193. నూట తొంబది మూడవ అధ్యాయము
పాండవులు, కుంతి ద్రుపదునిచే సమ్మానితులగుట - వారి శీలపరీక్ష.
దూత ఉవాచ
జన్యార్థమన్నం ద్రుపదేన రాజ్ఞా
వివాహహేతోరుపసంస్కృతం చ ।
తదాప్నువధ్వం కృతసర్వకార్యాః
కృష్ణాం చ తత్రైవ చిరం న కార్యమ్ ॥ 1
దూత చెప్పాడు. ద్రుపదమహారాజు వివాహనిమిత్తంగా జ్ఞాతులకు విందుచేయటానికి భోజనం సిద్ధంచేశాడు. మీరు కూడా పనులు ముగించుకొని దయచేయండి. ద్రౌపదిని కూడా శాస్త్రోక్తంగా అక్కడే పొందవచ్చు. ఆలస్యం చేయవద్దు. (1)
ఇమే రథాః కాంచనపద్మచిత్రాః
సదశ్వయుక్తా వసుధాధిపార్హాః ।
ఏతాన్ సమారుహ్య సమేత సర్వే
పాంచాలరాజస్య నివేశనం తత్ ॥ 2
ఈ రథాలు బంగారుకమలాల చిత్రాలు గలవి. శ్రేష్ఠాశ్వాలు పూన్చబడి, రాజశ్రేష్ఠుల కర్హాలై ఉన్నాయి. వీరందరూ కలసి వీటినధిరోహించి ఆద్రుపదుని రాజమందిరంలోనికి ప్రవేశించండి. (2)
వైశంపాయన ఉవాచ
తతః ప్రయాతాః కురుపుంగవాస్తే
పురోహితం తం పరియాప్య సర్వే ।
ఆస్థాయ యానాని మహాంతి తాని
కుంతీ చ కృష్ణా చ సహైకయానే ॥ 3
వైశంపాయనుడు ఇలా అన్నాడు- జనమేజయమహారాజా! ఆకురు శ్రేష్ఠులు ద్రుపదపురోహితుని బయలుదేరతీసి విశాలమైన రథాలపైన అధిష్ఠించి రాజభవనానికి బయలుదేరారు. అప్పుడు కుంతి, ద్రౌపది ఒకే రథంలో కూర్చున్నారు. (3)
శ్రుత్వా తు వాక్యాని పురోహితస్య
యాన్యుక్తవాన్ భారత ధర్మరాజః ।
జిజ్ఞాసమైవాథ కురూత్తమానాం
ద్రవ్యాణ్యనేకాన్యుపసంజహార ॥ 4
ద్రుపదుడు, ధర్మరాజు పురోహితునితో పల్కినమాటలను పురోహితుని ద్వారా విని కురుశ్రేష్ఠులను, వారి స్వభావం ద్వారా గ్రహించాలని అనేకవిధాలైన వస్తుసామగ్రిని తెప్పించాడు. (4)
ఫలాని మాల్యాని చ సంస్కృతాని
వర్మాణి చర్మాణి తథాఽఽసనాని ।
గాశ్చైవ రాజన్నథ చైవ రజ్జూః
బీజాని చాన్యాని కృషీనిమిత్తమ్ ॥ 5
అన్యేషు శిల్పేషు చ యాన్యపి స్యుః
సర్వాణి కృత్యాన్యఖిలేన తత్ర ।
క్రీడానిమిత్తాన్యపి యాని తత్ర
సర్వాణి తత్రోపజహార రాజా ॥ 6
రాజా! వివిధ ఫలాలు, సుందరంగా కూర్చిన మాలలు, కవచాలు, డాలులు, ఆసనాలు, గోవులు, త్రాళ్ళు, వ్యవసాయానికి ఉపయోగించే గింజలు, వివిధ కర్మల నిమిత్తమైన వస్తువులు సమకూర్చాడు. క్రీడల కొరకు ఉపయోగించే క్రీడాసామాగ్రిని పూర్తిగా తెప్పించి అక్కడ సిద్ధపరిచాడు. (5,6)
వర్మాణి చర్మాణి చ భానుమంతి
ఖడ్గా మహాంతోఽశ్వరథాశ్చ చిత్రాః ।
ధనూంషి చాగ్ర్యాణి శరాశ్చచిత్రాః
శక్త్యృష్టయః కాంచనభూషణాశ్చ ॥ 7
ప్రాసా భుశుండ్యశ్చ పరశ్వథాశ్చ
సాంగ్రామికం చైవ తథైవ సర్వమ్ ।
శయ్యాసనాన్యుత్తమ వస్తువంతి
తథైవ వాసో వివిధం చ తత్ర ॥ 8
రెండవవైపున కవచాలు, మెరిసిపోయే డాళ్ళు, కత్తులు, పెద్ద పెద్ద విచిత్రరథాలు, గుఱ్ఱాలు, శ్రేష్ఠమైన విచిత్రాలైన బాణాలు, సువర్ణభూషితాలైన శక్త్యాయుధాలు, ఋష్టులు, ప్రాసాలు, పేల్చేసామగ్రులు, పరశ్వథాలు, యుద్ధసామగ్రి, ఉత్తమాసనాలు, పాన్పులు, చాలా రకాల వస్త్రాలు అన్నీ ఏర్పాటు చేశాడు. (7,8)
కుంతీ తు కృష్ణాం పరిగృహ్య సాధ్వీం
అంతఃపురం ద్రుపదస్యావివేశ ।
స్త్రియశ్చ తాం కౌరవరాజపత్నీం
ప్రత్యర్చయామాసు రదీనసత్త్వాః ॥ 9
కుంతీదేవి సాధ్వియైన ద్రౌపదిని తీసికొని ద్రుపదుని అంతఃపురంలో ప్రవేశించింది. అక్కడి ఉదారమనస్కలైన స్త్రీలు కౌరవరాజపత్ని కుంతిని ఆదరసత్కారాలతో అర్చించారు. (9)
తాన్ సింహవిక్రాంతగతీన్ నిరీక్ష్య
మహర్షభాక్షానజినోత్తరీయాన్ ।
గూఢోత్తరాంసాన్ భుజగేంద్రభోగ-
ప్రలంబబాహాన్ పురుషప్రవీరాన్ ॥ 10
రాజా చ రాజ్ఞః సచివాశ్చ సర్వే
పుత్రాశ్చ రాజ్ఞః సుహృదస్తథైవ ।
ప్రేష్యాశ్చ సర్వే నిఖిలేన రాజన్
హర్షం సమాపేతురతీవ తత్ర ॥ 11
రాజా! సింహగమనం, ఋషభనేత్రాలు, నల్లలేడి చర్మాలు, బలిష్ఠమైన ఎగుబుజాలు, పాముపడగలవంటి బాహువులు గల ఆ పురుషోత్తములను చూచి ద్రుపదుడు, అతని మంత్రులు, పుత్రులు, స్నేహితులు, సేవకులు, అందరూ మిక్కిలి సంతసించారు. (10,11)
తే తత్ర వీరాః పరమాసనేషు
సపాదపీఠేష్వవిశంకమానాః
యథానుపూర్వం వివిశుర్నరాగ్ర్యాః
తథా మహార్హేషు న విస్మయంతః ॥ 12
వీరులైన పాండవులు పాదపీఠాలతో కూడిన ఆసనాలపై సందేహింపక, మనస్సు నందు ఆశ్చర్యాన్ని పొందకుండా కూర్చున్నారు. (12)
ఉచ్చావచం పార్థివ భోజనీయం
పాత్రీషు జాంబూనదరాజతీషు ।
దాసాశ్చ దాస్యశ్చ సుమృష్టవేషాః
సంభోజకాశ్చాప్యుపజహ్రురన్నమ్ ॥ 13
సుందరవేషధారులై వంటయింటి పరిచారకులు, పరిచారికలు, బంగారుపాత్రలలో బహువిధాలైన భోజనసామగ్రిని తెచ్చి వడ్డించారు. (13)
తే తత్ర భుక్త్వా పురుషప్రవీరా
యథాత్మకామం సుభృశం ప్రతీతాః ।
ఉత్ర్కమ్య సర్వాణి వసూని రాజన్
సాంగ్రామికం తే వివిశుర్నృవీరాః ॥ 14
రాజా! వీరశ్రేష్ఠులైన పాండవులు తమతమ ఆసక్తికనుగుణంగా భోజనపదార్థాలను తిని ప్రసన్నులై భోగసామగ్రిని కాదని, యుద్ధసామగ్రి కల ప్రదేశానికి చేరారు. (14)
తల్లక్షయిత్వా ద్రుపదస్య పుత్రః
రాజా చ సర్వైః సహ మంత్రిముఖ్యైః ।
సమర్థయామాసురుపేత్య హృష్టాః
కుంతీసుతాన్ పార్థివ రాజపుత్రాన్ ॥ 15
మహారాజా! అది గుర్తించిన ద్రుపదుడు, ధృష్టద్యుమ్నుడు, మంత్రులు అందరు ప్రసన్నులయ్యారు. వారి వద్దకు చేరి కుంతీపుత్రులైన వారిని రాజకుమారులుగా భావించారు. (15)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి వైవాహిక పర్వణి యుధిష్ఠిరాది పరీక్షణే త్రినవత్యధికశతతమోఽధ్యాయః ॥ 193 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున వైవాహికపర్వమను
ఉపపర్వమున యుధిష్ఠిరాదిపరీక్ష అను నూట తొంబది మూడవ అధ్యాయము. (193)