186. నూట ఎనుబది ఆరవ అధ్యాయము
స్వయంవరాగతులైన రాజులు లక్ష్యమును భేదింపలేక పోవుట.
వైశంపాయన ఉవాచ
తేఽలంకృతాః కుండలినో యువానః
పరస్పరం స్పర్ధమానా నరేంద్రాః ।
అస్త్రం బలం చాత్మని మన్యమానాః
సర్వే సముత్పేతు రుదాయుధాస్తే ॥ 1
రూపేణ వీర్యేణ కులేన చైవ
శీలేన విత్తేన చ యౌవనేన ।
సమిద్ధదర్పా మదవేగభిన్నాః
మత్తా యథా హైమవతా గజేంద్రాః ॥ 2
వైశంపాయనుడు ఇలా పలికాడు- ఒకరితో ఒకరు పోటీపడుతూ చక్కగా కుండలాదులతో అలంకరించుకొన్న యువకులైన రాజులందరు ఎవరి అస్త్రబలాన్ని వారు ఊహించుకొంటూ ఆయుధం పట్టి కదిలారు. రూపం, బలం, కులం, శీలం, ధనం, యౌవనం మొదలైన దర్పాలతో రాజులు మంచుకొండల్లోని మదపుటేనుగుల్లాగా రకరకాల నడకలు నడిచారు. (1,2)
పరస్పరం స్పర్ధయా ప్రేక్షమాణాః
సంకల్పజేనాభిపరిప్లుతాంగాః ।
కృష్ణా మమైవేత్యభిభాషమాణాః
నృపాసనేభ్యః సహసోదతిష్ఠన్ ॥ 3
రాజులు ఒకరినొకరు స్పర్ధతో చూసుకొంటూ, మన్మథునికి వశులై, నాదే ద్రౌపది అంటూ, ఒక్కసారిగా సింహాసనాల నుండి లేచి నిలిచారు. (3)
తే క్షత్రియా రంగగతాః సమేతాః
జిగీషమాణా ద్రుపదాత్మజాం తామ్ ।
చకాశిరే పర్వతరాజకన్యామ్
ఉమాం యథా దేవగణాః సమేతాః ॥ 4
ఆ రాజులు ద్రౌపదిని గెలుచుకోవాలని స్వయంవర రంగంలో కలిశారు. వారంతా హిమవత్పుత్రి అయిన పార్వతి కోసం కూడిన దేవగణాల వలె ప్రకాశిస్తున్నారు. (4)
కందర్పబాణాభినిపీడితాంగాః
కృష్ణాగతైస్తే హృదయై ర్నరేంద్రాః ।
రంగావతీర్ణా ద్రుపదాత్మజార్థం
ద్వేషం ప్రచక్రుః సుహృదోఽపి తత్ర ॥ 5
ద్రౌపదినే భావించే మనసులలో మన్మథుని బాణాలతో పీడింపబడుతూ అక్కడకు వచ్చిన రాజులంతా పూర్వం స్నేహితులయినా అక్కడ మాత్రం ఒకరినొకరు ద్వేషించుకోసాగారు. (5)
అథాయయు ర్దేవగణా విమానైః
రుద్రాదిత వసవోఽథాశ్వినౌ చ ।
సాధ్యాశ్చ సర్వే మరుతస్తథైవ
యమం పురస్కృత్య ధనేశ్వరం చ ॥ 6
అంతలోనే విమానాలెక్కి రుద్రులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినీదేవతలు, సాధ్యులు, మరుత్తులు, యముడు, కుబేరుడు అంతా వచ్చారు. (6)
దైత్యాః సుపర్ణాశ్చ మహోరగాశ్చ
దేవర్షయో గుహ్యకా శ్చారణాశ్చ ।
విశ్వావసు ర్నారదపర్వతా చ
గంధర్వముఖ్యాః సహసాప్సరోభిః ॥ 7
దైత్యులు, సుపర్ణులు, ఉరగులు, దేవర్షులు, గుహ్యకులు, చారణులు, విశ్వావసువు, నారదుడు, పర్వతుడు, అప్సరసలతో కలిసి గంధర్వులు మొదలగు వారంతా వచ్చారు. (7)
హలాయుధస్తత్ర జనార్దనశ్చ
వృష్ణ్యంధకాశ్చైవ యథాప్రధానమ్ ।
ప్రేక్షాం స్మ చక్రుర్యదుపుంగవాస్తే
స్థితాశ్చ కృష్ణస్య మతే మహాంతః ॥ 8
బలరాముడు, వృష్ణివీరులు, అంధకవీరులు, యదువీరులు అంతా కృష్ణుని ఇష్టానికి లోబడి ప్రేక్షకపాత్ర వహించి కూర్చుండిపోయారు. విల్లు ఎక్కుపెట్టదలచుకోలేదు. (8)
దృష్ట్వా తు తాన్ మత్తగజేంద్రరూపాన్
పంచాభిపద్మానివ వారణేంద్రాన్ ।
భస్మావృతాంగానివ హవ్యవాహాన్
కృష్ణః ప్రదధ్యౌ యదువీరముఖ్యః ॥ 9
లక్ష్మీదేవికి అభిముఖంగా ఉన్న అయిదు మదపుటేనుగుల్లా, నివురు గప్పిన నిప్పులవలె ఉన్న పాండవులను కృష్ణుడు చూసి గ్రహించాడు. (9)
శశంస రామాయ యుధిష్ఠిరం స
భీమం సజిష్ణుం చ యమౌ చ వీరౌ ।
శనైః శనైస్తాన్ ప్రసమీక్ష్య రామః
జనార్దనం ప్రీతమనా దదర్శ హ ॥ 10
కృష్ణుడు బలరామునికి ధర్మరాజును, భీముని, అర్జునుని, కవలలను మెల్లమెల్లగా వరుసగా చెప్పాడు. బలరాముడు చాలా సంతోషంతో చూస్తూ అలాగే కృష్ణుని వైపు చూశాడు. (10)
అన్యే తు వీరా నృపపుత్రపౌత్రాః
కృష్ణాగతైర్నేత్రమనఃస్వభావైః ।
వ్యాయచ్ఛమానా దదృశుర్న తాన్ వై
సందష్టదంతచ్ఛదతామ్రనేత్రాః ॥ 11
ఇతరరాజులకూ, వారిపుత్రపౌత్రులకూ, ద్రౌపదిపైనే కనులూ, మనస్సులూ, నిలిచిపోయాయి. వారు పెదవులు కొరుకుతూ ఎఱ్రని నేత్రాలు పెద్దవి చేసికొని చూస్తున్నారు కాని పాండవులనూ, రామకృష్ణులనూ చూడనే లేదు. (11)
తథైవ పార్థాః పృథుబహవస్తే
వీరౌ యమౌ చైవ మహానుభావౌ ।
తాం ద్రౌపదీం ప్రేక్ష్య తదాస్మ సర్వే
కందర్పబానాభిహతా బభూవుః ॥ 12
అలాగే దీర్ఘభుజులైన కౌంతేయులూ, మహానుభావులైన కవలలూ ద్రౌపదిని చూసి అందరూ మన్మథబాణాలకు వశమైపోయారు. (12)
దేవర్షి గంధర్వసమాకులం తత్
సుపర్ణనాగాసురసిద్ధజుష్టమ్ ।
దివ్యేన గంధేన సమాకులం చ
దివ్యైశ్చ పుష్పైరవకీర్యమాణమ్ ॥ 13
అపుడు ఆకాశంలో దేవర్షులూ, గంధర్వులూ, సుపర్ణులూ, నాగులూ, అసురులు, సిద్ధులూ ప్రత్యక్షమయ్యారు. దివ్యపుష్పవృష్టి కురిసింది. సభ ఆకాశమూ అంతా పరిమళభరిత మయింది. (13)
మహాస్వనై ర్దుందుభినాదితైశ్చ
బభూవ తత్ సంకులమంతరిక్షమ్ ।
విమానసంబాధమభూత్ సమంతాత్
సవేణు వీణాపణవానునాదమ్ ॥ 14
ఆకాశమంతా దుందుభిధ్వనులతో నిండిపోయింది. విమానాల రద్దీ ఎక్కువైపోయింది. వేణునాదాలు, వీణానాదాలు, పణవనాదాలు మిన్నుముట్టాయి. (14)
తతస్తు తే రాజగణాః క్రమేణ
కృష్ణానిమిత్తం కృతవిక్రమాశ్చ ।
సకర్ణ దుర్యోధన శాల్వ శల్య
ద్రౌణాయని క్రాథ సునీథ వక్రాః ॥ 15
కళింగ వంగాధిప పాండ్య పౌండ్రాః
విదేహరాజో యవనాధిపశ్చ ।
అన్యే చ నానానృప పుత్రపౌత్రాః
రాష్ట్రాధిపాః పంకజపత్రనేత్రాః ॥ 16
కిరీట హారాంగద చక్రవాలైః
విభూషితాంగాః పృథుబాహవస్తే ।
అనుక్రమం విక్రమసత్త్వయుక్తాః
బలేన వీర్యేణ చ నర్దమానాః ॥ 17
తరువాత రాజులంతా ద్రౌపదికోసం తమ బలపరాక్రమాలు ప్రదర్శించారు. వారిలో కర్ణుడు, దుర్యోధనుడు, శాల్వుడు, శల్యుడు, అశ్వత్థామ, క్రాథుడు, సునీథుడు, వక్రుడు, కళింగరాజు, వంగరాజు, పాండ్యరాజు, పౌండ్రదేశాధిపతి, విదేహరాజు, యవనదేశాధిపతి, ఉన్నారు. ఇంకా చాలా మంది రాజుల కొడుకులూ మనుమలూ కూడా ఉన్నారు. వారంతా కిరీటాలు, హారాలు, అంగదాలు ధరించి పద్మనేత్రులై విరాజిల్లుతున్నారు. బలపరాక్రమాలతో మోగిపోతూ, దీర్ఘభుజులై ఉన్నారు. (15-17)
తత్ కార్ముకం సంహననోపపన్నం
సజ్యం న శేకుర్మనసాపి కర్తుమ్ ।
తే విక్రమంతః స్ఫురతా దృఢేన
విక్షిప్యమాణా ధనుషా నరేంద్రాః ॥ 18
విచేష్టమానా ధరణీతలస్థాః
యథాబలం శైక్ష్యగుణక్రమాశ్చ ।
గతౌజసః స్రస్తకిరీటహారాః
వినిఃశ్వసంతః శమయాం బభూవుః ॥ 19
మిగిలిన రాజులు దృఢమైన ఆ ధనస్సును మనసా కూడా ఎక్కుపెట్టలేకపోయారు. కొంతమంది దృఢమైన వింటిని ఎక్కుపెట్టబోయి విసరివేయబడ్డారు. కొందరు చేష్టలుడిగి నేలమీద పడ్డారు. వారి వారి బలాలకూ, శిక్షణలకూ, గుణాలకూ తగినట్లు శక్తులుడిగి కిరీటాలు పడిపోయాయి కొందరికి. మరికొందరికి ఆభరణాలు జారిపడిపోయాయి. ఇంకా కొందరు రొప్పుతూ కిందపడి శాంతించారు. (18,19)
హాహాకృతం తద్ధనుషా దృఢేన
విస్రస్తహారాంగద చక్రవాలమ్ ।
కృష్ణానిమిత్తం వినివృత్తకామమ్
రాజ్ఞాం తదా మండలమార్తమాసీత్ ॥ 20
రాజసమూహమంతా ఆ దృఢమనస్సు చేత హారాలు, అంగదాలు, కేయూరాలు జారిపడిపోయి హాహాకారాలు చేశారు. ద్రౌపదిమీది అభిలాష వదలుకొని అంతా ఆర్తులై మిగిలిపోయారు. (20)
సర్వాన్ నృపాంస్తాన్ ప్రసమీక్ష్య కర్ణః
ధనుర్ధరాణాం ప్రవరో జగామ ।
ఉద్ధృత్య తూర్ణం ధనురుద్యతం తత్
సజ్యం చకారాశు యుయోజ బాణాన్ ॥ 21
ఆ రాజులందరినీ చూసి ధనుర్ధారులతో ఉత్తముడయిన కర్ణుడు లేచి వెళ్లి వెంటనే ఆ ధనస్సును ఎత్తి, ఎక్కు పెట్టి బాణాలు సంధించాడు. (21)
దృష్ట్వా సూతం మేనిరే పాండుపుత్రాః
భిత్త్వా నీతం లక్ష్యవరం ధరాయామ్ ।
ధనుర్ధరా రాగకృతప్రతిజ్ఞమ్
అత్యగ్ని సోమార్క మథార్కపుత్రమ్ ॥ 22
అగ్ని కంటె, చంద్రసూర్యులకంటె తేజస్వి అయిన కర్ణుడు ఆసక్తితో ప్రతిజ్ఞ చేస్తూ లేవడం చూసి ధనుర్ధరులైన పాండవులు "ఇతడు లక్ష్యాన్ని భేదించి నేలకూలుస్తాడు" అని భావించారు. (22)
దృష్ట్వా తు తం ద్రౌపదీ వాక్యముచ్చైః
జగాద నాహం వరయామి సూతమ్ ।
సామర్షహాసం ప్రసమీక్ష్య సూర్యం
తత్యాజ కర్ణః స్ఫురితం ధనుస్తత్ ॥ 23
కర్ణుని చూచి వెంటనే ద్రౌపది పెద్దగా "నేను సూతుని వరించను" అంది. ఇదంతా చూసి కోపంతో నవ్వుతూ సూర్యుని వైపు పైకి చూసి కర్ణుడు వెంటనే వెలుగులు చిమ్మే ఆ ధనస్సు వదిలేశాడు. (23)
ఏవం తేషు నివృత్తేషు క్షత్రియేషు సమంతతః ।
చేదీనామధిపో వీరః బలవానంతకోపమః ॥ 24
దమఘోషసుతో ధీరః శిశుపాలో మహామతిః ।
ధనురాదాయమానస్తు జానుభ్యామగమన్మహీమ్ ॥ 25
ఇలా రాజులంతా వెనుదిరిగారు. అపుడు బలంలో యమునితో సమానుడయిన చేదిరాజు, దమఘోషుని పుత్రుడు, మహామతి అయిన శిశుపాలుడు ధనుస్సు గ్రహించాడు. పట్టుకొంటూనే (ఎత్తలేక) మోకాళ్ల మీద పడిపోయాడు. (24,25)
తతో రాజా మహావీర్యః జరాసంధో మహాబలః ।
ధనుషోభ్యాశమాగత్య తస్థౌ గిరిరివాచలః ॥ 26
తరువాత మహావీరుడూ, బలవంతుడూ అయిన జరాసంధుడు వింటి దగ్గరకు వచ్చి చలించని పర్వతంలా నిలిచాడు. (26)
ధనుషా పీడ్యమానస్తు జానుభ్యామగమన్మహీమ్ ।
తత ఉత్థాయ రాజా స స్వరాష్ట్రాణ్యభిజగ్మివాన్ ॥ 27
అతడు కూడా వింటిచేత పీడితుడై ఎత్తలేక మోకాళ్లమీద పడిపోయాడు. వెంటనే లేచి అతడు తనదేశానికి వెళ్లిపోయాడు. (27)
తతః శల్యో మహావీరః మద్రరాజో మహాబలః
తదప్యారోప్యమాణస్తు జానుభ్యామగమన్మహీమ్ ॥ 28
మద్రరాజు శల్యుడు మహాబలుడు. అతడు కూడ వింటి నెక్కుపెడుతూ మోకాళ్లమీద వాలిపోయాడు. (28)
(తతో దుర్యోధనో రాజా ధార్తరాష్ట్రః పరంతపః ।
మానీ దృఢాస్త్రసంపన్నః సర్వైశ్చ నృపలక్షణైః ॥
ఉత్థితః సహసా తత్ర భ్రాతృమధ్యే మహాబలః ।
విలోక్య ద్రౌపదీం హృష్టః ధనుషోఽభ్యాశమాగమత్ ॥
స బభౌ ధనురాదాయ శక్రశ్చాపధరో యథా ।
ఆరోపయంస్తు తద్రాజా ధనుషా బలినా తదా ॥
ఉత్తానశయ్యమపతద్ అంగుళ్యంతరతాడితః ।
స యయౌ తాడితస్తేన వ్రీడన్నివ నరాధిపః ॥)
తరువాత అభిమానధనుడు దుర్యోధనుడు లేచాడు. అతడు అస్త్రవిద్యాసంపన్నుడు- రాజలక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అతడికి. సోదరుల మధ్యనుండి లేచి ఠీవిగా ద్రౌపదిని చూస్తూ వింటి దగ్గరకు వచ్చాడు. ధనుస్సును గ్రహించి అతడు ధనుస్సుపట్టిన ఇంద్రునిలా ప్రకాశించాడు. అతడు ధనుస్సు ఎత్తి ఎక్కుపెడుతూ వ్రేళ్లమధ్య వింటి నారి దెబ్బతగిలి ఎత్తయిన శయ్యమీద పడిపోయాడు. దెబ్బతిని సిగ్గుపడుతూ దుర్యోధనుడు అక్కడ నుండి నిష్ర్కమించాడు.
తస్మింస్తు సంభ్రాంతజనే సమాజే
విక్షిప్తవాదేషు జనాధిపేషు ।
కుంతీసుతో జిష్ణురియేష కర్తుం
సజ్యం ధనుస్తత్ సశరం ప్రవీరః ॥ 29
ఆ సభలో రాజులు అంతా సంభ్రాంతులైనారు. అపుడు వీరుడయిన అర్జునుడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టేందుకు బయలుదేరాడు. (29)
(తతో వరిష్ఠః సురదానవానామ్
ఉదారధీ ర్వృష్ణికులప్రవీరః ।
జహర్ష రామేణ స పీడ్య హస్తం
హస్తం గతాం పాండుసుతస్య మత్వా ॥
న జజ్ఞురన్యే నృపవీరముఖ్యాః
సంఛన్నరూపానథ పాండుపుత్రాన్ ।)
అపుడు దేవదానవుల్లో శ్రేష్ఠుడూ, వృష్ణివంశోత్తముడూ అయిన కృష్ణుడు బలరాముని చేతిని పట్టి ఊపి సంతోషం వెలిబుచ్చాడు. "ద్రౌపది అర్జునుని చేతికి వచ్చింది" అని వారు సంతోషించారు. ఇతర రాజులు ఎవరు పాండవులు మారువేషాల్లో ఉన్నట్లు గమనించలేదు.
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి రాజపరాఙ్ముఖీభవనే షడశీత్యధిక శతతమోఽధ్యాయః ॥ 186 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున స్వయంవరపర్వమను
ఉపపర్వమున రాజపరాఙ్ముఖీభవనము అను నూట ఎనుబది ఆరవ అధ్యాయము. (186)
(దాక్షిణాత్య అధికపాఠము 5 1/2 శ్లోకములు కలిపి మొత్తం 34 1/2 శ్లోకాలు)