218. రెండువందల పదునెనిమిదవ అధ్యాయము

(సుభద్రాహరన పర్వము)

అర్జునుడు సుభద్రను అపహరించుట

వైశంపాయన ఉవాచ
తతః కతిపయాహస్య తస్మిన్ రైవతకే గిరౌ ।
వృష్ణ్యంధకానామభవద్ ఉత్సవో నృపసత్తమ ॥ 1
వైశంపాయనుడు పలికాడు - రాజా! కొన్నిరోజులు గడిచిన తరువాత వృష్ణి, అంధక వంశీయులకు రైవతకపర్వతాన గొప్ప ఉత్సవం వచ్చింది. (1)
తత్ర దానం దదుర్వీరాః బ్రాహ్మణేభ్యః సహస్రశః ।
భోజవృష్ణ్యంధకాశ్చైవ మహే తస్య గిరేస్తదా ॥ 2
పర్వతం మీద జరిగే ఉత్సవంలో బ్రాహ్మణులకు చాలమందికి భోజ, వృష్ణి, అంధకవంశీయులు దానాలు చేశారు. (2)
ప్రాసాదైరత్నచిత్రైశ్చ గిరేస్తస్య సమంతతః ।
స దేశః శోభితో రాజన్ కల్పవృక్షైశ్చ సర్వశః ॥ 3
పర్వతానికి నాలుగువైపుల విచిత్రమైన రత్నఖచితభవనాలు, కల్పవృక్షాలు ఉన్నాయి. వాటితో ఆ ప్రదేశమ్ అందగించింది. (3)
వాదిత్రాణి చ తత్రాన్యే వాదకాః సమవాదయన్ ।
ననృతుర్నకాశ్చైవ జగుర్గేయాని గాయనాః ॥ 4
వాదకుశలులైన వాద్యకులు వివిధ రకాల వాద్యాలను మ్రోగించారు. నర్తకులు నాట్యం చేశారు. గాయకులు గీతాలు పాడారు. (4)
అలంకృతాః కుమారాశ్చ వృష్ణీనాం సుమహౌజసామ్ ।
యానైర్హాటకచిత్రైశ్చ చంచూర్యంతే స్మ సర్వశః ॥ 5
తేజస్వులైన యాదవకుమారులు అలంకరించుకొని బంగారుతాపడం చేసిన వాహనాలపై ఇటు అటు తిరగసాగారు. (5)
పౌరాశ్చ పాదచారేన యానైరుచ్చావచైస్తథా ।
సదారాః సానుయాత్రాశ్చ శతశోఽథ సహస్రశః ॥ 6
తతో హలధరః క్షీబః రేవతీసహితః ప్రభుః ।
అనుగమ్యమానో గంధర్వైః అచరత్ తత్ర భారత ॥ 7
ద్వారకాపురవాసులు తమతమ భార్యలతో గూడి కొందరు, కాలినడకన కొందరు; చిన్న, పెద్ద వాహనాలలో ఉత్సవంలో పాల్గొన్నారు. పూజ్యుడు బలరాముడు మధుపానమత్తుడై రేవతితో కలిసి విహరించాడు. గంధర్వు లతనిని అనుసరించారు. (6,7)
తథైవ రాజా వృష్ణీనామ్ ఉగ్రసేనః ప్రతాపవాన్ ।
అనుగీయమానో గంధర్వైః స్త్రీసహస్రసహాయవాన్ ॥ 8
వృష్ణివంశీయుడు, ప్రతాపవంతుడు, యాదవరాజు అయిన ఉగ్రసేనుడు అక్కడ సంచరించాడు. గంధర్వులు గానంతో మైమరపింపచేశారు. వేలకొద్దీ స్త్రీలు అతనిని సేవింపసాగారు. (8)
రౌక్మిణేయశ్చ సాంబశ్చ క్షీబౌ సమరదుర్మదౌ ।
దివ్యమాల్యాంబరధరౌ విజహ్రాతేఽమరావివ ॥ 9
యుద్ధదుర్మదులు, వీరశ్రేష్ఠులు సాంబప్రద్యుమ్నులు దివ్యమాలలు ధరించి మత్తులై అమరులైన దేవతలవలె ఆనందంతో సంచరింపసాగారు. (9)
అక్రూరః సారణశ్చైవ గదో బభ్రుర్విదూరథః ।
నిశఠశ్చారుదేష్ణశ్చ పృథుర్విపృథురేవ చ ॥ 10
సత్యకః సాత్యకిశ్చైవ భంగకారమహారవౌ ।
హార్దిక్య ఉద్ధవశ్చైవ యే చాన్యే నానుకీర్తితాః ॥ 11
ఏతే పరివృతాః స్త్రీభిః గంధర్వైశ్చ పృథక్ పృథక్ ।
తముత్సవం రైవతకే శోభయాంచక్రిరే తదా ॥ 12
అక్రూరుడు, సారణుడు, గదుడు, బభ్రువు, విదూరథుడు, నిశఠుడు, చారుదేష్ణుడు, పృథువు, విపృథువు, సత్యకుడు, సాత్యకి, భంగకారుడు, మహారవుడు, హార్దిక్యుడు (కృతవర్మ), ఉద్ధవుడు ఇంకా మిగిలిన యదువంశీయులూ తమ తమ భార్యలతో గంధర్వులతో విడివిడిగా తిరిగారు. రైవతం మిద ఉత్సవశోభను వృద్ధిచేశారు. (10-12)
చిత్రకౌతూహలే తస్మిన్ వర్తమానే మహాద్భుతే ।
వాసుదేవశ్చ పార్థశ్చ సహితౌ పరిజగ్మతుః ॥ 13
అద్బుతమూ, కుతూహలజనకమూ అయిన ఆ ఉత్సవంలో కృష్ణార్జునులిరువురూ కలిసి సంచరించారు. (13)
తత్ర చంక్రమ్యమాణౌ తౌ వసుదేవసుతాం శుభమ్ ।
అలంకృతాం సకీమధ్యే భద్రాం దదృశతుస్తదా ॥ 14
అలా సంచరిస్తూ వారిరువురు వసుదేవుని ప్రియపుత్రిక అయిన సుభద్రను చూశారు. ఆమె అలంకరించుకొని సఖురాండ్ర మధ్యలో తిరుగసాగింది. (14)
దృష్ట్వైవ తామర్జునస్య కందర్పః సమజాయత ।
తం తదైకాగ్రమనసం కృష్ణః పార్థమలక్షయత్ ॥ 15
ఆమెను చూస్తూనే అర్జునునికి హృదయంలో మన్మథుడు ఆవిర్భవించాడు. ఆమె పట్ల ఆసక్తమైన అర్జునుని తీరు శ్రీకృష్ణుడు గుర్తించాడు. (15)
అబ్రవీత్ పురుషవ్యాఘ్రః ప్రహసన్నివ భారత ।
వనేచరస్య కిమిదమ్ కామేనాలోడ్యతే మనః ॥ 16
శ్రీకృష్ణుడు పరిహసిస్తూ అర్జునునితో ఇలా అన్నాడు. 'వనవాసియైన నీ మనస్సు ఇలా మన్మథునిచే సంక్షోభ పడుతోంది ఏమిటి? (16)
మమైషా భగినీ పార్థ సారణస్య సహోదరా ।
సుభద్రా నామ భద్రం తే పితుర్మే దయితా సుతా ।
యది తే వర్తతే బుద్ధిః వక్ష్యామి పితరం స్వయమ్ ॥ 17
కుంతీనందనా! ఈమె నాసోదరి. సారణుని సహోదరి. ఈమె పేరే సుభద్ర. ఈమె నా తండ్రికి ప్రియపుత్రిక. నీకు మంగళమగుగాక! నీబుద్ధి ఈమెను వివాహమ్ చేసుకోవాలని అనుకొంటే నా తండ్రికి స్వయంగా చెపుతాను.' (17)
అర్జున ఉవాచ
దుహితా వసుదేవస్య వాసుదేవస్య చ స్వసా ।
రూపేణ చైషా సంపన్నా కమివైషా న మోహయేత్ ॥ 18
అర్జునుడు అన్నాడు-సాక్షాత్తుగా వాసుదేవుని చెల్లెలు, వసుదేవుని కుమార్తె. చక్కని రూప సంపదకల ఎవరిని మోహపెట్టదు? (18)
కృతమేవ తు కల్యాణం సర్వం మమ భవేద్ ధ్రువమ్ ।
యదిస్యాన్మమ వార్ష్ణేయీ మహిషీయం స్వసా తవ ॥ 19
మిత్రమా! వృష్ణివంశజ అయిన నీ సోదరి సుభద్ర నన్ను వివాహం చేసుకొంటే యింతకంటె నాకు వేరొక మంగళప్రదమైన విషయం ఏముంటుంది. (19)
ప్రాప్తౌ తు క ఉపాయః స్యాత్ తం బ్రవీహి జనార్దన ।
ఆస్థాస్యామి తదా సర్వం యది శక్యం నరేణ తత్ ॥ 20
జనార్దనా! చెప్పు. ఈమెను పొందుటకు సులభం అయిన ఉపాయం ఏది? నరుడు చేయగలిగిన దాన్ని తప్పక చేయగలను. (20)
వాసుదేవ ఉవాచ
స్వయంవరః క్షత్రియాణాం వివాహః పురుషర్షభ ।
స చ సంశయితః పార్థ స్వభావస్యానిమిత్తతః ॥ 21
వాసుదేవుడు అన్నాడు - పార్థుడా! క్షత్రియులకు స్వయంవరం ధర్మం కాని ఆ మార్గం సందేహం. స్త్రీ స్వభావం అనిశ్చితమై ఉంటుంది. (21)
వి॥సం॥ స్వభావం తెలియకపోయినా ఆపాతరమణీయమైన పురుషునిపై స్త్రీలు వెంటనే అనురక్తలవుతారు. (నీల)
ప్రసహ్య హరణం చాపి క్షత్రియాణాం ప్రశస్యతే ।
వివాహహేతుః శూరాణామ్ ఇతి ధర్మవిదో విదుః ॥ 22
బలవంతంగా అపహరించి వివాహం చేసుకోవటం కూడ శూరులకు ఉత్తమం అని ధర్మవేత్తలు తెలిపారు. (22)
స త్వమర్జున కల్యాణీం ప్రసహ్య భగినీం మమ ।
హర స్వయంవరే హ్యస్యాః కో వై వేద చికీర్షితమ్ ॥ 23
కావున నా అభిప్రాయంలొ ఈమెను అపహరించి వివాహం చేసుకోవడమే తగినది. అపహరించి తీసుకొని వెళ్ళు. స్వయంవరంలో ఈమె ఎవరిని వరిస్తుందో ఎవరికి తెలుసు? (23)
తతోఽర్జునశ్చ కృష్ణశ్చ వినిశ్చిత్యేతికృత్యతామ్ ।
శీఘ్రగాన్ పురుసానన్యాన్ ప్రేషయామాసతుస్తదా ॥ 24
ధర్మరాజాయ తత్ సర్వమింద్రప్రస్థగతాయ వై ।
శ్రుత్వైవ చ మహాబాహుః అనుజజ్ఞే స పాండవః ॥ 25
శ్రీకృష్ణార్జునులు ఇలా నిశ్చయించుకొని శీఘ్రంగా పొగల దూతలను ఇంద్రప్రస్థపురానికి ధర్మజుని అనుజ్ఞకై పంపారు. అది విన్న ధర్మరాజు తన సమ్మతిని తెలియజేశాడు. (24,25)
(భీమసేనస్తు తచ్ఛ్రుత్వా కృతకృత్యోఽభ్యమన్యత ।
ఇత్యేవం మనుజైః సార్థమ్ ఉక్త్వా ప్రీతిముపేయివాన్ ॥)
ఈ విషయం విని భీముడు కృతకృత్యుల మైనాము అని భావిమ్చి ఆ చారులతో కూడా ఈ విషయం చెప్పి సంతోషించాడు.
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సుభద్రాహరణపర్వణి యుధిష్ఠిరానుజ్ఞాయాం అష్టాదశాధిక ద్విశతతమోఽధ్యాయః ॥ 218 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సుభద్రాహరణ పర్వమను
ఉపపర్వమున యుధిష్ఠిరానుజ్ఞ అను రెండువందల పదునెనిమిదవ అధ్యాయము. (218)