229. రెండువందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము

జరిత తన పిల్లల కొరకు విలపించుట.

వైశంపాయన ఉవాచ
తతః ప్రజ్వలితే వహ్నౌ శార్ ఙ్గకాస్తే సుదుఃఖితాః ।
వ్యథితాః పరమోద్విగ్నాః నాధిజగ్ముః పరాయణమ్ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - అగ్ని మండుతుండగా మిక్కిలి దుఃఖితులై, వ్యథతో ఉద్విగ్నమైన పక్షులు తమ రక్షకుని కానలేకపోయాయి. (1)
నిశమ్య పుత్రకాన్ బాలాన్ మాతా తేషాం తపస్వినీ ।
జరితా శోకదుఃఖార్తా విలలాప సుదుఃఖితా ॥ 2
ఆ చిన్నపిల్లలను గూర్చి విన్న దీనురాలైన తల్లి - జరిత శోకంతో దుఃఖంతో విలపించసాగింది. (2)
జరితోవాచ
అయమగ్నిర్దహన్ కక్షమ్ ఇత ఆయాతి భీషణః ।
జగత్ సందీపయన్ భీమః మమ దుఃఖవివర్ధనః ॥ 3
జరిత చెప్పింది - భయంకరుడైన ఈ అగ్ని వనాన్ని దహిస్తూ ఇటువైపు వస్తున్నాడు. అతడు జగత్తును భస్మం చేసి, నా దుఃఖాన్ని పెంచుతాడు. (3)
ఇమే చ మామ్ కర్షయంతి శిశవో మందచేతసః ।
అబర్హాశ్చరణైర్హీనాః పూర్వేషాం నః పరాయణాః ॥ 4
సాంసారికజ్ఞానం లేని ఈ చిన్న చిన్న పక్షి పిల్లలు నన్ను ఆకర్షించాయి. రెక్కలు రాలేదు. కాళ్ళు కూడ సరిగా ఏర్పడలేదు. ఈ పిల్లలే మాపితృదేవతలకు దిక్కు. (4)
త్రాసయంశ్చాయమాయాతి లేలిహానో మహీరుహాన్ ।
అజాతపక్షాశ్చ సుతాః న శక్తాః సరణే మమ ॥ 5
అందరినీ భయపెడుతూ చెట్లనికూడ ఆస్వాదిస్తూ ఈ అగ్ని ఇటే వస్తున్నాడు. రెక్కలు రాని ఈ పిల్లలు నాతో ఎగరలేవు. (5)
ఆదాయ చ న శక్నోతి పుత్రాంస్తరితుమాత్మనా ।
న చ త్యక్తుమహం శక్తా హృదయం దూయతీవ మే ॥ 6
ఈ పిల్లల్ని తీసుకొని నేను ఎగురలేను. విడిచిపొలేను. నా హృదయం చాలా కలవరపడుతోంది. (6)
కం తు జహ్యామహం పుత్రం కమాదాయ వ్రజామ్యహమ్ ।
కిం ను మే స్యాత్ కృతం కృత్వా మన్యధ్వం పుత్రకాః కథమ్ ॥ 7
నేను ఏ పిల్లను విడుస్తాను? ఏ పిల్లను తీసుకుని ఎగురుతాను? ఏది చేసి కృతకృత్యురాలనవుతాను? పిల్లలారా! ఆలోచన చెప్పండి! (7)
చింతయానా విమోక్షం వః నాధిగచ్ఛామి కించన ।
ఛాదయిష్యామి వో గాత్రైః కరిష్యే మరణం సహ ॥ 8
ఎంతసేపు ఆలోచించినా మిమ్ము విడిపించే ఉపాయమేదీ కనపడటం లేదు. నా రెక్కలతో మిమ్మల్ని కప్పుతాను. మీతో సహా మరణిస్తాను. (8)
జరితారౌ కులం హ్యేతత్ జ్యేష్ఠత్వేన ప్రతిష్ఠితమ్ ।
సారిసృక్కః ప్రజాయేత పితౄణాం కులవర్ధనః ॥ 9
స్తంబమిత్రస్తపః కుర్యాద్ ద్రోణో బ్రహ్మవిదాం వరః ।
ఇత్యేవముక్త్వా ప్రయయౌ పితా వో నిర్ఘృణః పురా ॥ 10
పుత్రులారా! నిర్దయుడైన మి తండ్రి ఇదివరకే చెప్పి వెళ్లాడు. జరితారి కులంలో పెద్ద. కావున కులరక్షణ అతనిపై ఉంటుంది. సారిసృక్కుడు రెండవవాడు. పితృదేవతల కుల వృద్ధి ఇతనిచే జరుగుతుంది. స్తంబమిత్రుడు తపస్సు చేస్తాడు. ద్రోణుడు బ్రహ్మవాదులలో శ్రేష్ఠుడు అని. (9, 10)
కముపాదాయ శక్యేయం గంతుం కష్టాపదుత్తమా ।
కిం ను కృత్వా కృతం కార్యం భవేదితి చ విహ్వలా ॥ 11
నాపశ్యత్ స్వధియా మోక్షం స్వసుతానాం తదానలాత్ ।
నాపై గొప్పకష్టమైన ఆపద వచ్చిపడింది. ఈ నలుగురి పిల్లలలో ఎవరిని తీసుకొని బయటపడగలను. ఏంచేస్తే పని నెరవేరుతుంది. ఈ విధంగా ఆలోచిస్తూ జరిత భయవిహ్వల అయింది. కాని తన పిల్లలను రక్షించుకొనే ఉపాయం ఏదీ ఆమెబుద్ధికి తోచలేదు. (11)
వైశంపాయన ఉవాచ
ఏవం బ్రువాణాం శారాస్తే ప్రత్యూచురథ మాతరమ్ ।
స్నేహముత్సృజ్య మాతస్త్వం పత యత్ర న హవ్యవాట్ ॥ 12
వైశంపాయనుడు అన్నాడు - ఈ విధంగా భయవిహ్వల అయిన తల్లిని చూచి పిల్లలు తల్లితో అన్నాయి. అమ్మా! నీవు మాపై ప్రేమను వదలి అగ్నిలేనిచోటికి ఎగిరిపో! (12)
అస్మాస్విహ వినష్టేషు భవితారః సుతాస్తవ ।
త్వయి మాతర్వినష్టాయాం న నః స్యాత్ కులసంతతీః ॥ 13
అమ్మా! మేం నశించినా నీకు పిల్లలు కలగడానికి అవకాశమ్ ఉంది. కాని నీవు నశిస్తే మన కులపరంపర మిగలదు. (13)
అన్వవేక్ష్యైతదుభయం క్షేమం స్యాద్ యత్ కులస్య నః ।
తద్ వై కర్తుం పరః కాలః మాతరేష భవేత్ తవ ॥ 14
అమ్మా! ఈ రెండు పక్షాలను బాగా ఆలోచించి ఏది మనకులానికి శ్రేయస్కరమో దానిని గురించి ఆలోచించు. దానిని ఆచరించటానికి నీకు ఇది తగిన సమయం. (14)
మా త్వం సర్వవినాశాయ స్నేహం కార్షీః సుతేషు నః ।
న హీదం కర్మ మోఘం స్యాద్ లోకకామస్య నః పితుః ॥ 15
నీవు మా అందరి పుత్రులపై ప్రేమని విడు. లేకపోతే అందరం నశిస్తాం. ఉత్తమలోకాలను కాంక్షించే నా తండ్రి సత్కర్మ వ్యర్థం చేయకుండా ఆలోచించు. (15)
జరితోవాచ
ఇదమాఖోర్బిలం భూమౌ వృక్షస్యాస్య సమీపతః ।
తదావిశధ్వం త్వరితా వహ్నేరత్ర న వో భయమ్ ॥ 16
జరిత అన్నది - భూమిపై ఈ వృక్షం దగ్గర ఎలుక కన్నం ఉంది. దీనిలోకి త్వరగా ప్రవేశించండి. అగ్ని వలన మీకు ఇక్కడ భయం ఉండదు. (16)
తతోఽహమ్ పాంసునా ఛిద్రమ్ అపిధాస్యామి పుత్రకాః ।
ఏవం ప్రతికృతం మన్యే జ్వలితః కృష్ణవర్త్మనః ॥ 17
మీరు ప్రవేశించాక ధూళితో ఈ రంధ్రాన్ని మూసివేస్తాను. పుత్రులారా! మండే అగ్ని వలన రక్షన పొందటానికి ఇదే ఉపాయం అని నా నమ్మకం. (17)
తత ఏష్యామ్యతీతేఽగ్నౌ విహంతుం పాంసుసంచయమ్ ।
రోచతామేష వో వాదః మొక్షార్థమ్ చ హుతాశనాత్ ॥ 18
అగ్ని చల్లార్చిన తర్వాత ధూళిని తప్పించి మిమ్ములను విడిపిస్తాను. అగ్ని నుండి రక్షింపబడటానికి ఈ ఉపాయం మీకు నచ్చుతుంది అని అనుకొంటున్నాను. (18)
శారకా ఊచుః
అబర్హాన్ మాంసభూతాన్ నః క్రవ్యాదాఖుర్వినాశయేత్ ।
పశ్యమానా భయమిదమ్ ప్రవేష్టుం నాత్ర శక్నుమః ॥ 19
పక్షులు పలికాయి - రెక్కలు లేని, మాంసపు ముద్దలైన మమ్ములను ఆ ఎలుక తినివేస్తుంది. ఈ భయంతో మేమి బిలంలొ ప్రవేశింపలేము. (19)
కథమగ్నిర్న నో ధక్ష్యేత్ కథమాఖుర్న నాశయేత్ ।
కథం న స్యాత్ పితా మోఘః కథం మాతా ధ్రియేత నః ॥ 20
అగ్ని మమ్ము ఎలా దహింపడో, ఎలుక మమ్ములను ఎలా నాశంచేయదో, మా తండ్రి సత్కర్మ ఎలా వ్యర్థంకాదో, ఎట్లు మాతల్లి జీవింపగలదో అని దాన్ని ఆలోచిస్తున్నాం. (20)
బిల ఆఖోర్వినాశః స్యాద్ అగ్నేరాకాశచారిణామ్ ।
అన్వవేక్ష్యైతదుభయం శ్రేయాన్ దాహో న భక్షణమ్ ॥ 21
బిలంలో ఉన్న ఎలుక వల్లనూ నాశం కలుగుతుంది. ఆకాశంలోకి ఎగిరితే అగ్నివల్లనూ నాశమ్ కలుగుతుంది. ఈరెంటిని పర్యాలోచిస్తే అగ్నిలో మరణించటమే శ్రేయస్కరం. ఎలుకకు చిక్కి మరణించడం హీనం. (21)
గర్హితం మరణం నః స్యాద్ ఆఖునా భక్షితే బిలే ।
శిష్టాదిష్టః పరిత్యాగః శరీరస్య హుతాశనాత్ ॥ 22
ఒక వేళ మమ్ములను బిలంలోని ఎలుక తినివేస్తే అపుడు మామృత్యువు నింద్యమవుతుంది. అగ్నిలో పడి మరణిస్తే అది శిష్టాచారం అవుతుంది. (22)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి మయదర్శనపర్వణి జరితావిలాపే ఏకోనత్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 229 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున మయదర్శనపర్వమను
ఉపపర్వమున జరితావిలాపము అను రెండువందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము. (229)