221. రెండువందల ఇరువది యొకటవ అధ్యాయము

(ఖాండవ దాహపర్వము)

కృష్ణార్జునులు ఖాండవవనమున అగ్నిదేవుని చూచుట.

వైశంపాయన ఉవాచ
ఇంద్రప్రస్థే వసంతస్తే జఘ్నురన్యాన్ నరాధిపాన్ ।
శాసనాద్ ధృతరాష్ట్రస్య రాజ్ఞః శాంతనవస్య చ ॥ 1
వైశంపాయనుడు అన్నాడు -
రాజైన ధృతరాష్ట్రుడు, పితామహుడు శాంతనవుడు ఆజ్ఞాపించగా ఇంద్రప్రస్థనగరంలో నివసిస్తూ పాండవులు శత్రురాజులందరినీ జయించారు. (1)
ఆశ్రిత్య ధర్మరాజానం సర్వలోకోఽవసత్ సుఖమ్ ।
పుణ్యలక్షణకర్మాణం స్వదేహమివ దేహినః ॥ 2
జీవాత్మ పుణ్యకర్మల ఫలంగా సుంద్రదేహాన్ని పొంది ఆనందించినట్లు పుణ్యకర్మలను మాత్రమే ఆచరించే ధర్మరాజు పాలనలో లోకమంతా సుఖానుభవాన్ని పొందింది. (2)
స సమం ధర్మకామార్థాన్ సిషేవే భరతర్షభ ।
త్రీనివాత్మసమాన్ బంధూన్ నీతిమానివ మానయన్ ॥ 3
నీతిపరుడయిన పురుషుడు ధర్మార్థకామాలు మూడింటినీ సమంగా సేవించినట్లు ఆత్మసములైన బంధువుల వలె గౌరవిస్తూ ధర్మరాజు ధర్మార్థకామాలను సేవించాడు. (3)
తేషాం సమవిభక్తానామ్ క్షితౌ దేహవతామివ ।
బభౌ ధర్మార్థకామానాం చతుర్థ ఇవ పార్థివః ॥ 4
ఆయన పాలనలో ధర్మార్థకామపురుషార్థాలు శరీరం దాల్చినవా అన్నట్లు ప్రకాశించాయి. నాల్గవ పురుషార్థం మోక్షం సాక్షాత్తుగా ధర్మజుడై ప్రకాశించింది. (4)
వి॥సం॥ ముగ్గురుమంత్రులకు నాల్గవవాడైన రాజు ఆరాధ్యుడయినట్లు, ధర్మార్థకామాలకు మూడింటికి నాల్గవదైన మోక్షం ఆరాధనీయమైనట్లు ధర్మాదులు స్వయంగా సంక్రమించాయి. (నీల)
అధ్యేతారం పరం వేదాన్ ప్రయోక్తారం మహాధ్వరే ।
రక్షితారం శుభాంల్లోకాన్ లేభిరే తం జనాధిపమ్ ॥ 5
ప్రజలందరు ధర్మజుని పొంది పరబ్రహ్మ చింతన చేసేవానిగా, యాగాల్లో వేదాంశాలు ఉపయోగించే వానిగా, శుభలోకాలు రక్షించేవానిగా గుర్తించారు. (5)
అధిష్ఠానవతీ లక్ష్మీః పరాయణవతీ మతిః ।
వర్ధమానోఽఖిలో ధర్మః తేనాసీత్ పృథివీక్షితామ్ ॥ 6
చంచల అయిన లక్షి యుధిష్ఠిరుని కారణంగా రాజులలో స్థిరనివాసాన్ని ఏర్పరచుకొన్నది. బుద్ధి ఉత్తమ నిష్ట కలిగిన దయింది, ధర్మం దినదినమ్ ప్రవర్ధమయ్యేలా మారింది. (6)
భ్రాతృభిః సహితో రాజా చతుర్భిరధికం బభౌ ।
ప్రయుజ్యమానైర్వితతః వేదైరివ మహాధ్వరః ॥ 7
అవసరసమయాన సోదరుల నుపయోగిమ్చే ధర్మరాజు నాలుగువేదాలు యజ్ఞంలో ఉపయోగించేటట్లు వారిని తీర్చిదిద్దాడు. వారందరు అతని ఆజ్ఞావశులై చరింపసాగారు. (7)
తం తు ధౌమ్యాదయో విప్రాః పరివార్యోపతస్థిరే ।
బృహస్పతిసమా ముఖ్యాః ప్రజాపతిమివామరాః ॥ 8
బృహస్పతిసములైన దేవతాశ్రేష్ఠులు ప్రజాపతిని సేవించినట్లు ధౌమ్యాదులైన బ్రాహ్మణులందరు ఎల్లవేళలా ధర్మజుని అన్నివైపుల చుట్టి సంరక్షించసాగారు. (8)
ధర్మరాజే హ్యతిప్రీత్యా పూర్ణచంద్ర ఇవామలే ।
ప్రజానాం రేమిరే తుల్యం నేత్రాణి హృదయాని చ ॥ 9
నిర్మల చంద్రునిపై ప్రజలు ప్రీతిని చూపినట్లు ప్రజలందరి నేత్ర్రాలు, హృదయాలు ధర్మజుని మీది ప్రేమతో ఆనందించాయి. (9)
న తు కేవలదైవేన ప్రజాభావేన రేమిరే ।
యద్ బభూవ మనఃకాంతం కర్మణా స చకార తత్ ॥ 10
ధర్మరాజు దైవికంగా ఏర్పడిన రాజని ప్రజలు సంతోషించలేదు. మనస్సుతో, భక్తిభావంతో సంతసించారు. ప్రజల మనోభీష్టాలకు అనుగుణంగా ధర్మరాజు సత్కృత్యాలను ఆచరించాడు. (10)
న హ్యయుక్తం న చాసత్యం నాసహ్యం న చ వా ప్రియమ్ ।
భాషితం చారుభాషస్య జజ్ఞే పార్థస్య ధీమతః ॥ 11
సదా మంచినే మాట్లాడే కుంతీనందనుని ముఖమ్ నుండి అసత్యం, అయుక్తం, అసహ్యమ్, అప్రియం అయిన వచనాలు ఎన్నడూ వెలువడలేదు. (11)
స హి సర్వస్య లోకస్య హితమాత్మన ఏవ చ ।
చికీర్షన్ సుమహాతేజాః రేమే భరతసత్తమ ॥ 12
భరతశ్రేష్ఠా! తేజోవంతుడైన ధర్మజుడు ప్రజలందరి హితం తన హితంగా భావించి వారిని ఆనందపరిచి తాను ఆనందించాడు. (12)
తథా తు ముదితాః సర్వే పాండవా విగతజ్వరాః ।
అవసన్ పృథివీపాలాన్ తాపయంతః స్వతేజసా ॥ 13
ఆ విధంగా పాండవులందరు తమతేజస్సుచే శత్రురాజులను లొంగదీసికొని నిశ్చింతగా, సంతోషంతో ఇంద్రప్రస్థంలో జీవించారు. (13)
తతః కతిపయాహస్య బీభత్సుః కృష్ణమబ్రవీత్ ।
ఉష్ణాని కృష్ణ వర్తంతే గచ్ఛామో యమునామ్ ప్రతి ॥ 14
కొన్ని రోజులకు అర్జునుడు శ్రీకృష్ణునితో అన్నాడు - "వేసవి కాలం వచ్చింది. యమునానదికి వెళ్దామా'. (14)
సుహృజ్జనవృతౌ తత్ర విహృత్య మధుసూదన ।
సాయాహ్ణే పునరేష్యావః రోచతాం మే జనార్దన ॥ 15
మధుసూదనా! మిత్రులతో కలిసి సాయంకాలం వరకు విహరిమ్చి తిరిగి వద్దాం. మీ అనుమతిని తెల్పండి". (15)
వాసుదేవ ఉవాచ
కుంతీమాతర్మమాప్యేతద్ రోచతే యద్ వయం జలే ।
సుహృజ్జనావృతాః పార్థ విహరేమ యథాసుఖమ్ ॥ 16
వాసుదేవుడు పలిఖాడు - కుంతీనందనా! నాకూ ఈ కోరిక ఉంది. మనం స్నేహితులతో కలిసి యమునానదికి వెళ్లి జలవిహారం చేసి సుఖమ్గా తిరిగివద్దాం. (16)
వైశంపాయన ఉవాచ
ఆమంత్ర్య తౌ ధర్మరాజమ్ అనుజ్ఞాప్య చ భారత ।
జగ్మతుః పార్థగొవిందౌ సుహృజ్జనవృతౌ తతః ॥ 17
వైశంపాయనుడు అన్నాడు - భారతా! వారిలా అభిప్రాయపడి, ధర్మజుని అనుమతిగైకొని, స్నేహితులతో యమునావిహారానికి వెళ్ళాడు. (17)
విహారదేశం పంప్రాప్య నానాద్రుమమనుత్తమమ్ ।
గృహైరుచ్చావచైర్యుక్తమ్ పురందరపురోపమమ్ ॥ 18
భక్ష్యైర్భోజ్యైశ్చ పేయైశ్చ రమయద్భిర్మహాదనైః ।
మాల్యైశ్చ వివిధైర్గంధైః యుక్తం వార్ష్ణేయపార్థయోః ॥ 19
వివేశాంతఃపురం తూర్ణమ్ రత్నైరుచ్చావచైః శుభైః ।
యథోపజోషం సర్వశ్చ జనశ్చిక్రీడ భారత ॥ 20
ఆ విహారప్రదేశం ఎన్నో చెట్లతో, చిన్న, పెద్ద భవనాలతో ఇంద్రుని నగరంలా ఉంది. అంతఃపురస్త్రీలతో బాటు ఆ ప్రదేశం పరిమళభరితమ్ అయింది. రత్నాలతో, ఉత్తమస్త్రీలతో శ్రీకృష్ణార్జునులు క్రీడాభవనం వెలుపలికి వచ్చారు. అచట ఎవరికి వారు యమునాతీరంలో తమ స్వేచ్ఛానుసారం జలక్రీడలు ఆచరించారు. (18-20)
స్త్రియశ్చ విపులశ్రోణ్యః చారుపీనపయోధరాః ।
మదస్ఖలితగామిన్యః చిక్రీడుర్వామలోచనాః ॥ 21
ఆకర్షణీయమైన వక్షఃస్థలం, విశాలనితంబాలు గలిగి మందగామినులై సుందరస్త్రీలంతా క్రీడించారు. (21)
వనే కాశ్చిజ్జలే కాశ్చిత్ కాశ్చిత్ వేశ్మసు చాంగనాః ।
యథాయోగ్యం యథాప్రీతి చిక్రీడుః పార్థకృష్ణయోః ॥ 22
శ్రీకృష్ణార్జునుల ప్రీతికి అనుగుణంగా కొంతమంది స్త్రీలు వనంలో, కొంతమంది జలంలో, కొంతమంది భవనాల్లో సముచితంగా క్రీడించారు. (22)
ద్రౌపదీ చ సుభద్రా చ వాసాంస్యాభరణాని చ ।
ప్రాయచ్ఛతాం మహారాజ తే తు తస్మిన్ మదోత్కటే ॥ 23
మహారాజా! ద్రౌపది, సుభద్రకూడ ఆ పరవశమైన వాతావరణంలో వస్త్రాలు, ఆభరణాలు, దాసీజనులకు సమర్పించారు. (23)
కాశ్చిత్ ప్రహృష్టా ననృతుః చక్రుశుశ్చ తథాపరాః ।
జహసుశ్చ పరా నార్యః జగుశ్చాన్యా వరస్త్రియః ॥ 24
కొంతమంది సంతోషంతో నృత్యం చేశారు. కొంతమంది కోలాహలం చేశారు. కొంతమంది స్త్రీలు విరగబడినవ్వారు. కొంతమంది ఆ విహారంలో గానం చేశారు. (24)
రురుధుశ్చాపరాస్తత్ర ప్రజఘ్నుశ్చ పరస్పరమ్ ।
మంత్రయామాసురన్యాశ్చ రహస్యాని పరస్పరమ్ ॥ 25
కొందరు మిగతాస్త్రీలను అడ్డగించారు. పరస్పరమ్ బాధించుకొన్నారు. కొందరు మంత్రాంగాలు చేశారు. రహస్యాల్ని ఒకరినొకరు చెప్పుకొన్నారు. (25)
వేణువీణామృదంగానాం మనోజ్ఞానాం చ సర్వశః ।
శబ్దేన పూర్వతే హర్మ్యం తద్ వనం సుమహర్ధిమత్ ॥ 26
ఆ భవనం, ఆ యమునా తీరవనం అందంగా మ్రోగే వేణు, వీణా, మృదంగవాద్యాల ధ్వనులతో అన్నివైపులా మారుమ్రోగాయి. (26)
తస్మింస్తదా వర్తమానే కురుదాశార్హనందనౌ ।
సమీపం జగ్మతుః కంచిదుద్దేశం సుమనోహరమ్ ॥ 27
ఈ విధంగా యమునాతీరంలో క్రీడావనవిహారం జరుగుతూ ఉంటే శ్రీకృష్ణార్జునులు ఇరువురూ సమీపాన ఉన్న ఒక అందమైన ప్రదేశానికి చేరారు. (27)
తత్ర గత్వా మహాత్మానౌ కృష్ణౌ పరపురంజయౌ ।
మహార్హాసనయో రాజన్ తతస్తౌ సంనిషీదతుః ॥ 28
తత్ర పూర్వవ్యతీతాని విక్రాంతానీతరాణి చ ।
బహూని కథయిత్వా తౌ రేమాతే పార్థమాధవౌ ॥ 29
రాజా! అక్కడకు చేరిన శత్రుపురనాశకులు, మహాత్ములైన శ్రీకృష్ణార్జునులు విలువైన సింహాసనాలపై అసీనులు అయ్యారు. పూర్వం ఆచరించిన వీరవిహారాలనూ, పరిహాసప్రసంగాలనూ చాలా చెప్పుకొంటూ ఆ ప్రదేశంలో ఆనందించారు. (28,29)
తత్రోపవిష్టౌ ముదితౌ నాకపృషేఽశ్వినావివ ।
అభ్యాగచ్ఛద్ తదా విప్రః వాసుదేవధనంజయౌ ॥ 30
స్వర్గలోకంలో అశ్వినీదేవతల వలె ఉండి ఆసీనులై సంతోషిస్తున్న కృష్ణార్జునుల సమీపానికి బ్రాహ్మణుడొకడు వచ్చాడు. (30)
బృహచ్ఛాలప్రతీకాశః ప్రతప్తకనకప్రభః ।
హరిపింగోజ్జ్వలశ్మశ్రుః ప్రమాణాయామతః సమః ॥ 31
ఆ బ్రాహ్మణుడు పెద్దమద్దిచెట్టు వలె పొడుగుగా ఉన్నాడు. మెరిసే బంగారు రంగులో వెలిగిపోతున్నాడు. నీలం, ఎరుపురంగులతో అతని అవయవాలు మెరుస్తున్నాయి. ఔన్నత్యానికి తగిన బలం కలిగి ఉన్నాడు. (31)
తరుణాదిత్యసంకాశః చీరవాసా జటాధరః ।
పద్మపత్రాననః పింగః తేజసా ప్రజ్వలన్నివ ॥ 32
ప్రాతఃకాలసూర్యకాంతితో సమాన తేజస్సు కలిగి ఉన్నాడు. జటాధారియై పట్టుబట్టలు ధరించాడు. పద్మపత్రకాంతితో ముఖం ఉంది. పింగళవర్ణ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. (32)
ఉపసృష్టం తు తం కృష్ణః భ్రాజమానం ద్విజోత్తమమ్ ।
అర్జునో వాసుదేవశ్చ తూర్ణముత్పత్య తస్థతుః ॥ 33
ఆ తేజస్వి ద్విజశ్రేష్ఠుడు సమీపానికి రాగానే కృష్ణార్జునులు ఆసనాల నుంచి లేచి నిలబడి స్వాగతం పలికారు. (33)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఖాండవపర్వణి బ్రాహ్మణరూప్యనలాగమనే ఏకవింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః ॥ 221 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఖాండవదాహపర్వమను
ఉపపర్వమున బ్రాహ్మణరూపి అనలాగమము అను రెండువందల ఇరువది ఒకటవ అధ్యాయము. (221)