216. రెండువందల పదునారవ అధ్యాయము

అర్జునుడు నలుగురు అప్సరసలను విడిపించుట.

వర్గోవాచ
తతో వయం ప్రవ్యథితాః సర్వా భారతసత్తమ ।
అయామ శరణం విప్రం తం తపోధనమచ్యుతమ్ ॥ 1
వర్గ పలికింది - భరతశ్రేష్ఠా! ఆ బ్రాహ్మనుని శాపం పొంది మేము తల్లడిల్లిపోయాం. మేమందరం తపోధనుని శరణువేడాము. (1)
రూపేణ వయసా చైవ కందర్పేణ చ దర్పితాః ।
అయుక్తం కృతవత్యః స్మ క్షంతుమర్హసి నో ద్విజ ॥ 2
మేము సౌందర్య, యౌవన, మదాలతో గర్వపడ్డాము. మీపట్ల అనుచితంగా ప్రవర్తించాము. మమ్ములను క్షమించండి. (2)
ఏష ఏవ వధోఽస్మాకమ్ సుపర్యాప్తస్తపోధన ।
యద్ వయం సంశితాత్మానం ప్రలోబ్ధుం త్వామిహాగతాః ॥ 3
తపోధనా! మాకు మీ శాపమే మరణంతో సమానం. మేము మీ వంటి జితేంద్రియులను మోహపరచాలని ప్రయత్నించాము. (3)
అవధ్యాస్తు స్త్రియః సృష్టాః మన్యంతే ధర్మచారిణః ।
తస్మాత్ ధర్మేణ వర్ధ త్వం నాస్మాన్ హింసితుమర్హసి ॥ 4
స్త్రీలను చంపరాదని ధర్మపరాయణుల అభిప్రాయం. మీరు ధర్మంతో ఉన్నతిని పొందండి. మమ్ములను హింసించటం మీకు ఉచితం కాదు. (4)
సర్వభూతేషు ధర్మజ్ఞ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే ।
సత్యో భవతు కల్యాణ ఏష వాదో మనీషిణామ్ ॥ 5
ధర్మజ్ఞా! ప్రాణులందరి పట్ల బ్రాహ్మణుడు మైత్రితో ఉంటాడు. మంగళప్రదమైన వాడా! లోకంలో విద్వాంసుల ఈ అభిప్రాయాన్ని యథార్థం చేయండి. (5)
శరణం చ ప్రపన్నానాం శిష్టాః కుర్వంతి పాలనామ్ ।
శరణం త్వాం ప్రపన్నాః స్మ తస్మాత్ త్వం క్షంతుమర్హసి ॥ 6
శ్రేష్ఠులైన మహాత్ములు శరణాగతులను రక్షిస్తారు. మేము మీశరణు కోరాం. మమ్ములను ఐదుగురిని రక్షించండి' అన్నారు. (6)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః స ధర్మాత్మా బ్రాహ్మణః శుభకర్మకృత్ ।
ప్రసాదం కృతవాన్ వీర రవిసోమసమప్రభః ॥ 7
వైశంపాయనుడు అన్నాడు - ధర్మాత్ముడై, సత్కర్మలు చేస్తూ, సూర్యచంద్రులతో సమానకాంతికల ఆ బ్రాహ్మణుడు వారి ప్రార్థనను మన్నిమ్చి అనుగ్రహించాడు. (7)
బ్రాహ్మణ ఉవాచ
శతం శతసహస్రం తు సర్వమక్షయ్యవాచకమ్।
పరిమాణ్ శతం త్వేతత్ నేదమక్షయ్యవాచకమ్ ॥ 8
బ్రాహ్మణుడు పలికాడు - 'శతం, శతసహస్రం అనే పదాలు లోకంలో అనంతసంఖ్యను తెలుపుతాయి. కాని నేనన్న శతమ్ అనే పదానికి వందేండ్లనియే అర్థమ్ అగుగాక, అక్షయ్య వాచకం కాకుండుగాక! (8)
యదా చ వో గ్రాహభూతా గృహ్ణంతీః పురుషాన్ జలే ।
ఉత్కర్షతి జలాత్ తస్మాత్ స్థలం పురుషసత్తమః ॥ 9
తదా యూయం పునః సర్వాః స్వం రూపం ప్రతిపత్స్యథ ।
అనృతం నోక్తపూర్వం మే హసతాపి కదాచన ॥ 10
మొసళ్ళుగా ఉండి పురుషులను నీటిలోకి లాగే మిమ్ములను ఒక నరోత్తముడు నీటి నుండి బయటకు లాగుతాడు. అప్పుడు మీకు మీమి పూర్వపు రూపాలు వస్తాయి. నవ్వులాటకు కూడ నేనెన్నడు అబద్ధం చెప్పలేదు. (9,10)
తాని సర్వాణి తీర్థాని తతః ప్రభృతి చైవ హ ।
నారీతీర్థాని నామ్నేహ ఖ్యాతిం యాస్యంతి సర్వశః ।
పుణ్యాని చ భవిష్యంతి పావనాని మనీషిణామ్ ॥ 11
మిమ్ములను బయటకు లాగినపిదప ఆ తీర్థాలకు నారీ తీర్థాలని పేర్లు స్థిరపడతాయి. విద్వాంసులైన పురుషులకు పవిత్రాలు అవుతాయి.' (11)
వర్గోవాచ
తతోఽభివాద్య తం విప్రం కృత్వా చాపి ప్రదక్షిణమ్ ।
అచింతయామోఽపసృత్య తస్మాద్ దేశాత్ సుదుఃఖితాః ॥ 12
క్వ ను నామ వయం సర్వాః కాలేనాల్పేన తం నరమ్ ।
సమాగచ్ఛేమ యో నస్తద్ రూపమాపాదయేత్ పునః ॥ 13
వర్గ పలికింది - భారతా! మేము ఆ మహర్షికి నమస్కరించి ప్రదక్షిణం చేసి దుఃఖంతో ఆ ప్రదేశం నుండి వేరొక చోటికి బయలుదేరాము. మాకు మా పూర్వరూపాన్ని చేకూర్చగల ఆ నరోత్తముని ఎంత స్వల్పవ్యవధిలో ఎక్కడ కలుసుకొనగలమా అని ఆలోచించసాగాము. (12,13)
తా వయం చింతయిత్వైవ ముహూర్తాదివ భారత ।
దృష్టవత్యో మహాభాగం దేవర్షిముత నారదమ్ ॥ 14
మేము రెండు ఘడియలు ఈ విధంగా ఆలోచిస్తుండగా మహాభాగుడైన, దేవర్షి నారదుని చూశాం. (14)
సంప్రహృష్టాః స్మ తం దృష్ట్వా దేవర్షిమమితద్యుతిమ్ ।
అభివాద్య చ తం పార్థ స్థితాః స్మ వ్రీడితాననాః ॥ 15
అమితకాంతి గల దేవర్షిని చూచి మిక్కిలిగా సంతోషించాం. ఆయనకు నమస్కరించి సిగ్గుతో ముఖాలు దించుకొని నిలిచాము. (15)
ప వోఽపృచ్ఛత్ దుఃఖమూలమ్ ఉక్తవత్యో వయం చ తమ్ ।
శ్రుత్వా తత్ర యథావృత్తమిదం వచనమబ్రవీత్ ॥ 16
నారదమహర్షి మా దుఃఖకారణం అడిగాడు. మేము చెప్పాం. జరిగింది జరిగినట్లు ఆ వృత్తాంతాన్ని విని నారదుడు మాతో ఇలా పలికాడు. (16)
దక్షిణే సాగరానూపే పంచతీర్థాని సంతి వై ।
పుణ్యాని రమణీయాని తాని గచ్ఛత మా చిరమ్ ॥ 17
దక్షిణ సముద్రతీరాన ఐదు తీర్థాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. అవి పుణ్యజనకాలు, రమణీయాలు, మీరందరు ఆలస్యం చేయక అక్కడికి చేరండి. (17)
తత్రాశు పురుషవ్యాఘ్రః పాండవేయా ధనంజయః ।
మోక్షయిష్యతి శుద్ధాత్మా దుఃఖాదస్మాన్న సంశయః ॥ 18
తస్య సర్వా వయం వీర శ్రుత్వా వాక్యమిహాగతాః ।
తదిదం సత్యమేవాద్య మోక్షితాహం త్వయానఘ ॥ 19
అక్కడకు పురుషశ్రేష్ఠుడు, పాండునందనుడు, అయిన అర్జునుడు పరిశుద్ధాంతఃకరణ కలవాడై వచ్చి మిమ్ములను ఈ దుఃఖం నుంచి దూరం చేస్తాడు. నారదుని మాటలు విని మేము అయిదుగురం ఇక్కడికి వచ్చాం. పాపరహితుడా! ఆ వృత్తాంతం సత్యం. నీచే మేము శాపవిముక్తి పొందాం. (18,19)
ఏతాస్తు మమ తాః సఖ్యశ్చత్రసోఽన్యాజలే శ్రితాః ।
కురు కర్మ శుభం వీర ఏతాః సర్వా విమోక్షయ ॥ 20
ఈ నా నలుగురు సఖురాండ్రు వేరు వేరు తీర్థాల్లో ఉన్నారు. వీరా! ఈ పుణ్యకర్మ ద్వారా వారిని కూడ విడిపించు. (20)
వైశంపాయన ఉవాచ
తతస్తాః పాండవశ్రేష్ఠః సర్వా ఏవ విశాంపతే ।
తస్మాచ్ఛాపాదదీనాత్మా మోక్షయామాస వీర్యవాన్ ॥ 21
వైశంపాయనుడు చెప్పాడు - ఆ పాండవశ్రేష్ఠుడు అర్జునుడు వీర్యం, ధైర్యంతో వారిని మునిశాపం నుండి విడిపించాడు. (21)
ఉత్థాయ చ జలాత్ తస్మాత్ ప్రతిలభ్య వపుః స్వకమ్ ।
తాస్తదాప్సరసో రాజన్ అదృశ్యంత యథా పురా ॥ 22
నీటి నుండి బయటకు వచ్చి పూర్వపుదేహాన్ని పొందిన ఆ అప్సరసలు పూర్వం వలె సుందరీమణులై ప్రకాశించారు. (22)
తీర్థాని శోధయిత్వా తు తథానుజ్ఞాయ తాః ప్రభుః ।
చిత్రాంగదాం పునర్ద్రష్టుం మణిపూరం పునర్యయౌ ॥ 23
ఇలా తీర్థాల్ని స్నానయోగ్యాలుగా చేసి వారి నుండి అనుమతి పొంది అర్జునుడు మరల మణిపురంలోని చిత్రాంగదను చూడటానికి వెళ్ళాడు. (23)
తస్యామజనయత్ పుత్రం రాజానం బభ్రువాహనమ్ ।
తం దృష్ట్వా పాండవో రాజన్ చిత్రవాహనమబ్రవీత్ ॥ 24
మణిపురంలో చిత్రాంగదయందు బభ్రువాహునుని కన్నాడు. తన కుమారుణ్ణి చూచి అర్జునుడు చిత్రవాహనునితో ఇలా అన్నాడు. (24)
చిత్రాంగదాయాః శుల్కం త్వం గృహాణ బభ్రువాహనమ్ ।
అనేన చ భవిష్యామి ఋణాన్ముక్తో నరాధిప ॥ 25
చిత్రాంగదకు శుల్కంగా నాకుమారుడు, వంశవర్ధనుడైన బభ్రువాహనుని స్వీకరించు. ఈ సమర్పణచే నేను ఋణవిముక్తుడను అయ్యాను. (25)
చిత్రాంగదాం పునర్వాక్యమబ్రవీత్ పాండునందనః ।
ఇహ వై భవ భద్రం తే వర్ధేథా బభ్రువాహనమ్ ॥ 26
పిమ్మట అర్జునుడు చిత్రాంగదను ఉద్దేశించి ఇలా పలికాడు - ప్రియురాలా! శుభమస్తు. నీవు ఇక్కడే ఉండి బభ్రువాహనుని పాలన, పోషణ చూడు. (26)
ఇంద్రప్రస్థనివాసం మే త్వం తత్రాగత్య రంస్యసి ।
కుంతీం యుధిష్ఠిరం భీమం భ్రాతరౌ మే కనీయసౌ ॥ 27
ఆగత్య తత్ర పశ్యేథాః అన్యానపి చ బాంధవాన్ ।
బాంధవైః సహితాః సర్వైః నందసే త్వమనిందితే ॥ 28
సమయం వచ్చినప్పుడు ఇంద్రప్రస్థానికి చేరి సుఖిస్తావు. అక్కడ కుంతీదేవిని, ధర్మజుని, భీముని, కవలలను, ఇతరబంధువుల్ని చూస్తావు. పుణ్యశీలా! బంధువులందరితో ఇంద్రప్రస్థంలో ఆనందాన్ని పొందుతావు. (27,28)
ధర్మే స్థితః సత్యధృతిః కౌంతేయోఽథ యుధిష్ఠిరః ।
జిత్వా పృథివీం సర్వాం రాజసూయం కరిష్యతి ॥ 29
ఎల్లప్పుడు ధర్మాన్ని పరిపాలించే కౌంతేయుడు, యుధిష్ఠిరుడు సత్యశీలుడై భూమినంతటిని జయించి రాజసూయయాగం చేస్తాడు. (29)
తత్రాగచ్ఛంతి రాజానః పృథివ్యాం నృపసంజ్ఞితాః ।
బహూని రత్నాన్యాదాయ ఆగమిష్యతి తే పితా ॥ 30
ఆ సమయాన భూమండలంలో రాజసంజ్ఞ గలవారందరు అక్కడకు వస్తారు. నీ తండ్రి కూడ చాల ధనసంపద, రత్నాలను తీసుకొని వస్తాడు. (30)
ఏకసార్థం ప్రయాతాసి చిత్రవాహనసేవయా ।
ద్రక్ష్యామి రాజసూయే త్వాం పుత్రం పాలయ మా శుచః ॥ 31
చిత్రవాహనుని సేవకై నీవు రాజసుయానికి రాగలవు. నేను నిన్ను అక్కడనే కలుస్తాను. పుత్రుని పాలన పోషణ చూసుకొంటూ దుఃఖాన్ని విడచిపెట్టు. (31)
బభ్రువాహననామ్నా తు మమ ప్రాణొ మహీచరః ।
తస్మాద్ భర్స్వ పుత్రం వై పురుషం వంశావర్ధనమ్ ॥ 32
బభ్రువాహనుని పేరుతో నాప్రాణాలు ఇక్కడే సంచరిస్తాయి. కావున వంశవర్ధనుడైన కుమారుని పెంచి పెద్ద చెయ్యి. (32)
చిత్రవాహనదాయాదం ధర్మాద్ పౌరవనందనమ్ ।
పాండవానాం ప్రియం పుత్రం తస్మాత్ పాలయ సర్వదా ॥ 33
ధర్మానుసారం ఇతడు చిత్రవాహనుని పుత్రుడు. పూరువంశానందకారకుడు. పాండవులప్రియపుత్రుడైన బభ్రువాహనుని పరిపాలించు. (33)
విప్రయోగేన సంతానం మా కృథాస్త్వమనిందితే ।
చిత్రాంగదామేవముక్త్వా గోకర్ణమభితోఽగమత్ ॥ 34
సాధ్వీ! నావియోగమ్చే దుఃఖింపకు. అని చిత్రాంగదతో పలికి అర్జునుడు గోకర్ణతీర్థం వైపుగా బయలుదేరాడు. (34)
ఆద్యం పశుపతేః స్థానం దర్శనాదేవ ముక్తిదమ్ ।
యత్ర పాపోఽపి మనుజః ప్రాప్నోత్యభయం పదమ్ ॥ 35
గోకర్ణ క్షేత్రం ఈశ్వరుని మొదటి నివాసస్థానం. దర్శనం వల్లే ముక్తి కలుగుతుంది. పాపాత్ముడైనా ఈ క్షేత్రాన అభయపదాన్ని అధిరోహిస్తాడు. (35)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి వనవాస పర్వణి అర్జునతీర్థయాత్రాయాం షోడశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 216 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున అర్జునవనవాస పర్వమను
ఉపపర్వమున అర్జునతీర్థయాత్ర అను రెండువందల పదునారవ అధ్యాయము. (216)