163. నూట అరువది మూడవ అధ్యాయము

నగరజనులందరు సంతోషించుట.

వైశంపాయన ఉవాచ
తతః స బగ్నపార్శ్వాంగః నదిత్వా భైరవం రవమ్ ।
శైలరాజప్రతీకాశః గతాసురభవత్ బకః ॥ 1
వైశంపాయనుడన్నాడు. అప్పుడు ఆబకుడు ప్రక్కటెముకలు విరుగుతుండగా, భయంకరంగా అరుస్తూ పర్వతంలా విరుచుకు పడిపోయాడు. బకుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. (1)
తేన శబ్దేన విత్రస్తః జనస్తస్యాథరక్షసః ।
నిష్పపాత గృహాద్రాజన్ సహైవ పరిచారిభిః ॥ 2
తాన్ భీతాన్ విగతజ్ఞానాన్ భీమః ప్రహరతాం వరః ।
సాంత్వయామాస బలవాన్ సమయే చ న్యవేశయత్ ॥ 3
న హింస్యా మానుషా భూయః యుష్మాభిరితి కర్హిచిత్ ।
హింసతాం హి వధః శీఘ్రమ్ ఏవమేవ భవేదితి ॥ 4
రాజా! ఆ రాక్షసుని ఆర్తనాదం విన్న అతని అనుచరులు, పరివారం అందరూ కూడా వారి నివాసప్రదేశాన్నుండి భయంతో పారిపోవటం ప్రారంభించారు. యుద్ధవిశారదుడు, బలశాలి అయిన భీముడు భయంతో అచేతనులవుతున్న వారందరినీ ఓదార్చాడు. వారిని నియమానికి కటుబడేటట్లు చేశాడు. 'మీరెవ్వరూ ఎన్నడూ మనుష్యులను తిరిగి హింసించరాదు. ఎవరైనా హింసిస్తే వారిని కూడా ఈ విధంగానే వెంటనే సంహరించటం జరుగుతుంది'. అని భీముడు హెచ్చరించాడు. (2-4)
తస్య తద్ వచనం శ్రుత్వా తాని రక్షాంసి భారత ।
ఏవమస్త్వితి తం ప్రాహుః జగృహుః సమయం చ తమ్ ॥ 5
జనమేజయా! భీముని మాటలు విన్న ఆ రాక్షసులందరూ, అలాగే చేస్తామని చెప్పారు. ఆ ఒడంబడికకు వారు అంగీకరించారు. (5)
తతః ప్రభృతి రక్షాంసి తత్ర సౌమ్యాని భారత ।
నగరే ప్రత్యదృశ్యంత నరైర్నగరవాసిభిః ॥ 6
రాజా! ఆ నాటి నుండి అచ్చటి రాక్షసులందరూ సౌమ్యులుగా మారిపోయారు. నగరవాసులందరూ ఈ విషయాన్ని గ్రహించారు. (6)
తతో భీమస్తమాదాయ గతాసుం పురుషాదకమ్ ।
ద్వారదేశే వినిక్షిప్య జగామానుపలక్షితః ॥ 7
తర్వాత భీముడు చనిపోయిన ఆ నరభక్షకుని శవాన్ని మోసుకొని వచ్చి, నగర ద్వారం ముందుంచి, ఎవరికీ కనపడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. (7)
దృష్ట్వా భీమబలోద్భూతం బకం వినిహతం తదా ।
జ్ఞాతయోఽస్య భయోద్విగ్నాః ప్రతిజగ్ముస్తతస్తతః ॥ 8
భయంకరబలశాలి అయిన బకుడు చంపబడటం చూసి, అతని బంధువులందరూ భయంతో కంపిస్తూ ఇటూ అటూ పారిపోయారు. (8)
తతః స భీమస్తం హత్వ గత్వా బ్రాహ్మణవేశ్మ తత్ ।
ఆచచక్షే యథావృత్తం రాజ్ఞః సర్వమశేషతః ॥ 9
భీముడు బకుని చంపి, బ్రాహ్మణగృహం ప్రవేశించి, యుధిష్ఠిరునికి, జరిగింది జరిగినట్లు అంతా చెప్పాడు. (9)
తతో నరా వినిష్క్రాంతాః నగరాత్ కల్యమేవ తు ।
దదృశుర్నిహతం భూమౌ రాక్షసం రుధిరోక్షితమ్ ॥ 10
తెల్లవారగానే, బయటకు వచ్చిన నగరజనులు రక్తసిక్తుడై, చచ్చి పడిఉన్న రాక్షసుని చూశారు. (10)
తమద్రికూటసదృశం వినికీర్ణం భయానకమ్ ।
దృష్వా సంహృష్టరోమాణః బభూవుస్తత్ర నాగరాః ॥ 11
అక్కడి నగరజనులందరూ పర్వతసమానుడు భయంకరుడు అయిన ఆ రాక్షసుడు చచ్చి భూమి మీద విసరివేయబడి ఉండటం చూశారు. ఆనందంతో వారి శరీరాలు గగుర్పొడిచాయి. (11)
ఏకచక్రాం తతో గత్వా ప్రవృత్తిం ప్రదదుః పురే ।
తతః సహస్రశో రాజన్ నరా నగరవాసినః ॥ 12
తత్రాజగ్ముర్బకం ద్రష్టుం సస్త్రీవృద్ధకుమారకాః ।
తతస్తే విస్మితాః సర్వే కర్మ దృష్ట్వాతిమానుషమ్ ।
దైవతాన్యర్చయాంచక్రుః సర్వ ఏవ విశాంపతే ॥ 13
చూసినవారు, ఏకచక్రపురంలోనికి ప్రవేశించి, జనులందరికీ ఈ వార్తను తెలియపర్చారు. రాజా ఆ నగరంలో ఉండే జనులందరూ, బాలురు, స్త్రీలు, వృద్ధులు కూడా చచ్చిపడిన బకుడిని చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. మహారాజా! మనుష్యులు సాధించనలవికాని ఈ గొప్పపనిని చూసి వారందరూ ఆశ్చర్యపోయారు. వారి వారి ఇష్టదైవాలకు పూజలు చేశారు. (12,13)
తతః ప్రగణయామాసుః కస్య వారోఊద్య భోజనే ।
జ్ఞాత్వా చాగత్య తం విప్రం పప్రచ్ఛుః సర్వ ఏవ తే ॥ 14
ఆ తర్వాత వారందరూ ఈ రోజు బకుని దగ్గరకు వెళ్ళవలసిన వంతు ఎవరిదా అని లెక్కించారు. తెలిసిన వెంటనే ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి పరిపరివిధాల ప్రశ్నించారు. (14)
ఏవం పృష్టః స బహుశః రక్షమాణశ్చ పాండవాన్ ।
ఉవాచ నాగరాన్ సర్వాన్ ఇదం విప్రర్షభస్తదా ॥ 15
ఈ విధంగా అనేక ప్రశ్నలను ఎదుర్కొన్న ఆ బ్రాహ్మణుడు పాండవుల గుట్టు ఎంతమాత్రం బయటకు రాకుండా, నగర ప్రజలందరినీ ఉద్దేశించి ఇలా చెప్పాడు. (15)
ఆజ్ఞాపితం మామశనే రుదంతం సహబంధుభిః ।
దదర్శ బ్రాహ్మణః కశ్చిత్ మంత్రసిద్ధో మహామనాః ॥ 16
నేను బకునికి ఆహారంగా వెళ్ళటానికి ఆజ్ఞాపించబడ్డాను. ఆ దుఃఖంతో నేను కుటుంబసభ్యులు ఏడుస్తున్నాము. ఆ సమయంలో గొప్పమనస్సున్న మంత్రసిద్ధుడైన బ్రాహ్మణుడు కనపడ్డాడు. (16)
పరిపృచ్ఛ్యస మాం సర్వం పరిక్లేశం పురస్య చ ।
అబ్రవీద్ బ్రాహ్మణశ్రేష్ఠః విశ్వాస్య ప్రహసన్నివ ॥ 17
ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు, నన్ను ప్రశ్నించి, నా కుటుంబానికి నగరానికి ఏర్పడిన కష్టాన్ని తెలుసుకుని, నన్ను నమ్మించి, నవ్వుతూ ఇలా అన్నాడు. (17)
ప్రాపయిష్యామ్యహం తస్మై అన్నమేతద్ దురాత్మనే ।
మన్నిమిత్తం భయం చాపి న కార్యమితి చాబ్రవీత్ ॥ 18
'నేను ఈ అన్నాన్ని ఆ దుర్మార్గుని వద్దకు చేరుస్తాను. నా విషయంలో మీరు ఎంతమాత్రం భయపడవలిసిన పనిలేదు.' (18)
స తదన్నముపాదాయ గతో బకవనం ప్రతి ।
తేన మానం భవేదేతత్ కర్మ లోకహితం కృతమ్ ॥ 19
అతడు ఆ అన్నాన్నంతా తీసుకుని బకుడున్న అరణ్యానికి వెళ్ళాడు. లోకానికి శ్రేయస్సునందించే ఈ పనిని అతడే చేసి ఉంటాడు. ఇందులో సందేహం లేదు. (19)
తతస్తే బ్రాహ్మణాః సర్వే క్షత్రియాశ్చ సువిస్మితాః ।
వైశ్యాః శూద్రాశ్చ ముదితాః చక్రుర్బ్రహ్మమహం తదా ॥ 20
ఆ నగరంలో ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులూ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. మిక్కిలిగా సంతోషించారు. వారు గొప్ప ఉత్సవాన్ని చేసుకొన్నారు. (20)
తతో జానపదాః సర్వే ఆజగ్ముర్నగరం ప్రతి ।
తదద్భుతతమం ద్రష్టుం పార్థాస్తత్రైవ చావసన్ ॥ 21
ఆ తర్వాత పల్లెల్లో నివసించే జనమంతా కూడా, ఆశ్చర్యకరమైన దాన్ని చూడటానికి నగరానికి వచ్చారు. పాండవులు మాత్రం ఆ ఇంటిలోనే ఉండిపోయారు. (21)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి బకవధపర్వణి బకవధే త్రిషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 163 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున బకవధ పర్వమను ఉపపర్వమున బకవధ అను నూట అరువది మూడవ అధ్యాయము. (163)