138. నూట ముప్పది యెనిమిదవ అధ్యాయము

యుధిష్ఠిరుని యౌవరాజ్యాభిషేకము - పాండవుల వృద్ధిని చూచి ధృతరాష్ట్రుడు చింతించుట.

వైశంపాయన ఉవాచ
తతః సంవత్సరస్యాంతే యౌవరాజ్యాయ పార్థివ ।
స్థాపితో ధృతరాష్ట్రేణ పాండుపుత్రో యుధిష్ఠిరః ॥ 1
ధృతిస్థైర్య సహిష్టుత్వాత్ ఆనృశంస్యాత్ తథార్జవాత్ ।
భృత్యానామనుకంపార్థం తథైవ స్థిరసౌహృదాత్ ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! ఒక సంవత్సరకాలం గడిచిన తర్వాత దృతరాష్ట్రుడు పాండుకుమారుడైన యుధిష్ఠిరుని యువరాజును చేశాడు. యుధిష్ఠిరునిలోని ధైర్యం, స్థైర్యం, సహనం, దయాళుత, ఋజువర్తనం, స్థిరమైన సౌహార్దం కారణంగా పరిపాలకుడై ప్రజలను అనుగ్రహించటానికి ఆ ఏర్పాటు జరిగింది. (1,2)
తతోఽదీర్ఘేణ కాలేన కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
పితురంతర్దధే కీర్తిం శీలవృత్త సమాధిభిః ॥ 3
ఆ తరువాత స్వల్పకాలంలోనే తన శీలం, వర్తనం, ఏకాగ్రతలచే కుంతీ పుత్రుడైన యుధిష్ఠిరుడు తన తండ్రి కీర్తిని మరపింపజేశాడు. (3)
అసియుద్ధే గదాయుద్ధే రథయుద్ధే చ పాండవః ।
సంకర్షణాదశిక్షద్ వై శశ్వచ్ఛిక్షాం వృకోదరః ॥ 4
వృకోదరుడు ప్రతిదినమూ బలరాముని దగ్గర కత్తియుద్ధాన్ని, గదాయుద్ధాన్నీ, రథయుద్ధాన్నీ అభ్యసింపసాగాడు. (4)
సమాప్తశిక్షో భీమస్తు ద్యుమత్సేన సమో బలీ ।
పరాక్రమేణ సంపన్నః భ్రాతౄణామచరద్ వశే ॥ 5
విద్యాభ్యాసం ముగిసిన తర్వాత భీమసేనుడు బలంలో ద్యుమత్సేనునితో సముడయ్యాడు. పరాక్రమసంపన్నుడై సోదరుల అదుపులో ప్రవర్తించసాగాడు. (5)
ప్రగాఢదృఢముష్టిత్వే లాఘవే వేధనే తథా ।
క్షురనారాచభల్లానాం విపాఠానాం చ తత్త్వవిత్ ॥ 6
ఋజువక్రవిశాలానాం ప్రయోక్తా ఫాల్గునోఽభవత్ ।
లాఘవే సౌష్ఠవే చైవ నాన్యః కశ్చన విద్యతే ॥ 7
బీభత్సుసదృశో లోకే ఇతి ద్రోణో వ్యవస్థితః ।
తతో-బ్రవీత్ గుడాకేశం ద్రోణః కౌరవసంసది ॥ 8
అర్జునుడు పిడికిలి బిగించి వింటిని పట్టడంలోనూ, హస్తలాఘవంలోనూ, లక్ష్యాన్ని భేదించటంలోనూ, క్షుర నారాచ భల్ల విపాఠాలనబడే సరళ, వక్ర, విశాల బాణాలను ప్రయోగించటంలోనూ నేర్పరి అయ్యాడు. లాఘవంలోనూ, సౌష్ఠవంలోనూ అర్జునునితో సాటిరాగలవాడు లోకంలో మరెవ్వడూ లేడని ద్రోణుడు విశ్వసించాడు. ఒకరోజు ద్రోణుడు కౌరవసభలో (నిదురను అదుపులో నుంచుకొనగల) అర్జునునితో ఇలా అన్నాడు. (6-8)
అగస్త్యస్య ధనుర్వేదే శిష్యో మమ గురుః పురా ।
అగ్నివేళ ఇతి ఖ్యాతః తస్య శిష్యోఽస్మి భారత ॥ 9
తీర్థాత్ తీర్థం గమయితుమ్ అహమేతత్ సముద్యతః ।
తపసా యన్మయా ప్రాప్తమ్ అమోఘమశనిప్రభమ్ ॥ 10
అస్త్రం బ్రహ్మశిరో నామ యద్ దహేత్ పృథివీమపి ।
దదతా గురుణా చోక్తం న మనుష్యేష్విదం త్వయా ॥ 11
భారద్వాజ విమోక్తవ్యమ్ అల్పవీర్యేష్వపి ప్రభో ।
త్వయా ప్రాప్తమిదం వీర దివ్యం నాన్యోఽర్హతి త్విదమ్ ॥ 12
సమయస్తు త్వయా రక్ష్యః మునిసృష్టో విశాంపతే ।
ఆచార్యదక్షిణాం దేహి జ్ఞాతిగ్రామస్య పశ్యతః ॥ 13
అర్జునా! నా గురువు అగ్నివేశుడు. ఆయన అస్త్రవిద్యలో ఒకప్పుడు అగస్త్యుని శిష్యుడు. ఒక యోగ్యుని నుండి మరొక యోగ్యునకు సంక్రమింపజేయాలన్న ప్రయత్నంతో నేను నీకు బ్రహ్మశిరోనామకమైన అస్త్రాన్ని ఇచ్చాను. అది నా తపస్సాధన. అది వజ్రాయుధం వలె ప్రకాశిస్తుంది. అది సమస్తభూమండలాన్నీ దహింపగలది. ఈ అస్త్రాన్ని నాకు ప్రసాదిస్తూ నా గురువు అగ్నివేశుడు "ద్రోణా! దీనిని మానవులపై ప్రయోగించరాదు" అని చెప్పి ఇచ్చాడు. వీరా! అర్జునా! దీనిని నా నుండి నీవు పొందావు. మరెవ్వరికీ ఇది లభించదు. ఈ అస్త్రాన్ని అనుగ్రహిస్తూ ఆ మహర్షి చెప్పిన నియమాన్ని నీవు కూడా పాటించాలి. ఇప్పుడు నీజ్ఞాతుల సమక్షంలో నీవు నాకు గురుదక్షిణను ఇవ్వాలి. (9-13)
దదానీతి ప్రతిజ్ఞాతే ఫాల్గునేనాబ్రవీద్ గురుః ।
యుద్ధే-హం ప్రతియోద్ధవ్యః యుధ్యమానస్త్వయానఘ ॥ 14
ఇవ్వటానికి అర్జునుడు అంగీకరించిన తరువాత ద్రోణుడు ఇలా అన్నాడు. - అనఘా! అర్జునా! యుద్ధభూమిలో నేను నీకు ఎదురు నిలిస్తే నీవు నాతో పోరాడాలి. (14)
తథేతి చ ప్రతిజ్ఞాయ ద్రోణాయ కురుపుంగవః ।
ఉపసంగృహ్య చరణౌ స ప్రాయాదుత్తరాం దిశమ్ ॥ 15
'అలాగే' అని ద్రోణునకు మాట ఇచ్చి కురుశ్రేష్ఠుడైన అర్జునుడు ఆచార్యుని పాదాలకు నమస్కరించి గురువు నుండి సర్వోత్తమమైన ఉపదేశాన్ని పొందాడు. (15)
స్వభావాదగమచ్ఛబ్దః మహీం సాగరమేఖలామ్ ।
అర్జునస్య సమో లోకే నాస్తి కశ్చిద్ ధనుర్ధరః ॥ 16
సాగర మేఖల అయిన ఈ భూమండలంలో అర్జునునకు సాటిరాగల విలుకాడు ఎవ్వడూ లేడన్న మాట తనంతతానుగా వ్యాపించింది. (16)
గదాయుద్ధే ఽసియుద్ధే చ రథయుద్ధే చ పాండవః ।
పారగశ్చ ధనుర్యుద్ధే బభూవాథ ధనంజయః ॥ 17
అర్జునుడు గదాయుద్ధంలోనూ, ఖడ్గయుద్ధంలోనూ, రథయుద్ధంలోనూ, విలువిద్యలోనూ నిష్ణాతుడయ్యాడు. (17)
నీతిమాన్ సకలాం నీతిం విబుధాధిపతేస్తదా ।
అవాప్య సహదేవోఽపి భ్రాతౄణాం వవృతే వశే ॥ 18
ద్రోణేనైవ వినీతశ్చ భ్రాతౄణాం నకులః ప్రియః ।
చిత్రయోధీ సమాఖ్యాతః బభూవాతిరథోదితః ॥ 19
ఆ సమయంలోనే నీతిమంతుడైన సహదేవుడు ద్రోణుని రూపంలో ఉన్న దేవగురువు నుండి నీతిశాస్త్రాన్ని గ్రహించి సోదరులకు వశవర్తి అయి ఉన్నాడు. సోదరులకు ఇష్టుడైన నకులుడు ద్రోణుని దగ్గరే అస్త్రశస్త్రవిద్యలు గ్రహించి చిత్రంగా యుద్ధం చేయటంలో ప్రసిద్ధికెక్కి అతిరథుడు అనిపించుకొన్నాడు. (18,19)
త్రివర్షకృతయజ్ఞస్తు గంధర్వాణాముపప్లవే ।
అర్జునప్రముఖైః పార్థైః సౌవీరః సమరే హతః ॥ 20
న శశాక వశే కర్తుం యం పాండురపి వీర్యవాన్ ।
సోఽర్జునేన వశం నీతః రాజాఽఽసీద్ యవనాధిపః ॥ 21
సౌవీరదేశాధిపతి గంధర్వులు ఇబ్బందిపెడుతున్నా ఏకంగా మూడు సంవత్సరాలు విఘాతం లేకుండా యజ్ఞాలను అనుష్ఠించినవాడు. ఆయన అర్జునాదులతో యుద్ధం చేస్తూ మరణించాడు. పరాక్రమసంపన్నుడైన పాండురాజుకు కూడా లొంగని యవనదేశపు రాజు అర్జునునకు లోబడ్డాడు. (20,21)
అతీవ బలసంపన్నః సదా మానీ కురూన్ ప్రతి ।
విపులో నామ సౌవీరః శస్తః పార్థేన ధీమతా ॥ 22
దత్తామిత్ర ఇతి ఖ్యాతం సంగ్రామే కృతనిశ్చయమ్ ।
సుమిత్రం నామ సౌవీరమ్ అర్జునోఽదమయచ్ఛరైః ॥ 23
విపులుడనే సౌవీరరాజు మిగుల బలసంపన్నుడు. అభిమానవంతుడు. కౌరవుల విషయంలో ఎప్పుడూ పొగరుగా ప్రవర్తించేవాడు. ఆయనను కూడా అర్జునుడు యుద్ధంలో చంపివేశాడు. మరొక సౌవీరరాజు సుమిత్రుడు. దత్తామిత్రుడని అతనికి మరొక పేరు. ఎప్పుడూ యుద్ధానికి సంకల్పించేవాడు. ఆయనను కూడా అర్జునుడు బాణాలతో అణచివేశాడు. (22,23)
భీమసేనసహాయశ్చ రథానామయుతం చ సః ।
అర్జునః సమరే ప్రాచ్యాన్ సర్వానేకరథో ఽజయత్ ॥ 24
అర్జునుడు భీమసేనునొక్కడివే తోడు తీసికొని ఒంటరిగా రథంపై నిలిచి తూర్పుదిక్కున నున్న వీరులనూ, పదివేలమంది రథికులనూ జయించాడు. (24)
తథైవైకరథో గత్వా దక్షినామజయద్ దిశమ్ ।
ధనౌఘం ప్రాపయామాస కురురాష్ట్రం ధనంజయః ॥ 25
అదేవిధంగా అర్జునుడు ఒంటరిగా రథంపై నిలిచి దక్షిణ దిక్కును జయించాడు. కురురాజధానికి ధనరాసులను కొనితెచ్చాడు. (25)
ఏవం సర్వే మహాత్మానః పాండవా మనుజోత్తమాః ।
పరరాష్రాణి నిర్జిత్య స్వరాష్ట్రం వవృధుః పురా ॥ 26
ఈ విధంఘా మహాత్ములూ, మానవోత్తములూ అయిన పాండవులు శత్రురాజధానులను గెలిచి తమ రాజధానిని అభివృద్ధి చేసికొన్నారు. (26)
తతో బలమతిభ్యాతం విజ్ఞాయ దృఢధన్వినామ్ ।
దూషితః సహసా భావః ధృతరాష్ట్రస్య పాండుషు ।
స చింతాపరమో రాజా న నిద్రామలభన్నిశి ॥ 27
గట్టిగా విల్లుపట్టగలిగిన ఆ పాండవుల బలపరాక్రమాలను తెలిసికొనిన వెంటనే ధృతరాష్ట్రునిలో పాండవుల పట్ల చెడు తలపులు కలిగాయి. ఆ చింతతో ధృతరాష్ట్రునికి రాత్రి నిదురపట్టలేదు. (27)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ధృతరాష్ట్ర చింతాయామ్ అష్టాత్రింశదధిక శతతమోఽధ్యాయః ॥138॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్రచింత అను నూట ముప్పదియెనిమిదవ అధ్యాయము. (138)