168. నూట అరువది ఎనిమిదవ అధ్యాయము

ద్రౌపది పూర్వజన్మవృత్తాంతమును వ్యాసుడు చెప్పుట.

వైశంపాయన ఉవాచ
వసత్సు తేషు ప్రచ్ఛన్నం పాండవేషు మహాత్మసు ।
ఆజాగామాథ తాన్ ద్రష్టుం వ్యాసః సత్యవతీసుతః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. మహాత్ములైన పాండవులు గూఢంగా నివసిస్తూ ఉండగా సాత్యవతేయుడయిన వ్యాసుడు వారిని చూడటానికి వచ్చాడు. (1)
తమాగతమభిప్రేక్ష్య ప్రత్యుద్గమ్య పరంతపాః ।
ప్రణిపత్యాభివాద్యైనం తస్థుః ప్రాంజలయస్తదా ॥ 2
సమనుజ్ఞాప్య తాన్ సర్వాన్ ఆసీనాన్ మునిరబ్రవీత్ ।
ప్రచ్ఛన్నం పూజితః పార్థైః ప్రీతిపూర్వమిదం వచః ॥ 3
అప్పుడు పరంతపులయిన పాండవులు తమ చెంతకు వచ్చిన వ్యాసుని చూసి, ఎదురేగి నమస్కారపురస్సరంగా పలుకరించి, చేతులు జోడించి, నిలిచారు. పాండవులచే ప్రచ్ఛన్నంగా పూజింపబడిన వ్యాసుడు వారినందరినీ కూర్చొనమని ఆదేశించి, వారు కూర్చున్న తరువాత ప్రీతిపూర్వకంగా ఇలా పలికాడు (2,3)
అపి ధర్మేణ వర్తేధ్వం శాస్త్రేణ చ పరంతపాః ।
అపి విప్రేషు పూజా వః పూజార్హేషు న హీయతే ॥ 4
పరంతపులారా! మీరు శాస్త్రవిధి ననుసరించి ధర్మానుసారంగా ప్రవర్తిస్తున్నారు. గదా! పూజింపదగిన బ్రాహ్మణుల పూజలలో లోపం చేయటం లేదుగదా! (4)
అథ ధర్మార్థవత్ వాక్యమ్ ఉక్త్వా సః భగవాన్ ఋషిః ।
విచిత్రాశ్చ కథాస్తాస్తాః పునరేవేదమబ్రవీత్ ॥ 5
ఆ తరువాత వ్యాసభగవానుడు ధర్మార్థయుక్తమైన విషయాలు చెప్పాడు. విచిత్రకథలను ఎన్నో చెప్పాడు. మరలా ఇలా అన్నాడు. (5)
వ్యాస ఉవాచ
ఆసీత్ తపోవనే కాచిత్ ఋషేః కన్యా మహాత్మనః ।
విలగ్నమధ్యా సుశ్రోణీ సుభ్రూః సర్వగుణాన్వితా ॥ 6
వ్యాసుడిలా అంటున్నాడు. ఒకానొక తపోవనంలో మహాత్ముడైన ఒక ఋషికి ఒక కూతురుండేది. ఆమె సన్నని నడుము, అందమైన కటి, కనుబొమలు గలిగి సమస్త సద్గుణాలతో కూడినది. (6)
కర్మభిః స్వకృతైః సా తు దుర్భగా సమపద్యత ।
నాధ్యగచ్ఛత్ పతిం సా తు కన్యా రూపవతీ సతీ ॥ 7
తన పురాకృతకర్మల వలన ఆమె దౌర్భాగ్యానికి లోనయినది. రూపవతి, సత్ప్రర్తన గలదీ అయినా ఆమెకు వివాహం కాలేదు. (7)
తత స్తప్తుమథారేభే పత్యర్థమసుఖా తతః ।
తోషయామాస తపసా సా కిలోగ్రేణ శంకరమ్ ॥ 8
ఆపై పెళ్ళి కాలేదన్న దుఃఖంతో ఆమె భర్తకోసం తపస్సుచేయ నారంభించింది. తీవ్రమయిన తపస్సుతో శంకరుని మెప్పించింది. (8)
తస్యాః స భగవాన్ తుష్టః తామువాచ యశస్వినీమ్ ।
వరం వరయ భద్రం తే వరదోఽస్మీతి శంకరః ॥ 9
ఆమె తపస్సునకు సంతోషించిన ఆ శంకరుడు "నీకు మేలు జరుగుతుంది. వరాన్ని కోరుకో. నీకు వరమిస్తాను" అని ఆ యశస్వినితో అన్నాడు. (9)
అథేశ్వరమువాచేదం ఆత్మనః సా వచో హితమ్ ।
పతిం సర్వగుణోపేతమ్ ఇచ్ఛామీతి పునః పునః ॥ 10
అప్పుడు ఆమె తనకు హితకరమైన మాటగా "సర్వగుణాలతో కూడి ఉన్న భర్త నాకు కావాలి" అని చాలా సార్లు ఈశ్వరునితో పలికింది. (10)
తామథ ప్రత్యువాచేదమ్ ఈశానో వదతాం వరః ।
పంచ తే పతయో భద్రే భవిష్యం తీతి భారతాః ॥ 11
భరతవంశస్థులారా! వాగ్మి అయిన ఈశ్వరుడు "కళ్యాణీ! నీకు అయిదుగురు భర్తలు లభిస్తారు" అని ఆమెతో అన్నాడు. (11)
ఏవముక్తా తతః కన్యా దేవం వరదమబ్రవీత్ ।
ఏకమిచ్ఛామ్యహం దేవ త్వత్ప్రసాదాత్ పతిం ప్రభో ॥ 12
ఈశ్వరుడు ఆ రీతిగా పలుకగా ఆమె "ప్రభూ! నీ అనుగ్రహం వలన నేను ఒక్కభర్తనే కోరుతున్నాను" అని వరదుడైన ఆ శివునితో అన్నది. (12)
పునరేవాబ్రవీత్ దేవః ఇదం వచనముత్తమమ్ ।
పంచకృత్వ స్త్వయా హ్యుక్తః పతిం దేహీత్యహం పునః ॥ 13
శివుడు మరలా ఈ మంచిమాట అన్నాడు - నీవు అయిదుసార్లు "భర్తకావాల" ని నాతో అన్నావు. (13)
దేహమన్యం గతాయాస్తే యథోక్తం తత్ భవిష్యతి ।
ద్రుపదస్య కులే జజ్ఞే సా కన్యా దేవరూపిణీ ॥ 14
నీవు దేహాంతరాన్ని పొందినప్పుడు నేను చెప్పినట్లు జరుగుతుంది. దేవరూపిణి అయిన ఆ కన్యయే ద్రుపదుని ఇంట జన్మించింది. (14)
నిర్దిష్టా భవతాం పత్నీ కృష్ణా పార్షత్యనిందితా ।
పాంచాలనగరే తస్మాత్ నివసధ్వం మహాబలాః ॥
సుఖినస్తామనుప్రాప్య భవిష్యథ న సంశయః ॥ 15
పృషతుని మనుమరాలైన ఆ సతి - కృష్ణ - మీకు భార్యగా నిర్ణయింపబడినది. కాబట్టి మహాబలులయిన మీరు పాంచాల నగరంలో నివసించండి. ఆమెను పొంది మీరు సుఖంగా జీవించగలరు. అనుమానం లేదు. (15)
ఏవముక్త్వా మహాభాగః పాండవాన్ స పితామహః ।
పార్థానామంత్య్ర కుంతీం చ ప్రాతిష్ఠత మహాతపాః ॥ 16
మహాతపస్వి, మహానుభావుడైన తాత వ్యాసభగవానుడు ఈ విధంగా పలికి పాండవుల దగ్గర, కుంతి దగ్గర సెలవు తీసికొని వెళ్ళిపోయాడు. (16)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి
ద్రౌపదీ జన్మాంతరకథనమను నూట అరువది యెనిమిదవ అధ్యాయము. (168)