232. రెండువందల ముప్పది రెండవ అధ్యాయము

మందపాలుడు తన పిల్లలతో కలియుట.

వైశంపాయన ఉవాచ
మందపాలోఽపి కౌరవ్య చింతయామాస పుత్రకాన్ ।
ఉక్త్వాపి చ స తిగ్మాంశుం నైవ శర్మాధిగచ్ఛతి ॥ 1
వైశంపాయనుడు చెప్పాడు - జనమేజయా! మందపాలుడు కూడ తన పుత్రులను గూర్చి చింతించాడు. వారి సంరక్షణ కోసమ్ అగ్నిని ప్రార్థించినా అతనికి శాంతి లభించలేదు. (1)
స తప్యమానః పుత్రార్థే లపితామిదమబ్రవీత్ ।
కథం ను శక్తాః శరణే లపితే మమ పుత్రకాః ॥ 2
పుత్రుల కోసం పరితపిస్తూనే లపితతో ఇలా అన్నాడు. 'లపితా! నా పుత్రులు తమ గూళ్లలో ఎలా పరిరక్షింపబడతారో! (2)
వర్ధమానే హుతవహే వాతే చాశు ప్రవాయతి ।
అసమర్థా విమోక్షాయ భవిష్యంతి మమాత్మజాః ॥ 3
అగ్ని ప్రజ్వలించి, వాయువు శీఘ్రంగా వస్తుంటే ఆ సమయంలో నా కుమారులు అగ్ని నుండి రక్షించుకోలేని వారు అవుతారు. (3)
కథం త్వశక్తా త్రాణాయ మాతా తేషాం తపస్వినీ ।
భావిష్యతి హి శోకార్తా పుత్రత్రాణమపశ్యతీ ॥ 4
వారి తల్లి దీనురాలై, స్వయంగా వారిని రక్షించటంలో అసమర్థురాలై పుత్రుల సంరక్షణ చేయలేక శోకార్తురాలు అవుతుంది. (4)
కథముడ్డయనేఽశక్తాన్ పతనే చ మమాత్మజాన్ ।
సంతప్యమానా బహుధా వాశమానా ప్రధావతీ ॥ 5
నా పిల్లలు ఎగరలేరు. రెక్కలు తపతపలాడించే శక్తి ఇంకా రాలేదు. వారి అవస్థను చూచి తపించి ఆక్రోశిస్తూ నలువైపులు పరుగులు తీసి ఉంటుంది. (5)
జరితారిః కథం పుత్రః సారిసృక్కః కథమ్ చ మే ।
స్తంభమిత్రః కథం ద్రోణః కథమ్ సా చ తపస్వినీ ॥ 6
నాజ్యేష్ఠపుత్రుడు జరితారి ఎట్లుండెనో? సారిసృక్కుడు, స్తంబమిత్రుడు, ద్రోణుడు ఎట్లున్నారో? దీనురాలైన జరిత ఏబాధ పడుతోందో! (6)
లాలప్యమానం తమృషిం మందపాలం తథా వనే ।
లపితా ప్రత్యువాచేదం సాసూయమివ భారత ॥ 7
మందపాల ఋషి ఈ ప్రకారంగా ఖాండవవనంలో విలపిస్తుంటే లపిత అసూయతో ఇలా బదులు పలికింది. (7)
న తే పుత్రేష్వవేక్షాస్తి యానృషీనుక్తవానసి ।
తేజస్వినో వీర్యవంతః న తేషాం జ్వలనాద్ భయమ్ ॥ 8
నీకు పుత్రులను చూడాలి అనే చింత అవసరం లేదు. తేజస్వులూ, వీర్యవంతులూ అయిన ఏ ఋషులపేర్లు నీ పిల్లలకు పెట్టావో వారి మహిమచే నీ పుత్రులకు కొంచమైనా నా భయం లేదు. (8)
తవ్యాగ్నౌ తే పరీతాశ్చ స్వయం హి మమ సంనిధౌ ।
ప్రతిశ్రుతం తథా చేతి జ్వలనేన మహాత్మనా ॥ 9
నా సన్నిధిలో నీచే అగ్నిదేవునికి స్వయంగా పుత్రులు అర్పించబడ్డారు. ఆ మహాత్ముడు వారి రక్షణవిషయంలో ప్రతిజ్ఞ చేశాడు. (9)
లోకపాలో న తాం వాచమ్ ఉక్త్వా మిథ్యా కరిష్యతి 7.
సమక్షం బంధుకృత్యే న తేన తే స్వస్థమానసమ్ ॥ 10
లోకపాలకుడు అగ్ని మాట ఇస్తే అది అబద్ధం కాదు. నీ మనస్సు పిల్లలను రక్షించుట అనే బంధుకృత్యంలో ఉత్సుకం కాలేదు. (10)
తామేవ తు మమామిత్రాం చింతయన్ పరితప్యసే ।
ధ్రువం మయి న తే స్నేహః యథా తస్యాం పురాభవత్ ॥ 11
నా శత్రువైన జరితను చింతిస్తూ పరితపించావు. నీకు నా విషయంలో పూర్వం ఆమె యందు ఉన్నట్లు ప్రేమ నిశ్చయంగా లేదు. (11)
న హి పక్షవతా న్యాయ్యం నిః స్నేహేన సుహృజ్జనే ।
పీడ్యమాన ఉపద్రష్టుం శక్తేనాత్మా కథంచన ॥ 12
సహాయకుల శక్తి కల నీవు స్నేహితులమైన మా యందు ఉపేక్ష చూపటం ఉచితం కాదు. ఇది ఏవిధంగానూ ఉచితం కాదని చెప్పగలం. (12)
గచ్ఛ త్వం జరితామేవ యదర్థం పరితప్యసే ।
చరిష్యామ్యాహమప్యేకా యథా కుపురుషాశ్రితా ॥ 13
నీవు ఏ జరితకోసం బాధపడుతున్నావో ఆమె వద్దకే వెళ్ళు. నేను కూడ దుష్టుని ఆశ్రయిమ్చిన స్త్రీ వలె ఒక్కతెనే చరిస్తాను. (13)
మందపాల ఉవాచ
నాహమేవం చరే లోకే యథా త్వమభిమన్యసే ।
అపత్యహేతోర్విచరే తచ్చ కృచ్ఛ్రగతం మమ ॥ 14
మందపాలుడు పలికాడు - నీవెలా అనుకుంటున్నావో నేను అలా ఈ సంసారంలో సంచరించటమ్ లేదు. నా విచారమంతా సంతానం కోసమే. అట్టి నా సంతానమ్ సంకటస్థితిలో ఉంది. (14)
భూతం హిత్వా చ భావ్యర్థే యోఽవలంబేత్ స మందధీః ।
అవమన్యేత తం లోకః యథేచ్ఛసి తథా కురు ॥ 15
పుట్టిన పిల్లలను విడచి భవిష్యత్తులో పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించేవాడు మూర్ఖుడు. లోకమంతా అతనిని ఆదరించదు. నీకెలా తోస్తే అలా చెయ్యి. (15)
ఏష హి ప్రజ్వలన్నగ్నిః లేలిహానో మహీరుహాన్ ।
ఆవిగ్నే హృది సంతాపం జనయత్యశివం మమ ॥ 16
ఈ ప్రజ్వలితాగ్ని చెట్లనన్నింటినీ తన నాలుకలతో కబళిస్తూ ఉంటే ఉద్విగ్నమైన చిత్తంలో అమంగళకరమైన సంతాపం పుడుతోంది. (16)
వైశంపాయన ఉవాచ
తస్మాద్ దేశాదతిక్రాంతే జ్వలనే జరితా పునః ।
జగామ పుత్రకానేవ త్వరితా పుత్రగృద్ధినీ ॥ 17
వైశంపాయనుడు అన్నాడు - ఆ ప్రదేశం నుంచి అగ్ని తొలగిపోగానే తన పిల్లల మీది ప్రేమతో జరిత తిరిగి శీఘ్రంగా అక్కడకు చేరింది. (17)
సా తాన్ కుశలినః సర్వాన్ విముక్తాన్ జాతవేదసః ।
రోరూయమాణాన్ దదృశే వనే పుత్రాన్ నిరామయాన్ ॥ 18
అగ్ని కరుణచే విముక్తులై క్షేమంగా ఉన్న పిల్లలందరినీ చూచింది. కష్టం తీరి అరుస్తున్నట్లు తెలిసికొంది. (18)
అశ్రూణి మముచే తేషాం దర్శనాత్ సా పునః పునః ।
ఏకైకశ్యేన తాన్ సర్వాన్ క్రోశమానాన్వపద్యత ॥ 19
వారి దర్శనం వల్ల ఆమె మరల మరల కన్నీటి ధారలను విడచింది. ఒక్కొక్కరిని విడివిడిగా పిలచి తన పిల్లలను కలిసి ఆనందించింది. (19)
తతోఽభ్యగచ్ఛత్ సహసా మందపాలోఽపి భారత ।
అథ తే సర్వ ఏవైనం నాభ్యనందంస్తదా సుతాః ॥ 20
ఇంతలో మందపాలుడు కూడా శీఘ్రంగా అక్కడికి వచ్చాడు. కాని ఆ పిల్లలతో ఎవ్వరు ఆ మందపాలుని అభినందించలేదు. (20)
లాలప్యమానమేకైకం జరితాం చ పునః పునః ।
న చైవోచుస్తదా కించిత్ తమృషిం సాధ్వసాధు వా ॥ 21
విలపిస్తున్న వారి నొక్కక్కరిని, జరితమ మరల మరల పలుకరించినా వారెవ్వరు ఆ ఋషితో మంచిగా గాని, చెడుగా గాని మాట్లాడలేదు. (21)
మందపాల ఉవాచ
జ్యేష్ఠః సుతస్తే కతమః కతమస్తస్య చానుజః ।
మధ్యమః కతమశ్చైవ కనీయాన్ కతమశ్చ తే ॥ 22
మందపాలుడు అన్నాడు - ప్రియా! వీరిలో నీ జ్యేష్ఠపుత్రుడు ఎవడు? చిన్నవాడెవడు? మధ్యముడు ఎవడు? అందరికంటె చిన్నవాడు ఎవడో చెప్పు. (22)
ఏవం బ్రువంతం దుఃఖార్తం కిం మాం న ప్రతిభాషసే ।
కృతవానపి హి త్యాగం నైవ శాంతిమితో లభే ॥ 23
నేను ఈ విధంగా దుఃఖంతో బాధపడుతుండగా నాకు సమాధానం చెప్పవేమి? నేను నిన్ను విడచిపెట్టినా శాంతిని పొందలేదు. (23)
జరితోవాచ
కిం ను జ్యేష్ఠేన తే కార్యం కిమనంతరజేన తే ।
కిం వా మధ్యమజాతేన కిం కనిష్ఠేన వా పునః ॥ 24
జరిత పలికింది - నీకు జ్యేష్ఠునితో పని ఏముంది? తరువాతి వానితో ఏమిపని? మధ్యమునితో, కనిష్ఠునితో సిద్ధించే ప్రయోజనమేమి? (24)
యాం త్వం మాం సర్వతో హీనామ్ ఉత్సృజ్యాసి గతః పురా ।
తామేవ లపితాం గచ్ఛ తరుణీం చారుహాసినీమ్ ॥ 25
పూర్వం నీవు నన్ను అందరికంటె హీనురాలిగా భావించి విడచిపెట్టావు. ఆ సుందరమైన చిరునవ్వు, యౌవనం గల లపితవద్దకే పొమ్ము. (25)
మందపాల ఉవాచ
న స్త్రీణాం విద్యతే కించిదముత్ర పురుషాంతరాత్ ।
సాపత్నకమృతే లోకే నాన్యదర్థవినాశనమ్ ॥ 26
మందపాలుడు అన్నాడు - స్త్రీలకు పరలోకంలో పరపురుషసంబంధం, సవతి పోరు తప్ప మరే దోషం వారి పరమార్థాన్ని నాశం చెయ్యలేదు. (26)
వైరాగ్నిదీపనం చైవ భృశముద్వేగకారి చ।
సువ్రతా చాపి కళ్యాణీ సర్వభూతేషు విశ్రుతా ॥ 27
అరుంధతీ మహాత్మానం వసిష్ఠమ్ పర్యశంకత ।
విశుద్ధభావమత్యంతం సదా ప్రియహితే రతమ్ ॥ 28
సప్తర్షిమద్యగమ్ ధీరమ్ అవమేనే చ తం మునిమ్ ।
అపధ్యానేన సా తేన ధూమారుణసమప్రభా ।
లక్ష్యాలక్ష్యా నాభిరూపా నిమిత్తమివ పశ్యతి ॥ 29
ఈ సవతిపోరు శత్రుత్వాగ్నిని వెలిగిస్తుంది. ఎక్కువగా శరీరాన్ని బాధిస్తుంది. ప్రాణులందరిలో ప్రసిద్ధురాలు, మంగళ లక్షణాలు గల అరుంధతి వశిష్ఠుని శంకించింది. ఆయన హృదయం నిర్మలం. ఎల్లప్పుడు అరుంధతి ప్రియాన్ని, హితాన్ని కోరేవాడు. సప్తర్షి మండలంలో ఆకాశంలో విరాజమానుడు. ఇట్టి మునిని సవతి కారణంగా అరుంధతి తిరస్కరించింది. ఇట్టివానిని శంకించుటచే ఆమె శరీర కాంతి ధూమవర్ణంగా, అరుణునివలె మందంగా మారిపోయింది. ఆమె ఒకసారి కనిపిస్తూ ఒకసారి కనిపించక ప్రచ్ఛన్న వేషధారిణి వలె నిమిత్తాలను ఆశ్రయించింది. (27-29)
అపత్యహేతోః సంప్రాప్తం తథా త్వమపి మామిహ ।
ఇష్టమేవం గతే హి త్వం సా తథైవాద్య వర్తతే ॥ 30
సంతానం కోసం వచ్చిన నన్ను నీవు తిరస్కరించావు. అభీష్టవస్తువు లభించిన పిదప నాపట్ల నీవు ఏ సందేహాన్ని ప్రదర్శిస్తున్నావో లపిత కూడ అట్లే చేసింది. (30)
న హి భార్యేతి విశ్వాసః కార్యః పుంసా కథంచన ।
న హి కార్యమనుధ్యాతి నారీ పుత్రవతీ సతీ ॥ 31
ఇది నా భార్య అని పురుషుడు ఎన్నడును స్త్రీపై విశ్వాసముంచరాదు. సంతానవతి అయిన పిదప స్త్రీ భర్త సేవను విడచివేస్తుంది. (31)
వైశంపాయన ఉవాచ
తతస్తే సర్వ ఏవైనం పుత్రాః సమ్యగుపాసతే ।
స చ తానాత్మజాన్ సర్వాణ్ ఆశ్వాసయితుముద్యతః ॥ 32
వైశంపాయనుడు చెప్పాడు - పిమ్మట పుత్రులందరు వారి వారి రూపాలతో తండ్రివద్దకు వచ్చి కూర్చున్నారు. మందపాలుడు కూడ వారిని ఊరడించటానికి ఉద్యుక్తుడు అయ్యాడు. (32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి మయదర్శనపర్వణి శార్ ఙ్గకోపాఖ్యానే ద్వావింశదధిక ద్విశతతమోఽధ్యాయః ॥ 232 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున మయదర్శనపర్వమను
ఉపపర్వమున శార్ ఙ్గకోపాఖ్యానము అను రెండువందల ముప్పదిరెండవ అధ్యాయము. (232)