215. రెండువందల పదునైదవ అధ్యాయము

వర్గ యను అప్సరసకు అర్జునుడు శాపమోక్షమిచ్చుట.

వైశంపాయన ఉవాచ
తతః సముద్రే తీర్థాని దక్షిణే భరతర్షభ ।
అభ్యగచ్ఛత్ సుపుణ్యాని శోభితాని తపస్విభిః ॥ 1
వైశంపాయనుడు అన్నాడు. భరతశ్రేష్ఠా! పిమ్మట అర్జునుడు పరమపావనులైన ఋషులతో ప్రకాశించే దక్షిణసముద్రతీరంలోని తీర్థాలన్నింటిలో స్నానాలు చేశాడు. (1)
వర్జయంతి స్మ తీర్థాని తత్ర పంచ స్మ తాపసాః ।
అవకీర్ణాని యాన్యాసన్ పురస్తాత్ తు తపస్విభిః ॥ 2
అక్కడ తాపసులందరు అయిదు తీర్థాలను విసర్జించారు. పూర్వం ఆ తీర్థాలు తాపసులతో నిండి ఉండేవి. (2)
అగస్త్యతీర్థం సౌభద్రం పౌలోమం చ సుపావనమ్ ।
కారంధమం ప్రసన్నం చ హయమేధఫలమ్ చ తత్ ॥ 3
భారద్వాజస్య తీర్థం తు పాపప్రశమనం మహత్ ।
ఏతాని పంచతీర్థాని దదర్శ కురుసత్తమః ॥ 4
అగస్త్యతీర్థం, సౌభద్రతీర్థం, పరమపవిత్రమైన పౌలోమ తీర్థం, అశ్వమేధయాగాచరనఫలం ఇచ్చే కారంధమతీర్థం, సకలపాపాలను పోగొట్టే భారద్వాజతీర్థం, వీటన్నింటిని అర్జునుడు దర్శించాడు. (3,4)
వివిక్తాన్యుపలక్ష్యాథ తాని తీర్థాని పాండవః ।
దృష్ట్వా చ వర్జ్యమానాని మునిభిర్ధర్మబుద్ధిభిః ॥ 5
ఈ తీర్థాలన్ని జనులు లేనివై ఏకాంతప్రదేశాల్లా ఉన్నాయి. అది చూచి 'ధర్మబుద్ధి గల తాపసులచే విడువబడ్డాయి' అని గ్రహించాడు అర్జునుడు. (5)
తపస్వినస్తతోఽపృచ్ఛత్ ప్రాంజలిః కురునందనః ।
తీర్థానీమాని వర్జ్యంతే కిమర్థం బ్రహ్మవాదిభిః ॥ 6
రెండు చేతులు జోడించి అక్కడి తాపసులను అడిగాడు-వేదవాదులైన తాపసులు ఈ తీర్థాలను ఎందుకు విడిచిపెట్టారు? (60)
తాపసా ఊచుః
గ్రాహాః పంచ వసంత్యేషు హరంతి చ తపోధనాన్ ।
తత ఏతాని వర్జ్యంతే తీర్థాని కురునందన ॥ 7
తాపసులు పలికారు-ఇక్కడ ఐదు మొసళ్ళు చేరాయి. తాపసులను జలంలోకి లాగి తినివేస్తున్నాయి. ఈ కారణంగా ఈ ఐదుతీర్థాలను తాపసులు త్యజించారు. (7)
వైశంపాయన ఉవాచ
తేషాం శ్రుత్వా మహాబాహుః వార్యమాణస్తపోధనైః ।
జగామ తాని తీర్థాని ద్రష్టుం పురుషసత్తమః ॥ 8
వైశంపాయనుడు అన్నాడు - వారి మాటలద్వారా వృత్తాంతాన్ని గ్రహించి, అర్జునుడు తపోధనులు వారిస్తున్నా వాటిని చూడటానికి వెళ్ళాడు. (8)
తతః సౌభద్రమాసాద్య మహర్షేస్తీర్థముత్తమమ్ ।
విగ్రాహ్య సహసా శూరః స్నానం చక్రే పరంతపః ॥ 9
అథ తం పురుషవ్యాఘ్రమ్ అంతర్జలచరో మహాన్ ।
జగ్రాహ చరణే గ్రాహః కుంతీపుత్రం ధనంజయమ్ ॥ 10
ఇంతలో నీటిలోని పెద్ద మొసలి ఒకటి కుంతీపుత్రుడైన ధనంజయుని పాదాన్ని పట్టి గట్టిగా లాగింది. (10)
స తమాదాయ కౌంతేయః విస్ఫురంతం జలేచరమ్ ।
ఉదతిష్ఠన్మహాబాహుః బలేన బలినాం వరః ॥ 11
బలవంతులలో శ్రేష్ఠుడైన అర్జునుడు తన బాహుబలాన్ని ఉపయోగించి మొసలిని గట్టిగా లాగి భూమిపై పడవేశాడు. (11)
ఉత్కృష్ట ఏవ గ్రాహస్తు సోఽర్జునేన యశస్వినా ।
బభూవ నారీ కల్యాణీ సర్వాభరణభూషితా ॥ 12
అర్జునునిచే బయటపడ్డ ఆ మొసలి సర్వాలంకార భూషితురాలు అయిన స్త్రీగా మారింది. (12)
దీప్యమానా శ్రియా రాజన్ దివ్యరూపా మరోరమా ।
తదద్భుతం మహద్ దృష్ట్వా కుంతీపుత్రో ధనంజయః ॥ 13
తాం స్త్రియం పరమప్రీతః ఇదం వచనమబ్రవీత్ ।
కా వై త్వమసి కల్యాణి కుతో వాసి జలేచరీ ॥ 14
కిమర్థం చ మహత్ పాపమ్ ఇదం కృతవతీ పురా ।
ఆ దివ్యకాంత తన శరీర సౌందర్యంతో, ఆభరణాలతో ప్రకాశిస్తోంది. అర్జునుడు ఆశ్చర్యపడి ప్రసన్నుడై ఇలా పలికాడు. 'కల్యాణీ! నీవెవరివి? ఏ కారణాన మొసలిరూపు దాల్చావు? నీ ఈ దుర్గతికి నీవు చేసిన ఘోరమైన తప్పు ఏమిటి?' (13,14 1/2)
వర్గోవాచ
అప్సరాస్మి మహాబాహో దేవారణ్యవిహారణీ ॥ 15
అప్సర పలికింది - మహాబాహూ! నేను నందనవనాన సంచరించే అప్సరసను. (15)
ఇష్టా ధనపతేర్నిత్యం వర్గా నామ మహాబల ।
మమ సఖ్యశ్చతస్రోఽన్యాః సర్వాః కామగమాః శుభాః ॥ 16
మహాబలుడా! నేను ధనపతి అయిన కుబేరునికి సదా ఇష్టమైన దాన్ని. నా స్నేహితురాండ్రు నలుగురు. స్వేచ్ఛాసంచారం గల సుందరీమణులు. (16)
తాభిః సార్ధం ప్రయాతాస్మి లోకపాలనివేశనమ్ ।
తతః పశ్యామహే సర్వాః బ్రాహ్మణం సంశితవ్రతమ్ ॥ 17
వారితో కలిసి ఒకనాడు కుబేరుని మందిరానికి బయలుదేరాను. అక్కడ దారిలో జితేంద్రియుడైన ఒకానొక బ్రాహ్మణుని మేమందరం చూశాము. (17)
రూపవంతమధీయానమ్ ఏకమేకాంత చారిణమ్ ।
తస్యైవ తపసా రాజన్ తద్ వనం తేజసాఽఽవృతమ్ ॥ 18
అతడు రూపవంతుడు. ఒంటరి. ఒక్కడే వేదం అభ్యసిస్తున్నాడు. అతని తేజస్సుతో, తపస్సుతో ఆవనం ప్రకాశిస్తోంది. (18)
ఆదిత్య ఇవ తం దేశమ్ కృత్స్నం సర్వం వ్యకాశయత్ ।
తస్య దృష్ట్వా తపస్తాదృగ్ రూపం చాద్భుతముత్తమమ్ ॥ 19
అవతీర్ణాః స్మ తం దేశం తపోవిఘ్నచికీర్షయా ।
సూర్యునివలె అతడు ఆ ప్రదేశాన్నంతటిని వెలిగిస్తున్నాడు. అతని అద్భుతమైన ఆ తపస్సును చూసి తపస్సుకు విఘ్నం చేయాలనే తలంపుతో ఆ ప్రదేశంలొ మేము అయిదుగురమ్ దిగాము. (19 1/2)
అహం చ సౌరభేయీ చ సమీచీ బుద్బుదా లతా ॥ 20
యౌగపద్యేన తం విప్రమ్ అభ్యగచ్ఛామ భారత ।
గాయంత్యోఽథ హసంత్యశ్చ లొభయిత్వా చ తం ద్విజమ్ ॥ 21
భారతా! నేను, సౌరభేయి, సమీచి, బుద్బుద, లత అనే మేమంతా ఒక్కసారిగా ఆ బ్రాహ్మణుని సమీపంలో దిగి పాటలతో, నవ్వులతో, అతనిని ప్రలోభపెట్టాము. (20,21)
స చ నాస్మాసు కృతవాన్ మనో విర కథంచన ।
నాకంపవత మహాతేజాః స్థితస్తపసి నిర్మలే ॥ 22
అతడు మామీద ఏవిధంగాను మనస్సు పెట్టలేదు. ఆ మహాతేజస్వి నిర్మలమయిన తపస్సులో ఉండి చలించలేదు. (22)
సోఽశపత్ కుపితోఽస్మాసు బ్రాహ్మణః క్షత్రియర్షభ ।
గ్రాహభూతా జలే యూయమ్ చరిష్యథ శతమ్ సమాః ॥ 23
మా మీద కోపం వచ్చి ఆ బ్రాహ్మణుడు అప్సరసలారా! మీరు వందేండ్లు మొసళ్ళై ఈ తీర్థంలో నివసించండి' అని శపించాడు. (23)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి అర్జునవనవాస పర్వణి తీర్థగ్రాహవిమోచనే పంచదశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 215 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున అర్జునవనవాస పర్వమను
ఉపపర్వమున తీర్థగ్రాహవిమోచనమను రెండువందల పదునైదవ అధ్యాయము. (215)