133. నూట ముప్పది మూడవ అధ్యాయము
రాజకుమారాస్త్ర విద్యా ప్రదర్శనము.
వైశంపాయన ఉవాచ
కృతాస్త్రాన్ ధార్తరాష్ట్రాంశ్చ పాండుపుత్రాంశ్చ భారత ।
దృష్ట్వాద్రోణోఽబ్రవీద్ రాజన్ ధృతరాష్ట్రం జనేశ్వరమ్ ॥ 1
కృపస్య సోమదత్తస్య బాహ్లీకస్య చ ధీమతః ।
గాంగేయస్య చ సాంనిధ్యే వ్యాసస్య విదురస్య చ ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు- జనమేజయా! అస్త్రవిద్యాభ్యాసాన్ని ముగించిన పాండవులనూ, ధార్తరాష్ట్రులనూ చూసి కృపుడూ, సోమదత్తుడూ, బుద్ధిమంతుడైన బాహ్లీకుడూ, భీష్ముడూ, వ్యాసుడూ, విదురుడూ దగ్గరున్న సమయంలో ద్రోణుడు ధృతరాష్ట్రమహారాజుతో ఇలా అన్నాడు. (1,2)
రాజన్ సంప్రాప్తవిద్యాస్తే కుమారాః కురుసత్తమ ।
తే దర్శయేయుః స్వాం శిక్షాం రాజన్ననుమతే తవ ॥ 3
తతోఽబ్రవీన్మహారాజః ప్రహృష్టేనాంతరాత్మనా ।
రాజా! కురుసత్తమా! నీ కుమారుల అధ్యయనం పూర్తి అయినది. తమ అనుమతితో వారు తమ విద్యను ప్రదర్శిస్తారు. అప్పుడు ధృతరాష్ట్రమహారాజు పరమానందపడి ఇలా అన్నాడు. (3 1/2)
ధృతరాష్ట్ర ఉవాచ
భారద్వాజ మహత్ కర్మ కృతం తే ద్విజసత్తమ ॥ 4
ధృతరాష్ట్రుడిలా అన్నాడు- భారద్వాజా! బ్రాహ్మణోత్తమా! తమరెంతో ఘనకార్యం చేశారు. (4)
యదానుమన్యసే కాలం యస్మిన్ దేశే యథాయథా ।
తథా తథా విధానాయ స్వయమాజ్ఞాపయస్వ మామ్ ॥ 5
అస్త్ర విద్యాప్రదర్శనకై అనువైన సమయాన్నీ, అనువైన ప్రదేశాన్నీ, నిర్వహించవలసిన విధానాన్నీ నిర్ణయించి నన్ను ఆదేశించండి. నేను ఆ విధంగా ఏర్పాటు చేయిస్తాను. (5)
స్పృహయామ్యద్య నిర్వేదాత్ పురుషాణాం సచక్షుషామ్ ।
అస్త్రహేతోః పరాక్రాంతాన్ యే మే ద్రక్ష్యంతి పుత్రకాన్ ॥ 6
నేను అంధుడనైనందున కలతపడుతున్నాను. కానీ అస్త్రవిద్యాప్రదర్శనకై ఒకరినొకరు మించిపోయే ప్రయత్నం చేసే నాకుమారులను చూడగల అదృష్టం గల ఇతరులకోసం ఆశపడుతున్నాను. (6)
క్షత్తర్యద్ గురురాచార్యః బ్రవీతి కురు తత్ తథా ।
నహీదృశం ప్రియం మన్యే భవితా ధర్మవత్సల ॥ 7
(ద్రోణునితో ఆవిధంగా పలికి ధృతరాష్ట్రుడు) ధర్మవత్సలా! విదురా! ద్రోణాచార్యులు చెప్పినట్లు చేయి. మనకు ఇంతకన్నా ప్రియమైనది మరొకటి లేదనుకొంటున్నాను. (7)
తతో రాజానమామంత్య్ర నిర్గతో విదురో బహిః ।
భారద్వాజో మహాప్రాజ్ఞః మాపయామాస మేదినీమ్ ॥ 8
ఆ తరువాత రాజు దగ్గర సెలవు తీసికొని విదురుడు (ద్రోణునితోపాటు)బయటకు వచ్చాడు. మహాప్రాజ్ఞుడైన రంగమంటపానికై స్థలాన్ని ఎంపికచేసి కొలిపించాడు. (8)
సమామవృక్షాం నిర్గుల్మామ్ ఉదక్ ప్రస్రవణాన్వితామ్ ।
తస్యాం భూమౌ బలిం చక్రే తిథౌ నక్షత్రపూజితే ॥ 9
అవఘుష్టే సమాజే చ తదర్థం వదతాం వరః ।
రంగభూమౌ సువిపులం శాస్త్రదృష్టం యథావిధి ॥ 10
ప్రేక్షాగారం సువిహితం చక్రుస్తే తస్య శిల్పినః ।
రాజ్ఞః సర్వాయుధోపేతం స్త్రీణాం చైవ నరర్షభ ॥ 11
మంచాంశ్చ కారయామాసుః తత్ర జానపదా జనాః ।
విపులానుచ్ఛ్రయోపేతాన్ శిబికాశ్చ మహాధనాః ॥ 12
సమతలమై పొదలులేక ఉత్తర దిక్కుపల్లంగా ఉన్న స్థలాన్ని నిర్ణయించి మంచి నక్షత్రం గల తిథిలో వాస్తుపూజ జరిపించాడు. వాగ్మి అయిన ద్రోణుడు వాస్తుపూజా కార్యక్రమాన్ని ముందే ఘోషింపజేసి వీరులను ఆహ్వానించాడు. తర్వాత ఆ మహారాజశిల్పులు రంగభూమిపై వాస్తుశాస్త్రానుసారం యథావిధిగా విశాలమైన ప్రేక్షాగృహాన్ని చక్కగా సమకూర్చారు. రాజూ, అంతఃపురకాంతలూ కూర్చొని చూడటానికి అన్నివిధాల అస్త్రశస్త్రాలతో కూడిన భవనాన్ని ఏర్పాటుచేశారు. జానపదులు తాము కూర్చొని తిలకించటానికి వీలుగా ఎత్తైన పెద్దపెద్ద మంచెలను ఏర్పాటు చేయించారు. విలువైన పల్లకీలను కూడా తయారు చేయించారు. (9-12)
తస్మింస్తతోఽహని ప్రాప్తే రాజా ససచివస్తదా ।
భీష్మం ప్రముఖతః కృత్వా కృపం చాచార్యసత్తమమ్ ॥ 13
(బాహ్లీకం సోమదత్తం చ భూరిశ్రవసమేవ చ ।
కురూనన్యాంశ్చ సచివాన్ ఆదాయ నగరాద్ బహిః ॥)
ముక్తాజాలపరిక్షిప్తం వైదూర్యమణిశోభితమ్ ।
శాతకుంభమయం దివ్యం ప్రేక్షాగారముపాగమత్ ॥ 14
ఆ తర్వాత నిర్ణయించినరోజు రాగానే ధృతరాష్ట్ర మహారాజు మంత్రులతోపాటు భీష్ముని, ఆచార్యశ్రేష్ఠుడైన కృపునీ, బాహ్లీకునీ, సోమదత్తునీ, భూరిశ్రవసునీ, ఇతరకౌరవులనూ, మంత్రులనూ వెంటపెట్టుకొని నగరానికి వెలుపల ఉన్న ఆ ప్రేక్షాగృహానికి వచ్చాడు. ఆ ప్రేక్షాగృహం ముత్యాల జాలర్లతో వైడూర్యమణులతో అలంకరింపబడి ఉన్నది. స్వర్ణమయమై దివ్యంగా శోభిస్తుంది. (13,14)
గాంధారీ చ మహాభాగా కుంతీ చ జయతాం వర ।
స్త్రియశ్చ రాజ్ఞః సర్వాస్తాః సప్రేష్యాః సపరిచ్ఛదాః ॥ 15
హర్షాదారురుహుర్మంచాన్ మేరుం దేవస్త్రియో యథా ।
బ్రాహ్మణక్షత్రియాద్యం చ చాతుర్వర్ణ్యం పురాద్ ద్రుతమ్ ॥ 16
దర్శనేప్సు సమభ్యాగాత్ కుమారాణాం కృతాస్త్రతామ్ ।
క్షణేనైకస్థతాం తత్ర దర్శనేప్సు జగామ హ ॥ 17
విజయశీలురలో శ్రేష్ఠుడా! సౌభాగ్యవతి అయిన గాంధారి, కుంతి, అంతఃపురకాంతలందరూ ఆభరణాలు ధరించి దాసీజనంతో కలిసి ఆనందంగా దేవతాకాంతులు మేరు పర్వతంపై నిలిచినట్లు మంచెలపైకెక్కారు. కుమారుల అస్త్రవిద్యానైపుణ్యాన్ని చూడాలని బ్రాహ్మణ, క్షత్రియులతో పాటు నాలుగువర్ణాలవారూ నగరం నుండి వేగంగా అక్కడకు వచ్చి చేరారు. క్షణకాలంలో అక్కడ పెద్ద జనసముదాయం గుమిగూడింది. (15-17)
ప్రవాదితైశ్చ వాదిత్రైః జనకౌతూహలేన చ ।
మహార్ణవ ఇవ క్షుబ్ధః సమాజః సోఽభవత్ తదా ॥ 18
మ్రోయింపబడిన వివిధవాద్యధ్వనుల వలనా, ప్రజల కుతూహలం వలనా ఆ జనసముదాయం అప్పుడు ఘోషించే మహాసముద్రమే అయింది. (18)
తతః శుక్లాంబరధరః శుక్లయజ్ఞోపవీతవాన్ ।
శుక్లకేశః సితశ్మశ్రుః శూక్లమాల్యానులేపనః ॥ 19
రంగమధ్యం తదాఽఽచార్యః సపుత్రః ప్రవివేశ హ ।
నభో జలధరైర్హీనం సాంగారక ఇవాంశుమాన్ ॥ 20
అప్పుడు తెల్లని బట్టలు కట్టి, తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి తెల్లనిపూలమాలలనూ చందనాలనూ అలంకరించుకొని పుత్రునితో కూడా ద్రోణాచార్యుడు గంగస్థల మధ్యభాగంలోనికి వచ్చాడు. ఆయన తల, మీసాలు తెల్లబడి ఉన్నాయి. అగ్నితో కూడిన ఆదిత్యుడు నిర్మలగగనం మిదకు వచ్చినట్టు ఆ ద్రోణుడు కుమారునితో సహా రంగమధ్యానికి వచ్చాడు. (19,20)
స యథాసమయం చక్రే బలిం బలవతాం వరః ।
బ్రాహ్మణాంస్తు సుమంత్రజ్ఞాన్ కారయామాస మంగలమ్ ॥ 21
బలవంతులలో శ్రేష్ఠుడైన ఆ ద్రోణుడు సకాలంలో దేవపూజ చేశాడు. బ్రాహ్మణులచే మంత్రపూర్వకంగా మంగళవిధి నిర్వర్తింపజేశాడు. (21)
(సువర్ణమణిరత్నాని వస్త్రాణి వివిధాని చ ।
ప్రదదౌ దక్షిణాం రాజా ద్రోణస్య చ కృపస్య చ ॥ )
సుఖపుణ్యార్హఘోషస్య పుణ్యస్య సమనంతరమ్ ।
వివిశు ర్వివిధం గృహ్య శస్త్రోపకరణం నరాః ॥ 22
ధృతరాష్ట్రమహారాజు సువర్ణమణి పుష్పాలనూ, వివిధవస్త్రాలనూ దక్షిణగా ద్రోణకృపుల కిచ్చాడు. సుఖప్రాప్తి కోసం పుణ్యాహవాచనమూ, దానహోమాది పుణ్యకర్మలూ ముగిసిన తరువాత వివిధశస్త్రాస్త్రసామగ్రిని తీసికొని చాలామంది రంగస్థలం ప్రవేశించారు. (22)
తతో బద్ధాంగుళిత్రాణాః బద్ధకక్షా మహారథాః ।
బద్ధతూణాః సధనుషః వివిశుర్భరతర్షభాః ॥ 23
ఆ తరువాత భరతశ్రేష్ఠులయిన ఆ వీరులంతా వ్రేళ్ళతొడుగులను ధరించి, నడుం బిగించి, అమ్ములపొదులను ధరించి, ధనుస్సులు చేతబట్టి పెద్దపెద్ద రథాలనెక్కి రంగస్థలం పైకి వచ్చారు. (23)
అనుజ్యేష్ఠం తు తే తత్ర యుధిష్ఠిరపురోగమాః ।
(రణమధ్యే స్థితం ద్రోణమ్ అభివాద్య నరర్షభాః ।
పూజాం చక్రుర్యథాన్యాయం ద్రోణస్య చ కృపస్య చ ॥
యుధిష్ఠిరుడు మొదలయిన ఆ నరశ్రేష్ఠులు పెద్దవారి వరుసలో వచ్చి రంగమధ్యంలో ఉన్న ద్రోణునకు నమస్కరించి యథావిధిగా ద్రోణాచార్యునీ, కృపాచార్యున్ అర్చించారు.
ఆశీర్భిశ్చ ప్రయుక్తాభిః సర్వే సంహృష్టమానసాః ।
అభివాద్య పునః శస్త్రాన్ బలిపుష్పైః సమన్వితాన్ ॥
రక్తచందనసమ్మిశ్రైః స్వయమార్ఛంత కౌరవాః ।
రక్తచందనదిగ్ధాశ్చ రక్తమాల్యానుధారిణః ॥
సర్వే రక్తపతాకాశ్చ సర్వే రక్తాంతలోచనాః ।
ద్రోణేన సమనుజ్ఞాతాః గృహ్య శస్త్రం పరంతపాః ॥
ధనూంషి పూర్వం సంగృహ్య తప్తకాంచనభూషితాః ।
సజ్యాని వివిధాకారైః శరైః సంధాయ కౌరవాః ॥
జ్యాఘోషం తలఘోషం చ కృత్వా భూతాన్యపూజయన్ ।)
చక్రురస్త్రం మహావీర్యాః కుమారాః పరమాద్భుతమ్ ॥ 24
వారిచ్చిన దీవెనలతో కుమారులంతా సంతుష్ట మనస్కులైనారు. ఆ తరువాత బలిపుష్పాలతో అలంకరింపబడి ఉన్న శస్త్రాలకు నమస్కరించి రక్తచందనంతో కూడిన పూలతో మరలా స్వయంగా అర్చించారు కౌరవులు. వారంతా ఎఱ్ఱచందనాన్ని పూసికొని, ఎఱ్ఱని పూలమాలలను ధరించి, ఎఱ్ఱని పతాకలను రథాలపై నిలుపుకొని ఉన్నారు. వారి కన్నుల కొనలు ఎఱ్ఱబడి ఉన్నాయి. ఆ తరువాత మేలిమిబంగారు నగలు ధరించి ఉన్న పరంతపులయిన ఆ కురురాజకుమారులు ద్రోణుని అనుమతితో ముందుగా తమ ధనుర్బాణాలను చేతబట్టి, అల్లెత్రాటిని బిగించి, వివిధాకారాలతో ఉన్న బాణాలను ఎక్కుపెట్టి టంకారంతోనూ, చప్పట్లతోనూ సమస్తభూతాలనూ అర్చించారు.
ఆపై ఆ కుమారులంతా ఆశ్చర్యకరంగా అస్త్రవిద్యను ప్రదర్శించారు. (24)
కేచిచ్ఛరాక్షేపభయాత్ శిరాంస్యవననామిరే ।
మనుజా ధృష్టమపరే వీక్షాం చక్రుః సువిస్మితాః ॥ 25
కొందరు మనుష్యులు బాణాలు మీదపడతాయన్న భయంతో తలలు వంచారు. మిగిలినవారు పరమాశ్చర్యంతో ఏ మాత్రం భయపడకుండా అదంతా చూచారు. (25)
తే స్మ లక్ష్యాణి బిభిదుః బాణైర్నామాంకశోభితైః ।
వివిధైర్లాఘవోత్సృష్టైః ఉహ్యంతో వాజిభిర్ద్రుతమ్ ॥ 26
వారు గుఱ్ఱాలపై స్వారీచేస్తూ తమతమ నామధేయాలతో ప్రకాశిస్తున్న వివిధ బాణాలను చాలా నేర్పుగా వదలుతూ వేగంగా లక్ష్యాలను బ్రద్దలు కొట్టసాగారు. (26)
తత్ కుమారబలం తత్ర గృహీతశరకార్ముకమ్ ।
గంధర్వనగరాకారం ప్రేక్ష్య తే విస్మితాభవన్ ॥ 27
ధనుర్బాణాలు ధరించిన ఆ రాజకుమారుల సముదాయాన్ని గంధర్వ నగరంగా భావించి చూస్తూ ఆ ప్రేక్షకులంతా ఆశ్చర్యచకితులయ్యారు. (27)
సహసా చుక్రుశుశ్చాన్యే నరాః శతసహస్రశః ।
విస్మయోత్ఫుల్లనయనాః సాధు సాధ్వితి భారత ॥ 28
జనమేజయా! వందలు, వేల కొలదిగ గుంపులు గుంపులుగా కూడి ఉన్న కొందరు మనుష్యులు ఆశ్చర్యంతో కన్నులు వికసింపజేసి చూస్తూ హఠాత్తుగా 'భళీభళీ' అని అరవసాగారు. (28)
కృత్వా ధనుషి తే మార్గాన్ రథచర్యాసు చాసకృత్ ।
గజపృష్ఠేఽశ్వపృష్ఠే చ నియుద్ధే చ మహాబలః ॥ 29
ఆ కుమారసముదాయం అస్త్ర విద్యాప్రదర్శనను ముగించి రథాలను వివిధమార్గాలలో నడిపించే విన్యాసాలను చూపారు. ఆపై ఏనుగులనెక్కి, గుఱ్ఱాలనెక్కి యుద్ధం చేయటాన్నీ, కుస్తీ పట్టటంలోని నేర్పును కూడా ప్రదర్శించారు. (29)
గృహీతఖడ్గచర్మాణః తతో భూయః ప్రహారిణః ।
త్సరుమార్గాన్ యథోద్దిష్టాన్ చేరుః సర్వాసు భూమిషు ॥ 30
ఆ తరువాత కత్తీ, డాలూ ధరించి ఒకరిపై ఒకరు దాడిచేస్తూ కత్తి త్రిప్పటంలోని శాస్త్రీయమార్గాలను ప్రదర్శించారు. ఈ విధంగా రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు ఎక్కి, పాదచారులై కూడా ప్రదర్శనలిచ్చారు. (30)
లాఘవం సౌష్ఠవం శోభాం స్థిరత్వం దృఢముష్టితామ్ ।
దదృశుస్తత్ర సర్వేషాం ప్రయోగం ఖడ్గచర్మణోః ॥ 31
అక్కడున్న ప్రేక్షకులు కత్తీ, డాలూ పట్టడంలో అందరి ప్రయోగాలనూ; వాటిలోని లాఘవాన్నీ, సౌష్ఠవాన్నీ, కళను, స్థిరత్వాన్ని, గట్టిపట్టును కూడా గమనించారు. (31)
అథ తౌ నిత్యసంహృష్టౌ సుయోధనవృకోదరౌ ।
అవతీర్ణౌ గదాహస్తౌ ఏకశృంగావివాచలౌ ॥ 32
ఆ తరువాత నిరంతరమూ ఒకరినొకరు గెలవాలన్న కోరిక గల దుర్యోధన, భీమసేనులు గదలు చేత బట్టి రంగభూమిపైకి వచ్చారు. అప్పుడు వారు ఒక్కొక్క శిఖరం గల రెండు పర్వతాల వలె కనిపించారు. (32)
బద్ధకక్షా మహాబాహూ పౌరుషే పర్యవస్థితౌ ।
బృంహంతౌ వాసితాహేతోః సమదావివ కుంజరౌ ॥ 33
ఆ మహాబాహులిద్దరూ నడుం బిగించి పౌరుషాన్ని ప్రదర్శించటానికి సన్నద్ధులై గర్జిస్తూ ఆడయేనుగుకోసం పోరాడబోతున్న రెండు మదపుటేనుగుల వలె కన్పించారు. (33)
తౌ ప్రదక్షిణసవ్యాని మండలాని మహాబలౌ ।
చేరతుర్మండలగతౌ సమదావివ కుంజరౌ ॥ 34
ఆ మహాబలులిద్దరూ తమ గదలను ప్రదక్షిణంగానూ, అప్రదక్షిణం గానూ మండలాకారంలో త్రిప్పుతూ రెండు మదపుటేనుగుల వలె రంగమండపంపై తిరుగసాగారు. (34)
విదురో ధృతరాష్ట్రాయ గాంధార్యాః పాండవారణిః ।
న్యవేదయేతాం తత్ సర్వం కుమారాణాం విచేష్టితమ్ ॥ 35
విదురుడు ధృతరాష్ట్రునకూ, కుంతి గాంధారికీ ఆ కుమారుల చేష్టలన్నింటినీ నివేదించసాగారు. (35)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి అస్త్రదర్శనే త్రయస్త్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 133 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున అస్త్రదర్శనమను నూట ముప్పది మూడవ అధ్యాయము. (133)
(దాక్షిణాత్య అధికపాఠం 7 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 42 1/2 శ్లోకాలు)