157. నూట ఏబది యేడవ అధ్యాయము

బ్రాహ్మణి తానే మరణింతు ననుట.

బ్రాహ్మణ్యువాచ
న సంతాప స్త్వయా కార్యః ప్రాకృతేనేవ కర్హిచిత్ ।
న హి సంతాపకాలోఽయం వైద్యస్య తవ విద్యతే ॥ 1
బ్రాహ్మణి ఇలా అన్నది. మీరు సామాన్యుల్లా ఎప్పుడూ విచారించవద్దు, దుఃఖపడవద్దు. పండితులైన మీకు ఇది బాధపడవలసిన సమయం కాదు. (1)
అవశ్యం నిధనం సర్వైః గంతవ్యమిహ మానవైః ।
అవశ్యంభావిన్యర్థే వై సంతాపో నేహ విద్యతే ॥ 2
మానవులందరూ ఏదో ఒకరోజున వచ్చిన చోటికి పోవలసినవారే.. ఎలాగూ తప్పనిసరిగా జరిగితీరే విషయంలో దుఃఖించవలసిన అవసరం ఏమీ లేదు. (2)
భార్యా పుత్రోఽథ దుహితా సర్వమాత్మార్థమిష్యతే ।
వ్యథాం జహి సుబుద్ధ్యా త్వం స్వయం యాస్యామి తత్ర చ ॥ 3
ఏతద్ధి పరమం నార్యాః కార్యం లోకే సనాతనమ్ ।
ప్రానానపి పరిత్యజ్య యద్ భర్తృహితమాచరేత్ ॥ 4
భార్యకాని, పుత్రుడు కాని, పుత్రిక కాని, ఎవరైనా తనకోసమే కావాలని కోరుకొంటారు. నీవు బాధపడవద్దు. నీవు మంచిబుద్ధితో ఆలోచించి. నేను స్వయంగా అక్కడకు వెడతాను. ఈ లోకంలో ఏస్త్రీకయినా ఇదే పరమార్థం, సనాతన ధర్మం కూడా. ప్రాణాలను అర్పించి అయినా భర్తకు మేలు చెయ్యాలి. (3,4)
తచ్చ తత్ర కృతం కర్మ తవాపీదం సుఖావహమ్ ।
భవత్యముత్ర చాక్షయ్యం లోకేఽస్మింశ్చ యశస్కరమ్ ॥ 5
అలాంటి పనిని నేను చెయ్యటం మంచిది. నీకు కూడా ఈ పని సుఖాన్నిస్తుంది. దీని వల్ల పరలోకంలో ఎంతో మేలు కల్గుతుంది. ఈ లోకంలో అఖండమైన కీర్తీ లభిస్తుంది. (5)
ఏష చైవ గురుర్ధర్మః యం ప్రవక్ష్యామ్యహం తవ ।
అర్థశ్చ తవ ధర్మశ్చ భూయానత్ర ప్రదృశ్యతే ॥
నేను నీకు చెపుతున్న ఈ ధర్మం గొప్పది. దీని వల్ల నీకు ధర్మార్థాలు పుష్కలంగా లభిస్తాయి. (6)
యదర్థమిష్యతే భార్యా ప్రాప్తః సోఽర్థస్త్వయా మయి ।
కన్యాచైకా కుమారశ్చ కృతాహమనృణా త్వయా ॥ 7
ఎవరైనా ఎందుకు వివాహం చేసుకొంటారో ఆ ప్రయోజనం ఇప్పటికే నెరవేరింది. ఒక కుమార్తెను, ఒక కుమారుని కన్నాను. ఆ విధంగా నేను నీ ఋణం తీర్చుకున్నాను. (7)
సమర్థః పోషణే చాసి సుతయో రక్షణే తథా ।
న త్వహం సుతయోశ్శక్తా తథా రక్షణపోషణే ॥ 8
నీవు పిల్లలను చక్కగా పెంచటానికి, వారిని అన్ని విధాలా రక్షించటానికి సమర్థుడవు. నీలాగ, నాకు పిల్లలను పోషించి రక్షించే శక్తి లేదు. (8)
మమ హి త్వద్విహీనాయాః సర్వప్రాణధనేశ్వర ।
కథం స్యాతాం సుతౌ బాలౌ భరేయం చ కథం త్వహమ్ ॥ 9
సమస్త ప్రాణాలకు ధనాలకు ప్రభువైనవాడా! నీవు లేకపోతే, బాలురైన ఈ పిల్లలను నేను ఏవిధంగా పోషించగల్గుతాను? (9)
కథం హిం విథవానాథా బాలపుత్రా వినా త్వయా ।
మిథునం జీవయిష్యామి స్థితా సాధుగతే పథి ॥ 10
భర్తలేని దానను, రక్షకుడు లేనిదానను, నీవు లేకపోతే ఈ చిన్నపిల్లల జంటను, సరియైన మార్గంలో నడుస్తూ ఎలా రక్షించగలను? (10)
అహం కృతావలిప్తైశ్చ ప్రార్థ్యమానామిమాం సుతామ్ ।
అయుక్తైస్తవ సంబంధే కథం శక్ష్యామి రక్షితుమ్ ॥ 11
అహంకారంతో, గర్వంతో అనర్హులు ఈ కుమార్తెను కోరుకుంటే, వారి బారినుండి ఈమెను ఎలా రక్షించగలను? (11)
ఉత్సృష్టమామిషం భూమౌ ప్రార్థయంతి యథా ఖగాః ।
ప్రార్థయంతి జనాః సర్వే పతిహీనాం తథా స్త్రియమ్ ॥ 12
సాహం విచాల్యమానా వై ప్రార్థ్యమానా దురాత్మభిః ।
స్థాతుం పథి న శక్ష్యామి సజ్జనేష్టే ద్విజోత్తమ ॥ 13
భూమి మీద పడ్డ మాంసం ముద్దను పక్షులన్నీ కోరుకొన్నట్లు భర్తలేని స్త్రీని ప్రతివాడూ కోరుకుంటాడు. బ్రాహ్మణోత్తమా! దుర్మార్గులచే ప్రార్థింపబడ్డ నేను, వారిచే పరిపరివిధాల ప్రలోభపెట్టబడి, సజ్జనుల మార్గంలో ఎలా ప్రయాణం చెయ్యగల్గుతాను? (12,13)
కథం తవ కులస్యైకాం ఇమాం బాలామనాగసమ్ ।
పితృపైతామహే మార్గే నియోక్తుమహముత్సహే ॥ 14
ఏ పాపం తెలియని, నీ వంశంలో ఒక్కగానొక్క కుమార్తెను, ఈ బాలికను తండ్రితాతల మార్గమైన స్వర్గానికి పంపించటానికి నా మనస్సు ఎలా ఒప్పుకొంటుంది? (14)
కథం శక్ష్యామి బాలఽస్మిన్ గుణానాధాతుమిప్సితాన్ ।
అనాథే సర్వతో లుప్తే యథా త్వం ధర్మదర్శివాన్ ॥ 15
మీరు ధర్మమెరిగినవారు. నిరాశ్రయురాలనైన నేను, అన్ని విధాలా లోపించిన నేను, ఈ బాలకునికి కావలసిన గుణసంపదను అలవర్చటానికి ఎలా సమర్థురాలనవుతాను? (15)
ఇమామపి చ తే బాలాం అనాథాం పరిభూయ మామ్ ।
అనర్హాః ప్రార్థయిష్యంతి శూద్రా వేదశ్రుతిం యథా ॥ 16
అనాథనైన నన్ను పరాభవించి, ఈ నీకుమార్తెను కూడా, శూద్రూలు వేదాలను వినాలనుకొన్నట్లుగా, అనర్హులు కోరుకొంటారు. (16)
తాం చేదహం న దిత్సేయం త్వద్గుణైరుపబృంహితామ్ ।
ప్రమథ్యైనాం హరేయుస్తే హవిర్ధ్వాంక్షా ఇవాధ్వరాత్ ॥ 17
నీ సద్గుణాలతో పెరిగే ఈమెను, వారికి నేను ఇవ్వకపోతే, యజ్ఞహవిస్సును కాకులు తన్నుకుపోయినట్లు, నన్ను సంక్షోభింపచేసైనా సరే అపహరించుకొనిపోతారు. (17)
సంప్రేక్షమాణా పుత్రం తే నానురూపమివాత్మనః ।
అనర్హవశమాపన్నామ్ ఇమాం చాపి సుతాం తవ ॥ 18
అవజ్ఞాతా చ లోకేషు తథాఽఽత్మాన మజానతీ ।
అవలిప్తైర్నరైర్బ్రహ్మన్ మరిష్యామి న సంశయః ॥ 19
బ్రాహ్మాణోత్తమా! ఈ నీ కుమారుని నీకు తగ్గట్టుగా పెంచలేక, ఈ నీ కుమార్తెను, అయోగ్యులకు అప్పగించి, లోకమంతటితో అవమానాలను భరిస్తూ, చివరకు నన్ను నేను కూడా రక్షించకోలేని దాననై, మదమత్తులచేతిలో ప్రాణాలను వదలిపెట్టటం ఖాయం. (18,19)
తౌ చ హీనౌ మయా బాలౌ త్వయా చైవ తథాత్మజౌ ।
వినశ్యేతాం న సందేహః మత్స్యావివ జలక్షయే ॥ 20
ఈ పిల్లలు నీవులేక, నేనూలేక, చివరకు నీళ్ళులేని సరస్సులోని చేపల్లాగా నిస్సందేహంగా నశించి పోతారు. (20)
త్రితయం సర్వథాప్యేవం వినశిష్యత్యసంశయమ్ ।
త్వయా విహీనం తస్మాత్ త్వం మాం పరిత్యక్తుమర్హసి ॥ 21
ఏ విధంగా చూసినా నేను, కుమారుడు, కుమారై ముగ్గురం నీవు లేకపోతే నశించక తప్పదు. కనుక నీవు నన్ను ఒక్కదాన్నీ పరిత్యజించటం మంచిది. (21)
యుష్టిరేషా పరా స్త్రీణాం పూర్వం భర్తుః పరాంగతిమ్ ।
గంతుం బ్రహ్మన్ నపుత్రాణామ్ ఇతి ధర్మవిదో విదుః ॥ 22
బ్రాహ్మాణా! పుత్రవంతులైన స్త్రీలకు భర్తకంటె పూర్వం సౌభాగ్యవతిగా పరలోకానికి పోవటమన్నది మిక్కిలి కోరుకోదగ్గ విషయమని ధర్మవిదులు సెలవిస్తున్నారు. (22)
(మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః ।
అమితస్య హి దాతారం కా పతిం నాభినందతి ॥)
ఏస్త్రీకయినా తండ్రి పరిమితమైనదాన్నే ఇస్తాడు. తల్లి కూడా అంతే, కొడుకు కూడా పరిమితంగానే ఇవ్వగల్గుతాడు. అన్నింటినీ అమితంగా అందించే భర్తను ఏ స్త్రీ ఆరాధించదు?
పరిత్యక్తః సుతశ్చాయం దుహితేయం తథా మయా ।
బాంధవాశ్చ పరిత్యక్తాః త్వదర్థం జీవితం చ మే ॥ 23
ఈ కొడుకును నేను విడిచిపెట్టినట్లే, కుమార్తెనూ విడిచి పెట్టాను. బంధువులెప్పుడో విడువబడ్డారు. ప్రస్తుతం నీకోసం నా జీవితాన్ని విడిచిపెడతాను. (23)
యజ్ఞైస్తపోభిర్నియమైః దానైశ్చ వివిధైస్తథా ।
విశిష్యతే స్త్రియా భర్తుః నిత్యం ప్రియహితే స్థితిః ॥ 24
ఎల్లవేళలా భర్తకు ప్రియాన్ని, హితాన్ని కలిగించటమనేది, స్త్రీ కి పరమధర్మం. ఇది వివిధతపస్సులకంటె, నియమాల కంటె, దానాలకంటె విశిష్టమైన ధర్మం. ఇది చాలా గొప్పది. (24)
తదిదం యచ్చికీర్షామి ధర్మం పరమసమ్మతమ్ ।
ఇష్టం చైవ హితం చైవ తవ చైవ కులస్య చ ॥ 25
నేనిప్పుడు చేయాలనుకొంటున్న ఆపని ధర్మబద్ధమైనది. అందరికీ ఆమోదయోగ్యమైనది. మీకు, మీ కులానికి ప్రియాన్ని, హితానిఇ కలిగించేది. (25)
ఇష్టాని చాప్యపత్యాని ద్రవ్యాణి సుహృదః ప్రియాః ।
ఆపద్ధర్మప్రయోక్షాయ భార్యా చాపి సతాం మతమ్ ॥ 26
ఇష్టమైన పిల్లలు, వస్తువులు, స్నేహితులు ఆప్తులు, భార్య వీరందరూ ఆపత్కాలంలో ధర్మసంకటాన్నుంచి బయటకు చేర్చేవారని సత్పురుషులు భావిస్తారు. (26)
ఆపదర్థే ధనం రక్షేత్ దారాన్ రక్షేద్ ధనైరపి ।
ఆత్మానం సతతం రక్షేత్ దారైరపి ధనైరపి ॥ 27
ఆపదల నుండి బయటపడడానికి ధనాన్ని రక్షించుకోవాలి. ధనాన్ని విడిచిపెట్టి, అయినా సరే భార్యను రక్షించుకోవాలి, భార్య పోయినా, ధనం పోయినా సరే, తనను తాను అన్నివేళలా రక్షించుకోవాలి. (27)
దృష్టాదృష్టఫలార్థం హి భార్యా పుత్రో ధనం గృహమ్ ।
సర్వమేతద్ విధాతవ్యం బుధానామేషనిశ్చయః ॥ 28
భార్య, పుత్రుడు, ధనం, ఇల్లు ఇవన్నీ సంపాడించుకోవటం ఇహపరప్రయోజనాలను సాధించుకోవటానికే, ఇది పండితులు చెప్పిన సిద్ధాంతం. (28)
ఏకతో వా కులం కృత్స్నమ్ ఆత్మా వా కులవర్థనః ।
న సమం సర్వమేవేతి బుధానామేష నిశ్చయః ॥ 29
ఒక వైపున కులమంతా ఉన్నప్పటికీ, మరొకవైపున కులాన్ని వృద్ధి చేసే తాను ఉన్నప్పుడు, తననే రక్షించుకోవాలి కాని అన్యాన్ని కాదు. ఇది పండితులు చెప్పిన సిద్ధాంతం. (29)
స కురుష్వ మయా కార్యం తారయాత్మానమాత్మనా ।
అనుజానీహి మామార్య సుతౌ మే పరిపాలయ ॥ 30
పూజ్యుడా! నన్ను అనుమతించు. నాసుతులను రక్షించు. నేను చేయవలసిన పోషణను నీవే నిర్వహించు. నీకు మరొకరూపమైన నాతో నిన్ను నీవు రక్షించుకో. (30)
అవధ్యాం స్త్రియమిత్యాహుః ధర్మజ్ఞా ధర్మనిశ్చయే ।
ధర్మజ్ఞాన్ రాక్షసానాహుః న హన్యాత్ స చ మామపి ॥ 31
ధర్మాభిజ్ఞులు, ధర్మనిశ్చయ సందర్భంలో, స్త్రీ అవధ్యురాలని చెప్పారు. రాక్షసులు ధర్మవిదులని చెప్తారు. కనుక ఆ రాక్షసుడు నన్ను సంహరించకపోవచ్చు కూడా. (31)
నిస్సంశయం వధః పుంసాం స్త్రీణాం సంశయితో వధః ।
అతో మామేవ ధర్మజ్ఞ ప్రస్థాపయితుమర్హసి ॥ 32
పురుషుడు చంపబడతాడనటంలో సందేహం లేదు. స్త్రీ చంపబడవచ్చు, చంపబడకపోవచ్చు. ఇక్కడ సంశయం ఉంది. కనుక ధర్మజ్ఞా! నన్నే అతనివద్దకు పంపటం మంచిది. (32)
భుక్తం ప్రియాణ్యవాప్తాని ధర్మశ్చ చరితో మహాన్ ।
త్వత్ ప్రసూతిః ప్రియా ప్రాప్తా న మాం తప్స్యత్యజీవితమ్ ॥ 33
నేను పొందవలసిన అనుభవాలను పొందాను. ఇష్టాలను పొందాను. ధర్మాన్ని చక్కగా ఆచరించాను. నీకు ఇష్టమైన సంతితిని ఇచ్చాను. కనుక ప్రాణాలు పోవటం, నన్నేమీ బాధించదు. (33)
జాతపుత్రా చ వృద్ధా చ ప్రియకామా చ తే సదా ।
సమీక్ష్యైతదహం సర్వం వ్యవసాయం కరోమ్యతః ॥ 34
నాకు పుత్రులు కలిగారు. వయస్సు ఉడిగింది. నీకు ఎప్పుడూ ప్రియం చేయాలని భావిస్తుంటాను. ఇదంతా ఆలోచించుకొనే, నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. (34)
ఉత్సృజ్యాపి హి మామార్య ప్రాప్స్యస్యన్యామపి స్త్రియమ్ ।
తతః ప్రతిష్ఠితో ధర్మః భవిష్యతి పునస్తవ ॥ 35
పూజ్యుడా! నీవు నన్ను పరిత్యజించినా కావాలనుకొంటే మరొక స్త్రీ ని వివాహమాడవచ్చు. తర్వాత నీవు చేయవలసిన ధర్మకార్యాలకు ఆటంకం ఏర్పడదు. (35)
న చాప్యధర్మః కల్యాణ బహుపత్నీకృతాం నృణామ్ ।
స్త్రీణా మధర్మః సుమహాన్ భర్తుః పూర్వస్య లంఘనే ॥ 36
ఆర్యా! పురుషులకు అనేక స్త్రీలను వివాహం చేసుకోవటం వల్ల వచ్చే అధర్మమేమీ లేదు. కానీ స్త్రీలకు మొదటి భర్తను అతిక్రమించి ప్రవర్తిస్తే పెద్ద అధర్మం ఏర్పడుతుంది. (36)
ఏత్పత్సర్వం సమీక్ష్య త్వమాత్మత్యాగం చ గర్హితమ్ ।
ఆత్మానం తారయాద్యాశు కులం చేమౌ చ దారకౌ ॥ 37
దీన్నంతటినీ చక్కగా ఆలోచించి - ఆత్మత్యాగం పెద్దలచే గర్హింపబడింది - అనే విషయాన్ని గుర్తించి, నేడు ఈ ఆపద నుండి నీవు గట్టెక్కవలసింది. వంశాన్ని ఈ పుత్రులను కూడా రక్షింపవలసింది. (37)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తయా భర్తా తాం సమాలింగ్య భారత ।
ముమోచ బాష్పం శనకైః సభార్యో భృశదుఃఖితః ॥ 38
వైశంపాయనుడన్నాడు. భారతా! ఆ బ్రాహ్మణిచేత ఈ విధంగా అనునయింపబడి బ్రాహ్మణుడు ఆమెను కౌగిలించుకొని భార్యతో సహా కన్నీళ్ళు విడుస్తూ మిక్కిలిగా దుఃఖించాడు. (38)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి బకవధ పర్వణి బ్రాహ్మణీవాక్యే సప్తపంచాశదధికశతతమోఽధ్యాయః ॥157॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున బకవధపర్వ మను ఉపపర్వమున బ్రాహ్మణీవాక్యమను నూట ఏబది ఏడవ అధ్యాయము. (157)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకం కలిపి మొత్తం 39 శ్లోకాలు)