166. నూట అరువది యారవ అధ్యాయము
ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జననము.
బ్రాహ్మణ ఉవాచ
అమర్షీ ద్రుపదో రాజా కర్మసిద్ధాన్ ద్విజర్షభాన్ ।
అన్విచ్ఛన్ పరిచక్రామ బ్రాహ్మణావసథాన్ బహూన్ ॥ 1
బ్రాహ్మణుడిలా అన్నాడు. ద్రుపదమహారాజు అసహనంతో కర్మసిద్ధిగల బ్రాహ్మణోత్తముల నన్వేషిస్తూ బ్రహ్మర్షుల ఆశ్రమాలకెన్నింటికో తిరిగాడు. (1)
పుత్రజన్మ పరీప్సన్ వై శోకోపహతచేతనః ।
వాస్తి శ్రేష్ఠమపత్యం మే ఇతి నిత్యమచింతయత్ ॥ 2
కొడుకు కావాలని కోరుతూ శోకాకులితమనస్కుడై తనకు మంచిబిడ్డలు లేరని ఎప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. (2)
జాతాన్ పుత్రాన్ స నిర్వేదాత్ ధిక్ బంధూనితి చాబ్రవీత్ ।
విశ్వాసపరమశ్చాసీత్ ద్రోణం ప్రతిచికీర్షయా ॥ 3
అప్పటికే ఉన్న పిల్లలను గానీ, బంధువులను గానీ తనలోని నిర్వేదం వలన ద్రుపదుడు సహకరింపగలవారుగా పరిగణించలేదు. ద్రోణునిపై పగ సాధించాలని పెద్ద నిట్టూర్పులు విడిచేవాడు. (3)
ప్రభావం వినయం శిక్షాం ద్రోణస్య చరితాని చ ।
క్షాత్రేణ చ బలేనాస్య చింతయన్ నాధ్యగచ్ఛత ॥ 4
ప్రతికర్తుం నృపశ్రేష్ఠః యతమానోఽపి భారత ।
అభితః సోఽథ కల్మాషీం గంగాకూలే పరిభ్రమన్ ॥ 5
బ్రాహ్మణావసథం పుణ్యమ్ ఆససాద మహీపతిః ।
తత్ర నాస్నాతకః కశ్చిద్ న చాసీదవ్రతీ ద్విజః ॥ 6
జనమేజయా! రాజశ్రేష్ఠుడైన ద్రుపదుడు ద్రోనాచార్యునకు ప్రతీకారం చేయాలని ప్రయత్నం చేసి కూడా ద్రోణుని ప్రభావం, వినయం, అధ్యయనం, చరితం కారణంగా క్షాత్రబలంతో దానిని సాధించే ఉపాయం కనిపించలేదు. ఆ రాజు ఒకసారి గంగాయమునల ఒడ్డున సంచరిస్తూ బ్రాహ్మణనివాసస్థానమైన ఒక ప్రదేశానికి వచ్చాడు. అక్కడ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అధ్యయనశీలుడు కాని బ్రాహ్మణుడొక్కడు కూడా లేడు. (4-6)
తథైవ చ మహాభాగః సోఽపశ్యత్ సంశితవ్రతౌ ।
యాజోపయాజౌ బ్రహ్మర్షీ శామ్యంతౌ పరమేష్ఠినౌ ॥ 7
ఆ రీతిగా ఆ మహనీయుడు (ద్రుపదుడు) యాజుడు, ఉపయాజుడు అను పేర్లుగల ఇద్దరు బ్రహ్మర్షులను చూచాడు. వారు దీక్షితులు, శమసంపన్నులు, బ్రహ్మస్వరూపులూ. (7)
సంహితాధ్యయనే యుక్తౌ గోత్రతశ్చాపి కాశ్యపౌ ।
తారణేయౌ యుక్తరూపౌ బ్రాహ్మణౌ ఋషిసత్తమౌ ॥ 8
ఆ బ్రాహ్మణులు వేదాధ్యయనంలో లగ్నమైనవారు, కాశ్యపగోత్రులు, సూర్యోపాసకులు, సర్వవిధాలా యోగ్యులు, ఋషిశ్రేష్ఠులు. (8)
స తావామంత్రయామాస సర్వకామైరతంద్రితః ।
బుద్ద్వా బలం తయోస్తత్ర కనీయాంసముపహ్వరే ॥ 9
ప్రపేదే ఛందయన్ కామైః ఉపయాజం ధృతవ్రతమ్ ।
పాదశుశ్రూషణే యుక్తః ప్రియవాక్ సర్వకామదః ॥ 10
అర్చయిత్వా యథాన్యాయం ఉపయాజమువాచ సః ।
యేన మే కర్మణా బ్రహ్మన్ పుత్రః స్యాద్ ద్రోణమృత్యవే ॥ 11
ఉపయాజ కృతే తస్మిన్ గవాం దాతాఽస్మి తేఽర్బుదమ్ ।
యద్వా తేఽన్యద్ ద్విజశ్రేష్ఠ మనసః సుప్రియం భవేత్ ।
సర్వం తత్తే ప్రదాతాహం న హి మేఽత్రాస్తి సంశయః ॥ 12
ఆ ఇరువురి శక్తినీ గ్రహించిన ద్రుపదుడు ఆలస్యం లేకుండా వారి సంకల్పాలనన్నింటినీ నెరవేర్చగోరి ఆహ్వానించాడు. వారిలో చిన్నవాడు ఉపయాజి వ్రతశీలి. ద్రుపదుడు ఏకాంతంలో అతనిని కలిసి కావలసినవి అందజేస్తూ తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం ప్రారంభించాడు. పాదసేవలు చేస్తూ ప్రియంగా మాటాడుతూ శాస్త్రోక్తరీతిని పూజిస్తూ ఇలా అడిగాడు - బ్రాహ్మణా! ఉపయాజా! ద్రోణాచార్యుని చంపగల కొడుకు నాకెలా పుట్టగలడు? అది నెరవేరిస్తే తమకు పదికోట్ల ఆవులను ఇస్తాను. ద్విజోత్తమా! తమ మనస్సులో మరే కోరిక ఉన్నా తీర్చగలను. కోరినదివ్వగలను. సంశయించనవసరం లేదు. (9-12)
ఇత్యుక్తో నాహమిత్యేవం తమృషిః ప్రత్యభాషత ।
ఆరాధయిష్యన్ ద్రుపదః స తం పర్యచరత్ పునః ॥ 13
ద్రుపదుడు అలా అడగగానే ఆ ఋషి నేనా పని చేయనన్నాడు. అయినా ద్రుపదుడు మరలా ఆయనను సేవించనారంభించాడు. (13)
తతః సంవత్సరస్యాంతే ద్రుపదం స ద్విజోత్తమః ।
ఉపయాజోఽబ్రవీత్ కాలే రాజన్ మధురయా గిరా ॥ 14
జ్యేష్ఠో భ్రాతా మమాగృహ్హత్ విచరన్ గహన్ వనే ।
అపరిజ్ఞాతశౌచాయాం భూమౌ నిపతితం ఫలమ్ ॥ 15
రాజా! ఆపై ఒక సంవత్సరం గడిచిన తర్వాత తగినవేళలో ఉపయాజుడు ద్రుపదునితో మధురవాక్కులతో ఇలా అన్నాడు - 'మా అన్న ఒకసారి అరణ్యంలో సంచరిస్తూ నేలపై రాలి ఉన్న ఒక పండును తిసికొన్నాడు. కానీ దానిని ఎలా శుద్ధి చేయాలో ఆయనకు తెలియదు. (14,15)
తదపశ్యమహం భ్రాతుః అసాంప్రతమనువ్రజన్ ।
విమర్శం సంకరాదానే నాయం కుర్యాత్ కదాచన ॥ 16
బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠులై, ద్రోణునికన్నా మిన్న అయిన తమరిని ఆశ్రయించి, యుద్ధంలో గెలువరానివాడై, ద్రోణుని సంహరించగల కుమారుని పొందాలని ఆశ. (30)
తత్ కర్మ కురు మే యాజ వితరామ్యర్బుదం గవామ్ ।
తథేత్యుక్త్వా తు తం యాజః యాజ్యార్థముపకల్పయత్ ॥ 31
కాబట్టి యాజా! నామనోరథాన్ని సఫలంచేయగల యాగాన్ని చేయించండి. పదికోట్ల గోవులనిస్తాను.' ఆ మాటలు విని, అంగీకరించి, యాజుడు దానికవసరమైన యజ్ణాన్నీ, సాధనాలనూ స్మరించాడు. (31)
గుర్వర్థ ఇతి చాకామమ్ ఉపయాజమచోదయత్ ।
యాజో ద్రోణవినాశాయ ప్రతిజజ్ఞే తథా చ సః ॥ 32
తతస్తస్య నరేంద్రస్య ఉపయాజో మహాతపాః ।
ఆచఖ్యౌ కర్మ వైతానం తదా పుత్రఫలాయ వై ॥ 33
కార్యభారం ఎక్కువన్న భావంతో యాజుడు ఏ కోరికలూ లేని ఉపయాజుని కూడా ప్రేరేపించి ద్రోణవినాశానికి తగినట్టి కుమారుని కలిగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు మహాతపస్వి అయిన ఉపయాజుడు పుత్రసంప్రాప్తికి అనువైన యజ్ఞకర్మను ద్రుపదమహారాజుకు ఉపదేశించాడు. (32,33)
స చ పుత్రో మహావీర్యః మహాతేజా మహాబలః ।
ఇష్యతే యద్విధో రాజన్ భవితా తే తథావిధః ॥ 34
"రాజా! ఈ యజ్ఞం ద్వారా నీవు కోరుకొన్న లక్షణాలు గల కొడుకు జన్మిస్తాడు. ఆ కుమారుడు మహాపరాక్రమవంతుడూ, మహాతేజస్వి 'మహాబలుడు కూడా కాగలడు.' (34)
భారద్వాజస్య హంతారం సోఽభిసంధాయ భూపతిః ।
ఆజహ్రే తత్ తథా సర్వం ద్రుపదః కర్మసిద్ధయే ॥ 35
ద్రుపదమహారాజు ద్రోణుని సంహరించ గల కొడుకు కావాలని మనసా భావించి ఉపయాజుడు ఉపదేశించిన ఆ యాగవిధికి మొత్తం ఏర్పాటు చేశాడు (35)
యాజస్తు హవనస్యాంతే దేవీ మాజ్ణ్యాపయత్ తదా ।
ప్రేహి మాం రాజ్ఞి పృషతి మిథునం త్వామ్ ఉపస్థితమ్ ॥ 36
(కుమారశ్చ కుమారీ చ పితృవంశవివర్థయే ।)
యాగసమాప్తి వేళలో యాజుడు ద్రుపదుని రాణిని ఇలా ఆజ్ఞాపించాడు-ద్రుపదరాజ్ఞీ! నా దగ్గర నుండి త్వరగా హవిస్సును స్వీకరించు. నీకు ఒక కొడుకూ, ఒక కూతురూ జన్మిస్తారు. వారు పితృవంశవృద్ధికి హేతువు కాగలరు. (36)
రాజ్ఞీ ఉవాచ
అవలిప్తం ముఖం బ్రహ్మన్ దివ్యాన్ గంధాన్ బిభర్మి చ ।
సుతార్థేనోపలబ్ధాస్మి తిష్ట యాజ మమ ప్రియే ॥ 37
రాణి ఇలా అన్నది - బ్రాహ్మణా! నా నోట తాంబూలరాగం తగిలి ఉన్నది. దివ్యగంధాలు నా శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఇప్పుడు పుత్రార్థమై హవిస్సును స్వీకరింపలేను. కాబట్టి యాజా! నా ఇష్టసిద్ధిని కలిగించడానికి కొంతసేపు ఆగండి. (37)
యాజ ఉవాచ
యాజేన శ్రపితం హవ్యం ఉపయాహాభిమంత్రితమ్ ।
కథం కామం న సందధ్యాత్ సా త్వం విప్రేహి తిష్ఠ వా ॥ 38
యాజుడిలా అన్నాడు. ఈ హవిస్సును నేను తయారు చేశాను. ఉపయాజుడు మంత్రపూతం చేశాడు. కాబట్టి నీవు వచ్చినా, రాకపోయినా ఇది యజమాని కోరికను తప్పక తీరుస్తుంది. (38)
బ్రాహ్మణ ఉవాచ
ఏవముక్త్వాతు యాజేన హుతే హవిషి సంస్కృతే ।
ఉత్తస్థౌ పావకాత్ తస్మాత్ కుమారో దేవసంనిభః ॥ 39
ఈ మాట అని యాజుడు సుసంస్కృతమైన హవిస్సుతో హోమం ముగించాడు. అప్పుడు ఆ హోమాగ్ని నుండి దేవసమానుడైన ఒక కుమారుడు పైకి లేచాడు. (39)
జ్వాలావర్ణో ఘోరరూపః కిరీటీ వర్మ చోత్తమమ్ ।
బిభ్రత్ సఖడ్గః సశరః ధనుష్మాన్ వినదన్ ముహుః ॥ 40
ఆ కుమారుని శరీరచ్ఛాయ అగ్నిజ్వాలలవలె ఉన్నది. రూపం భీకరంగా ఉన్నది. తలపై కిరీటం, తనువుపై మంచి కవచం ఉన్నాయి. కత్తినీ, ధనుర్బాణాళనూ ధరించి పదే పదే సింహనాదం చేస్తూ వెలువడ్డాడు. (40)
సోఽధ్యారోహత్ రథవరం తేన చ ప్రయయౌ తదా ।
తతః ప్రణేదుః పంచాలాః ప్రహృష్టాః సాధు సాధ్వితి ॥ 41
ఆ కుమారుడు అప్పుడే రథాన్నెక్కి యుద్ధయాత్రకు బయలుదేరాడు. పంచాలదేశీయులు ఆనందంతో "భళీ భళీ" అని నినాదాలు చేశారు. (41)
హర్షావిష్టాన్ తతశ్చైతాన్ నేయం సేహే వసుంధరా ।
భయాపహో రాజపుత్రః పాంచాలానాం యశస్కరః ॥ 42
రాజ్ఞః శోకాపహో జాతః ఏష ద్రోణవధాయ వై ।
ఇత్యువాచ మహత్ భూతం అదృశ్యం ఖేచరం తదా । 43
అప్పుడు ఆనందంతో బరువెక్కిన ఆ పంచాలదేశభారాన్ని భూమి భరించలేకపోయింది. గగనతలం నుండి ఆ శరీర భూతం ఇలా ప్రకటించింది. పంచాలుర భయాన్ని పోగిట్టి వారి కీర్తిని పెంచగలవాడూ, ద్రోణుని వధకు కారణం కాగలవాడూ, ద్రుపదుని శోకాన్ని దూరం చేయగలవాడు ఈ కుమారుడు. (42,43)
కుమారీ చాపి పాంచాలీ వేదీమధ్యాత్ సముత్థితా ।
సుభగా దర్శనీయాంగీ స్వసితాయతలోచనా ॥ 44
తరువాత ఆ వేదిమధ్యనుండి ఒక కన్య పైకి వచ్చింది. ఆమె సౌందర్యసౌభాగ్యాలతో కూడినది. ఆమె నేత్రాలు నల్లగా, విశాలంగా ఉన్నాయి. (44)
శ్యామా పద్మపలాశాక్షీ నీలకుంచితమూర్ధజా ।
తామ్రతుంగనఖీ సుభ్రూః చారుపీనపయోధరా ॥ 45
ఆమె నల్లగా ఉన్నది. తామర రేకుల వంటి కన్నులు, ఉంగరాలు తిరిగిన నల్లని జుట్టు, ఎత్తైన ఎఱ్ఱటి గోరులు, అందమై ఉన్నతమైన వక్షోజాలు కలిగి ఉన్నది. (45)
మానుషం విగ్రహం కృత్వా సాక్షాదమరవర్ణినీ ।
నీలోత్పలసమో గంధః యస్యాః క్రోశాత్ ప్రధావతి ॥ 46
మానుషరూపాన్ని ధరించిన సాక్షాత్తు దేవకాంతవలె ఉన్నది. ఆమె శరీరం నుండి వెలువడుతున నల్లకలువల వంటి సౌరభం కోసెడు దూరం వ్యాపిస్తోంది. (46)
యా బిభర్తి పరం రూపం యస్యాః వాస్త్యుపమా భువి ।
దేవదానవయక్షాణామ్ ఈప్సితాం దేవరూపిణీమ్ ॥ 47
ఆమె మహాసుందరమైన రూపాన్ని ధరించి ఉన్నది. భూలోకంలో ఆమెకు సాటి లేదు. దివ్యరూపంగల ఆమెను దేవతలూ, రాక్షసులూ, యక్షులూ కూడా కోరుతున్నారు. (47)
తాం చాపి జాతాం సుశ్రోణీం వాగువాచాశరీరిణీ ।
సర్వయోషిద్వరా కృష్టా నినీషుః క్షత్రియాన్ క్షయమ్ ॥ 48
ఆమె జన్మించిన తర్వాత ఆ శరీరవాణి ఇలా వినిపించింది. 'ఈమె పేరు కృష్ణ. స్త్రీలందరిలో శ్రేష్ఠయైన ఈమె క్షత్రియులనందరినీ నాశనం చేస్తుంది. (48)
సురకార్యమ్ ఇయం కాలే కరిష్యతి సుమధ్యమా ।
అస్యా హేతోః కౌరవాణాం మహదుత్పత్స్యతే భయమ్ ॥ 49
తగినవేళలో ఈ సుమధ్యమ దేవకార్యాన్ని పూర్తి చేస్తుంది. ఈమె కారణం గానే కౌరవులకు తీవ్రభయం కలుగుతుంది.' (49)
తచ్ఛ్రుత్వా సర్వపాంచాలాః ప్రణేదుః సింహసంఘవత్ ।
న చైతాన్ హర్షసంపూర్ణాన్ ఇయం సేహే వసుంధరా ॥ 50
ఆ మాటవిని పాంచాలదేశస్థులు సింహసమూహంలాగా గర్జించారు. ఆనందనిర్భరులైన వారిని ఈ భూమి భరించలేక పోయింది. (50)
తౌ దృష్ట్వా పార్షతీ యాజం ప్రపేదే వై సుతార్థినీ ।
న వై మదన్యాం జననీం జానీయాతామిమావితి ॥ 51
ఆ ఇద్దరినీ చూచి సంతానార్థిని అయిన ద్రుపదుని భార్య యాజునితో "ఈ ఇరువురూ నన్నే తల్లిగా భావించాలి" అని అభ్యర్థించింది. (51)
తథేత్యువాచ తం యాజః రాజ్ఞః ప్రియచికీర్షయా ।
తయోశ్చ నామనీ చక్రుః ద్విజాః సంపూర్ణమానసాః ॥ 52
అప్పుడు ద్రుపదుని అభీష్టాన్ని తీర్చదలచిన యాజుడు 'అలాగే' అని ద్రుపదునితో అన్నాడు. అక్కడి బ్రాహ్మణులు పూర్ణమనస్కులై వారికి నామకరణం చేశారు. (52)
ధృష్టత్వాత్ అత్యమర్షిత్వాత్ ద్యుమ్నాద్యుత్సంభవాదపి ।
ధృష్టద్యుమ్నః కుమారోఽయం ద్రుపదస్య భవత్వితి ॥ 53
ఈ ద్రుపదకుమారుడు దృష్టుడూ, అమర్షశీలుడూ, తేజః కవచాన్ని ధరించి పుట్టినవాడూ కాబట్టి ఇతని పేరు ధృష్టద్యుమ్నుడు. (53)
కృష్టేత్యేవాబ్రువన్ కృష్ణాం కృష్ణాభూత్ సా హి వర్ణతః ।
తథా తత్ మిథునం జజ్ఞే ద్రుపదస్య మహామఖే ॥ 54'
కుమార్తెనల్లని రంగు గలది కాబట్టి కృష్ణ అని వ్యవహరించారు. ఆ విధంగా ద్రుపదుని యాగఫలంగా ఆ పిల్లలిద్దరూ జన్మించారు. (54)
ధృష్టద్యుమ్నం తు పాంచాల్యమ్ ఆనీయ స్వం నివేశనమ్ ।
ఉపాకరోదస్త్రహేతోః బారద్వాజః ప్రతాపవాన్ ॥ 55
అమోక్షణీయం దైవం హి భావి మత్వా మహామతిః ।
తథా తత్ కృతవాన్ ద్రోణః ఆత్మకీర్తనురక్షణాత్ ॥ 56
ధీమంతుడూ, ప్రతాపవంతుడూ అయిన ద్రోణుడు కాగలదాని నుండి బయటపడటం అసాధ్యమని ఆలోచించి పాంచాలదేశీయుడైన ధృష్టద్యుమ్నుని అస్త్రవిద్యాబ్యాసానికై తన ఇంటికే తీసికొనివచ్చాడు. తనపేరును నిలుపుకొనటానికై ద్రోణుడు ఆ విధంగా వ్యవహరించాడు. (55,56)
(బ్రాహ్మణ ఉవాచ)
శ్రుత్వా జతుగృహే వృత్తం బ్రాహ్మణాః సపురోహితాః ।
పాంచాలరాజం ద్రుపదమ్ ఇదం వచనమబ్రువన్ ॥
ధార్తరాష్ట్రాః సహామాత్యాః మంత్రయిత్వా పరస్పరమ్ ।
పాండవానాం వినాశాయ మతిం చక్రుః సుదుష్కరామ్ ॥
దుర్యోధనేన ప్రహితః పురోచన ఇతి శ్రుతః ।
వారణావతమాసాద్య కృత్వా జతుగృహం మహత్ ॥
తస్మిన్ గృహే సువిశ్వస్తాన్ పాండవాన్ పృథయా సహ ॥
అర్థరాత్రే మహారాజః దగ్ధవాన్ స పురోచనః ॥
అగ్నినా తు స్వయమపి దగ్ధః క్షుద్రో నృశంసకృత్ ।
ఏతత్ శ్రుత్వా సుసంహృష్టః ధృతరాష్ట్రః సబాంధవః ॥
శ్రుత్వా తు పాండవాన్ దగ్ధాన్ ధృతరాష్రోఽం బికాసుతః ।
ఏతావదుక్త్వా కరుణం ధృతరాష్ట్రస్తు మారిషః ॥
అల్పశోకః ప్రహృష్టాత్మా శశాస విదురం తదా ।
పాండవానాం మహాప్రాజ్ఞ కురు పిండోదకక్రియామ్ ॥
అద్య పాండుర్హతః క్షత్తః పాండవానాం వినాశనే ।
తస్మాత్ భాగీరథీం గత్వా కురు పిండోదకక్రియామ్ ॥
అహో విధివశాదేవ గతాస్తే యమసాదనమ్ ।
ఇత్యుక్త్వా ప్రారుదత్ తత్ర ధృతరాష్ట్రః ససౌబలః ।
శ్రుత్వా భీష్మేణ విధివత్ కృతవానౌర్ధ్వదేహికమ్ ।
పాండవానాం వినాశాయ కృతం కర్మ దురాత్మనా ॥
ఏతత్ కార్యస్య కర్తా తు న దృష్టః న శ్రుతః పురా ।
ఏతత్ వృత్తం మహారాజః పాండవాన్ ప్రతి నః శ్రుతమ్ ॥
శ్రుత్వా తు వచనం తేషాం యజ్ఞసేనో మహామతిః ।
యథా తజ్జనకః శోచేత్ ఔరసస్య వినాశనే ।
తథాతప్యత పాంచాలః పాండవానాం వినాశనే ॥
సమాహూయ ప్రకృతయః సహితాః సహ బాంధవైః ।
కారుణ్యాదేవ పాంచాలః ప్రోవాచేదం వచస్తదా ॥
బ్రాహ్మణుడిలా అన్నాడు. లక్క ఇంటిలో జరిగిన వృత్తాంతాన్ని విని బ్రాహ్మణులూ, పురోహితులూ ద్రుపదునితో ఇలా అన్నారు - ధృతరాష్ట్రకుమారులు మంత్రులతో కూడి సంప్రదించుకొని పాండవుల వినాశానికై ఆలోచించారు. దుర్యోధనుడు పంపిన పురోచనుడు వారణావతానికి వెళ్ళి పెద్దలక్క ఇంటిని నిర్మించాడు. ఆ ఇంటిలో నమ్మకంగా నిదురిస్తున్న కుంతినీ, పాండవులనూ నడిరేయి తగులబెట్టాడు. ఆ నీచుడు తాను కూడా ఆ నిప్పులోనే బూడిదయ్యాడు. పాండవులు దగ్ధమయ్యారని విని ఆంబికేయుడయిన ధృతరాష్ట్రుడు సబాంధవంగా పరమానందాన్ని పొందాడు. పైకి మాత్రం కొంత దుఃఖాన్ని ప్రకటిస్తూ విదురుని ఇలా శాసించాడు. మహాప్రాజ్ఞా! పాండవులకు అంత్యక్రియలు జరిపించు. పాండవులంతా చనిపోయినందువల్ల ఇప్పుడు పాండురాజు మరణించి నట్లయినది. గంగా తీరానికి వెళ్ళి పిండప్రదానాది క్రియలు ముగించు. వారు మరణించటం విధిలీల. ఇలా అని ధృతరాష్ట్రుడూ, ఆయనతో పాటు శకునీ రోదించారు. ఇది తెలిసి భీష్ముడు యథావిధిగా పాండవుల అంత్యక్రియలు జరిపించాడు. పాండవ వినాశానికై ఈ దుష్కర్మను జరిపించాడు దుర్యోధనుడు. ఇంత ఘోరకృత్యాన్ని ఇంతకు ముందెవరూ చేయగా చూడలేదు. చేసినట్లు విననూ లేదు. పాండవులను గురించి మేమీరీతిగా విన్నాం. ఆ మాటలు విని యజ్ఞసేనుడు (ద్రుపదుడు) సొంతబిడ్డలు చనిపోతే తండ్రి దుఃఖించినట్లు పాండవుల మరణానికి దుఃఖించాడు. తన బంధువులతోపాటు ప్రజలందరినీ పిలిపించి ఈ విధంగా ప్రకటించాడు.
ద్రుపద ఉవాచ
అహోరూపమహోధైర్యమ్ అహోవీర్యం చ శిక్షితమ్ ।
చింతయామి దివారాత్రమ్ అర్జునం ప్రతి బాంధవాః ॥
భ్రాతృభిః సహితో మాత్రా సోఽదహ్యత హుతాశనే ।
కిమాశ్చర్యమిదం లోకే కాలో హి దురతిక్రమః ॥
మిథ్యాప్రతిజ్ఞో లోకేషు కిం వదిష్యామి సాంప్రతమ్ ।
అంతర్గతేన దుఃఖేన దహ్యమానో దివానిశమ్ ।
యాజోపయాజౌ సత్కృత్య యాచితౌ తౌ మయానఘౌ ॥
భారద్వాజస్య హంతారం దేవీం చాప్యర్జునస్య వై ।
లోకస్తద్వేద యచ్చైవ తథా యాజేన వై శ్రుతమ్ ।
యాజేన పుత్రకామీయం హుత్వా చోత్పాదితావుభౌ ।
ధృష్టద్యుమ్నశ్చ కృష్ణా చ మమ తుష్టికరావుభౌ ॥
కిం కరిష్యామి తే నష్టాః పాండవాః పృథయా సహ ।
ద్రుపదుడిలా అన్నాడు. బంధువులారా! అర్జునుడి రూపం అద్భుతమైనది. ఆయన ధైర్యం ఆశ్చర్యకరం. ఆ పరాక్రమం, ఆ అస్త్రవిద్య అనన్యసామాన్యం. పగలూ, రేయీ ఆయనను గురించియే నా ఆలోచన. ఆ అర్జునుడు తల్లితో సహా అగ్నికి ఆహుతయ్యాడు. లోకంలో ఇంతకన్నా ఆశ్చర్యమేముంది? కాలాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు. నా ప్రతిజ్ఞ వ్యర్థమైంది. లోకులకు ఏం చెప్పగలను? పగలూ, రేయీ నాలో నేనే కుమిలిపోతున్నాను. నేను అనఘలయిన యాజోసయాజులను అర్చించి ద్రోణుని చంపగల కొడుకును, అర్జునుని పట్టమహిషి కాగల కూతురును కోరాను. లోకులందరికీ అది తెలుసు. స్వయంగా యాజమహర్షి కూడా దానిని ప్రకటించాడు. యాజుడు పుత్రకామేష్టి చేసి ధృష్టద్యుమ్నునీ, కృష్టను కలిగించాడు. వారి పుట్టుక నాఖు ఆనందదాయకమే కానీ ఇప్పుడేమి చేయగలను? ఆ అర్జునుడు మరణించాడు.
బ్రాహ్మణ ఉవాచ
ఇత్యేవముక్త్వా పాంచాలః శుశోచ పరమాతురః ।
దృష్ట్వా శోచంతమత్యర్థం పాంచాలగురురబ్రవీత్ ।
పురోధాః సత్వసంపన్నః సమ్యక్ విద్యావిశేషవాన్ ॥
బ్రాహ్మణుడిలా అన్నాడు. ఆ విధంగా పలికి ద్రుపదుడు దుఃఖించి, రోదించాడు. అది చూచి సత్త్వసంపన్నుడూ, విద్యావిశేషవేత్తా అయిన పంచాలరాజపురోహితుడు ఇలా అన్ణాడు.
గురు రువాచ
వృద్ధానుశాసనే సక్తాః పాండవా ధర్మచారిణః ।
తాదృశా న వినశ్యంతి నైవ యాంతి పరాభవమ్ ॥
మయా దృష్టమిదం సత్యం శృణుష్వ మనుజాధిప ।
బ్రాహ్మణైః కథితం సత్యం వేదేషు చ మయా శ్రుతమ్ ॥
బృహస్పతిముఖేనాథ పౌలోమ్యా చ పురా శ్రుతమ్ ।
నష్ట ఇంద్రో బిస గ్రంథ్యా ఉపశ్రుత్యా తు దర్శితః ॥
ఉపశ్రుతిః మహారాజ పాండవార్థే మయా శ్రుతా ।
యత్ర వా తత్ర జీవంతి పాండవాస్తే న సంశయః ॥
గురువు ఇలా అన్నాడు. మహారాజా! పాండవులు పెద్దలమాటను మన్నించేవారూ, ధర్మాత్ములు. అటువంటి వారు నశించరు. పరాజితులూ కారు. నరేశ్వరా! నేను గ్రహించిన సత్యాన్ని ఆలకించండి. బ్రాహ్మణులు ఈ సత్యాన్ని ప్రతిపాదించారు. వేదమంత్రాలలో కూడా నేను దానిని విన్నాను. గతంలో ఇంద్రాణి బృహస్పతిద్వారా ఉపశ్రుతి మహిమను విన్నది. ఆ ఉపశ్రుతి అదృశ్యుడైపోయిన ఇంద్రుని తామరతూటిముడిలో దర్శింపజేసింది. ఈ విధంగా పాండవుల విషయంలో కూడా నేను ఉపశ్రుతిని విన్నాను. వారు ఎక్కడో ఒక చోట జీవించియే ఉంటారు. అనుమానం లేదు.
మయా దృష్టాని లింగాని ధ్రువమేష్యంతి పాండవాః ॥
యన్నిమిత్త మిహాయాంతి తచ్ఛృణుష్వ నరాధిప ॥
స్వయంవరః క్షత్రియాణాం కన్యాదానే ప్రదర్శితః ।
స్వయవరస్తు నగరే ఘుష్యతాం రాజసత్తమ ॥
యత్ర వా నివసంతస్తే పాండవాః పృథయా సహ ।
దూరస్థా వా సమీపస్థాః స్వర్గస్ధా వాపి పాండవాః ॥
శ్రుత్వా స్వయంవరం రాజన్ సమేష్యంతి న సంశయః ।
తస్మాత్ స్వయంవరో రాజన్ ఘుష్యతాం మాచిరం కృథాః ॥
పాండవులు తప్పక తిరిగి వచ్చే సూచనలు నాకు కనిపిస్తున్నాయి-కారణం చెపుతాను విను. క్షత్రియులకు స్వయంవరమే కన్యాదానానికి శ్రేష్ఠమైన మార్గమని చెప్పబడుతుంది. అందుచేత రాజా! నగరంలో స్వయంవరం చాటించు. దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, స్వర్గస్థులయినా, ఎక్కడ ఉన్నాసరే కుంతీ సహితంగా పాండవులు స్వయంవరం విని తప్పక వస్తారు. ఆలస్యం చేయక స్వయంవరం ప్రకటించు.
బ్రాహ్మణ ఉవాచ
శ్రుత్వా పురోహితేనోక్తం పాంచాలః ప్రీతిమాన్ తదా ।
ఘొషయామాస నగరే ద్రౌపద్యాస్తు స్వయంవరమ్ ॥
పుష్యమాసే తు రోహిణ్యాం శుక్లపక్షే శుభే తిథౌ ।
దివసైః పంచసప్తత్యా భవిష్యతి స్వయంవరః ॥
దేవగంధర్వయక్షాశ్చ ఋషయశ్చ తపోధనాః ।
స్వయంవరం ద్రష్ఠుకామాః గచ్ఛంత్యేవ న సంశయః ॥
తవ పుత్రా మహాత్మానః దర్శనీయా విశేషతః ।
యదృచ్ఛయా తు పాంచాలీ గచ్ఛేత్ వా మధ్యమం పతిమ్ ॥
కో హి జానాతి లోకేషు ప్రజాపతివిధిం పరమ్ ।
తస్మాత్ సపుత్రా గచ్ఛేథా బ్రాహ్మణ్యై యది రోచతే ॥
నిత్యకాలం సుభిక్షాస్తే పంచాలాస్తు తపోధనే ।
యజ్ఞసేనస్తు రాజాసౌ బ్రహ్మణ్యః సత్యసంగరః ॥
బ్రహ్మణ్యా నాగరాశ్చాథ బ్రాహ్మణాశ్చాతిథిప్రియాః ।
నిత్యకాలం ప్రదాస్యంతి ఆమంత్రణమయాచితమ్ ॥
అహం చ తత్ర గచ్ఛామి మమైభిః సహశిష్యకైః ।
ఏకసార్థాః ప్రయాతాః స్మ బ్రాహ్మణ్యై యది రోచతే ॥
బ్రాహ్మణుడిలా అన్నాడు. పురోహితుని మాటలు విని ద్రుపదుడు పరమానందపడ్డాడు. ఆయన నగరంలో ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటించాడు. పుష్యమాసంలో, శుక్లపక్షంలో ఏకాదశినాడు రోహిణీ నక్షత్రంలో ఆ స్వయంవరం జరుగుతుంది. ఇక డెబ్బది అయిదు రోజులున్నది. కుంతీ! దేవతలు, గంధర్వులు, యక్షులు, తపస్సంపన్నులయిన ఋషులు అక్కడకు చేరుతారు ఆ స్వయంవరాన్ని చూడాలని. మహాత్ములయిన నీ కొడుకులందరూ చూడచక్కని వారు. వీరిలో ఎవరినైనా పాంచాల రాజపుత్రి వరించవచ్చు. బహుశా అర్జునునే వరించవచ్చు. విధి నిర్ణయాన్ని ఎవ్వరమూ గ్రహింపజాలము గదా! నీకు నా మాట నచ్చితే నీ కుమారులందరితో నీవు అక్కడకు వెళ్ళు. తపోధనా! పంచాలదేశం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది. పంచాలరాజు యజ్ఞసేనుడు సత్యసంధుడూ, బ్రాహ్మణ భక్తుడూ. అక్కడి ప్రజలు కూడా బ్రాహ్మణులపై శ్రద్దాభక్తులు గలవారు. అతిథులను ఆదరించేవారు. ప్రతి దినమూ అడగకపోయినా ఆతిథ్యమిచ్చేవారు. నేను కూడా నా శిష్యులతో కలిసి అక్కడకు వెళ్తున్నాను. నీ కిష్టమయితే మనమంతా కలిసే వెళ్ళవచ్చు.
వైశంపాయన ఉవాచ
ఏతావదుక్త్వా వచనం బ్రాహ్మణో విరరామ హ ।)
వైశంపాయనుడిలా అన్నాడు. ఈ మాటలు చెప్పి ఆ బ్రాహ్మణుడు మిన్నకున్నాడు.
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ద్రౌపదీసంభవే షట్ షష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 166
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను ఉపపర్వమున ద్రౌపదీసంభవమను నూట అరువది ఆరవ అధ్యాయము. (166)
(దాక్షిణాత్య అధిక పాఠము 38 శ్లోకాలతో కలిపి మొత్తం 94 శ్లోకాలు).