207. రెండువందల ఏడవ అధ్యాయము

నారదుని రాక, సుందోపసుందుల కథ చెప్పుట.

జనమేజయ ఉవాచ
ఏవం సంప్రాప్య రాజ్యం తదింద్రప్రస్థం తపోధన ।
అత ఊర్ధ్వం మహాత్మానః కిమకుర్వత పాండవాః ॥ 1
జనమేజయడు అన్నాడు - తపోధనా! ఇంద్రప్రస్థరాజ్యాన్ని పొంది పాండవులు పిమ్మట ఏ కార్యాలను సాధించారు. (1)
సర్వ ఏవ మహాసత్త్వాః మమ పూర్వపితామహాః ।
ద్రౌపదీ ధర్మపత్నీ చ కథం తానన్వవర్తత ॥ 2
మా పూర్వపితామహులైన పాండవులు మహాబలశాలులు, మనోబలం కలవారు. వారి దర్మపత్ని ద్రౌపది ఏలా సేవించింది. (2)
కథం చ పంచ కృష్ణాయామ్ ఏకస్యాం తే నరాధిపాః ।
వర్తమానా మహాభాగాః నాభిద్యంత పరస్పరమ్ ॥ 3
నరపాలురైన పాండవులు ఆమె ఒక్కతెపట్ల ఎలా ప్రవర్తించారు? మహాభాగులు పాండవులు ఆమె విషయంలో ఒకరితో ఒకరికి భేదం కలగకపోవటానికి కారణమేమి? (3)
శ్రోతుమిచ్ఛమ్యహం సర్వం విస్తరేన తపోధన ।
తేషామ్ చేష్టితమన్యోన్యం యుక్తానాం కృష్ణయా సహ ॥ 4
నేనీ వృత్తాంతాన్ని పూర్తిగా వినగోరుతున్నాను. పరస్పరం కలిసి వారు ద్రౌపదితో ఆచరించిన విధానం తెలుపు. (4)
వైశంపాయన ఉవాచ
ధృతరాష్ట్రాభ్యనుజ్ఞాతాః కృష్ణయా సహ పాండవాః ।
రేమిరే ఖాండవప్రస్థే ప్రాప్తరాజ్యాః పరంతపాః ॥ 5
వైశంపాయనుడు పలికెను - రాజా! ధృతరాష్ట్రుని ఆజ్ఞాసానుసారం ఖాండవప్రస్థంలో రాజ్యాన్ని పొంది శత్రునాశకులైన పాండవులు ద్రౌపదితో కలిసి ఆనందించారు. (5)
ప్రాప్య రాజ్యం మహాతేజాః సత్యసంధో యుధిష్ఠిరః ।
పాలయామాస ధర్మేణ పృథివీం భ్రాతృభిః సహ ॥ 6
తేజశ్శాలి, సత్యసంధుడు అయిన ధర్మజుడు రాజ్యాన్ని పొంది సోదరులతో కలిసి ధర్మంగా భూమిని పరిపాలించాడు. (6)
జితారయో మహాప్రజ్ఞాః సత్యధర్మపరాయణాః ।
ముదం పరమికాం ప్రాప్తాః తత్రోషుః పాండునందనాః ॥ 7
శత్రువులను జయించి సత్యధర్మపరాయణులుగా, ప్రజ్ఞావంతులుగా కీర్తింపబడుతూ పాండవులు ఆనందంతో అక్కడ నివసించారు. (7)
కుర్వాణాః పౌరకార్యాణి సర్వాణి పురుషర్షభాః ।
ఆసాంచక్రుర్మహార్హేషు పార్థివేష్వాసనేషు చ ॥ 8
నరశ్రేష్ఠులైన పాండవులు పౌరకార్యాన్ని సమర్థంగా నిర్వహిస్తూ విలువైన, రాజోచితాలైన ఆసనాలపై కూర్చొని ఉన్నారు. (8)
అథ తేషూపవిష్టేషు సర్వేష్వేవ మహాత్మసు ।
నారదస్త్వథ దేవర్షిః ఆజగామ యదృచ్ఛయా ॥ 9
ఒకరోజున పాండవులు సింహాసనాలపై ఆసీనులై ఉండగా అనుకోకుండా దేవర్షి నారదుడు అక్కడికి వచ్చాడు. (9)
(పథా నక్షత్రజుష్టేన సుపర్ణచరితేన చ ।
చంద్రసూర్యప్రకాశేన సేవితేన మహర్షిభిః ।
నభఃస్థలేన దివ్యేన దుర్లభేనాతపస్వినామ్ ॥
తాపసులు కాని వారికి పొందశక్యం కానిదై, నక్షత్రాలతో వ్యాపించి, గరుడుని సంచారంతో, చంద్రసూర్యకాంతితో, మహర్షులచే సేవింపబడే ఆకాశమార్గాన నారదుడు అక్కడికి చేరాడు.
భూతార్చితో భూతధరం రాష్ట్రం నగరభూషితమ్ ।
అవేక్షమాణో ద్యుతిమాన్ ఆజగామ మహాతపాః ॥
సర్వవేదాంతగో విప్రః సర్వవిద్యాసు పారగః ।
పరేణ తపసా యుక్తః బ్రాహ్మేణ తపసా వృతః ॥
నయే నీతౌ చ నిరతః విశ్రుతశ్చ మహామునిః ।
అందరిచే పూజింపబడే తాపసి-నారదుడు-పెద్దపెద్దనగరశోభలను, వాటిలో నివసించే ప్రాణులను చూస్తూ అక్కడికి వచ్చాడు. వేదాంతశాస్త్రవేత్త నారదుడు సర్వవిద్యలలో ఆరితేరిన గొప్పతాపసుడు, బ్రహ్మతేజస్వి, నీతిసహితాలైన మంచి మాటలను చెప్పటంలో ప్రసిద్ధుడు.
పరాత్పరతరం ప్రాప్తః ధర్మాత్ సమభిజగ్మివాన్ ॥
భావితాత్మా గతరజాః శాంతో మృదురృజుర్ద్విజః ।
ధర్మేణాధిగతః సర్వైః దేవదానవమానుషైః ॥
అక్షీణవృత్తధర్మశ్చ సంసారభయవర్జితః ॥
సర్వథా కృతమర్యాదః వేదేషు వివిధేషు చ ॥
బుక్సామయజుషాం వేత్తా న్యాయవృత్తాంతకోవిదః ॥
ఋజురారోహవాన్ శుక్లః భూయిష్ఠపథికోఽనఘః ।
శ్లక్ష్ణయా శిఖయోపేతః సంపన్నః పరమత్విషా ॥
అవదాతే చ సూక్ష్మే చ దివ్యే చ రుచిరే శుభే ।
మహేంద్రదత్తే మహతీ బిభ్రత్ పరమవాససీ ॥
ప్రాప్య దుష్ప్రాపమన్యేన బ్రహ్మవర్చసముత్తమమ్ ॥
భవనే భూమిపాలస్య బృహస్పతిరివాప్లుతః ॥
నారదుడు ధర్మబలంతో పరమార్థజ్ఞానం తెలిసికొన్నవాడు. అతడు శుద్ధహృదయంతో రజోగుణంలేని, శాంతుడు, మృదుస్వభావం కల బ్రాహ్మణుడు. దేవదానవమనుష్యులకు ధర్మంచేత మాత్రమే పొందగలవాడు. సంసారభయం లేనివాడు. అన్నివిధాల లోకంలో వైదికధర్మమర్యాదను నెలకొల్పిన ఋగ్యజుస్సామవేదాలలో నిష్ణాతుడు. న్యాయశాస్త్రపారంగతుడు. ఋజుస్వభావం, శుక్లవర్ణం గలవాడు, పాపరహితుడు. చాలా సమయం యాత్రలో గడుపుతాడు. స్వచ్ఛమైనశిఖ కలవాడు. సూక్ష్మాలు, సుందరాలు, పవిత్రాలు, ఇంద్రదత్తాలైన వస్త్రాలు ధరిస్తాడు. అనితరసాధ్యమైన బ్రహ్మవర్చస్సు గల నారదుడు ఇంద్రుని భవనంలో బృహస్పతి ప్రవేశించినట్లు ధర్మజుని భవంతిలో ప్రవేశించాడు.
సంహితాయాం చ సర్వేషాం స్థితస్యోపస్థితస్య చ ।
ద్విపదస్య చ ధర్మస్య క్రమధర్మస్య పారగః ॥
గాథాసామానుధర్మజ్ఞః సామ్నాం పరమవల్గునామ్ ।
ఆత్మనా సర్వమోక్షిభ్యః కృతిమాన్ కృత్యవిత్ తథా ॥
యోక్తా ధర్మే బహువిధే మనో మతిమతాం వరః ।
విదితార్థః సమశ్చైవ ఛేత్తా నిగమసంశయాన్ ॥
అర్థనిర్వచనే నిత్యం సంశయచ్ఛిదసంశయః ।
ప్రకృత్యా ధర్మకుశలః నానాధర్మ విశారదః ।
లోపేనాగమధర్మేణ సంక్రమేణ చ వృత్తిషు ।
ఏకశబ్దాంశ్చ నానార్థానేకార్థాంశ్చ పృథక్ శ్రుతీన్ ॥
పృథగర్ధాభిధానాంశ్చ ప్రయోగాణామవేక్షితా ॥
సంహితాశాస్త్రాల్లో మానవులకు చెప్పబడిన ధర్మాలన్నింటిలో పారంగతుడైన విద్వాంసుడు. గాథాఛందం, సామవేదాల్లోని ధర్మాలు తెలిసినవాడు. మధురంగా సామగానం చేస్తాడు. ముక్తిని కోరేవారికి స్వయంగా ఉపాయాలు తెలుపుతాడు.బహువిధమయిన ధర్మశాస్త్రంలో మనస్సు నిలుపుతాడు. శాస్త్రజ్ఞానం తెలిసి వాటి విషయంలో సమబుద్ధితో ఉంటాడు. వేదసంశయాన్ని తీర్చి, అర్థవ్యాఖ్యానాలను చేస్తాడు. స్వభావంతో ధర్మాన ఆసక్తికలవాడు. లోపాలు, ఆగమాలు మొదలైన వాటితో ప్రయోగాలు చేసి చూపుతాడు. ఒకే అర్థం గల శబ్దాలను, అనే కార్థకశబ్దాలను వింగడించగలడు. అనేకశబ్దాలను ఒకే అర్థంలో, ఒకే అర్థాన్ని విభిన్న శబ్దాలతో చెప్పగల మహాప్రతిభాశాలి.
ప్రమాణభూతో లోకస్య సర్వాధికరణేషు చ ।
సర్వవర్ణవికారేషు నిత్యం సకలపూజితః ॥
స్వరేఽస్వరే చ వివిధే వృత్తేషు వివిధేషు చ ।
సమస్థానేషు సర్వేషు సమామ్నాయేషు ధాతుషు ॥
ఉద్దేశ్యానాం సమాఖ్యాతా సర్వమాఖ్యాతుముద్దిశన్ ।
అభిసంధిషు తత్త్వజ్ఞః పదాన్యంగాన్యనుస్మరన్ ॥
కాలధర్మేణ నిర్దిష్టం యథార్థం చ విచారయన్ ।
చికీర్షితం చ యో వేత్తా యథా లోకేన సంవృతమ్ ॥
విభాషితం చ సమయం భాషితం హృదయంగమమ్ ।
ఆత్మనే చ పరస్యై చ స్వరసంస్కారయోగవాన్ ॥
ఏషాం స్వరాణాం వేత్తా చ బోద్ధా చ వచనస్వరాన్ ।
విజ్ఞాతా చోక్తవాక్యానామ్ ఏకతాం బహుతాం తథా ॥
బోద్ధా హి పరమార్థాంశ్చ వివిధాంశ్చ వ్యతిక్రమాన్ ।
అభేదతశ్చ బహుశః బహుశశ్చాపి భేదతః ॥
వచనానాం చ వివిధాన్ ఆదేశాంశ్చ సమీక్షితా ।
నానార్థకుశలస్తత్ర తద్ధితేషు చ సర్వశః ॥
పరిభుషయితా వాచాం వర్ణతః స్వరతోఽర్థతః ।
ప్రత్యయాంశ్చ సమాఖ్యాతా నియతం ప్రతిధాతుకమ్ ॥
పంచ చాక్షరజాతాని స్వరసంజ్ఞాని యాని చ ॥)
సర్వవర్ణాల మార్పువిషంలో, అన్ని అధికరణాల్లో లోకంలో ప్రమాణభూతుడు, అందరకు అన్నివేళల పూజ్యుడు. అచ్చులు, హల్లులు, ఛంధస్సులు, నిఘంటువులు, వాని అవయవాల స్మరణ చేస్తూ నిజతత్త్వాన్ని తెలుపుతాడు. మానవులలోని హృదయాంతరాళాల దాగిన అంశాలను వెలికి తీస్తాడు. వైకల్పిక వచనాలు, నిశ్చయాంశాలను బాగా గుర్తిస్తాడు. తనకు, ఇతరులకు స్వరసంస్కారాలను ఆచరిస్తాడు. మాట్లాడే వచనాల్లో ఏకత్వ, బహుత్వ సాధన చేయు నైపుణ్యం చూపుతాడు. పరమార్థాన్ని వెంటనే గ్రహిస్తాడు. అపరాధాల్ని గుర్తిస్తాడు. తద్థితప్రయోగాల్లో నిపుణుడు. స్వర, వర్ణ, అర్థాలతో తన మాటలను అలంకరింపచేస్తాడు. ధాతువులలో పరిపూర్ణజ్ఞాని. అయిదురకాల్లో అక్షరాలను, స్వరాలను విభాగం చేసి ప్రదర్శిస్తాడు.
తమాగతమృషిం దృష్ట్వా ప్రత్యుద్గమ్యాభివాద్య చ ।
ఆసనం రుచిరం తస్మై ప్రదదౌ స్వం యుదిష్ఠిరః ॥
దేవర్షేరుపవిష్టస్య స్వయమర్ఘ్యం యథావిధి ॥ 10
ప్రాదాద్ యుధిష్ఠిరో ధీమాన్ రాజ్యం తస్మై న్యవేదయత్ ।
ప్రతిగృహ్య తు తాం పూజామ్ ఋషిః ప్రీతమనాస్తదా ॥ 11
వచ్చిన నారదుని చూచి, ఎదురేగి, నమస్కరించి యుధిష్ఠిరుడు సుందరమైన తన ఆసనాన్ని ఆయనకిచ్చాడు. ఆసీనుడైన నారదమహర్షికి స్వయంగా యథావిధిగా అర్ఘ్యాదులనిచ్చి బుద్ధిమంతుడు ధర్మజుడు వినయంగా ఇలా నివేదించాడు. ఆ పూజగైకొని నారదుడు ఆనందంలో మునిగిపోయాడు. (10,11)
ఆశీర్భిర్వర్ధయిత్వా చ తమువాచాస్యతామితి ।
నిషసాదాభ్యనుజ్ఞాతః తతో రాజా యుధిష్ఠిరః ॥ 12
కథయామాస కృష్ణాయై భగవంతముపస్థితమ్ ।
శ్రుత్వైతద్ ద్రౌపదీ చాపి శుచిర్భూత్వా సమాహితా ॥ 13
జగామ తత్ర యత్రాస్తే నారదః పాండవైః సహ ।
తస్యాభివాద్య చరణౌ దేవర్షేర్ధర్మచారిణీ ॥ 14
కృతాంజలిః సుసంవీతా స్థితాథ ద్రుపదాత్మజా ।
తస్యాశ్చాపి స ధర్మాత్మా సత్యవాగృషిసత్తమః ॥ 15
ఆశిషో వివిధాః ప్రోచ్య రాజపుత్ర్యాస్తు నారదః ।
గమ్యతామితి హోవాచ భగవాంస్తామనిందితామ్ ॥ 16
గతాయామథ కృష్ణాయాం యుధిష్ఠిరపురోగమాన్ ।
వివిక్తే పాండవాన్ సర్వానువాచ భగవానృషిః ॥ 17
యుధిష్ఠిరుని అభ్యుదయాన్ని ఆకాంక్షించి, ఆశీర్వదించి, ఆసీనుని కమ్మని నారదుడు ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞపై యుధిష్ఠిరుడు కూర్చుని, నారదుని రాకను ద్రౌపదికి వినిపించాడు. విన్న ద్రౌపది పవిత్రత, ఏకాగ్రచిత్తాలతో పాండవులతో నారదుడున్న ప్రదేశానికి వెళ్ళింది. ఆమె నారదముని పాదాలకు నమస్కరించి వినయంతో నిలిచింది. నారదుడు అనేకమైన ఆశీర్వచనాలిచ్చి సాద్వి ద్రౌపదిని లోపలికి వెళ్ళమని ఆదేశించాడు. ఆమె వెళ్ళిన తరువాత నారదుడు ఏకాంతంలో యుధిష్ఠిరునితో కూడిన పాండవులతో ఇలా అన్నాడు. (12-17)
నారద ఉవాచ
పాంచాలీ భవతామేకా ధర్మపత్నీ యశస్వినీ ।
యథా వో నాత్ర భేదః స్యాత్ తథా నీతిర్విధీయతామ్ ॥ 18
కీర్తిని ఇవ్వగల ద్రౌపది మీకు ఒక్కతే ధర్మపత్ని. మీలో మీకు ఆ కారణంగా వైరం పెరగకుండా ఉండండి అన్నాడు. (18)
సుందోపసుందౌ హి పురా భ్రాతరౌ సహితావుభౌ ।
ఆస్తామవధ్యావన్యేషాం త్రిషు లోకేషు విశ్రుతౌ ॥ 19
పూర్వకాలం నాటి గాథ ఒకటి ఉంది. సుందోపసుందు లిద్దరూ సోదరులు. వారెల్లప్పుడు ఒకచోటే కలిసి ఉంటారని, చంపవీలుకాని వారని ముల్లోకాల్లో ప్రసిద్ధి. (19)
ఏకరాజ్యావేకగృహౌ ఏకశయ్యాసనాశనౌ ।
తిలోత్తమాయాస్తౌ హేతోః అన్యోన్యమభిజఘ్నతుః ॥ 20
వారికొకటే రాజ్యమ్, ఇల్లు, పాన్పు, ఆసనమ్. ఆహారం వారు కలిసే తింటారు. కాని వారిరువురు తిలోత్తమ అనే అప్సరస ప్రేమలో పడి ఒకరినొకరు చంపుకున్నారు. (20)
రక్ష్యతామ్ సౌహృదం తస్మాదన్యోన్యప్రీతిభావకమ్ ।
యథా వో నాత్ర భేదః స్యాత్ తత్ కురుష్వ యుధిష్ఠిర ॥ 21
యుధిష్ఠిరా! మీరు మీ మధ్యలో ప్రేమభావాన్ని పెంచుకొంటూ సౌహర్దంతో ఉండండి. మీలో మీకు విరోధమ్ రాకుండా జాగ్రత్త వహించండి. (21)
యుధిష్ఠిర ఉవాచ
సుందోపసుందావసురౌ కస్య పుత్రౌ మహామునే ।
ఉత్పన్నశ్చ కథం భేదః కథం చాన్యోన్యమఘ్నతామ్ ॥ 22
యుధిష్ఠిరుడు అడిగాడు - మహామునీ! సుందోపసుందులు ఎవరికుమారులు? వారి మధ్య వైరం కలగటానికి కారణమేది? ఒకరినొకరు ఎలా చంపుకొన్నారు? (22)
అప్సరా దేవకన్యా వా కస్య చైషా తిలోత్తమా ।
యస్యాః కామేన సమ్మత్తౌ జఘ్నతుస్తౌ పరస్పరమ్ ॥ 23
మీరు పలికిన ఈ తిలోత్తమ అప్సరసయా? దేవకన్యయా? తెలుపండి. ఏ కోరికచే వారిర్వురు సోదరులు ఒకరినొకరు చంపుకొన్నారు? (23)
ఏతత్ సర్వం యథావృత్తం విస్తరేణ తపోధన ।
శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మన్ పరం కౌతూహలం హి నః ॥ 24
ఈ కథను జరిగిన దాన్ని జరిగినట్లుగా విస్తరంగా వినగోరుతున్నాం. బ్రహ్మవాదీ! అది వినుటకు మాకు చాల ఆసక్తిగా ఉంది. (24)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమన రాజ్యలంభపర్వణి యుధిష్ఠిరనారదసంవాదే సప్తాధికద్విశతతమోఽధ్యాయః ॥ 207 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమన రాజ్యలంభపర్వమను
ఉపపర్వమున యుధిష్ఠిర నారద సంవాదమను
రెండు వందల ఏడవ అధ్యాయము. (207)
(దాక్షిణాత్య అధికపాఠము 25 1/2 శ్లోకాలు కలిపి మొత్తం 49 1/2 శ్లోకాలు)