219. రెండువందల పందొమ్మిదవ అధ్యాయము
యాదవులతో యుద్ధము, బలరాముని క్రోధవచనములు.
వైశంపాయన ఉవాచ
తతః సంవాదితే తస్మిన్ అనుజ్ఞాతో ధనంజయః ।
గతాం రైవతకే కన్యాం విదిత్వా జనమేజయ ॥ 1
వాసుదేవాభ్యనుజ్ఞాతః కథయిత్వేతికృత్యతామ్ ।
కృష్ణస్య మతమాదాయ ప్రయయౌ భరతర్షభః ॥ 2
వైశంపాయనుడు అన్నాడు. జనమేజయా! వివాహ విషయంలో యుధిష్ఠిరుని ఆజ్ఞపొందిన అర్జునుడు సుభద్ర రైవతకపర్వతానికి వెళ్ళినట్లు తెలిసికొని శ్రీకృష్ణుని అభిప్రాయం అడిగాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి ఆచరించవలసినదాన్ని ఆదేశించాడు. సుభద్ర వివాహవిషయంలో శ్రీకృష్ణుని అనుమతి గ్రహించి బయలుదేరాడు అర్జునుడు. (1,2)
రథేన కాంచనాంగేన కల్పితేన యథావిధి ।
శైబ్యసుగ్రీవయుక్తేన కింకిణీజాలమాలినా ॥ 3
సర్వశస్త్రోపపన్నేన జిమూతరవనాదినా ।
జ్వలితాగ్నిప్రకాశేన ద్విషితామ్ హర్షఘాతినా ॥ 4
సంనద్ధః కవచీ ఖడ్గీ బద్ధగోధాంగుళిత్రవాన్ ।
మృగయావ్యపదేశేన ప్రయయౌ పురుషర్షభః ॥ 5
ఇంతలొ దారుకుడు శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం సువర్ణ రథాన్ని యథావిధిగా సిద్ధపరచాడు. చిరుమువ్వలు, జాలరులు గల ఆ రథానికి శైబ్యం, సుగ్రీవం అనే గుఱ్ఱాలను పూన్చాడు. ఆ రథంలో వివిధ శస్త్రాస్త్రాలు సమకుర్చాడు. వాటి ఒరపిడిచే మేఘగర్జన వంటి ధ్వని వస్తోంది. అది శత్రువుల హర్షం ఒక్కసారిగా దిగజార్చేలా ఉంది. కవచం,ఖడ్గం, వ్రేలి తొడుగులు ధరించిన అర్జునుడు వేట మిషతో రైవతానికి బయలుదేరినట్లుగా వెళ్లాడు. (3-5)
సుభద్రా త్వథ శైలేంద్రమ్ అభ్యర్చ్యైవ హి రైవతమ్ ।
దైవతాని చ సర్వాణి బ్రాహ్మణాన్ స్వస్తి వాచ్య చ ॥ 6
ప్రదక్షిణం గిరేః కృత్వా ప్రయయౌ ద్వారకామ్ ప్రతి ।
తామభిద్రుత్య కౌంతేయః ప్రసహ్యారోపయేద్ రథమ్ ।
సుభద్రాం చారు సర్వాంగీం కామబాణప్రపీడితః ॥ 7
సుభద్ర రైవతకపర్వతాన్ని పూజించి, దేవతాగణాన్ని ఆరాధించి, బ్రాహ్మణుల స్వస్తివచనాలను గ్రహించి పర్వతానికి ప్రదక్షిణమ్ చేసి ద్వారకానగరానికి బయలుదేరింది. కాముని బాణాలచే పీడితుడైన అర్జునుడు సుందరి సుభద్రను బలవంతంగా రథంపై కూర్చుండబెట్టుకొని బయలుదేరాడు. (6,7)
తతః స పురుష వ్యాఘ్రః తామాదాయ శుచిస్మితామ్ ।
రథేన కాంచనాంగేన ప్రయయౌ స్వపురం ప్రతి ॥ 8
పురుషశ్రేష్ఠుడు అర్జునుడు చక్కని చిరునవ్వు లొలికే సుభద్రను సువర్ణరథంపై ఎక్కించుకుని తన నగరం వైపు బయలుదేరాడు. (8)
హ్రియమాణాం తు తాం దృష్ట్వా సుభద్రాం సైనికా జనాః ।
విక్రోశంతోఽద్రవన్ సర్వే ద్వారకామభితః పురమ్ ॥ 9
సుభద్ర అపహరణం చూచిన సైనికగణం పెడబొబ్బలు పెడుతూ ద్వారకానగరం వైపు పరుగులు తీసింది. (9)
తే సమాసాద్య సహితాః సుధర్మామభితః సభామ్ ।
సభాపాలస్య తత్ సర్వమాచఖ్యుః పార్థవిక్రమమ్ ॥ 10
వారందరు ఒక్కసారిగా సుధర్మ అనే సభలోనికి ప్రవేశించి సభాపాలకునితో పార్థుని విక్రమాపహరణ వృత్తాంతం చెప్పారు. (10)
తేషాం శ్రుత్వా సభాపాలః భేరీం సాంనాహికీం తతః ।
సమాజఘ్నే మహాఘోషాం జాంబూనదపరిష్కృతామ్ ॥ 11
వెంటనే సభాపాలకుడు అదివిని యుద్ధభేరిని మ్రోగింపచేశాడు. (11)
క్షుబ్ధాస్తేనాథ శబ్దేన భొజవృష్ణ్యంధకాస్తదా ।
అన్నపానమపాస్యాథ సమాపేతుః సమంతతః ॥ 12
ఆ ధ్వని విని భోజ, వృష్ణి, అంధకాది యదువీరులు కలవరపడ్డారు. అన్నపానాలు విడిచి ఒక్కుమ్మడిగా అన్నివైపుల నుండి వచ్చిచేరాడు. (12)
తత్ర జాంబూనదాంగాని స్పర్ధ్యాస్తరనవంతి చ ।
మైవిద్రుమచిత్రాణి జ్వలితాగ్నిప్రభాణి చ ॥ 13
భేజిరే పురుషవ్యాఘ్రాః వృష్ణ్యంధకమహారథాః ।
సింహాసనాని శతశః ధిష్ణ్యానీవ హుతాశనాః ॥ 14
ఆ సభాభవనంలో బంగారు సింహాసనాలు, వాటిపై విలువైన కంబళ్ళు ఉన్నాయి. మణులు, పగడాలు పొదగటంతో అవి అగ్నివలె ప్రకాశించాయి. భోజ, వృష్ణి, అంధక యదువీరులు ఆయా ఆసనాలపై ఆసీనులయ్యారు. ఆ మహారథులంతా యజ్ఞవేదికలలో ప్రకాశించే అగ్నులవలె భాసించారు. (13,14)
తేషాం సముపవిష్టానాం దేవానామివ సంనయే ।
ఆచఖ్యౌ చేష్టితం జిష్ణోః సభాపాలః సహానుగః ॥ 15
దేవతల వలె ప్రకాశించే యదువీరులందరు ఆసీనులు కాగానే సభాపాలకుడు అర్జునుని సుభద్రాపహరణ వృత్తాంతమంతా వారికి వినిపించాడు. (15)
తచ్ఛ్రుత్వా వృష్ణివరాస్తే మదసంరక్తలోచనాః ।
అమృష్యమాణాః పార్థస్య సముత్పేతురహంకృతాః ॥ 16
అది విని వృష్ణి వీరులు యుద్ధోన్మాదంతో ఎఱ్ఱబడ్డ కన్నులు కలవారై అర్జునుని చేష్టను సహింపలేక గర్వంతో ఎగిరి పడ్డారు. (16)
యోజయుధ్వం రథానాశు ప్రాసానాహరేతి చ ।
ధనూంషి చ మహార్హాణి కవచాని బృహంతి చ ॥ 17
తొందరగా రథాలు సిద్ధం చేయండి. ప్రాసాయుధాలను బయటకు తీయండి. గొప్పగొప్ప ధనుస్సులను, పెద్ద పెద్ద కవచాలను తీసుకురండి అని పలికారు. (17)
సూతానుచ్చుక్రుశుః కేచిద్ రథాన్ యోజయతేతి చ ।
స్వయం చ తురగాన్ కేచిదయుంజన్ హేమభూషితాన్ ॥ 18
కొందరు సారథులను పిలిచి రథాలను సిద్ధంచేయండి అన్నారు. కొందరు స్వయంగానే బంగారు ఆభరణాలతో కూడిన గుఱ్ఱాలను పూన్చారు. (18)
రథేష్వానీయమానేషు కవచేషు ధ్వజేషు చ ।
అభిక్రందే నృవీరాణాం తదాసీత్ తుములం మహత్ ॥ 19
రథాలు, కవచాలు, ధ్వజాలు తెచ్చేటప్పుడు నాలుగువైపులా ఆ యాదవవీరుల కోలాహలంతో సంకులమైన ధ్వని వ్యాపించింది. (19)
వనమాలీ తతః క్షీబః కైలాసశిఖరోపమః ।
నిలవాసా మదోత్సిక్తః ఇదం వచనమబ్రవీత్ ॥ 20
అపుడు కైలాసశిఖరంవలె తెల్లగా ప్రకాశిస్తూ, నీల వస్త్రాలు. వనమాల ధరించి బలరాముడు ఇలా పలికాడు. (20)
కిమిదం కురుథాప్రజ్ఞాః తూష్ణీంభూతే జనార్దనే ।
అస్య భావమవిజ్ఞాయ సంక్రుద్ధా మోఘగర్జితాః ॥ 21
మూర్ఖులారా! శ్రీకృష్ణుడు మాటాడటం లేదు. ఈ కోలాహలమెందులకు? వాని అభిప్రాయం తెలుసుకోకుండా వ్యర్థంగా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. (21)
ఏష తావదభిప్రాయమ్ ఆఖ్యాతు స్వం మహామతిః ।
యదస్య రుచిరం కర్తుం తత్ కురుధ్వమతంద్రితాః ॥ 22
ముందు బుద్ధిమంతుడైన శ్రీకృష్ణుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు. అటుపై కర్తవ్య నిర్ణయం మనం చేద్దాం. ఆలసించకుండా ఆయన మాటలు వినండి. (22)
తతస్తే తద్ వచః శ్రుత్వా గ్రాహ్యరూపం హలాయుధాత్ ।
తూష్ణీం భూతాస్తతః సర్వే సాదుసాధ్వితి చాబ్రువన్ ॥ 23
స్వికరింపతగిన బలరాముని మాటలను విని యాదవులందరు నిశ్శబ్దాన్ని పాటించారు. అందరు బాగుంది అన్నారు. (23)
సమం వచో నిశమ్యైవ బలదేవస్య ధీమతః ।
పునరేవ సభామధ్యే సర్వే తే సముపావిశన్ ॥ 24
బుద్ధిమంతుడైన బలరాముని మాటల్ని విని వెంటనే సభలోని యాదవవీరులందరు శ్రీకృష్ణుని మాటలు వినటానికి మౌనంగా కూర్చున్నారు. (24)
తతోఽబ్రవీత్ వాసుదేవం వచో రామః పరంతపః ।
కిమవాగుపవిష్టోఽసి ప్రేక్షమాణో జనార్దన ॥ 25
శత్రుపీడకుడు బలరాముడు వెంటనే శ్రీకృష్ణునితో 'జనార్దనా! ఏమియు మాటాడక మౌనంగా చూస్తూ ఊరకున్నావేమి? (25)
సత్కృతస్త్వత్కృతే పార్థః సర్వైరస్మాభిరచ్యుత ।
న చ సోఽర్హతి తాం పూజాం దుర్భుద్ధిః కులపాంసనః ॥ 26
అచ్యుతా! నీకోసం అర్జునుని మేము గౌరవించాం. కులనాశకుడు, అల్పబుద్ధిగల అర్జునుడు ఆ పూజకు అర్హుడు కాడు. (26)
కో హి తత్రైవ భుక్త్వాన్నం భాజనం భేత్తుమర్హతి ।
మన్యమానః కులే జాతమ్ ఆత్మానం పురుషః క్వచిత్ ॥ 27
అన్నం తిన్న పాత్రను అచటనే పగులగొట్టడం సద్వంశజులకు ఉచితం కాదు. (27)
ఇచ్ఛన్నేవ హి సంబంధం కృతం పూర్వం చ మానయన్ ।
కొ హి నామ భవేనార్థీ సాహసేన సమాచరేత్ ॥ 28
మన సంబంధాన్ని కోరుతూనే పూర్వపు ఉపకారాన్ని స్మరింపకుండా కళ్యాణాన్ని కోరే వాడు ఎవడయినా ఇలా సాహసాన్ని చూపుతాడా? (28)
సోఽవమన్య తథాస్మాకమ్ అనాదృత్య చ కేశవమ్ ।
ప్రసహ్య హృతవానద్య సుభద్రాం మృత్యుమాత్మనః ॥ 29
అర్జునుడు మనసు అవమానించి, శ్రీకృష్ణుని లక్ష్యపెట్టక, తన మృత్యువును తెచ్చిపెట్టే సుభద్రాదేవిని బలవంతంగా అపహరించాడు. (29)
కథం హి శిరసో మధ్యే కృతం తేన పదం మమ ।
మర్షయిష్యామి గోవింద పాదస్పర్శమివోరగః ॥ 30
సర్పం నరునిపాదమెట్లు సహింపదో అట్లే నా తలపై నుంచిన అర్జునుని పాదాన్ని బలవంతుడనైన నేను ఎలా వహిస్తాను. (30)
అద్య నిష్కౌరవామేకః కరిష్యామి వసుంధరామ్ ।
న హి మే మర్షణీయోఽయమ్ అర్జునస్య వ్యతిక్రమః ॥ 31
అర్జునుని ఈ ధిక్కారాన్ని నేను సహింపలేను. ఇప్పుడే నేనొక్కడినే ఈ భూమినంతటినీ అకౌరవం చేసి చూపిస్తాను.' (31)
తం తథా గర్జమానం తు మేఘదుందుభినిస్స్వనమ్ ।
అన్వపద్యంత తే సర్వే భోజవృష్ణ్యంధకాస్తదా ॥ 32
మేఘ, దుందుభులతో పోటీ పడే కంఠస్వరంతో బలరాముడు ఇలా గర్జిస్తే భోజ, వృష్ణి, అంధక యదువీరులంతా ఆ మాటలను సమర్థించారు. (32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సుభద్రాహరణపర్వణి బలదేవక్రోధే ఏకోనవింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః ॥ 219 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సుభద్రాహరణ పర్వమను
ఉపపర్వమున బలదేవక్రోధమను రెండువందల పందొమ్మిదవ అధ్యాయము. (219)
సోఽవమన్య తథాస్మాకమ్ అనాదృత్య చ కేశవమ్ ।
ప్రసహ్య హృతవానద్య సుభద్రాం మృత్యుమాత్మనః ॥ 29
అర్జునుడు మనసు అవమానించి, శ్రీకృష్ణుని లక్ష్యపెట్టక, తన మృత్యువును తెచ్చిపెట్టే సుభద్రాదేవిని బలవంతంగా అపహరించాడు. (29)
కథం హి శిరసో మధ్యే కృతం తేన పదం మమ ।
మర్షయిష్యామి గోవింద పాదస్పర్శమివోరగః ॥ 30
సర్పం నరునిపాదమెట్లు సహింపదో అట్లే నా తలపై నుంచిన అర్జునుని పాదాన్ని బలవంతుడనైన నేను ఎలా వహిస్తాను. (30)
అద్య నిష్కౌరవామేకః కరిష్యామి వసుంధరామ్ ।
న హి మే మర్షణీయోఽయమ్ అర్జునస్య వ్యతిక్రమః ॥ 31
అర్జునుని ఈ ధిక్కారాన్ని నేను సహింపలేను. ఇప్పుడే నేనొక్కడినే ఈ భూమినంతటినీ అకౌరవం చేసి చూపిస్తాను.' (31)
తం తథా గర్జమానం తు మేఘదుందుభినిస్స్వనమ్ ।
అన్వపద్యంత తే సర్వే భోజవృష్ణ్యంధకాస్తదా ॥ 32
మేఘ, దుందుభులతో పోటీ పడే కంఠస్వరంతో బలరాముడు ఇలా గర్జిస్తే భోజ, వృష్ణి, అంధక యదువీరులంతా ఆ మాటలను సమర్థించారు. (32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సుభద్రాహరణపర్వణి బలదేవక్రోధే ఏకోనవింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః ॥ 219 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సుభద్రాహరణ పర్వమను
ఉపపర్వమున బలదేవక్రోధమను రెండువందల పందొమ్మిదవ అధ్యాయము. (219)