134. నూట ముప్పది నాలుగవ అధ్యాయము
భీమసేన-దుర్యోధన-అర్జునులు అస్త్రవిద్యను ప్రదర్శించుట.
వైశంపాయన ఉవాచ
కురురాజే హి రంగస్థే భీమే చ బలినాం వరే ।
పక్షపాతకృతస్నేహః స ద్విధేవాభవజ్జనః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. కురురాజు సుయోధనుడూ, బలవంతులలో శ్రేష్ఠుడైన భీమసేనుడూ రంగంలోనికి దిగి గదలతో పోరాడుతున్నప్పుడు ప్రేక్షకజనులంతా ఆ ఇద్దరిపై పక్షపాతంతో కూడిన స్నేహం వలన రెండుగా చీలిపోయారు. (1)
హా వీర కురురాజేతి హా భీమ ఇతి జల్పతామ్ ।
పురుషాణాం సువిపులాః ప్రణాదాః సహసోత్థితాః ॥ 2
"ఆహా! వీరా" అని సుయోధనునీ, "ఓహో! భీమా" అని భీమసేనుని అభినందిస్తున్న ప్రేక్షకుల విస్తృతనినాదాలు వెంటవెంటనే చెలరేగసాగాయి. (2)
తతః క్షుబ్ధార్ణవనిభం గంగమాలోక్య బుద్ధిమాన్ ।
భారద్వాజః ప్రియం పుత్రమ్ అశ్వత్థామానమబ్రవీత్ ॥ 3
ఆ తరువాత కలతపడిన కడలిలా కనిపిస్తున్న రంగమంటపాన్ని గమనించి బుద్ధిమంతుడైన ద్రోణాచార్యుడు తన ప్రియపుత్రుడైన అశ్వత్థామతో ఇలా అన్నాడు. (3)
ద్రోణ ఉవాచ
వారయైతౌ మహావీర్యౌ కృతయోగ్యావుభావపి ।
మా భూద్ రంగప్రకోపోఽయం భీమదుర్యోధనోద్భవః ॥ 4
ద్రోణుడిలా అన్నాడు. ఈ ఇద్దరూ మహాపరాక్రమశాలులూ, యుద్ధవిద్యలో నిష్ణాతులు. వారినిక ఆఫు. ఆ భీమదుర్యోధనుల కారణంగా రంగస్థలమంతా కోపోద్రిక్తం కాకూడదు. (4)
వైశంపాయన ఉవాచ
(తత ఉత్థాయ వేగేన అశ్వత్థామా న్యవారయత్ ।
గురోరాజ్ఞా భీమ ఇతి గాంధారే గురుశాసనమ్ ।
అలం యోగ్యకృతం వేగమ్ అలం సాహసమిత్యుత ॥)
తతస్తావుద్యతగదౌ గురుపుత్రేణ వారితౌ ।
యుగాంతానిల సంక్షుబ్ధౌ మహావేలావివార్ణవౌ ॥ 5
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ పై అశ్వత్థామ వేగంగా లేచి భీమదుర్యోధనులను వారిస్తూ "భీమా! ఇది గుర్వాజ్ఞ. సుయోధనా! ఇది గురువు ఆదేశం. ఇక యుద్ధం చాలు. మీరిద్దరూ యోగ్యులే. ఒకరిపై ఒకరు త్వరపడవలదు. పరాక్రమణం కూడా వద్దు" అని పలికి ప్రళయకాలమారుతం చేత కలత పెట్టబడిన మహాసముద్రాల వలె గదలనెత్తి ఉన్న ఆదుర్యోధనభీమసేనులను వారించాడు. (5)
తతో రంగాంగణగతః ద్రోణో వచనమబ్రవీత్ ।
నివార్య వాదిత్రగణం మహామేఘనిభస్వనమ్ ॥ 6
ఆ తరువాత ద్రోణుడు రంగంలోనికి ప్రవేశించి మేఘాడంబరం లాగా కోలాహలం కల్గిస్తున్న వాద్యఘోషలను ఆపి ఇలా అన్నాడు. (6)
యో మే పుత్రాత్ ప్రియతరః సర్వశస్త్రవిశారదః ।
ఐంద్రిరింద్రానుజసమః స పార్థో దృశ్యతామితి ॥ 7
నాకు నా కుమారుని కన్నా ఇష్టమైన వాడూ, సర్వశస్త్రనిపుణుడూ, సాక్షాత్ నారాయణ సమానుడూ అయిన ఇంద్రకుమారుడు ఈ అర్జునుడు. ఇతని నైపుణ్యాన్ని గమనించండి. (7)
ఆచార్యావచనేనాథ కృతస్వస్త్యయనో యువా ।
బద్ధగోధాంగుళిత్రాణః పూర్ణతూణః సకార్ముకః ॥ 8
కాంచనం కవచం బిభ్రత్ ప్రత్యదృశ్యత ఫాల్గునః ।
సార్కః సేంద్రాయుధతడిత్ ససంధ్య ఇవ తోయదః ॥ 9
ఆ తరువాత ద్రోణాచార్యుని మాటమేరకు అర్జునునకు స్వస్తివచనాలు పలికారు. అప్పుడు యువకుడైన అర్జునుడు ఉడుముచర్మంతో చేసిన వ్రేలితొడుగులను ధరిమ్చి, అమ్ముల పొదినిండా బాణాలు నింపుకొని, వింటిని చేతబట్టి, బంగారు కవచాన్ని ధరించి రంగస్థలంపై కనిపించాడు. అప్పుడు అర్జునుడు సూర్యునితో, ఇంద్రధనుస్సుతో, మెరుపుతో, సంధ్యతో కూడిన మేఘం వలె కనిపించాడు. (8,9)
తతః సర్వస్య రంగస్య సముత్పింజలకోఽభవత్ ।
ప్రావాద్యంత చ వాద్యాని సశంఖాని సమంతతః ॥ 10
అప్పుడు రంగస్థలమంతా ఉప్పొంగిపోయింది. అన్ని వైపుల నుండీ శంఖధ్వనులూ, వివిధ వాద్యధ్వనులూ వినిపించసాగాయి. (10)
ఏష కుంతీసుతః శ్రీమాన్ ఏష మధ్యమపాండవః ।
ఏష పుత్రో మహేంద్రస్య కురూణామేష రక్షితా ॥ 11
ఏషోఽస్త్రవిదుషాం శ్రేష్ఠః ఏష ధర్మభృతాం వరః ।
ఏష శీలవతాం చాపి శీలజ్ఞాననిధిః పరః ॥ 12
ఇత్యేవం తుములా వాచః శృణ్వత్యాః ప్రేక్షకేరితాః ।
కుంత్యాః ప్రస్రవసంయుక్తైః అస్త్రైః క్లిన్నమురోఽభవత్ ॥13
'ఇతడే శ్రీమంతుడైన కుంతికొడుకు. ఇతడే పాండవులలో నడిమివాడు. ఇతడు దేవేంద్రుని కొడుకు. ఇతడే కురువంశరక్షకుడు . ధనుర్విద్వావేత్తలలో ఇతడే మేటి. ధార్మికులలోనూ శీలవంతులలోనూ శ్రేష్ఠుడితడే. ఇతడే శీలజ్ఞాననిధి" అంటూ ప్రేక్షకులు అంటుంటే ఆ కోలాహంలో కూడా ఆ మాటలు వినిన కుంతికి రొమ్ము స్రవించింది. కళ్ళనీళ్ళు వచ్చాయి. ఈ రెండింటితో గుండె తడిసిపోయింది. (11-13)
తేన శబ్దేన మహతా పూర్ణశ్రుతిరథాబ్రవీత్ ।
ధృతరాష్ట్రో నరశ్రేష్ఠః విదురం హృష్టమానసః ॥ 14
ఆ రణగుణధ్వని ధృతరాష్ట్రుని చెవిని కూడా పడింది. దానితో ఆనందించిన ధృతరాష్ట్రనరశ్రేష్ఠుడు విదురునితో ఇలా అన్నాడు. (14)
క్షత్తః క్షుబ్ధార్ణవనిభః కిమేష సుమహాస్వనః ।
సహసైవోత్థితో రంగే భిందన్నివ నభస్తలమ్ ॥ 15
విదురా! కలతపడిన సముద్రం లాగా ఈ పెద్దకోలాహలమేమిటి? గగనతలాన్ని చీల్చివేస్తున్నట్లు హఠాత్తుగా రంగస్థలం నుండి పైకెగసింది. (15)
విదుర ఉవాచ
ఏష పార్థో మహారాజ ఫాల్గునః పాండునందనః ।
అవతీర్ణః సకవచః తత్రైష సుమహాస్వనః ॥ 16
విదిరుడిలా అన్నాడు. మహారాజా! అదిగో! పాండుకుమారుడైన అర్జునుడు కవచాన్ని ధరించి రంగస్థలంపైకి వచ్చాడు. దానితో ఈ కోలాహలం. (16)
థృతరాష్ట్ర ఉవాచ
ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి రక్షితోఽస్మి మహామతే ।
పృథారణిసముద్భూతైః త్రిభిః పాండవవహ్నిభిః ॥ 17
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. మహామతీ! కుంతి అనే అరణినుండి పుట్టిన పాండవులనే మూడుఅగ్నులతో ధన్యుడనయ్యాను. వారిచే అనుగ్రహింపబడి సురక్షితుడనై ఉన్నాను. (17)
వైశంపాయన ఉవాచ
తస్మిన్ ప్రముదితే రంగే కథంచిత్ ప్రత్యుపస్థితే ।
దర్శయామాస బీభత్సుః ఆచార్యాయాస్త్రలాఘవమ్ ॥ 18
ఆగ్నేయేనాసృజద్ వహ్నిం వారుణేనాసృజత్ పయః ।
వాయవ్యేనాసృజత్ వాయుం పార్జన్యేనాసృజద్ ఘనాన్ ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ విధంగా ఆనందకోలాహలంలో నిలిచిన ఆ రంగస్థలి ఎట్టకేలకు ప్రశాంతం అయింది. అర్జునుడు ద్రోణాచార్యునకు తన అస్త్రలాఘవాన్ని ప్రదర్శించాడు. ఆగ్నేయాస్త్రంలో నిప్పునూ, వారుణాస్త్రంతో నీటినీ, వాయవ్యాస్త్రంతో గాలినీ, పర్జన్యాస్త్రంతో మేఘాలనూ సృష్టించాడు. (18,19)
భౌమేన ప్రావిశద్ భూమిం పార్వతేనాసృజద్ గిరీన్ ।
అంతర్ధానేన చాస్త్రేణ పునరంతర్హితోఽభవత్ ॥ 20
భౌమాస్త్రంతో నేలనూ, పార్వతాస్త్రంతో పర్వతాలనూ సృజించాడు. అంతర్ధానాస్త్రంతో తనంతతాను అదృశ్యమయ్యాడు. (20)
క్షణాత్ ప్రాంశుః క్షణాద్ఢ్రస్వః క్షణాచ్చ రథధూర్గతః ।
క్షణేన రథమధ్యస్థః క్షణేనావతరత్ మహీమ్ ॥ 21
ఒక్క క్షణం పొడవుగా కనిపించి మరుక్షణంలో పొట్టిగా కనిపిస్తున్నాడు. రథం నొగలిపై క్షణకాలం కనిపించి మరుక్షణంలో రథమధ్యంలో కనిపిస్తున్నాడు. వెంటనే క్షణంలో నేలపైకి దిగుతున్నాడు. (21)
సుకుమారం చ సూక్ష్మం చ గురుం చాపి గురుప్రియః ।
సౌష్ఠవేనాభిసంక్షిప్తః సోఽవిధ్యద్ వివిధైః శరైః ॥ 22
ఆచార్యద్రోణునకు ప్రియశిష్యుడైన అర్జునుడు పరిపూర్ణమైన లాఘవంతో సుకుమార, సూక్ష్మ, గురు (పెద్దవి) లక్ష్యాలను వివిధబాణాలతో భేదించాడు. (22)
భ్రమతశ్చ వరాహస్య లోహస్య ప్రముఖే సమమ్ ।
పంచబాణానసంయుక్తాన్ సమ్ముమోచైకబాణవత్ ॥ 23
రంగమండపంలో లోహనిర్మితమైన పందిని ఉంచారు. అది తిరుగుతోంది. తిరుగుతున్న దాని ముఖంపై అర్జునుడు ఒక్కమారే విడివిడిగా ఉన్న అయిదుబాణాలను ప్రయోగించాడు. అవి అయిదు అయినా ఒక్కటే అనిపించాయి. (23)
గవ్యే విషాణకోషే చ చలే రజ్జ్వవలంబిని ।
నిచఖాన మహావీర్యః సాయకానేకవింశతిమ్ ॥ 24
రంగమండపంలో ఒకవైపు ఎద్దుకొమ్మును త్రాటితో కట్టారు. అది కదులుతోంది. ఆ కొమ్మురంధ్రంలో మహాపరాక్రమశాలి అయిన అర్జునుడు ఇరువది యొక్క బాణాలను నాటేటట్లు విసిరాడు. (24)
ఇత్యేవమాది సుమహత్ ఖడ్గే ధనుషి చానషు ।
గదాయాం శస్త్రకుశలః మండలాని హ్యదర్శయత్ ॥ 25
అనఘా! ఈ విధంగా గొప్ప ప్రదర్శన నిచ్చాడు అర్జునుడు. కత్తి, విల్లు, గద-మొదలయిన వాటితో కూడా శస్త్రకుశలుడైన అర్జునుడు అనేకవ్యూహాలను ప్రదర్శించాడు. (25)
తతః సమాప్తభూయిష్ఠే తస్మిన్ కర్మణి భారత ।
మందీభూతే సమాజే చ వాదిత్రస్య చ నిఃస్వనే ॥ 26
ద్వారదేశాత్ సముద్భూతః మహాత్మ్యబలసూచకః ।
వజ్రనిష్పేషసదృశః శుశ్రువే భుజనిఃస్వనః ॥ 27
జనమేజయా! ఆ తరువాత అర్జునుని అస్త్రవిద్యాప్రదర్శనం సమాప్తం కాగా మనుష్యుల కోలాహలమూ, వాద్యధ్వనీ మందగిస్తోంది. అపుడు ద్వారదేశం నుండి మాహాత్మ్యాన్నీ, బలాన్నీ సూచిస్తూ వెలువడి జబ్బచరిచిన చప్పుడు వినిపించింది. ఆ ధ్వని వజ్రాలను పొడిచేస్తున్న శబ్దం వలె ఉన్నది. (26,27)
దీర్యంతే కిం ను గిరయః కింస్విద్ భూమిర్విదీర్యతే ।
కింస్విదాపూర్యతే వ్యోమ జలధారాఘనైర్ఘనైః ॥ 28
ఆ చప్పుడు విని ప్రజలిలా భావించారు-పర్వతాలు బ్రద్దలవుతున్నాయా? భూమి చీలిపోతోందా? జలధారలతో నిండిన మేఘాల గర్జనము ఆకాశాన్ని నింపివేస్తున్నాయా? (28)
రంగస్వైవం మతిరభూత్ క్షణేన వసుధాధిప ।
ద్వారం చాభిముఖాః సర్వే బభూవుః ప్రేక్షకాస్తదా ॥ 29
రాజా! క్షణకాలం రంగస్థలమంతా పైవిధంగా భావించింది. అప్పుడు ప్రేక్షకులంతా ద్వారం వైపు దృష్టి సారించారు. (29)
పంచభిః భ్రాతృభిః పార్థైః ద్రోణః పరివృతో బభౌ ।
పంచతారేణ సంయుక్తః సావిత్రేణేవ చంద్రమాః ॥ 30
కౌంతేయులయిన అయిదుగురు సోదరులు చుట్టూ నిలువగా అయిదుతారల సమూహమైన హస్తానక్షత్రంతో కూడికొనిన చంద్రునివలె ప్రకాశించాడు ద్రోణుడు. (30)
అశ్వత్థామ్నా చ సహితం భ్రాతౄణాం శతమూర్జితమ్ ।
దుర్యోధనమమిత్రఘ్నమ్ ఉత్థితం పర్యవారయత్ ॥ 31
సతైస్తదా భ్రాతభిరుద్యతాయుధైః
గదాగ్రపాణిః సమవస్థితైర్వృతః ।
బభౌ యథా దానవసంక్షయే పురా
పురందరో దేవగణైః సమావృతః॥ 32
శత్రుసంహారకుడైన దుర్యోధనుడు కూడా లేచి నిలబడ్డాడు. దుర్యోధనుని నూర్గురు సోదరులూ అశ్వత్థామతో కలిసి సుయోధనుని చుట్టూ నిలిచారు. చేత ఆయుధాలు ధరించి తన చుట్టూ సోదరులు నిలువగా గద చేతబట్టి నిలిచిన దుర్యోధనుడు గతంలో దానవసంహారంలో దేవగణాలు పరివేష్టించిన దేవేంద్రునివలె ప్రకాశించాడు. (31,32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి అస్త్రదర్శనే చతుస్త్రింశదధిక శతతమోఽధ్యాయః ॥ 134 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున అస్త్రదర్శనమను నూట ముప్పది నాలుగవ అధ్యాయము. (134)
(దాక్షిణాత్య అధికపాఠం 1 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 33 1/2 శ్లోకాలు)