139. నూట ముప్పదితొమ్మిదవ అధ్యాయము

కణికుడు ధృతరాష్ట్రునకు కూటనీతినుపదేశించుట.

వైశంపాయన ఉవాచ
శ్రుత్వా పాండుసుతాన్ వీరాన్ బలోద్రిక్తాన్ మహౌజసః ।
ధృతరాష్ట్రో మహీపాలః చింతామగమదాతురః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. పాండురాజకుమారులు వీరులూ, బలసంపన్నూలూ, తేజోమూర్తులూ అని విని ధృతరాష్ట్రమహారాజు కలతపడి చింతాక్రాంతుడయ్యాడు. (1)
తత ఆహూయ మంత్రజ్ఞం రాజశాస్త్రార్థవిత్తమమ్ ।
కణికం మంత్రిణాం శ్రేష్ఠం ధృతరాష్ట్రోఽబ్రవీద్ వచః ॥ 2
ఆపై మంత్రవేత్తా, మంత్రిశ్రేష్ఠుడూ, రాజనీతివేత్తలలో అగ్రగణ్యుడూ అయిన కణికుని పిలిపించి ధృతరాష్ట్రుడిలా అన్నాడు. (2)
ధృతరాష్ట్ర ఉవాచ
ఉత్సిక్తాః పాండవా నిత్యం తేభ్యోఽసూయే ద్విజోత్తమ ।
తత్ర మే నిశ్చితతమం సంధివిగ్రహకారణమ్ ॥ 3
ధృతరాష్ట్రుడిలా అడిగాడు. ద్విజశ్రేష్ఠా! పాండవులు అనుదినమూ వృద్ధినందుతున్నారు. వారిపై నాకు అసూయ కలుగుతోంది. కాబట్టి ఈ విషయంలో బాగా నిశ్చయించి సంధి తగినదో, విగ్రహం తగినదో నాకు చెప్పు. (3)
వైశంపాయన ఉవాచ
స ప్రసన్నమనాస్తేన పరిపృష్టో ద్విజోత్తమః ।
ఉవాచ వచనం తీక్ష్ణం రాజశాస్త్రార్థదర్శనమ్ ॥ 4
వైశంపాయనుడిలా అన్నాడు. ధృతరాష్ట్రుడిలా అడగగానే ప్రసన్నమనస్కుడై ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు-కణికుడు-రాజనీతిసిద్ధాంతాలను దర్శింపజేస్తూ తీక్ష్ణంగా ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. (4)
శృణు రాజన్నిదం తత్ర ప్రోచ్యమానం మయానఘ ।
న మేఽభ్యసూయా కర్తవ్యా శ్రుత్వైతత్ కురుసత్తమ ॥ 5
అనఘా! రాజా! ఈ విషయంలో నా అభిప్రాయం చెపుతాను విను. కురుసత్తమా! ఇది విని నన్ను తప్పు పట్టగూడదు. (5)
నిత్యముద్యతదండః స్యాత్ నిత్యం వివృతపౌరుషః ।
అచ్ఛిద్రశ్ఛిద్రదర్శీ స్యాత్ పరేషాం వివరానుగః ॥ 6
రాజు ఎప్పుడూ దండాన్ని ఎత్తిపట్టియే ఉండాలి. నిత్యమూ పౌరుషాన్ని ప్రకటిస్తూనే నిలవాలి. తన లోపాలను బయటపడనీయకూడదు. శత్రువుల లోపాలను దర్శించగలగాలి. ఇతరుల దుర్బలతను గ్రహించి తదనుగుణంగా ఉద్యమించాలి. (6)
నిత్యముద్యతదండాద్ధి భృశముద్విజతే జనః ।
తస్మాత్ సర్వాణి కార్యాణి దండేనైవ విధారయేత్ ॥ 7
రాజు అనుక్షణమూ దండాన్ని ఎత్తి ఉన్నప్పుడే ప్రజలు భయపడతారు. కాబట్టి అన్ని పనులనూ దండం ద్వారానే సాధించాలి. (7)
నాస్యచ్ఛిద్రం పరః పశ్యేత్ ఛిద్రేణ పరమన్వియాత్ ।
గూహేత్ కూర్మ ఇవాంగాని రక్షేద్ వివరమాత్మనః ॥ 8
నాసమ్యక్కృతకారీ స్యాత్ ఉపక్రమ్య కదాచన ।
కంటకో హ్యాపి దుశ్ఛిన్నః ఆస్రావం జనయేచ్చిరమ్ ॥ 9
శత్రువు తన లోపాలను గ్రహించలేనంత జాగరూకుడై రాజు మెలగాలి. శత్రువుల లోపాలు బయటపడితే తప్పక అతనిపై దండెత్తాలి. తాబేలు అంగాలను ముడుచుకొనినట్లు రాజు తన సప్తాంగాలనూ రక్షించుకోవాలి. ప్రారంభించిన పనిని ఎప్పుడూ మధ్యలోనే వదలివేయదగదు. ముల్లునైనా సరే సగం తీసి మిగిలిన భాగాన్ని శరీరంలోనే విడిస్తే చాలాకాలం వరకు ఆ గాయం మానదు. (8,9)
వధమేవ ప్రశంసంతి శత్రూణామపకారిణామ్ ।
సువిదీర్ణం సువిక్రాంతం సుయుద్ధం సుపలాయితమ్ ॥ 10
ఆపద్యాపది కాలే చ కుర్వీత న విచారయేత్ ।
నావజ్ఞేయో రిపుస్తాత దుర్బలోఽపి కథంచన ॥ 11
అపకారం చేసిన శత్రువులను చంపటమే అభినందనీయమైన పని. గొప్ప పరాక్రమం గల శత్రువయినా ఇబ్బందులలో పడినప్పుడు తేలికగా నష్టపరచవచ్చు. మేటి యోధుడైనా విపత్తికాలంలో తేలికగా చంపవచ్చు. విపత్కాలంలో ఉన్న శత్రువులపై తప్పక దాడి చేయాలి. ఆ సమయంలో సౌహార్దచర్యలు చేయరాదు. నాయనా! శత్రువు దుర్బలుడయినా ఏ రీతిగానూ అతనిని ఉపేక్షించకూడదు. (10,11)
అల్పోఽప్యగ్నిర్వనం కృత్స్నం దహత్యాశ్రయ సంశ్రయాత్ ।
అంధః స్యాదంధవేలాయాం బాధిర్యమపి చాశ్రయేత్ ॥ 12
చిన్న నిప్పురవ్వ అయినా ఆశ్రయం దొరికితే మొత్తం అడవినే తగులబెడుతుంది. తనకు అనువుగానపుడు శత్రువుల దోషాలను చూడకుండా గ్రుడ్డిగానే ఉండాలి. తగని వేళలో నిందావచనాలనైనా విననట్లే నిలవాలి. (12)
కుర్యాత్ తృణమయం చాపం శయీత మృగశాయికామ్ ।
సాంత్వాదిభిరుపాయైస్తు హన్యాచ్ఛత్రుం వశే స్థితమ్ ॥ 13
అవసరపడినపుడు తన వింటిని తృణమయంగానే భావించాలి. అల్పజంతువులకు నమ్మకం కలిగేదాకా నిద్ర నటిస్తున్న మృగం లాగా అసమర్థునివలెనే కనిపించాలి. శత్రువు తనను సమీపించిన తరువాత సాంత్వనం మొదలగు ఉపాయంతో నమ్మించి సంహరించాలి. (13)
దయా న తస్మిన్ కర్తవ్యా శరణాగత ఇత్యుత ।
నిరుద్విగ్నో హి భవతి న హతాజ్జాయతే భయమ్ ॥ 14
ఆ శత్రువు శరణుగోరినా జాలిపడరాదు. శత్రువును చంపినపుడే రాజుకు కలత ఉండదు. చంపకపోతే నిత్యమూ భయం భయంగానే ఉంటుంది. (14)
హన్యాదమిత్రం దానేన తథా పూర్వాపకారిణమ్ ।
హన్యాత్ త్రీన్ పంచసప్తేతి పరపక్షస్య సర్వశః ॥ 15
సహజ శత్రువును దానాదుల చేత నమ్మకం కలిగించి చంపాలి. ఒకప్పుడు అపకారం చేసి, ప్రస్తుతం ఆశ్రయించి ఉన్నవాన్ని కూడా సంహరించాలి. శత్రుపక్షం యొక్క పురుషార్థరూప త్రివర్గాన్నీ, ప్రకౄతిరూప పంచవర్గాన్నీ, సాధన రూపసప్తవర్గాన్నీ నశింపజేయాలి. (15)
మూలమేవాదితశ్ఛింద్యాత్ పరపక్షస్య నిత్యశః ।
తతః సహాయాంస్తత్పక్షాన్ సర్వాంశ్చ తదనంతరమ్ ॥ 16
ఎప్పుడూ శత్రుపక్షం యొక్క మూలాన్నే ముందు నరకాలి. ఆ తరువాత శత్రు సహాయకులను చంపాలి. ఆపై ఆ పక్షానికి చెందిన అందరినీ సంహరించాలి. (16)
ఛిన్నమూలే హ్యధిష్ఠానే సర్వే తజ్జీవినో హతాః ।
కథం ను శాఖాస్తిష్ఠేరన్ ఛిన్నమూలే వనస్పతౌ ॥ 17
మూలాధారం నశిస్తే దానినాశ్రయించి ఉన్న వారంతా నశించినట్లే. చెట్టు మొదలు నరికిన తరువాత కొమ్మలు నిలువలేవు గదా! (17)
ఏకాగ్రః స్యాదవివృతః నిత్యం వివరదర్శకః ।
రాజన్ నిత్యం సపత్నేషు నిత్యోద్విగ్నః సమాచరేత్ ॥ 18
మూలమేవాదితశ్ఛింద్యాత్ పరపక్షస్య నిత్యశః ।
తతః సహాయాంస్తత్పక్షాన్ సర్వాంశ్చ తదనంతరమ్ ॥ 16
ఎప్పుడూ శత్రుపక్షం యొక్క మూలాన్నే ముందు నరకాలి. ఆ తరువాత శత్రు సహాయకులను చంపాలి. ఆపై ఆ పక్షానికి చెందిన అందరినీ సంహరించాలి. (16)
ఛిన్నమూలే హ్యధిష్ఠానే సర్వే తజ్జీవినో హతాః ।
కథం ను శాఖాస్తిష్ఠేరన్ ఛిన్నమూలే వనస్పతౌ ॥ 17
మూలాధారం నశిస్తే దానినాశ్రయించి ఉన్న వారంతా నశించినట్లే. చెట్టు మొదలు నరికిన తరువాత కొమ్మలు నిలువలేవు గదా! (17)
ఏకాగ్రః స్యాదవివృతః నిత్యం వివరదర్శకః ।
రాజన్ నిత్యం సపత్నేషు నిత్యోద్విగ్నః సమాచరేత్ ॥ 18
రాజా! నిత్యమూ శత్రుగమనాన్ని తెలిసికొనుటలో ఏకాగ్రత కావాలి. తన రాజ్యాంగాలను రహస్యంగా నిలుపుకోవాలి. శత్రువుల లోపాలను నిరంతరమూ గమనించాలి. వారి విషయంలో నిత్యమూ ఉద్విగ్నుడై చరించాలి. (18)
అగ్న్యాధానేన యజ్ఞేన కాషాయేణ జటాజినైః ।
లోకాన్ విశ్వాసయిత్వైవ తతో లుంపేద్ యథా వృకః ॥ 19
అగ్నిహోత్రాలనూ, యజ్ఞాలనూ ఆచరిస్తూ; కాషాయాలనూ, జటలను, మృగచర్మాలను ధరిస్తూ లోకానికి నమ్మకాన్ని కలిగించాలి. ఆ తర్వాత తోడేలు వలె మొత్తం నాశనం చేయాలి. (19)
అంకుశం శౌచమిత్యాహుః అర్థానాముపధారణే ।
ఆనామ్య ఫలితాం శాఖాం పక్వం ప్రశాతయేత్ ॥ 20
అర్థసిద్ధికై శౌచాన్ని పాటించటాన్ని అంకుశంగా భావిస్తారు. ఫలించిన చెట్టుకొమ్మను వంచి పండిన పండును ఒక్కొక్కటీ కోసికోవాలి. (20)
ఫలార్థోఽయం సమారంభః లోకే పుంసాం విపశ్చితామ్ ।
వహేదమిత్రం స్కంధేన యావత్ కాలస్య పర్యయః ॥ 21
లోకంలో పండితులైన వారి ప్రయత్నాలన్నీ ఫలసిద్ధికోసమే. కాలం తనకు అనుకూలమయ్యేంతవరకూ అవసరమయితే శత్రువును భుజాన మోయాలి. (21)
తతః ప్రత్యాగతే కాలే భింద్యాత్ ఘటమివాశ్మని ।
అమిత్రో న విమొక్తవ్యః కృపణం బహ్వపి బ్రువన్ ॥ 22
కృపా న తస్మిన్ కర్తవ్యా హన్యాదేవాపకారిణమ్ ।
హన్యాదమిత్రం సాంత్వేన తథా దానేన వా పునః ॥ 23
తథ్వైవ భేదదండాభ్యాం సర్వోపాయైః ప్రశాతయేత్ ।
తరువాత కాలం అనుకూలించినప్పుడు రాతిమీద కుండను బ్రద్దలు కొట్టినట్లు శత్రువును నశింపజేయాలి. శత్రువు ఎంత దీనంగా మాటాడినా అతనిని వదలరాదు. అతనిపై జాలి చూపదగదు. అపకారిని చంపి తీరవలసినదే. శత్రువును సాంత్వనంతో కానీ, దానంతో కానీ నమ్మకం కలిగించి చంపాలి. అలాగే అవసరాన్ని బట్టి భేదదండోపాయాలతో నరికివేయాలి. (22,23 1/2)
ధృతరాష్ట్ర ఉవాచ
కథం సాంత్వేన దానేన భేదైర్దండేన వా పునః ॥ 24
అమిత్రః శక్యతే హంతుం తన్మే బ్రూహి యథాతథమ్ ।
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. శత్రువును సామ, దాన, భేద, దండోపాయాలతో ఎలా చంపగలం? దానిని నాకు యథాతథంగా చెప్పు. (24 1/2)
కణిక ఉవాచ
శృణు రాజన్ యథావృత్తం వనే నివసతః పురా ॥ 25
జంబుకస్య మహారాజ నీతిశాస్త్రార్థదర్శినః ।
కణికుడిలా చెప్పాడు. మహారాజా! ఈ సందర్భంలో నీతిశాస్త్రవేత్తయై అడవిలో నివసిస్తున్న ఒక నక్క కథను చెపుతా విను. (25 1/2)
అథ కశ్చిత్ కృతప్రజ్ఞః శృగాలః స్వార్థపండితః ॥ 26
సఖిభిర్న్యవసన్ సార్థం వ్యాఘ్రాఖువృకబభ్రుభిః ।
తేఽపశ్యన్ విపినే తస్మిన్ బలినం మృగయూథపమ్ ॥ 27
అశక్తా గ్రహణే తస్య తతో మంత్రమమంత్రయన్ ।
ఒక అడవిలో స్వార్థసాధనలో నిపుణత్వం గల ఒక తెలివైన నక్క ఉండేది. దానికి నలుగురు మిత్రులు-పులి, ఎలుక, తోడేలు, నెమలి. వాటితో కలిసి అది నివసించేది. అవి ఆ అడవిలో ఒక జింకలరాజును చూచాయి. అది బలిష్ఠమైనది. దానిని పట్టుకోవటం కుదరక అవన్నీ కలిసి ఆలోచించాయి. (26,27 1/2)
జంబుక ఉవాచ
అసకృద్ యతితో హ్యేషః హంతుం వ్యాఘ్ర వనే త్వయా ॥ 28
యువా వై జవసంపన్నః బుద్ధిశాలీ న శక్యతే ।
మూషికోఽస్య శయానస్య చరణే భక్షయత్వయమ్ ॥ 29
యథైనం భక్షితైః పాదైః వ్యాఘ్రో గృహ్ణాతు వై తతః ।
తతో వై భక్షయిష్యామః సర్వే ముదితమానసాః ॥ 30
జంబుకం ఇలా అన్నది. పులీ! అడవిలో దీనిని చంపటానికి నేను ఎన్నో సార్లు ప్రయత్నించాను. అది తెలివైనది, వయస్సులో నున్నది, యౌవనంలో ఉన్నది కాబట్టి వేగంగా పరుగెత్తగలదు. పట్టుకోవటం వీలుకాలేదు. అది నిదురించేటప్పుడు ఈ ఎలుక వెళ్ళి దాని పాదాలను కొరకాలి. అందువల్ల అది వేగంగా పరుగెత్తలేదు. ఆపై పులి దానిని పట్టుకోవాలి. అప్పుడు అందరమూ ఆనందంగా దానిని తిందాము. (28-30)
జంబుకస్య తు తద్వాక్యం తథా చక్రుః సమాహితాః ।
మూషికాభక్షితైః పాదైః మృగం వ్యాఘ్రోఽవధీత్ తదా ॥ 31
నక్క మాటలు విని సావధానులై అవన్నీ అలాగే చేశాయి. ఎలుక కాళ్ళను కొరకగా, పరగెత్తలేని స్థితిలో ఉన్న ఆ జింకను పులి చంపివేసింది. (31)
దృష్ట్వైవాచేష్టమానం తు భూమౌ మృగకళేవరమ్ ।
స్నాత్వాఽఽగచ్ఛత భద్రం వః రక్షామీత్యాహ జంబుకః ॥ 32
జింక శరీరం నిశ్చేష్టంగా భూమిపై పడిపోగానే నక్క అది చూచి "బాగా చేశారు. స్నానం చేసి రండి. అప్పటిదాకా దీనిని నేను కాపాడుతాను" అని పలికింది. (32)
శృగాలవచనాత్ తఽపి గతాః సర్వే నదీం తతః ।
స చింతాపరమో భూత్వా తస్థౌ తత్రైవ జంబుకః ॥ 33
ఆపై నక్క మాటవిని మిగిలిన జంతువులన్నీ నది దగ్గరకు వెళ్లాయి. తీవ్రంగా ఆలోచిస్తూ నక్క అక్కడే ఉండిపోయింది. (33)
అథాజగామ పూర్వం తు స్నాత్వా వ్యాఘ్రో మహాబలః ।
దదర్శ జంబుకం చైవ చింతాకులితమానసమ్ ॥ 34
ఆ తరువాత స్నానం చేసి అందరికన్న ముందుగా బలశాలి అయిన పులివచ్చింది. మనస్సులో కలతపడుతున్న నక్కను చూచింది. (34)
వ్యాఘ్ర ఉవాచ
కిం శోచసి మహాప్రాజ్ఞ త్వం నో బుద్ధిమతాం వరః ।
అశ్వితా పిశితాన్యద్య విహరిష్యామహే వయమ్ ॥ 35
పులి ఇలా అన్నది. మహాప్రాజ్ఞా! ఏమాలోచిస్తున్నావు? మన అందరిలో నీవే తెలివైనవాడవు. మనం ఈ రోజు ఈ మాంసం తిని హాయిగా తిరగవచ్చు. (35)
జంబుక ఉవాచ
శృణు మే త్వం మహాబాహో యద్ వాక్యం మూషికోఽబ్రవీత్ ।
ధిగ్ బలం మృగరాజస్య మయాద్యాయం మృగోహతః ॥ 36
నక్క ఇలా అన్నది. మహాబాహూ! ఒకమాట చెపుతా విను. ఎలుక నాకీ మాట చెప్పింది. "ఛీ! ఏం బల మీపులిది! ఈ రోజు ఈజింకను నేనే చంపాను." (36)
మద్బాహుబలమాశ్రిత్య తృప్తిమద్య గమిష్యతి ।
గర్జమానస్య తస్యైవమ్ అతో భక్ష్యం న రోచయే ॥ 37
నా బాహుబలం మీద ఆధారపడియే ఈ రోజు ఆపులి ఆకలి తీరుతోంది. అది ఆవిధంగా ప్రగల్భాలు పలుకుతుంటే దాని సహాయంతో పొందిన ఈ మాంసం తినాలనిపించటం లేదు. (37)
వ్యాఘ్ర ఉవాచ
బ్రవీతి యది సహ్యేవం కాలే హ్యస్మిన్ ప్రబోధితః ।
స్వబాహుబలమాశ్రిత్య హనిష్యేఽహం వనేచరాన్ ॥ 38
ఖాదిష్యే తత్ర మాంసాని ఇత్యుక్త్వా ప్రస్థితో వనమ్ ।
ఏతస్మిన్నేవ కాలే తు మూషికోఽప్యాజగామ హ ॥ 39
తమాగతమభిప్రేత్య శృగాలోఽప్యబ్రవీద్ వచః ।
పులి ఇలా అన్నది. అది ఆ రీతిగా అని ఉంటే, సకాలంలో నన్ను మేల్కొలిపినట్లే. నా బాహుబలాన్ని ప్రదర్శించి వాటినన్నింటినీ చంపి వాటి మాంసాన్నే తింటాను. ఆ విధంగా పలికి పులి అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలోనే ఎలుక అక్కడకు వచ్చింది. దానిని చూచి నక్క ఇలా అన్నది. (38,39)
జంబుక ఉవాచ
శృణు మూషిక భద్రం తే నకులో యది హాబ్రవీత్ ॥ 40
జంబుకమిలా పలికింది. మూషికమా! నీకు మేలగుగాక! నెమలి ఒక మాట అన్నది. దానిని చెపుతా విను. (40)
మృగమాంసం న ఖాదేయం గరమేతన్న రోచతే ।
మూషికం భక్షయిష్యామి తద్ భవాననుమన్యతామ్ ॥ 41
నేను జింకమాంసాన్ని తినను. ఇది విషప్రాయం. కాబట్టి తమరు అనుమతిస్తే నేను ఎలుకను తింటాను. (41)
తచ్ఛ్రుత్వా మూషికో వాక్యం సంత్రస్తః ప్రగతో బిలమ్ ।
తతః స్నాత్వా స వై తత్ర ఆజగామ వృకో నృప ॥ 42
ఆ మాట విని, భయపడి ఎలుక పారిపోయి కలుగులో దూరింది. ఆ తర్వాత తోడేలు స్నానం చేసి అక్కడకు వచ్చింది. (42)
తమాగతమిదం వాక్యమ్ అబ్రవీజ్జంబుకస్తదా ।
మృగరాజో హిసంక్రుద్ధః న తే సాధు భవిష్యతి ॥ 43
సకళత్రస్త్విహాయాతి కురుష్వ యదనంతరమ్ ।
ఏవం సంచోదితస్తేన జంబుకేన తదా వృకః ॥ 44
ఏతస్మిన్నేవ కాలే తు నకులోఽప్యాజగామ హ ॥ 45
దగ్గరకు వచ్చిన తోడేలుతో నక్క ఇలా అన్నది. మృగరాజుకు నీ మీద బాగా కోపంగా ఉంది. నీకేదో కీడు మూడుతోంది. అది భార్యతో సహా ఇక్కడకు రాబోతోంది. ఏం చేస్తే బావుంటుందో ఆలోచించి చేయి. నక్క ఆవిధంగా అనగానే పచ్చిమాంసం తినే ఆ తోడేలు ఎగిరి దూకి పారిపోయింది. ఆ సమయంలోనే నెమలి అక్కడకు వచ్చింది. (43-45)
తమువాచ మహారాజ నకులం జంబుకో వనే ।
స్వబాహుబలమాశ్రిత్య నిర్జితాస్తేఽన్యతో గతాః ॥ 46
మమ దత్త్వా నియుద్దం త్వం భుంక్ష్వ మాంసం యథేప్సితమ్ ।
మహారాజా అప్పుడు నక్క ఆ అడవిలో నెమలితో ఇలా అన్నది - నాబాహుబలానికి ఓడిపోయి మిగిలిన వారంతా ఎటో వెళ్లిపోయారు. నీవు నాతో యుద్ధం చేసి గెలిచి స్వేచ్ఛగా మాంసం తినవచ్చు. (46)
నకుల ఉవాచ
మృగరాజో వృకశ్చైవ బుద్ధిమానపి మూషికః ॥ 47
నిర్జితా యత్ త్వయా వీరాః తస్మాద్ వీరతరో భవాన్ ।
న త్వయాప్యుత్సహే యోద్ధుమ్ ఇత్యుక్త్వాసోఽప్యపాగమత్ ॥ 48
నెమలి ఇలా అన్నది - మృగరాజూ, తోడేలూ, తెలివి గల ఎలుక - ఈ వీరుల నందరినీ నీవు ఓడించావు కాబట్టి నీవు మహావీరుడవు. నీతో యుద్ధం చేసే ఉత్సాహం నాకు లేదు. ఆ మాట అని నెమలి కూడా వెళ్ళిపోయింది. (47,48)
కణిక ఉవాచ
ఏవం తేషు ప్రయాతేషు జంబుకో హృష్టమానసః ।
ఖాదతిస్మ తదా మాంసమ్ ఏకః సన్ మంత్రనిశ్చయాత్ ॥ 49
కణికుడిలా అన్నాడు. ఈ విధంగా అవన్నీ వెళ్ళిపోతే తన ఆలోచన ఫలించినందుకు ఆనందించి నక్క అప్పుడు ఒంటరిగా మాంసాన్ని భుజించింది. (49)
ఏవం సమాచరన్నిత్యం సుఖమేధేత భూపతిః ।
భయేన భేదయేద్ భీరుమ్ శూరమంజలికర్మణా ॥ 50
నిత్యం ఈ విధంగా ప్రవర్తిస్తూ రాజు సుఖంగా ఉంటూ వృద్ధిచెందవచ్చు. పిరికివారిని భయపెట్టాలి. వీరులకు మ్రొక్కి లొంగదీసికోవాలి. (50)
లుబ్ధమర్థప్రదానేన సమం న్యూనం తథౌజసా ।
ఏవం తే కథితం రాజన్ శృణు చాప్యపరం తథా ॥ 51
పేరాస గలవానిని డబ్బుతో వశపరచుకోవాలి. తక్కువ వారినీ, తనంతవారినీ పరాక్రమంతో లొంగదీయాలి. రాజా! ఇంత వివరంగా నీకు చెప్తున్నాను. మరొక మాట కూడా విను. (51)
పుత్రః సఖా వా భ్రాతా వా పితా వా యది వా గురుః ।
రిపుస్థానేషు వర్తంతః హంతవ్యా భూతిమిచ్ఛతా ॥ 52
రాజు ఐశ్వర్యాన్ని కోరుతుంటే కుమారుని అయినా, మిత్రునయినా, సోదరునైనా, తండ్రినయినా, గురువునయినా సరే శత్రుస్థానంలో నిలిస్తే సంహరించాలి. (52)
శపథేనాప్యరిం హన్యాత్ అర్థదానేన వా పునః ।
విషేణ మాయయా వాపి నోపేక్షేత కథంచన ।
ఉభౌ చేత్ సంశయోపేతౌ శ్రద్ధావాన్ తత్ర వర్ధతే ॥ 53
ధనమిచ్చి కానీ, విషం పెట్టి కానీ, మాయలు పన్ని కానీ, మాటలతో బెదిరించి కానీ శత్రువును చంపవలసినదే. ఏవిధంగానూ ఉపేక్షించతగదు. ఇద్దరు రాజుల మధ్య గెలుపు అటు ఇటుగా ఉన్నప్పుడు శ్రద్ధగలవాడే గెలుస్తాడు. (53)
గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ।
ఉత్పథప్రతిపన్నస్య న్యాయ్యం భవతి శాసనమ్ ॥ 54
అహంకరించి కర్తవ్యాకర్తవ్యాలను గ్రహించక దారితప్పి ప్రవర్తిస్తే గురువునైనా దండించవలసినదే. (54)
క్రుద్ధోఽప్యక్రుద్ధరూపః స్యాత్ స్మితపూర్వాభిభాషితా ।
న చాప్యన్యమపధ్వంసేత్ కదాచిత్ కోపసంయుతః ॥ 55
ప్రహరిష్యన్ ప్రియం బ్రూయాత్ ప్రహరన్నపి భారత ।
ప్రహృత్య చ కృపాయిత శోచేత చ రుదేత చ ॥ 56
కోపం ఉన్నా లేనట్టు కనిపించాలి. చిరునవ్వుతో పలుకరించాలి. కోపంతో ఎప్పుడూ ఎవ్వరినీ తిరస్కరిచకూడదు. ధృతరాష్ట్రా! శత్రువును దెబ్బతీయదలచినపుడు, దెబ్బతీస్తున్నప్పుడూ కూడా ప్రియంగానే మాటాడాలి. దెబ్బ తీసిన తరువాత కూడా దయచూపాలి. అతనికై దుఃఖించాలి, రోదించాలి కూడా. (55-56)
ఆశ్వాసయేచ్చాపి పర సాంత్వధర్మార్ధవృత్తిభిః ।
అథ్యాస్య ప్రహరేత్ కాలే యదా విచలితే పథి ॥ 57
శత్రువును అనునయించి, ధర్మాన్ని బోధించి, ధనాన్ని ఇచ్చి, మంచిగా వ్యవహరించి బాగా నిదానింపజేయాలి. సమయం వచ్చినపుడు ఆ శత్రువు దారి తప్పి ఉంటే సంహరించాలి. (57)
అపి ఘోరాపరాధస్య ధర్మమాశ్రిత్య తిష్ఠతః ।
స హి ప్రచ్ఛాద్యతే దోషః శైలో మేఘైరివాసితైః ॥ 58
ధర్మాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంటే తీవ్రమయిన అపరాధం చేసినా నీలిమేఘాలు పర్వతాన్ని కప్పివేసినట్టు ఆ దోషం మరుగున పడిపోయింది. (58)
యః స్యాదనుప్రాప్తవధః తస్యాగారం ప్రదీపయేత్ ।
అధనాన్ నాస్తికాంశ్చౌరాన్ విషయే స్వే న వాసయేత్ ॥ 59
ఎవరినైనా సత్వరమే చంపవలసి వస్తే అతని ఇంటిని తగులబెట్టాలి. దరిద్రులనూ, నాస్తికులనూ, దొంగలనూ తన రాజ్యంలో నిలువనీయరాదు. (59)
ప్రత్యుత్థానాస నాద్యేన సంప్రదానేన కేనచిత్ ।
ప్రతి విశ్రబ్దఘాతీ స్యాత్ తీక్ష్ణదంష్ట్రో నిమగ్నకః ॥ 60
శత్రువు దగ్గరకు వస్తే ఎదురేగటం, ఆసనభోజనాదులతో ఆదరించటం, ఏదైనా వస్తువును కానుకగా ఇవ్వటం అతనిలో నమ్మకాన్ని కలిగిస్తాయి. నమ్మకం కలిగిన తర్వాత అవసరమైతే చంపివేయాలి. పాము కరకైన కోరలతో కాటువేసినట్టు దెబ్బతీయాలి. (60)
అశంకితేభ్యః శంకేత శంకితేభ్యశ్చ సర్వశః ।
అశంక్యాద్ భయముత్పన్నమ్ అపి మూలం నికృంతతి ॥ 61
ఇబ్బంది లేదనుకొనే వారిని కూడా అనుమానిస్తూనే ఉండాలి. ఇబ్బంది పెడతా డనుకొనే వారి విషయంలో ఇంకా జాగరూకతతో ఉండాలి. అనుమానించదగిన వాడు భయానికి కారకుడయితే సర్వనాశనం చేయగలుగుతాడు. (61)
న విశ్వసేదవిశ్వస్తే విశ్వస్తే నాతివిశ్వసేత్ ।
విశ్వాసాద్ భయముత్పన్నం మూల్యాన్యపి నికృంతతి ॥ 62
నమ్మదగని వానిని నమ్మరాదు. నమ్మినవారిని కూడా పూర్తిగా నమ్మరాదు. నమ్మినవాడి ద్వారా కలిగే భయం సమూలంగా నాశనం చేస్తుంది. (62)
చారః సువిహితః కార్యః ఆత్మనశ్చ పరస్య వా ।
పాషండాంస్తాపసాదీంశ్చ పరరాష్ట్రేషు యోజయేత్ ॥ 63
తన రాజ్యంలో కానీ, శత్రురాజ్యంలో కానీ చక్కని గూఢచారులను ఏర్పాటు చేసికోవాలి. శత్రుక్షేత్రంలో వేదబాహ్యమైన ఆచారాలు గల సంన్యాసులనూ, తాపసులనూ గూఢచారులుగా నియమించుకోవాలి. (63)
ఉద్యానేషు విహారేషు దేవతాయతనేషు చ।
పానాగారేషు రథ్యాసు సర్వతీర్థేషు చాప్యథ ॥ 64
చత్వరేషు చ కూపేషు పర్వతేషు వనేషు చ ।
సమవాయేషు సర్వేషు సరిత్సు చ విచారయేత్ ॥ 65
ఉద్యానవనాలలో, విహారక్షేత్రాలలో, దేవాలయాలలో, పానగృహాలలో, సందుగొందులలో, సమస్తతీర్థాలలో, చౌరస్తాలలో, బావుల దగ్గరా, పర్వతాల మీదా అడవులలో, నలుగురూ కలిసే ప్రదేశాలలో, నదులలో గూఢచారులు సంచరిస్తూ ఉండాలి. (64,65)
వి: సం: తీర్థస్థానాలు 18 అవి -
మంత్రీ పురోహితశ్చైవ యువరాజశ్చమూపతిః । (4)
పంచమో ద్వారపాలశ్చ షష్ఠోంతర్వేశికస్తథా ॥ (2)
కారాగారాధికారీ చ ద్రవ్యసంచయుకృత్తథా । (2)
కృత్యాకృత్యేషు చార్థానాం నవమో వినియోజకః ॥ (1)
ప్రద్యేష్టా నగరాధ్యక్షః కార్యనిర్మాణకృత్తథా । (3)
ధర్మాధ్యక్షః సభాధ్యక్షః దండపాలస్త్రిపంచమః ॥ (3)
షోడశో దుర్గపాలశ్చ తథా రాష్ట్రాంతపాలకః । (2)
అటవీ పాలకాంతాని తీర్థాన్యష్టాదశైవ తు ॥ (1)
వాచా భృశం వినీతః స్యాత్ హృదయేన తథా క్షురః ।
స్మితపూర్వాభిభాషీ స్యాత్ సృష్టో రౌద్రాయ కర్మణే ॥ 66
రాజు బాగా వినయశీలుడై మాటాడాలి. మనస్సు మాత్రం కత్తిలా ఉండాలి. ఎంత భీకరకార్యాన్ని తలపెట్టినా చిరునవ్వు నవ్వుతూనే మాటాడుతూ ఉండాలి. (66)
అంజలిః శపథః సాంత్వం శిరసా పాదవందనమ్ ।
ఆశాకరణమిత్యేవం కర్తవ్యం భూతిమిచ్ఛతా ॥ 67
అవసరమయితే చేతులు జోడించాలి. శపథాలు చేయాలి. అనునయించాలి. తలవాల్చి కాళ్ళకు మ్రొక్కాలి. ఆశ చూపాలి. ఐశ్వర్యాన్నీ పొందగోరిన రాజుకు ఇవన్నీ కర్తవ్యాలే. (67)
సుపుష్పితః స్యాదఫలః ఫలవాన్ స్యాద్ దురారుహః ।
ఆమః స్యాత్ పక్స్వసంకాశః న చ జీర్యేత కర్హిచిత్ ॥ 68
పుష్పించినా ఫలించదు. ఫలించినా అవి అందవు. పచ్చివయినా పండులా కనిపిస్తాయి. అటువంటి వృక్షంలాగానే రాజు ప్రవర్తించాలి. ఎట్టి పరిస్థితిలోనూ తాను మాత్రం శిథిలం కాకూడదు. (68)
త్రివర్గే త్రివిధా పీడా హ్యనుబంధస్తథ్వైవ చ ।
అనుబంధాః శుభాః జ్ఞేయాః పీడాస్తు పరివర్జయేత్ ॥ 69
ధర్మార్థకామరూపమైన పురుషార్థాలను సేవించటంలో మూడు బాధలూ ఉంటాయి. మూడు ఫలితాలూ ఉంటాయి. ఫలితాలు శుభకరాలే. కానీ బాధలను వదిలించుకొనగలగాలి. (69)
ధర్మం విచరతః పీడా సాపి ద్వాభ్యాం నియచ్ఛతి ।
అర్థం చాప్యర్థలుబ్ధస్య కామం చాతిప్రవర్తినః ॥ 70
ధర్మాన్ని పాటిస్తున్నవానికి అర్థకామాల ద్వారా బాధ కలుగుతుంది. అర్థాసక్తుడైన వానికి ధర్మకామాల ద్వారా పీడ ఏర్పడుతుంది. భోగాసక్తి అధికమైన వానికి ధర్మార్థాల ద్వారా ఇబ్బంది వస్తుంది. (70)
అగర్వితాత్మా యిక్తశ్చ సాంత్వయుక్తోఽనసూయితా ।
అవేక్షితార్థః శుద్ధాత్మా మంత్రయీత ద్విజైః సహ ॥ 71
రాజు అహంకారాన్ని పరిత్యజించి, సావధానుడై, అనునయపూర్వకంగా మాటాడుతూ, అసూయను వీడి, సర్వవిషయాలనూ పరిశీలిస్తూ, శుద్ధచిత్తుడై బ్రాహ్మణులతో కలిసి ఆలోచించాలి. (71)
కర్మణా యేన కేనైవ మృదునా దారుణేన చ ।
ఉద్ధరేద్ దీనమాత్మానం సమర్థో ధర్మమాచరేత్ ॥ 72
కష్టం వస్తే తనను తాను ఉద్ధరించుకోవాలి. దానికై మృదుకర్మకయినా, దారుణకర్మకయినా సిద్ధపడాలి. సామర్థ్యముంటే మాత్రం ధర్మ మార్గాన్నే అవలంబించాలి. (72)
న సంశయమనారుహ్య నరో భద్రాణి పశ్యతి ।
సంశయం పునరారుహ్య యది జీవతి పశ్యతి ॥ 73
కష్టపడనివాడు సుఖాలను పొందలేడు. ప్రాణసంకటంలో పడినప్పుడు బ్రతికి బయటపడితే సుఖభోగాలను చవిచూడగలుగుతాడు. (73)
యస్య బుద్ధిః పరిభవేత్ తమతీతేన సాంత్వయేత్ ।
అనాగతేన దుర్బుద్ధిం ప్రత్యుత్పన్నేన పండితమ్ ॥ 74
మనస్సు కలతపడినవారిని గతాన్ని గుర్తుచేస్తూ ఓదార్చాలి. దుర్బుద్ధిని భవిష్యత్తు మీద ఆశ చూపి శాంతింపజేయాలి. పండితుని సమయోచిత కృత్యాలలో ఆదరించాలి. (74)
యోఽరిణా సహసంధాయ కృతకృత్యవత్
స వృక్షాగ్రే యథా సుప్తః పతితః ప్రతిబుధ్యతే ॥ 75
శత్రువుతో సంధిచేసికొని పని ముగిసిపోటినట్టుగా పడుకొన్నవాడు చెట్టుకొమ్మపై నిదురిస్తున్న వాడితో సమానం. పడితే కానీ మెలకువ కలుగదు. (75)
మంత్రసంవరణే యత్నః సదా కార్యోఽనసూయతా ।
ఆకారమభిరక్షేత చారేణాప్యనుపాలితః ॥ 76
రాజు ఇతరులలోని దోషాలను ఎత్తిచూపకూడదు. తన మంత్రాంగాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచుకోవాలి. శత్రుగూఢచారులకు తన ఆనుపానులు తెలియనీయరాదు. తన గూఢచారులతో కూడా తాను బయటపడకుండానే వ్యవహరించాలి. (76)
నాచ్ఛిత్త్వా పరమర్మాణి నాకృత్వా కర్మ దారుణమ్ ।
నాహత్వా మత్స్యఘాతీవ ప్రాప్నోతి మహతీం శ్రియమ్ ॥ 77
రాజు మత్స్యకారుని వంటివాడు. శత్రువుల మర్మాలను విచ్ఛిన్నం చేయకుండా, దారుణకర్మలు చేయకుండా మహైశ్వర్యాన్ని పొందాలటే వీలుకాదు. (77)
కర్శితం వ్యాధిత క్లిన్నమ్ అపానీయమఘాసకమ్ ।
పరివిశ్వస్తమందం చ ప్రహర్తవ్యారేర్బలమ్ ॥ 78
శత్రుబలం దుర్బలమో, రోగ్రగ్రస్తమో అయి కలతపడి, తిండీ, నీరూ దొరకని స్థితిలో ఉండి, అంతా బాగానే ఉందని నమ్మి నిశ్చేష్టంగా ఉన్నప్పుడు దానిపై దాడి చేయాలి. (78)
వార్థికోఽర్థినమభ్యేతి కృతార్థే నాస్తి సంగతమ్ ।
తస్మాత్ సర్వాణి సాధ్యాని సావశేషాణి కారయేత్ ॥ 79
ధనవంతుడు మరొక ధనవంతుని దగ్గరకు పోడు. పనిలో కృతార్థుడైన వాడు పరుల మైత్రిని కోరడు. కాబట్టి ఏ పని నయినా సరే సగం మాత్రమే చేయాలి. (79)
సంగ్రహే విగ్రహే చైవ యత్నః కార్యోఽనసూయతా ।
ఉత్సాహశ్చాపి యత్నేన కర్తవ్యో భూతిమిచ్ఛతా ॥ 80
సంపదలు కోరే రాజు అసూయకు లోను కాకుండానే సంధికైనా, యుద్ధానికైనా ప్రయత్నించాలి. తనను తానెప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకే ప్రయత్నించాలి. (80)
నాస్య కృత్యాని బుధ్యేరన్ మిత్రాణి రిపవస్తథా ।
ఆరబ్ధాన్యేవ పశ్యేరన్ సుపర్యవసితాన్యపి ॥ 81
మిత్రులయినా, శత్రువులయినా రాజు ఎప్పుడేమిచేస్తాడో తెలియగూడదు. ప్రారంభించిన పని లేదా సమాప్తమయిన పని మాత్రమే వారికి కనిపించాలి. (81)
భీతవత్ సంవిధాతవ్యం యావద్ భయమనాగతమ్ ।
ఆగతం తు భయం దృష్ట్వా ప్రహర్తవ్యాభీతవత్ ॥ 82
తన మీదకు ఏదీ రానంతవరకూ ఏమి వస్తుదో అని భయపడుతూ ఏర్పాట్లు చేసికోవాలి. భయకారణం దగ్గర పడ్డప్పుడు మాత్రం నిర్భయంగా దానినెదిరిచి శత్రువును దెబ్బతీయాలి. (82)
దండేనోపనతం శత్రుమ్ అనుగృహ్ణాతి యో నరః ।
స మృత్యుముపగృహ్ణీయాత్ గర్భాశ్వతరీ యథా ॥ 83
దండనీతితో లోబరుచుకొన్న శత్రువులై దయ చూపటమంటే రాజు మృత్యువును ఒడిగట్టుకొన్నట్టే. అది కంచరగాడిద గర్భాన్ని ధరించటం వంటిది. (83)
అనాగతం హి బుధ్యేత యచ్ఛ కార్యం పురఃస్థితమ్ ।
న తు బుద్ధిక్షయాత్ కించిత్ అతిక్రామేత్ ప్రయోజనమ్ ॥ 84
భవిష్యత్తులో చేయవలసిన పనిని గూర్చి ముందుగానే, ఆలోచించి తదనుకూలంగా ఏర్పాట్లు చేసికోవాలి. సమీపించిన పని విషయంలో కూడా ఆరీతిగానే ప్రవర్తించాలి. బాగా ఆలోచించకుండా ఏ పనినీ పరిత్యజించదగదు. (84)
ఉత్సాహశ్చాపి యత్నేన కర్తవ్యో భూతిమిచ్ఛతా ।
విభజ్య దేశకాలౌ చ దైవం ధర్మాదయస్త్రయః ।
నైశ్రేయసౌ తౌ జ్ఞేయౌ దేశకాలావితి స్థితిః ॥ 85
ఐశ్వర్యాభిలాష గల రాజు దేశకాలాల ననుసరించియే ప్రయత్నపూర్వకంగా కర్తవ్యోన్ముఖుడు కావాలి. దేశకాలాలకను గుణంగానే దైవ, ధర్మ, అర్థ, కామాలను సేవించాలి. నీతిశాస్త్రానుసారంగా దేశకాలాలే శ్రేయస్సాధనలో ప్రధాన హేతువులు. (85)
తాలవత్ కురుతే మూలం బాలః శత్రురుపేక్షితః ।
గహ్సఽగ్నిరివోత్సృష్టః క్షిప్రం సంజాయతే మహాన్ ॥ 86
శత్రువు చిన్నవాడు కదా అని ఉపేక్షిస్తే వాడే తాటిచెట్టులా ఎదిగి అడవిలో పుట్టిన అగ్నిలాగా అచిరకాలంలోనే మహావినాశనాన్ని కల్గించగలడు. (86)
అగ్నిం స్తోకమివాత్మానం సంధుక్షయతి యో నరః ।
స వర్ధమానో గ్రసతే మహాంతమపి సంచయమ్ ॥ 87
నిఇప్పురవ్వను మెల్లగా రాజుకొననిచ్చినట్లు తనను కూడా క్రమంగా వృద్ధిపరచుకొనిన రాజు ఎదిగి అదనులో శత్రువు లనే ఎంత ఇంధనాన్ని అయినా మ్రింగివేయగలుగును. (87)
ఆశాం కాలవతీం కుర్యాత్ కాలం విఘ్నేన యోజయేత్ ।
విఘ్నం నిమిత్తతో బ్రూయాత్ నిమిత్తం వాపి హేతుతః ॥ 88
పెట్టిన ఆశను కాలాధీనం చేయాలి. కానీ వెంటనే తీర్చకూడదు. తీర్చవలసిన సమయం వచ్చినపుడు ఏదో ఒక ఆటంకాన్ని కల్పించి వ్యవధిపెంచాలి. తగిన కారణాన్ని చూపి ఆటంకాలు కల్పించాలి. ఆ కారణం యిక్తి యుక్తం కావాలి. (88)
క్షురో భూత్వా హరేత్ ప్రాణాన్ నిశితః కాలసాధనః ।
ప్రతిచ్ఛన్నో లోమహారీ ద్విషతాం పరికర్తనః ॥ 89
లోహంతో చేసిన చురకత్తిని పదునుపెట్టి చర్మంతో చుట్టిపెడితే అవసరపడినపుడు అది వెంట్రుకలు ఖండించగలుగుతుంది. అదేవిధంగా రాజు సర్వసన్నద్ధుడై ఉండి తగినవేళలో శత్రువులను సమూలంగా నరికివేయాలి. (89)
పాండవేషు యథా న్యాయమ్ అన్యేషు చ కురూద్వహ ।
వర్తమానో న మజ్జేస్త్వం తథా కృత్యం సమాచర ॥ 90
సర్వకళ్యాణ సంపన్నః విశిష్ట ఇతి నిశ్చయః ।
తస్మాత్ త్వం పాండుపుత్రేభ్యః రక్షాత్మానం నరాధిప ॥ 91
కురుశ్రేష్ఠా! పాండవుల విషయంలో అయినా ఇతరుల విషయంలో అయినా ఈ రాజనీతి ననుసరించియే ప్రవర్తించాలి. నీవు మునిగిపోకుండా ఉండేటట్లు వ్యవహరించాలి. నీవు సర్వకళ్యాణ సాధన సంపన్నుడవని అందరూ భావిస్తున్నారు. కాబట్టి మహారాజా! నిన్ను నీవు పాండుకుమారుల నుడి రక్షించుకోవాలి. (90,91)
భ్రాతృవ్యా బలినో యస్మాత్ పాండుపుత్రా నరాధిప ।
పశ్చాత్తాపో యథా న స్యాత్ తథా నీతిర్విధీయతామ్ ॥ 92
మహారాజా! నీతమ్ముని కొడుకులు పాండువులు మిక్కిలి బలవంతులు. కాబట్టి నీవు పశ్చాత్తాపపడవలసిన అవసరం కలుగకుండేటట్లు నీతిమార్గాన్ని అనుసరించు. (92)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా సంప్రతస్థే కణికః స్వగృహం తతః ।
ధృతరాష్ట్రోఽపి కౌరవ్యః శోకార్తః సమపద్యత ॥ 93
వైశంపాయనుడిలా అన్నాడు. ఈ విధంగా పలికి కణికుడు తననివాసానికి వెళ్ళిపోయాడు. కురువశస్థుడు ధృతరాష్ట్రుడు శోకంతో కలతపడ్డాడు. (93)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి కణికవాక్యే ఏకోన చత్వారింశదధిక శతతమోఽధ్యాయః ॥ 139 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సభవపర్వమను ఉపపర్వమున కణికవాక్యమను నూట ముప్పదితొమ్మిదవ అధ్యాయము. (139)