175. నూట డెబ్బది అయిదవ అధ్యాయము

విశ్వామిత్రుని ప్రోత్సాహము - కల్మాషపాదుడు వసిష్ఠపుత్రులను భక్షించుట.

గంధర్వ ఉవాచ
కల్మాషపాద ఇత్యేవం లోకే రాజా బభూవ హ ।
ఇక్ష్వాకువంశజః పార్థ తేజసా సదృశో భువి ॥ 1
గంధర్వుడిలా అన్నాడు.
అర్జునా! ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజు ఒకడుండేవాడు. కల్మాషపాదుడు అన్న పేరుతో ఆయన లోక ప్రసిద్ధుడు. సాటిలేని తేజస్సు గలవాడు. (1)
స కదాచిద్వనం రాజా మృగయాం నిర్యయౌ పురాత్ ।
మృగాన్ విధ్యన్ వరాహాంశ్చ చచార రిపుమర్దనః ॥ 2
ఒకసారి ఆ రాజు వేటకై నగరం నుండి వెళ్ళాడు. శత్రుసంహర్త అయిన ఆయన జింకలను, వరాహాలను వేటాడుతూ సంచరించసాగాడు. (2)
తస్మిన్ వనే మహాఘోరే ఖడ్గాంశ్చ బహుశోఽహనత్ ।
హత్వా చ సుచిరం శ్రాంతః రాజా నివవృతే తతః ॥ 3
మహాభీకరమయిన ఆ అరణ్యంలో ఖడ్గమృగాలను కూడా చాలా సంహరించాడు. ఎంతోసేపు వేటాడి అలసిపోయిన ఆ రాజు నగరానికి మరలాడు. (3)
అకామయత్ తం యాజ్యార్థే విశ్వామిత్రః ప్రతాపవాన్ ।
స తు రాజా మహాత్మానం వాసిష్ఠమ్ ఋషిసత్తమమ్ ॥ 4
తృషార్తశ్చ క్షుధార్తశ్చ ఏకాయనగతః పథి ।
అపశ్యదజితః సంఖ్యే మునిం ప్రతిముఖాగతం ॥ 5
ప్రతాపశాలి అయిన విశ్వామిత్రుడు ఆ కల్మాషపాదుని తన యజమానుని చేసికోవాలని అనుకొన్నాడు. యుద్ధంలో ఓటమి నెరుగని ఆ రాజు ఆనాడు ఆకలిదప్పులచే పీడింపబడి, ఒక ఇరుకు బాటలో నడుస్తూ ఒక మునిని చూచాడు ఆయన ఋషి శ్రేష్ఠుడు, వసిష్ఠమహర్షి కొడుకు. (4,5)
శక్తిం నామ మహాభాగం వసిష్ఠకులవర్థనం ।
జ్యేష్ఠం పుత్రం పుత్రశతాద్ వసిష్ఠస్య మహాత్మనః ॥ 6
ఆయన మహాత్ముడైన వసిష్ఠుని నూరుగురు కొడుకులలో పెద్దవాడు. వసిష్ఠ వంశ వర్థకుడైన ఆ మహానుభావుని పేరు శక్తి. (6)
అపగచ్ఛ పథోఽస్మాకమ్ ఇత్యేవం పార్థివోఽబ్రవీత్ ।
తథా ఋషిరువాచైనం సాంత్వయన్ శ్లక్ష్ణయా గిరా ॥ 7
ఆయనను చూచి రాజు 'నా బాట నుండి తప్పుకో' అని అన్నాడు. అప్పుడు శక్తి మధుర వాక్కులతో ఇలా అన్నాడు. (7)
మమ పంథా మహారాజ ధర్మ ఏష సనాతనః ।
రాజ్ఞా సర్వేషు ధర్మేషు దేయః పంథా ద్విజాతయే ॥ 8
మహారాజా! దారిని నా కివ్వాలి. ఇది సనాతన ధర్మం. ఏ ధర్మం ప్రకారం చూచినా రాజే బ్రాహ్మణునకు దారినివ్వాలి. (8)
ఏవం పరస్పరం తౌ తే పథోఽర్థం వాక్యమూచతుః ।
అపసర్పాపసర్పేతి వాగుత్తరమకుర్వతామ్ ॥ 9
ఈ ప్రకారం వారిద్దరూ బాటకోసం 'నీవు తప్పుకో' 'నీవు తప్పుకో' అని పరస్పరం వాగ్యుద్ధం చేస్తూ పలుకసాగారు (9)
ఋషిస్తు నాపచక్రామ తస్మిన్ ధర్మపథే స్థితః ।
నాపి రాజా మునేర్మానాత్ క్రోధాచ్చాథ జగామ హ ॥ 10
అముంచంతం తు పంథానం తమృషిం నృపసత్తమః ।
జఘాన కశయా మోహాత్ తదా రాక్షసవన్మునిమ్ ॥ 11
ధర్మమార్గానువర్తి అయిన ఆ శక్తిముని దారినివ్వలేదు. రాజు కూడా అభిమానం, కోపం అడ్డుతగిలి మునిబాటనుండి తప్పుకోలేదు.
రాజశ్రేష్ఠుడైన కల్మాషపాదుడు మోహవశుడై రాక్షసునివలె దారివదలని శక్తి మహర్షిని కొరడాతో కొట్టాడు. (10,11)
కశాప్రహారాభిహతః తతః స మునిసత్తమః ।
తం శశాప నృపశ్రేష్ఠం వాసిష్ఠః క్రోధమూర్ఛితః ॥ 12
వసిష్ఠసుతుడై, మునిశ్రేష్ఠుడైన ఆ శక్తి కొరడా దెబ్బతిని కోపంతో ఆ రాజశ్రేష్ఠుని శపించాడు. (12)
హంసి రాక్షసవద్యస్మాత్ రాజాపసద తాపసమ్ ।
తస్మాత్ త్వమద్యప్రభృతి పురుషాదో భవిష్యసి ॥ 13
మనుష్య పిశితే సక్తః చరిష్యసి మహీమిమామ్ ।
గచ్ఛ రాజాధమేత్యుక్తః శక్తినా వీర్యశక్తినా ॥ 14
తపశ్శక్తి సంపన్నుడైన ఆ శక్తిముని రాజునిలా శపించాడు - రాజా రాక్షసునివలె తాపసుని కొట్టావు. కాబట్టి ఇప్పటి నుండి నీవు రాక్షసుడి వవుతావు. నరమాంసంపై ఆసక్తితో ఈ భూమిపై తిరుగుతుంటావు. రాజాధమా! వెళ్ళు. (13,14)
తతో యాజ్యనిమిత్తే తు విశ్వామిత్రవసిష్ఠయోః ।
వైరమాసీత్ తదా తం హు విశ్వామిత్రోఽన్వపద్యత ॥ 15
ఆ రోజుల్లో యజమానొకొరకై వసిష్ఠ విశ్వామిత్రులలో వైరం సాగుతోంది. ఆ సమయంలో విశ్వామిత్రుడు కల్మాషపాదుని దగ్గరకు వెళ్ళాడు. (15)
తయోర్వివదతోరేవం సమీపముపచక్రమే ।
ఋషి రుగ్రతపాః పార్థ విశ్వామిత్రః ప్రతాపవాన్ ॥ 16
పార్థా! కల్మాషపాదుడూ, తపస్వి అయిన శక్తీ పై రీతిగా వాదన పడుతున్న సమయంలోనే ప్రతాపవంతుడైన విశ్వామిత్రుడు దగ్గరకు వచ్చాడు. (16)
తతః స బుబుధే పశ్చాత్ తమృషిం నృపసత్తమః ।
ఋషేః పుత్రం వసిష్ఠస్య వసిష్ఠమివ తేజసా ॥ 17
శాపాన్ని పొందిన తరువాత రాజోత్తముడు అయిన కల్మాషపాదుడు వసిష్ఠుని వలె తేజోమూర్తి అయిన ఆయనను వసిష్ఠుని కుమారునిగా గ్రహించాడు. (17)
అంతర్ధాయ తదాత్మానం విశ్వామిత్రోఽపి భారత ।
తావుభావతిచక్రామ చికీర్షన్నాత్మనః ప్రియమ్ ॥ 18
భారతా! విశ్వామిత్రుడు అదృశ్యుడై తన మేలు కోసం వారిద్దరినీ అతిక్రమించి పోయాడు. (18)
స తు శప్తస్తదా తేన శక్తినా వై నృపోత్తమః ।
జగామ శరణం శక్తిం ప్రసాదయితుమర్హయన్ ॥ 19
శక్తి ఆ రీతిగా శపించగా ఆ రాజశ్రేష్ఠుడు - కల్మాషపాదుడు - ఆయనను ప్రస్తుతించి అనుగ్రహించవలసినదిగ అభ్యర్థిస్తూ శక్తిమునిని శరణుకోరాడు. (19)
తస్య భావం విదిత్వా స నృపతేః కురుసత్తమ ।
విశ్వామిత్ర స్తతోరక్ష ఆదిదేశ నృపం ప్రతి ॥ 20
కురుసత్తమా! ఆ మహారాజు భావాన్ని గ్రహించి విశ్వామిత్రుడు ఆ రాజులో ప్రవేశించ వలసినదిగ ఒక రాక్షసుని ఆదేశించాడు. (20)
శాపాత్తస్యతు విప్రర్షేః విశ్వామిత్రస్య చాజ్ఞయా ।
రాక్షసః కింకరో నామ వివేశ నృపతిం తదా ॥ 21
బ్రహ్మర్షిశాపం కారణంగా విశ్వామిత్రుని ఆదేశం మేరకు కింకరుడనే రాక్షసుడు అప్పుడు ఆ రాజులో ప్రవేశించాడు. (21)
రక్షసా తం గృహీతం తు విదిత్వా మునిసత్తమః ।
విశ్వామిత్రో ప్యపాక్రామత్ తస్మాద్ధేశాదరిందమ ॥ 22
అరిందమా! మహర్షి శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు కల్మాషపాదునిలో రాక్షసుడు ప్రవేశించాడని గ్రహించి ఆ తావు నుండి నిష్క్రమించాడు. (22)
తతః స నృపతిస్తేన రక్షసాంతర్గతేన వై ।
బలవత్పీడితః పార్థ నాన్వబుద్ధ్యత కించన ॥ 23
అర్జునా! అప్పుడు కల్మాషపాదునిలో ప్రవేశించిన రాక్షసుడు ఆయనను కలవరపరచాడు. ఆ రాజుకు ఏమీ తెలియటం లేదు. (23)
దదర్శాథ ద్విజః కశ్చిద్ రాజానం ప్రస్థితం వనమ్ ।
అయాచత క్షుథాపన్నః సమాంసం భోజనం తదా ॥ 24
ఒకనాడు ఒకానొక బ్రాహ్మణుడు ఆకలిగొని, అరణ్యం వైపు వెళ్తున్న కల్మాషపాదుని చూచి మాంససహితంగా భోజనం కావాలని అభ్యర్థించాడు. (24)
తమువాచాథ రాజర్షిః ద్విజం మిత్రసహస్తదా ।
ఆస్స్ప బ్రహ్మం స్త్వమత్రైవ ముహూర్తం ప్రతిపాలయన్ ॥ 25
అప్పుడు రాజర్షి అయిన మిత్రసహుడు (కల్మాషపాదుడు) బ్రాహ్మణునితో ఇలా అన్నాడు -
బ్రాహ్మణా! ఇక్కడే కూర్చో, రెండు గడియలు నిరీక్షించు. (25)
నివృత్తః ప్రతిదాస్యామి భోజనం తే యథేప్సితమ్ ।
ఇత్యుక్త్వా ప్రయయౌ రాజా తస్థౌ చ ద్విజసత్తమః ॥ 26
నేను మరలివచ్చి నీవు కోరిన భోజనాన్ని అందజేస్తాను. ఆ మాట చెప్పి కల్మాషపాదుడు వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు అక్కడే నిలిచాడు. (26)
తతో రాజా పరిక్రమ్య యథాకామం యథాసుఖమ్ ।
నివృత్తోఽంతః పురం పార్థ ప్రవివేశ మహామనాః ॥ 27
అర్జునా! ఆ తరువాత గొప్ప మనస్సు గల కల్మాషపాదుడు సుఖంగా, స్వేచ్ఛగా తిరిగి వచ్చి అంతఃపురంలో ప్రవేశించాడు. (27)
తతోఽర్ధరాత్ర ఉత్థాయ సూదమానాయ్య సత్వరమ్ ।
ఉవాచ రాజా సంస్మృత్య బ్రాహ్మణస్య ప్రతిశ్రుతమ్ ॥ 28
గచ్ఛాముష్మిన్ వనోద్దేశే బ్రాహ్మణో మాం ప్రతీక్షతే ।
అన్నార్థీ తం త్వమన్నేన సమాంసే నోపపాదయ ॥ 29
ఆపై అర్థరాత్రి లెచి బ్రాహ్మణునకిచ్చిన మాఠను తలచుకొని వంటలవానిని పిలిపించి ఇలా అన్నాడు -
'వెళ్ళు! అరణ్యంలో ఈ ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు నా కోసం ఎదురుచూస్తూంటాడు. ఆయనకు అన్నం పెట్టాలి. సమాంసమైన భోజనాన్ని ఆయన కందించు. (28,29)
గంధర్వ ఉవాచ
ఏవముక్తస్తతః సూదః సోఽనాసాద్యామిషం క్వచిత్ ।
నివేదయామాస తదా తస్మై రాజ్ఞే వ్యథాన్వితః ॥ 30
గంధర్వుడిలా అన్నాడు. కల్మాషపాదుడు ఆ రీతిగా ఆదేశించిన తరువాత వంటవాడు మాంసం కోసం వెదకి ఎక్కడా దొరకక బాధపడుతూ ఆ విషయాన్ని రాజునకు తెలియజేశాడు. (30)
రాజా తు రక్షసావిష్ఠః సూదమాహ గతవ్యథః ।
అప్యేనం నరమాంసేన భోజయేతి పునః పునః ॥ 31
రాజుపై రాక్షసావేశమున్నది. అందువలన ఆయన నిశ్చింతగా "అయితే ఆ బ్రాహ్మణునకు నరమాంసాన్నే పెట్టు" అని మాటిమాటికి వంటవానితో అన్నాడు. (31)
తథేత్యుక్త్వా తతః సూదః సంస్థానం వధ్యఘాతినామ్ ।
గత్వా జహార త్వరితో నరమాంసమపేతభీః ॥ 32
అలాగే అని వంటవాడు తలారుల నివాసస్థానానికి పోయి నిర్భయంగా నరమాంసాన్ని తీసికొని త్వరగా వచ్చాడు. (32)
ఏతత్సంస్కృత్య విధివత్ అన్నోపహితమాశు వై ।
తస్మై ప్రాదాద్ బ్రాహ్మణాయ క్షుధితాయ తపస్వినే ॥ 33
దానిని పద్ధతి ప్రకారం వండి అన్నంతో పాటు తీసికొనిపోయి ఆకలి గొన్న ఆ బ్రహ్మర్షికి అందించాడు. (33)
దానిని పద్ధతి ప్రకారం వండి అన్నంతో పాఠు తీసికొనిపోయి ఆకలిగొన్న ఆ బ్రహ్మర్షికి అందించాడు. (33)
స సిద్ధచక్షుషా దృష్ట్వా తదన్నం ద్విజసత్తమః ।
అభోజ్యమిద మిత్యాహ క్రోధపర్యాకులేక్షణః ॥ 34
ఆ ద్విజోత్తముడు దివ్యదృష్టితో ఆ అన్నాన్ని చూచి కోపం నిండిన కళ్ళతో చూస్తూ "ఇది తినరానిది" అని చెప్పాడు. (34)
బ్రాహ్మణ ఉవాచ
యస్మాదభోజ్య మన్నం మే దదాతి స నృపాధమః ।
తస్మాత్ తస్యైవ మూఢస్య భవిష్యత్యత్ర లోలుపా ॥ 35
బ్రాహ్మణుడిలా అన్నాడు. ఆ నృపాధముడు తినటానికి వీలుకాని అన్నాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ మూఢునికే ఇటువంటి అన్నానికై నోరూరుతుంది. (35)
సక్తో మానుషమాంసేషు యథోక్తః శక్తినా తథా ।
ఉద్వేజనీయో భూతానాం చరిష్యతి మహీమిమామ్ ॥ 36
శక్తిముని చెప్పినట్లుగా మానవ మాంసం మీద ఆసక్తిగొని సమస్తప్రాణులకూ భయాన్ని కలిగిస్తూ ఈ భూమిపై తిరుగుతాడు. (36)
ద్విరనువ్యాహృతే రాజ్ఞః స శాపో బలవానభూత్ ।
రక్షోబలసమావిష్టః విసంజ్ఞశ్చాభవన్నృపః ॥ 37
రెండుసార్లు ఒకేవిధంగా శపింపబడటంతో ఆ శాపం బలవత్తరమైంది. ఆ రాజు తనలో రాక్షసబలం ప్రవేశించగా వివేకాన్ని పూర్తిగా కోలుపోయాడు. (37)
తతః స నృపతిశ్రేష్ఠః రక్షసాపహృతేంద్రియః ।
ఉవాచ శక్తిం తం దృష్ట్వా న చిరాదివ భారత ॥ 38
భారతా! ఆ రాజశ్రేష్ఠుని మనస్సును, ఇంద్రియాలను అన్నింటిని రాక్షసుడు లొంగదీసికొన్నాడు. కొద్దిరోజుల తరువాత ఒకనాడు శక్తిముని కనిపించగా కల్మాషపాదుడిలా అన్నాడు. (38)
యస్మాదసదృశః శాపః ప్రయుక్తోయం మయిత్వయా ।
తస్మాత్ త్వత్తః ప్రవర్తిష్యే ఖాదితుం పురుషానహమ్ ॥ 39
నీవు నాకు తగని శాపాన్ని ఇచ్చావు కాబట్టి నరభక్షణాన్ని నేను నీతోనే ప్రారంభిస్తాను. (39)
ఏవముక్త్వా తతః సద్యః తం ప్రాణై ర్విప్రయుజ్య చ ।
శక్తినం భక్షయామాస వ్యాఘ్రః పశుమివేప్సితమ్ ॥ 40
ఆ మాటలు అంటూనే శక్తిముని ప్రాణాలు తీసి పులి తన కిష్టమైన పశువును తిన్నట్టు శక్తిమునిని తినివేశాడు. (40)
శక్తినం తు మృతం దృష్వా విశ్వామిత్రః పునః పునః ।
వసిష్ఠస్యైవ పుత్రేషు తద్రక్షః సందిదేశ హ ॥ 41
శక్తి మరణించటాన్ని గమనించి విశ్వామిత్రుడు వసిష్ఠుని కుమారుల మీదికే ఆ రాక్షసుని రెచ్చగొట్టాడు. (41)
స తాన్ శక్త్యవరాన్ పుత్రాన్ వసిష్ఠస్య మహాత్మనః ।
భక్షయామాస సంక్రుద్ధః సింహః క్షుద్రమృగానివ ॥ 42
రెచ్చిపోయిన ఆ రాక్షసుడు సింహం క్షుద్రమృగాలను తిన్నట్లు తనకన్న బలహీనులైన వసిష్ఠమహాత్ముని కుమారులను తినివేశాడు. (42)
వసిష్ఠో ఘాతితాన్ శ్రుత్వా విశ్వామిత్రేణ తాన్ సుతాన్ ।
ధారయామాస తం శోకం మహాద్రిరివ మేదినీమ్ ॥ 43
విశ్వామిత్రుడు తన కుమారులను చంపించినట్లు విని కూడా వసిష్ఠుడు మేరు పర్వతం భూమిని ధరించినట్టు ఆ శోకాన్ని భరించాడు. (43)
చక్రే చాత్మవినాశాయ బుద్ధిం స మునిసత్తమః ।
న త్వేవ కౌశికోచ్ఛేదం మేనే మతిమతాం వరః ॥ 44
ఆ మునిసత్తముడు దేహత్యాగాన్ని చేయాలని కూడా అనుకొన్నాడు. కానీ కౌశికుని (విశ్వామిత్రుని) నాశనం చేయాలని భావించలేదు. ఆ వసిష్ఠుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. (44)
స మేరుకూటాదాత్మానం ముమోచ భగవానృషిః ।
గిరేస్తస్య శిలాయాం తు తూలరాశావివాపతత్ ॥ 45
పూజ్యుడైన ఆ వసిష్ఠ మహర్షి మేరుపర్వతశిఖరం నుండి పర్వతశిలలపైకి దూకాడు. కాని ఆయన దూదికుప్పపై పడ్డట్లు అయినది. (45)
న మమార చ పాతేన స యదా తేన పాండవ ।
తదాగ్నిమిద్దం భగవాన్ సంవివేశ మహావనే ॥ 46
పాండవా! దూకటం వలన మరణించక పోవటంతో ఆ వసిష్ఠుడు దావాగ్నితో తగులబడుతున్న మహారణ్యంలో ప్రవేశించాడు. (46)
తం తదా సుసమిద్ధోపి న దదాహ హుతాశనః ।
దీప్యమానోఽప్యమిత్రఘ్న శీతోఽగ్నిరభవత్తతః ॥ 47
అరిందమా! ఆ అగ్ని తీవ్రంగా మండుతున్న ఆ వసిష్ఠుని తగులబెట్టలేదు. మండుతున్నా నిప్పు కూడా ఆయనకు చల్లగానే ఉన్నది. (47)
స సముద్రమభిప్రేక్ష్య శోకావిష్టో మహామునిః ।
బద్ధ్వా కంఠే శిలాం గుర్వీం నిపపాత తదాంభసి ॥ 48
ఆపై శోకావిష్టుడైన ఆ ముని సముద్రాన్ని చూచి మెడకు ఒక గండశిలను కట్టుకొని నీటిలోనికి దుమికాడు. (48)
స సముద్రోర్మివేగేన స్థలే న్యస్తో మహామునిః ।
న మమార యదా విప్రః కథంచిత్ సంశితవ్రతః ।
జగామ సతతః ఖిన్నః పునరేవాశ్రమం ప్రతి ॥ 49
సముద్రపుటలల వేగం ఆ మహర్షిని ఒడ్డుకు నెట్టేసింది. దీక్షితుడయిన ఆ బ్రాహ్మణుడు ఏ రీతిగానూ మరణించలేదు. దానితో బాధపడి ఆయన మరలా ఆశ్రమానికే బయలుదేరాడు. (49)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి వాసిష్ఠే వసిష్ఠశోకే పంచసప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 175 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను
వాసిష్ఠోపాఖ్యానమున వసిష్ఠుని శోకమను నూట డెబ్బదిఅయిదవ అధ్యాయము. (175)