231. రెండువందల ముప్పదియొకటవ అధ్యాయము
శార్ ఙ్గకములు అగ్నిదేవుని పొగడి అభయము పొందుట.
జరితారిరువాచ
పురతః కృచ్ఛ్రకాలస్య ధీమాన్ జాగర్తి పూరుషః ।
స కృచ్ఛ్రకాలం సంప్రాప్య వ్యథాం నైవైతి కర్హిచిత్ ॥ 1
జరితారి చెప్పాడు - బుద్ధిమంతుడైన పురుషుడు ఆపత్కాలానికి ముందే మేల్కొంటాడు. కష్టకాలం వచ్ఛాక వ్యథ చెందడు. (1)
యత్తు కృచ్ఛ్రమనుప్రాప్తం విచేతా నావబుధ్యతే ।
స కృచ్ఛ్రకాలే వ్యథితః న శ్రేయో విందతే మహత్ ॥ 2
మూఢచిత్తుడు రాబోయే ఆపదను తెలుసుకోకుండా కష్టకాలం వచ్చాక బాధపడినా శ్రేయస్సును పొందలేడు. (2)
సారిసృక్క ఉవాచ
ధీరస్త్వమసి మేధావీ ప్రాణకృచ్ఛ్రమిదం చ నః ।
ప్రాజ్ఞః శూరో బహూనాం హి భవత్యేకో న సంశయః ॥ 3
సారిసృక్కుడు పలికాడు - నీవు ధీరుడవు. తెలివైన వాడివి. ఇది మాప్రాణాలు ఆపదలీ పడిన సమయం. చాలా మందిలో ప్రాజ్ఞుడు, శూరుడు ఒక్కడే ఉంటాడు అనటంలో సందేహం లేదు. (3)
స్తంబమిత్ర ఉవాచ
జ్యేష్ఠస్తాతో భవతి వై జ్యేష్ఠో ముంచతి కృచ్ఛ్రతః ।
జ్యేష్ఠశ్చేన్న ప్రజానాతి కనీయాన్ కిం కరిష్యతి ॥ 4
స్తంబమిత్రుడు అన్నాడు - పెద్ద అన్న తండ్రితో సమానం. పెద్ద అన్న కష్టాల నుంచి విడిపిస్తాడు. పెద్ద అన్న రాబోయే ఆపదను గుర్తించలేకపోతే చిన్నవాడు ఏంచేస్తాడు? (4)
ద్రోణ ఉవాచ
హిరణ్యరేతాస్త్వరితః జ్వలన్నాయాతి నః క్షయమ్ ।
సప్తజిహ్వాననః క్రూరః లేలిహానో విసర్పతి ॥ 5
ద్రోణుడు పలికాడు - అగ్ని మండిపడుతూ మనబలాల వైపు వేగంగా వస్తున్నాడు. ఏడు జిహ్యలు కల ముఖంతో క్రూరుడై చెట్లనన్నింటిని దహిస్తూ, వ్యాపిస్తున్నాడు. (5)
వైశంపాయన ఉవాచ
ఏవం సంభాష్య తేఽన్యోన్యం మందపాల్య పుత్రకాః ।
తుష్టువుః ప్రయతా భూత్వా యథాగ్నిం శృణు పార్థివః ॥ 6
వైశంపాయనుడు అన్నాడు - ఇట్లు మందపాలుని పుత్రులు వారిలో వారు మాట్లాడుకొని ఏకాగ్రచిత్తంతో అగ్నిదేవుని స్తుతించారు - రాజా! అది విను. (6)
జరితారిరువాచ
ఆత్మాసి వాయోర్జ్వలన శరీరమసి వీరుధామ్ ।
యొనిరాపశ్చ తే శుక్రం యోనిస్త్వమసి చాంభసః ॥ 7
జరితారి పలికాడు. అగ్నిదేవా! మీరు వాయుదేవుని ఆత్మస్వరూపులు, లతలకు శరీరం. మీ వీర్యమే జలాలకు కారణం. భూమికి కూడ మీరే కారణభూతులు. (7)
ఊర్ధ్వం చాధశ్చ సర్పంతి పృష్ఠతః పార్శ్వతస్తథా ।
అర్చిషస్తే మహావీర్య రశ్మయః సవితుర్యథా ॥ 8
మీ జ్యాలలు సూర్యకిరణాలతో సమానంగా పైకి, క్రిందకి, ముందుకి, వెనక్కి, ప్రక్కలకు ప్రసరిస్తాయి. (8)
సారిసృక్క ఉవాచ
మాతా ప్రనష్టా పితరం న విద్మః
పక్షా జాతా నైవ నో ధూమకేతో ।
న నస్త్రాతా విద్యతే వై త్వదన్య
స్తస్మాదస్మాంస్త్రాహి బాలాంస్త్వమగ్నే ॥ 9
సారిసృక్కుడు పలికాడు - ధూమకేతూ! మాతలి మమ్మల్ని విడచిపోయింది. తండ్రిజాడ తెలియదు. రెక్కలు రానివాళ్లం. నీకంటె వేరొక రక్షకుడు మాకు లేడు. బాలురమైన మమ్ములను మీరే రక్షించాలి. (9)
య దగ్నే తే శివం రూపం యే చ తే సప్త హేతయః ।
తేన నః పరిపాహి త్వమ్ ఆర్తాన్ వై శరణైషిణః ॥ 10
నీ మంగళకరమైన స్వరూపం, ఏడు జ్వాలలు కలది అన్నిటితో నీశరణువేడిన దీనులమైన మమ్ము కాపాడు. (10)
త్వమేవైకస్తపసే జాతవేదో
నాన్యస్తప్తా విద్యతే గోషు దేవ ।
ఋషీనస్మాన్ బాలకాన్ పాలయస్వ
పరేణాస్మాన్ ప్రేహి వై హవ్యవాహ ॥ 11
అగ్నీ! మీరొక్కరే అన్నిచోట్ల తపిస్తున్నారు. దేవా! సూర్యకిరణాలలోని తపిమ్చేశక్తి మీరే. హవ్యవాహనా! మేము చిన్న ఋషులమ్. మమ్ము రక్షించండి. మానుంచి దూరానికి తొలగండి. (11)
స్తంబమిత్ర ఉవాచ
సర్వమగ్నే త్వమేవైకః త్వయి సర్వమిదం జగత్ ।
త్వమ్ ధారయసి భూతాని భువనం త్వం బిభర్షి చ ॥ 12
స్తంబమిత్రుడు పలికాడు - నీవొక్కడివే సర్వస్వం. నీవు సమస్తజగత్తుకు అధిష్ఠాతవు. భూతాల్ని నీవే పాలిస్తున్నావు. జగత్తును పరిపాలిస్తూ భారం మోస్తున్నావు. (12)
త్వమగ్నిర్హవ్యహస్త్వం త్వమేవ పరమం హవిః ।
మనీషిణస్త్వాం జానంతి బహుధా చైకధాపి చ ॥ 13
నీవు అగ్నివి, హవ్యం తీసికొనిపొయేవాడవు. శ్రేష్ఠమైన హవిస్సువు నీవే. శ్రేష్ఠపురుషులు నిన్ను అనేకరూపాలతోను, ఏకరూపంతోనూ కూడా భావిస్తారు. (13)
సృష్ట్వా లోకాంస్త్రీనిమాన్ హవ్యవాహ
కాలే ప్రాప్తే పచసి పునః సమిద్ధః ।
త్వం సర్వస్య భువనస్య ప్రసూతి
స్త్వమేవాగ్నే భవసి పునః ప్రతిష్ఠా ॥ 14
అగ్నీ! మూడులోకాలను సృజించి, తగిన సమయంలో దహించి సంహరిస్తున్నావు. సమస్తలోకానికి నీవే ఉత్పత్తి స్థానం, నీవే లయస్థానమ్ అవుతున్నావు. (14)
ద్రోణ ఉవాచ
త్వమన్నం ప్రాణిబిర్భుక్తమ్ అంతర్భూతో జగత్పతే ।
నిత్యప్రవృద్ధః పచసి త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ ॥ 15
ద్రోణుడు పలికాడు. జగత్పతీ! నీవు ప్రాణుల శరీరాల్లో ఉండి ప్రాణులు తిన్న అన్నాన్ని సదా పచనం చేస్తున్నావు. నీయందే విశ్వం సుప్రతిష్ఠతం. (15)
సుర్యో భూత్వా రశ్మిభిర్జాతవేదో
భూమేరంభో భూమిజాతాన్ రసాంశ్చ ।
విశ్వానాదాయ పునరుత్సృజ్య కాలే
దృష్ట్వా వృష్ట్యా భావయసీహ శుక్ర ॥ 16
సర్వజ్ఞుడా! నీవే సూర్యుడవై కిరణాలతో భూమినుంచి జలాలను, రసాలను గ్రహించి తగిన సమయంలో తిరిగి వర్షాల ద్వారా భూమిపై జలాలను రసరూపంగా విడుస్తున్నావు. (16)
త్వత్త ఏతాః పునః శుక్ర వీరుధో హరితచ్ఛదాః ।
జాయంతే పుష్కరిణ్యశ్చ సుభద్రశ్చ మహోదధిః ॥ 17
మంచి రంగు గలవాడా! నీ నుంచే పచ్చటి ఆకులు గల వనస్పతులు, నదులు మంగళకరమైన మహోదధి ఏర్పడుతున్నాయి. (17)
ఇదం వై సద్మ తిగ్మాంశో వరుణస్య పరాయణమ్ ।
శివస్త్రాతా భవాస్మాకం మాస్మానద్య వినాశయ ॥ 18
ప్రచండ కిరణాలు గలవాడా! శరీర రూపమైన ఈ మా ఇంటికి రసాధిపతి వరుణుడు దిక్కు. నీవు శీతలుడవై మమ్ము రక్షించు. నాశం చేయవద్దు. (18)
పింగాక్ష లోహితగ్రీవ కృష్ణవర్త్మన్ హుతాశన ।
పరేణ ప్రేహి ముంచాస్మాన్ సాగరస్య గృహానివ ॥ 19
పింగాక్షా! ఎర్రటి కంఠమ్ కలవాడా! కృష్ణవర్త్మా! అగ్నీ! సముద్రుని ఇళ్ళను వలె మమ్ము విడువుము. ఇంకొక మార్గంలో వెళ్లు.
వైశంపాయన ఉవాచ
ఏవముక్తో జాతవేదా ద్రోణేన బ్రహ్మవాదినా ।
ద్రోణమాహ ప్రతీతాత్మా మందపాలప్రతిజ్ఞయా ॥ 20
వైశంపాయనుడు అన్నాడు -
బ్రహ్మవాది ద్రోణుని మాటలు విన్న అగ్ని ప్రసన్నుడై మందపాలునికిచ్చిన మాటను గుర్తు తెచ్చుకొని ద్రోణునితో అన్నాడు. (20)
అగ్ని రువాచ
ఋషిర్ద్రోణస్త్వమసి వై బ్రహ్మ తద్ వ్యాహృతం త్వయా ।
ఈప్సితం తే కరిష్యామి న చ తే విద్యతే భయమ్ ॥ 21
అగ్ని పలికాడు - నీవు ద్రోణుడవను ఋషివి. బ్రహ్మతత్త్వాన్ని వ్యాఖ్యానించావు. నీకోరికను తీరుస్తాను. నా వలన నీకు భయం ఉండదు. (21)
మందపాలేన వై యూయం మమ పూర్వం నివేదితాః ।
వర్జయేః పుత్రకాన్ మహ్యం దహన్ దావమితి స్మ హ ॥ 22
మందపాలుడు అనే ఋషి మీ వృత్తాంతమ్ ముందే నివేదించాడు. "ఖాండవవనదహనంలో నా పుత్రులను విడచిపెట్టుము" అని. (22)
తస్య తద్ వచనం ద్రోణ త్వయా యచ్చేహ భాషితమ్ ।
ఊభయమ్ మే గరీయస్తు బ్రూహి కిం కరవాణి తే ।
భృశమ్ ప్రీతోఽస్మి భద్రం తే బ్రహ్మన్ స్తోత్రేణ సత్తమ ॥ 23
ద్రోణా! నీ తండ్రికిచ్చిన మాటను, నీవు చెప్పిన దానిని విచారిస్తే రెండూ విశిష్టమయినవే. నీకు నేనేం చేయగలవో చెప్పు. నేను మిక్కిలి తృప్తిని పొందాను. నీకు మంగళం అగుగాక. నీ ఈ స్తోత్రంచే మిక్కిలి ప్రసన్నుడను అయ్యాను. (23)
ద్రోణ ఉవాచ
ఇమే మార్జారకాః శుక్ర నిఇత్యముద్వేజయంతి నః ।
ఏతాన్ కురుష్వ దగ్ధాంస్త్వం హుతాశన సబాంధవాన్ ॥ 24
ద్రోణుడు పలికాడు - శుక్ల స్వరూపుడా! అగ్నీ! ఈ పిల్లి పిల్లలు ప్రతినిత్యం మమ్ము బాధిస్తున్నాయి. వీటిని బంధుమిత్రసహితంగా నాశనం చెయ్యి. (24)
వైశంపాయన ఉవాచ
తథా తత్ కృతవానగ్నిః అభ్యనుజ్ఞాయ శార్ ఙ్గకాన్ ।
దదాహ ఖాండవం దావం సమిద్ధో జనమేజయ ॥ 25
వైశంపాయనుడు అన్నాడు - శార్ ఙ్గకముల అనుమతితో అగ్ని అట్లే ఆచరించాడు. అధికంగా ప్రజ్వలించి పూర్తిగా ఖాండవవనాన్ని దహించాడు. (25)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి మయదర్శనపర్వణి శార్ ఙ్గకోపాఖ్యానే ఏకత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 231 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున మయదర్శనపర్వమను
ఉపపర్వమున శార్ ఙ్గకోపాఖ్యానమను రెండువందల ముప్పది యొకటవ అధ్యాయము. (231)