182. నూట ఎనుబది రెండవ అధ్యాయము

పాండవులు ధౌమ్యుని తమ పురోహితునిగా వరించుట.

అర్జున ఉవాచ
అస్మాక మనురూపో వై యః స్యాద్ గంధర్వ వేదవిత్ ।
పురోహిత స్తమాచక్ష్వ సర్వం హి విదితం తవ ॥ 1
అర్జునుడిలా అన్నాడు.
గంధర్వా! మాకు పురోహితుడుగా నుండదగిన వేద పండితులు ఎవరైనా ఉంటే చెప్పు. నీకంతా తెలుసుగదా! (1)
గంధర్వ ఉవాచ
యవీయాన్ దేవలస్యైషః వనే భ్రాతా తపస్యతి ।
ధౌమ్య ఉత్కోచకే తీర్థే తం వృణుథ్వం యదీచ్ఛథ ॥ 2
గంధర్వుడిలా అన్నాడు.
ఈ వనంలో ఉత్కోచకతీర్థంలో దేవలమహర్షి కనిష్ఠ సోదరుడు ధౌమ్యుడు తపస్సు చేస్తున్నాడు. మీకు నచ్చితే ఆయనను పురోహితుని చేసికోండి. (2)
వైశంపాయన ఉవాచ
తతోఽర్జునోఽస్త్ర మాగ్నేయం ప్రదదౌ తద్యథావిధి ।
గంధర్వాయ తదా ప్రీతః వచనం చేదమబ్రవీత్ ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు.
అప్పుడు అర్జునుడు ప్రీతమనస్కుడై యథావిధిగా ఆగ్నేయాస్త్రాన్ని ఆ గంధర్వునకిచ్చాడు. ఇచ్చి ఈ మాట చెప్పాడు. (3)
త్వయ్యేవ తావత్ తిష్ఠంతు హయా గంధర్వసత్తమ ।
కార్యకాలే గ్రహీష్యామః స్వస్తి తేఽస్త్వితి చాబ్రవీత్ ॥ 4
తేఽన్యోన్యమభిసంపూజ్య గంధర్వః పాండవాశ్చ హ ।
రమ్యాద్ భాగీరథీతీరాద్ యథా కామం ప్రతస్థిరే ॥ 5
గంధర్వోత్తమా! గుఱ్ఱాలను నీ దగ్గరే ఉంచు. అవసరం కలిగినపుడు స్వీకరిస్తాము. నీకు శుభం కలుగుగాక అని అన్నాడు.
ఆ గంధర్వుడు, పాండవులు పరస్పరం పూజించుకొని రమ్యమయిన ఆ భాగీరథీతీరం నుండి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. (4,5)
తత ఉత్కోచకం తీర్థం గత్వా ధౌమ్యాశ్రమం తు తే ।
తం వవ్రుః పాండవా ధౌమ్యం పౌరోహిత్యాయ భారత ॥ 6
భారతా! తరువాత పాండవులు ఉత్కోచక తీర్థంలోని ధౌమ్యుని ఆశ్రమానికి పోయి పురోహితునిగా ఆయనను వరించారు. (6)
తాన్ ధౌమ్యః ప్రతిజగ్రాహ సర్వవేదవిదాం వరః ।
వన్యేన ఫలమూలేన పౌరోహిత్యేన చైవ హ ॥ 7
సర్వవేదవేత్తలలో శ్రేష్ఠుడైన ధౌమ్యుడు వారిని అడవిలో దొరికే ఫలమూలాలతో సత్కరించి పౌరోహిత్యాన్ని అంగీకరించాడు. (7)
తే సమాశంసిరే లబ్ధాం శ్రియం రాజ్యం చ పాండవాః ।
బ్రాహ్మణం తు పురస్కృత్య పాంచాలీం చ స్వయంవరే ॥ 8
ధౌమ్యుని పురోహితునిగా చేసికొన్న తర్వాత రాజ్యం, సంపద అన్నీ పొందినట్లు పాండవులు భావించారు. స్వయంవరంలో పాంచాలి కూడా లభించినట్లే అని కూడా భావించారు. (8)
పురోహితేన తేనాథ గురుణా సంగతాస్తదా ।
నాథవంతమివాత్మానం మేనిరే భరతర్షభాః ॥ 9
భరతశ్రేష్ఠులు ధౌమ్యుని పురోహితునిగా, గురువుగా స్వీకరించి తమను తాము సనాథులనుగా భావించారు. (9)
స హి వేదార్థతత్త్వజ్ఞః తేషాం గురురుదారధీః ।
తేన ధర్మవిదా పార్థాః యాజ్యా ధర్మవిదః కృతాః ॥ 10
పాండవుల పురోహితుడయిన ధౌమ్యుడు వేదార్థతత్త్వం తెలిసినవాడు. ఉదారబుద్ధిగలవాడు. ధర్మజ్ఞుడైన ఆయన ధర్మవేత్తలయిన పాండవులను తన యజమానులను చేసికొన్నాడు. (10)
వీరాంస్తు సహితాన్ మేనే ప్రాప్తరాజ్యాన్ స్వధర్మతః ।
బుద్ధివీర్యబలోత్సాహైః యుక్తాన్ దేవానివ ద్విజః ॥ 11
ధౌమ్యుడు కూడా బుద్ధి, పరాక్రమం, బలం, ఉత్సాహం కలిగి దేవతాసమానులైన ఆ వీరులు స్వధర్మాన్ని ఆశ్రయించి తమ రాజ్యాన్ని పొందగలరని విశ్వసించాడు. (11)
కృతస్వస్త్యయనాస్తేన తతస్తే మనుజాధిపాః ।
మేనిరే సహితా గంతుం పాంచాల్యాస్తం స్వయంవరమ్ ॥ 12
ధౌమ్యుడు పాండవులకు స్వస్తివాచన చేశాడు. ఆపై నరోత్తములయిన ఆ పాండవులు పాంచాలీ స్వయంవరానికి వెళ్లాలని నిశ్చయించుకొన్నారు. (12)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ధౌమ్య పురోహితకరణే ద్వ్యశీత్యధిక శతతమోఽధ్యాయః ॥ 182 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను ఉపపర్వమున ధౌమ్యపురోహితకరణము అను నూట ఎనుబది రెండవ అధ్యాయము. (182)