194. నూట తొంబది నాలుగవ అధ్యాయము

ద్రుపద యుధిష్ఠిర సంవాదము, వ్యాసాగమనము.

వైశంపాయన ఉవాచ
తత ఆహూయ పాంచాల్యః రాజపుత్రం యుధిష్ఠిరమ్ ।
పరిగ్రహేణ బ్రాహ్మేణ పరిగృహ్య మహాద్యుతిః ॥ 1
పర్యపృచ్ఛదదీనాత్మా కుంతీపుత్రం సువర్చసమ్ ।
కథం జానీమ భవతీః క్షత్రియాన్ బ్రాహ్మణానుత ॥ 2
వైశ్యాన్వా గుణసంపన్నాన్ అథవా శూద్రయోనిజాన్ ।
మాయామాస్థాయ వా విప్రాన్ చరతః సర్వతోదిశమ్ ॥ 3
వైశంపాయనుడు చెప్పసాగాడు - జనమేజయమహారాజా! భోజనాలైన పిదప ద్రుపదుడు తేజస్వి అయిన ధర్మజుని పిలిచి బ్రాహ్మణోచితసత్కారాలతో సమ్మానించి తనవానిగా చేసికొని ఇలా అడిగాడు- మిమ్ము నేనెట్లు తెలిసికొనగలను? మీరు బ్రాహ్మణులా, క్షత్రియులా, గుణసంపన్నులైన వైశ్యులా, శూద్రులా? లేక మాయనాశ్రయించి విప్రరూపంలో అన్ని దిక్కులా సంచరిస్తున్న వారా? (1-3)
కృష్ణాహేతోరనుప్రాప్తాః దేవాః సందర్శనార్థినః ।
బ్రవీతు నో భవాన్ సత్యం సందేహో హ్యత్ర నో మహాన్ ॥ 4
ద్రౌపది కారణంగా భూలోక సందర్శనార్థులై వచ్చిన దేవతలా? మీరు సత్యాన్ని చెప్పండి. మీ విషయంలో నాకు పెద్ద సందేహం కలిగింది. (4)
అపి నః సంశయస్యాంతే మనః సంతుష్టిమావహేత్ ।
అపి నో భాగధేయాని శుభాని స్యుః పరంతప ॥ 5
శత్రుతాపనుడా! మీ నుంచి ఈ రహస్యాన్ని విన్నప్పుడు నా మనస్సు తేలికపడుతుంది. మాకు దీని వలన భాగ్యోదయం కావాలి. (5)
ఇచ్ఛయా బ్రూహి తత్ సత్యం సత్యం రాజసు శోభతే ।
ఇష్టాపూర్తేన చ తథా వక్తవ్యమనృతం న తు ॥ 6
మీరు స్వేచ్ఛగా సత్యం చెప్పండి. రాజులకు ఇష్టా పూర్తాలకంటే సత్యమే మహిమగలది. కాబట్టి సత్యానే పలుకు. అసత్యం పలుకవద్దు. (6)
వి॥ సం॥ స్మృతులలో ఇష్టాపూర్తాల నిర్వచనమిట్లు చెప్పబడింది (గోరఖ్ పూర్ ప్రతి)
1. అగ్నిహోత్రం తపః సత్యం వేదానాం చానుపాలనమ్ ।
ఆతిథ్యం వైశ్యదేవం చ ఇష్టమిత్యభిదయతే ॥
2. వాపీకూపతటాకాది దేవతాయతనాని చ ।
అన్నప్రదానమారామాః పూర్తమిత్యభిధీయతే ॥
1. అగ్నిహోత్రం, తపస్సు, సత్యం మాట్లాడటం, వేదాధ్యయనం, అతిథి మర్యాద, వైశ్యదేవం - వీనిని ఇష్టమని అంటారు.
2. నూతులు, బావులు, చెరువులు, త్రవ్వించడం; దేవాలయాలు, ఆరామాలు నిర్మించడం, అన్నదానం చెయ్యడం. వీనిని 'పూర్త' మని అంటారు. రెండూ కలిపి ఇష్టాపూర్తాలు అంటారు.
శ్రుత్వా హ్యమర సంకాశ తవ వాక్యమరిందమ ।
ధ్రువం వివాహకరణం ఆస్థాస్యామి విధానతః ॥ 7
దేవసమాన తేజస్వీ! శత్రునాశకా! నీ మాటలను విని నిశ్చయంగా విధిపూర్వకంగా వివాహం చేయటానికి సిద్ధపడతాను. (7)
యుధిష్ఠిర ఉవాచ
మా రాజన్ విమనా భూస్త్వం పాంచాల్య ప్రీతిరస్తు తే ।
ఈప్సితస్తే ధ్రువః కామః సంవృత్తోఽయమసంశయమ్ ॥ 8
యుధిష్ఠిరుడు అన్నాడు - నీవు కలవరపడవద్దు. ప్రసన్నుడవు కమ్ము. నీమనసులో కోరిక నేడు తీరినదనుకో. ఇది సత్యం. (8)
వయం హి క్షత్రియా రాజన్ పాండోః పుత్రా మహాత్మనః ।
జ్యేష్ఠం మాం విద్ధి కౌంతేయం భీమసేనార్జునావిమౌ ॥ 9
ద్రుపదమహారాజా! మేము క్షత్రియులం. పాండుపుత్రులం. నన్ను జ్యేష్ఠుడైన ధర్మజునిగా తెలుసుకో. వీరు భీమసేనార్జునులు. (9)
ఆభ్యాం తవ సుతా రాజన్ నిర్జితా రాజసంసది ।
యమౌ చ తత్ర కుంతీ చ యత్ర కృష్ణా వ్యవస్థితా ॥ 10
రాజా! వీరే నీకుమార్తెను రాజసభలో జయించారు. వారు నకులసహదేవులు. ద్రౌపదికి దగ్గరగా ఉన్నది మా తల్లి కుంతి. (10)
వ్యేతు తే మానసం దుఃఖం క్షత్రియాః స్మో నరర్షభ ।
పద్మినీవ సుతేయం తే హ్రదాదన్యహ్రదం గతా ॥ 11
నరశ్రేష్ఠా! నీ మానసిక చింత తొలగునుగాక! మేము క్షత్రియులం. తామరతీగవలె నీకుమార్తె ఒక సరస్సు నుండి మరో సరస్సుకు చేరిన దనుకో. (11)
ఇతి తథ్యం మహారాజ సర్వమేతత్ బ్రవీమి తే ।
భవాన్ హి గురురస్మాకం పరమం చ పరాయణమ్ ॥ 12
మహారాజా! జరిగినదంతా యథాతథంగా మీకు చెప్తున్నాను. మీరే మాకు పెద్దలు, ఆశ్రయింపదగినవారు కూడా. (12)
వైశంపాయన ఉవాచ
తతః స ద్రుపదో రాజా హర్షవ్యాకులలోచనః ।
ప్రతివక్తుం ముదా యుక్తః నాశకత్ తం యుధిష్ఠిరమ్ ॥ 13
వైశంపాయనుడు చెప్ఫాడు - యుధిష్ఠిరుని మాటలు విన్న ద్రుపదుని కన్నుల నుండి ఆనందాశ్రువులు రాలాయి.
అతడు ఆనందంలో మునిగి వెంటనే ధర్మజునకు సమాధానమీయలేకపోయాడు. (13)
యత్నేన తు స తం హర్షం సంనిగృహ్య పరంతపః ।
అనురూపం తదా వాచా ప్రత్యువాచ యుధిష్ఠిరమ్ ॥ 14
ద్రుపదుడు ప్రయత్నపూర్వకంగా సంతోషాన్ని నిలువరించుకొని యుధిష్ఠిరునికి అతని మాటలకు అనుగుణంగా బదులిచ్చాడు. (14)
పప్రచ్ఛ చైనం ధర్మాత్మా యథా తే ప్రద్రుతాః పురాత్ ।
స తస్మై సర్వమాచఖ్యౌ ఆనుపూర్వ్యేణ పాండవః ॥ 15
తిరిగి ద్రుపదుడు "మీరెట్లు ఆ నగరం నుండి తప్పించుకొన్నారు" అని అడిగాడు. ధర్మజుడాతనికి క్రమంగా సర్వవృత్తాంతాన్నీ వివరించాడు. (15)
తచ్ర్ఛుత్వా ద్రుపదో రాజా కుంతీపుత్రస్య భాషితమ్ ।
విగర్హయామాస తదా ధృతరాష్ట్రం నరేశ్వరమ్ ॥ 16
ఆశ్వాసయామాస చ తం కుంతీపుత్రం యుధిష్ఠిరమ్ ।
ప్రతిజజ్ఞే చ రాజ్యాయ ద్రుపదో వదతాం వరః ॥ 17
వక్తలలో శ్రేష్ఠుడైన ద్రుపదుడు కుంతీపుత్రునిమాటలు పూర్తిగా విని ధృతరాష్ట్రమహారాజును అప్పుడు మిక్కిలిగా నిందించాడు. అదేసమయంలో ద్రుపదుడు ధర్మజుని ఊరడించి, రాజ్యాన్ని సాధించటంలో సహాయపడగలమని ప్రతిజ్ఞచేశాడు. (16,17)
తతః కుంతీ చ కృష్ణా చ భీమసేనార్జునావపి ।
యమౌ చ రాజ్ఞా సందిష్టం వివిశుర్భవనం మహత్ ॥ 18
తత్ర తే న్యవసన్ రాజన్ యజ్ఞసేనేన పూజితాః ।
ప్రత్వాశ్వస్తస్తతో రాజా సహపుత్రైరువాచ తమ్ ॥ 19
రాజా! కుంతి, ద్రౌపది, భీమసేనార్జునులు, నకులసహదేవులు ద్రుపదుడు నిర్దేశించిన గొప్పభవనంలో ప్రవేశించారు. యజ్ఞసేనుడు (ద్రుపదుడు) వారిని సన్మానించాడు. ఈ విధంగా పాండవులపై విశ్వాసాన్ని ప్రకటించిన ద్రుపదుడు కుమారులతో కలిసి వచ్చి ధర్మరాజుతో ఇలా అన్నాడు. (18,19)
గృహ్ణాతు విధివత్ పాణిమ్ అద్యాయం కురునందనః ।
పుణ్యే-హని మహాబాహుః అర్జునః కురుతాం క్షణం ॥ 20
కురువంశ నందనుడూ, మహాబాహువూ అయిన అర్జునుడు నేడు పుణ్యదినమున నా కుమార్తెను శాస్ర్తోక్తవిధానంతో పరిణయమాడాలి. మా కులోచితమైన ఈ ఉత్సవం ప్రారంభం కావాలి. (20)
వైశంపాయన ఉవాచ
తమబ్రవీత్ తతో రాజా ధర్మాత్మా చ యుధిష్ఠిరః ।
మమాపి దారసంబంధః కార్యస్తావత్ విశాంపతే ॥ 21
వైశంపాయనుడిట్లు చెప్పాడు - ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు ద్రుపదునితో ఇలా అన్నాడు. నరేశ్వరా! నాకూ పెండ్లి కావలసియున్నది. (21)
ద్రుపద ఉవాచ
భవాన్ వా విధివత్ పాణిం గృహ్ణాతు దుహితుర్మమ ।
యస్య వా మన్యసే వీర తస్య కృష్ణాముపదిశ ॥ 22
ద్రుపదుడిలా అన్నాడు! అట్లైన నీవు నాకుమార్తెను విధి ప్రకారం వివాహం చేసికో. లేకపోతే నీతమ్ములలో ఎవరినైనా వివాహానికి నియోగించు. (22)
యుధిష్ఠిర ఉవాచ
సర్వేషాం మహిషీ రాజన్ ద్రౌపదీ నో భవిష్యతి ।
ఏవం ప్రవ్యాహృతం పూర్వం మమ మాత్రా విశాంపతే ॥ 23
యుధిష్ఠిరుడు పలికాడు - రాజా! ద్రౌపది మాకందరకు పట్టమహిషి కాగలదు. మా తల్లి మా అందరిని ఆ విధంగా ఆదేశించింది. (23)
అహం చాప్యనివిష్టో వై భీమసేనశ్చ పాండవః ।
పార్థేన విజితా చైషా రత్నభూతా సుతా తవ ॥ 24
నేను, భీమసేనుడు కూడ అవివాహితులమే. రత్నం వంటి నీకుమార్తెను అర్జునుడు రాజసభలో మత్స్యయంత్రాన్ని కొట్టి గెలుచుకొన్నాడు. (24)
ఏష నః సమయో రాజన్ రత్నస్య సహ భోజనమ్ ।
న చ తం హాతుమిచ్ఛామః సమయం రాజసత్తమ ॥ 25
మహారాజా! రత్నాన్ని మేమందఱం కలిసి అనుభవించటం మా నియమం. ఈ నియమాన్ని భంగపరచటానికి మేము ఇష్టపడము. (25)
సర్వేషాం ధర్మతః కృష్ణా మహిషీ నో భవిష్యతి ।
ఆనుపూర్వ్యేణ సర్వేషాం గృహ్ణాతు జ్వలనే కరాన్ ॥ 26
కావున మాకందఱకు ద్రౌపది ధర్మబద్ధంగానే పట్టమహిషి అవుతుంది. ప్రజ్వలించే అగ్నిసాక్షిగా ఆమె మా అందఱితో పాణి గ్రహణం చేస్తుంది. (26)
ద్రుపద ఉవాచ
ఏకస్య బహవో విహితాః మహిష్యః కురునందన ।
నైకస్యాః బహనః పుంసః శ్రూయంతే పతయః క్వచిత్ ॥ 27
ద్రుపదుడు అన్నాడు - కురునందనా! ఒకరాజునకు చాలామంది రాణులు ఉండవచ్చు. కాని ఒక రాణికి అనేకులు భర్తలుగా ఉండటం ఎక్కడా వినబడదు. (27)
లోకవేదవిరుద్ధం త్వం నాధర్మం ధర్మవిచ్ఛుచిః ।
కర్తుమర్హసి కౌంతేయ కస్మాత్తే బుద్ధిరీదృశీ ॥ 28
నీవు ధర్మవేత్తవు, పవిత్రుడవు. లోకవేద విరుద్ధమైన అధర్మాన్ని అంగీకరింపవు. కుంతీపుత్రా! నీబుద్ధి ఈ విధంగా ఎందుకు పెడదారిని పోతోంది? (28)
యుధిష్ఠిర ఉవాచ
సూక్ష్మో ధర్మో మహారాజ నాస్య విద్మో వయం గతిమ్ ।
పూర్వేషామానుపూర్వ్యేణ యాతం వర్త్మానుయామహే ॥ 29
యుధిష్ఠిరుడు చెప్ఫాడు - రాజా! ధర్మం మిక్కిలి సూక్ష్మమైంది. దాని మార్గాన్ని మన మెఱుగలేము. కాని పూర్వీకుల మార్గాన్నే ఈ విషయంలో అనుసరిద్దాం. (29)
న మే వాగనృతం ప్రాహ నాధర్మే ధీయతే మతిః ।
ఏవం చైవ వదత్యంబా మమ చైతన్మనోగతమ్ ॥ 30
నా మాట ఎన్నడూ పొల్లుపోదు, ధర్మంపైన నాబుద్ధి ఎన్నడూ నిలువదు. నా తల్లి ఈ విషయంలో ఇలాగే ఆజ్ఞాపించింది. నా మనస్సు కూడ ఇదే సరియైనదని తెల్పుతోంది. (30)
ఏష ధర్మో ధ్రువో రాజన్ చరైనమవిచారయన్ ।
మా చ శంకా తత్ర తే స్యాత్ కథంచిదపి పార్థివ ॥ 31
రాజా! ఇది నిశ్చయంగా ధర్మమే. ఇంక ఆలోచింపక అనుసరించు. ఈ విషయంలో మీకు ఏవిధమైన సంకోచమూ వద్దు. (31)
ద్రుపద ఉవాచ
త్వం చ కుంతీ చ కౌంతేయ ధృష్టద్యుమ్నశ్చ మే సుతః ।
కథయం త్వితి కర్తవ్యం శ్వః కాలే కరవామహే ॥ 32
ద్రుపదుడు అన్నాడు - నీవు, కుంతి, నాసుతుడైన ధృష్టద్యుమ్నుడూ కలిసి ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించండి. ధర్మరాజా! రేపు సరియైన సమయంలో దీని నాచరించుదాం. (32)
వైశంపాయన ఉవాచ
తే సమేత్య తతః సర్వే కథయంతి స్మ భారత ।
అథ ద్వైపాయనో రాజన్ అభ్యాగచ్ఛత్ యదృచ్ఛయా ॥ 33
వైశంపాయనుడు చెప్పాడు - భారతా! మరునాడు వారందరు కలిసి ఈ విషయాన్ని గూర్చి మాటాడుకొనే సమయంలో అనుకోకుండా కృష్ణద్వైపాయనమహర్షి అక్కడికి వచ్చాడు. (33)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి వైవాహికపర్వణి ద్వైపాయనాగమనే చతుర్నవత్యధిక శతతమోఽధ్యాయః ॥ 194 ॥
ఇది శ్రీమహాభారతమును ఆదిపర్వమున వైవాహికపర్వమను
ఉపపర్వమున ద్వైపాయనాగమనము అను నూట తొంబది నాలుగవ అధ్యాయము. (194)