222. రెండువందల ఇరువది రెండవ అధ్యాయము

అగ్ని ఖాండవవనము దహించుట, శ్వేతకి కథ.

వైశంపాయన ఉవాచ
సోఽబ్రవీదర్జునం చైవ వాసుదేవం చ సాత్వతమ్ ।
లోకప్రవీరౌ తిష్ఠంతౌ ఖాండవస్య సమీపతః ॥ 1
వైశంపాయనుడు అన్నాడు. రాజా! ఆ విప్రుడు ఖాండవవనసమీపంలో ఉన్న లోకైకవీరులైన కృష్ణార్జునులతో ఇలా అన్నాడు. (1)
బ్రాహ్మణో బహుభోక్తాస్మి భుంజేఽపరిమితం సదా ।
భిక్షే వార్ష్ణేయపార్థౌ వామ్ ఏకాం తృప్తిం ప్రయచ్ఛతమ్ ॥ 2
నేను ఎక్కువగా భుజింపశక్తి గల బ్రాహ్మణుడను. ఎల్లప్పుడు అపరిమితంగా భోజనం చేస్తాను. వీరులైన శ్రీకృష్ణార్జునులారా! నేను మిమ్ములను నాకు తృప్తి కలిగేటట్లు భిక్షను ఇమ్మని యాచిస్తున్నాను. (2)
ఏవముక్తౌ తమబ్రూతాం తతస్తౌ కృష్ణపాండవౌ ।
కేనాన్నేన భవాంస్తృప్యేత్ తస్యాన్నస్య యతావహే ॥ 3
అపుడు కృష్ణార్జునులు అతనితో పలికారు. బ్రాహ్మణుడా! నీకు ఏ అన్నంతో తృప్తి కలుగుతుందో చెప్పు. దాన్ని సంపాదించటానికి ప్రయత్నిస్తాం. (3)
ఏవముక్తః స భగవాన్ అబ్రవీత్ తావుభౌ తతః ।
భాషమాణౌ తదా వీరౌ కిమన్నం క్రియతామితి ॥ 4
వారిరువురు వీరులు అలా అడిగితే ఆ బ్రాహ్మణ దేవత శ్రీకృష్ణార్జునులకు ఇలా బదులు చెప్పాడు. (4)
బ్రాహ్మణ ఉవాచ
నాహ మన్నం బుభుక్షే వై పావకం మాం నిబోధతమ్ ।
యదన్నమనురూపం మే తద్ యువాం సంప్రయచ్ఛతమ్ ॥ 5
బ్రాహ్మణుడు అన్నాడు - వీరులారా! నాకు అన్నం మీద ఆకలి లేదు. ముందు మీరు నన్ను అగ్నిదేవునిగా తెలుసుకోండి. మీరిరువురు నాకు తగిన దానినే సమర్పించండి. (5)
ఇదమింద్రః సదా దావం ఖాండవం పరిరక్షతి ।
న చ శక్నోమ్యహం దగ్ధుం రక్ష్యమాణం మహాత్మనా ॥ 6
ఇంద్రుడు ఎల్లప్పుడు ఈ ఖాండవవనాన్ని పరిరక్షిస్తున్నాడు. నేను ఆ మహాత్ముని రక్షణలోని ఈ వనాన్ని దహింపలేకున్నాను. (6)
వసత్యత్ర సఖా తస్య తక్షకః పన్నగః సదా ।
సగనస్తత్కృతే దావం పరిరక్షతి వజ్రభృత్ ॥ 7
ఈ ఖాండవవనంలో ఇంద్రుని మిత్రుడు తక్షకుడు తన పరివారంతో నివసిస్తున్నాడు. ఆ తక్షకగణంకోసం ఇంద్రుడు ఈ వనాన్ని కాపాడుతున్నాడు. (7)
తత్ర భూతాన్యనేకాని రక్షతేఽస్య ప్రసంగతః ।
తం దిధక్షుర్న శక్నోమి దగ్ధుం శక్రస్య తేజసా ॥ 8
తక్షకుని కారణంగా ఇక్కడ ఇంకా అనేకప్రాణులను కాపాడుతున్నాడు. ఇంద్రుని ప్రభావంతో ఈ వనాన్ని దహించాలనే తలంపు ఉన్నా దహింపలేకపోతున్నాను. (8)
స మాం ప్రజ్వలితం దృష్ట్వా మేఘాంభోభిః ప్రవర్షతి ।
తతో దగ్ధుం న శక్నోమి దిధక్షుర్దావమీప్సితమ్ ॥ 9
మండిపోయే ఈ వనాన్ని ఇంద్రుడు జలధారతో ఆర్పివేస్తున్నాడు. ఈ వనాన్ని దహించాలనే నాకోరిక. కాని ఇంద్రుని ప్రభావంచే దహించలేకపోయాను. (9)
స యువాభ్యాం సహాయాభ్యామ్ అస్త్రవిద్ భ్యామ్ సమాగతః ।
దహేయం ఖాండవం దావమ్ ఏతదన్నం వృతం మయా ॥ 10
అస్త్రవేత్తలు మీరు సహాయంగా వస్తే ఖాండవవనాన్ని దహిస్తాను. ఈ అభిప్రాయంతో మీ దగ్గరకు వచ్చాను. ఇదే నాకు కావలసిన అన్నం. (10)
యువామ్ హ్యుదకధారాస్తా భూతాని చ సమంతతః ।
ఉత్తమాస్త్రవిదౌ సమ్యక్ సర్వతో వారయిష్యథః ॥ 11
అస్త్రవిద్యావిశారదులు మీరువురూ నేను ఈ వనాన్ని దహిస్తున్నపుడు కురిసే వర్షధారలనూ ఈ వనం నుంచి నలుదిక్కులకు పోయే ప్రాణులను నివారించగలరు. (11)
జనమేజయ ఉవాచ
కిమర్థం భగవానగ్నిః ఖాండవం దగ్ధుమిచ్ఛతి ।
రక్ష్యమాణమ్ మహేంద్రేణ నానాసత్త్వసమాయుతమ్ ॥ 12
జనమేజయుడు అడిగాడు - ఇంద్రుడు రక్షించే నానాప్రాణులను, ఖాండవవనాన్ని అగ్ని ఎందుకు దహించాలని భావించాడు? ఇది నానా ప్రాణులకు ఆశ్రయమిస్తోంది గదా! (12)
న హ్యేతత్ కారణం బ్రహ్మన్ అల్పం సంప్రతిభాతి మే ।
యద్ దదాహ సుసంక్రుద్ధః ఖాండవం హవ్యవాహనః ॥ 13
ద్విజోత్తమా! కోపించిన అగ్నిదేవుడు ఈ ఖాండవాన్ని దహిస్తాను అనటం వలన ఇందులకు బలమైన కారణమే ఏదో ఉండాలి. (13)
ఏతద్ విస్తరశో బ్రహ్మన్ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ।
ఖాండవస్య పురా దాహః యథా సమభవన్మునే ॥ 14
విప్రోత్తమా! పూర్వకాలంలో జరిగిన ఖాండవవనదాహాన్ని గురించి నేను పూర్తిగా వినగోరుతున్నాను. (14)
వైశంపాయన ఉవాచ
శృణు మే బ్రువతో రాజన్ సర్వమేతద్ యథాతథమ్ ।
యన్నిమిత్తం దదాహాగ్నిః ఖాండవం పృథివీపతే ॥ 15
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! పూర్తివృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తాను. ఏ కారణంగా అగ్ని ఖాండవదహనం కోరినాడో విను. (15)
హంత తే కథయిష్యామి పౌరాణీమృషిసంస్తుతామ్ ।
కథామిమాం నరశ్రేష్ఠ ఖాండవస్య వినాశినీమ్ ॥ 16
ఖాండవవన వినాశరూపమైన గాథ పూర్వం ఋషులచే చెప్పబడింది. దాన్ని నేను నీకు వివరంగా చెబుతాను. (16)
పౌరాణః శ్రూయతే రాజన్ రాజా హరిహయోపమః ।
శ్వేతకిర్నామ విఖ్యాతః బలవిక్రమసంయుతః ॥ 17
ఇంద్రసమప్రభావమూ, బల, పౌరుషాలూ గల శ్వేతకి అనేరాజు పూర్వకాలంలో ప్రసిద్ధి పొంది ఉన్నాడు. (17)
యజ్వా దానపతిర్ధీమాన్ యథా నాన్యోఽస్తి కశ్చన ।
ఈజే చ స మహాయజ్ఞైః క్రతుభిశ్చాప్తదక్షిణైః ॥ 18
అతనితో సమానమైన దానశీలి, బుద్ధిమంతుడు, యజ్ఞకర్త మరొకడు లేడు. సమగ్ర దక్షిణలు ఇచ్చి గొప్పగొప్ప యజ్ఞాలు ఎన్నింటినో చేశాడు. (18)
తస్య నాన్యాభవద్ బుద్ధిః దివసే దివసే నృప ।
సత్రే క్రియాసమారంభే దానేషు వివిధేషు చ ॥ 19
ప్రతిదినమ్ అతని ఆలోచనలో యజ్ఞాలు, వాటికి తగిన దానాలు మాత్రమే ఉంటాయి. యజ్ఞకర్మల నారంభించటమ్, వాటికి కావలసిన దక్షిణలు సమకూర్చటమే అతనికి ఇష్టం. (19)
ఋత్విగ్భిః సహితో ధీమాన్ ఏవమీజే స భూమిపః ।
తతస్తు ఋత్విజశ్చాస్య ధూమవ్యాకులలోచనాః ॥ 20
ఈ విధంగా ఋత్విజులతో కలిసి బుద్ధిమంతుడు శ్వేతకి యజ్ఞాలలో నిరంతరం దీక్షితుడై ఉన్నాడు. అతని యజ్ఞాలలో ఋత్విక్కులందరి కళ్ళు పొగచే ఆవరింపబడి కనపడకుండా పోతున్నాయి. (20)
కాలేన మహతా ఖిన్నాః తత్యజుస్తే నరాధిపమ్ ।
తతః ప్రచోదయామాస ఋత్విజస్తాన్ మహీపతిః ॥ 21
చక్షుర్వికలతామ్ ప్రాప్తా న ప్రపేదుశ్చ తే క్రతుమ్ ।
తతస్తేషామనుమతే తద్ విప్రైస్తు నరాధిపః ॥ 22
పత్రం సమాపయామాస ఋత్విగ్భిరపరైః సహ ।
దీర్ఘకాలం ఆహుతిప్రదానంచే అందరు ఖిన్నులై రాజును విడచిపెట్టాడు. అప్పుడు రాజు మరల వారిని యజ్ఞాల కోసం ప్రేరేపించాడు. నేత్రాల చూపుకోల్పోయి వారు యజ్ఞాలకు రాలేదు. రాజు వారి అనుమతి గైకొని ఇతరులతో క్రతువుల్ని పూర్తిచేశాడు. (21,22 1/2)
తస్యైవం వర్తమానస్య కదాచిత్ కాలపర్యయే ॥ 23
సత్రమాహర్తుకామస్య సంవత్సరశతం కిల ।
ఋత్విజో నాభ్యపద్యంత సమాహర్తుం మహాత్మనః ॥ 24
ఈ విధంగా యజ్ఞపరాయణుడైన రాజు ఒక సంకల్పం చేసి వంద సంవత్సరాలు సత్రయాగం చేయ నిశ్చయించాడు. కాని ఆ మహాత్ముని యజ్ఞాన్ని సమాప్తి చేయగల ఋత్విజులు దొరకలేదు. (23,24)
స చ రాజాకరోద్ యత్నం మహాంతం ససుహృజ్జనః ।
ప్రణిపాతేన సాంత్వేన దానేన చ మహాయశాః ॥ 25
ఋత్విజోఽనునయామాస భూయో భూయస్త్వతంద్రితః ।
తే చాస్య తమభిప్రాయం న చక్రురమితౌజసః ॥ 26
మహాయశస్వి శ్వేతకి అతని స్నేహితులతో కలిసి ఈ యజ్ఞం కోసం గొప్ప ప్రయత్నం చేశాడు. ఋత్విక్కుల పాదాలపై పడి, సాంత్వవచనాలతో, దానంతో అలసత్వం విడిచి వారిని యజ్ఞం చేయడం కోసం ప్రార్థించాడు. వారు అతని మనోరథాన్ని సఫలం చేయలేదు. (25,26)
స చాశ్రమస్థాన్ రాజర్షిః తానువాచ రుషాన్వితః ।
యద్యహమ్ పతితో విప్రాః శుశ్రూషాయాం న చ స్థితః ॥ 27
అశు త్యాజ్యోఽస్మి యుష్మాభిః బ్రాహ్మణైశ్చ జుగుప్సితః ।
తన్నార్హథ క్రతిశ్రద్ధాం వ్యాఘాతయితుమద్య తామ్ ॥ 28
అప్పుడు రాజర్షి శ్వేతకి కోపించి ఆశ్రమంలోని మహర్షులతో అన్నాడు. బ్రాహ్మణులారా! నేను పతితుడనై మీ శుశ్రూష చేయలేనివాడనైనచో మీకు నిందితుడనై విడువతగినవాడను అయ్యాను. నా ఈ క్రతుశద్ధ విషయంలో మిమ్ములను బాధించటం నాకు ఇష్టం లేదు. (27,28)
అస్థానే వా పరిత్యాగం కర్తుం మే ద్విజసత్తమాః ।
ప్రపన్న ఏవ వో విప్రాః ప్రసాదం కర్తుమర్హథ ॥ 29
అపరాధం చేయకుండానే మీరు నన్ను విడచిపోవటం యుక్తం కాదు. నేను మీ శరణు కోరాను. మీరు దయతో నాపై ప్రసన్నులు కండి. (29)
సాంత్వదానాదిభిర్వాక్యైః తత్త్వతః కార్యవత్తయా ।
ప్రసాదయిత్వా వక్ష్యామి యన్నః కార్యం ద్విజోత్తమాః ॥ 30
ద్విజోత్తములారా! నేను కార్యార్థినై సాంత్వవచనాలతో, దానాలతో మిమ్ములను బ్రతిమాలుకొంటున్నాను. మీసేవతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయ సంకల్పించాను. (30)
అథవాహమ్ పరిత్యక్తః భవిద్భిర్ద్వేషకారణాత్ ।
ఋత్విజోఽన్యాన్ గమిష్యామి యాజనార్థం ద్విజోత్తమాః ॥ 31
మీరు ద్వేషభావంతో నన్ను పరిత్యజించాలని అనుకొంటే నేను యజ్ఞం చేయించటానికి ఇతరఋత్విక్కులను వేడుకొంటాను. (31)
ఏతావదుక్త్వా వచనమ్ విరరామ స పార్థివః ।
యదా న శేకూ రాజానం యాజనార్థం పరంతప ॥ 32
తతస్తే యాజకాః క్రుద్ధాః తమూచుర్నృపసత్తమమ్ ।
తవ కర్మాణ్యజస్రం వై వర్తంతే పార్థివోత్తమ ॥ 33
అని పలికి శ్వేతకి ఊరుకున్నాడు. యజ్ఞం చేయించే సామర్థ్యం లేని ఆ ఋత్విక్కులు కోపించి రాజుతో ఇలా అన్నారు. రాజా! నీ యజ్ఞకర్మలు ఎల్లప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. (32,33)
తతో వయం పరిశ్రాంతాః సతతం కర్మవాహినః ।
శ్రమాదస్మాత్ పరిశ్రాంతాన్ స త్వం నస్త్యక్తుమర్హసి ॥ 34
బుద్ధిమోహం సమాస్థాయ త్వరాసంభావితోఽనఘ ।
గచ్చ రుద్రసకాశం త్వం స హి త్వామ్ యాజయిష్యతి ॥ 35
నిత్యం కర్మలలో లగ్నమయి మేము పూర్తిగా అలసి పోయాం. అలసిన మమ్ములను నీవు విడవటం యుక్తమైంది కాదు. ఈ దశలో బుద్ధి మందగించి నీవు తొందరపడితే శివుని దగ్గరకు పోయి యాజకత్వం ఆచరింపమని ప్రార్థించు. (34,35)
సాధిక్షేపం వచః శ్రుత్వా సంక్రుద్ధః శ్వేతకిర్నృపః ।
కైలాసం పర్వతం గత్వా తప ఉగ్రం సమాస్థితః ॥ 36
బ్రాహ్మణుల నిందావాక్యాల్ని విని శ్వేతకి కోపించాడు. కైలాస పర్వతానికి పోయి గొప్ప తపస్సు చేశాడు. (36)
ఆరాధయన్ మహాదేవం నియతః సంశ్రితవ్రతః ।
ఉపవాసపరో రాజన్ దీర్ఘకాలమతిష్ఠత ॥ 37
కఠినంగా నియమాల్ని పాటిస్తూ, జితేంద్రియుడై, ఉపవాసంతో శివుని ఆరాదిస్తూ చాలాకాలం తపస్సు చేశాడు. (37)
కదాచిద్ ద్వాదశే కాలే కదాచిదపి షోడశే ।
ఆహారమకరోద్ రాజా మూలాని చ ఫలాని చ ॥ 38
పన్నెండవ రోజున ఒక్కొక్కసారి, పదహారవరోజున ఒక్కొక్కసారి ఆ రాజు కందమూలఫలాలను భుజించేవాడు. (38)
ఊర్ధ్వబాహుస్త్వనిమిషః తిష్ఠన్ స్థాణురివాచలః ।
షణ్మాసానభవద్ రాజా శ్వేతకిః సుసమాహితః ॥ 39
అతడు రెమ్డుచేతులు పైకెత్తి, కనురెప్ప, పాటులేక, కొయ్యవలె కదలిక, ఏకాగ్రచిత్తంతో ఆరునెలలు ఉన్నాడు. (39)
తం తథా నృపశార్దూలం తప్యమానం మహత్ తపః ।
శంకరః పర్మప్రీత్యా దర్శయామాస భారత ॥ 40
గొప్ప తపస్సు చేస్తు నియమపాలనాతత్పరుడైన ఆరాజు పట్ల ప్రసన్నుడై శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. (40)
ఉవాచ చైనం భగవాన్ స్నిగ్ధగంభీరయా గిరా ।
ప్రీతోఽస్మి నరశార్దూల తపసా తే పరంతప ॥ 41
వాత్సల్యం ప్రదర్శిస్తూ గంభీరమైన కంఠస్వరంతో శివుడు రాజును ఉద్దేశించి అన్నాడు. "రాజశ్రేష్ఠుడా! నీ తపస్సుకు మిక్కిలి సంతసించాను. (41)
వరం వృణీష్వ భద్రం తే యం త్వమిచ్ఛసి పార్థివ ।
ఏతచ్ఛ్రుత్వా తు వచనం రుద్రస్యామితతేజసః ॥ 42
ప్రణిపత్య మహాత్మానం రాజర్షిః ప్రత్యభాషత ।
నీకు శుభం జరుగుతుంది. నీకు ఏ వరం కావాలో అది కోరుకో'. అమిత తేజస్వి అయిన శంకరుని ఆ మాటలు విని, పరమాత్మ అయిన శివునికి నమస్కరించి శ్వేతకి ఇలా చెప్పాడు. (42 1/2)
యది మే భగవాన్ ప్రీతః సర్వలోకనమస్కృతః ॥ 43
స్వయం మాం దేవదేవేశ యాజయస్వ సురేశ్వర ।
ఏతచ్ఛ్రుత్వా తు వచనం రాజ్ఞా తేన ప్రభాషితమ్ ॥ 44
ఉవాచ భగవాన్ ప్రీతః స్మితపూర్వమిదం వచః ।
దేవదేవేశ! సర్వలోకాలకు వంద్యులైన మీరు నాపట్ల ప్రసన్నులైతే స్వయంగా మీరు నాచే యజ్ఞాలు చేయించండి. రాజవచనాలు విని శివుడు ప్రసన్నుడై చిరునవ్వుతో ఇట్లు పలికాడు. (43, 44 1/2)
నాస్మాకమేష విషయః వర్తతే యాజనం ప్రతి ॥ 45
త్వయా చ సుమహత్ తప్తం తపో రాజన్ వరార్థినా ।
యాజయిష్యామి రాజంస్త్వాం సమయేన పరంతప ॥ 46
రాజా! యజ్ఞం చేయించటం నా కర్తవ్యం కాదు. కాని ఈ వరం కోసం నీవు గొప్ప తపస్సు చేశావు. ఒక నియమంపై నీకు నేను యాజకత్వాన్ని ఆచరిస్తాను. (45,46)
రుద్ర ఉవాచ
సమా ద్వాదశ రాజేంద్ర బ్రహ్మచారీ సమాహితః ।
సతతం త్వాజ్యధారాభిః యది తర్పయసేఽనలమ్ ॥ 47
కామం ప్రార్థయసే యం త్వం మత్తః ప్రాప్స్యసి తం నృప ।
రుద్రుడు పలికాడు - రాజశ్రేష్ఠుడా! ఏకాగ్రచిత్తంతో బ్రహ్మచారివై పండ్రెండు సంవత్సరాలు ఎడతెగని ఆజ్యధారలతో అగ్నిని తృప్తిపరిస్తే నీ కోరికను నేను తీర్చగలను. (47 1/2)
ఏవముక్తశ్చ రుద్రేన శ్వేతకిర్మనుజాధిపః ॥ 48
తథా చకార తత్ సర్వం యథోక్తం శూలపాణినా ।
పూర్ణే తు ద్వాదశే వర్షే పునరాయాన్మహేశ్వరః ॥ 49
ఇలా రుద్రుడు చెపితే మనుజాధిపుడైన శ్వేతకి శూలపాణి చెప్పినట్లు చేశాడు. పండ్రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాక శంకరుడు తిరిగి వచ్చాడు. (48,49)
దృష్ట్వైవ చ స రాజానం శంకరో లోకభావనః ।
ఉవాచ పర్మప్రీతః శ్వేతకిమ్ నృపసత్తమమ్ ॥ 50
లోకాలను సృజించగల శంకరుడు మిక్కిలి ప్రీతితో ప్రత్యక్షమై శ్వేతకిని చూస్తూనే ఇలా అన్నాడు. (50)
తోషితోఽహం నృపశ్రేష్ఠ త్వయేహాద్యేన కర్మణా ।
యాజనం బ్రాహ్మణానాం తు విధిదృష్టం పరంతప ॥ 51
రాజా! నీవు వేదోక్తమైన కర్మచే నన్ను సంతృప్తిపరచావు. శత్రుతాపనుడా! శాస్త్రవిధిగా యజ్ఞాలను చేయించే అధికారం బ్రాహ్మణులకే ఉంది. (51)
అతోఽహం త్వాం స్వయం నాద్య యాజయామి పరంతప ।
మమాంశస్తు క్షితితలే మహాభాగో ద్విజోత్తమః ॥ 52
కావున నేను నీకు యజ్ఞాన్ని చేయింపలేను. భూమిపై నా అంశతో అవతరిమ్చిన ఒక ద్విజశ్రేష్ఠుడు ఉన్నాడు. (52)
దుర్వాసా ఇతి విఖ్యాతః స హి త్వాం యాజయిష్యతి ।
మన్నియోగాన్మహాతేజాః సంభారాః సంభ్రియంతు తే ॥ 53
ఆయన నామధేయం దుర్వాసుడు. అతడే నిచే యజ్ఞాలను నా ఆజ్ఞానుసారం చేయిస్తాడు. నీవు సామగ్రిని సిద్ధమ్ చేసుకో. (53)
ఏతచ్ఛ్రుత్వా తు వచనమ్ రుద్రేణ సముదాహృతమ్ ।
స్వపురం పునరాగమ్య సంభారాన్ పునరార్జయత్ ॥ 54
రుద్రుడు చెప్పిన మాటలు విని శ్వేతకి సంతోషంతో తన నగరానికి తిరిగి వచ్చి యజ్ఞసామగ్రినంతా సిద్ధం చేశాడు. (54)
తతః సంభృతసంభారః భూయో రుద్రముపాగమత్ ।
సంభృతా మమ సంభారాః సర్వోపకరణాని చ ॥ 55
త్వత్రసాదాన్మహాదేవ శ్వో మే దీక్షా భవేదితి ।
ఏతచ్ఛ్రుత్వా తు వచనం తస్య రాజ్ఞో మహాత్మనః ॥ 56
దుర్వాసనం సమాహూయ రుద్రో వచనమబ్రవీత్ ।
ఏష రాజా మహాభాగః శ్వేతకిర్ద్విజసత్తమ ॥ 57
ఏవం యాజయ విప్రేంద్ర మన్నియోగేన భూమిపమ్ ।
బాఢమిత్యేవ వచనం రుద్రం త్వృషిరువాచ హ ॥ 58
రాజు శ్వేతకి యజ్ఞసామగ్రిని సిద్ధం చేసికొని రుద్రుని వద్దకు పోయి సామగ్రి, సాధనాలు సిద్ధం అయినాయని, నీ అనుగ్రహంతో రేపే దీక్షితుడను అగుదును అని విన్నవించాడు. ఆ రాజవచనాలు విని రుద్రుడు దుర్వాసుని పిలిపించి అతనితో ఇలా అన్నాడు. "ఈ రాజు దోషరహితుడు, నామధేయం శ్వేతకి, నా ఆజ్ఞానుసారం ద్విజోత్తమా! ఇతనిచే యజ్ఞాలు చేయించు.' అది విని దుర్వాసుడు దుర్వాసుడు 'చాలా బాగున్నది, అట్లే' అని అంగీకరించాడు. (55-58)
తత్రః సత్రం సమభవత్ తస్య రాజ్ఞో మహాత్మనః ।
యథావిధి యథాకాలమ్ యథోక్తం బహుదక్షిణమ్ ॥ 59
యథాకాలంగా విధిపూర్వకంగా యజ్ఞం ప్రారంభం అయింది. శాస్త్రానుసారం కార్యక్రమమ్ పూర్తి అయింది. దక్షిణలు బాగుగా ఇవ్వబడ్డాయి. (59)
తస్మిన్ పరిసమాప్తే తు రాజ్ఞః సత్రే మహాత్మనః ।
దుర్వాససాభ్యనుజ్ఞాతాః విప్రతస్థుః స్మ యాజకాః ॥ 60
యే తత్ర దీక్షితాః సర్వే సదస్యాశ్చ మహౌజసః ।
సోఽపి రాజన్ మహాభాగః స్వపురం ప్రావిశత్ తదా ॥ 61
పూజ్యమానో మహాభాగైః బ్రాహ్మణైర్వేదపారగైః ।
వందిభిః స్తూయమానశ్చ నాగరైశ్చాభినందితః ॥ 62
శ్వేతకి చేసిన యజ్ఞం పూర్తి అయింది. మహాతేజస్వులు ఋత్విజులందరు దుర్వాసుని అనుమతి పొంది వారివారి నివాసాలకు బయలుదేరి వెళ్ళారు. అదృష్టవంతుడు శ్వేతకి వెదపారగులైన బ్రాహ్మణోత్తముల పూజలందుకొంటూ వందిమాగధుల స్తోత్రాలు వింటూ, పౌరుల అభినందనలతో నగరంలో ప్రవేశించాడు. (60-62)
ఏవం వృత్తః స రాజర్షిః శ్వేతకిర్నృపసత్తమః ।
కాలేన మహాతా చాపి యయౌ స్వర్గమభిష్టుతః ॥ 63
ఋత్విగ్భిః సహితః సర్వైః సదస్యైశ్చ సమన్వితః ।
తస్య సత్రే పపౌ వహ్నిః హవిర్ద్వాదశవత్సరాన్ ॥ 64
ఆ రాజశ్రేష్ఠుడు, రాజర్షి శ్వేతకి చాలాకాలం పరిపాలన చేసి సదస్యులతో, ఋత్విజులతో కూడి స్వర్గానికి చేరాడు. అసత్రయాగంలో అగ్ని పండ్రెండు సంవత్సరాలు నిరంతరమ్ హవిస్సును త్రాగాడు. (63,64)
సతతం చాబ్యధారాభిః ఐకాత్మ్యే తత్ర కర్మణి ।
హవిషా చ తతో వహ్నిః పరాం తృప్తిమగచ్ఛత ॥ 65
అద్వితీయమైన ఆయజ్ఞంలో ఎల్లప్పుడు నేతిధారలను ఆస్వాదించటంతో అగ్నికి చాలా తృప్తి కలిగింది. (65)
న చైచ్ఛత్ పునరాదాతుం హవిరన్యస్య కస్యచిత్ ।
పాండువర్ణో వివర్ణశ్చ న యథావత్ ప్రకాశతే ॥ 66
తరువాత యజ్ఞకర్తలిచ్చే హవిస్సును గ్రహిమ్చే శక్తి నశించింది. అగ్నిరంగు తెల్లబడి పూర్వవర్ణాన్ని కోల్పోయాడు. (66)
తతో భగవతో వహ్నేః వికారః సమజాయత ।
తేజసా విప్రహీణశ్చ గ్లానిశ్చైవం సమావిశత్ ॥ 67
అప్పుడు అగ్నిలో పూర్తిగా మార్పు వచ్చింది. తేజస్సు తగ్గింది. మానసిక శ్రమ అతనిని క్రుంగదీసింది. (67)
స లక్షయిత్వా చాత్మానం తేజోహీనం హుతాశనః ।
జగామ సదనం పుణ్యం బ్రహ్మణో లొకపూజితమ్ ॥ 68
ఆ అగ్ని తనను తేజోహీనునిగా తెలిసికొని లోకపూజ్యుడైన బ్రహ్మయొక్క నివాసానికి వెళ్ళాడు. (68)
తత్ర బ్రహ్మాణమాసీనమ్ ఇదం వచనమబ్రవీత్ ।
భగవన్ పరమా ప్రీతిః కృతా మే శ్వేతకేతునా ॥ 69
అక్కడ ఆసీనుడైన బ్రహ్మను చూచి ఇలా పలికాడు - భగవంతుడా! శ్వేతకి మహారాజు తన యజ్ఞంతో నన్ను ఎక్కువగా తృప్తిపరచాడు. (69)
అరుచిశ్చాభవత్ తీవ్రా తాం న శక్నోమ్యపోహితుమ్ ।
తేజసా విప్రహీణోఽస్మి బలేన చ జగత్పతే ॥ 70
ఇచ్ఛేయం త్వత్ప్రసాదేన స్వాత్మనః ప్రకృతిం స్థిరామ్ ।
నాకు హవిస్సులను గ్రహించటంలో అరుచి కలిగింది. దానిని తొలగించుకొనే శక్తిలేదు. తేజస్సు కోల్పోయాను. బలహీనుడనయ్యాను. నీ అనుగ్రహంతో పూర్వపు శక్తిని స్థిరంగా పొందాలని భావిస్తున్నాను. (70 1/2)
ఏతచ్ఛ్రుత్వా హుతవహాద్ భగవాన్ సర్వలోకకృత్ ॥ 71
హవ్యవాహమిదం వాక్యమ్ ఉవాచ ప్రహసన్నివ ।
త్వయా ద్వాదశ వర్షాణి వసోర్ధారాహుతం హవిః ॥ 72
ఉపయుక్తం మహాభాగ తేన త్వాం గ్లానిరావిశత్ ।
తేజసా విప్రహీణత్వాత్ సహసా హవ్యవాహన ॥ 73
మా గమస్త్వం యథా వహ్నే ప్రకృతిస్థో భవిష్యసి ।
అరుచిం నాశయిష్యే-హం సమయం ప్రతిపద్యతే ॥ 74
అగ్నిదేవుని మాటలు విని బ్రహ్మ చిరునవ్వుతో ఇలా అన్నాడు. 'హవ్యవాహనా! నీచే పండ్రెండు సంవత్సరాలు పూర్తిగా వసుధారరూపంలో నేతి ధారలు గ్రోలబడ్డాయి. కావున నీకు వైవర్ణ్యం, మానసిక శ్రమ, అశక్తత ఏర్పడ్డాయి. నీవు తేజస్సును కోల్పోయావని విచారింపకు. నీవు తిరిగి పూర్వపుస్థైర్యాన్ని పొందుతావు. నేను సమయం వచ్చినపుడు నీ అరుచిని పోగొడతాను. (71-74)
పురా దేవనియోగేన యత్ త్వయా భస్మసాత్ కృతమ్ ।
ఆలయం దేవశత్రుణాం సుఘోరం ఖాండవం వనమ్ ॥ 75
తత్ర సర్వాణి సత్త్వాని నివసంతి విభావసో ।
తేషాం త్వం మేదసా తృప్తః ప్రకృతిస్థో భవిష్యసి ॥ 76
పూర్వం దేవతల అజ్ఞానుసారం నీచే రాక్షసనివాసమైన ఖాండవవనం దహింపబడింది. ఇప్పుడు అక్కడ అన్నిరకాల జీవజంతువులు నివసించసాగాయి. వాటిని దహించడం ద్వారా వారి క్రొవ్వుచే నీవు స్వస్థుడవు కాగలవు. (75,76)
గచ్ఛ శీఘ్రం ప్రదగ్ధుం త్వం తతో మోక్ష్యసి కిల్బిషాత్ ।
ఏతచ్ఛ్రుత్వా తు వచనం పరమేష్ఠిముఖాచ్చ్యుతమ్ ॥ 77
ఉత్తమం జవమాస్థాయ ప్రదుద్రావ హుతాశనః ।
ఆగమ్య ఖాండవం దావమ్ ఉత్తమం వీర్యమాస్థితః ।
సహసా ప్రాజ్వలచ్చాగ్నిః క్రుద్ధో వాయుసమీరితః ॥ 78
ఆ ఖాండవవనాన్ని దహించడానికి శీఘ్రంగా పో. నీ వీ అరుచి నుండి బయటపడతావు. పరమేష్ఠిముఖమ్ నుండి వెలువడ్డ ఈ మాటలు విని అగ్ని వేగంతో ఆ ప్రదేశానికి చేరాడు. ఖాండవవనానికి చేరి తన బలమంతా కూడదీసుకుని, వాయు ప్రేరణచే కోపించి దహించే యత్నం చేశాడు. (78)
ప్రదీప్తం ఖాండవం దృష్ట్వా యే స్యుస్తత్ర నివాసినః ।
పరమం యత్నమాతిష్ఠన్ పావకస్య ప్రశాంతయే ॥ 79
భగభగమండుతున్న ఖాండవాన్ని చూచి అక్కడి ప్రాణులందరు అగ్నిని చల్లార్చటానికి తమతమ ప్రయత్నాలు చేశారు. (79)
కరైస్తు కరిణః శీఘ్రం జలమాదాయ సత్వరాః ।
సిషిచుః పావకం క్రుద్ధాః శతశోఽథ సహస్రశః ॥ 80
వందల, వేలకొద్దీ ఏనుగులు తమ తొండాలతో తొందరగా జలాన్ని నింపుకొని, కోపించి అగ్నిని ఆర్పివేశాయి. (80)
బహుశీర్షాస్తతో నాగాః శిరోభిర్జలసంతతిమ్ ।
ముముచుః పావకాభ్యాశే సత్వరాః క్రోధమూర్ఛితాః ॥ 81
ఎన్నో పడగలున్న సర్పాలన్నీ క్రోధంతో వడిగా తమశిరస్సులతో జలధారలను అగ్నిపై విడచాయి. (81)
తథైవాన్యాని సత్త్వాని నానాప్రహరోణోద్యమైః ।
విలయం పావకం శీఘ్రమ్ అనయన్ భరతర్షభ ॥ 82
ఈ విధంగా అక్కడి మిగిలిన ప్రాణులన్నీ తమ తమ శక్త్యనుసారం ధూళిని చిమ్మటం మొదలైన పనుల ద్వారా అగ్నిని ఆర్పివేశాయి. (82)
అనేన తు ప్రకారేణ భూయో భూయశ్చ ప్రజ్వలన్ ।
సప్తకృత్వః ప్రశమితః ఖాండవే హవ్యవాహనః ॥ 83
ఈ ప్రకారంగా మరల మరల ప్రజ్వలితుడై అగ్ని ఏడు పర్యాయాలు రజ్వలింపచేసినా ఖాండవాన్ని దహించలేకపోయాడు. (83)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఖాండవదాహపర్వణి అగ్నిపరాభవే ద్వావింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః ॥ 222 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఖాండవ దాహపర్వమను
ఉపపర్వమున అగ్నిపరాభవమను రెండువందల ఇరువది రెండవ అధ్యాయము. (222)