131. నూట ముప్పదియొకటవ అధ్యాయము
కౌరవపాండవుల విద్యాభ్యాసము - ఏకలవ్యుని గురుభక్తి.
వైశంపాయన ఉవాచ
తతః సంపూజితో ద్రోణః భీష్మేణ ద్విపదాం వరః ।
విశశ్రామ మహాతేజాః పూజితః కురువేశ్మని ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ తరువాత మనుజశ్రేష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు భీష్మునిచే సత్కరింపబడ్డాడు. కౌరవుల ఆశ్రయంలో అర్చింపబడిన మహాతేజస్వి విశ్రమించాడు. (1)
విశ్రాంతేఽథ గురౌ తస్మిన్ పౌత్రానాదాయ కౌరవాన్ ।
శిష్యత్వేన దదౌ భీష్మః వసూని వివిధాని చ ॥ 2
గృహం చ సుపరిచ్ఛన్నం ధనధాన్యసమాకులమ్ ।
భారద్వాజాయ సుప్రీతః ప్రత్యపాదయత ప్రభుః ॥ 3
ద్రోణాచార్యుడు విశ్రమించిన తర్వాత భీష్ముడు కురువంశస్థులయిన తన మనవళ్లను శిష్యులుగా ద్రోణునకప్పగించాడు. వారితోపాటు వివిధ ధనరాసులను, చక్కని సామాగ్రి కలిగి ధనధాన్యాలతో నిండిన మంచి ఇంటిని ఆనందంగా ద్రోణునకు అందించాడు. (2,3)
స తాన్ శిష్యాన్ మహేష్వాసః ప్రతిజగ్రాహ కౌరవాన్ ।
పాండవాన్ ధార్తరాష్ట్రాంశ్చ ద్రోణో ముదితమానసః ॥ 4
మేటి విలుకాడైన ద్రోణుడు ముదితహృదయుడై కురువంశస్థులైన పాండవధార్తరాష్ట్రులను శిష్యులుగా స్వీకరించాడు. (4)
ప్రతిగృహ్య చ తాన్ సర్వాన్ ద్రోణో వచనమబ్రవీత్ ।
రహస్యేకః ప్రతీతాత్మా కృతోపసదనాంస్తథా ॥ 5
వారినందరినీ శిష్యులనుగా స్వీకరించిన తరువాత ఒకనాడు ఏకాంతంగా నిండు మనస్సుతో తన దగ్గర కూర్చొని ఉన్న ఆ శిష్యులతో ఇలా అన్నాడు. (5)
ద్రోణ ఉవాచ
కార్యం మే కాంక్షితం కించిత్ హృది సంపరివర్తతే ।
కృతాస్త్రైస్తత్ ప్రదేయం మే తదేతద్ వదతానఘాః ॥ 6
ద్రోణుడిలా అన్నాడు. అనఘులారా! నామనస్సులో ఒక కోరిక ఉన్నది. అది మీరు తీర్చవలసినది. అస్త్రవిద్య ముగిసిన పిమ్మట మీరు దానిని సాధించి పెట్టాలి. దాని విషయంలో మీ అభిప్రాయమేమిటి? (6)
వైశంపాయన ఉవాచ
తచ్ఛ్రుత్వా కౌరవేయాస్తే తూష్ణీమాసన్ విశాంపతే ।
అర్జునస్తు తతః సర్వం ప్రతిజజ్ఞే పరంతప ॥ 7
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! పరంతపా! ఆ మాట విని కౌరవులంతా మిన్నకుండిపోయారు. అయితే అర్జునుడు గురుకార్యాన్ని నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. (7)
తతోఽర్జునం తదా మూర్ధ్ని సమాఘ్రాయ పునః పునః ।
ప్రీతిపూర్వం పరిష్వజ్య ప్రరురోద ముదా తదా ॥ 8
అప్పుడు ద్రోణుడు పదే పదే అర్జునుని శిరస్సు మూర్కొని, ప్రీతిపూర్వకంగా కౌగిలించుకొని ఆనందంతో కన్నీరు విడిచాడు. (8)
తతో ద్రోణః పాండుపుత్రాన్ అస్త్రాణి వివిధాని చ ।
గ్రాహయామాస దివ్యాని మానుషాణి చ వీర్యవాన్ ॥ 9
ఆ తరువాత పరాక్రమశాలి అయిన ద్రోణుడు దివ్య, మానుషాలయిన అనేకాస్త్రాలను పాండవులకు నేర్పాడు. (9)
రాజపుత్రాస్తథా చాన్యే సమేత్య భరతర్షభ ।
అభిజగ్ముస్తతో ద్రోణమ్ అస్త్రార్థే ద్విజసత్తమమ్ ॥ 10
భరతశ్రేష్ఠా! ఆ సమయంలో ఇతర రాజకుమారులు కూడా చాలా మంది అస్త్రవిద్యనభ్యసించాలని ద్రోణుని సన్నిధికి వచ్చారు. (10)
వృష్ణయశ్చాంధకాశ్చైవ నానాదేశ్యాశ్చ పార్థివాః ।
సూతపుత్రశ్చ రాధేయః గురుం ద్రోణమియాత్ తదా ॥ 11
అప్పుడు వృష్ణివంశజులు, అంధకవంశస్థులూ వివిధ దేశాల రాజులూ, సూతపుత్రుడైన రాధేయుడూ కూడా ద్రోణుని దగ్గరకు వచ్చారు. (11)
స్పర్ధమానస్తు పార్థేన సూతపుత్రోఽత్యమర్షణః ।
దుర్యోధనం సమాశ్రిత్య సోఽవమన్యత పాండవాన్ ॥ 12
సూతపుత్రుడయిన కర్ణుడు అర్జునునితో ఎప్పుడూ ఘర్షణ పడుతూ, అసహనశీలుడై దుర్యోధనుని ప్రాపు పొంది పాండవులను అవమానించేవాడు. (12)
అభ్యయాత్ స తతో ద్రోణం ధనుర్వేదచికీర్షయా ।
శిక్షాభుజ బలోద్యోగైః తేషు సర్వేషు పాండవః ।
అస్త్రవిద్యానురాగాచ్చ విశిష్టోఽభవదర్జునః ॥ 13
తుల్యేష్వస్త్రప్రయోగేషు లాఘవే సౌష్ఠవేషు చ ।
సర్వేషామేవ శిష్యాణాం బభూవాభ్యధికోఽర్జునః ॥ 14
పాండుకుమారుడైన అర్జునుడు ధనుర్వేదాసక్తి, అధ్యయనం, బలం, ప్రయత్నశీలతల దృష్ట్యా శిష్యులందరిలో శ్రేష్ఠుడై ద్రోణాచార్యునికి సాటియై నిలిచాడు. అర్జునుడు తనకున్న అస్త్రవిద్యానురాగం వలన సమానంగా, అనాయాసంగా, నిక్కచ్చిగా అస్త్రాలను ప్రయోగించటంలో సర్వశిష్యులలోను అగ్రగణ్యుడయ్యాడు. (13,14)
ఐంద్రిమ ప్రతిమం ద్రోణః ఉపదేశేష్వమన్యత ।
ఏవం సర్వకుమారాణామ్ ఇష్వస్త్రం ప్రత్యపాదయత్ ॥ 15
ఉపదేశ సమయంలో అర్జునుడు సాటిలేనివాడని ద్రోణుడు భావించాడు. ఈ విధంగా కుమారులందరికీ అస్త్రవిద్యను నేర్పాడు ద్రోణుడు. (15)
కమండలుం చ సర్వేషాం ప్రాయచ్ఛచ్చిరకారణాత్ ।
పుత్రాయ చ దదౌ కుంభమ్ అవిలంబన కారణాత్ ॥ 16
యావత్ తే నోపగచ్ఛంతి తావదస్మై పరాం క్రియామ్ ।
ద్రోణ ఆచష్ట పుత్రాయ తత్ కర్మ జిష్ణురౌహత ॥ 17
నీటిని తెచ్చేందుకు శిష్యులు అందరికీ ఆలస్యం కావాలన్న ఆలోచనతో కమండలాల నిచ్చేవాడు. తన కుమారుడు త్వరగా రావాలన్న భావనతో కుండ నిచ్చేవాడు. మిగిలిన వారు తిరిగి వచ్చేలోగా ద్రోణుడు తన కుమారునకు ధనుర్విద్యావిశేషమేదో ఒకటి బోధించేవాడు. అర్జునుడు ద్రోణుని చర్యను గమనించాడు. (16,17)
తతః స వారుణాస్త్రేణ పూరయిత్వా కమండలుమ్ ।
సమమాచార్యపుత్రేణ గురుమభ్యేతి ఫాల్గునః ॥ 18
ఆచార్య పుత్రాత్ తస్మాత్ తు విశేషోపచయేఽపృథక్ ।
న వ్యహీయత మేధావీ పార్థోఽప్యస్త్రవిదాం వరః ॥ 19
అర్జునః పరమం యత్నమ్ ఆతిష్ఠద్ గురుపూజనే ।
అస్త్రే పరమం యోగం ప్రియో ద్రోణస్య చాభవత్ ॥ 20
ఆ తరువాత అర్జునుడు వారుణాస్త్రంతో కమండలాన్ని నింపుకొని అశ్వత్థామతో పాటే ద్రోణుని దగ్గరకు వచ్చేవాడు. అందువలన మేటివిలుకాడైన అర్జునుడు విశేషవృద్ధిలో అశ్వత్థామతో సమానంగా ఉంటూ ఏమీ తీసిపోయేవాడు కాదు. అర్జునుడు గురువును సేవించటంలో కూడా పరిపూర్ణంగా ప్రయత్నం చేసేవాడు. అస్త్రవిద్యాభ్యాసంలో కూడా పూర్తిగా ఆసక్తిని చూపేవాడు. అందుకే ద్రోణునకు ప్రియశిష్యుడయ్యాడు. (18-20)
తం దృష్వా నిత్యముద్యుక్తమ్ ఇష్వస్త్రం ప్రతి ఫాల్గునమ్ ।
ఆహూయ వచనం ద్రోణః రహః సూదయబాషత ॥ 21
అంధకారేఽర్జునాయాన్నం న దేయం తే కదాచన ।
న చాఖ్యేయమిదం చాపి మద్వాక్యం విజయే త్వయా ॥ 22
ధనుర్బాణాభ్యాసంలో నిరంతరమూ ఆసక్తుడైన అర్జునుని గమనించి ద్రోణాచార్యుడు రహస్యంగా వంటవానిని పిలిపించి ఇలా ఆదేశించాడు - అర్జునుడికి ఎప్పుడూ చీకట్లో అన్నం పెట్టవద్దు. అంతేకాదు. ఈ నా మాటను అర్జునునకెప్పుడూ చెప్పరాదు. (21,22)
తతః కదాచిత్ భుంజానే ప్రవవౌ వాయురర్జునే ।
తేన తత్ర ప్రదీపః సః దీప్యమానో విలోపితః ॥ 23
ఆ తరువాత ఒకప్పుడు అర్జునుడు అన్నం తింటుంటే గాలి పెద్దగా వీచింది. దానితో అక్కడ వెలుగుతున్న దీపం ఆరిపోయింది. (23)
భుంక్త ఏవ తు కౌంతేయః నాస్యాదన్యత్ర వర్తతే ।
హస్తస్తేజస్వినస్తస్య అనుగ్రహణకారణాత్ ॥ 24
అర్జునుడు భోజనం చేస్తూనే ఉన్నాడు. అభ్యాసమున్నందు వలన తేజస్వి అయిన ఆ అర్జునుని చేయి చీకటిలో కూడా నోటిలోనికే వెళ్ళింది. (24)
తదభ్యాసకృతం మత్వా రాత్రావపి స పాండవః ।
యోగ్యాం చక్రే మహాబాహుః ధనుషా పాండునందనః ॥ 25
అది అభ్యాసం వలన జరుగుతున్న పని అని గ్రహించి మహాబాహువైన అర్జునుడు రాత్రివేళ కూడా ధనుర్విద్యను అభ్యసించసాగాడు. (25)
తస్య జ్యాతలనిర్ఘోషం ద్రోణః శుశ్రావ భారత ।
ఉపేత్య చైన ముత్థాయ పరిష్వజ్యేదమబ్రవీత్ ॥ 26
జనమేజయా! ఆ అర్జునుని అల్లెత్రాటి ధ్వనిని నిదురిస్తున్న ద్రోణుడు విన్నాడు. లేచి అర్జునుని దగ్గరకు వచ్చి కౌగిలించు కొని ఇలా పలికాడు. (26)
ద్రోణ ఉవాచ
ప్రయతిష్యే తథా కర్తుం యథా నాన్యో ధనుర్ధరః ।
త్వత్సమో భవితా లోకే సత్యమేతద్ బ్రవీమి తే ॥ 27
ద్రోణుడిలా అన్నాడు. విలువిద్యలో లోకంలో మరెవ్వరూ నీకు సమానులుగా కూడా నిలువలేనట్లు నిన్ను తీర్చటానికి ప్రయత్నిస్తాను. నేను నీకీ సత్యవచనాన్ని చెప్తున్నాను. (27)
వైశంపాయన ఉవాచ
తతో ద్రోణోఽర్జునం భూయః హయేషు చ గజేషు చ ।
రథేషు భూమావపి చ రణశిక్షామశిక్షయత్ ॥ 28
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ తరువాత ద్రోణుడు మరలా అర్జునకు ఏనుగులపై గుఱ్ఱాలపై, రథాలపై, నేలపై నిలిచి యుద్ధం చేయటాన్ని నేర్పించాడు. (28)
గదాయుద్ధేఽసిచర్యాయాం తోమరప్రాసశక్తిషు ।
ద్రోణః సంకీర్ణయుద్ధే చ శిక్షయామాస కౌరవాన్ ॥ 29
ద్రోణుడు గదాయుద్ధంలో, ఖడ్గయుద్ధంలో తోమరాలనూ, ప్రాసాలనూ, శక్తులను ప్రయోగించటంలో, ఒక్కడే అనేకులతో యుద్ధం చేయటంలోనూ కౌరవులకు శిక్షణనిచ్చాడు. (29)
తస్య తత్ కౌశలం శ్రుత్వా ధనుర్వేదజిఘృక్షవః ।
రాజానో రాజపుత్రాశ్చ సమాజగ్ముః సహస్రశః ॥ 30
ద్రోణుని ఆచార్యత్వంలోని ఆ నేర్పును విని ధనుర్వేదాన్ని అభ్యసించగోరిన రాజులు, రాజకుమారులు వేలకొలది ఆయన దగ్గరకు వచ్చారు. (30)
తతో నిషాధరాజస్య హిరణ్యధనుషః సుతః ।
ఏకలవ్యో మహారాజ ద్రోణమభ్యాజగామ హ ॥ 31
మహారాజా! ఆ తర్వాత నిషాదరాజైన హిరణ్యధన్వుని కొడుకు ఏకలవ్యుడు ద్రోణుని దగ్గరకు వచ్చాడు. (31)
న స తం ప్రతిజగ్రాహ నైషాదిరితి చింతయన్ ।
శిష్యం ధనుషి ధర్మజ్ఞః తేషామేవాన్వవేక్షయా ॥ 32
ధర్మజ్ఞుడైన ద్రోణుడు బోయవాడన్న కారణంగా ఏకలవ్యుని శిష్యునిగా స్వీకరించలేదు. ఆయన దృష్టి అంతా కౌరవుల మీదనే ఉన్నది. (32)
స తు ద్రోణస్య శిరసా పాదౌ గృహ్య పరంతపః ।
అరణ్యమనుసంప్రాప్య కృత్వాద్రోణం మహీమయమ్ ॥ 33
తస్మిన్నాచార్యవృత్తిం చ పరమామాస్థితస్తదా ।
ఇష్వస్త్రే యోగమాతస్థే పరం నియమమాస్థితః ॥ 34
అయితే పరంతపుడైన ఆ ఏకలవ్యుడు ద్రోణునకు శిరసా పాదాభివందనం చేసి అరణ్యానికి మరలివచ్చి మట్టితో ద్రోణుని ప్రతిమను చేసి దానిపైనే పరమోన్నతంగా ఆచార్యభావాన్ని నిలుపుకొని తీవ్రమయిన నియమాలను పాటిస్తూ ధనుర్విద్యను అభ్యసించ నారంభించాడు. (33,34)
పరయా శ్రద్ధయోపేతః యోగీన పరమేణ చ ।
విమోక్షాదానసంధానే లఘత్వం పరమాప సః ॥ 35
అత్యంత శ్రద్ధతో తీవ్రమయిన అభ్యాసంతో ఆ ఏకలవ్యుడు బాణాలను విడవటంలోనూ, స్వీకరించటంలోనూ ఎంతో నైపుణ్యాన్ని సాధించాడు. (35)
అథ ద్రోనాభ్యనుజ్ఞాతాః కదాచిత్ కురుపాండవాః ।
రథైర్వినిర్యయుః సర్వే మృగయా మరిమర్దన ॥ 36
శత్రుమర్దనా! ఆ తరువాత ఒకసారి ద్రోణుని అనుమతితో కౌరవపాండవులందరూ రథాలపై వేటకు బయలుదేరారు. (36)
తత్రోపకరణం గృహ్య నరః కశ్చిద్ యదృచ్ఛయా ।
రాజన్ననుజగామైకః శ్వానమాదాయ పాండవాన్ ॥ 37
రాజా! వేటకవసరమయిన సామాగ్రిని తీసికొని ఒక వ్యక్తి కూడా తన ఇచ్ఛననుసరించి ఒక కుక్కను తీసికొని ఒంటరిగా పాండవుల ననుసరించి వెళ్ళాడు. (37)
తేషాం విచరతాం తత్ర తత్త త్కర్మచికీర్షయా ।
శ్వా చరన్ స వనే మూఢః నైషాదిం ప్రతి జగ్మివాన్ ॥ 38
వారంతా తమతమ పనులను చేయాలనుకొని అటు ఇటూ తిరగసాగారు. ఆ సమయంలో ఆ తెలివి తక్కువ కుక్క తిరుగుతూ ఏకలవ్యుని దగ్గరకు వెళ్ళింది. (38)
స కృష్ణం మలదిగ్ధాంగం కృష్ణాజినజటాధరమ్ ।
నైషాదిం శ్వా సమాలక్ష్య భషంస్తస్థౌ తదంతికే ॥ 39
ఆ ఏకలవ్యుడు నల్లనివాడు. శారీరమంతా మలినమై ఉన్నది. జటలు, జింకతోలు ధరించి ఉన్నాడు. అటువంటి ఏకలవ్యుని చూచి ఆ కుక్క మొరుగుతూ అక్కడే నిలిచిపోయింది. (39)
తదా తస్యాథ భషతః శునః సప్తశరాన్ ముఖే ।
లాఘవం దర్శయన్నస్త్రే ముమోచ యుగపద్ యథా ॥ 40
అప్పుడు తన అస్త్రలాఘవాన్ని ప్రదర్శిస్తూ ఏకలవ్యుడు మొరిగే ఆ కుక్క ముఖం మీద ఒకేసారి ఏడుబాణాలను ప్రయోగించాడు. (40)
స తు శ్వా శరపూర్ణాస్యః పాండవానాజగామ హ ।
తం దృష్ట్వా పాండవా వీరాః పరం విస్మయమాగతాః ॥ 41
ముఖం నిండా బాణాలతో ఆ కుక్క పాండవుల దగ్గరకు వచ్చింది. దానిని చూచి వీరులయిన ఆ పాండవులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. (41)
లాఘవం శబ్దవేధిత్వం దృష్ట్వా తత్ పరమం తదా ।
ప్రేక్ష్య తం వ్రీడితాశ్చాసన్ ప్రశశంసుశ్చ సర్వశః ॥ 42
ఆ హస్తలాఘవాన్నీ, శబ్దాన్ని అనుసరించి లక్ష్యాలను భేదించగల అపారనైపుణ్యాన్నీ చూచి వారంతా సిగ్గుపడ్డారు. ఆ విలుకాని బహువిధాలుగా ప్రశంసించారు. (42)
తం తతోఽన్వేషమాణాస్తే వనే వననివాసినమ్ ।
దదృశుః పాండవా రాజన్ అస్యంతమనిశం శరాన్ ॥ 43
రాజా! ఆ తరువాత ఆ విలుకానికై వెదకుతూ పాండవులు అరణ్యంలో సదా బాణాలు వేస్తున్న ఆ ఆటవికుని చూచారు. (43)
న చైన మభ్యజానంస్తే తదా వికృతదర్శనమ్ ।
అథైనం పరిపప్రచ్ఛుః కో భవాన్ కస్య వేత్యుత ॥ 44
అప్పుడు ఆ ఏకలవ్యునిలో మార్పు వచ్చి ఉన్నందువలన పాండవులు అతనిని గుర్తించలేకపోయారు. "నీవెవడవు? ఎవరి కొడుకువు?" అని ఏకలవ్యుని అడిగారు. (44)
ఏకలవ్య ఉవాచ
నిషాదాధిపతే ర్వీరాః హిరణ్యధనుషః సుతమ్ ।
ద్రోనశిష్యం చ మాం విత్త ధనుర్వేదకృతశ్రమమ్ ॥ 45
ఏకలవ్యుడిలా అన్నాడు. వీరులారా! నేను నిషాదరాజైన హిరణ్యధన్వుని కొడుకును. విలువిద్యలో పరిశ్రమ చేసినవాడను. ద్రోణశిష్యుడను. (45)
వైశంపాయన ఉవాచ
తే తమాజ్ఞాయ తత్త్వేన పునరాగమ్య పాండవాః ।
యథావృత్తం వనే సర్వం ద్రోణాయాచఖ్యురద్భుతమ్ ॥ 46
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! ఆ పాండవులు ఆ ఏకలవ్యుని గురించి యథార్థాన్ని గ్రహించి తిరిగి వచ్చి అరణ్యంలో జరిగిన ఆ అద్భుత వృత్తాంతాన్ని యథాతథంగా ద్రోణునకు వివరించారు. (46)
కౌంతేయస్త్వర్జునో రాజన్ ఏకలవ్యమనుస్మరన్ ।
రహోద్రోణం సమాసాద్య ప్రణయాదిదమబ్రవీత్ ॥ 47
రాజా! కుంతికొడుకైన అర్జునుడు ఏకలవ్యునే తలచుకొంటూ ఏకాంతంగా ద్రోణాచార్యుని దగ్గరకుపోయి చనువుతో ఇలా అన్నాడు. (47)
అర్జున ఉవాచ
తదాహం పరిరభ్యైకః ప్రీతిపూర్వమిదం వచః ।
భవతోక్తో న మే శిష్యః త్వద్విశిష్టో భవిష్యతి ॥ 48
అర్జునుడిలా అన్నాడు. ఆనాడు నన్ను కౌగిలించుకొని ప్రేమపూర్వకంగా "నాశిష్యులలో నిన్ను మించిపోగల వాడెవ్వడూ ఉండడు" అని తమరు నాతో అన్నారు. (48)
అథ కస్మా న్మద్విశిష్టః లోకాదపి చ వీర్యవాన్ ।
అన్యోఽస్తి భవతః శిష్యః నిషాదాధిపతేః సుతః ॥ 49
కానీ తమశిష్యుడు నిషాదరాజకుమారుడు అయిన ఏకలవ్యుడు నన్నూ, లోకాన్నీ మించిన వీరుడు ఎలా కాగలిగాడు? (49)
వైశంపాయన ఉవాచ
ముహూర్తమివ తం ద్రోణః చింతయుత్వా వినిశ్చయమ్ ।
సవ్యసాచినమాదాయ నైదిషాం ప్రతిజగ్మివాన్ ॥ 50
వైశంపాయనుడిలా అన్నాడు. ద్రోణుడు ఏకలవ్యుని గురించి రెండు గడియలు ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చి, అర్జునుని వెంటబెట్టుకొని ఏకలవ్యుని దగ్గరకు వెళ్లాడు. (50)
దదర్శ మలదిగ్ధాంగం జటిలం చీరవాససమ్ ।
ఏకలవ్యం ధనుస్పాణిమ్ అస్యంతమనిశం శరాన్ ॥ 51
వెళ్ళి మలినశరీరుడై, జటిలుడై, నారబట్టలు కట్టుకొని, విల్లుచేత బట్టుకొని బాణాలను విసురుతున్న ఏకలవ్యుని చూచాడు. (51)
ఏకలవ్యస్తు తం దృష్ట్వా ద్రోణమాయాంతమంతికాత్ ।
అభిగమ్యోపసంగృహ్య జగామ శిరసా మహీమ్ ॥ 52
ఏకలవ్యుడు తన దగ్గరకు వస్తున్న ద్రోణాచార్యుని చూచి ఎదురేగి, పాదాలు అంటి నేలకు తల ఆనించి నమస్కరించాడు. (52)
పూజయిత్వా తతో ద్రోణం విధివత్ సనిషాదజః ।
నివేద్య శిష్యమాత్మానం తస్థౌ ప్రాంజలిరగ్రతః ॥ 53
ఆ తరువాత యథావిధిగా ఆ ద్రోణుని పూజించి ఏకలవ్యుడు తనను ద్రోణుని శిష్యునిగా తెలియజెప్పుకొని చేతులు జోడించి ఎదుట నిలిచాడు. (53)
తతో ద్రోణోఽబ్రవీద్ రాజన్ ఏకలవ్యమిదం వచః ।
యది శిష్యోఽసి మే వీర వేతనం దీయతాం మమ ॥ 54
ఏకలవ్యస్తు తచ్ఛ్రుత్వా ప్రీయమాణోఽబ్రవీదిదమ్ ।
రాజా! ఆ తర్వాత ద్రోణుడు ఏకలవ్యునితో "వీరుడా! నీవు నా శిష్యుడివే ఆయితే నాకు గురుదక్షిణ నిమ్ము" అని అడిగాడు. ఆ మాట విని ఏకలవ్యుడు ఆనందంగా ఇలా అన్నాడు. (54 1/2)
ఏకలవ్వ ఉవాచ
కిం ప్రయచ్ఛామి భగవన్ ఆజ్ఞాపయతు మాం గురుః ॥ 55
న హి కించిదదేయం మే గురవే బ్రహ్మవిత్తమ ।
ఏకలవ్యుడిలా అన్నాడు. స్వామీ! నేను మీకేమివ్వాలి? గురువుగా తమరు ఆదేశించండి. బ్రాహ్మణశ్రేష్ఠా! గురువున కీయరానిదంటూ నాకు ఏదీలేదు. (55 1/2)
వైశంపాయన ఉవాచ
తమబ్రవీత్ త్వయాంగుష్ఠః దక్షిణో దీయతామితి ॥ 56
వైశంపాయనుడిలా అన్నాడు. అప్పుడు ద్రోణుడు కుడిచేతి బొటనవ్రేలి నిమ్మని అడిగాడు. (56)
ఏకలవ్యస్తు తచ్ఛ్రుత్వా వచో ద్రోణస్య దారుణమ్ ।
ప్రతిజ్ఞామాత్మనో రక్షన్ సత్యే చ నియతః సదా ॥ 57
తథైవ హృష్టవదనః తథైవాదీనమానసః ।
ఛిత్త్వాఽవిచార్య తం ప్రాదాత్ ద్రోణాయాంగుష్ఠ మాత్మనః ॥ 58
ద్రోణుని ఆ భయంకరవచనాన్ని విని, సంతతమూ సత్యవాక్పాలన చేసే ఏకలవ్యుడు తన ప్రతిజ్ఞను నిలుపుకొంటూ, దిగాలుపడకుండా ప్రసన్నముఖంతో ఏ మాత్రమూ ఆలోచించకుండా తన బొటనవ్రేలిని ద్రోణున కిచ్చాడు. (57,58)
(స సత్యసంధం నైషాదం దృష్ట్వా ప్రీతోఽబ్రవీదిదమ్ ।
ఏవం కర్తవ్యమితి వా ఏకలవ్యమభాషత ॥)
తతః శరం తు నైషాదిః అంగుళీభిర్వ్యకర్షత ।
న తథా చ స శీఘ్రోఽభూత్ యథాపూర్వం నరాధిప ॥ 59
సత్యసంధుడైన ఏకలవ్యుని చూచి ఆనందించిన ద్రోణుడు ఈ రీతిగా అభ్యసింపుమని ఏకలవ్యునకు ఒక మార్గాన్ని సూచించాడు. దానిని బట్టి ఏకలవ్యుడు మిగిలిన వ్రేళ్ళతో బాణాన్ని ఆకర్షించాడు. కానీ రాజా! అప్పుడు ఆ బాణం అంతకుముందులా వేగంగా వెళ్ళలేదు. (59)
తతోఽర్జునః ప్రీతమనాః బభూవ విగతజ్వరః ।
ద్రోణశ్చ సత్యవాగాసీత్ నాన్యోఽభిభవితార్జునమ్ ॥ 60
దానితో అర్జునుడు దిగులు వదలి సంతసించాడు. ద్రోణుడు సత్యవచనుడయ్యాడు. అర్జునుడు ఎదురులేని వాడయ్యాడు. (60)
ద్రోణస్య తు తదా శిష్యా గదాయోగ్యౌ బభూవతుః ।
దుర్యోధనశ్చ భీమశ్చ సదా సంరబ్ధమానసౌ ॥ 61
అప్పుడు దుర్యోధనుడూ, భీముడూ గదాయుద్ధంలో ద్రోణునకు మంచి శిష్యులయ్యారు. కానీ ఎప్పుడూ ఒకరిపై ఒకరు క్రోధంతో ఉండేవారు. (61)
అశ్వత్థామా రహస్యేషు సర్వేష్వభ్యధికోఽభవత్ ।
తథాపి పురుషానన్యాన్ త్సారుకౌ యమజావుభౌ ॥ 62
అశ్వత్థామ ధనుర్వేదంలోని మెలుకువల నెరుగుటలో అందరినీ మించిపోయాడు. నకులసహదేవులు కత్తిపట్టడంలో అందరినీ మించిపోయారు. (62)
యుధిష్ఠిరో రథశ్రేష్ఠః సర్వత్ర తు ధనంజయః ।
ప్రథితః సాగరాంతాయాం రథయూథపయూథపః ॥ 63
యుధిష్ఠిరుడు రథంపై నిలిచి యుద్ధం చేయటంలో నేర్పు గడించాడు. కానీ ధనంజయుడు ఈ విద్యలన్నింటిలో సముద్రపర్యంతమున్న భూమండలంలో రథశ్రేష్ఠులందరిలో శ్రేష్ఠుడుగా ప్రసిద్ధికెక్కాడు. (63)
బుద్ధియోగబలోత్సాహైః సర్వాస్త్రేషు చ నిష్ఠితః ।
అస్త్రే గుర్వనురాగే చ విశిష్టోఽభవదర్జునః ॥ 64
బుద్ధి, ఏకాగ్రత, బలం, ఉత్సాహం బాగా ఉన్నందువలన అర్జునుడు సర్వాస్త్ర విద్యలలో ఆరితేరాడు. అస్త్రాభ్యాసంలోనూ, గురువుపై ప్రేమను ప్రదర్శించటంలోనూ అర్జునుడు అందరినీ మించిపోయాడు. (64)
తుల్యేష్వస్త్రోపదేశేషు సౌష్ఠవేన చ వీర్యవాన్ ।
ఏకః సర్వకుమారాణాం బభూవాతిరథోఽర్జునః ॥ 65
అస్త్రవిద్యోపదేశం అందరికీ సమానమే అయినా పరాక్రమవంతుడయిన అర్జునుడు తన ప్రతిభ వలన కుమారులందరిలో తానొక్కడే అతిరథుడయ్యాడు. (65)
ప్రాణాధికం భీమసేనం కృతవిద్యం ధనంజయమ్ ।
ధార్తరాష్ట్రా దురాత్మానః నామృష్యంత పరస్పరమ్ ॥ 66
భీమసేనుడు బలంలో మిన్న. అర్జునుడు అస్త్రవిద్యలో మేటి. దురాత్ములైన ధార్తరాష్ట్రులు వారిని చూచి సహింపలేకపోయారు. (66)
తాంస్తు సర్వాన్ సమానీయ సర్వవిద్యాస్త్రశిక్షితాన్ ।
ద్రోణః ప్రహరణజ్ఞానే జిజ్ఞాసుః పురుషర్షభః ॥ 67
ధనుర్విద్యలోనూ, అస్త్రప్రయోగంలోను వారు సుశిక్షితులయిన తరువాత పురుషశ్రేష్ఠుడైన ద్రోణుడు వారందరినీ ఒక్కచోట చేర్చి, అస్త్రప్రయోగజ్ఞానాన్ని పరీక్షించాలనుకొన్నాడు. (67)
కృతిమం భాసమారోప్య వృక్షాగ్రే శిల్పిభిః కృతమ్ ।
అవిజ్ఞాతం కుమారాణాం లక్ష్యభూతముపాదిశత్ ॥ 68
ఆ ద్రోణుడు శిల్పుల చేత ఒక గ్రద్ద బొమ్మను చేయించి, దానిని కుమారులకు తెలియకుండా చెట్టుకొమ్మపై పెట్టించి దానిని లక్ష్యంగా వారికందరకూ చూపించాడు. (68)
ద్రోణ ఉవాచ
శీఘ్రం భవంతః సర్వేఽపి ధనూంష్యాదాయ సర్వశః ।
భాసమేతం సముద్దిశ్య తిష్ఠధ్వం సంధితేషవః ॥ 69
ద్రోణుడిలా అన్నాడు. వెంటనే మీరందరూ ధనస్సులను తీసికొని ఈ గ్రద్దకు గురిచూచి బాణాలను ఎక్కుపెట్టి నిలవండి. (69)
మద్వాక్యసమకాలం తు శిరోఽస్య వినిపాత్యతామ్ ।
ఏకైకశో నియోక్ష్యామి తథా కురుత పుత్రకాః ॥ 70
నేను చెప్పిన వెంటనే దాని తలను పడగొట్టాలి. ఒక్కొక్కరినే విడివిడిగా ఆదేశిస్తాను. కుమారులారా! ఆ విధంగా చెయ్యాలి. (70)
వైశంపాయన ఉవాచ
తతో యుధిష్ఠిరం పూర్వమ్ ఉవాచాంగిరసాం వరః ।
సంధత్స్వ బాణం దుర్ధర్ష మద్వాక్యాంతే విముంచ తమ్ ॥ 71
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ తర్వాత ద్రోణుడు ముందుగా యుధిష్ఠిరునితో "దుర్ధర్షా! బాణాన్ని సంధించు. నేను చెప్పగానే వదులు" అన్నారు. (71)
తతో యుధిష్ఠిరః పూర్వం ధనుర్గృహ్య పరంతపః ।
తస్థౌ భాసం సముద్దిశ్య గురువాక్యప్రచోదితః ॥ 72
ఆపై పరంతపుడైన యుధిష్ఠిరుడు గురువాక్యాన్ని అనుసరించి వింటిని తీసికొని గ్రద్ధకు గురిపెట్టి నిలిచాడు. (72)
తతో వితతధన్వానం ద్రోణస్తం కురునందనమ్ ।
స ముహూర్తాదువాచేదం వచనం భరతర్షభ ॥ 73
భరతశ్రేష్ఠా! ఆ తరువాత యుధిష్ఠిరుడు ధనస్సు నాకర్షించి నిలిచిన క్షణకాలం తర్వాత ద్రోణుడు అతనితో ఇలా అన్నాడు. (73)
పశ్యైనం తం ద్రుమాగ్రస్థం భాసం నరవరాత్మజ ।
పశ్యామీత్యేవమాచార్యం ప్రత్యువాచ యుధిష్ఠిరః ॥ 74
రాజకుమారా! చెట్టుపైనున్న ఆ గద్దను చూడు. చూస్తున్నానని యుధిష్ఠిరుడు ద్రోణునితో అన్నాడు. (74)
స ముహూర్తాదివపునః ద్రోణస్తం ప్రత్యభాషత ।
క్షణ కాలం తర్వాత ద్రోణుడు అతనితో మరలా ఇలా అన్నాడు. (74 1/2)
ద్రోణ ఉవాచ
అథ వృక్షమిమం మాం వా భ్రాతౄన్ వాపి ప్రపశ్యసి ॥ 75
ద్రోణుడిలా అడిగాడు. ఇప్పుడు ఈ చెట్టునూ, నన్నూ, నీ సోదరులనూ కూడా చూస్తున్నావా? (75)
తమువాచ స కౌంతేయః పశ్యామ్యేనం వనస్పతిమ్ ।
భవంతం చ తథా భ్రాతౄన్ భాసం చేతి పునః పునః ॥ 76
అప్పుడు యుధిష్ఠిరుడు ఈ చెట్టునూ తమనూ, సోదరులనూ, గ్రద్దను కూడా చూస్తున్నానని పదే పదే పలికాడు. (76)
తమువాచాపసర్పేతి ద్రోణోఽప్రీతమనా ఇవ ।
నైతచ్ఛక్యం త్వయా వేద్ధుం లక్ష్యమిత్యేవ కుత్సయన్ ॥ 77
ఆ సమాధానాన్ని విని ద్రోణుడు చిరాకు పడుతూ నిందిస్తూ "తప్పుకో, ఈ లక్ష్యాన్ని నీవు కొట్టలేవు" అని యుధిష్ఠిరునితో అన్నాడు. (77)
తతో దుర్యోధనాదీంస్తాన్ ధార్తరాష్ట్రాన్ మహాయశాః ।
తేనైవ క్రమయోగేన జిజ్ఞాసుః పర్యపృచ్ఛత ॥ 78
ఆ తర్వాత మహాయశస్వి అయిన ఆ ద్రోణుడు దుర్యోధనుడు మొదలుగా గల ధార్తరాష్ట్రులను కూఢా వారి పరిస్థితిని తెలిసికొనగోరి అదేమాదిరిగా, క్రమంగా అడిగాడు. (78)
అన్యాంశ్చ శిష్యాన్ భీమాదీన్ రాజ్ఞ శ్చైవాన్యదేశజాన్ ।
తథా చ సర్వే తత్ సర్వం పశ్యామ ఇతి కుత్సితాః ॥ 79
భీముడు మొదలుగా గల ఇతరశిష్యులను విదేశీయులయిన రాజులను కూడా అదేవిధంగా అడిగాడు. యుధిష్ఠిరునివలెనే అందరూ అంతా చూస్తున్నామని చెప్పారు. వారిని కూడా నిందించి ద్రోణుడు తప్పించాడు. (79)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ద్రోణశిష్యపరీక్షాయాం ఏకత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 131 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ద్రోణశిష్యపరీక్ష అను నూట ముప్పది యొకటవ అధ్యాయము. (131)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో మొత్తం 80 శ్లోకాలు)