183. నూట ఎనుబది మూడవ అధ్యాయము
(స్వయంవర పర్వము)
పాండవులు పాంచాలదేశమునకు వెడలుట.
వైశంపాయన ఉవాచ
తతస్తే నరశార్దూలాః భ్రాతరః పంచ పాండవాః ।
ప్రయయుర్ర్దౌపదీం ద్రష్టుం తం చ దేశం మహాత్సవమ్ ॥ 1
వైశంపాయనుడు ఇలా అన్నాడు-
నరోత్తములైన పాండవులు అయిదుగురు సోదరులు ద్రౌపదిని చూడటానికి మహోత్సవభరితమైన పాంచాల దేశానికి బయలుదేరారు. (1)
తే ప్రయతా నరవ్యాఘ్రాః సహ మాత్రా పరంతపాః ।
బ్రాహ్మణాన్ దదృశుర్మార్గే గచ్ఛతః సంగతాన్ బహూన్ ॥ 2
తల్లితో కలిసి ప్రయాణం చేస్తున్న పాండవులు దారిలో చాలామంది బ్రాహ్మణులను చూశారు. (2)
త ఊచుర్ర్బాహ్మణా రాజన్ పాండవాన్ బ్రహ్మచారిణః ।
క్వ భవంతో గమిష్యంతి కుతో వాభ్యాగతా ఇహ ॥ 3
రాజా! బ్రహ్మచారులైన ఆ బ్రాహ్మణులు పాండవులతో "మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎక్కడకు వెళుతున్నారు?, అన్నారు. (3)
యుధిష్ఠిర ఉవాచ
ఆగతానేకచక్రాయాః సోదర్యానేకచారిణః ।
భవంతో హి విజానంతు సహమాత్రా ద్విజర్షభాః ॥ 4
ధర్మరాజు పలికాడు-
"బ్రాహ్మణోత్తములారా! మేము అన్నదమ్ములం. ఏకచక్రపురం నుంచి తల్లిని వెంటబెట్టుకొని వస్తున్నాం. మీ సమాచారం చెప్పండి." (4)
బ్రాహ్మణా ఊచుః
గచ్ఛతాద్వైవ పంచాలాన్ ద్రుపదస్య నివేశనే ।
స్వయంవరో మహాంస్తత్ర భవితా సుమహాధనః ॥ 5
బ్రాహ్మణులు పలికారు-
పాంచాల దేశానికి వెళ్లండి. ద్రుపదమహారాజు భవనంలో సుసంపన్నమైన గొప్పస్వయంవరం జరుగబోతోంది. (5)
ఏకసార్ధం ప్రయాతాః స్మ వయం తత్రైవ గామినః ।
తత్ర హ్యద్భుతసంకాశః భవితా సుమహోత్సవః ॥ 6
అందరం కలిసి వెళదాం. మేమూ అక్కడికే వెళుతున్నాం. అక్కడ అద్భుతమైన గొప్ప ఉత్సవం జరుగబోతోంది. (6)
యజ్ఞసేనస్య దుహితా ద్రుపదస్య మహాత్మనః ।
వేదీమధ్యాత్ సముత్పన్నా పద్మపత్రనిభేక్షణా ॥ 7
తామరరేకుల వంటి కన్నులు కల అమ్మాయి యజ్ఞకుండంలో నుండి యజ్ఞసేనుడైన ద్రుపదుని కుమార్తెగా జన్మించింది. (7)
దర్శనీయానవద్యాంగీ సుకుమారీ మనస్వినీ ।
ధృష్టద్యుమ్నస్య భగినీ ద్రోణశత్రోః ప్రతాపినః ॥ 8
ఆమె చూడచక్కనిది. సుకుమారి. మనస్విని. ద్రోణశత్రువు, ప్రతాపవంతుడు అయిన ధృష్టద్యుమ్నునికి చెల్లెలు. (8)
యో జాతః కవచీ ఖడ్గీ సశరః సశరాసనః ।
సుసమిద్ధే మహాబాహుః పావకే పావకోపమః ॥ 9
మహావీరుడైన ధృష్టద్యుమ్నుడు కూడ కవచం, ఖడ్గం, విల్లు అమ్ములతో అగ్నివలె ప్రకాశిస్తూ యజ్ఞకుండంలో నుండి జన్మించాడు. (9)
స్వసా తస్యానవద్యాంగీ ద్రౌపదీ తనుమధ్యమా ।
నీలోత్పలసమో గంధః యస్యాః క్రోశాత్ ప్రవాతి వై ॥ 10
అతని చెల్లెలు ద్రౌపది. సన్నని నడుము గల సుందరాంగి. ఆమె ఉన్నచోటు నుండి క్రోసెడు దూరం నల్లకలువల సువాసన వ్యాపిస్తుంది. (10)
యజ్ఞసేనస్య చ సుతాం స్వయంవరకృతక్షణామ్ ।
గచ్ఛామో వై వయం ద్రష్టుం తం చ దివ్యం మహోత్సవమ్ ॥ 11
స్వయంవరం ఏర్పాటుచేయబడిన ద్రౌపదిని, ఆ మహోత్సవాన్ని చూడటానికి మేము వెళుతున్నాం. (11)
రాజానో రాజపుత్రాశ్చ యజ్వానో భూరిదక్షిణాః ।
స్వాధ్యాయవంతః శుచయః మహాత్మానో యతవ్రతాః ॥ 12
తరుణా దర్శనీయాశ్చ నానాదేశసమాగతాః ।
మహారథాః కృతాస్త్రాశ్చ సముపైష్యంతి భూమిపాః ॥ 13
రాజులు, రాజపుత్రులు, అధికదక్షిణలిచ్చే యజ్ఞకర్తలు, స్వాధ్యాయపరులు, శౌచం, వ్రతదీక్ష కల మహాత్ములు, చూడచక్కని యువకులు, మహారథులు, మహావీరులు ఎందరో మహారాజులు అక్కడకు వస్తారు. (12,13)
తే తత్ర వివిధాన్ దాయాన్ విజయార్థం నరేశ్వరాః ।
ప్రదాస్యంతి ధనం గాశ్చ భక్ష్యం భోజ్యం చ సర్వశః ॥ 14
ఆ రాజులు విజయంకోసం అనేకవిధాలయిన కానుకలిస్తారు. ధనమూ, ఆవులూ, భక్ష్యభోజ్యాలను అంతటా దానం చేస్తారు. (14)
ప్రతిగృహ్య చ తత్సర్వం దృష్ట్వా చైవ స్వయంవరమ్ ।
అనుభూయోత్సవం చైవ గమిష్యామో యథేప్సితమ్ ॥ 15
ఆ దానాలన్నీ అందుకొని, స్వయంవరాన్ని, ఉత్సవవైభవాన్ని తనివితీరా చూచి వెళదాం. (15)
నటా వైతాళికాస్తత్ర నర్తకాః సూతమాగధాః ।
నియోధకాశ్చ దేశేభ్యః సమేష్యంతి మహాబలాః ॥ 16
అక్కడికి దేశదేశాల నుండి నటులు, వైతాళికులు, నర్తకులు, సూతులు, మాగధులు, బలవంతులైన యోధులు వస్తారు. (16)
ఏవం కౌతూహలం కృత్వా దృష్ట్వా చ ప్రతిగృహ్య చ ।
సహాస్మాభిర్మహాత్మానః పునః ప్రతినివర్త్స్యథ ॥ 17
ఈ విధంగా ఆసక్తికరమైన వానిని చూచి, చేసి, దానాలు పుచ్చుకొని మహాత్ములయిన మీరు మాతో కలిసి తిరిగిరావచ్చు. (17)
దర్శనీయాంశ్చ వః సర్వాన్ దేవరూపానవస్థితాన్ ।
సమీక్ష్య కృష్ణా వరయేత్ సంగత్యైకతమం వరమ్ ॥ 18
మీరు అయిదుగురు అందంగా దేవతలవలె ఉన్నారు. మిమ్మల్ని చూచి ద్రౌపది వరిస్తుంది. ఈడూ జోడూ బాగుంటుంది. (18)
అయం భ్రాతా త్వ శ్రీమాన్ దర్శనీయో మహాభుజః ।
నియుజ్యమానో విజయే సంగత్యా ద్రవిణం బహు ।
ఆహరిష్యన్నయం నూనం ప్రీతం వో వర్ధయిష్యతి ॥ 19
నీ ఈ తమ్ముడు (అర్జునుడు) కళగా, అందంగా, మహావీరుడుగా ఉన్నాడు. ఇతనిని స్వయంవరానికి పంపిస్తే వివాహంతోపాటు గొప్పసంపదను తీసుకొని వచ్చి మీకు తప్పకుండా సంతోషాన్ని కలిగిస్తాడు. (19)
యుధిష్ఠిర ఉవాచ
పరమం బో గమిష్యామః ద్రష్టుం చైవ మహోత్సవమ్ ।
భవద్భిః సహితాః సర్వే కన్యాయాస్తం స్వయంవరమ్ ॥ 20
ధర్మరాజు అన్నాడు-
బ్రాహ్మణులారా! ఆ కన్యాస్వయంవరమహోత్సవాన్ని చూడటానికి మనం అందరం కలసివెళదాం. (20)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి పాండవాగమనే త్ర్యశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 183 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున స్వయంవరపర్వమను
ఉపపర్వమున పాండవాగమనమను నూట ఎనుబది మూడవ అధ్యాయము. (183)