228. రెండువందల ఇరువది ఎనిమిదవ అధ్యాయము

మందపాలజరితల వృత్తాంతము, అగ్నిస్తుతి.

జనమేజయ్ ఉవాచ
కిమర్థమ్ శార్ ఙ్గకానగ్నిః న దదాహ తథాగతే ।
తస్మిన్ వనె దహ్యమానే బ్రహ్మన్నేతత్ ప్రచక్ష్వ మే ॥ 1
జనమేజయుడు అడిగాడు - వనాన్ని పూర్తిగా తగులబెట్టిన అగ్ని ఎందుకు ఈ నాలుగు శార్ ఙ్గకాలను దహించలేదో చెప్పండి. (1)
అదాహే హ్యశ్వసేనస్య దానవస్య మయస్య చ ।
కారణం కీర్తితమ్ బ్రహ్మన్ శార్ ఙ్గకాణాం న కీర్తితమ్ ॥ 2
విప్రవర్యా! అశ్వసేనునీ, రాక్షసుడైన మయునీ దహింపకపోవటానికి కారణాలు చెప్పారు. శార్ ఙ్గకాల్ని దహింపకపోవటానికి కారణం చెప్పలేదు. (2)
తదేతదద్భుతమ్ బ్రహ్మన్ శార్ ఙ్గకాణామనామయమ్ ।
కీర్తయస్వాగ్నిసమ్మర్దే కథం తే న వినాశితాః ॥ 3
అగ్నిదాహంలో ఈ పక్షిపిల్లలు నాలుగూ క్షేమంగా ఉండటం ఆశ్చర్యకరం. దయతో దానికి కారణం చెప్పండి. (3)
వైశంపాయన ఉవాచ
యదర్థం శార్ ఙ్గకానగ్నిః న దదాహ తథాగతే ।
తత్ తే సర్వం ప్రవక్ష్యామి యథాభూతమరిందమ ॥ 4
వైశంపాయనుడు అన్నాడు - ఆ భయంకరమైన అగ్ని దాహంలో పక్షులు దహనమ్ కాకపోవటానికి తగిన కారణం అంతటినీ వివరంగా చెపుతాను. విను. (4)
ధర్మజ్ఞానాం ముఖ్యతమః తపస్వీ సంశితవ్రతః ।
ఆసీన్మహర్షిః శ్రుతవాన్ మందపాల ఇతి శ్రుతః ॥ 5
ధర్మజ్ఞులలో ఉత్తముడు, తపస్వి, కఠోరనియమాలను పాలించే మందపాలుడనే మహర్షి ఒకడు ఉన్నాడు. (5)
స మార్గమాశ్రితో రాజన్ ఋషీణామూర్ధ్వరేతసామ్ ।
స్వాధ్యాయవాన్ ధర్మరతః తపస్వి విజితేంద్రియః ॥ 6
అతడు ఊర్ధ్వరేతస్కుల (బ్రహ్మచారుల) మార్గాన్ని ఆశ్రయించి, స్వాధ్యాయపరుడై, ధర్మమందు ఆసక్తితో, తాపసియై ఇంద్రియాలను జయించి జీవించాడు. (6)
స గత్వా తపసః పారం దేహముత్సృజ్య భారత ।
జగామ పితృలోకాయ న లేభే తత్ర తత్ఫలమ్ ॥ 7
అతడు తపస్సు పూర్తిచేసి దేహమ్ విడచి పితృలోకానికి వెళ్ళినా ఆ తపస్సుకు, సత్కర్మలకు తగిన ఫలాన్ని అక్కడ పొందలేకపోయాడు. (7)
స లోకానఫలాన్ దృష్ట్వా తపసా నిర్జితానపి ।
పప్రచ్ఛ ధర్మరాజస్య సమీపస్థాన్ దివౌకసః ॥ 8
మందపాల ఉవాచ
కిమర్థమావృతా లోకాః మమైతే తపసార్జితాః ।
కిమ్ మయా న కృతం తత్ర యస్యైతత్ కర్మణః ఫలమ్ ॥ 9
మందపాలుడు అన్నాడు - నేను తపస్సుచే సంపాదించిన ఆ లోకాలు ఏ కారణంచే మూసివేయబడ్డాయి. నేను సత్కర్మలను చేసినా తగిన ఫలితాన్ని ఇక్కడ ఎందుకు పొందలేదు? (9)
తత్రాహం తత్ కరిష్యామి యదర్థమిదమావృతమ్ ।
ఫలమేతస్య తపసః కథయధ్వం దివౌకసః ॥ 10
దేవతలారా! ఏలోపంచేత ఈ లోకం మూసివేయబడిందో ఆ కర్మను తిరిగి ఆచరిస్తాను. మీరా సత్కర్మను నాకు ఉపదేశించండి. (10)
దేవా ఊచుః
ఋణినో మానవా బ్రహ్మన్ జాయంతే యేన తచ్ఛృణు ।
క్రియాభిర్బ్రహ్మచర్యేణ ప్రజయా చ న సంశయః ॥ 11
తదపాక్రియతే సర్వం యజ్ఞేన తపసా శ్రుతైః ।
తపస్వీ యజ్ఞకృచ్చాసి న చ తే విద్యతే ప్రజా ॥ 12
దేవతలు పలికారు - బ్రాహ్మణుడా! మానవులు ఋణగ్రస్తులై భూలోకంలో పుడతారు. దానిని గూర్చి చెబుతాను. యజ్ఞకర్మలు, బ్రహ్మచర్యం, సంతానం వీటిచే ఆ మూడు ఋణాలూ తీరిపోతాయి. సంశయంలేదు, యజ్ఞం, తపస్సు, వేదాధ్యయనాలచే ఆ ఋణమంతా తీరుతుంది. నీవు తాపసివి, యజ్ఞకర్తవు అయ్యావు. సంతానం మాత్రం నీకు లేదు. (11,12)
త ఇమే ప్రసవస్యార్థే తవ లోకాః సమావృతాః ।
ప్రజాయస్వ తతో లోకానుపభోక్ష్యసి పుష్కలాన్ ॥ 13
నీకు సంతానం లేకపోవడం వల్ల కర్మలచే సాధింపబడిన ఈ లోకాలు మూసివేయబడ్డాయి. ముందు సంతానాన్ని కని, ఆపై పుష్కలభోగాలను అనుభవించు. (13)
పుంనామ్నో నరకాత్ పుత్రః త్రాయతే పితరం శ్రుతిః ।
తస్మాదపత్యసంతానే యతస్వ బ్రహ్మసత్తమ ॥ 44
పున్నామ నరకం నుంచి తండ్రిని రక్షించేవానిని పుత్రుడని వేదాలు ఘోషించాయి. కావున బ్రాహ్మణోత్తమా! అపత్యం కోసమ్ ప్రయత్నించు. (14)
వైశంపాయన ఉవాచ
తచ్ఛ్రుత్వా మందపాలస్తు వచస్తేషాం దివౌకసామ్ ।
క్వ ను శీఘ్రమపత్యం స్యాద్ బహులం చేత్యచింతయత్ ॥ 15
వైశంపాయనుడు చెప్పాడు - ఆ దేవతల మాటలు విని మందపాలుడు "ఎక్కడ శీఘ్రంగా ఎక్కువ సంతానం కలుగునా!" అని ఆలోచించాడు. (15)
స చింతయన్నభ్యగచ్ఛత్ సుబహుప్రసవాన్ ఖగాన్ ।
శారికాం శారికో భూత్వా జరితాం సముపేయివాన్ ॥ 16
ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఎక్కువ సంతానాన్ని ఇవ్వగల పక్షులను చేరాడు. జరిత అనే శారికతో శారికుడై సంబంధాన్ని పెంచుకొన్నాడు. (16)
తస్యాం పుత్రానజనయత్ చతురో బ్రహ్మవాదినః ।
తానపాస్య స తత్రైవ జగామ లపితాం ప్రతి ॥ 17
బాలాన్ స తానండగతాన్ సహ మాత్రా మునిర్వనే ।
ఆమె యందు సంస్కారంచే బ్రహ్మవాదులైన నలుగురు కుమారులను జనింపచేశాడు. అండదశలోనే వారిని తల్లితో అక్కడనే విడచి, లపిత అనే పక్షివద్దకు మందపాలుడు చేరాడు. (17 1/2)
తస్మిన్ గతే మహాభాగే లపితాం ప్రతి భారత ॥ 18
అపత్యస్నేహసంయుక్తా జరితా బహ్వచింతయత్ ।
మహానుభావుడైన మందపాలుడు లపితను చేరేసరికి సంతానంపై మిక్కిలి ప్రేమ గల జరిత చాల ఆలోచనలో పడింది. (18 1/2)
తేన త్యక్తా న సంత్యాజ్యాన్ ఋషీనండగతాన్ వనే ॥ 19
న జహౌ పుత్రశోకార్తా జరితా ఖాండవే సుతాన్ ।
బభార చైతాన్ సంజాతాన్ స్వవృత్త్యా స్నేహవిప్లవా ॥ 20
అండాలలో నున్న (గ్రుడ్లు) బిడ్డలను విడువలేక పుత్ర శోకపీడితయై ఖాండవ వనమందే ఉండిపోయింది. ఆమె తన స్నేహ ప్రవృత్తితో అప్పుడే గ్రుడ్లను వీడి బయటకు వచ్చిన పిల్లలను పెంచిపోషించసాగింది. (19,20)
తతోఽగ్నిం ఖాండవం దగ్ధుమ్ ఆయాంతం దృష్టవానృషిః ।
మందపాలశ్చరంస్తస్మిన్ వనే లపితయా సహ ॥ 21
పిమ్మట ఆ వనంలోనే లపితతో సంచరిస్తున్న మందపాలుడు ఖాండవవనాన్ని దహించడానికి వచ్చిన అగ్నిదేవుని చూశాడు. (21)
తం సంకల్పం విదిత్వాగ్నేః జ్ఞాత్వాపుత్రాంశ్చ బాలకాన్ ।
సోఽభితుష్టాన విప్రర్షిః బ్రాహ్మనో జాతవేదసమ్ ॥ 22
పుత్రాన్ ప్రతి వదన్ భీతః లోకపాలం మహౌజసమ్ ।
అగ్ని మనోనిశ్చయమెరిగి పుత్రుల బాల్యావస్థను తలచుకొని మందపాలుడు భయపడి తేజోవంతుడు, లోకపాలకుడు అయిన అగ్నిని తన పుత్రులను రక్షించమని ప్రార్థించాడు. (22 1/2)
మందపాల ఉవాచ
త్వమగ్నే సర్వలోకానాం ముఖం త్వమసి హవ్యవాట్ ॥ 23
మందపాలుడు పలికాడు - అగ్నీ! నీవు సర్వలోకాలకు ముకస్వరూపుడివి. దేవతలకు హవిస్సును చేరుస్తావు. (23)
త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి పావక ।
త్వామేకమాహుః కవయః త్వామాహుస్త్రివిధం పునః ॥ 24
నీవు ప్రాణుల దేహాలలో రహస్యంగా సంచరిస్తున్నావు. నిన్ను కవులు అద్వితీయుడని పిలుస్తారు. దివ్య, భౌమ, జఠర అనలరూపంగల త్రివిధమూర్తిగా నిన్ను కొలుస్తారు. (24)
త్వామష్టధా కల్పయిత్వా యజ్ఞవాహమకల్పయన్ ।
త్వయా విశ్వమిదం సృష్టం వదంతి పరమర్షయః ॥ 25
నిన్ను అష్టవిధమూర్తిగా ప్రశంసించి (భూమి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, యజమాన స్వరూపం) యజ్ఞవాహనుడని చెపుతారు. విశ్వం నీచేతనే సృష్టింపబడిందని ఋషులు అందరు చెపుతారు. (25)
త్వదృతే హి జగత్ కృత్స్నం సద్యో నశ్యేద్ధుతాశన ।
తుభ్యం కృత్వా నమో విప్రాః స్వకర్మవిజితాం గతిమ్ ॥ 26
గచ్ఛంతి సహ పత్నీభిః సుతైరపి చ శాశ్వతీమ్ ।
నీవు లేకపోతే లోకమంతా నశిస్తుంది. నీకు నమస్కరించి బ్రాహ్మణులు వారి కర్మలచే పత్నీపుత్రులతో ఉత్తమ, శాశ్వతగతిని చేరుతున్నారు. (26 1/2)
త్వామగ్నే జలదానాహుః ఖే విషక్తాన్ సవిద్యుతః ॥ 27
అగ్నీ! ఆకాశంలో మెరుపుతీగలతో కూడి విహరించే మేఘపంక్తి నీవే అని కొనియాడుతున్నారు. (27)
దహంతి సర్వభూతాని త్వత్తో నిష్ర్కమ్య హేతయః ।
జాతవేదస్త్వయైవేదం విశ్వం స్పష్టం మహాద్యుతే ॥ 28
ప్రళయకాలంలో నీ నుంచి బయటపడిన ఆయుధాల వంటి జ్వాలలు సర్వప్రాణులను నశింపచేస్తున్నాయి. నీ నుంచే ఈ జగత్తు అంతా పుట్టింది. (28)
తవైవ కర్మ విహితం భూతం సర్వం చరాచరమ్ ।
త్వయాఽఽపో విహితాః పూర్వం త్వయి సర్వమిదం జగత్ ॥ 29
నీ చేతనే సత్కర్మల విధానం లోకంలో ప్రసరించింది. చరాచరప్రాణులు నీ నుంచే ఉత్పన్నం అవుతున్నాయి. పూర్వం నీ నుంచి జలాలు వచ్చాయి. నీ యందే ఈ జగత్తు సుప్రతిష్ఠితమై ఉంది. (29)
త్వయి హవ్యం చ కవ్యమ్ చ యథావత్ సంప్రతిష్ఠితమ్ ।
త్వమేవ దహనో దేవ త్వం ధాతా త్వం బృహస్పతిః ॥ 30
త్వమశ్వినౌ యమౌ మిత్రః సోమస్త్వమసి చానిలః ।
హవ్యకవ్యాలు నీయందు స్థిరంగా ప్రతిష్ఠింపబడ్డాయి. నీవు అగ్నివి, నీవే బ్రహ్మవు, నీవే బృహస్పతివి, అశ్వినీ కుమారులు కూడ నీవే. చంద్రసూర్యులు, వాయువు కూడ నీస్వరూపాలే. (30 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవం స్తుతస్తదా తేన మందపాలేన పావకః ॥ 31
తుతోష తస్య నృపతే మునేరమితతేజసః ।
ఉవాచ చైనం ప్రీతాత్మా కిమిష్టం కరవాణి తే ॥ 32
వైశంపాయనుడు పలికాడు - రాజా! మందపాలునిచే పొగడబడిన అగ్ని అమితతేజస్వి అయిన మందపాలుని విషయంలో ప్రసన్నుడై "నేను మీకు ఏమి చేయుదును"? అన్నాడు. (31,32)
తమబ్రవీన్మందపాలః ప్రాంజలిర్హవ్యవాహనమ్ ।
ప్రదహన్ ఖాండవం దావం మమ పుత్రాన్ విసర్జయ ॥ 33
అంజలి ఘటించి మందపాలుడు అగ్నితో "ఖాండవదహన సమయంలో నాపుత్రులను విడిచిపెట్టు" అన్నాడు. (33)
తథేతి తత్ ప్రతిశ్రుత్య భగవాన్ హవ్యవాహనః ।
ఖాండవే తేన కాలేన ప్రజజ్వాల దిధక్షయా ॥ 34
అట్లే అని అగ్ని ప్రతిజ్ఞ చేసి వారిని విడచి ఖాండవవనాన్ని మాత్రం దహించాలనే తలంపుతో ఉన్నాడు. (34)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి మయదర్శనపర్వణి శార్ ఙ్గకోపాఖ్యానే అష్టావింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః ॥ 228 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున మయదర్శనపర్వమను
ఉపపర్వమున శార్ ఙ్గకోపాఖ్యానము అను రెండువందల ఇరువది ఎనిమిదవ అధ్యాయము. (228)