4. నాలుగవ అధ్యాయము

మయ సభా ప్రవేశము.

(వైశంపాయన ఉవాచ
తాం తు కృత్వా సభాం శ్రేష్ఠాం మయశ్చార్జునమబ్రవీత్ ।
వైశంపాయనుడు ఇలా అన్నాడు. మయాసురుడు శ్రేష్ఠమైన ఆ సభను నిర్మించి అర్జునునితో ఈ విధంగా అన్నాడు.
మయ ఉవాచ
ఏషా సభా సవ్యసాచిన్ ధ్వజో హ్యత్ర భవిష్యతి ।
మయుడు అన్నాడు - "సవ్యసాచీ" ఇదియే మీ సభ. ఇక్కడ ఒక జెండా నేను ఉంచుతాను.
భూతానాం చ మహావీర్యః ధ్వజాగ్రే కింకరో గణః ।
తవ విస్ఫారఘోషేణ మేఘవన్నినదిష్యతి ॥
దీనియొక్క అగ్రభాగంలో భూతాలలో కింకర గణం నివాసం ఉంటుంది. నీవు ధనుష్టంకారాన్ని చేసినపుడే ఆ శబ్దంతో పాటు ఈ భూతగణం మేఘాలతో సమానంగా గర్జన చేస్తుంది.
అయం హి సూర్యసంకాశః జ్వలనస్య రథోత్తమః ।
ఇమే చ దివిజాః శ్వేతాః వీర్యవంతో హయోత్తమాః ॥
ఇది సూర్యునితో సమానమైన తేజస్సుతో ప్రకాశించే అగ్నిదేవుని ఉత్తమరథం. అంతేకాదు. ఇవి తెల్లని వర్ణంతో ప్రకాశించే బలిష్ఠమైన దివ్యమైన గుఱ్ఱాలు.
మాయామయః కృతో హ్యేషః ధ్వజో వానరలక్షణః ।
అసజ్జమానో వృక్షేషు ధూమకేతురివోచ్ఛ్రితః ॥
ఈ ధ్వజం వానరచిహ్నంతో ఉన్నది. దీని నిర్మాణం అంతా మాయామయం - ఈ జెండా అగ్నిలా పైకి ఎగురుతూ ఉంటుంది. అడ్డం వచ్చినా చెట్లకు తగుల్కొనదు.
బహువర్ణమ్ హి లక్ష్యేత ధ్వజం వానరలక్షణమ్ ।
ధ్వజోత్కటం హ్యనవమం యుద్ధే ద్రక్ష్యసి విష్ఠితమ్ ॥
ఈ వానరధ్వజం అనేకమైన రంగులతో కనిపిస్తుంది. ఇది యుద్ధంలో ఎప్పుడూ పైకి ఎగురుతూనే ఉంటుంది. ఎపుడూ వంగిపోదు. స్థిరంగా ఉంటుంది.
ఇత్యుక్త్వాఽఽలింగ్య బీభత్సుం విసృష్టః ప్రయయౌ మయః ।)
ఈ విధంగా మయాసురుడు పలికి, అర్జునుని గాఢంగా ఆలింగనం చేసుకొని వెళ్లిపోయాడు.
వైశంపాయన ఉవాచ
తతః ప్రవేశనం తస్యాం చక్రే రాజా యుధిష్ఠిరః ।
అయుతం భోజయిత్వా తు బ్రాహ్మణానాం నరాధిపః ॥ 1
సాజ్యేన పాయసేనైవ మదునా మిశ్రితేన చ ।
కృసరేణాథ జీవన్త్యా హవిష్యేణ చ సర్వశః ॥ 2
భక్ష్యప్రకారైర్వివిధైః ఫలైశ్చాపి తథా నృప ।
చోష్యైశ్చ వివిధై రాజన్ పేయైశ్చ బహువిస్తరైః ॥ 3
వైశంపాయనుడు ఇలా అన్నాడు.
"మహారాజా! ఆ తరువాత ధర్మరాజు నేయి తేనె కలిపిన పులగాన్ని, పాయసాన్ని, జీవంతి అనే శాకాన్ని అనేక భక్ష్యాలతోను, ఫలాలతోను భక్ష భోజ్య చోష్య లేహ్యాది నానావిధపదార్థాలతోను వేయిమంది బ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేసి ఆ మహనీయుడు సభాభవనంలోనికి ప్రవేశించాడు. (1-3)
వి॥సం॥ కృసరము = బియ్యం, నువ్వులు కలిపి వండిన అన్నం.
జీవంతి = పాలకూర
అహతైశ్చైవ వాసోభిః మాల్యైరుచ్చావచైరపి ।
తర్పయామాస విప్రేంద్రాన్ నానాదిగ్భ్యో సమాగతాన్ ॥ 4
నూతనవస్త్రాలతోను, పుష్పహారాలతోను, సత్కరించి అనేక ప్రాంతాల నుండి వచ్చిన బ్రాహ్మణులను ధర్మరాజు సంతృప్తి పరచాడు. (4)
దదౌ తేభ్యః సహస్రాణి గవామ్ ప్రత్యేకశః పునః ।
పుణ్యాహ ఘోషస్తత్రాసీద్ దివస్పృగివ భారత ॥ 5
అనంతరం ప్రత్యేకంగా వచ్చిన బ్రాహ్మణులకు అందరికీ వెయ్యి వెయ్యి చొప్పున గోవులను దానం చేశాడు యుధిష్ఠిరుడు. ఆ సమయంలో, ఆ భవనంలో పుణ్యాహవాచనమంత్రాలు ఆకాశమంటుతున్నట్లు మారుమ్రోగాయి. (5)
వాదిత్రైర్వివిధైర్దివ్యైః గంధైరుచ్చావచైరపి ।
పూజయిత్వా కురుశ్రేష్ఠః దైవతాని నివేశ్య చ ॥ 6
కురుశ్రేష్ఠుడయిన యుధిష్ఠిరుడు అనేక మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే వివిధసుగంధ ద్రవ్యాల పరిమళంతో సభాభవనంలో దేవతలను స్థాపించి పూజించాడు. అనంతరం ఆ భవనంలో ప్రవేశించాడు. (6)
తత్ర మల్లా నటా ఝల్లాః సూతా వైతాళికాస్తథా ।
ఉపతస్థుర్మహాత్మానం ధర్మపుత్రం యుధిష్ఠిరమ్ ॥ 7
అక్కడ ధర్మనందనుడైన యుధిష్ఠిరుని సేవించడానికి మల్లులు, నటులు, ఝల్లులు, సూతులు, వైతాళికులు వచ్చారు. (7)
వి॥సం॥ ఇచ్చట హల్లాః అని పాఠము. నానావిధ వాద్యకుశలాః (లక్షా)
తథా స కృత్వా పూజాం తాం భ్రాతృభిః సహ పాండవః ।
తస్యాం సభాయాం రమ్యాయాం రేమే శక్రో యథా దివి ॥ 8
తనసోదరులతో కూడి పుజాకార్యక్రమం చేసి ధర్మనందనుడైన యుధిష్ఠిరుడు స్వర్గంలో ఇంద్రుడి లాగ ఆ సుందరమయిన సభా భవనంలో విహరించాడు. (8)
సభాయామృషయస్తస్యామ్ పాండవైః సహ ఆసతే ।
ఆసాంచక్రుర్నరేంద్రాశ్చ నానాదేశసమాగతాః ॥ 9
ఋషులు, వారితో పాటు అనేకదేశాల నుంచి వచ్చిన మహారాజులు పాండవులతో కలిసి ఆ సభలో కూర్చున్నారు. (9)
అసితో దేవలః సత్యః సర్పిర్మాలీ మహాశిరాః ।
ఆర్యావసుః సుమిత్రశ్చ మైత్రేయః శునకో బలిః ॥ 10
బకో దాల్భ్యః స్థూలశిరాః కృష్ణద్వైపాయనః శుకః ।
సుమంతుర్జైమినిః పైలః వ్యాసశిష్యాస్తథా వయమ్ ॥ 11
తిత్తిరిర్యాజ్ఞవల్క్యశ్చ ససుతో లోమహర్షణః ।
అప్సుహోమ్యశ్చ ధౌమ్యశ్చ అణీమాండవ్య కౌశికౌ ॥ 12
దామోష్ణీషస్త్రైబలిశ్చ పర్ణాదో ఘటజానుకః ।
మౌంజాయనో వాయుభక్షః పారాశర్యశ్చ సారికః ॥ 13
బలివాకః సినివాకః సత్యపాలః కృతశ్రమః ।
జాతూకర్ణః శిఖావాంశ్చ ఆలంబః పరిజాతకః ॥ 14
పర్వతశ్చ మహాభాగః మార్కండేయో మహామునిః ।
పవిత్రశ్చ మహాభాగః మార్కండేయో మహామునిః ।
పవిత్రపాణిః సావర్ణః భాలుకిర్గాలవస్తథా ॥ 15
జంఘాబంధుశ్చ రైభ్యశ్చ కోపవేగస్తథా భృగుః ।
హరిబభ్రుశ్చ కౌండిన్యః బభ్రుమాలీ సనాతనః ॥ 16
కాక్షీవానౌశిజశ్చైవ నాచికేతోఽథ గౌతమః ।
పైంగ్యో వరాహః శునకః శాండిల్యశ్చ మహాతపాః ॥ 17
కుక్కురో వేణుజంగోఽథ కాలాపః కఠ ఏవ చ ।
మునయో ధర్మవిద్వాంసః ఘృతాత్మానో జితేంద్రియాః ॥ 18
అసితుడు, దేవలుడు, సత్యుడు, సర్పిర్మాలి, మహాశిరుడు, ఆర్యావసుడు, సుమిత్రుడు, మైత్రేయుడు, శునకుడు, బలి, బకుడు, దాల్భ్యుడు, స్థూలశిరుడు, కృష్ణద్వైపాయనుడు, శుకుడు అనేవారూ, వ్యాసుని శిష్యులైన సుమంత పైల జైమినులతో నేనూ, తిత్తిరి, యాజ్ఞ్యవల్క్యుడును, తన కుమారునితో సహా రోమహర్షణుడూ; అప్సుహోమ్యుడు, ధౌమ్యుడు, అణీమాండవ్యుడు, కౌశికుడు, దామోష్ణీషుడు, త్రైబలి, పర్ణాదుడు, ఘటజానుకుడు, మౌంజాయనుడు,
వాయుభక్షుడు, పారాశర్యుడు, సారికుడు, బలివాకుడు, సినివాకుడు, సత్యపాలుడు, కృతశ్రముడు, జాతుకర్ణుడు, శిఖావంతుడు, ఆలంబుడు, పరిజాతకుడు, మహాభాగుడైన పర్వతుడును, మార్కండేయుడు, పవిత్రపాణి, సావర్ణుడు, భలుకి, గాలవుడు, జంఘాబంధుడు, రైభ్యుడు, కోపవేగుడు, భృగుమహర్షి, హరిబభ్రుడు, కౌండిన్యుడు, బభ్రుమాలి, సనాతనుడు, కాక్షీవంతుడు, ఔశిజుడు, నాచికేతుడు, గౌతముడు, పైంగ్యుడు, వరాహుడు, శునకుడు మహాతపస్వి అయిన శాండిల్యుడు, కుక్కురుడు, వేణుజంఘుడు, కాలాపుడు, కఠుడు మొదలగు జితేంద్రియులు, ధర్మవిద్వాంసులు, ధృతాత్ములును అయిన మహర్షులు ఆ సభను అలంకరించారు. (10-18)
ఏతే చాన్యేచ బహవః వేదవేదాంగపారగాః ।
ఉపాసతే మహాత్మానం సభాయామృషిసత్తమాః ॥ 19
వీరితోబాటు వేద వేదాంగ పారంగతులయిన పండితులు, మునిశ్రేష్ఠులు మహాత్ముడైన యుధిష్ఠిరునితోబాటు సభలో కూర్చున్నారు. (19)
కథయంతః కథాః పుణ్యాః ధర్మజ్ఞాః శుచయోఽమలాః ।
తథైవ క్షత్రియశ్రేష్ఠాః ధర్మరాజముపాసతే ॥ 20
ధర్మజ్ఞులు, పవిత్రాత్ములు, నిర్మల హృదయులు అయిన మహర్షులు మహారాజైన ధర్మజునకు పవిత్రమైన కథలను చెప్తున్నారు. ఆయనతో పాటు క్షత్రియశ్రేష్ఠులయిన రాజులు కూడా ధర్మరాజును సేవిస్తున్నారు. (20)
శ్రీమాన్ మహాత్మా ధర్మాత్మా ముంజకేతుర్వివర్ధనః ।
సంగ్రామజిద్ దుర్ముఖశ్చ ఉగ్రసేనశ్చ వీర్యవాన్ ॥ 21
కక్షసేనః క్షితిపతిః క్షేమకశ్చాపరాజితః ।
కాంబోజరాజః కమఠః కంపనశ్చ మహాబలః ॥ 22
సతతం కంపయామాస యవనానేక ఏవ యః ।
బలపౌరుష సంపన్నాన్ కృతాస్త్రానమితౌజసః ॥ 23
మహాత్ముడూ, ధర్మాత్ముడూ, శ్రీమంతుడూ అయిన ముంజకేతుమహారాజు, వివర్ధనుడు, సంగ్రామజిత్తు దుర్ముఖుడు, పరాక్రమవంతుడైన ఉగ్రసేనుడు, కక్షసేన మహారాజు, అపరాజితుడు, క్షేమకుడు, కాంబోజరాజు, కమఠుడు, మహాబలుడైన కంపనుడు ధర్మరాజును సేవిస్తున్నారు. ఆ కంపనుడు బలపౌరుష సంపన్నులు, అస్త్రవేత్తలు, అమితపరాక్రములూ అయిన యువకులను అందరినీ తానొక్కడే నిత్యమూ కంపింపజేసేవాడు. (21-23)
జటాసురో మద్రకాణాం చ రాజా
కుంతిః పులిందశ్చ కిరాతరాజః ।
తథాంగవాంగౌ సహ పుండ్రకేణ
పాండ్యోఢ్రరాజౌ చ సహాంధ్రకేణ ॥ 24
అంగో వంగః సుమిత్రశ్చ శైబ్యశ్చామిత్రకర్శనః ।
కిరాతరాజః సుమనాః యవనాధిపతిస్తథా ॥ 25
చాణూరో దేవరాతశ్చ భోజో భీమరథశ్చ యః ।
శ్రుతాయుధశ్చ కాలింగః జయసేనశ్చ మాగధః ॥ 26
సుకర్మా చేకితానశ్చ పురుశ్చామిత్రకర్శనః ।
కేతుమాన్ వసుదానశ్చ వైదేహోఽథ కృతక్షణః ॥ 27
సుధర్మా చానిరుద్ధశ్చ శ్రుతాయుశ్చ మహాబలః ।
అనూపరాజో దుర్ధర్షాః క్రమజిచ్చ సుదర్శనః ॥ 28
శిశుపాలః సహసుతః కరూషాధిపతిస్తథా ।
వృష్ణీనాం చైవ దుర్ధర్షాః కుమారా దేవరూపిణః ॥ 29
ఆహుకో విపృథుశ్చైవ గదః సారణ ఏవ చ ।
అక్రూరః కృతవర్మా చ సత్యకశ్చ శినేః సుతః ॥ 30
భీష్మకోఽథాకృతిశ్చైవ ద్యుమత్సేనశ్చ వీర్యవాన్ ।
కేకయాంశ్చ మహేష్వాసాః యజ్ఞసేనశ్చ సౌమకిః ॥ 31
కేతుమాన్ వసుమాంశ్చైవ కృతాస్త్రశ్చ మహాబలః ।
ఏతే చాన్యే చ బహవః క్షత్రియా ముఖ్యసమ్మతాః ॥ 32
ఉపాసతే సభాయాం స్మ కుంతీపుత్రం యుధిష్ఠిరమ్ ।
ఇంకా ఆ సభలో
జటాసురుడు, మద్రరాజు శల్యుడు, కుంతిభోజమహారాజు, కిరాతరాజయిన పుళిందుడు, అంగరాజు, వంగరాజు, పుండ్రకుడు, పాండ్యుడు, ఓఢ్రరాజు, ఆంధ్రరాజు, సుమిత్రుడు, శత్రుసంహారకుడైన శైబ్యుడు, కిరాతరాజైన సుమనుడు, యవనదేశాధీశుడు, చాణూరుడు, దేవరాతుడు, భోజుడు, భీమరథుడు, కళింగరాజైన శ్రుతాయుధుడు, మగధ దేశీయుడైన జయసేనుడు, సుకర్ముడు, చేకితానుడు, శత్రుసంహారకుడైన పురుడు, కేతుమంతుడు, వసుదానుడు, విదేహరాజైన కృతక్షణుడు, సుధర్ముడు, అనిరుద్ధుడు, మహాబలాఢ్యుడైన శ్రుతాయువు, దుర్ధర్ష వీరుడైన అనూపరాజు, క్రమజితుడు, సుదర్శనుడు, పుత్రులతో ఉన్న శిశుపాలుడు, కరూషరాజైన దంతవక్ర్తుడు, వృష్ణివంశీయులు దేవతాస్వరూపులు అయిన రాజకుమారులు, ఆహుకుడు, విపృథుడు, గదుడు, సారణుడు, అక్రూరుడు, కృతవర్మ, శినిపుత్రుడయిన సత్యకుడు, బీష్మకుడు, ఆకృతి, పరాక్రమవంతుడైన ద్యుమత్సేనుడు,
ధనుర్ధారులలో గొప్పవాడయిన కేకయరాజకుమారుడు, సోమకునిమనుమడైన ద్రుపదుడు, కేతుమానుడు (రెండవ) మొదలగు మహారాజులు ధర్మరాజును సేవిస్తున్నారు. అంతేకాక అస్త్రవిద్యానిపుణులు, మహాబలాఢ్యులు అయిన వసుమానుడు మొదలయిన ప్రధానక్షత్రియులు అందరు ఆ సభలో కుంతీనందనుడైన యుధిష్ఠిరుని సేవిస్తున్నారు. (24-32 1/2)
అర్జునం యే చ సంశ్రిత్య రాజపుత్రా మహాబలాః ॥ 33
అశిక్షంత ధనుర్వేదం రౌరవాజినవాససః ।
తత్రైవ శిక్షితా రాజన్ కుమారా వృష్ణినందనాః ॥ 34
మహాబలవంతుడు, రాజకుమారుడు అయిన అర్జునుని దగ్గర ఉండి మృగచర్మాంబరధారులు ధనుర్వేదంలో శిక్షణ ఇస్తున్నారు. వీరు కూడా ఆ సభలో ధర్మరాజును సేవిస్తున్నారు. రాజా! వృష్ణివంశరాజకుమారులు ఆనందంగా ఆ శిక్షణలో పాల్గొన్నారు. (33,34)
రౌక్మినేయశ్చ సాంబశ్చ యుయుధానశ్చ సాత్యకిః ।
సుధర్మా చానిరుద్ధశ్చ శైబ్యశ్చ నరపుంగవః ॥ 35
ఏతే చాన్యే చ బహవః రాజానః పృథివీపతే ।
ధనంజయసఖా చాత్ర నిత్యమాస్తే స్మ తుంబురుః ॥ 36
రుక్మిణీ కుమారుడైన ప్రద్యుమ్నుడూ, జాంబవతీ కుమారుడైన సాంబుడూ, సాత్యకి, యుయుధానుడూ, సుధర్ముడూ, అనిరుద్ధుడూ, మానవశ్రేష్ఠుడయిన శైబ్యుడూ, ఇంకా అనేకులైన రాజులూ ఆ సభలో ఉన్నారు. (35,36)
ఉపాసతే మహాత్మానమ్ ఆసీనం సప్తవింశతిః ।
చిత్రసేనః సహామాత్యః గంధర్వాప్సరసస్తథా ॥ 37
మంత్రులతో కూడ చిత్రసేనుడు మొదలయిన ఇరువదియేడుమంది గంధర్వులు, ఇంకను అప్సరసలూ ఆ సభలో ఉండి ధర్మరాజును సేవిస్తున్నారు. (37)
గీతవాదిత్రకుశలాః సామ్యతాలవిశారదాః ।
ప్రమాణేఽథ లయే స్థానే కిన్నరాః కృతనిశ్రమాః ॥ 38
సంచోదితాస్తుంబురుణా గంధర్వసహితాస్తదా ।
గాయంతి దివ్యతానైస్తే యథాన్యాయం మనస్వినః ।
పాండుపుత్రానృషీంశ్చైవ రమయంత ఉపాసతే ॥ 39
గీతవాద్య నిపుణులయిన సంగీతజ్ఞులు, తాలజ్ఞాన పండితులును లయ, స్థానపరిజ్ఞానంతో సంగీతకళలో విశేషంగా పరిశ్రమచేసిన గాయకులు కిన్నర తుంబురుల ఆజ్ఞానువర్తులై ఉన్నారు. వారితో పాటు ఇతరగంధర్వులు కూడా తగినరీతిలో గానంచేస్తూ మహర్షులందరికీ ఆనందాన్ని కల్గిస్తున్నారు. ఆ విధంగా వారందరు ధర్మరాజును ఆ సభలో సేవిస్తున్నారు. (38,39)
తస్యాం సభాయామాసీనాః సువ్రతాః సత్యసంగరాః ।
దివీవ దేవా బ్రహ్మాణం యుధిష్ఠిరముపాసతే ॥ 40
దేవతలందరూ బ్రహ్మదేవుని సేవించినట్లు ఆ సభలో సత్యప్రతిజ్ఞులు, సువ్రతులు అయిన మహాపురుషులు ధర్మరాజును సేవిస్తున్నారు. (40)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి సభాక్రియాపర్వణి సభాప్రవేశో నామ చతుర్థోఽధ్యాయః ॥ 4 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున సభాక్రియాపర్వమను
ఉపపర్వమున సభాప్రవేశమను నాల్గవ అధ్యాయము. (4)
(ధాక్షిణాత్య అధిక పాఠము 5 శ్లోకములు కలిపి మొత్తం 45 శ్లోకములు)