156. నూట యేబదియారవ అధ్యాయము

(బకవధ పర్వము)

బ్రాహ్మణ కుటుంబమునకు విపత్తు.
జనమేజయ ఉవాచ
ఏకచక్రాం గతాస్తే తు కుంతీపుత్రా మహారథాః ।
అత ఊర్ధ్వం ద్విజశ్రేష్ఠ కిమకుర్వత పాండవాః । 1
జనమేజయుడన్నాడు. ద్విజశ్రేష్ఠా! మహారథులు కుంతీపుత్రులు పాండవులు ఏకచక్రాపురాన్ని ప్రవేశించి, ఏంచేశారు? (1)
వైశంపాయన ఉవాచ
ఏకచక్రాం గతాస్తే తు కుంతీపుత్రా మహారథాః ।
ఊషుర్నాతిచిరం కాలం బ్రాహ్మణస్య నివేశనే ॥ 2
వైశంపాయనుడు ఇలా అన్నాడు - మహారథులు కుంతీ పుత్రులు ఏకచక్రాపురంలో ప్రవేశించి, ఆ బ్రాహ్మణుని ఇంటిలో ఎంతోకాలం నివసించలేదు. (2)
రమణీయాని పశ్యంతః వనాని వివిధాని చ ।
పార్థివానపి చోద్దేశాన్ సరితశ్చ సరాంసి చ ॥ 3
చేరుర్భైక్షం తదా తే తు సర్వ ఏవ విశాంపతే ।
బభువ ర్నాగరాణాం చ స్వైర్గుణైః ప్రియదర్శనాః ॥ 4
వైశంపాయనా! అప్పుడు పాండవులందరూ భిక్షమెత్తుకొని జీవించారు. నగరంలో ఉండే జనులందరూ వారిని చూడాలని తహతహలాడే వారు. వారు ఆ సమయంలో అవకాశాన్ని బట్టి అందమైన ప్రదేశాలను, పలు అరణ్యాలను, రాజసంబంధమైన ప్రదేశాలను, నదులను, సరస్సులను, చూస్తుండేవారు. (3,4)
(దర్శనీయా ద్విజాః శుద్ధాః దేవగర్భోపమాః శుభాః ।
భైక్షానర్హాశ్చ రాజ్యార్హాః సుకుమారాస్తపస్వినః ॥
సర్వలక్షణసంపన్నాః భైక్షం నార్హంతి నిత్యశః ।
కార్యార్థినశ్చరంతీతి తర్కయంత ఇతి బ్రువన్ ॥
బంధూనామాగమాన్నిత్యమ్ ఉపచింత్య తు నాగరాః ।
భాజనాని చ పూర్ణాని భక్ష్యభోజ్యైరకారయన్ ॥
మౌనవ్రతేన సంయుక్తాః భైక్షం గృహ్ణంతి పాండవాః ।
మాతా చిరగతాన్ దృష్ట్వా శోచంతీతి చ పాండవాః ।
త్వరమాణా నివర్తంతే మాతృగౌరవయంత్రితాః ॥)
ఆ నగరంలోని జనులు పాండవులను గూర్చి ఇలా అనుకొనేవారు. వీరు చూడముచ్ఛటైనవారు, బ్రాహ్మణులు, పరిశుద్ధులు, దేవతల్లా ఉన్నారు. శుభులు, బిచ్చమెత్తుకోవలసిన వారు కారు. రాజ్యాన్ని పాలించదగ్గవారు. సుకుమారులు తపశ్శీలురు. అన్ని మంచి లక్షణాలు ఉన్నవారు. నిత్యం బిచ్చమెత్తుకోవటం వీరికి తగనిపని. బహుశా వీరు ఏదో పని మీద ఈ విధంగా సంచరిస్తున్నారేమో! ఇలా ఆలోచిస్తూ ఆ నగరజనులు నిత్యం బందువులు వస్తున్నారనే భావనతో రకరకాల భక్ష్యాలతో, భోజ్యపదార్థాలతో పాత్రలన్నీ నిండుగా ఉంచేవారు. పాండవులు మౌనవ్రతాన్ని స్వీకరించి భిక్షాటన చేసేవారు. తల్లిమీదుండే ప్రేమతో పాండవులు, ఆలస్యం చేస్తే అమ్మ బాధపడుతుందనుకొంటూ, వేగంగా ఇంటికి తిరిగివస్తుండేవారు.
నివేదయంతి స్మ తదా కుంత్యా భైక్షం సదా నిశి ।
తయా విభక్తాన్ భాగాంస్తే భుంజతే స్మ పృథక్ పృథక్ ॥ 5
నిత్యం రాత్రివేళలో తాము తమసంపాదించిన భిక్షలో వచ్చిన పదార్థాలను కుంతికి సమర్పించేవారు. ఆవిడ పంచి యిచ్చినట్లు పాండవులు ఎవరి భాగాలను వారు విడివిడిగా భుజించేవారు. (5)
అర్ధం తే భుంజతే వీరః సహమాత్రా పరంతపాః ।
అర్ధం సర్వస్య భైక్షస్య భీమో భుంక్తే మహాబలః ॥ 6
ఆ వీరులందరూ తల్లితో కలిసి ఒక సగభాగాన్ని మాత్రం తినేవారు. మిగిలిన సగభాగాన్ని మహాబలుడు భీమసేనుడు భుజించేవాడు. (6)
తథా తు తేషాం వసతాం తస్మిన్ రాష్ట్రే మహాత్మనామ్ ।
అతిచక్రామ సుమహాన్ కాలోఽథ భరతర్షభ ॥ 7
భరతర్షభ! ఆ విధంగా కాలక్షేపం చేస్తున్న మహాత్ములు పాండవులకు ఆదేశంలోనే చాలాకాలం గడిచిపొయింది. (7)
తతః కదాచిత్ భైక్షాయ గతాస్తే పురుషర్షభాః ।
సంగత్యా భీమసేనస్తు తత్రాస్తే పృథయా సహ ॥ 8
తరువాత ఒకరోజున పురుషశ్రేష్ఠులైన పాండవులు భిక్షకు బయలుదేరి వెళ్ళారు. భీమసేనుడు మాత్రం ఏవో మాట్లాడుతూ కుంతితోపాటు ఇంటిలోనే ఉండిపోయాడు. (8)
అథార్తిజం మహాశబ్ధం బ్రాహ్మణస్య నివేశనే ।
భృశముత్పతితం ఘోరం కుంతీ శుశ్రాన భారత ॥ 9
జనమేజయా! ఒకనాడు బ్రాహ్మణుని నివాసంలోంచి ఆర్తస్వరం వినపడింది. భయంకరమైన ఆరోదన ధ్వనిని కుంతి విన్నది. (9)
రోరూయమానాంస్తాన్ దృష్ట్వా పరిదేవయతశ్చ సా ।
కారుణ్యాత్ సాధుభావాచ్చ కుంతీ రాజన్ న చక్షమే ॥ 10
రాజా! రోషిస్తూ పరిపరివిధాల పరితపిస్తున్న ఆ బ్రాహ్మణ గృహంలోని వారిని చూసి, దయతో మంచితనంతో కుంతి జాలిపడింది. (10)
మథ్యమానేన దుఃఖేన హృదయేన పృథా తదా ।
ఉవాచ భీమం కల్యాణీ కృపాన్వితమిదం వచః ॥ 11
వసామ సుసుఖం పుత్ర! బ్రాహ్మణస్య నివేశనే ।
అజ్ఞాతా ధార్తరాష్ట్రస్య సత్కృతా వీతమన్యవః ॥ 12
అప్పుడు మంచి మనసున్న కుంతి జాలితో భీమసేనునితో, ఇలా అంది. కుమారా! ఈ బ్రాహ్మణుని ఇంటిలో మనమంతా, ధృతరాష్ట్రకుమారులకు తెలియకుండా, కోపతాపాలకు దూరంగా, గౌరవంగా సుఖంగా జీవిస్తున్నాము. (11,12)
సా చింతయే సదా పుత్ర బ్రాహ్మణస్యాస్య కింన్వహమ్ ।
ప్రియం కుర్యామితి గృహే యత్ కుర్యురుషితాః సుఖమ్ ॥ 13
ఇలాంటి భావన వల్ల కుమారా! నేను ఎప్పుడూ ఈ బ్రాహ్మణునికి ఏమి ప్రత్యుపకారం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే వారివల్ల మనం సుఖంగా జీవిస్తున్నాము కదా! (13)
ఏతావాన్ పురుషస్తాత కృతం యస్మిన్ న నశ్యతి ।
యావచ్చ కుర్యాదన్యోఽస్య కుర్యాదభ్యధికం తతః ॥ 14
నాయనా! ఎవరికి చేసిన ఉపకారం నిరుపయోగం కాదో వాడే నిజమైన పురుషుడు. ఉపకారం చేసినవానికి అంతకంటె ఎక్కువ మేలు చేయటం మానవత్వం అవుతుంది. (14)
వి: తె: దీనికి నన్నయ్య విశ్లేషణాత్మకమైన తెనిగింపు ఇది
కృతమెఱుఁగుట పుణ్యము స
న్మతి దానికి సమముసేఁత మధ్యము మఱి త
త్కృమున కగ్గలముగ స
త్కఋతిసేయుటయుత్తమంబు కృతబుద్ధులకున్. (1-6-244)
తదిదం బ్రాహ్మణస్యాస్య దుఃఖమాపతితం ధ్రువమ్ ।
తత్రాస్య యది సాహాయ్యం కుర్యాముపకృతం భవేత్ ॥ 15
ప్రస్తుతం ఈ బ్రాహ్మణునికి గొప్ప దుఃఖం వచ్చింది. ఇది నిజం. మనం ఈ విషయంలో ఏమైనా ఉపకారం చేయగల్గితే చాలా బాగుంటుంది. (15)
భీమసేన ఉవాచ
జ్ఞాయతామస్య యద్ దుఃఖం యతశ్చైవ సముతిథితమ్ ।
విదిత్వా వ్యవసిష్యామి యద్యపి స్యాత్ సుదుష్కరమ్ ॥ 16
భీమసేనుడన్నాడు. అమ్మా! వారికి ఏమి దుఃఖం వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకో. అది ఎంతటి కష్టసాధ్యమైన పని అయినా దాన్ని చేయటానికి ప్రయత్నిస్తాను. (16)
వైశంపాయన ఉవాచ
ఏవం తౌ కథయంతౌ చ భూయః శుశ్రువతుఃస్వనమ్ ।
ఆర్తిజం తస్య విప్రస్య సభార్యస్య విశాంపతే ॥ 17
వైశంపాయనుడన్నాడు. జనమేజయా! ఇలా వీరిద్దరూ మాట్లాడుకొంటుండగానే, మరొకసారి బ్రాహ్మణుని గృహం నుండి రోదనధ్వని విన్పించింది. బ్రాహ్మణుని భార్య స్వరం కూడా విన్పించింది. (17)
అంతఃపురం తతస్తస్య బ్రాహ్మణస్య మహాత్మనః ।
వివేశ త్వరితా కుంతీ బద్ధవత్సేవ సౌరభీ ॥ 18
వెంటనే కుంతి, దూడను బంధిస్తే ఆవు కంగారు పడినట్లుగా కంగారుపడుతూ, మహాత్ముడైన బ్రాహ్మణుని ఇంటిలోనికి ప్రవేశించింది. (18)
తతస్తం బ్రాహ్మణం తత్ర భార్యయా చ సుతేన చ ।
దుహిత్రా చైవ సహితం దదర్శావనతాననమ్ ॥ 19
ఆమె అక్కడ భార్య, కొడుకు, కుమార్తెలతో కూడి, తలవంచుకొని దుఃఖిస్తున్న బ్రాహ్మణుని చూసింది. (19)
బ్రాహ్మణ ఉవాచ
ధిగిదం జీవితం లోకే గతసార మనర్థకమ్ ।
దుఃఖమూలం పరాధీనం భృశమప్రియభాగి చ ॥ 20
బ్రాహ్మణుడన్నాడు. ఈ లోకంలో జీవితం ఎంత నీచమైనది! ఇంత సారరహితమూ, నిష్ప్రయోజనమూ అయినది మరొకటి లేదు. జీవితం దుఃఖానికి కారణం, పరాధీనమైనది ఈ జీవితంలో అన్నీ అప్రియాలే ఉంటాయి. (20)
జీవితే పరమం దుఃఖం జీవితే పరమో జ్వరః ।
జీవితే వర్తమానస్య దుఃఖానామాగమో ధ్రువః ॥ 21
బ్రతికితే ఎంతో దుఃఖం అనుభవించాలి. జీవిస్తే మనస్సు, శరీరం తపిస్తాయి. జీవించి ఉన్నవానికి దుఃఖాలు రాక తప్పదు. (21)
ఆత్మాహ్యేకో హి ధర్మార్థౌ కామం చైవ నిషేవతే ।
ఏతైశ్చ విప్రయోగోఽపి దుఃఖం పరమనంతకమ్ ॥ 22
జీవుడొక్కడే ధర్మార్థకామాలను సేవిస్తాడు. అయితే వీటితో వియోగం అంతులేని దుఃఖాన్ని కల్గిస్తుంది. (22)
ఆహుః కేచిత్ పరం మోక్షం స చ నాస్తి కథంచన ।
అర్థప్రాప్తౌ తు నరకః కృత్స్న ఏవోపపద్యతే ॥ 23
కొంతమంది మోక్షం చాలా గొప్పదంటారు. నిజానికి అలాంటిది లేనేలేదు. అర్థాన్ని సాధించాలంటే పరిపూర్ణమైన నరకాన్ని అనుభవించకతప్పదు. (23)
అర్థేప్సుతా పరం దుఃఖం అర్థప్రాప్తౌ తతోఽధికమ్ ।
జాతస్నేహస్య చార్థేషు విప్రయోగే మహత్తరమ్ ॥ 24
డబ్బుకోరుకోవడమే గొప్పదుఃఖం, డబ్బు దొరికితే అంతకన్నా దుఃఖం. డబ్బు పట్ల ప్రేమ కలిగాక దానితో వియోగం వస్తే అంతకంటె దుఃఖం మరొకటి ఉండదు. (24)
న హి యోగం ప్రపశ్యామి యేన ముచ్యేయమాపదః ।
పుత్రదారేణ వా సార్ధం ప్రాద్రవేయమనామయమ్ ॥ 25
ఈ ఆపదల్లోంచి బయటపడే ఉపాయం ఏదీ కన్పించటం లేదు. అలాంటిదే ఉంటే భార్యాపుత్రులతో బాధారహితమైన ఆ ప్రదేశానికి పారిపోయి ఉండేవాడిని. (25)
యతితం వై మయా పూర్వం వేత్థ బ్రాహ్మణి తత్తథా ।
క్షేమం యతస్తతో గంతుం త్వయా మమ న శ్రుతమ్ ॥ 26
బ్రాహ్మణీ! లోగడ నేనీవిషయంలో గట్టిగా ప్రయత్నించాను. మనకు క్షేమం లభించే చోటికి వెళ్ళిపోదామని నీకు చెప్పాను. కానీ నీవు నామాట వినలేదు. (26)
ఇహ జాతా వివృద్ధాస్మి పితా చాపి మమేతి వై ।
ఉక్తవత్యసి దుర్మేధే యాచ్యమానా మయాసకృత్ ॥ 27
తెలివి తక్కువదానా! నేను పదేపదే కోరినా నీవు అంగీకరించలేదు. నాతండ్రి ఇక్కడే పెరిగాడు. నేనూ ఇక్కడే పెరిగి పెద్దదాన్నయాను - అన్నావు. (27)
స్వర్గతోఽపి పితా వృద్ధః తథా మాతా చిరం తవ ।
బాంధవా భూతపూర్వాశ్చ తత్ర వాసే తు కా రతిః ॥ 28
నీ తండ్రి వృద్ధుడై స్వర్గానికి వెళ్ళిపొయాడు. అలాగే తల్లి కూడా ఏనాడో చనిపోయింది. బంధువులందరూ కూడా ఇప్పుడు లేరు. అలాంటి ప్రదేశంలో ఉండాలనే కోరిక నీకు ఎలా కల్గింది. (28)
సోఽయం తే బంధుకామాయాః అశృణ్వత్యా వచో మమ ।
బంధుప్రణాశః సంప్రాప్తః భృశం దుఃఖకరో మమ ॥ 29
బంధువులంటే పడిచచ్చే నీకు, నా మాటను లక్ష్యపెట్టని నీకు నిజమైన బంధువినాశం ఇప్పుడు వచ్చింది. ఇది నాకెంతో బాధాకరమైన విషయం. (29)
అథవా మద్వినాశోఽయం న హి శక్ష్యామొ కంచన ।
పరిత్యక్తుమహం బంధుం స్వయం జీవన్ నృశంసవత్ ॥ 30
అయినా ఇది బంధువినాశం కాదు. నాకే వినాశం. ఎందుకంటే పరమక్రూరునిలాగా నేను జీవించి ఉండి, ఆత్మీయులను విడిచిపెట్టలేను. (30)
సహధర్మచరీం దాంతాం నిత్యం మాతృసమాం మమ ।
సఖాయం విహితాం దేవైః నిత్యం పరమికాం గతిమ్ ॥ 31
నీవు నా సహధర్మచారిణివి. ఎంతో సహనం కలదానివి. నాకు తల్లితో సమానంగా బాగోగుల చూస్తున్నదానివి. దేవతలు నిన్ను నాకు స్నేహితురాలిగా పంపారు. నిత్యమూ సుఖ దుఃఖాల్లో నీవే నాకు దిక్కు. (31)
పిత్రా మాత్రా చ విహితాం సదా గార్హస్థ్యభాగినీమ్ ।
వరయిత్వా యథాన్యాయం మంత్రవత్ పరిణీయ చ ॥ 32
నీకు ఇప్పుడు తల్లి తండ్రులు లేరు. నిత్యం గృహకృత్యాల్లో ములిగితేలుతూ ఉంటావు. నిన్ను న్యాయంగా నేను వరించాను. మంత్రపూర్వకంగా వివాహం చేసుకొన్నాను. నిన్నెలా విడిచిపెట్టను? (32)
కులీనాం శీలసంపన్నామ్ అపత్యజననీమపి ।
త్వామహం జీవితస్యార్థే సాధ్వీమనపకారిణీమ్ ॥ 33
పరిత్యక్తుం న శక్ష్యామి భార్యాం నిత్యమనువ్రతామ్ ।
కుత ఏవ పరిత్యక్తుం సుతం శక్ష్యామ్యహం స్వయమ్ ॥ 34
బాలమప్రాప్తవయసమ్ అజాతవ్యంజనాకృతిమ్ ।
భర్తురర్థాయ నిక్షిప్తాం న్యాసం ధాత్రా మహాత్మనా ॥ 35
యయా దౌహిత్రజాన్ లోకాన్ ఆశంసే పితృభిః సహ ।
స్వయముత్పాద్య తాం బాలాం కథముత్స్రష్టుముత్సహే ॥ 36
నీవు గొప్పవంశంలో పుట్టావు. మంచి శీలమున్నదానివి. నాకు బిడ్డల్ని ప్రసాదించావు. పతివ్రతవు. నాకు ఎన్నడూ అపకారం చేసి ఎరుగవు. నీవు నాభార్యవు. నాకోసమే జీవిస్తున్నావు. అలాంటి నిన్ను నేను నా జీవితం కోసం విడిచిపెట్టలేను. అలాంటిది నేను కుమారుని మాత్రం ఎలా విడిచిపెట్టగలను? నా కొడుకు బాలుడు. ఇంకా యౌవనం రాలేదు. రూపురేఖలింకా స్పష్టంకానివాడు. వాడిని స్వయంగా ఎలా విడిచిపెట్టను? అలాగే ఈ కుమార్తెనూ విడిచిపెట్టలేను. మహాత్ముడు బ్రహ్మ ఒక అయ్య చేతిలో పెట్టడానికి, న్యాసంగా ఆమెను నాకిచ్చాడు. నేను, నా పితృదేవతలు ఈమె సంతతివల్ల గొప్పలోకాలను పొందాలని ఆకాంక్షిస్తున్నాను. అలాంటి బాలికని, స్వయంగా కన్నదానిని ఎలా విడిచిపెట్టగలను? (33-36)
మన్యంతే కేచిదధికం స్నేహం స్నేహం పుత్రే పితుర్నరాః ।
కన్యాయాం కేచిదపరే మమ తుల్యావుభౌ స్మృతౌ ॥ 37
కొంతమంది అంటుంటారు. తండ్రికి కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని, మరికొంతమంది కూతురి మీద తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. నాకు మాత్రం ఇద్దరి మీద సమానమైన ప్రేమ ఉంది. (37)
యస్యాం లోకాః ప్రసూతిశ్చ స్థితా నిత్యమథో సుఖమ్ ।
అపాపాం తామహం బాలాం కథముత్స్రష్టుముత్సహే ॥ 38
ఏ కుమార్తె లోకస్థితికి, సంతానానికి, సుఖసంతోషాలకు కారణమైనదో అటువంటి కుమార్తెను, ఏ పాపమెరుగనిదానిని, బాలికను నేను ఏవిధంగా విడిచిపెట్టగలను? (38)
ఆత్మానమపి చోత్సృజ్య తప్స్యామి పరలోకగః ।
త్యక్తాహ్యేతే మయా వ్యక్తం నేహ శక్ష్యంతి జీవితుమ్ ॥ 39
నన్ను నేను విడిచిపెట్టుకొని పరలోకానికి వెళ్ళిపోతాను. నాబాధేదో నేనే పడతాను. కానీ నావియోగాన్ని పొందిన వీరు, ఈ లోకంలో జీవించలేరుకదా! (39)
ఏషాం చాన్యతమత్యాగః నృశంసో గర్హితో బుధైః ।
ఆత్మత్యాగే కృతే చేమే మరిష్యంతి మయా వినా ॥ 40
వీళ్ళలో ఏ ఒక్కరినో విడిచిపెట్టడమనేది చాలా నీచమైన పని. పండితలోకం అసహ్యించుకొనేది. నేను ప్రాణాలర్పిద్దామంటే, నేను లేకపోతే వీరందరూ జీవించలేరు. (4)
సకృచ్ఛ్రామహమాపన్నః న శక్త స్తర్తుమాపదమ్ ।
అహో ధిక్ కాం గతిం త్వద్య గమిష్యామి సబాంధవః ।
సర్వైః సహ మృతం శ్రేయః న చ మే జీవితం క్షమమ్ ॥ 41
ఇలాంటి ఆపదలో నేనున్నాను. దీన్ని దాటే ఉపాయం లేదు. అయ్యయ్యో! నేడు బంధువులతో సహా నాకెలాంటి దుర్గతి కలగనున్నదో! అందరితో కలసి చనిపోవటమే మేలు. అంతే కాని నేను మాత్రం జీవించి ఉండటం మంచిది కాదు. (41)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి బకవధపర్వణి బ్రాహ్మణచింతాయాం షట్ పంచాశదధికశతతమోఽధ్యాయః ॥156॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున బకవధపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణ చింత అను నూటయేబది యారవ అధ్యాయము. (156)
(దాక్షిణాత్య అధికపాఠం 4 1/2 శ్లోకాలు కలుపుకొని 45 1/2 శ్లోకాలు)