191. నూట తొంబది ఒకటవ అధ్యాయము

పాండ లెరుంగకుండ ధృష్టద్యుమ్నుడు వారిని పరిశీలించుట.

వైశంపాయన ఉవాచ
ధృష్టద్యుమ్నస్తు పాంచాల్యః పృష్ఠతః కురునందనౌ ।
అన్వగచ్ఛత్ తదా యాంతౌ భార్గవస్య నివేశనే ॥ 1
వైశంపాయనుడు చెప్పాడు.
కుమ్మరి ఇంటికి వెడుతున్న భీమార్జునులను ధృష్టద్యుమ్నుడు వెనుక నుండి అనుసరించి వెళ్లాడు. (1)
సోఽజ్ఞాయమానః పురుషాన్ అవధాయ సమంతతః ।
స్వయమారాన్నిలీనోభూద్ భార్గవస్య నివేశనే ॥ 2
(భీమార్జునులకు) తెలియకుండా చాలామంది సేవకులను అంతటా పెట్టి ధృష్టద్యుమ్నుడు తాను భార్గవుని ఇంటి దగ్గర అజ్ఞాతంగా ఉన్నాడు. (2)
సాయం చ భీమస్తు రిపుప్రమాథీ
జిష్ణుర్యమౌ చాపి మహానుభావౌ ।
భైక్ష్యం చరిత్వా తు యుధిష్ఠిరాయ
నివేదయాంచక్రురదీనసత్త్వాః ॥ 3
సాయంకాలం అయ్యాక శత్రుసంహారకులయిన భీమార్జునులూ మహానుభావులైన నకులసహదేవులూ భిక్షాటనం చేసికొని వచ్చి ధర్మరాజుకు నివేదించారు. (3)
తతస్తు కుంతీ ద్రుపదాత్మజాం తామ్
ఉవాచ కాలే వచనం వదాన్యా ।
త్వమగ్రమాదాయ కురుష్వ భద్రే
బలిం చ విప్రాయ చ దేహి భిక్షామ్ ॥ 4
అపుడు వదాన్య అయిన కుంతి ద్రౌపదితో ఇలా అంది. ముందు నీవా అన్నం తీసికొని ఒక భాగం దేవతలకు బలిగా నివేదించు. మరొక భాగం విప్రులకు భిక్షగా పెట్టు. (4)
యే చాన్నమిచ్ఛంతి దదస్య తేభ్యః
పరిశ్రితా యే పరితో మనుష్యాః ।
తతశ్చ శేషం ప్రవిభజ్య శీఘ్రమ్
అర్ధం చతుర్ధా మమ చాత్మనశ్చ ॥ 5
అన్నంకోసం మన చుట్టూ ఆశ్రయించుకొని ఉన్నవారికి కొంత భాగం పెట్టు. మిగిలిన దానిలో సగం ఒక ప్రక్క పెట్టు. ఇంకా మిగిలిన సగం ఆరుభాగాలు చెయ్యి. నాలుగుభాగాలు కొడుకులకూ, నాకు ఒకటి, నీకు ఒకటి మొత్తం ఆరు. (5)
అర్ధంతు భీమాయ చ దేహి భద్రే
య ఏష నాగర్షభతుల్యరూపః ।
గౌరో యువా సంహననోపపన్నః
ఏషో హి వీరో బహుభుక్ సదైవ ॥ 6
మొదటచేసిన సగభాగం-అడుగో ఏనుగులూ, వృషభంలా తెల్లగా పెద్దశరీరంతో ఉన్న యువకుడు ఉన్నాడే వాడు కాస్త ఎక్కువ తినగలడు. వాడికి పెట్టు. (6)
సా హృష్టరూపేవ తు రాజపుత్రీ
తస్యా వచః సాధు విశంకమానా ।
యథావదుక్తం ప్రచకార సాధ్వీ
తే చాపి సర్వే బుభుజుస్తదన్నమ్ ॥ 7
ద్రౌపది ఆ మాటలు విని ఏమీ శంకించకుండా సంతోషంతో ఆమె చెప్పినట్లు అక్షరాలా చేసింది. ఆ అన్నం వారంతా భుజించారు. (7)
కుశైస్తు భూమౌ శయనం చకార
మాద్రీపుత్రః సహదేవస్తరస్వీ ।
యథా స్వకీయాన్యజినాని సర్వే
సంస్తీర్య వీరాః సుషుపుర్ధరణ్యామ్ ॥ 8
భోజనానంతరం మాద్రి కొడుకు సహదేవుడు నేల మీద దర్భలతో శయనం ఏర్పాటు చేసేశాడు. వాటిపై వీరులంతా తమతమ కృష్ణాజినాలు పరుచుకొని నేలమీద పడుకొన్నారు. (8)
అగస్త్యశాస్తామభితో దిశం తు
శిరాంసి తేషాం కురుసత్తమానామ్ ।
కుంతీ పురస్తాత్తు బభూవ తేషాం
పాదాంతరే చాథ బభూవ కృష్ణా ॥ 9
అశేత భూమౌ సహ పాండుపుత్రైః
పాదోపధానీవ కృతా కుశేషు ।
న తత్ర దుఃఖం మనసాపి తస్యాః
న చావమేనే కురుపుంగవాంస్తాన్ ॥ 10
పాండవులంతా దక్షిణ దిక్కుకి తలపెట్టి పండుకొన్నారు. వారి తలల దగ్గర కుంతి, పాదాల దగ్గర ద్రౌపది పండుకొన్నారు.
ద్రౌపది పాండవుల కాలిదిండులాగా నేలమీద పరిచిన దర్భలపై పరుండినది. అపుడు అది ఆమె మనసుకు ఏ మాత్రం కష్టం అనిపించలేదు. పాండవులను ఆమె కించిత్తు కూడా తిరస్కరించలేదు. (9,10)
తే తత్ర శూరాః కథయాం బభూవుః
కథా విచిత్రాః పృతనాధికారాః ।
అస్త్రాణి దివ్యాని రథాంశ్చ నాగాన్
ఖడ్గాన్ గదాశ్చాపి పరశ్వధాంశ్చ ॥ 11
అక్కడ పండుకొని పాండవులు, సేనాధికారులను గూర్చి, దివ్యాస్త్రాల గురించి, రథాలు ఏనుగులు ఖడ్గాలు గదలు, పరశ్వధాలు మొదలయిన వాటిని గురించి విచిత్రమయిన కథలు చెప్పుకొన్నారు. (11)
తేషాం కథాస్తాః పరికీర్త్యమానాః
పాంచాలరాజస్య సుతస్తదానీమ్ ।
శుశ్రావ కృష్ణాం చ తదా విషణ్ణాం
తే చాపి సర్వే దదృశుర్మనుష్యాః ॥ 12
వారు చెప్పుకొన్న కథలన్నీ పాంచాలమహారాజపుత్రి అయిన ద్రౌపది వింది-అక్కడ ఉన్న మనుష్యులంతా అలా నేలపై పడుకొన్న ద్రౌపదిని చూశారు. (12)
ధృష్టద్యుమ్నో రాజపుత్రస్తు సర్వం
వృత్తం తేషాం కథితం చైవ రాత్రౌ ।
సర్వం రాజ్ఞే ద్రుపదాయా ఖిలేన
నివేదయిష్యంస్త్వరితో జగామ ॥ 13
రాజకుమారుడయిన ధృష్టద్యుమ్నుడు వారు రాత్రి చెప్పుకొన్నదంతా విని అంతా మహారాజు ద్రుపదునికి చెప్పాలని త్వరగా తండ్రి దగ్గరకు వెళ్లాడు. (13)
పాంచాలరాజస్తు విషణ్ణరూపః
తాన్ పాండవానప్రతివిందమానః ।
ధృష్టద్యుమ్నం పర్యపృచ్ఛన్నహాత్మా
క్వ సా గతా కేన నీతా చ కృష్ణా ॥ 14
ద్రుపదుడు విషాదంతో "వారు పాండవులని తెలియక" ధృష్టద్యుమ్నుని ఇలా అడిగాడు-ద్రౌపది ఎక్కడకి వెళ్లింది? ఎవరు తీసుకువెళ్లారు?" (14)
కచ్చిన్న శూద్రేణ నహీనజేన
వైశ్యేన వా కరదేనోపపన్నా ।
కచ్చిత్పదం మూర్ధ్ని న పంకదిగ్ధం
కచ్చిన్నమాలా పతితా శ్మశానే ॥ 15
నాపుత్రిని శూద్రుడు గ్రహించలేదుకదా! హీనకులజుడు గ్రహించలేదు కదా! కప్పం కట్టే వైశ్యుడు గ్రహించలేదుకదా! నా నెత్తిమీద బురదపాదం ఎవడూ పెట్టలేదుకదా! పూలమాల శ్మశానంలో పడలేదు కదా! (15)
కచ్చిత్ సవర్ణప్రవరో మనుష్యః
ఉద్రిక్త వర్ణోప్యుత ఏవ కచ్చిత్ ।
కచ్చిన్నవామో మమ మూర్థ్ని పాదః
కృష్ణాభిమర్శేన కృతోఽద్య పుత్ర ॥ 16
నా పుత్రికను నా వర్ణం వాడే గ్రహించాడా? లేక అగ్రవర్ణం వాడు గ్రహించాడా? ద్రౌపదిని గ్రహించి హీనవర్ణస్థుడు ఎవడూ నానెత్తిని తనపాదం పెట్టలేదుకదా! (16)
కశ్చిన్న తప్స్యే పరమప్రతీతః
సంయుజ్య పార్థేన నరర్షభేణ ।
వదస్య తత్త్వేన మహానుభావ
కోఽసౌ విజేతా దిహితుర్మమాద్య ॥ 17
ప్రసిద్ధుడయిన నరోత్తముడు అర్జుననుకు పిల్లనివ్వకుండా ఇలా ఎవడయినా పరితపిస్తాడా? నిజం చెప్పు-నాపుత్రికను గెల్చుకొన్నవాడెవడు? (17)
విచిత్ర వీర్యస్య సుతస్య కచ్చిత్
కురుప్రవీరస్య ధ్రియంతి పుత్రాః ।
కచ్చిత్తు పార్థేన యవీయసాద్య
ధనుర్గృహీతం నిహతం చ లక్ష్యమ్ ॥ 18
విచిత్రవీర్యపుత్రుడయిన పాండురాజు యొక్క కొడుకులు బ్రతికి ఉన్నారా? ఈ రోజు పాండుని చిన్నకొడుకు అర్జునుడే ధనుస్సు పట్టి లక్ష్యం భేదించాడంటావా? (18)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి ధృష్టద్యుమ్న ప్రత్యాగమనే ఏకనవత్యధిక శతతమోఽధ్యాయః ॥ 191 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున స్వయంవరపర్వమను
ఉపపర్వమున ధృష్టద్యుమ్నప్రత్యాగమన మను నూట తొంబది ఒకటవ అధ్యాయము. (191)