174. నూట డెబ్బది నాల్గవ అధ్యాయము

వసిష్ఠుని క్షమాశక్తి - విశ్వామిత్రుని పరాభవము.

అర్జున ఉవాచ
కిం నిమిత్తమభూత్ వైరం విశ్వామిత్ర వసిష్ఠయోః ।
వసతో రాశ్రమేదివ్యే శంస నః సర్వమేవ తత్ ॥ 1
అర్జునుడిలా అన్నాడు.
తమతమ పవిత్రాశ్రమాలలో నివసించే విశ్వామిత్ర వసిష్ఠులకు ఏ కారణంగా వైరం ఏర్పడింది. అది మాకు సవిస్తరంగా చెప్పు. (1)
గంధర్వ ఉవాచ
ఇదం వాసిష్ఠమాఖ్యానం పురాణం పరిచక్షతే ।
పార్థ సర్వేషు లోకేషు యథావత్ తన్నిబోధ మే ॥ 2
గంధర్వుడిలా అన్నాడు.
అర్జునా! ఈ వాసిష్ఠోపాఖ్యానం సమస్తలోకాలలోనూ చాలా పురాతనమైనదిగా చెప్పబడుతోంది. ఉన్నదున్నట్లు చెపుతా విను. (2)
కాణ్యకుబ్జే మహానాసీత్ పార్థివో భరతర్షభ ।
గాధీతి విశ్రుతో లోకే కుశికస్యాత్మసంభవః ॥3
భరతర్షబా! కాన్యకుబ్జంలో గొప్ప రాజుండేవాడు. గాధి అన్న పేరుతో అతడు లోకవిఖ్యాతుడు. ఆయన కుశికుని కొడుకు. (3)
తస్య ధర్మాత్మనః పుత్రః సమృద్ధబలవాహనః ।
విశ్వామిత్ర ఇతి ఖ్యాతః బభూవ రిపుమర్దనః ॥ 4
ధర్మస్వరూపుడైన ఆయనకు ఒక కొడుకు. పేరు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు సేన, వాహనాలు మిక్కిలిగా కలిగి శత్రువులను అణచివేసేవాడు. (4)
స చచార సహామాత్యః మృగయాం గహనే వనే ।
మృగాన్ విధ్యన్ వరాహాంశ్చ రమ్యేషు మరుధన్వసు ॥ 5
వ్యామామకర్శితః సోఽథ మృగలిప్సుః పిపాసితః ।
ఆజగామ నరశ్రేష్ఠ వసిష్ఠస్యాశ్రమం ప్రతి ॥ 6
తమాగతమభిప్రేక్ష్య వసిష్ఠః శ్రేష్ఠభాగృషిః ।
విశ్వామిత్రం నరశ్రేష్ఠం ప్రతిజగ్రాహ పూజయా ॥ 7
నరోత్తమా! ఒకమారు అమాత్యులతో కలిసి ఆ విశ్వామిత్రుడు కీకారణ్యంలో వేటాడుతున్నాడు. మరుప్రదేశంలోని అందమైన వనాలలో మృగాలను, వరాహాలను వేటాడుతూ ఒక మృగాన్ని వెంటాడి, అలసిపోయి, దప్పికగొని వసిష్ఠాశ్రమానికి వచ్చాడు. గొప్పవారిని సమర్చించగల ఆ వసిష్ఠ మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన ఆ నరోత్తముని - విశ్వామిత్రుని - సత్కరించి ఆతిథ్యాన్ని అందుకోవటానికి ఆహ్వానించాడు. (5-7)
పాద్యార్ఘ్యాచమనీయైస్తం స్వాగతేన చ భారత ।
తథైవ పరిజగ్రాహ వన్యేన హవిషా తదా ॥ 8
భారతా! అర్ఘ్య, పాద్య, ఆచమనీయ స్వాగతవాక్యాలతోనూ, అరణ్యకమైన హవిస్సుతోనూ విశ్వామిత్రుని సత్కరించాడు. (8)
తస్యాథ కామధుగ్ధేనుః వసిష్ఠస్య మహాత్మనః ।
ఉక్తా కామాన్ ప్రయచ్ఛేతి సా కామాన్ దుహ్యతే సదా ॥ 9
మహాత్ముడైన వసిష్ఠునకు కోరికల తీర్చగల ఒక ఆవు ఉన్నది. "ఇది కావాలి" అంటే ఆ ఆవు ఎప్పుడైనా ఆ కోరిక తీర్చుతుంది. (9)
గ్రామ్యారణ్యాశ్చౌషధీశ్చ దుదుహే పయ ఏవ చ ।
షడ్రసం చామృతనిభం రసాయనమనుత్తమమ్ ॥ 10
భోజనీయాని పేయాని భక్ష్యాణి వివిధాని చ ।
లేహ్యాన్యమృతకల్పాని చోష్యాణి చ తథార్జున ॥ 11
రత్నాని చ మహార్హాణి వాసాంసి వివిధాని చ ।
తైః కామైః సర్వసంపూర్ణైః పూజితశ్చ మహీపతిః ॥ 12
అర్జునా! ఆ ఆవు గ్రామీణుల అన్నాన్ని, ఆటవికుల ఫలమూలాలను, పాలనూ, షడ్రసోపేత భోజనాలను, అమృత మధురాలయిన ఉత్తమపానీయాలను వివిధభక్ష్యాలను, లేహ్యాలను, అమృతాయమానాలయిన చోష్యాలను (పచ్చడి పులుసు మొదలగునవి), విలువయిన రత్నాలను, వివిధ వస్త్రాలను ఆ కామధేనువు అందజేసింది. సర్వవిధాలా సంపూర్ణమైన ఆ పదార్థాలతో విశ్వామిత్రుని పూజించాడు. వసిష్ఠుడు. (10-12)
సామాత్యః సబలశ్చైవ తుతోష స భృశం తదా ।
షడున్నతాం సుపార్శ్వోరుం పృథు పంచ సమావృతామ్ ॥ 13
అప్పుడు ఆ విశ్వామిత్రుడు, ఆయన అమాత్యులు, పరివారం అందరూ చాలా తృప్తిపడ్డారు.
ఆ కామధేనువు తల, మెడ, పిక్కలు, గంగడోలు, తోక, పొదుగు ఉన్నతమైనవి. దాని ప్రక్కలు, తొడలు అందమైనవి. లలాటం, కళ్ళు, చెవులు విశాలమైనవి. (13)
మండూకనేత్రాం స్వాకారం పీనోధసమనిందితామ్ ।
సువాలధిం శంకుకర్ణాం చారుశృంగాం మనోరమామ్ ॥ 14
కప్పలవంటి కళ్ళు, మంచిరూపం, నిర్దుష్టమైన పెద్దపొదుగు,అందమైన తోక, శంకుల వంటి చెవులు, అందమైన కొమ్ములు గలిగి మనోరమంగా ఉంది. (14)
పుష్టాయతశిరోగ్రీవాం విస్మితః సోఽభివీక్ష్య తామ్ ।
అభినంద్య స తాం రాజా నందినీం గాధినందనః ॥ 15
బలిష్ఠాలై, విశాలంగా ఉన్న దాని శిరస్సును మెడను చూచి ఆశ్చర్యపడిన ఆ విశ్వామిత్రుడు ఆ ఆవును-నందినిని-అభినందించాడు. (15)
అబ్రవీచ్చ భృశం తుష్టః స రాజా తమృషిం తదా ।
అర్బుదేవ గనాం బ్రహ్మన్ మమ రాజ్యేన వా పునః ॥ 16
నందినీం సంప్రయచ్ఛస్వ భుంక్ష్వ రాజ్యం మహామునే ।
పరమానందపడిన ఆ రాజు అప్పుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. బ్రహ్మర్షీ! తమకు పదికోట్ల ఆవులను ఇస్తాను. లేదా నా రాజ్యాన్నే ఇస్తాను. నందినిని నా కిచ్చి రాజ్యాన్ని అనుభవించండి. (16 1/2)
వసిష్ఠ ఉవాచ
దేవతాతిథి పిత్రర్థం యాజ్యార్థం చ పయస్వినీ ॥ 17
అదేయా నందినీయం వై రాజ్యేనాపి తవానఘ ।
వసిష్ఠుడిలా అన్నాడు.
అనఘా! ఈ నందిని దేవ, అతిథి, పితృ కార్యాలను నిర్వహించటానికి యాగహవిస్సుగా వినియోగించటానికి పాలనిస్తూ ఇక్కడున్నది, నీ రాజ్యమంతా ఇచ్చినా నందినిని ఇవ్వలేను. (17 1/2)
విశ్వామిత్ర ఉవాచ
క్షత్రియో-హం భవాన్ విప్రః తపస్స్వాధ్యాయసాధనః ॥ 18
విశ్వామిత్రుడిలా అన్నాడు.
నేను క్షత్రియుడను. తమరు తపస్సును, స్వాధ్యాయాన్ని సాధనచేసే విప్రులు. (18)
బ్రాహ్మణేషు కుతో వీర్యం ప్రశాంతేషు ధృతాత్మసు ।
అర్బుదేన గవాం యస్త్వం న దదాసి మమేప్సితమ్ ॥ 19
స్వధర్మం న ప్రహ్యాస్యామి నేష్యామి చ బలేన గామ్ ।
(క్షత్రియోఽస్మిన విప్రోహం బాహువీర్యోఽస్మి ధర్మతః ।
తస్మాద్ భుజబలేనేమాం హరిష్యామీహ పశ్యతః ॥)
బ్రాహ్మణులు ప్రశాంతచిత్తులు, జితేంద్రియులును, అటువంటి మీలో పరాక్రమానికి అవకాశమేది? నేను కోటి ఆవులను ఇస్తానన్నా నందినిని నాకివ్వనంటున్నారు. నా ధర్మాన్ని నేను విడువను. బలపూర్వకంగా ఆవును కొనిపోతాను. నేను క్షత్రియుడనే కానీ బ్రాహ్మణుడను కాను. ధర్మానుసారంగానే నేను బాహుపరాక్రమాన్ని ప్రదర్శించవచ్చు. కాబట్టి తమరు చూస్తూండగానే భుజబలంతో దీనిని కొనిపోతాను. (19 1/2)
వసిష్ఠ ఉవాచ
బలస్థశ్చాసి రాజా చ బాహువీర్యశ్చ క్షత్రియః ॥ 20
యథేచ్ఛసి తథాక్షిప్రం కురు మా త్వం విచారయ ।
వసిష్ఠుడిలా అన్నాడు.
నీవు క్షత్రియుడవు. బాహుపరాక్రమం గలవాడవు. సైన్యం కూడా నీ వెంట ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టు వెంటనే చేయవచ్చు. ఆలోచించనవసరం లేదు. (20 1/2)
గంధర్వ ఉవాచ
ఏవముక్త స్తథా పార్థ విశ్వామిత్రో బలాదివ ॥ 21
హంసచంద్రప్రతీకాశాం నందినీం తాం జహార గామ్ ।
కశాదండప్రణుదితాం కాల్యమానామితస్తతః ॥ 22
గంధర్వుడిలా అన్నాడు.
అర్జునా! వసిష్ఠుడలా అనగానే విశ్వామిత్రుడు హంసవలె, చంద్రునివలె తెల్లగా ఉన్న ఆ నందినీధేనువును కొరడాలతో, కర్రలతో కొడుతూ ఇటు అదిలిస్తూ బలవంతంగా అపహరించాడు. (21,22)
హంభాయమానా కల్యాణీ వాసిష్ఠస్యాథ నందినీ ।
ఆగమ్యాభిముఖీ పార్థ తస్థౌ భగవదున్ముఖీ ॥ 23
భృశం చ తాడ్యమానా వై న జగామాశ్రమాత్ తతః ।
అర్జునా! అప్పుడు కళ్యాణప్రద అయిన ఆ వసిష్ఠుని నందిని బెదురుతూ వచ్చి వసిష్ఠుని ఎదుట నిలబడింది ఆయనవైపే చూస్తూ. పిమ్మట విశ్వామిత్రుడు ఎంత కొట్టినా అది ఆశ్రమం నుండి కదలలేదు. (23 1/2)
వసిష్ఠ ఉవాచ
శృణోమి తే రవం భద్రే వినదంత్యాః పునః పునః ॥ 24
హ్రియసే త్వం బలాద్భద్రే విశ్వామిత్రేణ నందిని ।
కిం కర్తవ్యం మయా తత్ర క్షమావాన్ బ్రాహ్మణోఽహ్యహమ్ ॥ 25
వసిష్ఠుడిలా అన్నాడు.
అమ్మా! మాటిమాటికీ నీవు చేస్తున్న ఆర్తనాదాలను వింటూనే ఉన్నాను. విశ్వామిత్రుడు నిన్ను బలవంతంగా కొనిపోతున్నాడు. నందినీ నేనేమి చేయగలను. సహనశీలుడనయిన బ్రాహ్మణుడను నేను. (24,25)
గంధర్వ ఉవాచ
సా భయాన్నందినీ తేషాం బలానాం భరతర్షభ ।
విశ్వామిత్ర భయోద్విగ్నా వసిష్ఠం సముపాగమత్ ॥ 26
గంధర్వుడిలా అన్నాడు.
భరతశ్రేష్ఠా! నందిని విశ్వామిత్రుని చూచి ఉద్వేగానికి లోనైంది. ఆయన సేనను చూచి భయపడి వసిష్ఠుని దగ్గరకు వచ్చింది. (26)
గౌరువాచ
కశాగ్రదండాభిహతాం క్రోశంతీం మామనాథవత్ ।
విశ్వామిత్ర బలైర్ఘోరైః భగవన్ కిముపేక్షసే ॥ 27
గోవు ఇలా అన్నది.
స్వామీ! విశ్వామిత్రుని సేనలు నన్ను కొరడాలతో, కర్రలతో తీవ్రంగా కొడుతున్నారు. దిక్కులేని దాననైనేను ఆక్రోశిస్తున్నాను. మీరెందుకు ఉపేక్షిస్తున్నారు? (27)
గంధర్వ ఉవాచ
నందిన్యామేవం క్రందంత్యాం ధర్షితాయాం మహామునిః ।
న చక్షుభే తదా ధైర్యాత్ న చచాల ధృతవ్రతః ॥ 28
గంధర్వుడిలా అన్నాడు.
నందిని ఈ విధంగా పరాభవింపబడి ఆక్రోశిస్తున్నా ధృతవ్రతుడయిన ఆ వసిష్ఠమహర్షి కలత పడలేదు. ధైర్యాన్ని కోలిపోలేదు. (28)
వసిష్ఠ ఉవాచ
క్షత్రియాణాం బలం తేజః బ్రాహ్మణానాం క్షమా బలమ్ ।
క్షమా మాం భజతే యస్మాద్ గమ్యతాం యది రోచతే ॥ 29
వసిష్ఠుడిలా అన్నాడు.
క్షత్రియులకు తేజస్సు బలం. బ్రాహ్మణులకు సహనమే బలం. క్షమ నన్ను ఆశ్రయించింది. కాబట్టి నీకిష్టమయితే వెళ్ళవచ్చు. (29)
నందిన్యువాచ
కిం ను త్యక్తాస్మి భగవన్ యదేవం త్వం ప్రభాషసే ।
అత్యక్తాహం త్వయా బ్రహ్మన్ నేతుం శక్యా న వై బలాత్ ॥ 30
నందిని ఇలా అన్నది.
స్వామీ! నన్ను మీరు త్యాగం చేశారా? ఇలా అంటున్నారేమిటి? బ్రహ్మర్షీ! మీరు నన్ను త్యాగం చేయకుంటే బలపూర్వకంగా నన్నెవ్వరూ కొనిపోలేదు. (30)
వసిష్ఠ ఉవాచ
న త్వాం త్యజామి కల్యాణి స్థీయతాం యది శక్యతే ।
దృఢేన దామ్నా బద్ధ్వైషః వత్సస్తే హ్రియతే బలాత్ ॥ 31
వసిష్ఠుడిలా అన్నాడు.
కళ్యాణి! నేను నిన్ను విడుచుట లేదు. శక్తి ఉంటే ఇక్కడే నిలు. నీ దూడను గట్టిత్రాళ్ళతో కట్టి బలపూర్వకంగా తీసుకొనిపోతున్నారు. (31)
గంధర్వ ఉవాచ
స్థీయతామితి తచ్ఛ్రుత్వా వసిష్ఠస్య పయస్వినీ ।
ఊర్ధ్వాంచిత శిరోగ్రీవా ప్రబభౌ రౌద్రదర్శనా ॥ 32
గంధర్వుడిలా అన్నాడు.
'నిలు' అన్న వసిష్ఠుని మాట విని ఆ నందిని తలను మెడను పైకి చాపి భయంకరంగా కనిపించింది. (32)
క్రోధరక్తేక్షణా సా గౌః హంభారవఘనస్వనా ।
విశ్వామిత్రస్య తత్సైన్యం వ్యద్రావయత సర్వశః ॥ 33
ఆ నందిని కోపంతో కళ్ళెర్రజేసి పెద్ద పెద్దగా అంబారవాలు చేస్తూ విశ్వామిత్రుని సేననంతా నాలుగు దిక్కులకూ పారద్రోలింది. (33)
కశాగ్రదండాభిహతా కాల్యమానా తతస్తతః ।
క్రోధరక్తేక్షణా క్రోధః భూయ ఏవ సమాదదే ॥ 34
అంతకు ముందే కొరడాలతో కర్రలతో కొట్టినందువలనా, అటు ఇటు అదిలించటం వలన కోపంతో కన్నెర్రజేసిన ఆ నందిని ఇంకా కోపాన్ని తెచ్చుకొంది. (34)
ఆదిత్య ఇవ మధ్యాహ్నే క్రోధదీప్తవపుర్బభౌ ।
అంగారవర్షం ముంచంతీ ముహుర్వాలధితో మహత్ ॥ 35
అసృజత్ పహ్లవాన్ పుచ్ఛాత్ ప్రస్రవాద్ ద్రవిడాన్ శకాన్ ।
యోనిదేశాచ్చ యవనాన్ శకృతః శబరాన్ బహూన్ ॥ 36
మధ్యాహ్నకాలపు సూర్యునివలె కోపంతో దాని శరీరం ప్రజ్వరిల్లింది. తోక నుండి మాటిమాటికి నిప్పులవాన కురిపిస్తూ తోకనుండి పహ్లవులను, పొదుగునుండి ద్రవిడులను, శకులను, యోని ప్రదేశం నుండి యవనులను, గుదం నుండి ఎంతో మంది శబరులను వెలువరించింది. (35,36)
మూత్రతశ్చాసృజత్ కాంశ్చిత్ శబరాంశ్చైవ పార్శ్వతః ।
పౌండ్రాన్ కిరాతాన్ యవనాన్ సింహలాన్ బర్బరాన్ ఖసాన్ ॥ 37
మూత్రం నుండి కొందరు శబరులను, ప్రక్కల నుండి పౌండ్రులను, కిరాతులను, యవనులను, సింహళులను, బర్బరులను, ఖసులను సృష్ఠించింది. (37)
చిబుకాంశ్చ పులిందాంశ్చ చీనాన్ హూణాన్ స కేరళాన్ ।
ససర్జ ఫేనతః సా గౌః మ్లేచ్ఛాన్ బహువిధానపి ॥ 38
ఆగ్నేయం వారుణం చైంద్రం యామ్యం వాయవ్యమేవ చ ।
విససర్జ మహాభాగే వసిష్ఠే బ్రహ్మణః సుతే ॥
అస్త్రాణి సర్వతో జ్వాలాం విసృజంతి ప్రపదిరే ।
యుగాంతసమయే ఘోరాః పతంగస్యేవ రశ్మయః ॥
వసిష్ఠో-పి మహాతేజాః బ్రహ్మశక్తిప్రయుక్తయా ।
యష్ట్యా నివారయామాస సర్వాణ్యస్త్రాణి స స్మయన్ ॥
తతస్తే భస్మసాద్భూతాః పతంతి స్మ మహీతలే ।
అపోహ్య దివ్యాన్యస్త్రాణి వసిష్ఠో వాక్యమబ్రవీత్ ॥
అదిచూచి విశ్వామిత్రుడు క్రోధావిష్టుడై మునిశ్రేష్ఠుడైన వసిష్ఠుని లక్ష్యంగా చేసి నేలపైనా నింగిపైనా బాణవర్షం కురిపించాడు. అయితే ఆ విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోరనారాచాలను, క్షురాలను, భల్లాలను వెదురుకర్రతో నివారించాడు వసిష్ఠుడు. యుద్ధంలో ఆ వసిష్ఠుని కార్యకౌశలాన్ని చూచి విశ్వామిత్రుడు మరల కుపితుడై వసిష్ఠమహర్షిపై కోపంతో దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. ఆగ్నేయ, వారుణ, ఇంద్ర, యామ్యాస్త్రాలను మహానుభావుడు, బ్రహ్మసుతుడైన వసిష్ఠునిపై ప్రయోగించాడు విశ్వామిత్రుడు.
అవి ప్రళయకాలంలోని సూర్యుని తీక్ష్ణ జ్వాలలవలె అన్ని దిక్కులా మంటలను క్రక్కుతూ వసిష్ఠుని సమీపించాయి. మహాతేజస్వి అయిన వసిష్ఠుడు బ్రాహ్మబలంతో ప్రేరేపించిన బ్రహ్మదండంతో ఆ అస్త్రాల నన్నింటినీ నవ్వుతూ నివారించాడు. అప్పుడవన్నీ బూడిదై నేలగూలాయి. ఆ దివ్యాస్త్రాల నన్నింటినీ తప్పించి వసిష్ఠుడిలా అన్నాడు.
వసిష్ఠ ఉవాచ
నిర్జితోఽసి మహారాజ దురాత్మన్ గాధినందన ।
యదితేఽస్తి పరం శౌర్యం తద్దర్శయ మయి స్థితే ॥
వసిష్ఠుడిలా అన్నాడు.
గాధికుమారా! మహారాజా! దుర్మార్గుడా! ఓడిపోయావు. ఇంకా నీకు శక్తి ఉంటే నేను నిలిచే ఉన్నాను. నాపై చూపించు.
గంధర్వ ఉవాచ
విశ్వామిత్రస్తథా చోక్తః వసిష్ఠేన నరాధిప ।
నోవాచ కించిద్ వ్రీడాఢ్యః విద్రావితమహాబలః ॥)
గంధర్వుడిలా అన్నాడు.
రాజా! వసిష్ఠుడలా అనగానే విశ్వామిత్రుడు సిగ్గుపడి ఏమీ అనలేకపోయాడు. ఆయన సేన అంతా పారిపోయింది.
దృష్ట్వా తన్మహదాశ్చర్యం బ్రహ్మతేజోభవే తదా ॥ 44
విశ్వామిత్రః క్షత్రభావాద్ నిర్విణ్ణో వాక్యమబ్రవీత్ ।
ధిగ్ బలం క్షత్రియ బలం బ్రహ్మతేజోబలం బలమ్ ॥ 45
అప్పుడు బ్రహ్మతేజస్సు నుండి కల్గిన ఆ ఆశ్చరకర సన్నివేశాన్ని చూచి విశ్వామిత్రుడు తాను క్షత్రియుడనైనందుకు బాధపడి ఇలా అన్నాడు. క్షత్రియ బలం నిరుపయోగం, బ్రహ్మతేజోబలమే బలం. (44,45)
బలాబలం వినిశ్చిత్య తప ఏవ పరం బలమ్ ।
స రాజ్యం స్ఫీతముత్సృజ్య తాం చ దీప్తాం నృపశ్రియమ్ ॥ 46
భోగాంశ్చ పృష్ఠతః కృత్వా తపస్యేవ మనోదధే ।
స గత్వా తపసా సిద్ధిం లోకాన్ విష్టభ్య తేజసా ॥ 47
తతాప సర్వాన్ దీప్తౌజాః బ్రాహ్మణత్వమవాప్తవాన్ ।
అపిబచ్చ తతః సోమమ్ ఇంద్రేణ సహ కౌశికః ॥ 48
బలాబలాను పరిశీలించి తపోబలమే మిన్న అని నిర్ణయించుకొన్నాడు. విశ్వామిత్రుడు.
విశాల సామ్రాజ్యాన్ని, రాజ్యశ్రీని వీడి వైభోగాలనన్నింటిని కాదని తపస్సు మీదనే మనస్సును లగ్నం చేశాడు. వెళ్లి తపస్సు చేసి ఆ తపస్సులో సిద్ధిని పొంది, తన తేజస్సుతో లోకాలను స్తంభింపజేసి తపింపజేశాడు. కడకు తేజస్వియై బ్రాహ్మణత్వాన్ని పొందాడు. తర్వాత ఇంద్రునితో కలిసి సోమపానం చేశాడు. (46-48)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి వాసిష్ఠే విశ్వామిత్రపరాభవే చతుఃసప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥174॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను ఉపపర్వమున
వసిష్ఠోపాఖ్యానమున విశ్వామిత్రపరాభవమను నూట డెబ్బది నాల్గవ అధ్యాయము. (174)
(దాక్షిణాత్య అధికపాఠము 10 శ్లోకములు కలిపి మొత్తం 58 శ్లోకములు)