162. నూట అరువది రెండవ అధ్యాయము

బక భీమసేనుల యుద్ధము.

యుధిష్ఠిర ఉవాచ
ఉపపన్నమిదం మాతః త్వయా యద్బుద్ధిపూర్వకమ్ ।
ఆర్తస్య బ్రాహ్మణస్యైతద్ అనుక్రోశాదిదం కృతమ్ ॥ 1
యుధిష్ఠిరుడిలా అన్నాడు. అమ్మా! దుఃఖితుడైన బ్రాహ్మణుని పట్ల దయతో, నీవు బుద్ధిపూర్వకంగా చేస్తున్న ఈ పని ఎంతో చక్కగా ఉంది. (1)
ధ్రువమేష్యతి భీమోఊయం నిహత్య పురుషాదకమ్ ।
సర్వథా బ్రాహ్మణస్యార్థే యదనుక్రోశవత్యసి ॥ 2
నీ దయను పొందిన బ్రాహ్మణుని రక్షించడానికి, మన బీమసేనుడు వెడతాడు. మానవభక్షకుడైన ఆ రాక్షసుని చంపి తిరిగివస్తాడు. ఇది నిజం. (2)
యథా త్విదం న విందేయుః నరా నగరవాసినః ।
తథాయం బ్రాహ్మణో వాచ్యః పరిగ్రాహ్యశ్చ యత్నతః ॥ 3
అమ్మా! ఈ విషయాన్ని నగరంలోని జనులెవరికీ తెలియకుండా పూర్తిచేయాలి. దానికి తగినట్లు ఈ బ్రాహ్మణునితో నీవు మాట్లాడి, అతనికి విషయం అర్థమయ్యేటట్లు చెప్ఫాలి. (3)
వైశంపాయన ఉవాచ
(యుధిష్ఠిరేణ సమ్మంత్య్ర బ్రాహ్మణార్థమరిందమ ।
కుంతీ ప్రవిశ్య తాన్ సర్వాన్ సాంత్వయామాస భారత ॥)
తతో రాత్య్రాం వ్యతీతాయామ్ అన్నమాదాయ పాండవః ।
భీమసేనో యయౌ తత్ర యత్రాసౌ పురుషాదకః ॥ 4
వైశంపాయనుడన్నాడు. జనమేజయా! బ్రాహ్మణుని కోసం యుధిష్ఠిరునితో ఈ విధంగా సమాలోచన చేసి కుంతి, లోనికి వెళ్ళి, బ్రాహ్మణపరివారాన్నంతటినీ ఓదార్చింది. తర్వాత కొంత రాత్రి గడిచాక, పాండుపుత్రుడు భీమసేనుడు ఆహారాన్ని తీసుకుని, (మానవభక్షకుడు) రాక్షసుడుండే ప్రదేశానికి వెళ్ళాడు. (4)
ఆసాద్య తు వనం తస్య రక్షసః పాండవో బలీ ।
ఆజుహావ తతో నామ్నా తదన్నముపపాదయన్ ॥ 5
బలశాలి అయిన పాండుకుమారుడు భీముడు, ఆ రాక్షసుని వనాన్ని సమీపించి, అతనికి పంపిన అన్నాన్ని తింటూ, పేరు పెట్టి రాక్షసుడిని పిలిచాడు. (5)
తతస్స రాక్షసః క్రుద్ధః భీమస్య వచనాత్తదా ।
ఆజగామ సుసక్రుద్దః యత్ర భీమో వ్యవస్థితః ॥ 6
అప్పుడు ఆ రాక్షసుడు భీమసేనుని పిలుపు విని కోపించి భీముడున్న ప్రదేశానికి, మిక్కిలి క్రోధంతో చేరుకొన్నాడు. (6)
మహాకాయో మహావేగః దారయన్నివ మేదినీమ్ ।
లోహితాక్షః కరాలశ్చ లోహితశ్మశ్రుమూర్ధజః ॥ 7
ఆ రాక్షసుడు పెద్దశరీరంతో ఉన్నాడు. గొప్పవేగమున్నవాడు. అతడు నడుస్తుంటే భూమి బ్రద్దలవుతున్నట్లుగా ఉంది. ఎర్రనికళ్ళు, భయంకరాకారం, గడ్డం మీసాలు జుట్టు ఎర్రగా ఉన్నాయి. (7)
ఆకర్ణాద్ భిన్నవక్త్రశ్చ శంకుకర్ణో విభీషణః ।
త్రిశిఖాం భ్రుకుటిం కృత్వా సందశ్య దశనచ్ఛదమ్ ॥ 8
అతడినోరు చెవులదాకా వ్యాపించింది. చెవులు మేకుల్లా నిటారుగా ఉన్నాయి. అతడు కోపంతో కనుబొమ్మల్ని మూడు శిఖరాల్లా విరిచాడు. పెదవుల్ని కొరుక్కొంటూ భయంకరంగా ఉన్నాడు. (8)
భుంజానమన్నం తం దృష్ట్వా భీమసేనం స రాక్షసః ।
వివృత్య నయనే క్రుద్ధః ఇదం వచన మబ్రవీత్ ॥ 9
ఆ రాక్షసుడు తన ఆహారాన్ని తింటున్న భీమసేనుని చూశాడు. మిక్కిలి కోపంతో కళ్ళుపెద్దవి చేసి భీమునితో ఇలా అన్నాడు. (9)
కోఽయమన్నమిదం భుంక్తే మదర్థముకల్పితమ్ ।
పశ్యతో మమ దుర్భుద్ధిః యియాసుః యమసాదనమ్ ॥ 10
ఎవడ్రా నువ్వు? నాకోసం తయారు చేసిన ఆహారాన్ని నేను చూస్తుండగానే తింటున్నావు? నివు దుర్బుద్ధివి, యమలోకానికి పోతావు. (10)
భీమసేనస్తతః శ్రుత్వా ప్రహసన్నివ భారత ।
రాక్షసం తమనాదృత్య భుంక్త ఏవ పరాఙ్ ముఖః ॥ 11
జనమేజయా! భీమసేనుడు ఆ మాటలు విన్నాడు. వెక్కిరింతగా నవ్వాడు. ఆ రాక్షసుని లెక్క చేయలేదు. ముఖం ప్రక్కకు తిప్పుకొని భోజనం చేస్తూనే ఉన్నాడు. (11)
రవం స భైరవం కృత్వా సముద్యమ్య కరావుభౌ ।
అభ్యద్రవద్భీమసేనం జిఘాంసుః పురుషాదకః ॥ 12
ఆ మానవభక్షకుడు రాక్షసుడు భయంకరంగా గర్జించాడు. రెండుచేతులను పైకెత్తాడు. భీమసేనుని చంపాలని అతనివైపు పరుగెత్తాడు. (12)
తథాపి పరిభుయైనం ప్రేక్షమాణో వృకోదరః ।
రాక్షసం భుంక్త ఏవాన్నం పాండవః పరవీరహా ॥ 13
అమర్షేణ తు సంపూర్ణః కుంతీపుత్రం వృకోదరమ్ ।
జఘాన పృష్ఠే పాణిభ్యాం ఉభాభ్యాం పృష్ఠతః స్థితః ॥ 14
అయినా కూడా శత్రుమర్దనుడూ, పాండుకుమారుడూ అయిన వృకోదరుడు, ఆ రాక్షసుని చూస్తూనే, ఏ మాత్రం లెక్కచేయకుండా, భోజనం చేస్తూనే ఉన్నాడు. ఆ రాక్షసుడి కోపం తారస్థాయికి చేరింది. బీముని వెనుకకు వచ్చి రెండు చేతులూ బిగించి, గట్టిగ వీపుమీద కొట్టాడు. (13,14)
తథా బలవతా భీమః పాణిభ్యాం భృశమాహతః ।
నైవావలోకయామాస రాక్షసం భుంక్త ఏవ సః ॥ 15
అంతటి బలశాలి రెండు చేతులతోనూ గట్టిగా కొట్టినా, భీమసేనుడు రాక్షసునివైపు చూడనేలేదు. భోజనం చేస్తూ ఉన్నాడు. (15)
తత స్స భూయః సంక్రుద్ధః వృక్షమాదాయ రాక్షసః ।
తాడయిష్యంస్తదా భీమం పునరభ్యద్రవద్ బలీ ॥ 16
తర్వాత బలావంతుడైన ఆ రాక్షసుడు మిక్కిలి కోపంతో మళ్ళీ ఒక వృక్షాన్ని పెకలించి భీమసేనుని కొట్టడానికి పరుగుపెట్టాడు. (16)
తతో భీమశ్శనైర్భుక్త్వా తదన్నం పురుషర్షభః ।
వార్యుపస్పృశ్య సంహృష్టః తస్థౌ యుధి మహాబలః ॥ 17
ఇంతలో పురుషశ్రేష్ఠుడైన భీమసేనుడు మెల్లగా మిగిలిన ఆహారాన్ని భుజించి, నీళ్ళు త్రాగి, కాళ్ళు చేతులు కడుక్కొని మహాబలుడై యుద్ధరంగంలో నిలబడ్డాడు. (17)
క్షిప్తం క్రుద్ధేన తం వృక్షం ప్రతిజగ్రాహ వీర్యవాన్ ।
సవ్యేన పాణినా భీమః ప్రహసన్నివ భారత ॥ 18
రాజా! శక్తిశలి అయిన భీముడు, కోపించిన రాక్షసుడు విసరిన ఆ వృక్షాన్ని, ఎడమ చేత్తోపట్టుకొని అవహేళనగా నవ్వాడు. (18)
తతః స పునరుద్యమ్య వృక్షాన్ బహువిధాన్ బలీ ।
ప్ఱాహిణోద్ భీమసేనాయ తస్మై భీమశ్చ పాండవః ॥ 19
బలశాలి ఆ రాక్షసుడు ప్రయత్నపూర్వకంగా అనేక వృక్షాలను పెకలించి భీమసేనుని మీదకు విసిరాడు. అలాగే భీముడు కూడా చెట్లను రాక్షసుని పైకి విసిరాడు. (19)
తద్ వృక్షయుద్ధమభవత్ మహీరుహవినాశనమ్ ।
ఘోరరూపం మహారాజ నరరాక్షసరాజయోః ॥ 20
జనమేజయా! నరశ్రేష్ఠునికి, రాక్షసశ్రేష్ఠునికి మధ్య గొప్ప వృక్షయుద్ధం జరిగింది. చెట్ల వినాశానికి కారణమైన ఆ యుద్ధం భయంకరంగా సాగింది. (20)
నామ విశ్రావ్య తు బకః సమభిద్రుత్య పాండవమ్ ।
భుజాభ్యాం పరిజగ్రాహ భీమసేనం మహాబలమ్ ॥ 21
అప్పుడు బకుడు తనపేరును ప్రకటించుకొంటూ, పాండుకుమారుడు మహాబలశాలి అయిన బిముని మీదకు లంఘించి, తన బాహువులతో గట్టిగా పట్టుకొన్నాడు. (21)
భీమసేనోఽపి తద్రక్షః పరిరభ్య మహాభుజః ।
విస్ఫురంతం మహాబాహుః విచకర్ష బలాద్ బలీ ॥ 22
మహాబాహువైన భీమసేనుడు కూడా, గొప్ప బాహువులు కల ఆ రాక్షసుని గట్టిగా కౌగిలించుకొని, పెనగులాడుతున్న వానిని విరవడం ప్రారంభించాడు. (22)
స కృష్యమాణో భీమేన కర్షమాణశ్చ పాండవమ్ ।
సమయుజ్యత తీవ్రేణ క్లమేన పురుషాదకః ॥ 23
ఆ నరమాంసభక్షకుడు భీమునిచేత పరిపరివిధాల అటూ ఇటూ లాగబడ్డాడు. అతడు భీముని కూడా అటూ ఇటూ లాగడం ప్రారంభించాడు. కొంతసేపటికి రాక్షసుడు చాలా అలసట చెందాడు. (23)
తయోర్వేగేన మహతా పృథివీ సమకంపత ।
పాదపాంశ్చ మహాకాయాన్ చూర్ణయామాసతుస్తదా ॥ 24
వారిద్దరూ యుద్ధంలో గొప్పవేగాన్ని ప్రదర్శిస్తుంటే భూమి అంతా కంపించిపోయింది. కొంతసేపటికి ఆ మహాకాయులు అక్కడున్న చెట్లన్నింటినీ నుగ్గునుగ్గు చేశారు. (24)
హీయమానం తు తద్రక్షః సమీక్ష్య పురుషాదకమ్ ।
నిష్పిష్య భూమౌ జానుభ్యాం సమాజఘ్నే వృకోదరః ॥ 25
నరమాంసభక్షకుడైన ఆ రాక్షసుని బలం సన్నగిల్లటం గమనించిన వృకోదరుడు, అతడిని గట్టిగా భూమిమిద విసిరి కొట్టి మోకాళ్ళతో గట్టిగా పొడిచాడు. (25)
తతోఽస్య జానునా పృష్ఠమ్ అవపీడ్య బలాదివ ।
బాహునా పరిజగ్రాహ దక్షిణేన శిరోధరామ్ ॥ 26
సవ్యేన చ కటీదేశే గృహ్య వాససి పాండవః ।
తద్రక్షో ద్విగుణం చక్రే రువంతం భైరవం రవమ్ ॥ 27
తర్వాత భీముడు మోకాలితో ఆ రాక్షసుని నడుంవిరిచి, కుడిచేతితో బలంగా కంఠాన్ని పట్టుకొని, ఎడమచేత్తో కటివస్త్రాన్ని పట్టుకొని, భయంకరంగా అరుస్తున్న ఆ రాక్షసుని రెండుగా విరిచాడు. (26,27)
తతోఽస్య రుధిరం వక్త్రాత్ ప్రాదురాసీద్విశాంపతే ।
భజ్యమానస్య భీమేన తస్య ఘోరస్య రక్షసః ॥ 28
మహారాజా! భీముని చేత ముక్కలుగా విరవబడుతున్న ఆ భయంకర రాక్షసుని యొక్క ముఖం నుండి రక్తం బయటకు రావటం ప్రారంభించింది. (28)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి బకవధపర్వణి బక భీమసేన యుద్ధే ద్విషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 162 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున బకవధపర్వమను ఉపపర్వమున బక భీమసేనయుద్ధమను నూట అరువది రెండవ అధ్యాయము. (162)
(దాక్షిణాత్య అధికపాఠము 1 శ్లోకము కలుపుకొని మొత్తం 29 శ్లోకాలు)