167. నూట అరువది ఏడవ అధ్యాయము

పాండవులు కుంతి ద్రుపదపురమునకు బయలుదేరుట.

వైశంపాయన ఉవాచ
ఏతత్ శ్రుత్వా తు కౌంతేయాః బ్రాహ్మణాత్ సంశితవ్రతాత్ ।
సర్వే చాస్వస్థమనసః బభూవుస్తే మహాబలాః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. మహాబలులైన ఆ కౌంతేయులు సంశితవ్రతుడయిన ఆ బ్రాహ్మణుని మాటలు విని చలించిపోయారు. (1)
తతః కుంతీ సుతాన్ దృష్ట్వా సర్వాన్ తద్గతచేతసః ।
యుధిష్ఠిరమువాచేదం వచనం సత్యవాదినీ ॥ 2
సత్యవాదిని అయిన కుంతి తన పుత్రులందరూ ద్రౌపదిపై మనస్సు పడినట్టు గమనించి, యుధిష్ఠిరునితో ఇలా అన్నది. (2)
కుంత్యువాచ
చిరరాత్రోషితాః స్మేహ బ్రాహ్మణస్య నివేశనే ।
రమమాణాః పురే రమ్యే లబ్ధభైక్షాః మహాత్మనః ॥ 3
కుంతి ఇలా అన్నది - అందమైన ఈ నగరంలో మహాత్ముడైన ఈ బ్రాహ్మణుని ఇంటిలో ఇక్కడ చాలా రోజుల నుండి ఆనందంగా ఉంటున్నాము. భిక్ష కూడా లభిస్తోంది. (3)
యానీహ రమణీయాని వనాన్యుపవనాని చ ।
సర్వాణి తాని దృష్ణాని పునః పునరరిందమ ॥ 4
అరిందమా! ఇక్కడున్న అందమైన వనాలనూ, ఉద్యానవనాలనూ అన్నింటినీ చాలా సార్లు చూచాము. (4)
పునర్ ద్రష్టుం హి తానీహ ప్రీణయంతి న నస్తథా ।
భైక్షం చ న తథా వీర లభ్యతే కురునందన ॥ 5
మరల వాటినే చూడాలంటే మనస్సు కు నచ్చదు. కురుకుమారా! వీరా! భిక్ష కూడా అంతకు ముందువలె దొరకకపోవచ్చు. (5)
తే వయం సాధు పంచాలాన్ గచ్చామ యది మన్యసే ।
అపూర్వదర్శనం వీర రమణీయం భవిష్యతి ॥ 6
కాబట్టి నీకిష్టమయితే మనమంతా పంచాలదేశానికి వెళదాం. వీరా! క్రొత్తప్రదేశాలను చూడటం ఆనందదాయకమవుతుంది. (6)
సుభిక్షాశ్చైవ పంచాలాః శ్రూయంతే శత్రుకర్శన ।
యజ్ఞసేనశ్చ రాజాసౌ బ్రహ్మణ్య ఇతి శుశ్రుమ ॥ 7
శత్రుకర్శనా! పంచాల దేశస్థులు చక్కని భిక్షపెట్టగల వాఱని కూడా వింటున్నాం. యజ్ఞసేన మహారాజు కూడా బ్రాహ్మణుల పట్ల మంచిగా ప్రవర్తిస్తాడని విని ఉన్నాం. (7)
ఏకత్ర చిరవాసశ్చ క్షమో న చ మతో మమ ।
తే తత్ర సాధు గచ్చామః యది త్వం పుత్ర మన్యసే ॥ 8
ఒకేతావున ఎక్కువ కాలముండటం మంచిది కాదని నాకనిపిస్తోంది. కాబట్టి కుమారా! నీకు కూడా ఇష్టమయితే హాయిగా అక్కడకు వెళదాం. (8)
యుధిష్ఠిర ఉవాచ
భవత్యాః యన్మతం కార్యం తదస్మాకం పరం హితమ్ ।
అనుజాంస్తు న జానామి గచ్ఛేయుర్నేతి వా పునః ॥ 9
యుధిష్ఠిరుడిలా అన్నాడు. నీకిష్టమయినదే మాకు హితకరమయినది. తమ్ముళ్ళు వెళదామంటారో లేదో తెలియదు. (9)
వైశంపాయన ఉవాచ
తతః కుంతీ భీమసేనమ్ అర్జునం యమజౌ తథా ।
ఉవాచ గమనం తే చ తధేత్యేవాబ్రువంస్తదా ॥ 10
వైశంపాయనుడిలా అన్నాడు. అప్పుడు కుంతి బీమార్జునులతో నకులసహదేవులతో, ప్రయాణాన్ని గురించి ప్రస్తావించింది. వారు కూడా 'అలాగే' అని అంగీకరించారు. (10)
తత ఆమంత్య్ర తం విప్రం కుంతీ రాజన్ సుతైః సహ ।
ప్రతస్థే నగరీం రమ్యాం ద్రుపదస్య మహాత్మనః ॥ 11
రాజా! ఆపై కుంతి తమకు ఆశ్రయమిచ్చిన బ్రాహ్మణుని వద్ద వీడ్కోలు తీసుకొని, మహాత్ముడయిన ద్రుపదుని రమణీయనగరానికి కొడుకులతో పాటు బయలుదేరింది. (11)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి పంచాలదేశయాత్రాయాం సప్తషష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥167॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను ఉపపర్వమున పంచాలదేశయాత్ర అను నూట అరువదియేడవ అధ్యాయము. (167)