190. నూట తొంబదియవ అధ్యాయము
ద్రౌపదిని అయిదుగురు వివాహమాడుటను గురించిన సమాలోచనము.
వైశంపాయన ఉవాచ
గత్వా తు తాం భార్గవ కర్మశాలాం
పార్థౌ పృథాం ప్రాప్య మహానుభావౌ ।
తాం యాజ్ఞసేనీం పరమప్రతీతౌ
భిక్షేత్యథావేదయతాం నరాగ్ర్యౌ ॥ 1
వైశంపాయనుడు ఇలా అన్నాడు. మహానుభావులూ, నరోత్తములూ అయిన భీమార్జునులు కుమ్మరియింటికి వెళ్లి తల్లితో "అమ్మా భిక్ష తెచ్చాము" అన్నారు. (1)
కుటీగతా సా త్వనవేక్ష్య పుత్రౌ
ప్రోవాచ భుంక్తేతి సమేత్య సర్వే ।
పశ్చాచ్చ కుంతీ ప్రసమీక్ష్య కృష్ణాం
కష్టం మయా భాషితమిత్యువాచ ॥ 2
కుటీరంలో ఉన్న కుంతి కొడుకులను చూడకుండానే "అందరూ కలిసి భుజించండి" అంది. వెంటనే ద్రౌపదిని చూసి "అయ్యో ఇలా అన్నానేమిటి?" అని బాధపడింది. (2)
సా ధర్మభీతా పరిచింతయంతీ
తాం యాజ్ఞసేనీం పరమప్రతీతామ్ ।
పాణౌ గృహీత్వోపజగామ కుంతీ
యుధిష్ఠిరం వాక్యమువాచ చేదమ్ ॥ 3
పరమప్రఖ్యాతి వహించిన ద్రౌపది యొక్క చెయ్యి పట్టుకొని, కుంతి ధర్మలోపభయంతో చింతిస్తూ ధర్మరాజుతో ఇలా అంది. (3)
కుంత్యువాచ
ఇయం తు కన్యా ద్రుపదస్య రాజ్ఞః
తవానుజాభ్యాం మయి సంనివిష్టా ।
యథోచితం పుత్ర మయాపి చోక్తం
సమేత్య భుంక్తేతి నృప ప్రమాదాత్ ॥ 4
కుంతి చెప్పింది-ఈమె ద్రుపదమహారాజు యొక్క కుమార్తె. నీ తమ్ములు నా దగ్గరకు తీసుకొని వచ్చి 'భిక్ష తచ్చామన్నారు'- వెంటనే నేను "కలిసి భుజించండి' అన్నాను ప్రమాదపడి. (4)
మయా కథం నానృతముక్తమద్య
భవేత్ కురూణామృషభ బ్రవీహి ।
పాంచాలరాజస్య సుతామధర్మః
న చోపవర్తేత న విభ్రమేచ్చ ॥ 5
కురువంశోత్తమా! నేను మాట్లాడినది సత్యంగా ఎలా అవుతుంది! పాంచాలరాజు కుమార్తె దరిదాపులకు అధర్మం ఎలా రాకుండా ఉంటుంది? అధర్మవిలాసాలు ఆమెను పొందకుండా ఎలా ఉంటాయి? (5)
వైశంపాయన ఉవాచ
స ఏవముక్తో మతిమాన్ నృవీరః
మాత్రా ముహూర్తం తు విచింత్య రాజా ।
కుంతీం సమాశ్వాస్య కురుప్రవీరః
ధనంజయం వాక్యమిదం బభాషే ॥ 6
వైశంపాయనుడు చెపుతున్నాడు. కుంతి ఇలా అనేసరికి తెలివైన ధర్మరాజు కొద్దిసేపు ఆలోచించి కుంతిని ఊరడించి అర్జునునితో ఇలా అన్నాడు. (6)
త్వయా జితా ఫాల్గున యాజ్ఞసేనీ
త్వయైన శోభిష్యతి రాజపుత్రీ ।
ప్రజ్వాల్యతామగ్ని రమిత్రసాహ
గృహాణ పాణిం విధివత్ త్వమస్యాః ॥ 7
అర్జునా! యాజ్ఞసేనిని నీవు జయించుకొన్నావు. నీతోనే రాజకుమారి శోభిస్తుంది. అగ్నిహోత్రం చేసి ఆమెను శాస్త్రోక్తంగా పాణిగ్రహణం చేసుకో. (7)
అర్జున ఉవాచ
మా మాం నరేంద్ర త్వమధర్మభాజం
కృథా న ధర్మోయ మశిష్టదృష్టః ।
భవాన్ నివేశ్యః ప్రథమం తతోఽయం
భీమో మహాబాహురచింత్య కర్మా ॥ 8
అహం తతో నకులోనంతరం మే
పశ్చాదయం సహదేస్తరస్వీ ।
వృకోదరోఽహం చ యమౌ చ రాజన్
ఇయం చ కన్యా భవతో నియోజ్యాః ॥ 9
రాజా! నన్ను అధర్మాచరణపరుని చేయకు. పెద్దలు ఎవరూ చేయలేదీ అధర్మం. ముందుగా నీవు వివాహం చేసుకోవాలి. తరువాత ఈ అద్భుతపరాక్రముడయిన భీముడు చేసుకోవాలి. తరువాత నేను. నా తరువాత నకులుడు-ఆ తరువాత చురుకైన సహదేవుడు చేసుకోవాలి. భీముడు, నేను. నకుల సహదేవులూ, ఈ రాజకుమారి అంతా నీ ఆజ్ఞావర్తులమే. (8,9)
ఏవం గతే యత్కరణీయ మత్ర
ధర్మ్యం యశస్యం కురు తద్విచింత్య ।
పాంచాలరాజస్య హితం చ యత్ స్యాత్
ప్రశాధి సర్వే స్మ వశే స్థితాస్తే ॥ 10
ఇపుడు చేయదగిన ధర్మమేదో, ఏది యశస్కరమో ఆలోచించి చెయ్యి. పాంచాల రాజుకు హితమైనది చెయ్యి. మేమంతా నీకు వశులమై ఉన్నాము. ఆజ్ఞాపించు. (10)
వైశంపాయన ఉవాచ
జిష్ణోర్వచన మాజ్ఞాయ భక్తిస్నేహసమన్వితమ్ ।
దృష్టిం నివేశయామాసుః పాంచాల్యాం పాండునందనాః ॥ 11
వైశంపాయనుడు ఇలా అంటున్నాడు. భక్తి స్నేహాలతో కూడిన అర్జునుని మాట విని పాండవులందరూ పాంచాలి మీద దృష్టులు నిలిపారు. (11)
దృష్ట్వా తే తత్ర పశ్యంతీం సర్వే కృష్ణాం యశస్వినీమ్ ।
సంప్రేక్ష్యాన్యోన్యమాసీనాః హృదయైస్తామధారయమ్ ॥ 12
పాండవులంతా యశస్విని అయిన ద్రౌపదిని చూస్తూ తమ హృదయాల్లో ఆమెను ధరించారు. (12)
తేషాం తు ద్రౌపదీం దృష్ట్వా సర్వేషా మమితౌజసామ్ ।
సంప్రమథ్యేంద్రియగ్రామం ప్రాదురాసీన్మనోభవః ॥ 13
అమిత తేజస్వులయిన పాండవులంతా ఆమెను చూస్తుంటే వారి ఇంద్రియాలన్నింటినీ మథిస్తూ వారి హృదయాల్లో మన్మథుడు ఉద్భవించాడు. (13)
కామ్యం హి రూపం పాంచాల్యాః విధాత్రా విహితం స్వయమ్ ।
బభూవాధికమన్యాభ్యః సర్వభూతమనోహరమ్ ॥ 14
విధాత స్వయంగా పాంచాలి రూపాన్ని కోరదగినట్లుగానూ, ఇతర స్త్రీల కంటె అధికంగానూ, సర్వప్రాణుల మనస్సులనూ హరించేదిగానూ సృష్టించాడు. (14)
తేషామాకారభావజ్ఞః కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
ద్వైపాయనవచః కృత్స్నం సస్మార మనుజర్షభః ॥ 15
తమ్ముళ్ల ఆకారాన్ని, మనసులనూ ఎరిగిన ధర్మరాజు వ్యాసమహర్షి మాటలన్నిటినీ తలచుకొన్నాడు. (15)
అబ్రవీత్ సహితాన్ భ్రాతౄన్ మిథో భేదభయాన్నృపః ।
సర్వేషాం ద్రౌపదీ భార్యా భవిష్యతి హి నః శుభా ॥ 16
తమలో తమకు పరస్పరం భేదం వస్తుందనే భయంతో "ఈ కళ్యాణి ద్రౌపది మన అందరికీ భార్య అవుతుంది" అన్నాడు. (16)
వైశంపాయన ఉవాచ
భ్రాతుర్వచస్తత్ ప్రసమీక్ష్య సర్వే
జ్యేష్టస్య పాండోస్తనయాస్తదానీమ్ ।
తమేవార్థం ధ్యాయమానా మనోభిః
సర్వే చ తే తస్థురదీనసత్త్వాః ॥ 17
వైశంపాయనుడు చెప్పాడు. పెద్ద అన్నగారి మాట విని పాండవులంతా ఆ విషయాన్నే భావిస్తూ ఉదారహృదయంతో మిన్నకుండిపోయారు. (17)
వృష్ణి ప్రవీరస్తు కురుప్రవీరాన్
ఆసంసమానః సహ రౌహిణేయః ।
జగామ తాం భార్గవ కర్మశాలాం
యత్రాసతే తే పురుషప్రవీరాః ॥ 18
వృష్ణి వీరుడయిన కృష్ణుడు బలరామునితో సహా పాండవులను పలుకరించటానికి పాండవులున్న కుమ్మరి యింటికి వెళ్లాడు. (18)
తత్రోపవిష్టం పృథుదీర్గబాహుం
దదర్శ కృష్ణః సహ రౌహిణేయః ।
అజాతశత్రుం పరువార్య తాంశ్చా
ప్యుపోపవిష్టాన్ జ్వలన ప్రకాశాన్ ॥ 19
అక్కడకు వెళ్లి కృష్ణబలరాములు ఆజానుబాహువయిన ధర్మరాజును అతని చుట్టూరా అగ్నిహోత్రాలవలె ప్రాకాశిస్తున్న మిగిలిన పాండవులనూ చూశారు. (19)
తతోఽబ్రవీద్ వాసుదేవోఽభిగమ్య
కుంతీంసుతం ధర్మభృతాం వరిష్ఠమ్ ।
కృష్ణోఽహమస్మీతి నిపీడ్య పాదౌ
యుధిష్ఠిరస్యాజమీఢస్య రాజ్ఞః ॥ 20
కృష్ణుడు వెళ్లి ధార్మికోత్తముడూ, అజమీఢ వంశజుడూ అయిన ధర్మరాజు పాదాలు పట్టుకొని "కృష్ణుణ్ణి నేను" అని నమస్కరించాడు. (20)
తథైవ తస్యాప్యను రౌహిణేయః
తౌ చాపి హృష్టాః కురవోఽభ్యనందన్ ।
పితృష్వసుశ్చాపి యదుప్రవీరౌ
అగృహ్ణతాం భారతముఖ్య పాదౌ ॥ 21
బలరాముడు కూడ వెళ్లి తనపేరు చెప్పుకొని ధర్మరాజును అభినందించాడు. వారిద్దరినీ పాండవులూ సంతోషంతో అభినందించారు. బలరామకృష్ణులిద్దరూ తమ మేనత్త కుంతీదేవికి పాదాభివందనం చేశారు. (21)
అజాతశత్రుశ్చ కురుప్రవీరః
పప్రచ్ఛ కృష్ణం కుశలం విలోక్య ।
కథం వయం వాసుదేవ త్వయేహ
గూఢా వసంతో విదితాశ్చ సర్వే ॥ 22
అజాతశత్రువైన ధర్మరాజు కృష్ణుని చూసి కుశలమడిగి వెంటనే "కృష్ణా! ప్రచ్ఛన్నంగా నివసిస్తున్నమేము నీకు ఎలా తెలిశాము?" అని అడిగాడు. (22)
తమబ్రవీద్ వాసుదేవః ప్రహస్య
గూఢోఽప్యగ్నిర్ జ్ఞాయత ఏవ రాజన్ ।
తం విక్రమం పాండవేయానతీత్య
కోఽన్యః కర్తా విద్యతే మానుషేషు ॥ 23
కృష్ణుడు చిరునవ్వి నవ్వి "రాజా! గూఢంగా ఉన్నా అగ్ని తెలుస్తూనే ఉంటుంది. అంతటి పరాక్రమం పాండవులను మించి మానవులు ఎవరిలో ఉంటుంది? (23)
దిష్ట్వా సర్వే పావకాద్ విప్రముక్తా
యూయం ఘోరాత్ పాండవాః శత్రుసాహాః ।
దిష్ట్యా పాపో ధృతరాష్ట్రస్య పుత్రః
సహామాత్యో న స కామోఽభవిష్యత్ ॥ 24
అదృష్టవశాత్తు శత్రువులను సహించగల మీరంతా భయంకరమైన లాక్షాగృహం మంటల నుండి తప్పించుకొన్నారు. అమాత్యునితో కూడిన పాపి అయిన దుర్యోధనుని కోరిక అదృష్టవశాత్తు తీరలేదు. (24)
భద్రం వోఽస్తు నిహితం యద్గుహాయాం
వివర్ధధ్వం జ్వలనా ఇవైధమానాః ।
మా వో విదుః పార్థివాః కేచిదేవ
యాస్యావహే శిబిరాయైవ తావత్ ।
సోఽనుజ్ఞాతః పాండవే నావ్యయశ్రీః
ప్రాయాచ్ఛీఘ్రం బలదేవేన సార్ధమ్ ॥ 25
మీకందరికీ మా అంతరంగంలో నింపుకున్న కల్యాణమగుగాక. అగ్నిహోత్రాల వలె వృద్ధిపొందుతూ వ్యాపించండి. ఇపుడు ఏ రాజులూ మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఇక మేము శిబిరానికి వెడతాము. అంటూ కృష్ణుడు ధర్మరాజు యొక్క అనుజ్ఞ తీసికొని బలరామునితో సహా వెంటనే వెళ్లిపోయాడు. (25)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి రామకృష్ణాగమనే నవత్యధిక శతతమోఽధ్యాయః ॥ 190 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున స్వయంవరపర్వమను
ఉపపర్వమున బలరామకృష్ణాగమనమను నూట తొంబదియవ అధ్యాయము. (190)