187. నూట ఎనుబది యేడవ అధ్యాయము

అర్జునుడు లక్ష్యమును భేదించి ద్రౌపదిని పొందుట.

వైశంపాయన ఉవాచ
యదా నివృత్తా రాజానః ధనుషః సజ్యకర్మణః ।
అథోదతిష్ఠద్ విప్రాణాం మధ్యాజ్జిష్ణురుదారధీః ॥ 1
వైశంపాయనుడు ఇలా చెపుతున్నాడు. వింటిని ఎక్కుపెట్టలేక రాజులు వెనుదిరిగిన తరువాత బ్రాహ్మణుల మధ్యనుండి ఉదారబుద్ధి కల అర్జునుడు లేచాడు. (1)
ఉదక్రోశన్ విప్రముఖ్యాః విధున్వంతోఽజినాని చ ।
దృష్ట్వా సంప్రస్థితం పార్థమ్ ఇంద్రకేతు సమప్రభమ్ ॥ 2
ఇంద్రధ్వజ సమాన కాంతితో లేచి నిలుచున్న అర్జునుని చూసి బ్రాహ్మణోత్తములు తమతమ కృష్ణాజినాలు ఊపుతూ కోలాహలం చేశారు. (2)
కేచిదాసన్ విమనసః కేచిదాసన్ ముదాన్వితాః ।
ఆహుః పరస్పరం కేచిత్ నిపుణా బుద్ధిజీవినః ॥ 3
కొంతమందికిది నచ్చలేదు. మరికొంతమంది సంతోషించారు. బుద్ధిజీవులయిన నిపుణులు కొందరు ఒకరితో ఒకరు ఏవో చెప్పుకొన్నారు. (3)
యత్కర్ణశల్యప్రముఖైః క్షత్రియైర్లోకవిశ్రుతైః ।
నానతం బలవద్భిర్హి ధనుర్వేదపరాయణైః ॥ 4
తత్కథం త్వకృతాస్త్రేణ ప్రాణతో దుర్బలీయసా ।
వటుమాత్రేణ శక్యం హి సజ్యం కర్తుం ధనుర్ద్విజాః ॥ 5
"లోకప్రసిద్ధులయిన ధనుర్వేత్తలు కర్ణుడు, శల్యుడు మొదలయిన వారు. అంత బలవంతులకే సాధ్యంకాని ఈ వింటి నెక్కుపెట్టడం అస్త్ర విద్యయే తెలియని బలహీనుడయిన బాలవిప్రునికి సాధ్యమా? (4,5)
అవహాస్యా భవిష్యంతి బ్రాహ్మణాః సర్వరాజసు ।
కర్మణ్యస్మిన్నసంసిద్ధే చాపలాదపరీక్షితే ॥ 6
బాల్యచాపల్యంతో పరిశీలించకుండా ఈ పని చేయలేక పోతే రాజులందరిలో బ్రాహ్మణులు అపహాస్యం పాలవుతారు. (6)
యద్యేషదర్పాద్ధర్షాద్ వాప్యథ బ్రాహ్మణచాపలాత్ ।
ప్రస్థితో ధనురాయంతుం వార్యతాం సాధు మా గమత్ ॥ 7
ఇతడు గర్వంతోనో, ఉబలాటంతోనో, బ్రాహ్మణ చాపల్యంతోనో లేచి వింటినెక్కుపెట్టాలనుకొంటున్నాడు. రావద్దని వారిస్తే మంచిది" అన్నారు. (7)
బ్రాహ్మణా ఊచుః
నావహాస్యా భవిష్యామః న చ లాఘవమాస్థితాః ।
న చ విద్విష్టతాం లోకే గమిష్యామో మహీక్షితామ్ ॥ 8
బ్రాహ్మణులు ఇలా అన్నారు- మేము అపహాస్యం పాలు కాము, చిన్నతనం కూడా పొందము. రాజులచే ద్వేషింపబడము. (8)
కేచిదాహుర్యువా శ్రీమాన్ నాగరాజకరోపమః ।
పీనస్కంధోరుబాహుశ్చ ధైర్యేణ హిమవానివ ॥ 9
కొందరు ఇలా అన్నారు. ఇతడు ఏనుగు తొండం వలె బలిసిన ఆజానుబాహువు. ధైర్యంలో హిమవత్పర్వతంలా ఉన్నవాడు. యౌవనసంపద కలవాడు. (9)
సింహఖేలగతిః శ్రీమాన్ మత్తనాగేంద్రవిక్రమః ।
సంభావ్యమస్మిన్ కర్మేదమ్ ఉత్సాహాచ్చానుమీయతే ॥ 10
శుభలక్షణాలున్న ఇతని నడక సింహపునడకలా ఠీవిగా ఉంది. మదించిన ఏనుగు వంటి పరాక్రమం కలవాడు. ఈ పని చేయగలడని అతని ఉత్సాహమే చెపుతోంది. (10)
శక్తిరస్య మహోత్సాహః నహ్యశక్తః స్వయం వ్రజేత్ ।
న చ తద్విద్యతే కించిత్ కర్మ లోకేషుయద్భవేత్ ॥ 11
బ్రాహ్మణానామసాధ్యం చ నృషు సంస్థానచారిషు ।
అబ్భక్షా వాయుభక్షాశ్చ ఫలాహారా దృఢవ్రతాః ॥ 12
దుర్బలా అపి విప్రా హి బలీయాంసః స్వతేజసా ।
బ్రాహ్మణో నావమంతవ్యః సదసద్యా సమాచరన్ ॥ 13
సుఖం దుఃఖం మహద్ద్రస్వం కర్మ యత్సముపాగతమ్ ।
(ధనుర్వేదే చ వేదే చ యోగేషు వివిధేషు చ ।
న తం పశ్యామి మేదిన్యాం బ్రాహ్మణాభ్యధికో భవేత్ ॥
మంత్రయోగబలేనాపి మహతాఽఽత్మబలేన వా ।
జృంభయేయు రమం లోకమ్ అథవా ద్విజసత్తమాః ॥)
జామదగ్న్యేన రామేణ నిర్జితాః క్షత్రియా యుధి ॥ 14
అతని శక్తి ఉత్సాహభరితంగా ఉంది. అశక్తుడయితే స్వయంగా రాడు. సామాన్యంగా లోకంలో కనిపించే అశక్తత ఇతనిలో కనపడదు. ఆస్థానాల్లో తిరిగే బ్రాహ్మణులకు అసాధ్యమంటూ ఉండదు. నీళ్లుత్రాగి, గాలిమాత్రం పీలుస్తూ, పళ్లు తింటూ కఠిననియమాలు ఆచరించే బ్రాహ్మణులు శారీరకంగా బలహీనులయినా తమ తేజస్సుతో బలవత్తరులు. అందుకే బ్రాహ్మణులు మంచిపని చేసినా చెడ్డపనిచేసినా, సుఖం కలిగించినా,
దుఃఖం కలిగించినా, పెడ్దపనిచేసినా చిన్నపని చేసినా వారిని అవమానించరాదు. ధనుర్వేదంలో కాని, వేదంలోకాని, వివిధయోగాల్లో కాని బ్రాహ్మణుని మించిన వారిని కానము. మంత్రబలంలోకాని, యోగబలంలోకాని, ఆత్మబలంలో కాని వారు సాటిలేనివారు ఈ లోకమంతటినీ కూడా వారు కుదిపివేయగలరు. పరశురామునిచేత రాజులంతా యుద్ధంలో జయింపబడ్డారు. (11-14)
పీతస్సముద్రోఽగస్త్యేన హ్యగాథో బ్రహ్మతేజసా ।
తస్మాద్ర్బువంతు సర్వేఽత్ర వటురేవ ధనుర్మహాన్ ॥ 15
ఆరోపయతు శీఘ్రం వై తథేత్యూచుర్ద్విజర్షభాః ।
బ్రహ్మతేజస్సుకల అగస్త్యుడు అగాథమయిన సముద్రమే త్రాగివేశాడు. అందుచేత ఈ గొప్ప వింటిని ఈ వటువే ఆరోపించునుగాక. ఈ మాట విని బ్రాహ్మణులంతా "తథాస్తు" అన్నారు. (15 1/2)
ఏనం తేషాం విలపతాం విప్రాణాం వివిధా గిరః ।
అర్జునో ధనుషోఽభ్యాశే తస్థౌ గిరిరివాచలః ।
స తద్ధనుః పరిక్రమ్య ప్రదక్షిణమథాకరోత్ ॥ 17
ఇలా విప్రులంతా అనేక విధాలుగా అంటూ ఉండగానే అర్జునుడు వింటి దగ్గరకు వచ్చి పర్వతంలా నిలిచాడు. అతడు ఆ ధనువుకు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. (16,17)
ప్రణమ్య శిరసా దేవమ్ ఈశానం వరదం ప్రభుమ్ ।
కృష్ణం చ మనసా కృత్వా జగృహే చార్జునో ధనుః ॥ 18
వరప్రదాత, ప్రభువూ అయిన ఈశానునికి శిరసు వంచి నమస్కరించి, కృష్ణుని మనసా ధ్యానించి అర్జునుడు ధనువును (వింటిని) అందుకొన్నాడు. (18)
యత్పార్థివై రుక్మసునీథ వక్రైః
రాధేయ దుర్యోధన శల్య శాల్యైః ।
తదా ధనుర్వేద పరై ర్నృసింహైః
కృతం న సజ్యం మహతోఽపి యత్నాత్ ॥ 19
తదర్జునో వీర్యవతాం సదర్పః
తదైంద్రిరింద్రావరజ ప్రభావః ।
సజ్యం చ చక్రే నిమిషాంతరేణ
శరాంశ్చ జగ్రాహ దశార్ధసంఖ్యాన్ ॥ 20
ధనుర్వేదం అభ్యసించిన పురుషసింహులు రుక్ముడు, సునీథుడు, వక్రుడు, కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు, శాల్వుడు మొదలయినవారు ఎంతో ప్రయత్నించినా ఎక్కుపెట్టలేని ఆ ధనుస్సును విష్ణుప్రభావుడయిన అర్జునుడు ఒక్కనిమిషంలో ఎక్కుపెట్టి అయిదు బాణాలనూ గ్రహించాడు. (19,20)
వివ్యాధ లక్ష్యం నిపపాత తచ్చ
ఛిద్రేణ భూమౌ సహసాతివిద్ధమ్ ।
తతోఽంతరిక్షే చ బభూవ నాదః
సమాజమధ్యే చ మహాన్ నినాదః ॥ 21
వెంటనే లక్ష్యాన్ని కొట్టాడు. అది నేలమీద పడిపోయింది. మరుక్షణంలో సభలోనూ, ఆకాశంలోనూ పెద్దధ్వని వినపడింది. (21)
పుష్పాణి దివ్యాని వవర్ష దేవః
పార్థస్య మూర్ద్ని ద్విషతాం నిహంతుః ॥ 22
శత్రుసంహారకుడయిన అర్జునుని శిరస్సుపై దేవగణాలు దివ్యమైన పుష్పవర్షం కురిపించాయి. (22)
చైలాని వివ్యధుస్తత్ర బ్రాహ్మణాశ్చ సహస్రశః ।
విలక్షితాస్తతశ్చక్రుః హాహాకారాంశ్చ సర్వశః ।
న్యపతంశ్చాత్ర నభసః సమంతాత్ పుష్పవృష్టయః ॥ 23
శతాంగాని చ తూర్యాణి వాదకాః సమవాదయన్ ।
సూతమాగధసంఘాశ్చ అప్యస్తువన్ తత్ర సుస్వరాః ॥ 24
బ్రాహ్మణులు వేలకొలదీ ఉత్తరీయాలు ఊపారు. అంతటా హాహాకారాలు వినవచ్చాయి. ఆకాశం నుండి అంతటా పుష్పవృష్టి కురిసింది. వాదకులు తూర్యనాదాలు చేశారు. చక్కని కంఠధ్వనితో సూతులు మాగధుల సమూహాలు ప్రశంసలు కురిపించారు. (23,24)
తం దృష్ట్వా ద్రుపదః ప్రీతః బభూవ రిపుసూదనః ।
సహ సైన్యైశ్చ పార్థస్య సాహాయ్యార్థమియేష సః ॥ 25
ఆ దృశ్యం చూసి శత్రుసూదనుడైన ద్రుపదుడు ఎంతో సంతోషించాడు. అర్జునునికి సాయం కోసం అతడు సైన్యంతో వచ్చాడు. (25)
తస్మింస్తు శబ్దే మహతి ప్రవృద్ధే
యుధిష్ఠిరః ధర్మభృతాం వరిష్ఠః ।
ఆవాసమేవోపజగామ శీఘ్రం
సార్ధం యమాభ్యాం పురుషోత్తమాభ్యామ్ ॥ 26
ఆ శబ్దం అలా కోలాహలంగా ఉంది. ఇంతలో ధర్మజ్ఞులలో ఉత్తముడయిన ధర్మరాజు నకులసహదేవులతో కలిసి, సభనుండి లేచి, వెంటనే తమ నివాసానికి వెళ్లాడు. (26)
విద్ధం తు లక్ష్యం ప్రసమీక్ష్య కృష్ణా
పార్థం చ శక్రప్రతిమం నిరీక్ష్య ।
ఆదాయ శుక్లం వరమాల్యదామ
జగామ కుంతీసుతముత్స్మయంతీ ॥ 27
(స్వభ్యస్తరూపాపి నవేవ నిత్యం
వినాపి హాసం హసతీవ కన్యా ।
మదాదృతేఽపి స్ఖలతీవ భావైః
వాచా వినా వ్యాహరతీవ దృష్ట్యా ॥
సమేత్య తస్యోపరి సోత్ససర్జ
సమాగతానాం పరతో నృపాణామ్ ।
విన్యస్య మాలాం వినయేన తస్థౌ
విహాయ రాజ్ఞః సహసా నృపాత్మజా ॥
శచీవ దేవేంద్రమథాగ్నిదేవం
స్వాహేవ లక్ష్మీశ్చ యథా ముకుందమ్ ।
ఉషేవ సూర్యం మదనం రతిశ్చ
మహేశ్వరం పర్వతరాజపుత్రీ ॥
రామం యథా మైథిలిరాజపుత్రీ
భైమీ యథా రాజవరం నలం హి ॥)
లక్ష్యం భేదింపబడటాన్నీ, ఇంద్రుని వంటి అర్జునునీ చూసి ద్రౌపది తెల్లని పూలమాల గ్రహించి అర్జునుని సంతోషపెడుతూ బయలుదేరింది. (27)
నిత్యమూ చూసేవారికి కూడా ఆమె కొత్తగా కనిపిస్తోంది.
నవ్వకపోయినా ఆమె ముఖం నవ్వుతున్నట్లు ఉంది. మద్యసేవ లేకుండానే తలపులు తొణికిసలాడుతున్నాయి. మాట్లాడకపోయినా చూపులతోనే మాట్లాదుతున్నట్లు ఉంది ఆమె.
ఆమె అర్జునుని చేరి, రాజులందరి సమక్షంలో అందరినీ వదలి, అర్జునుని మెడలో ఆ కళ్యాణమాలవేసి వినయంతో నిలిచింది.
ఆమె అపుడు దేవేంద్రుని వరించిన శచీదేవి వలె, అగ్నిహోత్రుని వరించిన స్వాహాదేవి వలె, గోవిందుని వరించిన లక్ష్మీదేవి వలె, సూర్యుని వరించిన ఉష వలె, మన్మథుని వరించిన రతీదేవి వలె, రాముని వరించిన సీత వలె, నలుని వరించిన దమయంతి వలె శోభిల్లింది.
స తాముపాదాయ విజిత్య రంగే
ద్విజాతిభిస్తైరభిపూజ్యమానః ।
రంగాత్ నిరక్రామదచింత్యకర్మా
పత్న్యా తయా చాప్యనుగమ్యమానః ॥ 28
అర్జునుడు బ్రాహ్మణుల ఆశీర్వాదాలు, ప్రశంసలూ పొందుతూ, వెంట ద్రౌపది వస్తూ ఉండగా రంగం నుండి నిష్క్రమించాడు. (28)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి లక్ష్యఛేదనే సప్తాశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 187 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున స్వయంవరపర్వమను
ఉపపర్వమున లక్ష్యఛేదనము అను నూట ఎనుబది యేడవ అధ్యాయము. (187)
(దాక్షిణాత్య అధికపాఠము 5 1/2 శ్లోకములు కలిపి 33 1/2 శ్లోకములు)