॥ 4
పౌరజానపదులందరూ ఆ పాండురాజునే నిత్యమూ తలచుకొంటూ తమ బంధువే మరణించినట్లు శోకావిష్టులయ్యారు. (4)
శ్రాద్ధావసానే తు తదా దృష్ట్వా తం దుఃఖితం జనమ్ ।
సమ్మూఢాం దుఃఖశోకార్తాం వ్యాసో మాతరమబ్రవీత్ ॥ 5
శ్రాద్ధం ముగిసిన పిమ్మట జనులందరి దుఃఖాన్ని గమనించి వ్యాసుడు దుఃఖశోకాతురయై నిశ్చేతనలో ఉన్న తల్లితో ఇలా అన్నాడు. (5)
అతిక్రాంతసుఖాః కాలాః పర్యుపస్థితదారుణాః ।
శ్వః శ్వః పాపిష్ఠదివసాః పృథివీ గతయౌవనా ॥ 6
సుఖాలననుభవించే కాలం గడచిపోయింది. భయంకర సమయం సమీపిస్తోంది. రాను రానూ చెడ్డరోజులు రాబోతున్నాయి. నేల యౌవనాన్ని కోల్పోయింది. (6)
వి: తె: దీనిని నన్నయ్య సార్వకాళిక సూక్తివలె తెనిగించినాడు.
మతిఁ దలఁపఁగ సంసారం
బతిచంచల మెండమావు లట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు
గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్. (1-5-159)
బహుమాయాసమాకీర్ణః నానాదోషసమాకులః ।
లుప్తధర్మక్రియాచారః ఘోరః కాలో భవిష్యతి ॥ 7
రాబోవు కాలంలో అందరూ కపటంగా, మాయావులుగా జీవిస్తారు. అనేక దోషాలు రూపుదిద్దుకొంటాయి. ధర్మక్రియలూ, సదాచారాలూ నశిస్తాయి. కాలం భయంకరంగా ఉంటుంది. (7)
కురుణామనయాచ్చాపి పృథివీ న భవిష్యతి ।
గచ్ఛ త్వం యోగమాస్థాయ యుక్తా వస తపోవనే ॥ 8
కౌరవుల అవినీతి వలన భూమండలమంతా నాశనమైపోతుంది. కాబట్టి నీవు యోగమార్గాన్ని ఆశ్రయించి ఇక్కడ నుండి వెళ్ళిపో. తపోవనంలో నివసించు. (8)
మా ద్రాక్షీస్త్వం కులస్యాస్య ఘోరం సంక్షయమాత్మనః ।
తథేతి సమనుజ్ఞాయ సా ప్రవిశ్యాబ్రవీత్ స్నుషామ్ ॥ 9
ఈ వంశానికి కలిగే ఘోరసంక్షోభాన్నీ, వినాశనాన్నీ నీవు చూడలేవు. అప్పుడు సత్యవతి ఆ మాటను అంగీకరించి, లోనికి ప్రవేశిమ్చి కోడలితో ఇలా అన్నది. (9)
అంబికే తవ పౌత్రస్య దుర్ణయాత్ కిల భారతాః ।
సానుబంధా వినఙ్ క్ష్యంతి పౌరాశ్చైవేతి నః శ్రుతమ్ ॥ 10
అంబికా! నీపౌత్రుని దుర్నీతి వలన భరతవంశమూ, ఈ పౌరులూ బంధుమితులతో సహా నశిస్తారు. ఈ మాట నేను విన్నది. (10)
తత్ కౌసల్యా మిమామార్తాం పుత్రశోకాభిపీడితామ్ ।
వనమాదాయ భద్రం తే గచ్ఛామి యది మన్యసే ॥ 11
కాబట్టి నీకిష్టమయితే పుత్రశోకంతో బాధపడుతున్న ఈ అంబాలికను తీసికొని అరణ్యానికి వెళ్తున్నాను. నీకు శుభమగు గాక. (11)
తథేత్యుక్తా త్వంబికయా భీష్మమామంత్య్ర సువ్రతా ।
వనం యయౌ సత్యవతీ స్నుషాభ్యాం సహ భారత ॥ 12
భారతా! అంబిక అలాగే అని అంగీకరించింది. ఆపై సువ్రత అయిన సత్యవతి భీష్మునితో సంప్రదించి తన కోడళ్ళనిద్దరినీ తీసికొని అరణ్యానికి వెళ్ళిపోయింది. (12)
తాః సుఘోరం తపస్తప్త్వా దేవ్యో భరతసత్తమ ।
దేహం త్యక్త్వా మహారాజ గతిమిష్టాం యయుస్తదా ॥ 13
భరతశ్రేష్ఠా! మహారాజా! ఆ రాణులు ఘోరతపస్సు చేసి, శరీరాలను విడిచి అభీష్టగతులను పొందారు. (13)
వైశంపాయన ఉవాచ
అథాప్తవంతో వేదోక్తాన్ సంస్కారాన్ పాండవాస్తదా ।
సంవ్యవర్ధంత భోగాంస్తే భుంజానాః పితృవేశ్మని ॥ 14
వైశంపాయనుడిలా అన్నాడు - అప్పుడు పాండవులు వేదోక్తమైన సంస్కారాలను పొందారు. తండ్రి యింట వివిధ భోగాలను అనుభవిస్తూ చక్కగా ఎదగసాగారు. (14)
ధార్త రాష్ట్రైశ్చ సహితాః క్రీడంతో ముదితాః సుఖమ్ ।
బాలక్రీడాసు సర్వాసు విశిష్టాస్తేజసాభవన్ ॥ 15
ధార్తరాష్ట్రులతో సుఖంగా ఆడుకొంటూ ఆనందంగా ఉండేవారు. బాలక్రీడలన్నింటిలో తమ తేజస్సు వలన వారే గొప్పగా రాణించేవారు. (15)
జవే లక్ష్యాభిహరణే భోజ్యే పాంసువికర్షణే ।
ధార్తరాష్ట్రాన్ భీమసేనః సర్వాన్ స పరిమర్దతి ॥ 16
పరుగెత్తటంలో, లక్ష్యాన్ని ముందుగా తీసికొని రావటంలో, తినటంలో, మట్టిని వెదజల్లే ఆటలో (ఉప్పన బట్టెలు మొదలగునవి) భిమసేనుడే ధార్తరాష్ట్రులందరినీ ఓడించేవాడు. (16)
హర్షాత్ ప్రకీడమానాంస్తాన్ గృహ్య రాజన్ నిలీయతే ।
శిరఃసు వినిగృహ్యైతాన్ యోధయామాస పాండవైః ॥ 17
శతమేకోత్తరం తేషాం కుమారాణాం మహౌజసామ్ ।
ఏక ఏవ నిగృహ్ణాతి నాతికృచ్ఛ్రాద్ వృకోదరః ॥ 18
కచేషు చ నిగృహ్యైనాన్ వినిహత్య బలాద్ బలీ ।
చకర్ష క్రోశతో భూమౌ ఘృష్టజానుశిరోంసకాన్ ॥ 19
రాజా! ధార్త రాష్ట్రులు ఆనందంగా ఆడుకొంటుంటే వారిని పట్టుకొని ఎక్కడో దాగిఉండేవాడు. వారిని పట్టుకొని పాండవులతో పోరించేవాడు. మహాతేజస్సు గల నూటొక్కమంది ధార్తరాష్ట్రులనూ వృకోదరుకొక్కడే తేలికగా లొంగదీసికొనేవాడు. బలిష్ఠుడైన భీమసేనుడు ధార్తరాష్ట్రుల జట్టుపట్టుకొని బలవంతంగా ఒకరితో ఒకరిని మోదించేవాడు. వారు ఆక్రోశిస్తున్నా లెక్కచేయకుండా నేల మీద పడవేసి ఈడ్చేవాడు. అపుడు వారి మోకాళ్ళు తలలూ, భుజాలు దోక్కొనిపోయేవి. (17-19)
దశ బాలాన్ జలే క్రీడన్ భుజాభ్యాం పరిగృహ్య సః ।
ఆస్తే స్మ సలిలే మగ్నః మృతకల్పాన్ విముంచతి ॥ 20
జలక్రీడలాడేటప్పుడు పదిమంది ధార్తరాష్ట్రులనూ తన భుజాలతో పట్టుకొని నీటిలో మునిగి ఉండేవాడు. వారిప్రాణాల మీదకు వచ్చినప్పుడే విడిచి పెట్టేవాడు. (20)
ఫాలాని వృక్షమారుహ్య విచిన్వంతి చ తే తదా ।
తదా పాదప్రహారేణ భీమః కంపయతే ద్రుమాన్ ॥ 21
ధార్తరాష్ట్రులు చెట్టెక్కి పండ్లు కోసుకొంటున్న సమయంలో భీముడు కాలితో తన్ని ఆ చెట్లను కంపింపజేసేవాడు. (21)
ప్రహార వేగాభిహతా ద్రుమా వ్యాఘార్ణితాస్తతః ।
సఫలాః ప్రపతంతి స్మ ద్రుతం త్రస్తాః కుమారకాః ॥ 22
భీముడు తీవ్రవేగంతో ఆ చెట్లను కొట్టడం వలన అవి నిలువెల్లా కంపించేవి. భయపడిన ఆ ధార్తరాష్ట్రులు పళ్ళతోపాటు చెట్టు నుండి పడేవారు. (22)
న తే నియుద్ధే న జవే న యోగ్యాసు కదాచన ।
కుమారా ఉత్తరం చక్రుః స్పర్ధమానా వృకోదరమ్ ॥ 23
కుస్తీ పట్టడంలోగానీ,పరుగెత్తటంలో గానీ, చదువులో గానీ ధార్తరాష్ట్రులు భీమసేనునితో పోటీపడేవారే కానీ ఎప్పుడూ సమానం కాలేకపోయేవారు. (23)
ఏవం సధార్తరాష్ట్రాంశ్చ స్పర్ధమానో వృకోదరః ।
అప్రియే-తిష్ఠదత్యంతం బాల్యాన్న ద్రోహచేతసా ॥ 24
ఈ రీతిగా భీమసేనుడు ధార్తరాష్ట్రులతో పోటీపడి నెగ్గుతూ వారికి ఇష్టంలేని పనులెన్నో చేసేవాడు. అయితే అవి బాల్యచెష్టలే కానీ ద్రోహచింతనతో చేసినవి కావు. (24)
తతో బలమతిఖ్యాతం ధార్తరాష్ట్రః ప్రతాపవాన్ ।
భీమసేనస్య తద్ జ్ఞాత్వా దుష్టభావ మదర్శయత్ ॥ 25
అపుడు ప్రతాపవంతుడయిన్ దుర్యోధనుడు భీముసేనునిలోని బలవిశేషాన్ని గ్రహించి అతని విషయంలో చెడుగా ప్రవర్తించేవాడు. (25)
తస్య ఢర్మాదపేతస్య పాపాని పరిపశ్యతః ।
మోహాదైశ్వర్యలోభాశ్చ పాపా మతి రజాయత ॥ 26
దుర్యోధనుడు ధర్మానికి దూరమైన వాడూ, పాపదృష్టి గలవాడు కూడా. మోహం వలన ఐశ్వర్యలోభం వలనా అతనికి పాపబుద్ధి పుట్టింది. (26)
అయం బలవతాం శ్రేష్ఠః కుంతీపుత్రో వృకోదరః ।
మధ్యమః పాండుపుత్రాణాం నికృత్యా సంనిగృహ్యతామ్॥ 27
కుంతీకుమారుడూ, పాండవమధ్యముడూ అయిన భీమసేనుడు బలవంతులలో శ్రేష్ఠుడు. వాడిని మోసగించి బంధించాలి. (27)
ప్రాణవాన్ విక్రమీ చైవ శౌర్యేణ మహతాన్వితః ।
స్పర్ధతే చాపి సహితాన్ అస్మానేకో వృకోదరః ॥ 28
విడు బలవంతుడూ, పరాక్రమవంతుడూ, మహాశూరుడు కూడా. మనమంతా కలిసి ఉన్నా ఆ భీమసేనుడొక్కడే మనతో పోటీకి రాగల్గుతున్నాడు. (28)
తం తు సుప్తం పురోద్యానే గంగాయాం ప్రక్షిపామహే ।
అథ తస్మాదవరజం శ్రేష్ఠం చైవ యుధిష్ఠిరమ్ ॥ 29
ప్రసహ్య బంధనే బద్ధ్వా ప్రశాసిష్యే వసుంధరామ్ ।
ఏవం స నిశ్చయం పాపః కృత్వా దుర్యోధనస్తదా ।
నిత్య మేవాంతరప్రేక్షీ భీమస్యాసీన్మహాత్మనః ॥ 30
ఆ బీమసేనుడు నగరోద్యానవనంలో నిదురించే సమయంలో పట్టుకొని గంగానదిలో పడవేద్దాం. ఆ తర్వాత అతని తమ్ముడు అర్జునునీ, అన యుధిష్ఠిరునీ బలాత్కారంగా బంధించి ఈ భూమిని పరిపాలిస్తాను. ఈ విధంగా పాపాత్ముడైన దుర్యోధనుడు నిశ్చయించుకొని భీమసేనునకు కీడు చేయటానికి తగిన అవకాశం కోసం అనుక్షణం ఎదురుచూడసాగాడు. (29,30)
తతో జలవిహారార్థం కారయామాస భారత ।
చైలకంబలవేశ్మాని విచిత్రాణి మహాంతి చ ॥ 31
జనమేజయా! ఆ తరువాత దుర్యోధనుడు జలవిహారం కోసం ఉన్ని నూలు బట్టలతో విచిత్రమైన పెద్దపెద్ద గుడారాలు వేయించాడు. (31)
సర్వకామైః సుపూర్ణాని పతాకోచ్ఛ్రాయవంతి చ ।
తత్ర సంజనయామాస నానాగారాణ్యనేకశః ॥ 32
ఆ గుడారాలు అవసరమయిన సర్వసామగ్రితో నిండి ఉన్నాయి. ఎత్తైన పతాకలతో అలరారుతున్నాయి. వాటిలో వేరే వేరు గదులను ఎన్నింటినో ఏర్పాటు చేశారు. (32)
ఉదకక్రీడనం నామ కారయామాస భారత ।
ప్రమాణకోట్యాం తం దేశం స్థలం కించిదుపేత్య హ ॥ 33
గంగా తీరంలోని ప్రమాణకోటి అనుపేరుగల తీర్థంలో ఒకానొక ప్రదేశంలో ఈ ఏర్పాట్లనీ చేయించి దానికి ఉదకక్రీడనమని పేరు పెట్టాడు. (33)
భక్ష్యం భోజ్యం చ పేయం చ చోష్యం లేహ్యమథాపి చ ।
ఉపపాదితం నరైస్తత్ర కుశలైః సూదకర్మణి ॥ 34
వంటపనిలో నేర్పు గల వంటల వారు అక్కడ భక్ష్య, భోజ, పేయ, చోష్య, లేహ్యరూపంలోని సకలపదార్థాలను ఏర్పాటు చేశారు. (34)
న్య్వేదయంస్తత్ పురుషా ధార్తరాష్ట్రాయ వై తదా ।
తతో దుర్యోధనస్తత్ర పాండవానాహ దుర్మతిః ॥ 35
ఆ తరువాత అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు రాజ పురుషులు దుర్యోధనుడు పాండవులతో ఇలా అన్నారు. (35)
గంగాం చైవానుయాస్యామ ఉద్యానవనశోభితామ్ ।
సహితా భ్రాతరః సర్వే జలక్రీడామవాప్నుమః ॥ 36
మనం సోదరుల మందరమూ కలిసి ఉద్యానవన శోభితమైన గంగాతీరానికి వెళ్దాము. అక్కడ మనమంతా జలక్రీడలాడుదాము. (36)
ఏవమస్త్వితి తం చాపి ప్రత్యువాచ యుధిష్ఠిరః ।
తే రథైర్నగరాకారైః దేశజైశ్చ గజోత్తమైః ॥ 37
నిర్యయుర్నగరాచ్ఛూరాః కౌరవాః పాండవైః సహ ।
ఉద్యానవనమాసాద్య విసృజ్య చ మహాజనమ్ ॥ 38
విశంతి స్మ తదావీరాః సింహా ఇవ గిరేర్గుహామ్ ।
ఉద్యానమభిపశ్యంతః భ్రాతరః సర్వ ఏవ తే ॥ 39
యుధిష్ఠిరుడు అలాగే అని దుర్యోధనునితో అన్నాడు. శూరులయిన ఆ కౌరవులు పాండవులతో కలిసి నగరాకారంలో ఉన్న రథాలనూ, స్వదేశంలో పుట్టిన గొప్ప ఏనుగులూ ఎక్కి బయలుదేరారు. ఉద్యానవనాన్ని సమీపించి తమను వెన్నంటి వచ్చిన మహాజనాన్ని వదిలిపెట్టి ఆ సోదరులందరూ కొండగుహలోనికి సింహం ప్రవేశీంచినట్లు ఉద్యానవనశోభను తిలకిస్తూ దానిలోనికి ప్రవేశించారు. (37-39)
ఉపస్థానగృహైః శుభ్రైః వలభీభిశ్చ శోభితమ్ ।
గవాక్షకైస్తథా జాలైః యంత్రైః సాంచారికైరపి ॥ 40
సమ్మార్జితం సౌధకారైః చిత్రకారైశ్చ చిత్రితమ్ ।
దీర్ఘికాభిశ్చ పూర్ణాభిః తథా పద్మాకరైరపి ॥ 41
జలం తచ్ఛుశుభే ఛన్నం పుల్లైర్జలరుహైస్తథా ।
ఉపచ్ఛన్నా వసుమతీ తథా పుష్పైర్యథర్తుకైః ॥ 42
ఆ ఉద్యానవనం శుభ్రమయిన కొలువుకూటాలతో, చంద్రశాలలతో, గవాక్షాలతో, చిన్న చిన్న గూళ్ళతో, యంత్రాలతో, జల యంత్రాలతో విరాజిల్లుతోంది. తాపీపనివారుఆ ఉద్యానవనాన్ని శుభ్రం చేశారు. చిత్రకారులు చిత్రించారు. నిండుగా నీరున్న దిగుడు బావులతోనూ, కొలనులతోనూ ఆ తోట ప్రకాశిస్తోంది. విరబూచిన తామరల మాటుగా ఉన్న ఆ నీరు ఎంతో అందగించింది. ఆ ఋతువులో పుష్పించే పూలు ఆ నేలనంతా కపివేశాయి. (40-42)
తత్రోపవిష్టాస్తే సర్వే పాండవాః కౌరవాశ్చ హ ।
ఉపపన్నాన్ బహూన్ కామాన్ తే భుంజంతి తతస్తతః ॥ 43
పాండవులూ, కౌరవులూ అందరూ అక్కడ కూర్చిని తమ చెంతకు చేరిన సకలభోగాలనూ అనుభవించసాగారు. (43)
అథోద్యానవరే తస్మిన్ తథా క్రీడాగతాశ్చ తే ।
పరస్పరస్య వక్త్రేభ్యః దదుర్భక్ష్యాంస్తతస్తతః ॥ 44
తతో దుర్యోధనః పాపః తద్భక్ష్యే కాలకూటకమ్ ।
విషం ప్రక్ష్యేపయామాస భీమసేనజిఘాంసయా ॥ 45
ఆ శ్రేష్ఠోద్యానవనంలో ఆటలకై అరుదెంచిన ఆ కౌరవపాండవులు ఒకరినోటికొకరు భక్ష్యాలను అందించారు. అప్పుడు పాపి అయిన దుర్యోధనుడు భీమసేనుని చంపదలచి అతనికి అందిస్తున్న భక్ష్యంలో కాలకూటవిషాన్ని కలిపించాడు. (44,45)
స్వయముత్థాయ చైవాథ హృదయేన క్షురోపమః ।
స వాచామృతకల్పశ్చ భ్రాతృవచ్చ సుహృత్ యథా ॥ 46
స్వయం ప్రక్షిపతే భక్ష్యం బహు భీమస్య పాపకృత్ ।
ప్రతీచ్ఛితం స్మ భీమేన తం వై దోషమజానతా ॥ 47
తతో దుర్యోధనస్తత్ర హృదయేన హసన్నివ ।
కృతకృత్యమివాత్మానం మన్యతే పురుషాధమః ॥ 48
ఆపై కత్తిలాంటి మనసు, అమృతం వంటి మాటలు గల ఆ పాపి దుర్యోధనుడు తానే లేచి స్వయంగా ఒక సోదరుని వలె, మిత్రుని వలె భీమసేనునకు ఎక్కువ ఎక్కువగా ఆ భక్ష్యాన్ని అందించాడు. దానిలో విషమున్నదని తెలియని భీమసేనుడు దుర్యోధనుడు అందిస్తున్నవన్నీ తినసాగాడు. అప్పుడు పురుషాధముడయిన దుర్యోధనుడు లోలోన నవ్వుకొంటూ తనను తాను కృతార్థునిగా భావించాడు. (46-48)
తతస్తే సహితాః సర్వే జలక్రీడామకుర్వత ।
పాండవా ధార్తరాష్ట్రాశ్చ తదా ముదితమానసాః ॥ 49
ఆ తరువాత ప్రహృష్టమనస్కులైన ఆ పాండవులూ, ధార్తరాష్ట్రులూ అందరూ కలిసి జలక్రీడనారంభించారు. (49)
క్రీడావసానే తే సర్వే శుచివస్త్రాః స్వలంకృతాః ।
దివసాంతే పరిశ్రాంతాః విహృత్య చ కురూద్వహాః ॥ 50
విహారావసథేష్వేవ వీరా వాసమరోచయన్ ।
భిన్నస్తు బలవాన్ భీమః వ్యాయమ్యాభ్యధికం తదా ॥ 51
ఆటలు ముగిసిన తర్వాత సాయంకాలం అలసిపోయిన వీరులు కౌరవపాండవులు విహారాన్ని చాలించి శుభ్రమయిన బట్టలు కటుకొని చక్కగా అలంకరించుకొని క్రీడాభవనాలలోనే ఆరాత్రి విశ్రమించదలచారు. ఆ సమయంలో బలిష్ఠుడైన భీమసేనుడు అధికవ్యాయామం చేత బాగా అలసిపోయాడు. (50,51)
వాహయిత్వా కుమారాంస్తాన్ జలక్రీడాగతాంస్తదా ।
ప్రమాణకోట్యాం వాసార్థీ సుష్వాపావాప్య తత్ స్థలమ్ ॥ 52
అప్పుడు ఆ భీమసేనుడు జలక్రీడకోసం వచ్చిన కుమారులను వెంటబెట్టుకొని విశ్రాంతికై ప్రమాణకోటికి చేరి అక్కడ ఒక ప్రదేశంలో నిదురపోయాడు. (52)
శీతం వాతం సమాసాద్య శ్రాంతో మదవిమోహితః ।
విషేణ చ పరీతాంగః నిశ్చేష్టః పాండునందనః ॥ 53
భీమసేనుడు బాగా అలసిపోయాడు. విషమదంతో అచేతనుడయ్యాడు. విషం శరీరమంతా ప్రాకింది. చల్లగాలికి నిశ్చేష్టుడై పడుకొన్నాడు. (53)
తతో బద్ధ్వా లతాపాశైః భీమం దుర్యోధనః స్వయమ్ ।
మృతకల్పం తదావీరం స్థలాజ్జలమపాతయత్ ॥ 54
ఆపై దుర్యోధనుడు స్వయంగా లతాపాశాలతో భీమసేనుని బంధించి మృతకల్పుడై ఉన్న ఆ వీరుని ఎత్తైన తీరప్రదేశం నుండి నీటిలో పడవేశాడు. (54)
స నిఃసంగో జలస్యాంతమ్ అథ వై పాండవోఽవిశత్ ।
ఆక్రామన్నాగభవనే తదా నాగకుమారకాన్ ॥ 55
తతః సమేత్య బహుభిః తదా నాగైర్మహావిషైః ।
అదృశ్యత భృశం భీమః మహాదంష్ట్రైః విషోల్బణైః ॥ 56
ఆ భీమసేనుడు నిశ్చైతన్యస్థితిలోనే నీటిలోపల ముణిగిపోయి పాతాళలోకానికి చేరాడు. ఆ పడటంలో ఎందరో నాగకుమారులు ఆ శరీరం క్రింద నలిగిపోయారు. అప్పుడు భయంకరవిషం గల నాగులు అంతా ఒక్కటై విషం నిండిన తమకోరలతో భీముని కరిచారు. (55,56)
తతో-స్య దశ్యమానస్య తద్ విషం కాలకూటకమ్ ।
హతం సర్పవిషేణైవ స్థావరం జంగమేన తు ॥ 57
భీముడు ఆ రీతిగా కాటు తినగానే లోనున్న కాలకూట విషమంతా నశించిపోయింది పాముల ద్వారా ఎక్కిన ఆ జంగమవిషం వలన స్థావరంగా ఉన్న కాలకూట విషం నిస్సారమైంది. (57)
దంష్ట్రాశ్చ దంష్ట్రిణాం తేషాం మర్మస్వపి నిపాతితాః ।
త్వచం నైవాస్య బిభిదుః సారత్వాత్ పృథువక్షసః ॥ 58
ఆ నాగుల కోరలు మర్మస్థానాలపై కూడా పడ్డాయి. అయినా కూడా విశాలవక్షః స్థలం గల భీముని చర్మం లోహసమానమైనందు వలన ఆ చర్మాన్ని కూడా ఆ కోరలు భేదించలేకపోయాయి. (58)
తతః ప్రబుద్ధః కౌంతేయః సర్వం సంఛిద్య బంధనమ్ ।
పోథయామాస తాన్ సర్వాన్ కేచిద్ భీతా ప్రదుద్రువుః ॥ 59
ఆ తరువాత మేల్కొన్న బీమసేనుడు బంధనాలనన్నింటినీ త్రెంపుకొని ఆ నాగులనన్నింటినీ పట్టుకొని నేలకేసి కొట్టాడు. కొందరు నాగులు భయపడి పారిపోయారు. (59)
హతవశేషా భీమేన సర్వే వాసుకిమభ్యయుః ।
ఊచుశ్చ సర్పరాజానం వాసుకిం వాసవోపమమ్ ॥ 60
భీముడు చంపగా మిగిలిన నాగులు అందరూ వాసుకి దగ్గరకు పోయారు. సర్వరాజు, ఇంద్రసమానుడూ అయిన ఆ వాసుకితో ఇలా పలికారు. (60)
అయం నరో వై నాగేంద్ర హ్యప్సు బద్ధ్వా ప్రవేశితః ।
యథా చ నో మతిర్వీర విషపీతో భవిష్యతి ॥ 61
నాగరాజా! ఒకానొక నరుని ఎవరో బంధించి నీటిలో పడవేశారు. వీరా! అతడు విషం త్రాగి ఉంటాడని మేమనుకొంటున్నాం. (61)
నిశ్చేష్టోఽస్మాననుప్రాప్తః స చ దషోఽన్వబుధ్యత ।
ససంజ్ఞశ్చాపి సంవృత్తః ఛిత్వా బంధనమాశు నః ॥ 62
పోథయంతం మహాబాహుం త్వం వై తం జ్ఞాతుమర్హసి ।
స్పృహలేని దశలో మనలోకానికి వచ్చాడు. మాకాటుతిని మేల్కొన్నాడు. స్పృహలోనికి వచ్చాడు. వెంటనే కట్లు త్రెంపుకొని ఆ మహాబాహువు మా మీదకు వచ్చాడు. నీవే అతనిని గూర్చి తెలిసికోవాలి. (62 1/2)
తతో వాసుకిరభ్యేత్య నాగైరనుగతస్తదా ॥ 63
పశ్యతి స్మ మహాబాహుం భీమం భీమపరాక్రమమ్ ।
ఆర్యకేణ చ దృష్టః సః పృథాయా ఆర్యకేణ చ ॥ 64
తదా దౌహిత్ర దౌహిత్రః పరిష్వక్తః సుపీడితమ్ ।
సుప్రీతశ్చాభవత్తస్య వాసుకిః స మహాయశాః ॥ 65
అబ్రవీత్ తం చ నాగేంద్రః కిమస్య క్రియతాం ప్రియమ్ ।
ధనౌఘో రత్ననిచయః వసు చాస్య ప్రదీయతామ్ ॥ 66
ఆపై నాగులు అనుసరిస్తూండగా వాసుకి అక్కడకు వెళ్లాడు. భీమపరాక్రమాడూ, మహాబాహువూ అయిన భీముని చూచాడు. ఆ సమయంలో ఆర్యకుడనే నాగరాజు కూడా బీముని చూచాడు. ఆ ఆర్యకుడు పృథతండ్రి అయిన శూరసేనునకు మాతామహుడు. ఆ ఆర్యకుడు తన దౌహిత్ర దౌహిత్రుడయిన ఆ భీముని గట్టిగా కౌగిలించుకొన్నాడు. మహాయశస్వి అయిన వాసుకి భీముని చూచి ప్రసన్నుడై ఇలా అన్నాడు - అతనికి ఏ ప్రియాన్ని సమకూర్చగలం? ధనరాసులూ, రత్నరాసులూ, ధనమూ ఇవ్వండి. (63-66)
ఏవముక్తస్తదా నాగః వాసుకిం ప్రత్యభాషత ।
యది నాగేంద్ర తుష్టోఽసి కిమస్య ధనసంచయైః ॥ 67
వాసుకి అలా అనగానే ఆర్యకుడు "నాగరాజా! మీరు ప్రసన్నులయితే ఈ బాలునకు ధనరాసులతో పనేమున్నది" అన్నారు. (67)
రసం పిబేత్ కుమారోఽయం త్వయి ప్రీతే మహాబలః ।
బలం నాగసహస్రస్య యస్మిన్ కుండే ప్రతిష్ఠితిమ్ ॥ 68
నీ విష్టపడితే వేయి ఏనుగులబలం నిక్షిప్తమై ఉన్న ఆకుండలోని రసాన్ని మహాబలుడైన ఈ కుమారునకు త్రాగటానికివ్వు. (68)
యావత్ పిబతి బాలోఽయం తావదస్మై ప్రదీయతామ్ ।
ఏవమస్త్వితి తం నాగం వాసుకిః ప్రత్యభాషత ॥ 69
ఈ బాలుడెంత త్రాగగలడో అంత ఇవ్వవలసినది' - 'అలాగే కానీ!' అని వాసుకి ఆర్యకునితో అన్నాడు. (69)
తతో భీమస్తదా నాగైః కృతస్వస్త్యయనః శుచిః ।
ప్రాజ్ముఖశ్చోపవిష్టశ్చ రసం పిబతి పాండవః ॥ 70
అప్పుడు నాగులు భీమునికై స్వస్తివాచకాలు పలికారు. భీముడు శుచియై, తూర్పు దిక్కువైపు ముఖముంచి కూర్చొని ఆ కుండలోని రసాన్ని త్రాగసాగాడు. (70)
ఏకోచ్ఛ్వాసాత్ తతః కుండం పిబతి స్మ మహాబలః ।
ఏవమష్టౌ స కుండాని హ్యపిబత్ పాండునందనః ॥ 71
ఆ భీముడు ఒక్క గ్రుక్కలోనే కుండెడు రసాన్ని త్రాగివేశాడు. ఆవిధంగా ఎనిమిది కుండలరసాన్ని ఆ పాండుకుమారుడు త్రాగగలిగాడు. (71)
తతస్తు శయనే దివ్యే నాగదత్తే మహాభుజః ।
అశేత భీమసేనస్తు యథా సుఖమరిందమః ॥ 72
ఆ తర్వాత మహాభుజుడూ, అరిందముడూ అయిన భీమసేనుడు నాగులు ఏర్పాటుచేసిన దివ్యశయ్యపై సుఖంగా నిదురించాడు. (72)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి భీమసేనరసపానే సప్తవింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 127 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున నూట ఇరువది యేడవ అధ్యాయము. (127)