181. నూట ఎనుబది ఒకటవ అధ్యాయము

బ్రాహ్మణి ఆంగిరసుని శపించుట.

అర్జున ఉవాచ
రాజ్ఞా కల్మాషపాదేన గురౌ బ్రహ్మవిదాం వరే ।
కారణం కిం పురస్కృత్య భార్యా వై సంనియోజితా ॥ 1
అర్జునుడిలా అడిగాడు.
కల్మాషపాదనరపాలుడు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన తన గురువు - వసిష్ఠునితో ఏ కారణం చేత తన భార్యను నియోగించాడు. (1)
జానతా వై పరం ధర్మం వసిష్ఠేన మహాత్మనా ।
అగమ్యాగమనం కస్మాత్ కృతం తేన మహర్షిణా ॥ 2
మహాత్ముడై ధర్మపారమ్యం తెలిసిన ఆ వసిష్ఠమహర్షి ఏ కారణం చేత అగమ్యాగమనానికి అంగీకరించాడు. (2)
ఆధర్మిష్ఠం వసిష్ఠేన కృతం చాపి పురా సఖే ।
ఏతన్మే సంశయం సర్వం ఛేత్తుమర్హసి పృచ్ఛతః ॥ 3
మిత్రమా! వసిష్ఠుడు గతంలో ఆ అధర్మకార్యానికి ఎలా అంగీకరించాడు. నాకు సందేహం కలిగి అడుగుతున్నాను. దీన్ని తొలగించాలి. (3)
గంధర్వ ఉవాచ
ధనంజయ నిబోధేదం యన్మాం త్వం పరిపృచ్ఛసి ।
వాసిష్ఠం ప్రతి దుర్ధర్ష తదా మిత్రసహం నృపమ్ ॥ 4
గంధర్వుడిలా అన్నాడు.
దుర్ధర్షా! అర్జునా! వసిష్ఠమహర్షివిషయంలో, కల్మాషపాద మహారాజ విషయంలో నీవడిగిన దానికి సమాధానం చెపుతా విను. (4)
కథితం తే మయా సర్వం యథా శప్తః స పార్థివః ।
శక్తినా భరతశ్రేష్ఠ వాసిష్ఠేన మహాత్మనా ॥ 5
భరతశ్రేష్ఠా! వసిష్ఠకుమారుడు, మహాత్ముడూ అయిన శక్తి ఆ రాజును శపించటం మొదలగు విషయమంతా నీకు ముందే చెప్పాను. (5)
స తు శాపవశం ప్రాప్తః క్రోధపర్యాకులేక్షణః ।
నిర్జగామ పురాద్రాజా సహదారః పరంతపః ॥ 6
పరంతపుడైన ఆ రాజు శాపానికి లొంగి కోపంతో కలతపడిన కన్నులతో భార్యతో సహా నగరం నుండి నిష్ర్కమించాడు. (6)
అరణ్యం నిర్జనం గత్వా సదారః పరిచక్రమే ।
నానామృగగణాకీర్ణం నానాసత్త్వసమాకులమ్ ॥ 7
అనేకమృగగణాలతోనూ, వివిధప్రాణిసముదాయాలతోనూ క్రిక్కిరిసి ఉన్న నిర్జనారణ్యంలో భార్యతో సహ ప్రవేశించి సంచరించసాగాడు. (7)
నానాగుల్మలతాచ్ఛన్నం నానాద్రుమసమావృతమ్ ।
అరణ్యం ఘోరసంనాదం శాపగ్రస్తః పరిభ్రమన్ ॥ 8
ఆ అరణ్యం రకరకాల పొదలతో, లతలతో ఆచ్ఛాదింపబడి ఉంది. వివిధ వృక్షజాతులు దానినావరించి ఉన్నాయి. దాని నుండి భయంకర శబ్దాలు వినవస్తుంటాయి. శాపగ్రస్తుడైన కల్మాషరాజు ఆ అరణ్యంలో తిరుగసాగాడు. (8)
స కదాచిత్ క్షుధావిష్టః మృగయన్ భక్ష్యమాత్మనః ।
దదర్శ సుపరిక్లిష్టః కస్మింశ్చిన్నిర్జనే వనే ॥ 9
బ్రాహ్మణం బ్రాహ్మణీం చైవ మిథునాయోపసంగతౌ ।
తౌ తం వీక్ష్య సువిత్రస్తౌ అకృతార్థౌ ప్రధావితౌ ॥ 10
ఆయన ఒకనాడు ఆకలిగొని తనకు తగిన ఆహారాన్ని అన్వేషిస్తూ అలసిపోయిన తర్వాత ఒక నిర్జనవనంలో ఒక బ్రాహ్మణుల జంటను చూచాడు. వారు మైథునానికి ఉపక్రమించి ఉన్నారు. వారు కల్మాషపాదుని చూచి భయపడి వారి కోరిక తీరకముందే పారిపోయారు. (9,10)
తయోః ప్రద్రవతోర్విప్రం జగ్రాహ నృపతిర్బలాత్ ।
దృష్ట్వా గృహీతం భర్తారం అథ బ్రాహ్మణ్యభాషత ॥ 11
వారు పరుగెడుతుంటే ఆ కల్మాషపాదుడు ఆ బ్రాహ్మణుని బలంవంతాన పట్టుకొన్నాడు. భర్తను రాజు పట్టుకోవటం చూచి ఆ బ్రాహ్మణి ఇలా అన్నది. (11)
శృణు రాజన్ మమ వచః యత్త్వం వక్ష్యామి సువ్రత ।
ఆదిత్యవంశప్రభవః త్వం హి లోకే పరిశ్రుతః ॥ 12
సువ్రతా! రాజా! నీవు సూర్యవంశంలో పుట్టినవాడవు. లోక ప్రసిద్ధి గలవాడవు. నేను చెప్పబోయే మాట విను. (12)
అప్రమత్తః స్థితో ధర్మే గురుశుశ్రూషణే రతః ।
శాపోపహత దుర్ధర్ష న పాపం కర్తు మర్హసి ॥ 13
దుర్ధర్షా! శాపోపహతా! నీవు ధర్మాన్ని సావధానంగా పాటించేవాడవు. గురుశుశ్రూషయందు ఆసక్తి గలవాడవు. పాపకర్మలు చేయదగదు. (13)
ఋతుకాలే చ సంప్రాప్తే భర్త్ఱ్ఱ్వ్యసనకర్శితా ।
అకృతార్థా హ్యహం భర్ర్తా ప్రసవార్థం సమాగతా ॥ 14
ప్రసీద నృపతిశ్రేష్ఠ భర్తాయం మే విసృజ్యతామ్ ।
రాజశ్రేష్ఠా! నాకు ఋతుకాలం సమీపించింది. భర్త కష్టాల వలన దుఃఖంలో ఉన్నాను. నేను సంతానార్థినినై భర్త దగ్గరకు వచ్చాను. నా కోరిక ఇంకా తీరలేదు. నాపై ప్రసన్నుడవై నా భర్తను వదిలిపెట్టు. (14 1/2)
ఏవం విక్రోశమానాయాః తస్యాస్తు స నృశంసవత్ ॥ 15
భర్తారం భక్షయామాస వ్యాఘ్రో మృగమివేప్సితమ్ ।
తస్యాః క్రోధాభిభూతాయాః యాన్యశ్రూణ్యపతన్ భువి ॥ 16
సోఽగ్నిః సమభవద్దీప్తః తం చ దేశం వ్యదీపయత్ ।
తతః సా శోకసంతప్తా భర్తృవ్యసనకర్శితా ॥ 17
కల్మాషపాదం రాజర్షిమ్ అశపద్ బ్రాహ్మణీ రుషా ।
యస్మాన్మమాకృతార్థాయాః త్వయా క్షుద్ర నృశంసవత్ ॥ 18
ప్రేక్షంత్యా భక్షితో మేఽద్య ప్రియో భర్తా మహాయశాః ।
తస్మాత్ త్వమపి దుర్బుద్ధే మచ్ఛాపపరివిక్షతః ॥ 19
పత్నీమృతా వనుప్రాప్య సద్యస్త్యక్ష్యసి జీవితమ్ ।
యస్య చర్షేర్వసిష్ఠస్య త్వయా పుత్రా వినాశితాః ॥ 20
తేన సంగమ్య తే భార్యా తనయం జనయిష్యతి ।
స తే వంశకరః పుత్రః భవిష్యతి నృపాధమ ॥ 21
ఆమె ఆ రీతిగా ఆక్రోశిస్తున్నా పులి తాను తినదలచుకొన్న మృగాన్ని తినివేసినట్లు ఆ రాజు ఆమె భర్తను భక్షించాడు. ఆ సమయంలో క్రోధావిష్ట అయిన ఆమె కన్నుల నుండి నీళ్లు కారాయి. అవి మండే అగ్నిగా మారి ఆ ప్రాంతాన్ని దహించాయి. అప్పుడు భర్తృవియోగంతో శోకసంతప్త అయిన ఆమె కోపంతో కల్మాషపాదరాజర్షిని ఇలా శపించింది.
క్షుద్రుడా! నా కోరిక తీరకమునుపే నేను చూస్తుండగానే కీర్తివంతుడయిన నా ప్రియభర్తను భక్షించావు. కాబట్టి దుర్మతీ! నీవు కూడా నా శాపం వలన ఋతుకాలంలో భార్యతో కలిస్తే వెంటనే ప్రాణాలు పోగొట్టుకుంటావు. వసిష్ఠ మహర్షి కుమారులను నీవు నాశనం చేశావు. కాబట్టి నీ భార్య వసిష్ఠునితో సంగమించి కొడుకును కంటుంది. రాజాధమా! ఆ కొడుకే నీ వంశాభివృద్ధికి కారణమవుతాడు. (15-21)
ఏవం శప్త్వాతు రాజానం సా తమాంగిరసీ శుభా ।
తస్వైవ సంనిధౌ దీప్తం ప్రవివేశ హుతాశనమ్ ॥ 22
ఈ విధంగా రాజును శపించి సాధ్వి అయిన ఆ ఆంగిరసి ఆ రాజసన్నిధిలోనే ప్రజ్వలితాగ్నిలో ఆత్మార్పణ చేసింది. (22)
వసిష్ఠశ్చ మహాభాగః సర్వమేతదవైక్షత ।
జ్ఞానయోగేన మహతా తపసా చ పరంతప ॥ 23
పరంతపా! మహాభాగుడైన వసిష్ఠుడు తన మహాతపస్సు చేత ఇదంతా తెలిసికొన్నాడు. (23)
ముక్తశాపశ్చ రాజర్షిః కాలేన మహతా తతః ।
ఋతుకాలేభిపతితః మదయంత్యా నివారితః ॥ 24
ఆపై చాలాకాలం తర్వాత ఆ రాజు శాపాన్ని విస్మరించి ఋతుకాలంలో భార్య దగ్గరకు పోయాడు. ఆమె ఆయనను నివారించింది. (24)
న హి సస్మార స నృపః తం శాపం కామమోహితః ।
దేవ్యాః సోఽథ వచః శ్రుత్వా సంభ్రాంతో నృపసత్తమః ॥ 25
కామమోహితుడయిన ఆ రాజునకు శాపవిషయం గుర్తుకు రాలేదు. మహారాణి మాటలు విని ఆ రాజోత్తముడు కలవరపడ్డాడు. (25)
తం శాపమనుసంస్మృత్య పర్యతప్యద్ భృశం తదా ।
ఏతస్మాత్కారణాద్రాజా వసిష్ఠం సంన్యయోజయత్ ।
స్వదారేషు నరశ్రేష్ఠ శాపదోషసమన్వితః ॥ 26
నరోత్తమా! ఆ శాపాన్ని మాటిమాటికీ తలచుకొని చాలా దుఃఖించాడు. ఈ కారణం వలననే శాపదోషం తగిలిన ఆ కల్మాషపాదమహారాజు తన భార్యతో వసిష్ఠుని నియోగించాడు. (26)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి వసిష్ఠోపాఖ్యానే ఏకాశీత్యధిక శతతమోఽధ్యాయః ॥ 181 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను
ఉపపర్వమున వసిష్ఠోపాఖ్యానమను నూట ఎనుబది ఒకటవ అధ్యాయము. (181)