206. రెండువందల ఆరవ అధ్యాయము

పాండవులు అర్ధరాజ్యమును పొంది ఇంద్రప్రస్థనిర్మాణము చేయుట.

ద్రుపద ఉవాచ
ఏవమేత్మనహాప్రాజ్ఞ యదాఽత్థ విదురాద్య మామ్ ।
మమాపి పరమో హర్షః సంబంధేఽస్మిన్ కృతే ప్రభో ॥ 1
ద్రుపదుడు అన్నాడు - విదురా! నీవు చెప్పినదంతా సత్యం. కౌరవుల ఈ సంబంధంతో నాకు చాలా ఆనందం కల్గింది. (1)
గమనం చాపి యుక్తం స్యాత్ దృడమేషాం మనస్వినామ్ ।
న తు తావన్మయా యుక్తమ్ ఏతద్ వక్తుం స్వయం గిరా ॥ 2
యదా తు మన్యతే వీరః కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
భీమసేనార్జునౌ చైవ యమౌ చ పురుషర్షభౌ ॥ 3
రామకృష్ణౌ చ ధర్మజ్ఞౌ తదా గచ్ఛంతు పాండవాః ।
ఏతౌ హి పురుషవ్యాఘ్రౌ ఏషాం ప్రియహితే రతౌ ॥ 4
పాండవులు హస్తినకు చేరటం ఉచితమే. కాని నేను వెళ్ళమని చెప్పటం సరైంది కాదు. యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకులసహదేవులు, బలరామకృష్ణులు ఎక్కడకు వెళ్లటం తగినదని భావిస్తారో అక్కడికే వెళ్లాలి. బలరామకృష్ణులు వీరిపట్ల మిక్కిలి ప్రీతికల్గి ఉన్నారు. (2-4)
యుధిష్ఠిర ఉవాచ
పరవంతో వయం రాజన్ త్వయి సర్వే సహానుగాః ।
యథా వక్ష్యసి నః ప్రీత్యా తత్ కరిష్యామహే వయమ్ ॥ 5
యుధిష్ఠిరుడు అన్నాడు. - రాజా! మేము అందరం నీ వశంలో ఉన్నాం. ప్రసన్నుడవై ఉచితానుచితాలు నిర్ణయిస్తె అట్లే చేస్తాం. (5)
వి॥ రామాయణంలో రాముడు "గోదావరి తీరంలో సరియైన ప్రదేశం చూసి పర్ణశాల నిర్మించు" మని లక్ష్మణునితో అంటాడు. అపుడు లక్ష్మణుడు "పరవానస్మి కాకుత్థృ" అంటాడు. నేను అస్వతమ్త్రుడను - నీవు ఎక్కడ నిర్మించమంటే అక్కడ నిర్మిస్తాను - అంటాడు. ఇది పెద్దల పట్ల ఉన్న వినయాన్ని సూచిస్తుంది.
వైశంపాయన ఉవాచ
తతోఽబ్రవీద్ వాసుదేవః గమనం రోచతే మమ ।
యథా వా మన్యసే రాజా ద్రుపదః సర్వధర్మవిత్ ॥ 6
వైశంపాయనుడు పలికాడు - తరువాత వాసుదేవుడు ఇలా అన్నాడు. "సర్వధర్మాలూ తెలిసిన ద్రుపదుడు అనుకొన్నట్లుగా వెళ్లడమే నాకూ ఇష్టం". (6)
ద్రుపద ఉవాచ
యథైవ మన్యతే వీరః దాశార్హః పురుషోత్తమః ।
ప్రాప్తకాలం మహాబాహుః సా బుద్ధిర్నిశ్చితా మమ ॥ 7
యథైవ హి మహాభాగాః కౌంతేయా మమ సాంప్రతమ్ ।
తథైవ వాసుదేవస్య పాండుపుత్రా న సంశయః ॥ 8
ద్రుపదుడు అపుడు ఇలా అన్నాడు - దాశార్హుడైన కృష్ణుని అభిప్రాయమే నాకూ సమ్మతం. కుంతీపుత్రులు ఇప్పుడు నాకు ఎట్టి బంధువులో శ్రీకృష్ణునకూ వారు అలాంటివారే అనే మాట సత్యం. (7,8)
న తద్ ధ్యాయతి కౌంతేయః పాండుపుత్రో యుధిష్ఠిరః ।
యథైషామ్ పురుషవ్యాఘ్రః శ్రేయో ధ్యాయతి కేశవః ॥ 9
పురుషోత్తముడు కేశవుడు ఎల్లప్పుడూ పాండవుల హితమ్ ఎంతగా కోరుకుంటాడో అంతగా కుంతీపుత్రుడు ధర్మజుడు కూడ తన తమ హితాన్ని కోరడు. (9)
(వైశంపాయన ఉవాచ
పృథాయాస్తు తథా వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః ।
పాదౌ స్పృష్ట్వా పృథాయాస్తు శిరసా చ మహీం గతః ॥
దృష్ట్వా తు దేవరం కుంతీ శుశోచ చ ముహుర్ముహుః ॥
వైశంపాయనుడు చెప్పాడు - జనమేజయా! తేజస్వి అయిన విదురుడు కుంతిభవనాన్ని చేరాడు. అతడు భూమిని శిరస్సుతో తాకి కుంతి పాదాలకు నమస్కరించాడు. కుంతీదేవి మరిదిని చూచి మిక్కిలి విలపించింది.
కుంత్యువాచ
వైచిత్రవీర్య తే పుత్రాః కథంచిజ్జీవితాస్త్వయా ।
త్వత్ప్రసాదాజ్జతుగృహే త్రాతాః ప్రత్యాగతాస్తవ ॥
కూర్మశ్చింతయతే పుత్రాన్ యత్ర వా తత్ర వా గతాన్ ।
చింతయా వర్ధయేత్ పుత్రాన్ యథా కుశలినస్తథా ॥
తవ పుత్రాస్తు జీవంతి త్వం త్రాతా భరతర్షభ ।
యథా పరభృతః పుత్రానరిష్టా వర్ధయేత్ సదా ।
తథైవ తవ పుత్రాస్తు మయా తాత సురక్షితాః ॥
దుఃఖాస్తు బహవః ప్రాప్తాః తథా ప్రాణాంతికా మయా ।
అతః పరం న జానామి కర్తవ్యం జ్ఞాతుమర్హసి ॥
కుంతి అన్నది - విదురా! నీ పుత్రులైన పాండవులు ఎలాగో నీ అనుగ్రహంతో లక్కయింటి నుండి బయటపడి తిరిగి వచ్చారు. తాబేలు తన పిల్లల్ని గురించి ఆలోచన చేయడమే వాటిని పెంచటం, పొషించటం అవుతుంది. అవి తెలివితేటలు సంపాదిస్తాయి. అదేవిధంగా పాండవులు నీ ఆలోచనతో పెరిగి మంచివారయ్యారు. నీవే వీరి రక్షకుడవు. కోకిలపుత్రులను కాకి సంరక్షించినట్లు నీ పుత్రుల్ని నేను పెంచాను. ఇప్పటి వరకు ప్రాణాంతకాలైన కష్టాలను అనుభవించాను. ఇకపై కర్తవ్య నిర్ణయం నీవే చెయ్యాలి. నాకెంత మాత్రం తెలియదు.
విదుర ఉవాచ
న వినశ్యంతి లోకేషు తవ పుత్రా మహాబలాః ।
న చిరేణైవ కాలేన స్వరాజ్యస్థా భవంతి తే ।
బాంధవైః సహితాః సర్వైః మా శోకం కురు మాధవి ॥)
విదురుడు అన్నాడు - యాదవ వంశనందినీ! నీ పుత్రులు, బలవంతులు. ఇతరులచే నాశం పొందరు, అచిరకాలంలో వారు బంధుమిత్రులతో కలిసి రాజ్యాధికారం పొందుతారు. నీవు దుఃఖించకు.
వైశంపాయన ఉవాచ
తతస్తే సమనుజ్ఞాతాః ద్రుపదేన మహాత్మనా ।
పాండవాశ్చైవ కృష్ణశ్చ విదురశ్చ మహీపతే ॥ 10
ఆదాయ ద్రౌపదీం కృష్ణాం కుంతీం చైవ యశస్వినీమ్ ।
సవిహారం సుఖమ్ జగ్ముః నగరం నాగసాహ్వయమ్ ॥ 11
వైశంపాయనుడు అన్నాడు - రాజా! ద్రుపదుని అంగీకారంతో పాండవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణుడు, విదురుడు సుఖంగా హస్తినకు బయలుదేరారు. (10,11)
(సువర్ణకక్ష్యాగ్రైవేయాన్ సువర్ణాంకుశభూషితాన్ ।
జాంబూనదపరిష్కారాన్ ప్రభిన్నకరటాముఖాన్ ॥
అధిష్ఠితాన్ మహామాత్రైః సర్వశస్త్రసమన్వితాన్ ।
సహస్రం ప్రదదౌ రాజా గజానాం వరవర్ణినామ్ ॥
రథానాం చ సహస్రం వై సువర్ణమనిచిత్రితమ్ ।
చతుర్యుజాం భానుమచ్చ పంచానామ్ ప్రదదౌ తదా ॥
సువర్ణపరిబర్హాణాం వరచామరమాలినామ్ ।
జాత్యశ్వానాం చ పంచాశత్ సహస్రం ప్రదదౌ నృపః ॥
దాసీనామయుతం రాజా ప్రదదౌ వరభూషణమ్ ।
తతః సహస్రం దాసానామ్ ప్రదదౌ వరధన్వినామ్ ॥
హైమాని శయ్యాసన భాజనాని
ద్రవ్యాణి చాన్యాని చ గోధనాని ।
పృథక్ పృథక్ చైవ దదౌ స కోటిం
పాంచాలరాజః పరమప్రహృష్టః ॥
శిబికానాం శతం పూర్ణం వాహాన్ పంచశతం నరాన్ ।
ఏవమేతాని పాంచాలః కన్యార్థే ప్రదదౌ ధనమ్ ॥
హరణం చాపి పాంచాల్యా జ్ఞాతిదేయం తు సౌమకిః ।
ధృష్టద్యుమ్నో యయౌ తత్ర భగినీం గృహ్య భారత ॥
నానద్యమానే బహుభిః తూర్యశబ్దైః సహస్రశః ॥
ఆ సమయాన ద్రుపదుడు కంఠాన బంగారు ఆభరణాలు, బంగారు అంబారీ పీఠాలు ఉన్న వెయ్యి ఏనుగులను ఇచ్చాడు. వాటి శరీరం నుండి మదధారలు స్రవిస్తున్నాయి. మావటి వాండ్రు వాటిని నడపుతున్నారు. వారు అస్త్రశస్త్రాలలో
ఆరితేరినవారు. నాలుగేసి గుఱ్ఱాలు పూన్చిన వేయి రథాలను ఇచ్చాడు. ఐదువందల ఉత్తమజాతి గుఱ్ఱాలు ఇచ్చాడు. వాటి బంగారు ఆభరణాల కాంతులు అన్నివైపులా ప్రసరించాయి. పదివేల దాసిజనాన్ని ఇచ్చాడు. వెయ్యిమంది సమర్థులైన ధానుష్కులను ఇచ్చాడు. బంగారు పాత్రలు, పాన్పులు, ఆసనాలు ఇచ్చాడు. విడివిడిగా కోటి సంఖ్యలో గోధనం కూడా పంపాడు. ద్రుపదుడు వంద పల్లకీలను, అయిదు వందల బోయీలను తనకుమార్తెకు కానుకగా ఇచ్చాడు. ఈ విధంగా పాంచాలరాజు ద్రౌపదికి సమస్తవస్తువులనూ, ధనాన్నీ, అరణంగా ఇచ్చాడు. ధృష్టద్యుమ్నుడు స్వయంగా ద్రౌపది చేయిపట్టుకొని రథమెక్కించాడు. అప్పుడు అక్కడ వేలకొలది మంగలవాద్యాలు మ్రోగాయి.
శ్రుత్వా చాప్యాగతాన్ వీరాన్ ధృతరాష్ట్రో జనేశ్వరః ।
ప్రతి గ్రహాయ పాండూనాం ప్రేషయామాస కౌరవాన్ ॥ 12
ధృతరాష్ట్రుడు పాండవుల రాక విని వారికి ముందుకు పోయి స్వాగతం చెప్పటానికి కౌరవులను పంపించాడు. (12)
వికర్ణం చ మహేష్వాసం చిత్రసేనం చ భారత ।
ద్రోణం చ పరమేష్వాసం గౌతమమ్ కృపమేవ చ ॥ 13
భారతా! ధానుష్కుడైన వికర్ణుని, చిత్రసేనుని, ధనుర్విద్యావిశారదుడు ద్రోణుని, గౌతమవంశీయుడు కృపుని పంపాడు. (13)
తైస్తైః పరివృతా వీరాః శోభమానా మహాబలాః ।
నగరం హాస్తినపురం శనైః ప్రవివిశుస్తదా ॥ 14
(పాండవానాగతాంచ్ఛ్రుత్వా నాగరాస్తు కుతూహలాత్ ।
మండయాంచక్రిరే తత్ర నగరం నాగసాహ్వయమ్ ॥
ముక్తపుష్పావకీర్ణం తజ్జలసిక్తం తు సర్వశః ।
ధూపితం దివ్యధూపేన మండనైశ్చాపి సంవృతమ్ ॥
పతాకోచ్ఛ్రితమాల్యం చ పురమ ప్రతిమం బభౌ ।
శంఖభేరీనినాదైశ్చ నానావాదిత్రనిఃస్వనైః ॥)
కౌతూహలేన నగరం దీప్యమానమివాభవత్ ।
తత్ర తే పురుషవ్యాఘ్రాః శోకదుఃఖవినాశనాః ॥ 15
తత ఉచ్చావచా వాచః పౌరైః ప్రియచికీర్షుభిః ।
ఉదీరితా అశృణ్వంస్తే పాండవా హృదయంగమాః ॥ 16
ఆ వీరులతో కలిసి మహాబలులు, వీరులు అయిన పాండవులు మెల్లమెల్లగా హస్తినలో ప్రవేశించారు. పాండవుల రాక విని పౌరులు నగరాన్ని అన్నివైపుల అలంకరించారు. పూలు చల్లారు. నీళ్ళతో తడిపారు. దివ్యధూపాలు వెలిగించారు.
పుష్పహారాలతో, జెండాలతో, శంఖభేరీనాదాలతో, నానావాద్యాలతో మారుమ్రోగుతూ నగరం కుతూహలంతో దేదీప్యమానంగా ఉంది. పాండవులు పురుషశ్రేష్ఠులు. ప్రజల శోకదుఃఖాలను నివారించేవారు. ప్రియం చేసే పౌరులు పలికిన హృదయంగమాలైన పలుకులు పాండవులు విన్నారు. (14-16)
అయం స పురుషవ్యాఘ్రః పునరాయాతి ధర్మవిత్ ।
యో నః స్వానివ దాయాదాన్ ధర్మేణ పరిరక్షతి ॥ 17
ధర్మవేత్త యుదిష్ఠిరుడు తిరిగి వచ్చాడు. మనలను తన కన్నబిడ్డల వలె ధర్మంగా పరిరక్షిస్తాడు. (17)
అద్య పాండుర్మహారాజః వనాదివ జనప్రియః ।
ఆగతః ప్రియమస్మాకం చికీర్షుర్నాత్ర సంశయః ॥ 18
నేడు జనప్రియుడైన పాండుమహారాజు మనకు ప్రియం చేయాలని వనం నుంచి తిరిగి వచ్చాడు అన్నది సత్యం. (18)
కిం ను నాద్య కృతం తాత సర్వేషాం నః పరం ప్రియమ్ ।
యన్నః కుంతీసుతా వీరాః నగరం పునరాగతాః ॥ 19
కుంతీపుత్రులు పాండవులు నగరప్రవేశం చేస్తే మనకు ఏ శుభం సిద్ధింపదు? (19)
యది దత్తం యది హుతం విద్యతే యది నస్తపః ।
తేన తిష్టంతు నగరే పాండవాః శరదాం శతమ్ ॥ 20
మనం పూర్వం దానం, హోమం, తపస్సు చేసి ఉంటే పాండవులు మన నగరంలో సంవత్సరాల కొద్దీ ఇక్కడే ఉంటారు. (20)
తతస్తే ధృతరాష్ట్రస్య భీష్మస్య చ మహాత్మనః ।
అన్యేషాం చ తదర్హాణాం చక్రుః పాదాభివందనమ్ ॥ 21
ఇంతలో పాండవులు ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణాదులకు పాదాభివందనం చేశారు. (21)
కృత్వా తు కుశలప్రశ్నమ్ సర్వేణ నగరేణ చ ।
న్యవిశంతాథ వేశ్మాని ధృతరాష్ట్రస్య శాసనాత్ ॥ 22
నగరవాసులందరినీ కుశలమడిగి ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం పాండవులు తమతమ భవనాల్లోకి ప్రవేశించారు. (22)
(దుర్యోధనస్య మహిషీ కాశిరాజసుతా తదా ।
ధృతరాష్ట్రస్య పుత్రాణాం వధూభిః సహితా తదా ॥
పాంచాలీం ప్రతిజగ్రాహ ద్రౌపదీం శ్రీమివాపరామ్ ।
పూజయామాస పూజార్హాం శచీదేవీమివాగతామ్ ॥
వవందే తత్ర గాంధారీం మాధవీ కృష్ణయా సహ ।
ఆశిషశ్చప్రయుక్త్వా తు పాంచాలీం పరిషస్వజే ॥
పరిష్వజ్య చ గాంధారీ కృష్ణాం కమలలోచనామ్ ।
పుత్రాణాం మమ పాంచాలీ మృత్యురేవేత్యమన్యత ।
సా చింత్య విదురం ప్రాహ యుక్తితః సుబలాత్మజా ॥)
దుర్యోధనుని రాణి తోడికోడండ్రతో కలిసి ఎదురేగి రెండవలక్ష్మివలె ఉన్న ద్రౌపదికి స్వాగతం పలికింది. శచీదేవియే అడుగుపెట్టినట్లు తోచింది. కుంతి, ద్రౌపదీ గాంధారికి నమస్కరించారు. గాంధారి ఆశీర్వదించి ద్రౌపదిని కౌగిలించుకుంది. ఈ పాంచాలి నా పుత్రుల మృత్యుదేవతవలె ఉంది అని తలంచి విదురుని తెలివిగా మాట్లాడింది.
గాంధార్యువాచ
కుంతీం రాజసుతాం క్షత్రః సవధూ సపరిచ్ఛదామ్ ।
పాండోర్నివేశనం శీఘ్రం నీయతాం యది రోచతే ॥
కరణేన ముహూర్తేన నక్షత్రేణ శుభే తిధౌ ।
యథా సుఖం తథా కుంతీ రంస్యతే స్వగృహే సుతైః ॥
గాంధారి అన్నది - విదురా! నీకిష్టమైన రాజకుమారి కుంతిని, ద్రౌపదిని శీఘ్రంగా పాండురాజ భవనానికి చేర్చు. సామగ్రి ఆ భవనానికి చేర్పించు. కరణం, ముహూర్తం, నక్షత్రం, తిథి శుభం అయిన కారణంగా భవనంలోకి ప్రవేశపెట్టు. కుంతి తన పుత్రులతో ఆ గృహంలో క్షేమంగా ఉండాలి.
వైశంపాయన ఉవాచ
తథేత్యేవ తదా క్షత్రః కారయామాస తత్తదా ।
పుజయామాసురత్యర్థం బాంధవాః పాండవాంస్తదా ॥
నాగరాః శ్రేణిముఖ్యాశ్చ పూజయంతి స్మ పాండవాన్ ।
భీష్మో ద్రోణస్తథా కర్ణః బాహ్లీకః ససుతస్తదా ॥
శాసనాద్ ధృతరాష్ట్రస్య అకుర్వన్నతిథిక్రియామ్ ।
ఏవం విహరతాం తేషాం పాండవానాం మహాత్మనామ్ ॥
నేతా సర్వస్య కార్యస్య విదురో రాజశాసనాత్ ॥)
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! మంచి సూచనను గమనించి విదురుడు వెంటనే వారిని భవనంలో ప్రవేశపెట్టాడు. బాంధవులు పాండవులను సత్కరించారు. పౌరులు, శ్రేష్ఠులు పాండవులను పూజించారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కుమారునితో కలిసి బాహ్లీకుడు ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం పాండవులపై ఆదరసత్కారాలను చూపారు. ఇలా విహరించే పాండవులకు అప్పుడు విదురుడే సర్వకార్యాలకు నాయకుడై ఉన్నాడు. ధృతరాష్ట్రుని ద్వారా ఆజ్ఞను పొందాడు.
విశ్రాంతాస్తే మహాత్మానః కంచిత్ కాలం మహాబలాః ।
ఆహుతా ధృతరాష్ట్రేణ రాజ్ఞా శాంతనవేన చ ॥ 23
కొంతకాలం విశ్రాంతిని పొందిన తరువాత మహాత్ములైన పాండవులను ధృతరాష్ట్రుడు, భీష్ముడు పిలిపించారు. (23)
ధృతరాష్ట్ర ఉవాచ
భ్రాతృభిః సహ కౌంతేయ నిబోధ గదతో మమ ।
(పాండునా వర్ధితం రాజ్యం పాండువా పాలితం జగత్ ॥
శాసనాన్మమ కౌంతేయ మమ భ్రాతా మహాబలః ॥
కృతవాన్ దుష్కరం కర్మ నిత్యమేవ విశాంపతే ।
తస్మాత్ త్వమపి కౌంతేయ శాసనం కురు మా చిరమ్ ॥
మమ పుత్రా దురాత్మానః దర్పాహంకార సంయుతాః ॥
శాసనం న కరిష్యంతి మమ నిత్యం యుధిష్ఠిర ।
స్వకార్యనిరతైర్నిత్యమవలిప్తైర్దురాత్మభిః ॥)
పునర్వో విగ్రహం మా భూత్ ఖాండవప్రస్థమావిశ ॥ 24
ధృతరాష్ట్రుడు అన్నాడు. - యుధిష్ఠిరా! నీతో చెప్పే మాటలను నీ సోదరులతో కలిసి శ్రద్ధగా విను. పాండురాజు ఈ రాజ్యాన్ని వృద్ధి చేశాడు, పరిపాలించాడు. నా సోదరుడు పాండురాజు బలవంతుడు. అతడు నా ఆజ్ఞపై అసాధ్యాలను సాధ్యం చేశాడు. నీవును నా ఆజ్ఞను పాలించు. ఆలస్యం చేయకు. నా పుత్రులు గర్వం, అహంకారం కల చెడ్డవాళ్లు. వారు నా ఆజ్ఞలు పాలింపరు. స్వార్థసాధనలో లగ్నమై వారు మీతో యుద్ధం చేయకుండా ఉండాలంటే ఖాండవప్రస్థం మీరు ప్రవేశించాలి. (24)
న చ వో వసతస్తత్ర కశ్చిచ్ఛక్తః ప్రబాధితుమ్ ।
సంరక్ష్యమాణాన్ పార్థేన త్రిదశానివ వజ్రిణా ॥ 25
అర్ధం రాజ్యస్య సంప్రాప్య ఖాండవప్రస్థమావిశ ।
అక్కడ నివసించే మిమ్మల్ని ఎవరూ బాధింపలేరు. ఇంద్రుడు దేవతలను రక్షించినట్లు అర్జునుడు మిమ్మల్ని రక్షిస్తాడు. అర్ధరాజ్యంగా ఖాండవప్రస్థాన్ని పొంది అక్కడ సోదరులతో నివసించు. (25)
(ధృతరాష్ట్ర ఉవాచ
అభిషేకస్య సంభారాన్ క్షత్రరానయ మా చిరమ్ ।
అభిషిక్తం కరిష్యామి అద్య వై కురునందనమ్ ॥
బ్రాహ్మణా నైగమశ్రేష్ఠాః శ్రేణీముఖ్యాశ్చ సర్వశః ।
ఆహూయంతాం ప్రకృతయః బాంధవాశ్చ విశేషతః ॥
పుణ్యాహం వాచ్యతాం తాత గోసహస్రం తు దీయతామ్ ।
గ్రామముఖ్యాశ్చ విప్రేభ్యః దీయంతాం సహ దక్షిణాః ॥
అంగదే ముకుటం క్షత్తః హస్తాభరణమానయ ।
ముక్తావళీశ్చ హారం చ నిష్కాదీన్ కుండలాని చ ॥
కటిబంధశ్చ సూత్రం చ తథోదరనిబంధనమ్ ॥
అష్టోత్తరసహస్రం తు బ్రాహ్మణాధిష్ఠితా గజాః ।
జాహ్నవీసలిలం శీఘ్రమ్ ఆనయంతు పురోహితైః ॥
అభిషేకోదకక్లిన్నం సర్వాభరణభూషితమ్ ।
ఓపవాహ్యోపరిగతం దివ్యచామరవీజితమ్ ॥
సువర్ణమణి చిత్రేన శ్వేతచ్ఛత్రేన శోభితమ్ ।
జయేతి ద్విజవాక్యేన స్తూయమానం నృపైస్తథా ॥
దృష్ట్వా కుంతీసుతం జ్యేష్ఠమ్ ఆజమీఢం యుధిష్ఠిరమ్ ।
ప్రీతాః ప్రీతేన మనసా ప్రశంసంతు పురే జనాః ॥
పాండోః కృతోపకారస్య రాజ్యం దత్త్వా మమైవ చ ।
ప్రతిక్రియా కృతమిదం బవిష్యతి న సంశయః ॥
ధృతరాష్ట్రుడు చెప్పాడు - విదురా! నీవు రాజ్యాభిషేకానికి సామాగ్రిని తెప్పించు. ఆలస్యం వద్దు. నేనీరోజున కురుకుల నందనుడైన యుధిష్ఠిరుని అభిషేకిస్తాను. వేదవేత్తలయిన బ్రాహ్మణులను, వ్యాపారులను, బంధువులను, పౌరులను విశేషంగా రప్పించు. పుణ్యాహవాచనం చేయించి బ్రాహ్మణులకు భూరిదక్షిణలు ఇమ్ము. గోవులు, గ్రామాలు దానం చెయ్యి. ముత్యాల హారాలు, కోటి సూత్రం, ఉదరబంధమ్ తెప్పించు, బ్రాహ్మణుల స్వారీకి వీలైన వెయ్యి ఎనిమిది ఏనుగులను సిద్ధం చెయ్యి, పురోహితులు, ఏనుగులు పోయి గంగాజలం తేవాలి. యుదిష్ఠిరుని సర్వాభరణాలతో అలంకరించాలి. అంబారీ ఏనుగు, సువర్ణాభరణాలు, శ్వేతచ్ఛత్రం, చామరాలతో సిద్ధం చెయ్యాలి. బ్రాహ్మణులు, రాజులు జయశబ్దాలు పలకాలి. ప్రసన్నులై ప్రజలు ఆజమీఢ వంశజుడైన యుధిష్ఠిరుని ప్రశంసించాలి. పాండురాజు చేసిన ఉపకారానికి బదులుగా ఈ రాజ్యాభిషేకం చెయ్యాలి. ఇందులో సందేహం లేదు.
వైశంపాయన ఉవాచ
భీష్మో ద్రోణః కృపః క్షత్తా సాధు సాధ్విత్యభాషత ।
వైశంపాయనుడన్నాడు - భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు బాగుందని ప్రశంసించారు.
శ్రీవాసుదేవ ఉవాచ
యుక్తమేతన్మహారాజ కౌరవాణాం యశస్కరమ్ ।
శీఘ్రమద్యైవ రాజేంద్ర యథోక్తం కర్తుమర్హసి ॥
వాసుదేవుడు అన్నాడు - మహారాజా! నీ ఆలోచన ఉత్తమం. కౌరవులకు అభివృద్ధికరం. వెంటనే నీ వచనాలను నేడే ఆచరించు.
వైశంపాయన ఉవాచ
ఇత్యేవముక్త్వా వార్ణ్షేయః త్వరయామాస తం తదా ।
యథోక్తం ధృతరాష్ట్రస్య కారయామాస కౌరవః ॥
తస్మిన క్షణే మహారాజ కృష్ణద్వైపాయనస్తదా ।
ఆగత్య కురుభిః సర్వైః పూజితః స సుహృద్గణైః ॥
మూర్ధావసిక్తైః సహితః బ్రాహ్మణైర్వేదపారగైః ।
కారయామాస విధివత్ కేశవానుమతే తదా ॥
కృపో ద్రోణశ్చ బీష్మశ్చ ధౌమ్యశ్చ వ్యాసకేశవౌ ।
బాహ్లీకః ద్రోణశ్చ భీష్మశ్చ ధౌమ్యశ్చ వ్యాసకేశవౌ ।
బాహ్లీకః సోమదత్తశ్చ చాతుర్వేద్యపురస్కృతాః ॥
అభిషేకం తదా చక్రుః భద్రపీఠే సుసంయతమ్ ।
జిత్వా తు పృథివీం కృత్స్నాం వశే కృత్వా నరర్షభాన్ ॥
రాజసూయాదిభిర్యజ్ఞైః క్రతుభిర్బూరిదక్షిణైః ।
స్నాత్వా హ్యవభృథస్నానం మొదతాం బాంధవైః సహ ॥
ఏవముక్త్వా తు తే సర్వే ఆశీర్భిరభిపూజయన్ ।
మూర్ధాభిషిక్తః కౌరవ్య సర్వాభరణభూషితః ॥
జయేతి సంస్తుతో రాజా ప్రదదౌ ధనమక్షయమ్ ।
సర్వమూర్ధావసిక్తైశ్చ పూజితః కురునందనః ॥
ఔపవాహ్యమథారుహ్య శ్వేతచ్ఛత్రేన శోభితః ।
రరాజానుమతో రాజా మహేంద్ర ఇవ దైవతైః ॥
తతః ప్రదక్షిణీకృత్య నగరం నాగసాహ్వయమ్ ।
ప్రవివేశ తతో రాజా నాగరైః పూజితో భృశమ్ ॥
మూర్ధాభిషిక్తం కౌంతేయమ్ అభ్యనందంత బాంధవాః ।
గాంధారిపుత్రాః శోచంతః సర్వే తే సహ బాంధవైః ॥
జ్ఞాత్వా శోకం తు పుత్రాణాం ధృతరాష్ట్రోఽబ్రవీన్నృపమ్ ॥
సమక్షం వాసుదేవస్య కురూణాం చ సమక్షతః ॥
వైశంపాయనుడు అన్నాడు - శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పి పట్టాభిషేకానికి తొందరపెట్టాడు. విదురుడు ధృతరాష్ట్రుడు చెప్పినట్లు కార్యాలన్నీ పూర్తిచేశాడు. అదే సమయంలో కృష్ణద్వైపాయనమహర్షి అక్కడకు చేరాడు. కౌరవులందరూ బంధుసమేతంగా ఆయనను పూజించారు. శ్రీ కృష్ణుని ఆజ్ఞానుసారం వేదపండితుల సహాయంతో యథావిధిగా వ్యాసభగవానుడు పట్టాభిషేకం పూర్తికావించాడు. కృపుడు, ద్రోణుడు, భీష్ముడు, ధౌమ్యుడు, వ్యాసుడు, శ్రీకృష్ణుడు,
బాహ్లీకుడు, సోమదత్తుడు, చతుర్వేద విశారదులైన బ్రాహ్మణులను ముందు ఉంచి విధిపురస్సరంగా భద్రపీఠంపై నిగ్రహంతో ఉన్న ధర్మజుని అభిషేకించారు. రాజా! నీవు సమస్త భూమిని జయించి, నీ అధీనంలో ఉంచి రాజసూయాదియాగాలు గొప్ప దక్షిణలిచ్చి నిర్వహించి, అవభృథస్నానం చేసి బంధుమిత్రులతో సుఖంగా ఉండు అని ఆశీర్వదించారు. అలంకారసహితుడై ధర్మజుడు మూర్ధాభిషిక్తుడై అక్షయదక్షిణలు అందరికీ ఇచ్చాడు. సరిగ్గా అదే సమయాన అందరు జయ జయ ధ్వనులు చేశారు. రాజులందరు యుధిష్ఠిరుని అభినందించారు. ఏనుగును అధిరోహించిన ధర్మజుడు అనుచరులతో అనుసరింపబడి దేవతలనుసరించే ఇంద్రుని వలె ప్రకాశించాడు. శ్వేతచ్ఛత్రంతో వెలిగిపోయాడు. హస్తినాపురానికి ప్రదక్షిణమ్ చేసి నాగరికుల అనుసరణంతో నగరంలోకి ప్రవేశించాడు. బంధుమిత్రులందరు పట్టాభిషిక్తుడైన ధర్మజుని అభినందించారు. గాంధారీదేవి పుత్రులందరు ఈ వైభవాన్ని చూచి దుఃఖించారు. ఇది తెలిసిన ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని, కౌరవుల సమక్షంలో యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు.
ధృతరాష్ట్ర ఉవాచ
అభిషేకం త్వయా ప్రాప్తం దుష్ప్రాపమకృతాత్మభిః ।
గచ్ఛ త్వమద్యైవ నృప కృతకృత్యోఽసి కౌరవ ॥
ఆయుః పురూరవా రాజన్ నహుషశ్చ యయాతినా ।
తత్రైవ నివసంతి స్మ ఖాండవాహ్వే నృపోత్తమ ॥
రాజధానీ తు సర్వేషాం పౌరవాణాం మహాభుజ ।
వినాశితం మునిగణైః లోభాత్ బుధసుతస్య చ ॥
తస్మాత్ త్వం ఖాండవప్రస్థం పురం రాష్ట్రం చ వర్ధయ ।
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చ కృతనిశ్చయాః ॥
త్వద్భక్త్యా జంతవశ్చాన్యే భజంత్వేవం పురం శుభమ్ ।
పురం రాష్ట్రం సమృద్ధం వై ధనధాన్యైః సమావృతమ్ ॥
తస్మాత్ గచ్ఛస్య కౌంతేయ భ్రాతృభిః సహితోఽనఘ ।)
ధృతరాష్ట్రుడు చెప్పాడు - నీవు పొందిన పట్టాభిషేకం అజితాత్ములైన పురుషులకు అసాధ్యం. రాజా! నీవు పూర్వుల రాజ్యాన్ని పొంది కృతార్ధుడవు అయ్యావు. నీవు నేడే ఖాండవ ప్రస్థానికి పోయి నివసించు. అది పూర్వం పౌరవుల రాజధానీనగరం. ఖాండవప్రస్థాన్ని బుధపుత్రుని కారణంగా ఋషులు నాశనం చేశారు. నీవు మరల ఖాండవ ప్రస్థాన్ని వృద్ధి చెయ్యాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతరులు నీమీది భక్తితో నిన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నగరం ధనధాన్య సమృద్ధి కలది. నీ తమ్ములతో వెంటనే బయలుదేరు.
వైశంపాయన ఉవాచ
ప్రతిగృహ్య తు తద్ వాక్యం నృపం సర్వే ప్రణమ్య చ ॥ 26
ప్రతస్థిరే తతో ఘోరం వనమ్ తన్మనుజర్షభాః ।
అర్ధం రాజ్యస్య సంప్రాప్య ఖాండవప్రస్థమావిశత్ ॥ 27
వైశంపాయనుడు అన్నాడు - ధృతరాష్ట్రుని మాటను గౌరవించి పాండవులు అతనికి నమస్కరించి, అర్ధరాజ్యం పొంది, భయంకర, వనమైన ఖాండవప్రస్థానికి మెల్లమెల్లగా చేరారు. (26,27)
తతస్తె పాండవాస్తత్ర గత్వా కృష్ణపురోగమాః ।
మండయాంచక్రిరే తద్ వై పరం స్వర్గవదచ్యుతాః ॥ 28
పిమ్మట మర్యాదను అతిక్రమింపని పాండవులు కృష్ణుని ముందు ఉంచుకొని ఆ ప్రదేశం చేరి స్వర్గం వలె ప్రకాశించేటట్లు దాన్ని అలంకరించారు. (28)
(వాసుదేవో జగన్నాథః చింతయామాస వాసవమ్ ।
మహేంద్రశ్చింతితో రాజన్ విశ్వకర్మాఅమాదిశత్ ॥
భగవంతుడైన వాసుదేవుడు ఇంద్రుని మనస్సులో భావించాడు. అది గుర్తించిన ఇంద్రుడు విశ్వకర్మను ఆదేశించాడు.
మహేంద్ర ఉవాచ
విశ్వకర్మన్ మహాప్రాజ్ఞ అద్యప్రభృతి తత్ పురమ్ ।
ఇంద్రప్రస్థమితి ఖ్యాతం దివ్యం రమ్యం భవిష్యతి ॥
మహేంద్రుడు అన్నాడు - విశ్వకర్మా! బుద్ధిశాలీ! నీవు పోయి ఖాండవప్రస్థాన నగర నిర్మాణం చెయ్యాలి! అది ఇంద్రప్రస్థం అనుపేర ప్రసిద్ధి చెందాలి.
వైశంపాయన్ ఉవాచ
మహేంద్రశాసనాద్ గత్వా విశ్వకర్మా తు కేశవమ్ ।
ప్రణమ్య ప్రణిపాతార్హమ్ కిం కరోమీత్యభాషత ॥
వాసుదేవస్తు తచ్ఛ్రుత్వా విశ్వకర్మాణమూచివాన్ ।
వైశంపాయనుడు పలికాడు. మహేంద్రుని ఆజ్ఞానుసారం విశ్వకర్మ శ్రీకృష్ణునికి నమస్కరించి 'మీ ఆజ్ఞను పాలిస్తాను'. అనగానే శ్రీకృష్ణుడు ఆ మాటవిని విశ్వకర్మతో చెప్పాడు.
వాసుదేవ ఉవాచ
కురుష్వ కురురాజాయ మహేంద్రపురసంనిభమ్ ।
ఇంద్రేణ కృతనామానమ్ ఇంద్రప్రస్థం మహాపురమ్ ॥)
శ్రీకృష్ణుడు అన్నాడు - విశ్వకర్మా! కురురాజైన యుధిష్ఠిరునకు ఇంద్రనగరం వంటి నగరాన్ని నిర్మిమ్చు. అది శ్రీకృష్ణవచనానుసారం రాబోయే కాలంలో ఇంద్రప్రస్థమని పేరు పొందాలి.
తతః పుణ్యే శివే దేశే శాంతిం కృత్వా మహారథాః ।
నగరం మాపయామాసుః ద్వైపాయనపురోగమాః ॥ 29
పిమ్మట పవిత్రం, మంగళం అయిన ప్రదేశంలో ద్వైపాయనుని ముందుంచుకొని మహారథులైన పాండవులు శాంతికర్మను చేసి నగరనిర్మాణం చేయటానికి కొలిపించారు. (29)
సాగరప్రతిరూపాభిః పరిఖాభిరలంకృతామ్ ।
ప్రాకారేణ చ సంపన్నం దివమావృత్య తిష్ఠతా ॥ 30
పాండురాభ్రప్రకాశేన హిమరశ్మినిబేన చ ।
శుశుభే తత్ పురశ్రేష్ఠం నాగైర్భోగవతీ తథా ॥ 31
ఆ నగరానికి నలువైపుల సాగరసదృశాలు, అగాధాలు అయిన పరిఖలు తవ్వించాడు. ప్రాకారాలతో ఆ నగరం ఆకాశాన్ని తాకేలా ఉంది. తెల్లని మేఘాలకాంతిని, చంద్రకిరణాల శోభను వ్యాపించేలా చేస్తోంది. నాగనగరం భోగవతిలా నాలుగువైపుల గోడలతో ఆ నగరం ప్రకాశిస్తోంది. (30,31)
ద్విపక్షగరుడప్రఖైర్ద్వారైః సౌధైశ్చ శోభితమ్ ।
గుప్తమభ్రచయప్రఖైః గోపురైర్మందరోపమైః ॥ 32
ఆ నగరం ద్వారాలు, గరుడుని రెక్కల్లా ఉన్నాయి. గదులు విశాలంగా ఉన్నాయి. మేఘచయం వలె శోభిస్తూ మందరపర్వతంలా ఎత్తైన గోపురద్వారాలతో ఆ నగరం సురక్షితమై ఉంది. (32)
వివిధైరపి నిర్విద్ధైః శస్త్రోపేతైః సుసంవృతైః ।
శక్తిభిశ్చావృతం తద్ధి ద్విజిహ్వైరివ పన్నగైః ॥ 33
నానావిధలైన అభేద్య, శస్త్రాస్త్రాలతో నాలుగువైపుల నింపబడి సురక్షితంగా ఉంది. నగరం నాలుగువైపుల చేతులతో విసరుటకు వీలైన లోహశక్తులు నిండి ఉన్నాయి. అవి రెండు నాల్కల సర్పాల వలె భయంకరంగా కనపడుతున్నాయి. (33)
తల్పైశ్చాభ్యాసికైర్యుక్తం శుశుభే యోధరక్షితమ్ ।
తీక్ష్ణాంకుశశతఘ్నీభిః యంత్రజాలైశ్చ శోభితమ్ ॥ 34
అస్త్రశస్త్రాభ్యాసం చేసే యోధులతో ఆ నగరం వ్యాప్తమై ప్రకాశించింది. పదునైన అంకుశాలు, శతఘ్నులు, యంత్రజాలాలతో, యుద్ధసామాగ్రితో ఆ నగరం ప్రకాశిస్తోంది. (34)
ఆయసైశ్చ మహాచక్రైః శుశుభే తత్ పురోత్తమమ్ ।
సువిభక్తమహారథ్యం దేవతాబాధవర్జితమ్ ॥ 35
లోహ నిర్మిత చక్రాలతో ఆ శ్రేష్ఠనగరం ఎంతో శోభకలిగి ఉంది. చాలా విశాలాలైన వీథులతో నాల్గువైపులకూ వెళ్లటానికి వీలైన మార్గాలు ఉన్నాయి. ఆ నగరం దైవికమయిన ఆపదలకు దూరంగా ఉంది. (35)
విరోచమానం వివిధైః పాండురైర్భవనోత్తమైః ।
తత్ త్రివిష్టపసంకాశమింద్రప్రస్థం వ్యరోచత ॥ 36
అనేక విధాలైన తెల్లనిభవనాలతో ఆ నగరం నిండి కనపడుతోంది. స్వర్గంలా ప్రకాశించే ఆ నగరం పేరు ఇంద్రప్రస్థం. (36)
మేఘవృందమివాకాశే విద్ధం విద్యుత్సమావృతమ్ ।
తత్ర రమ్యే శివే దేశే కౌరవ్యస్య నివేశనమ్ ॥ 37
ఇంద్రప్రస్థనగరాన సుందర, పవిత్ర ప్రదేశాల్లో యుధిష్ఠిరుని నివాసగృహం నిర్మించారు. ఆకాశంలో విద్యుత్ కాంతితో వ్యాప్తమైన మేఘమండలం వలె దేదీప్యమానంగా ఉంది అది. (37)
శుశుభే ధనసంపూర్ణం ధనాధ్యక్షక్షయోపమమ్ ।
తత్రాగచ్ఛన్ ద్విజా రాజన్ సర్వవేదవిదాం వరాః ॥ 38
నివాసం రోచయంతి స్మ సర్వభాషావిదస్తథా ।
వణిజశ్చాయయుస్తత్ర నానాదిగ్భ్యో ధనార్థినః ॥ 39
అనంతధనరాశితొ నిండి యుధిష్ఠిరభవనం కుబేరుని నివాసంలా ఉంది. రాజా! వేదవేత్తల్లో శ్రేష్ఠులయిన బ్రాహ్మణులు ఆ నగరాన నివసించేందుకు వచ్చారు. అన్నిభాషలూ తెలిసిన వారు ఇక్కడ నివసించటానికి ఇష్టపడ్డారు. ధనార్థులై వ్యాపారులు నానాప్రదేశాలనుండి ఆ నగరానికి చేరారు. (38,39)
సర్వశిల్పవిదస్తత్ర వాసాయాభ్యాగమంస్తదా ।
ఉద్యానాని చ రమ్యాణి నగరస్య సమంతతః ॥ 40
శిల్పకళ తెలిసినవారు అనేకులు ఆ ఇంద్రప్రస్థంలో నివసించటానికి వచ్చారు. నగరానికి నాలుగువైపుల అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. (40)
ఆమ్రైరామ్రాతకైర్నీపైః అశోకైశ్చంపకైస్తథా ।
పున్నాగైర్నాగపుష్పైశ్చ లకుచైః పనసైస్తథా ॥ 41
శాలతాలతమాలైశ్చ వకులైశ్చ సకేతుకైః ।
మనోహరైః సుపుష్పైశ్చ ఫలభారావనామితైః ॥ 42
తియ్యమామిడి, కదంబం, అశోకం, చంపకం, పున్నాగం, నాగపుష్ప, లకుచం, పనస, మద్ది, తాడి, చీకటి చెట్లు, పొగడ, మొగలి మొదలైన మనోహర పుష్పాల శోభతో, ఫలభారంతో వంగిన పండ్ల చెట్లతో ఆ నగరం మిక్కిలి ప్రకాశిస్తోంది. (41,42)
ప్రాచీనామలకైర్లోధ్రైః అంకోలైశ్చ సుపుష్పితైః ।
జంబూభిఃపాటలాభిశ్చ కుంజకై రతిముక్తకైః ॥ 43
కరవీరైః పారిజాతైః అన్యైశ్చ వివిధైర్ద్రుమైః ।
నిత్యపుష్పఫలోపేతైః నానాద్విజగణాయుతైః ॥ 44
పెద్ద ఉసిరి, లొద్దుగు, అంకోలం, నేరేడు, పాటలం, కుంజకం అతిముక్తకం, కరవీరం, పారిజాతం -- మొదలైన చెట్లతో, ఎల్లప్పుడూ పుష్పఫలాలు గల చెట్లతో, పక్షుల కిలకిల ధ్వనులతో ఆ ఉద్యానశోభ వెలుగుతోంది. (43,44)
మత్తబర్హిణసంఘుష్టకోకిలైశ్చ సదా మదైః ।
గృహైరాదర్శవిమలైః వివిధైశ్చ లతాగృహైః ॥ 45
మదించిన మయూరాల కేకారవాలతో, ఎల్లప్పుడు మదించిన కోకిలలతో, అద్దాల వంటి స్వచ్ఛగృహాలతో, క్రీడాలతాగృహాలతో ఆ ఉద్యానం నిర్మితమై ఉంది. (45)
మనోహరైశ్చిత్రగృహైః తథా జగతిపర్వతైః ।
వాపీభిర్వివిధాభిశ్చ పూర్ణాభిః పరమామ్భసా ॥ 46
సరోభిరతిరమ్యైశ్చ పద్మోత్పలసుగంధిభిః ।
హంసకారండవయుతైః చక్రవాకోపశోభితైః ॥ 47
మనోహరాలైన చిత్రశాలలు, విహారార్థం కృత్రిమపర్వతాలు అన్నిచోట్ల ఉన్నాయి. మంచినీటితో నిండిన దిగుడు బావులు కనపడ్డాయి. తామరలు,కలువల గంధం కలిగి, హంసలు, కారండవాలు, చక్రవాకాలతో ప్రకాశించే సరస్సులు అన్నివైపుల వ్యాపించాయి. (46,47)
రమ్యాశ్చ వివిధాస్తత్ర పుష్కరిణ్యోవనావృతాః ।
తడాగాని చ రమ్యాణి బృహంతి సుబహూని చ ॥ 48
వనవ్యాప్తమైన వివిధ సుందర పుష్కరిణులు అక్కడ విస్తరించి ఉన్నాయి. సుందర, విశాలమైన పెద్ద పెద్ద చెరువులు వ్యాపించాయి. (48)
(చాతుర్వర్ణ్యసమాకీర్ణం మాన్యైః శిల్పిభిరావృతమ్ ।
ఉపయోగసమర్థైశ్చ సర్వద్రవ్యైః సమావృతమ్ ॥
నిత్యమార్యజనోపేతం నరనారీగణైర్యుతమ్ ।
మత్తవారణసంపూర్ణం గోభిరుష్ట్రైః ఖరైరజైః ॥
సర్వదాభిగతం సద్భిః కారితం విశ్వకర్మణా ।
తత్ త్రివిష్టపసంకాశమ్ ఇంద్రప్రస్థం వ్యరోచత ॥
పురీం సర్వగుణోపేతాం నిర్మితాం విశ్వకర్మణా ।
పౌరవాణామదిపతిః కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥
కృతమంగళసత్కారః బ్రాహ్మణైర్వేదపారగైః ।
ద్వైపాయనం పురస్కృత్య ధౌమ్యస్యానుమతే స్థితః ॥
భ్రాతృభిః సహితో రాజన్ కెశవేన సహాభిభూః ।
తోరనద్వారసుముఖం ద్వాత్రింశద్ద్వారసంయుతమ్ ॥
వర్ధమానపురద్వారం ప్రవివేశ మహాద్యుతిః ।
శంఖదుందుభినిర్ఘోషాః శ్రూయంతే బహవో భృశమ్ ॥
జయేతి బ్రాహ్మణగిరః శ్రూయంతే చ సహస్రశః ॥
సంస్తూయమానో మునిభిః సూతమాగధవందిభిః ।
ఔపవాహ్యగతో రాజా రాజమార్గమతీత్య చ ॥
కృతమంగళసత్కారం ప్రవివేశ గృహోత్తమమ్ ॥
ప్రవిశ్య భవనం రాజా సత్కారైరభిపూజితః ।
పూజయామాస విప్రేంద్రాన్ కెశవేన యథాక్రమమ్ ॥
తతస్తు రాష్ట్రం నగరం నరనారీగణాయుతమ్ ।
గోధనైశ్చ సమాకీర్ణం సస్యవృద్ధిస్తదాభవత్ ॥)
ఆ నగరం నాలుగువర్ణాల జనాలతో నిండి ఉంది. మాన్యులైన వారు ఉన్నారు. ఉపభోగార్హమైన సామగ్రి కలిగి ఉంది. శ్రేష్ఠపురుషులు, అసంఖ్యాకులైన స్త్రీ, పురుషులు ఉన్నారు. మదించిన ఏనుగులు, గోవులు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు, మేకలు, మొదలైన పశుసంపద సమృద్ధంగా ఉంది. విశ్వకర్మనిర్మితమైన ఆ నగరం మహాత్ములకు, సత్పురుషులకు నిలయమై భాసిస్తోంది. ఇంద్రనగర తుల్యంగా ఉంది. విశ్వకర్మ నిర్మితం అయిన ఆ నగరంలో పౌరవవంశీయుడై, మంగళసత్కారాలు పొందిన యుధిష్ఠిరుడు వేదవేత్తలైన బ్రాహ్మణులు, సోదరులతో కలిసి శ్రీకృష్ణుడు, ధౌమ్యుడు, వేదవ్యాసుడు మొదలైన వారి అంగీకారంతో ముప్పదిరెండు ద్వారాలు గలిగి వర్ధమాన మనుపేర ప్రసిద్ధి పొందిన నగరద్వారం నుంచి లోనికి ప్రవేశించాడు. అదే సమయాన శంఖ, దుందుభినాదాలు ఒక్కసారిగా మార్మ్ర్గాయి. బ్రాహ్మణుల
జయ జయ శబ్దాలు వ్యాపించాయి. వంది, మాగధ, సూతులు, మునులు స్తోత్రాలు చేశారు. పట్టాభిషిక్తుడైన యుధిష్ఠిరుడు ఏనుగును అధిరోహించాడు. రాజమార్గాన్ని దాటి, పవిత్రం చేసిన శ్రేష్ఠభవనాన్ని యుధిష్ఠిరుడు ప్రవేశించాడు. సమ్మానితుడైన యుధిష్ఠిరుడు పూజ్యుని శ్రీకృష్ణుని, విప్రులను యథాక్రమంగా సత్కరించాడు. ఆ నగరం నరనారీజనంతో గోవులతో ప్రకాశిస్తోంది. సస్యసమృద్ధిని పొంది ఉంది.
తేషామ్ పుణ్యజనోపేతం రాష్ట్రమావిశతాం మహత్ ।
పాండవానాం మహారాజ శశ్వత్ ప్రీతిరవర్ధత ॥ 49
మహారాజా! పవిత్రహృదయం గల మనుష్యప్రవేశంతో ఆ నగరం పాండవుల ప్రసన్నత కారణంగా నిరంతరం అభివృద్ధిని చెందసాగింది. (49)
తత్ర భీష్మేణ రాజ్ఞా చ ధర్మప్రణయనే కృతే ।
పాండవాః సమపద్యంత ఖాండవప్రస్థవాసినః ॥ 50
భీష్మునిచే, రాజైన ధృతరాష్ట్రునిచే ధర్మంగా అర్థరాజ్యం ఇచ్చి పంపబడిన పాండవులు ఖాండవప్రస్థవాసులు అయ్యారు. (50)
పంచభిస్తైర్మహేష్వాసైః ఇంద్రకల్పైః సమన్వితమ్ ।
శుశుభే తత్ పురశ్రేష్ఠం నాగైర్భోగవతీ యథా ॥ 51
ఇంద్రునితో సమానశక్తి గల ఆ పంచపాండవులతో ఆశ్రేష్ఠనగరం నాగులతో భోగవతీనగరం ప్రకాశించినట్లు ప్రకాశిస్తోంది. (51)
(తతస్తు విశ్వకర్మాణం పూజయిత్వా విసృజ్య చ ।
ద్వైపాయనం చ సంపూజ్య విసృజ్య చ నరాధిప ।
వార్ష్ణేయమబ్రవీత్ రాజా గంతుకామం కృతక్షణమ్ ॥
ముందుగా యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థనగర నిర్మాత విశ్వకర్మను పూజించి వీడ్కోలు పలికాడు. పిమ్మట కృష్ణద్వైపాయనుని పూజించి వీడ్కోలు పలికాడు. రాజా! ఈ మహోత్సవానికి కారణభూతుడైన, శ్రీకృష్ణుడు తిరిగివెళ్లటానికి సిద్ధపడగా యుధిష్ఠిరుడు ఈ విధంగా అన్నాడు.
యుధిష్ఠర ఉవాచ
తవ ప్రసాదాత్ వార్ష్ణేయ రాజ్యం ప్రాప్తం మయానఘ ।
ప్రసాదాదేవ తే వీర శూన్యం రాష్ట్రం సుదుర్గమమ్ ॥
తవైవ తు ప్రసాదేన రాజ్యస్థాశ్చ మహామతే ॥
గతిస్త్వమంతకాలే చ పాండవానాం తు మాధవ ।
మాతాస్మాకం పితా దేవః న పాండుం వై విద్మ వయమ్ ॥
జ్ఞాత్వా తు కృత్యం కర్తవ్యం కారయస్వ భవాన్ హి నః ।
యదిష్టమనుమంతవ్యం పాండవానాం త్వయానఘ ॥
యుధిష్ఠిరుడు పలికాడు- పుణ్యాత్మా! యదునందనా! నీదయవల్ల నేను రాజ్యాన్ని పొందాను. నీ అనుగ్రహంతో దుర్గమం, నిర్జనం అయిన ఈ ప్రదేశం ధనధాన్యసమృద్ధిని పొందింది. మీ కరుణ కారణంగా మేము సింహాసనం అధిరోహించాం. మాధవా! నీవే మాకు చివరికి దిక్కు, నీవే మాకు తల్లివి, తండ్రివి. మేము పాండుమహారాజును ఎఱుగం. మాచే చేయవలసిన పనులన్నీ నీవే చేయించు. పాండవుల ఇష్టానుసారం కార్యనిర్వహణానికి అనుజ్ఞ ఇమ్ము.
శ్రీవాసుదేవ ఉవాచ
త్వత్ప్రభావాన్మహాభాగ రాజ్యం ప్రాప్తం స్వధర్మతః ।
పితృపైతామహం రాజ్యం కథం న స్యాత్ తవ ప్రభో ॥
ధార్తరాష్ట్రా దురాచారాః కిం కరిష్యంతి పాండవాన్ ।
యధేష్టం పాలయ మహీం సదా ధర్మధురం వహ ॥
ధర్మోపదేశం సంక్షేపాత్ బ్రాహ్మణాన్ భజ కౌరవ ।
అద్యైవ నారదః శ్రీమాన్ ఆగమిష్యతి సత్వరః ॥
ఆదృత్య తస్య వాక్యాని శాసనం కురు తస్య వై ॥
భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు - మహాభాగా! నీ సామర్థ్యం చేత నీ రాజ్యాన్ని స్వధర్మానుసారం పొందావు. తండ్రి, తాతల రాజ్యం నీకెందుకు రాదు? దురాచారులైన దార్త రాష్ట్రులు పాండవులను ఏమీ చేయలేరు. ధర్మభారం వహిస్తూ స్వేచ్ఛగా రాజ్యపాలన చెయ్యి. కురురాజా! బ్రాహ్మణులను సేవించు, శీఘ్రంగా నేడు నారదమహర్షి వస్తాడు. అతని వాక్యాలు శ్రద్ధగా విని రాజ్యపాలనం చెయ్యి.
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా తతః కుంతీమ్ అభివాద్య జనార్దనః ।
ఉవాచ శ్లక్ష్ణయా వాచా గమిష్యామి నమోఽస్తు తే ॥
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! ఈ విధంగా పలికి శత్రుపీడకుడైన హరి కుంతికి నమస్కరించి మధురమైన వచనాలతో "నమోస్తు" అని పలికి వెళ్లటానికి అనుమతి కోరాడు.
కుంత్యువాచ
జాతుషం గృహమాసాద్య మయా ప్రాప్తం చ కేశవ ।
ఆర్యేణ చాపి న జ్ఞాతం కుంతిభోజేన చానఘ ॥
త్వయా నాథేన గోవింద దుఃఖం తీర్ణం మహత్తరమ్ ।
త్వం హి నాథస్త్వనాథానాం దరిద్రాణాం విశేషతః ॥
సర్వ దుఃఖాని శామ్యంతి తవ సందర్శనాన్మమ ।
స్మరస్వైనాన్ మహాప్రాజ్ఞ తేన జీవంతి పాండవాః ॥
కుంతి అన్నది - కేశవా! లాక్షాగృహంలో పడిన కష్టాలు నా తండ్రి కుంతిభోజునికి కూడా తెలియవు. గోవిందా! నీ సహాయంచే గొప్ప సముద్రం వంటి కష్టాన్ని దాటాను. ప్రభూ! నీవు దీనులకు రక్షకుడవు. విశేషించి దరిద్రులకు గొప్ప రక్షకుడవు. నీ దర్శనంతో మా దుఃఖాలన్నీ శమించాయి. బుద్ధిమంతుడా! పాండవులను నీవెప్పుడూ మరువకు. నీ చింతనతోనే వారు జీవించి ఉంటారు.
వైశంపాయన ఉవాచ
కరిష్యామీతి చామంత్ర్య అభివాద్య పితృష్వసామ్ ।
గమనామ మతిం చక్రే వాసుదేవః సహానుగః ॥)
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! ఆవిధంగానే చేస్తాను అని పలికి, మేనత్త కుంతికి నమస్కరించి వాసుదేవుడు సేవకులతో కలసి బయలుదేరాడు.
తాం నివేశ్య తతో వీరః రామేణ సహ కేశవః ।
యయౌ ద్వారవతీం రాజన్ పాండవానుమతే తదా ॥ 52
రాజా! యుధిష్ఠిరుని ఇంద్రప్రస్థంలో చేర్చి, బలరామునితో కలిసి కేశవుడు పాండవుల అనుమతి పొంది, ద్వారకానగరానికి బయలుదేరాడు. (52)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంభపర్వణి పురనిర్మాణే షడధికద్విశతతమోఽధ్యాయః ॥ 206 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమనరాజ్యలంభపర్వమను
ఉపపర్వమున పురనిర్మాణము అను రెండువందల ఆరవ అధ్యాయము. (206)
(దాక్షిణాత్య అధికపాఠము 99 శ్లోకాలు కలుపుకొని మొత్తం 151 శ్లోకాలు)