5. అయిదవ అధ్యాయము

(లోకపాల సభాఖ్యాన పర్వము)

నారదుడు ధర్మరాజుకు ప్రశ్నరూపమున రాజ్యపాలనమును బోధించుట.

వైశంపాయన ఉవాచ
అథ తత్రోపవిష్టేషు పాండవేషు మహాత్మసు ।
మహత్సు చోపవిష్టేషు గంధర్వేషు చ భారత ॥ 1
వైశంపాయనుడు అన్నాడు.
'మహారాజా! ఒకరోజున ఆ సభలో మహాత్ములైన పాండవులు, ఇతర మహాపురుషులూ, గందర్వులూ అందరూ కూర్చొని ఉన్నారు. (1)
వేదోపనిషదాం వేత్తా ఋషిః సురగణార్చితః ।
ఇతిహాసపురాణజ్ఞః పురాకల్పవిశేషవిత్ ॥ 2
న్యాయవిద్ ధర్మతత్త్వజ్ఞః షడంగవిదనుత్తమః ।
ఐక్యసంయోగనానాత్వ సమవాయవిశారదః ॥ 3
వక్తా ప్రగల్భో మేధావీ స్మృతిమాన్ నయవిత్ కవిః ।
పరాపరవిభాగజ్ఞః ప్రమాణకృతనిశ్చయః ॥ 4
పంచావయవయుక్తస్య వాక్యస్య గునదోషవిత్ ।
ఉత్తరోత్తరవక్తా చ వదతోఽపి బృహస్పతేః ॥ 5
ధర్మకామార్థమోక్షేషు యథావత్ కృతనిశ్చయః ।
తథా భువనకోశస్య సర్వస్యాస్యమహామతిః ॥ 6
ప్రత్యక్షదర్శీ లోకస్య తిర్యగూర్ధ్వమధస్తథా ।
సాంఖ్యయోగవిభాగజ్ఞః నిర్వివిత్సుః సురాసురాన్ ॥ 7
సంధి విగ్రహతత్వజ్ఞస్త్వనుమానవిభాగవిత్ ।
షాణ్గుణ్యవిధియుక్తశ్చ సర్వశాస్త్రవిశారదః ॥ 8
యుద్ధగాంధర్వసేవీ చ సర్వత్రాప్రతిఘస్తథా ।
ఏతైశ్చాన్యైశ్చ బహుభిః యుక్తో గుణగణైర్మునిః ॥ 9
లోకాననుచరన్ సర్వాన్ ఆగమత్ తాం సభాం నృప ।
నారదః సుమహాతేజాః ఋషిభిః సహితస్తదా ॥ 10
పారిజాతేన రాజేంద్ర పర్వతేన చ ధీమతా ।
సుముఖేన చ సౌమ్యేన దేవర్షిరమితద్యుతిః ॥ 11
సభాస్థాన్ పాండవాన్ ద్రష్టుం ప్రీయమాణో మనోజవః ।
జయాశీర్భిస్తు తం విప్రః ధర్మరాజానమార్చయత్ ॥ 12
అపుడు నారదుడు అక్కడకు వచ్చాడు. అతడు వేదాలు, ఉపనిషత్తులు పూర్తిగ తెలిసియున్న జ్ఞాని, దేవతలందరి చేత పూజింపబడేవాడు. ఇతిహాసాలూ పురాణాలూ తెలిసినవాడు, పూర్వకల్పవిశేషాలు ఎరిగినవాడు. ధర్మజ్ఞుడు. న్యాయవేత్త. శిక్షా, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందములు, జ్యోతిషము ఎరిగినవాడు. ఐక్య సంయోగ, వియోగ, నానాత్వ, సమవాయాలలో విశారదుడు. మహావక్త. ప్రగల్భుడును, మేధావి. స్మరణశక్తిమంతుడు, నీతిశాస్త్ర విశారదుడు, త్రికాలదర్శియును, పరాపర విభాగం తెలిసినవాడు, ప్రమాణపూర్వకంగా సిద్ధాంతాన్ని నిశ్చయించేవాడు. ప్రతిజ్ఞా, హేతు, ఉదాహరణ, ఉపనయ, నిగమములు అనే పంచావయవాలతో కూడిన వాక్యాలలోని గుణ దోషాలు తెలిసినవాడును, బృహస్పతి వంటి మహావక్తలకు సాటిగా ఉత్తరప్రత్యుత్తరములను ఇవ్వటంలో సమర్ధుడు, ధర్మ అర్థ కామ మోక్షాలు అనే నాల్గుపురుషార్థాల పరస్పర సంబంధం యథార్థంగా తెలిసినవాడును, ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాల యొక్క పరిష్కృత సిద్ధాంతం కలవాడు. ఈ పదునాల్గులోకాలలో సమస్తాన్ని ప్రత్యక్షంగా దర్శింపగల సమర్థుడు, మహాబుద్ధిశాలి, సాంఖ్యయోగ విభాగాలను తెలిసినవాడు. దేవాదురులలో ప్రసిద్ధికెక్కిన వైరాగ్యం కలవాడు. సంధి విగ్రహ తత్త్వజ్ఞుడు. స్వపర పక్షాలలోని బలాబలాలను సులభంగా అంచనా వేసి శత్రు పక్షాన్ని తన పక్షానికి త్రిప్పుకొనే నేర్పు గలిగినవాడు. రాజనీతిలో షడంగాలను ఉపయోగించడంలో నేర్పుగలవాడు, సమస్త శాస్త్రాలు తెలిసిన పండితుడు. విద్వాంసుడు. యుద్ధవిద్యలోలాగ సంగీతంలో గూడా కుశలుడు, ఏ మాత్రం కోపం ఎరుగనివాడు. ఇంకా అసంఖ్యాకసద్గుణాలతో కూడిన మననశీలుడు, పరమ తేజశ్శాలి. అన్ని లోకాలలో సంచరించేవాడు. నారదమహర్షి పారిజాతుడు, బుద్ధిశాలియయిన పర్వతుడు, సౌమ్యుడు, సుముఖుడు మొదలగు అనేక మహర్షులతో కూడి ప్రేమపూర్వకంగా పాండవులను కలుసుకోవాలని మనోవేగంతో ఆ ధర్మరాజు యొక్క సభకు వచ్చి జయసూచకమైన ఆశీర్వచనాల ద్వారా ధర్మరాజును ధర్మరాజును గౌరవించాడు. (2-12)
తమాగతమృషిం దృష్ట్వా నారదం సర్వధర్మవిత్ ।
సహసా పాండవశ్రేష్ఠః ప్రత్యుత్థాయానుజైః సహ ॥ 13
అభ్యవాదయత ప్రీత్యా వినయావనతస్తదా ।
తదర్హమాసనం తస్మై సంప్రదాయ యథావిధి ॥ 14
గాం చైవ మధుపర్కం చ సంప్రదాయార్ఘ్యమేవ చ ।
అర్చయామాస రత్నైశ్చ సర్వకామైశ్చ ధర్మవిత్ ॥ 15
వచ్చిన నారదమహర్షికి సర్వధర్మాలను పూర్తిగా తెలిసిన పాండవశ్రేష్ఠుడు యుధిష్ఠిరుడు తన సోదరులతో సహా సింహాసనం నుండి లేచి ప్రేమతోను, వినయంతోను నమస్కారం చేశాడు. ఆ మహనీయుడికి ఉచితాసనాన్ని చూపించి కూర్చుండబట్టి ఆ ధర్మరాజు నారదమహర్షికి గోవులను, మధుపర్కాన్ని బహూకరించి సంప్రదాయబద్ధంగా అర్ఘ్యపాద్యాదులను సమర్పించి, రత్నాలతో శాస్త్రోక్తంగా పూజించి సంతోషపరచాడు. (13-15)
తుతోష చ యథావచ్చ పూజాం ప్రాప్య యుధిష్ఠిరాత్ ।
సోఽర్చితః పాండవైః సర్వైః మహర్షిర్వేదపారగః ।
ధర్మకామార్థసంయుక్తం పప్రచ్ఛేదం యుధిష్ఠిరమ్ ॥ 16
మహారాజు ధర్మజుడు చేసిన ఈ యథోచిత స్వాగత సత్కారానికి నారదమహర్షి చాలా సంతోషించాడు.
ఈ విధంగా పాండవులు పూజించిన తరువాత ధర్మ, అర్థ, కామాలను దృష్టిలో పెట్టుకొని నారదుడు, ధర్మరాజును, ఇలా అడిగాడు. (16)
నారద ఉవాచ
కచ్చిదర్థాశ్చ కల్పంతే ధర్మే చ రమతే మనః ।
సుఖాని చానుభూయంతే మనశ్చ న విహన్యతే ॥ 17
నారదుడు ప్రశ్నిస్తున్నాడు.
ధర్మరాజా! నీ ధనం యజ్ఞాలకు, దానధర్మాలకూ, కుటుంబరక్షణకు, ఇతర సత్కార్యాలకు ఉపయోగిస్తున్నావా? నీ మనస్సు విక్షేపం లేకుండా సుప్రతిష్ఠితమై ఉంటోందా? సుఖసంతోషాలు పొందుతున్నావా? (17)
కచ్చిదాచరితం పూర్వైః నరదేవపితామహైః ।
వర్తసే వృత్తిమక్షుద్రాం ధర్మార్థసహితాం త్రిషు ॥ 18
మీ వంశంలో పుట్టిన రాజశ్రేష్ఠుల నుండి పరంపరంగా సంప్రాప్తమవుతున్న ధర్మసహితమయిన వృత్తిని అవలంబించి ధర్మార్థకామాలు ఒకదానినొకటి బాధింపకుండ సముచిత సమయాల్లో వాటిని సేవిస్తూ సుఖిస్తున్నావా? (18)
కచ్చిదర్థేన వా ధర్మం ధర్మేణార్థమథాపి వా ।
ఉభౌ వా ప్రీతిసారేణ న కామేన ప్రబాధసే ॥ 19
అర్థం వలన ధర్మం గాని, ధర్మం వల్ల అర్థం గాని, ప్రీతిసారమయిన కామంచేత ఈ రెండూ గాని బాధింపబడటం లేదు గదా! (19)
కచ్చిదర్థం చ ధర్మం చ కామం చ జయతాం వర ।
విభజ్య కాలే కాలజ్ఞః సదా వరద సేవసే ॥ 20
ధర్మ అర్థ కామ మోక్షాలు కాలజ్ఞుడవై కాలవిభజన చేసి సేవిస్తున్నావా? (20)
వి॥సం॥ ఉదయం ధర్మ మాచరించాలి. మధ్యాహ్నం అర్థం ఆర్జించాలి. సాయంకాలం కామ మాచరించాలి. అని దక్షస్మృతి త్రివర్గానికి కాలవిభాగం చేసింది. (నీల)
కచ్చిద్ రాజగుణైః షడ్భిః సప్తోపాయాంస్తథానఘ ।
బలాబలం తథా సమ్యక్ చతుర్దశ పరీక్షసే ॥ 21
అనఘా! వక్తృత్వం, ప్రాగల్భ్యం, మేధ, పూర్వ-ఉత్తర వచనాల స్మరణం, నీతి విజ్ఞానం, విచక్షణత్వం అనే ఆరు రాజగుణాలతోను కూడి, ధర్మాన్ని పరిశీలిస్తూ సామ దాన భేద దండాలు, మంత్రం, ఔషధం, ఇంద్రజాలం అనే ఏడు ఉపాయాలను తగినరీతి ఉపయోగిస్తూ బలాబలాలను పరీక్షిస్తున్నావా? (21)
వి॥సం॥ సామం, దానం, భేదం, దండం, ఉపేక్ష, మాయ, ఇంద్రజాలం ఇవి సప్త ఉపాయములు. (దేవ)
కచ్చిదాత్మానమన్వీక్ష్య పరాంశ్చ జయతాం వర ।
తథా సంధాయ కర్మాణి అష్టౌ భారత సేవసే ॥ 22
విజేతలలో శ్రేష్ఠుడా! యుధిష్ఠిరా! నీ శక్తిని, శత్రువుల శక్తిని బాగుగా పరిశీలించి, శత్రువు బలిష్ఠుడయితే అతనితో సంధి కుదుర్చుకొనడానికి ప్రయత్నిస్తున్నావా? నీ కోశాగారాన్నీ ధనాన్నీ పెంచుకోవడానికి అష్టకర్మలయిన వ్యవసాయమ్, వ్యాపారం, యుద్ధం, సేతువు, గజబంధనం, గనులలో రాజాదాయం పొందటం, బంగారు గనులను వెదికించటం అనే ఎనిమిందింటిని నడిపిస్తున్నావా? (22)
వి॥సం॥ మంత్రరక్షణంతోపాటు కర్మ రక్షణం కూడా అవసరం. (నీల)
కచ్చిత్ ప్రకృతయః సప్త న లుప్తా భరతర్షభ ।
ఆఢ్యాస్తథా వ్యసనినః స్వనురక్తాశ్చ సర్వశః ॥ 23
భరతవంశోత్తమా! దుర్గాధ్యక్షుడు, బలాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు, సేనాపతి, పురోహితుడు, వైద్యుడు, జ్యోతిషుడు అనే ఏడుగురు నీ యందే అనురక్తులై ఉన్నారు గదా? మోసగాండ్రయిన దూతలకు లోబడటం లేదు గదా! (23)
కచ్చిన్న కృతకైర్దూతైః యే చాప్యపరిశంకితాః ।
త్వత్తో వా తవ చామాత్యైః భిద్యతే మంత్రితం తథా ॥ 24
ఏ మాత్రం శంకింపరాని కపటులైన దూతలు నీ నుండి కాని, నీ మంత్రుల నుండి కాని నీ రహస్యాలోచనలను బయటపెట్టడం లెదు గదా! (24)
మిత్రోదాసీనశత్రూణాం కచ్చిద్ వేత్సి చికీర్షితమ్ ।
కచ్చిత్ సంధిం యథాకాలం విగ్రహం చోపసేవసే ॥ 25
నీ మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు మొదలగు వారి విషయంలో వారు ఎప్పుడు ఏమిచేస్తున్నారో తెలుసు కొంటున్నావా? తగిన సమయంలో సరిగా ఆలోచించి సంధి చేసుకోవడం, లేదా యుద్ధానికి సిద్ధపడటం చేస్తున్నావా? (25)
కచ్చిద్ వృత్తిముదాసీనే మద్యమే చానుమన్యసే ।
కచ్చిదాత్మసమా వృద్ధాః శుద్ధాః సంబోధనక్షమాః ॥ 26
కులీనాశ్చానురక్తాశ్చ కృతాస్తే వీర మంత్రిణః ।
విజయో మంత్రమూలో హి రాజ్ఞో భవతి భారత ॥ 27
వీరవరా! ఉదాసీనులయందుగాని, మధ్యముల యందు కాని ఏదయినా ప్రవర్తనను అనుమానిస్తున్నావా?
నీతో సమానులు, వృద్ధులు, నిష్కల్మషహృదయులు, అన్ని విషయాలలో చక్కగా చెప్ప గల సమర్థులు, ఉత్తమకుల సంజాతులు, నీయందు అనురాగం గలవారు. వీరిని రాజకార్యాల్ని నడపటానికి మంత్రులుగా నియోగిస్తున్నావా?
రాజు యొక్క విజయం వారి ఆలోచన మిద ఆధారపడి ఉంటుంది. (26,27)
కచ్చిత్ సంవృతమంత్రైస్తైః అమాత్యైః శాస్త్రకోవిదైః ।
రాష్ట్రం సురక్షితం తాత శత్రుభిర్న విలుప్యతే ॥ 28
సమాలోచనలను రహస్యంగా దాచగలిగిన శాస్త్రపరిజ్ఞానం కల మంత్రుల ద్వారా మాత్రమే రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. అలా ఉంటోందా? అట్టి రాజ్యాన్ని శత్రువులు ఎన్నటికీ నాశనం చేయలేరు. (28)
కచ్చిన్నిద్రావశమ్ నైషి కచ్చిత్ కాలే విబుద్ధ్యసే ।
కచ్చిచ్చాపరరాత్రేషు చింతయస్యర్థమర్థవిత్ ॥ 29
నీవు అకాలంలో నిద్రావశుడవు అగుట లేదుగదా. సమయానికి లేస్తున్నావా? అర్థశాస్త్రాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తున్నావు కదా! రాత్రిళ్లు అపరభాగంలో మేల్కొని కర్తవ్యం గురించి ఆలోచిస్తున్నావా? (29)
వి॥సం॥ బ్రాహ్మీముహూర్తంలో లేచి ఆత్మహితాన్ని గురించి ఆలోచించాలి. (నీల)
కచ్చిన్మంత్రయసే నైకః కచ్చిన్న బహుభిః సహ ।
కచ్చిత్ తే మంత్రితో మంత్రః న రాష్ట్రం పరిధావతి ॥ 30
ముఖ్య రాజకార్యాలను నీవు ఒక్కడివే ఆలోచించటం లేదు గదా? ఎప్పుడూ రహస్యం ఇద్దరిమద్యలోనే ఉండాలి గదా! అదే విధంగా తలిసీ తెలియని అనేకులతో కూడా రహస్య- విషయాల్ని ఆలోచించటం లేదు గదా? నీవు ఆలోచించిన రహస్యం నీ రాజ్యాన్ని అతిక్రమించి శత్రురాజ్యానికి పోవటం లేదు గదా? (30)
కచ్చిదర్థాన్ వినిశ్చిత్య లఘుమూలాన్ మహోదయాన్ ।
క్షిప్రమారభసే కర్తుం న విఘ్నయసి తాదృశాన్ ॥ 31
హితులైన మంత్రులతో ఆలోచన చేసి అల్పప్రయత్నంతొ విశేషఫలాన్ని పొందదగిన కార్యాలను ఆలస్యం చేయక వెంటనే ప్రారంభిస్తున్నావా? అటువంటి కార్యాలకు ఆటంకమ్ కల్గించటం లేదు కదా? (31)
కచ్చిన్న సర్వే కర్మాంతాః పరోక్షాస్తే విశంకితాః ।
సర్వే వా పునరుత్సృష్టాః సంసృష్టం చాత్రకారణమ్ ॥ 32
నీ రాజ్యంలో రైతులు, కర్షకులు మొదలయిన శ్రమజీవులు అందరూ నీకు అజ్ఞాతులుగా లేరు గదా! వారి కార్యాల్లో నీ దృష్టిని ప్రసరిస్తున్నావు కదా? వారు నీకు విశ్వాసపాత్రులే కదా! ఒకసారి విడచిపెట్టి, మళ్ళీ గ్రహించిన వారేనా అందరు? (మళ్లీ సేవలో తీసుకున్నావంటే వారు నిష్కల్మషులని భావం) (32)
ఆప్తైరలుబ్ధైః క్రమికైః తే చ కచ్చిదనుష్ఠితాః ।
కచ్చిద్ రాజన్ కృతాన్యేవ కృతప్రాయాణి వా పునః ॥ 33
ఆప్తులూ, లోభరహితులూ, వంశక్రమంగా సేవిస్తున్నవారు కృషి నిర్వహణ చేస్తున్నారా? రాజా! వారిచేత చేయింపబడినా చాలు. వారు విశ్వాస్యులై రహస్యరక్షణ చేస్తారు. (33)
కచ్చిద్ కారణికా ధర్మే సర్వశాస్త్రేషు కోవిదాః ।
కారయంతి కుమారాశ్చ యోధముఖ్యాంశ్చ సర్వశః ॥ 34
ధర్మజ్ఞులు, సంపూర్ణశాస్త్రమర్మజ్ఞులు అయిన విద్వాంసులను రాజకుమారులకుగాని, ముఖ్యులైన యోధులకుగాని శిక్షణ ఇవ్వటానికి నియమించావా? (34)
వి॥సం॥ కారణికాః = కారణమనగా జ్ఞాపకం (తెలియజెప్పడం) శిష్యులకు బోధించేవారు. కృప, ద్రోణాదులు బోధన చేయిస్తారు కూడా. (నీల)
కచ్చిత్ సహస్రైర్మూర్ఖాణామ్ ఏకం క్రీణాసి పండితమ్ ।
పండితోహ్యర్థకృచ్ఛ్రేషు కుర్యాన్నిః శ్రేయసం పరమ్ ॥ 35
నీవు వేయిమంది మూర్ఖులను తీసుకొనడం కంటె ఒక్కపండితుని తీసుకుంటే సరిపోతుంది కదా. కష్టసమయాలలో పండితుడు ఒక్కడే రాజ్యానికీ రాజుకూ శుభాన్ని కలిగిస్తాడు. (35)
కచ్చిద్ దుర్గాణి సర్వాణి ధనధాన్యాయుధోదకైః ।
యంత్రైశ్చ పరిపూర్ణాని తథా శిల్పిధనుర్ధరైః ॥ 36
నీ కోటలన్నీ, ఇంకా ధనధాన్యాలు, అస్త్రశస్త్రాలు, ఉదకస్థానాలు, యంత్రాలు, శిల్పులు ధనుర్థారులైన సైనికులు, అందరూ ఎట్టిలోటు లేకుండా పరిపూర్ణంగా ఉన్నారా? (36)
ఏకోఽప్యమాత్యో మేధావీ శూరో దాంతో విచక్షణః ।
రాజానం రాజపుత్రం వా ప్రాపయేన్మహతీం శ్రియమ్ ॥ 37
మేధావీ, శూరుడూ, ఇంద్రియ నిగ్రహం కలవాడూ విచక్షణజ్ఞానమూ గల మంత్రి ఒక్కడయినా రాజునకుగాని, రాజపుత్రునకు గాని గొప్పసంపదను కల్గించగలడు. (37)
కచ్చిదష్టాదశాన్యేషు స్వపక్షే దశపంచ చ ।
త్రిభిస్త్రిభిరవిజ్ఞాతైః వేత్సి తీర్థాని చారకైః ॥ 38
ఒక్కొక్క ప్రదేశంలో, తీర్థంలో ముగ్గురు ముగ్గురు చొప్పున ఒకరినొకరు తెలియకుండా శత్రుపక్షంలోని పద్దెనిమిదిమంది మీద నీపక్షంలో పదిహేనుమంది మీద గూఢచారులను నియమించావా? (38)
వి॥సం॥ ఆ తీర్థాలు పదునెనిమిది (18): 1) మంత్రి 2) పురోహితుడు 3) యువరాజు 4) చమూపతి 5) ద్వారపాలుడు 6) అంతర్వేశికుడు 7) కారాగారాధిపతి 8) ద్రవ్యసంచయకర్త 9) వినియోజకుడు 10) ప్రదేష్ట 11) నగరాధ్యక్షుడు 12) కార్యనిర్మాణకర్త 13) ధర్మాధ్యక్షుడు 14) సభాధ్యక్షుడు 15) దండపాలకుడు 16) దుర్గపాలకుడు 17) రాష్ట్రాంత పాలకుడు 18) అటవీపాలకుడు - తీర్థాలంటే ఈ పదునెనిమిది మంది. వీరిమీద గూఢచారులను నియోగించాలి. ఒక్కొక్కరి మీద ముగ్గురు ముగ్గురు చొప్పున నియోగించాలి. వారిలో ఒకరినొకరు తెలియకూడదు - ఇది శత్రుపక్షంలో పద్ధతి. తన రాజ్యంలో ఈ ముగ్గురి మీద చారవ్యవస్థ ఉండకూడదు. వారు 1) మంత్రి 2)యువరాజు 3)పురోహితుడు - ఇలా చారుల నుండి రాజు సమాచారం సేకరించాలని నీతిశాస్త్రం. (నీల)
కచ్చిద్ ద్విషామవిదితః ప్రతిపన్నశ్చ సర్వదా ।
నిత్యయుక్తో రిపూన్ సర్వాన్ వీక్షసే రిపుసూదన ॥ 39
శత్రుసూదనుడా! నీవు శత్రువుల నుండి అజ్ఞాతంగా ఉంటూ నిత్యమూ జాగరూకుడవై ఉంటూ వాళ్ల కదలికలను, చేష్టలను ఒక కంటితో కనిపెట్టి చూస్తున్నావా? (39)
కచ్చిద్ వినయసంపన్నః కులపుత్రో బహుశ్రుతః ।
అనసూయురనుప్రష్టా సత్కృతస్తే పురోహితః ॥ 40
వినయశీలుడు, సత్కులమందు జన్మించినవాడూ, పండితుడూ, విద్వాంసుడూ, అసూయలేనివాడూ, శాస్త్రచర్చలో నేర్పుగలవాడూ అయి నీ పురోహితుడు నీ చేత సత్కరింపబడుతున్నాడా? (40)
వి॥సం॥ వినయః = శాస్త్రజ్ఞానం కలవాడు (దేవ)
కచ్చిదగ్నిషు తే యుక్తః విధిజ్ఞో మతిమానృజుః ।
హుతం చ హోష్యమాణం చ కాలే వేదయతే సదా ॥ 41
నీవు చేసే యజ్ఞములందు యాజ్ఞికుడుగా నియోగింపబడిన బ్రాహ్మణుడు శాస్త్రజ్ఞానం కలవాడేనా? బుద్ధిమంతుడై ఋజువర్తనుడై, హుతాన్ని గురించి హోమము చేయుచున్న దానిని గురించి తగిన సమయాల్లో నీకు తెలియజేస్తున్నాడా? (41)
కచ్చిదంగేషు నిష్ణాతః జ్యోతిషః ప్రతిపాదకః ।
ఉత్పాతేషు చ సర్వేషు దైవజ్ఞః కుశలస్తవ ॥ 42
నిన్ను ఆశ్రయించిన దైవజ్ఞుడు జ్యోతిష శాస్త్రంలో సంపూర్నపాండిత్యం గలవాడై గ్రహచారాలను పరిశీలించి శుభాశుభాలను చక్కగా చెప్పటంలో నేర్పరిగా ఉన్నాడా? (42)
కచ్చిన్ముఖ్యా మహత్స్వేవ మద్యమేషు చ మధ్యమాః ।
జఘన్యాశ్చ జఘన్యేషు భృత్యాః కర్మసు యోజితాః ॥ 43
సేవకులను ఉత్తములని, మధ్యములని అధములని విభజించి ఉత్తములకు ఉత్తమకార్యాలను, మధ్యములకు మధ్యమకార్యాలను అధములకు అల్పకార్యాలను వారి వారికి తగినట్లు నియోగిస్తున్నావా? (43)
అమాత్యానుపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్ ।
శ్రేష్ఠాన్ శ్రేష్ఠేషు కచ్చిత్ త్వం నియోజయసి కర్మసు ॥ 44
ధర్మార్ధకామాల్లో పరీక్షలు దాటి పవిత్రులై, వంశపారంపర్యంగా వస్తున్న ఉత్తమోత్తములనే ఉత్తమకార్యాల్లో నియోగిస్తున్నావు కదా! (44)
వి॥సం॥ ఉపధాతీతాన్ = పరీక్షను దాటిపోయిన పవిత్రులు. (దేవ)
కచ్చిన్నోగ్రేణ దండేన భృశముద్విజసే ప్రజాః ।
రాష్ట్రం తవానుశాసంతి మంత్రిణో భరతర్షభ ॥ 45
భరతశ్రేష్ఠా! కఠినశిక్షలతో నీవు ప్రజలను బాధించటం లేదుగదా! మంత్రులందరూ నీ రాజ్యాన్ని న్యాయపూర్వకంగా నిర్వహిస్తున్నారా? (45)
కచ్చిత్ త్వాం నావజానంతి యాజకాః పతితం యథా ।
ఉగ్రప్రతిగ్రహీతారం కామయానమివ స్త్రియః ॥ 46
కామచారుడైన పురుషుని స్త్రీలు పరిత్యజించినట్లుగా, పతితుడైన యజమానిని యాజకులు విడిచిపెట్టినట్లుగా ఉగ్రమైన శిక్షలను విధించిన రాజును ప్రజలు అవమానిస్తారు. అలా నిన్ను ప్రజలు అవమానించటం లేదు కదా! (46)
కచ్చిద్ ధృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచః ।
కులీనశ్చానురక్తశ్చ దక్షః సేనాపతిస్తథా ॥ 47
నీ సేనాపతి కులీనుడై ధైర్యశాలిగాను, పరాక్రమవంతుడు గాను, బుద్ధిశాలిగాను, సంతోషంతోను, ఉత్సాహంతోను, నీ యందు అనురాగంతోను ఉండి నేర్పరిగా ఉంటున్నాడా? (47)
కచ్చిద్ బలస్య తే ముఖ్యాః సర్వయుద్ధవిశారదాః ।
ధృష్టావదాతా విక్రాంతాః త్వయా సత్కృత్య మానితాః ॥ 48
నీ సైన్యంలో ప్రధానులైన దళపతులు నిర్భీకులై యుద్ధ విశారదులై, నిష్కపటులై, పరాక్రమవంతులై ఉన్నారా? యథోచిత సత్కారాలు చేసి వారిని గౌరవించి తృప్తిని కలిగిస్తున్నావా? (48)
కచ్చిద్ బలస్య భక్తం చ వేతనం చ యథోచితమ్ ।
సంప్రాప్తకాలే దాతవ్యం దదాసి న వికర్షసి ॥ 49
నీ సైన్యానికి యథోచితంగా భోజనసదుపాయం, వేతనం సకాలానికి అందేటట్లు చేస్తున్నావా? వారి వేతనాలను ఆలస్యం కాకుండా, తక్కువ కాకుండా అందజేస్తున్నావా? (49)
కాలాతిక్రమణాదేతే భక్తవేతనయోర్భృతాః ।
భర్తుః కుప్యంతి యద్ భృత్యాః సోఽనర్థః సుమహాన్ స్మృతః ॥ 50
భోజన విషయంలో గాని, వేతన విషయంలో గాణి ఆలస్యం జరిగితే సేవకులు స్వామి యందు కోపిస్తారు. ఆ కోపం వల్ల రాజుకు ఎన్నో అనర్థాలు కలుగుతాయి. (50)
కచ్చిత్ సర్వేఽనురక్తాస్త్వాం కులపుత్రాః ప్రధానతః ।
కచ్చిత్ ప్రాణాంస్తవార్థేషు సంత్యజంతి సదా యుధి ॥ 51
ఉత్తమ కులంలొ జన్మించినట్టి నీ మంత్రులు, ఇతర అధికారులు అందరూ నీ యందు ప్రేమతో అవసరమైతే యుద్ధంలో ప్రాణాలయినా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? (51)
కచ్చిన్నైకో బహూనర్థాన్ సర్వశః సాంపరాయికాన్ ।
అనుశాస్తి యథాకామం కామాత్మా శాసనాతిగః ॥ 52
యుద్ధసాధనాలను పుర్తిగా తనొక్కడి అదుపులోనే నిలుపుకొని నీ శాసనాలను ఉల్లంఘిస్తూ స్వేచ్ఛగా సంచరించేవాడు ఎవ్వడూ నీ సేవకులలో లేడు గదా! (52)
కచ్చిత్ పురుషకారేణ పురుషః కర్మ శోభయన్ ।
లభతే మానమధికం భూయో వా భక్తవేతనమ్ ॥ 53
నీ సేవకులెవరయినా పురుషప్రయత్నంతో కార్యాలు చక్కగా నిర్వహిస్తూ ఉంటే వారికి అధికమర్యాద, వేతనమూ ఇచ్చి గౌరవిస్తున్నావా? (53)
కచ్చిద్ విద్యావినీతాంశ్చ నరాన్ జ్ఞానవిశారదాన్ ।
యథార్హం గుణతశ్చైవ దానేనాభ్యుపపద్యసే ॥ 54
విద్యా వినయసంపన్నులయిన మహానుభావులను వారి వారి అర్హతలను బట్టి దానాదులతో సత్కరిస్తున్నావా? (54)
కచ్చిద్ దారాన్మనుష్యాణాం తవార్థే మృత్యుమీయుషామ్ ।
వ్యసనం చాభ్యుపేతానాం బిభర్షి భరతర్షభ ॥ 55
భరతశ్రేష్ఠా! నీ మేలుకోరి నీ కోసం ప్రాణాలు అర్పించిన వారి భార్యాపుత్రులకు గాని, నీ మేలుకోసం సేవచేసి కష్టాలలో ఉన్న కుటుంబాలకు గాని రక్షణగా ఉంటూ వారి కష్టాలను తీరుస్తున్నావు గదా! (55)
కచ్చిద్ భయాదుపగతం క్షీణం వా రిపుమాగతమ్ ।
యుద్ధే వా విజితం పార్థ పుత్రవత్ పరిరక్షసి ॥ 56
నీ వల్ల భయపడిగాని, ధనసాధనసంపత్తి నశించి నిన్ను ఆశ్రయించిన వారిని గాని, వారికి శరణు ఇచ్చి ఆదుకొంటున్నావా? యుద్ధంలో నీతో ఓడిపోయిన వారిని నీ పుత్రుల వలె భావించి వారిని కాపాడుతున్నావా? (56)
కచ్చిత్ త్వమేవ సర్వస్యాః పృథివ్యాః పృథివీపతే ।
సమశ్చానభిశంక్యశ్చ యథా మాతా యథా పితా ॥ 57
రాజా! ఈ సమస్త భూమండల ప్రజల యందు సమదృష్టితో ఆర్జవంతో ఉంటూ వారిని అందరినీ తల్లిదండ్రులు బిడ్డలను రక్షించినట్లుగా రక్షిస్తున్నావా? (57)
కచ్చిద్ వ్యసనినం శత్రుం నిశమ్య భరతర్షభ ।
అభియాసి జవేనైవ సమీక్ష్య త్రివిధం బలమ్ ॥ 58
భరతకులశ్రేష్ఠా! నీ శత్రువు స్త్రీ, జూదం, మొదలయిన వ్యసనాలతో చిక్కుకొని కష్టాలలో చిక్కుకొన్నాడని తెలిస్తే అతనిపై త్రివిధబలాలైన మంత్ర, కోశ, సైనికబలాలను ప్రయోగించి అమితవేగంతో పరాక్రమించి అతని రాజ్యాన్ని ఆక్రమించుకొంటున్నావా? (58)
యాత్రామారభసే దిష్ట్యా ప్రాప్తకాలమరిందమ ।
పార్ష్ణిమూలం చ విజ్ఞాయ వ్యవసాయం పరాజయమ్ ।
బలస్య చ మహారాజ దత్వా వేతనమగ్రతః ॥ 59
శత్రుసంహారకా! పార్ష్ణిగ్రాహులు మొదలగు పండ్రెండు మందిని గురిమ్చి తెలుసుకొని, అపుడు నీ కర్తవ్యాన్ని నిశ్చయించుకొని, నీ పక్షంలో ఉన్న పరాజయానికి కారకాలైన దైవ మానుష వ్యసనాల్ని సరిచేసుకొని, నీ సైనికబలానికి ముందుగా జీతాలు చెల్లించి యాత్రను ప్రారంభిస్తున్నావా? (59)
కచ్చిచ్చ బలముఖ్యేభ్యః పరరాష్ట్రే పరంతప ।
ఉపచ్ఛన్నాని రత్నాని ప్రయచ్ఛసి యథార్హతః ॥ 60
పరంతపా! నీ శత్రురాజ్యంలో ప్రధానులైనవారికి ధనాలను, రత్నరాశులను అర్హతననుసరించి రహస్యంగా ఇచ్చి వారిని నీ వశవర్తులుగా చేసుకొంటున్నావా? (60)
కశ్చిదాత్మానమేవాగ్రే విజిత్య విజితేంద్రియః ।
పరాన్ జిగీషసే పార్థ ప్రమత్తానజితేంద్రియాన్ ॥ 61
కుంతీనందనా! నీవు ముందుగా ఇంద్రియాలను జయించి, అరిషడ్వర్గాన్ని జయించి, ఇంద్రియదాసులైన శత్రువులను వశవర్తులుగా చేసుకొంటున్నావా? (61)
కచ్చిత్ తే యాస్యతః శత్రూన్ పూర్వం యాంతి స్వనుష్ఠితాః ।
సామ దానమ్ చ భేదశ్చ దండశ్చ విధివద్ గుణాః ॥ 62
నీవు శత్రువులను ఆక్రమించే ముందరే పరాకులేకుండా సామం దానం భేదమ్ దండం అనే నాలుగు ఉపాయాలను వినియోగిమ్చి వారిని జయిస్తున్నావా? (62)
కచ్చిన్మూలం దృడం కృత్వా పరాన్ యాసి విశాంపతే ।
తాంశ్చ విక్రమసే జేతుమ్ జిత్వా చ పరిరక్షసి ॥ 63
మహారాజా! నీ రాజ్యానికి మూలాధారాలైన రథాలు, అశ్వాలు, గజాలు, పదాతులు, యంత్రాలు, ఔషధాలు, ద్రవ్యాలతో కూడిన సైన్యాన్ని సమకూర్చుకొని శత్రువులపై దండెత్తుతున్నావా? పరాక్రమంతో వారిపై గెలుస్తున్నావా? ఓడిపోయిన వారిని రక్షిస్తున్నావా? (63)
కచ్చిదష్టాంగ సంయుక్తా చతుర్విధబలా చమూః ।
బలముఖ్యైః సునీతా తే ద్విషతాం ప్రతివర్ధినీ ॥ 64
ధనరక్షకుడు, ద్రవ్యసంగ్రాహకుడు, చిక్సితకుడ్, గుప్తచరుడు, పాచకుడు, సేవకుడు, లేఖకుడు, ప్రహరి అనే ఈ ఎనిమిది మంది, ఇంకా గజాలు, అశ్వాలు, రథాలు, కాల్బలమ్ అనే ఈ నాలుగు బలాలతో కూడి నీ సేన యోగ్యుడైన సేనాపతి ద్వారా చక్కగా ప్రయోగింపబడి శత్రుసంహారానికి సమర్థంగా ఉన్నదా? (64)
కచ్చిల్లవమ్ చ ముష్టిం చ పరరాష్ట్రే పరంతప ।
అవిహాయ మహారాజ నిహంసి సమరే రిపూన్ ॥ 65
శత్రుసంహారకా! నీవు శత్రురాజ్యంలో కరువు కాటకాలు కల్గినపుడు రణభూమిలో శత్రుసంహారం చేస్తున్నావా? (65)
వి॥సం॥ లవః = కోతల కాలం; ముష్టిః = కట్టి వేతల కాలం (దేవ)
మొత్తానికి దుర్భిక్షసమయం (నీల) లవమంటే కోసే పంటలు ధాన్యాదులు - ముష్టి అంటే పీకే పెసలు మినుములు మొదలగునవి (లక్షా)
కచ్చిత్ స్వపరరాష్ట్రేషు బహవోఽధికృతాస్తవ ।
అర్థాన్ సమధితిష్ఠంతి రక్షంతి చ పరస్పరమ్ ॥ 66
నీదేశంలోను, శత్రుదేశంలోను నీ చేత నియమింపబడిన అధికారులు ఆయా స్థానాల్లో తిరుగుతూ, ప్రజలను వశపరచుకొంటూ, కార్యాలను ప్రయోజనకరంగా చేస్తూ, పరస్పరం కలుసుకొంటూ రాష్ట్రాన్నీ, ప్రజలనూ రక్షిస్తున్నారా? (66)
కచ్చిదభ్యవహార్యాణి గాత్రసంస్పర్శనాని చ ।
ఘ్రేయాణి చ మహారాజ రక్షంత్యనుమతాస్తవ ॥ 67
మహారాజా! నీవు తినే పదార్థాలను, శరీరధారణకు ఉపయోగించే వస్త్రాలను, సుగంధద్రవ్యాలను నీయందు పరిపూర్ణవిశ్వాసం కల ఆప్తులే చేస్తున్నారా? (67)
వి॥సం॥ గాత్రసంస్పర్శనాని = అనులేపాలు (దేవ) వస్త్రాలు. (నీల)
కచ్చిత్ కోశశ్చ కోష్ఠం చ వాహనం ద్వారమాయుధమ్ ।
ఆయశ్చ కృతకళ్యాణైః తవ భక్తైరనుష్ఠితః ॥ 68
భాండాగారం, గోష్ఠం, వాహనం, ద్వారం, ఆయుధాగారం, ధనార్జన అనే వీటియందు సుపరీక్షితులైన నీ భక్తులే అధికారులై తమకార్యాలను అనుష్ఠిస్తున్నారా? (68)
కచ్చిదాభ్యంతరేభ్యశ్చ బాహ్యేభ్యశ్చ విశాంపతే ।
రక్షస్యాత్మానమేవాగ్రే తాంశ్చ స్వేభ్యో మిథశ్చ తాన్ ॥ 69
మహారాజా! బాహ్య-ఆభ్యంతర రక్షణలతో ముందు నిన్ను నీవు రక్షించుకొంటున్నావా? అలాగే ఆ రెండింటిని పరస్పరం ఒకదానితో మరొకదానిని (అనగా బాహ్యాన్ని ఆభ్యంతరంతోను, ఆభ్యంతరాన్ని బాహ్యంతోనూ) రక్షిస్తున్నావా? బాహ్యాభ్యంతరాలకు విరోధం లేకుండా పరస్పరం రక్షిస్తున్నావా? (69)
కచ్చిన్న పానే ద్యూతే వా క్రీడాసు ప్రమదాసు చ 7.
ప్రతిజానంతి పూర్వాహ్ణే వ్యయమ్ వ్యసనజం తవ ॥ 70
నీ సేవకులు పూర్వాహ్ణకాలంలో (ఇది ధర్మాచరణకు తగిన సమయం) మద్యపానం, జూదం, ఆటలు, స్త్రీ, వ్యసనలోలత్వం మొదలైన వాటియందు ఆసక్తులై నీ సమయాన్ని, నీ ధనాన్ని నష్టపరస్తూ సమయాన్ని వ్యర్థం చేయరు కదా? (70)
కచ్చిదాయస్య చార్ధేన చతుర్భాగేన వా పునః ।
పాదభాగైస్త్రిభిర్వాపి వ్యయః సంశుద్ధ్యతే తవ ॥ 71
నీ ఆదాయంలో నాల్గవపాలుతో గాని, మూడుపాళ్లతో గాని, అర్థభాగంతో గాని, నీ ఖర్చు జరిగిపోతున్నదా? అంతకంటె ఎక్కువగా ధనవ్యయం చేయవుగదా? (71)
కచ్చిద్ జ్ఞాతీన్ గురూన్ వృద్ధాన్ వణిజః శిల్పినః శ్రితాన్ ।
అభీక్ష్ణమనుగృహ్ణాసి ధనధాన్యేన దుర్గతాన్ ॥ 72
రాజా! నిన్ను ఆశ్రయించిన కుటుంబాలనూ, గురువులనూ, వృద్ధులనూ వ్యాపారులనూ, శిల్పులను, దీనులనూ, దుఃఖితులనూ ధన ధాన్యాలను ఇచ్చి అనుగ్రహిస్తున్నావా? (72)
కచ్చిచ్చాయవ్యయే యుక్తాః సర్వే గణకలేఖకాః ।
అనుతిష్ఠంతి పూర్వాహ్ణే నిత్యమాయం వ్యయం తవ ॥ 73
నీ ఆయవ్యయాలను రాసే కరణాలు అందరు పూర్వాహ్ణంలో ప్రతిదినం ఆదాయ వ్యయాలను చెపుతున్నారా? (73)
కచ్చిదర్థేషు సంప్రౌఢాన్ హితకామాననుప్రియాన్ ।
నాపకర్షసి కర్మభ్యః పూర్వమప్రాప్య కిల్బిషమ్ ॥ 74
కొంతమంది అర్థశాస్త్ర విషయాల్లో నిపుణులై ఉంటారు. వారు నీకు హితం కోరుతూ పరోక్షంలో కూడా ప్రియం చేస్తూ ఉంటారు. వారిలో ఎప్పుడూ దోషమ్ కనపడదు. అటువంటి వారిని అధికారం నుండి తొలగించటం లేదు కదా! (74)
కచ్చిద్ విదిత్వా పురుషాన్ ఉత్తమాధమమధ్యమాన్ ।
త్వ కర్మస్వనురూపేషు నియోజయసి భారత ॥ 75
మహారాజా! నీవు నీ సేవకులను ఉత్తమ మధ్యమ, అధమ - అని మూడు విభాగాలు చేసి వారి వారికి తగిన కార్యాలలోనే నియోగిస్తున్నావా? (75)
కచ్చిన్న లుబ్ధాశ్చౌరా వా వైరిణో వా విశాంపతే ।
అప్రాప్తవ్యవహారా వా తవ కర్మస్వనుష్ఠితాః ॥ 76
రాజా! ఫలాపేక్షగలిగిన లోభులనుగాని, దొంగలనుగాని, శత్రువులనుగాని, వ్యవహార జ్ఞానశూన్యులను గాని రాచకార్యాలలో నియోగించవు కదా? (76)
కచ్చిన్న చౌరైర్లుబ్ధైర్వా కుమార్తెః స్త్రీబలేన వా ।
త్వయా వా పీడ్యతే రాష్ట్రం కచ్చిత్ తుష్టాః కృషీవలాః ॥ 77
చోరులవల్లగాని, లోభులవల్లగానీ, రాజకుమారులవల్లగానీ, రాజస్త్రీల ద్వారాగానీ, నీవల్లగాని రాష్ట్రానికి ఎటువంటి బాధ కలగటం లేదుకదా? నీ రాజ్యంలో రైతులు సంతోషంగా ఉంటున్నారా? (77)
కచ్చిద్ రాష్ట్రే తడాగాని పూర్ణాని చ బృహంతి చ ।
భాగశో వినివిష్టాని న కృషిర్దేవమాతృకా ॥ 78
నీ రాజ్యంలో అన్ని ప్రాంతాలలో పెద్ద చెరువులన్నీ నీటితో నిండి ఉన్నాయా? కేవలం వర్షాధార వ్యవసాయం జరగటం లేదుగదా ! (78)
కచ్చిన్నభక్తం బీజం చ కర్షకస్యావసీదతి ।
ప్రత్యేకం చ శతం వృద్ధ్యా దదాస్యృణమనుగ్రహమ్ ॥ 79
నీ రాజ్యంలో కర్షకులకు అన్నానికీ, ?విత్తనానికీ కొఱత లేకుండా ఉన్నదా? వారిపై ప్రత్యేకంగా దయచూపిస్తూ నూటికి రూపాయి వడ్డీ చొప్పున ఋణాన్ని ఇస్తున్నావా? (79)
కచ్చిత్ స్వనుష్ఠితా తాత వార్తాః తే సాధుభిర్జనైః ।
వార్తాయామ్ సంశ్రితస్తాత లోకోఽయం సుఖమేధతే ॥ 80
తాతా! నీ రాజ్యంలో ఉత్తమపురుషుల ద్వారా కృషి, గోరక్ష, వ్యాపారం అన్నీ చక్కగా జరుగుతున్నాయా? వార్త సుభిక్షంగా ఉంటే లోకులంతా సుఖాన్ని ఉన్నతిని పొందుతారు. (80)
వి॥సం॥ వార్త = కృషి, పశుపాలనం, వాణిజ్యం. (దేవ)
కచ్చిచ్ఛూరాః కృతప్రజ్ఞాః పంచ పంచస్వనుష్ఠితాః ।
క్షేమం కుర్వంతి సంహత్య రాజన్ జనపదే తవ ॥ 81
రాజా! నీ రాజ్యంలోని ప్రత్యేక గ్రామాలలో శూరవీరులు, బుద్ధిమంతులు, కార్యకుశలులు 1) కార్య ప్రారంభంలో మెలకువ కలవారై, 2) కార్యాన్ని నెరవేర్చడానికి తగిన మనుష్యుల యొక్క ద్రవ్యము యొక్క సహకారం పొంది, 3) దేశకాలవిభజనమ్ చేసి, 4) ఆపద కల్గినపుడు రహస్యంగా ఉంచడం, 5) కార్యసిద్ధి అనే ఈ అయిందింటిని బాగా తెలుసుకొని రాజ్యానికి క్షేమం కల్గిస్తున్నారా? (81)
కచ్చిన్నగరగుప్త్యర్థం గ్రామా నగరవత్ కృతాః ।
గ్రామవచ్చ కృతాః ప్రాంతాః తే చ సర్వే తదర్పణాః ॥ 82
పట్టణాలను రక్షించడానికి గ్రామాలను, గ్రామాలను రక్షించడానికి పల్లెలను శూరుల ద్వారా వీరుల ద్వారా రక్షిస్తున్నావా? ప్రాంతాలు, గ్రామాలు, నగరాలు - వీటి అధిపతులందరూ నీకు పన్నురూపంలో ధనాన్ని సమర్పిస్తున్నారా? (82)
కచ్చిద్ బలేనానుగతాః సమాని విషమాణి చ ।
పురాణి చౌరాన్ నిఘ్నంతః చరంతి విషయే తవ ॥ 83
నీ రాజ్యంలో రక్షకభటులు సైన్యసహాయకులై దొంగలను, బందిపోటులను అణచివేయడానికి సుగమనగారాల్లోనూ, దుర్గమనగరాల్లోనూ సంచరిస్తున్నారా? (83)
కశ్చిత్ స్త్రియః సాంత్వయసి కచ్చిత్ తాశ్చ సురక్షితాః ।
కచ్చిన్న శ్రద్దదాస్యాసాం కచ్చిద్ గుహ్యం న భాషసే ॥ 84
నీవు స్త్రీ సంరక్షణలో సంతృప్తి చెందుతున్నావా? నీ యొక్క పరిపాలనలో స్త్రీలందరు సురక్షితంగా ఉంటున్నారా? వాళ్లయందు నీవు పూర్తి విశ్వాసంతో లేవు గదా! వారితో రహస్యంగా మట్లాడటం లేదు కదా! (84)
కచ్చిదాత్యయికం శ్రుత్వా తదర్థమనుచింత్య చ ।
ప్రియాణ్యనుభవన్ శేషే న త్వమంతః పురే నృప ॥ 85
నీవు ఎప్పుడైన అమంగళకరమయిన వార్తలు వినినపుడు గాని, ఆ విధమైన సమాచారాన్ని తీవ్రంగా ఆలోచిస్తునపుడు గాని అంతఃపురంలో స్త్రీలోలుడవై ఆనందంలో మునిగితేలుతూ ఉండవు గదా? (85)
కచ్చిద్ ద్వౌ ప్రథమౌ యామౌ రాత్రేః సుప్త్వా విశాంపతే ।
సంచింతయసి ధర్మార్థౌ యామ ఉత్థాయ పశ్చిమే ॥ 86
ప్రజాపతీ! నీవు రాత్రిళ్లు ప్రథమయామంలోను, రెండవజాములోను నిద్రపోయి చివరియామంలో నిద్ర నుండి మేల్కొని ధర్మాన్ని, అర్థాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా? (86)
కచ్చిదర్థయసే నిత్యం మనుష్యాన్ సమలంకృతః ।
ఉత్థాయ కాలే కాలజ్ఞైః సహ పాండవ మంత్రిభిః ॥ 87
పాండునందనా! నీవు ప్రతిదినం ప్రభాతకాలంలోనే నిద్ర నుండి మేల్కొని, అలంకరించుకొని దేశకాలాలకు అనుగుణంగా మంత్రులతో కూర్చుండి నీ దర్శనార్థం వచ్చిన ప్రజానీకానికి దర్శనమిచ్చి వారి కోరికలను నెరవేరుస్తున్నావా? (87)
కచ్చిద్ రక్తాంబరధరాః ఖడ్గహస్తాః స్వలంకృతాః ।
ఉపాసతే త్వామభితః రక్షణార్థమరిందమ ॥ 88
శత్రుసంహారకా! ఎఱ్ఱని వస్త్రాల్ని ధరిమ్చి ఖడ్గపాణులైన భటులు నిరంతరం నీ చుట్టూ నీ రక్షణలో సావధానులై ఉంటున్నారా? (88)
కచ్చిద్ దండ్యేషు యమవత్ పూజ్యేషు చ విశాంపతే ।
పరీక్ష్య వర్తసే సమ్యక్ అప్రియేషు ప్రియేషు చ ॥ 89
మహారాజా! నీవు శిక్షింపదగినవారికి యమధర్మరాజులాగ; గౌరవింపదగిన వారికీ నీయందు అనురక్తి కలిగిన వారికి ధర్మరాజులాగా ప్రవర్తిస్తున్నావా? ఎవరు ప్రియులో, ఎవరు అప్రియులో పరీక్షించి ఎవరియందు ఏవిధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తున్నావా? (89)
కచ్చిచ్ఛారీరమాబాధామ్ ఔషధైర్నియమేన వా ।
మానసమ్ వృద్ధసేవాభిః సదా పార్థాపకర్షసి ॥ 90
కుంతీకుమారా! శరీరానికి రోగం సంభవించినప్పుడు ఔషధాలను సేవించిగాని, లంఘన చికిత్స చేసిగాని రోగం పోగొట్టుకొని ఆరోగ్యవంతునిగ ఉంటున్నావా? పెద్దలను సేవించి మనస్సును సంతోషపరచుకొంటున్నావా? (90)
కచ్చిద్ వైద్యాశ్చికిత్సాయామ్ అష్టాంగాయాం విశారదాః ।
సుహృదశ్చానురక్తాశ్చ శరీరే తే హితాః సదా ॥ 91
కాయచికిత్స, బాలచికిత్స, గ్రహచికిత్స,ఊర్ధ్వాంగ చికిత్స, శల్యచికిత్స, దంష్ట్రాచికిత్స, జరాచికిత్స, విషచికిత్స అను అష్టాంగ వైద్య చికిత్సలలో ప్రవీణులైన వైద్యులు నీయందు అనురక్తులై సహృదయంతో నీకు శరీరతాపం కలుగకుండా మేలు కలిగిస్తున్నారా? (91)
కచ్చిన్న లోభాన్మోహాద్ వా మానాద్ వాపి విశాంపతే ।
అర్థిప్రత్యర్థినః ప్రాప్తాన్ న పశ్యసి కథంచన ॥ 92
నరేశ్వరా! లోభమ్ చేతగాని, మోహం చేతగాని నీ దగ్గరకు వచ్చిన యాచకులను గాని, పశ్చాత్తాపంతో నీ దగ్గరకు చేరిన ప్రత్యర్థులను గాని ఎప్పుడూ దర్శనమివ్వకుండా అవమానించడం లేదుగదా? (92)
కచ్చిన్న లోభాద్ మోహాద్ వా విశ్రంభాత్ ప్రణయేన వా ।
ఆశ్రితానామ్ మనుష్యాణాం వృత్తిం త్వం సంరుణత్సి వై ॥ 93
నిన్ను ఆశ్రయించిన జనుల యొక్క జీవనోపాధులను నీవు లోభం వల్లగాని, మోహమ్ వల్లగాని, ఆత్మవిశ్వాసం వల్లగాని ఎన్నడూ ఎగతాళికైనా అడ్డగించుట లేదుగదా? (93)
కచ్చిత్ పౌరా న సహితా యే చ తే రాష్ట్రవాసినః ।
త్వయా సహ విరుధ్యంతే పరైః క్రీతాః కథంచన ॥ 94
నీ నగరవాసులుగాని, రాష్ట్రప్రజలుగాని అంతా కలిసి నీయందు విరోధంతో ప్రవర్తించడం లేదుగదా? అందులో ఎవరైనా నీ శత్రుపక్షం నుండి ద్రవ్యలాభాన్ని పొంది నీతో కలహించడం లేదు గదా? (94)
కచ్చిన్న దుర్బలః శత్రుః బలేన పరిపీడితః ।
మంత్రేణ బలవాన్ కశ్చిత్ ఉభాభ్యాం చ కథంచన ॥ 95
ఎవడైనా దుర్బలుడు - ఇది వరకు నీచేత చంపబడకుండా బాధింపబడ్డవాడు - ఇపుడు మంత్రాగం వల్లగాని సేనాబలం వల్లగాని బలవంతుడై నీకు ఎదురు తిరగటం లేదుగదా? (95)
కచ్చిత్ సర్వేఽనురక్తాస్త్వాం భూమిపాలాః ప్రధానతః ।
కచ్చిత్ ప్రాణాంస్త్వదర్థేషు సంత్యజంతి త్వయాఽఽదృతాః ॥ 96
నీ సామంతులలో ప్రధానులైన రాజులందరు నీయందు ప్రేమతో ఉంటున్నారా? నీ చేత గౌరవింపబడుతూ వారు నీకోసం ప్రాణాలను సహితం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారా? (96)
కచ్చిత్ తే సర్వవిద్యాసు గుణతోఽర్చా ప్రవర్తతే ।
బ్రాహ్మణానాం చ సాధూనాం తవ నైఃశ్రేయసీ శుభా ।
దక్షిణాస్త్వమ్ దదాస్యేషాం నిత్యం స్వర్గాపవర్గదాః ॥ 97
అన్ని విద్యలలోను ఆరితేరినవారిని పరీక్షించి ఆ విద్వాంసుల్ని గౌరవిస్తున్నావా? బ్రాహ్మణులకూ, సాధుపుంగవులకూ నీవు సేవచేస్తున్నావా? నీకు ఎల్లప్పుడూ శుభాల్ని కల్గిస్తూ ఉండే వారికి దక్షిణలు ఇచ్చి గౌరవిస్తున్నావా? వారు నీ స్వర్గప్రాప్తికీ, మోక్షప్రాప్తికీ కారకులు కదా! (97)
కచ్చిద్ ధర్మే త్రయీమూలే పూర్వైరాచరితే జనైః ।
యతమానస్తథా కర్తుం తస్మిన్ కర్మణి వర్తసే ॥ 98
నీ పూర్వపురుషులు అందరు మూడు వేదాలను ఆధారంగా చేసుకొని ధర్మాన్ని ఆచరించారు. ఆ ధర్మాన్నే నీవు ఆచరించడానికి నీ పూర్వులలాగా ప్రయత్నం చేస్తున్నావా? ధర్మాచరణకు అనుకూలమైన కార్యాలలో నీ మనఃప్రవృత్తి నిలుస్తున్నది గదా? (98)
కచ్చిత్తవ గృహేఽన్నాని స్వాదూన్యశ్నంతి వై ద్విజాః ।
గుణవంతి గుణోపేతాః తవాధ్యక్షః సదక్షిణమ్ ॥ 99
నీ రాజభవనంలో నీ కళ్ల ఎదుట సద్గుణ గరిష్ఠులైన బ్రాహ్మణులు మధురపదార్థాలు, రసవంతమైన మృష్టాన్నాలు భుజిస్తున్నారా? భోజనం తరువాత వారిని దక్షిణలిచ్చి సత్కరిస్తున్నావా? (99)
కశ్చిత్ క్రతూనేకచిత్తః వాజపేయాంశ్చ సర్వశః ।
పుండరీకాంశ్చ కార్త్య్న్యేన యతసే కర్తుమాత్మవాన్ ॥ 100
నీవు ఏకాగ్రమనస్కుడవై వాజపేయం, పౌండరీకం మొదలైన యాగాలను నిండుమనస్సుతో ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నావా? (100)
కచ్చిజ్ఞాతీన్ గురూన్ వృద్ధాన్ దైవతాం స్తాపసానపి ।
చైత్యాంశ్చ వృక్షాన్ కళ్యాణాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి ॥ 101
నీ జ్ఞాతులను, గురువులను, వృద్ధులను, దేవతాపసులను, ఆశ్వత్థం మొదలైన పుణ్యవృక్షాలను, శుభకారకులైన బ్రాహ్మణులను ప్రతిదినం నమస్కరిస్తున్నావా? (101)
కచ్చిచ్ఛోకో న మన్యుర్వా త్వయా ప్రోత్పాద్యతేఽనఘ ।
అపి మంగళహస్తశ్చ జనః పార్స్వేఽనుతిష్ఠతి ॥ 102
పుణ్యాత్మా! నీ మనస్సులో ఎప్పుడూ దుఃఖానికి గాని, కోపానికి గాని ఆశ్రయం ఇవ్వడం లేదుగదా? మంగళకరమైన వస్తువులను చేతిలో ఉంచుకొని నీ పరివారం నిన్నెప్పుడూ విడిచిపెట్టక నీ ప్రక్కనే ఉండి సేవిస్తున్నదా? (102)
కచ్చిదేషా చ తే బుద్ధిః వృత్తిరేషా చ తేఽనఘ ।
ఆయుష్యా చ యశస్యా చ ధర్మకామార్థదర్శినీ ॥ 103
పుణ్యాత్మా! ఇప్పటి వరకు నేను చెప్పినట్లుగా నీ బుద్ధి, ప్రవృత్తి ఉన్నాయి కదా? ఇటువంటి విధంగా ధర్మానికి అనుకూలమైన బుద్ధితో ప్రవర్తించినట్లయితే ఆయుర్వృద్ధి, దాంతో బాటు యశోవృద్ధి కలిగి ధర్మార్థకామాలను సంపూర్ణంగా ఆచరించేవాడివి కాగలవు. (103)
ఏతయా వర్తమానస్య బుద్ధ్యా రాష్ట్రం న సీదతి ।
విజిత్య చ మహీం రాజా సోఽత్యంతం సుఖమేధతే ॥ 104
ఈ విధంగా ధర్మబుద్ధితో ప్రవర్తిస్తే, అతని రాజ్యం ఎన్నడూ నశించదు. ఈ విధంగా ప్రవర్తించిన రాజు భూమండలాన్ని అంతటినీ జయించి సుఖిస్తూ దిన దినాభివృద్ధి చెందుతాడు. (104)
కచ్చిదార్యో విశుద్ధాత్మా క్షారితశ్చౌరకర్మణి ।
అదృష్టశాస్త్రకుశలైః న లోభాద్ వధ్యతే శుచిః ॥ 105
శాస్త్రకుశలులతో, విద్వాంసులతో సాంగత్యం లేక నీ మంత్రులలో మూర్ఖులు ఎవరయినా పవిత్రాత్ములపై దొంగతనం అనే నేరాన్ని మోపి వారి ధనాన్ని అన్యాయంగా కాజేస్తున్నారా? లోభం వల్ల అధికంగా ధనాన్ని సంపాదించాలని వారికి మరణశిక్ష విధిస్తున్నారా? (105)
దుష్టో గృహీతస్తత్కారీ తజ్ఞైర్దృష్టః సకారణః ।
కచ్చిన్న ముచ్యతే స్తేనః ద్రవ్యలోభాన్నరర్షభ ॥ 106
ఉత్పన్నాన్ కచ్చిదాఢ్యస్య దరిద్రస్య చ భారత ।
అర్థాన్ న మిథ్యా పశ్యతి తవామాత్యా హృతా జనైః ॥ 107
నాస్తిక్యమనృతమ్ క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతామ్ ।
అదర్శనం జ్ఞానవతామ్ ఆలస్యం పంచవృత్తితామ్ ।
ఏకచింతనమర్థానామ్ అనర్థజ్ఞైశ్చ చింతనమ్ ॥ 108
నిశ్చితానామనారంభం మంత్రస్యాపరిరక్షణమ్ ।
మంగళాద్యప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వతః ॥ 109
కచ్చిత్త్వం వర్జయస్యేతాన్ రాజదోషాంశ్చతుర్దశ ।
ప్రాయశో యర్వినశ్యంతి కృతమూలాపి పార్థివాః ॥ 110
యుధిష్ఠిరా! "పరలోకం లేదు. ఈశ్వరుడు లేడు అనే నాస్తిక్యభావం, అసత్యం, కోపం, ఏమఱుపాటు, దీర్ఘచింతనం, జ్ఞానులతో సహవాసం చేయకుండటం, ఆలస్యం, పంచేంద్రియ విషయాల్లో ఆసక్తి చూపటం, ప్రజోపయోగవిషయాలలో ఒక్కడే ఆలోచన చేయటం అర్థశాస్త్రం తెలియని మూర్ఖులతో ఆ విషయాలను గురించి ఆలోచించటం, నిశ్చయించుకొన్న కార్యాలను చేయకుండటం, రాచరికపురహస్యాలను బయటపెట్టడం, మంగళకరమైన ఉత్సవాల్ని చేయకుండుట, ఒక్కడితో శత్రువుపైకి దాడి వెళ్లటం-అనే ఈ పద్నాలుగూ రాజదోషాలు. ఈ పద్నాలుగు దోషాల్ని నీవు విడిచి పెట్టావు గదా? వీటిచేత రాజు తప్పక నష్టపోతాడు. (106-110)
కచ్చిత్ తే సఫలా వేదాః కచ్చిత్ తే సఫలం ధనమ్ ।
కచ్చిత్ తే సఫలా దారాః కచ్చిత్ తే సఫలం శ్రుతమ్ ॥ 111
నీ వేదాలు సఫలమయ్యాయా? నీ ధనం సఫలం అయిందా? నీ స్త్రీలు అందరు సఫలమయ్యారా? నీ శాస్త్రజ్ఞానం సఫలం అయిందా? (111)
యుధిష్ఠిర ఉవాచ
కథం వై సఫలా వేదాః కథం వై సఫలం ధనమ్ ।
కథమ్ వై సఫలా దారాః కథం వై సఫలం శ్రుతమ్ ॥ 112
ఆ విధంగా నారదుడు ప్రశ్నించిన తరువాత యుధిష్ఠిరుడు నారదునితో
"దేవర్షీ! వేదాలు ఏవిధంగా సఫలం అవుతాయి? ధనం ఎలా సఫలం అవుతుంది? స్త్రీల సాఫల్యం ఏవిధంగా ఉంటుంది? శాస్త్రజ్ఞానం ఏవిధంగా సఫలం అవుతుంది?" అని అడిగాడు. (112)
నారద ఉవాచ
అగ్నిహోత్రఫలా వేదా దత్తభుక్తఫలం ధనమ్ ।
రతిపుత్రఫలా దారాః శీలవృత్తఫలం శ్రుతమ్ ॥ 113
ఆ ప్రశ్నలకు సమాధానంగా నారదుడు ధర్మరాజుతో
రాజా! వేదాలు నీవుచేసే నిత్యాగ్నిహోత్రక్రియకు ఫలాలు. ధనానికి దానం భోగమే ఫలం. భార్య రతి, సంతానం అనే ఫలాల్ని ఇస్తుంది. శాస్త్రజ్ఞానానికి సదాచారవృత్తియే ఫలం. (113)
వైశంపాయన ఉవాచ
ఏతదాఖ్యాయ స మునిః నారదో వై మహాతపాః ।
పప్రచ్ఛానంతరమిదం ధర్మాత్మానం యుధిష్ఠిరమ్ ॥ 114
వైశంపాయనుడు చెపుతున్నాడు.
రాజా! ఇవన్నీ విని మహాతపస్వి అయిన నారదమహర్షి ధర్మాత్ముడైన యుధిష్ఠిరుని మరల ప్రశ్నిస్తున్నాడు. (114)
నారద ఉవాచ
కచ్చిదభ్యాగతా దూరాద్ వణిజో లాభకారణాత్ ।
యథోక్తమవహార్యంతే శుల్కం శుల్కోపజీవిభిః ॥ 115
నారదుడు యుధిష్ఠిరునితో ఇలా అడుగుతున్నాడు.
రాజా! పన్నులు వసూలుచేసే నీ సేవకులు లాభార్జన కోసం బహుదూరం నుండి వచ్చిన వ్యాపారుల నుండి సరిగ్గా పన్నులు వసూలు చేస్తున్నారా? అధికంగా వసూలు చేయటం లేదు గదా? (115)
కచ్చిత్ తే పురుషా రాజన్ పురే రాష్ట్రే చ మానితాః ।
ఉపానయంతి పణ్యాని ఉపధాభిరవంచితాః ॥ 116
మహారాజా! ఆ వ్యాపారులు నీ నగరంలోను, రాజ్యంలోను ఆదరింపబడుతూ జనానికి ఉపయోగపడే సామాగ్రినే అమ్ముతున్నారా? వాళ్లు పన్నులు వసూలు చేసే ఆ సేవకులను మోసగించడం లేదుగదా? (116)
కచ్చిచ్ఛృణోషి వృద్ధానాం ధర్మార్థసహితా గిరః ।
నిత్యమర్థవిదాం తాత యథా ధర్మార్థదర్శినామ్ ॥ 117
తాతా! నీవు ధర్మాన్ని, అర్థాన్ని తెలిసిన పండితుల మాటలను అర్థశాస్త్రంలో సంపూర్ణ పాండిత్యం గలిగిన వృద్ధుల ధర్మార్థవచనాలనూ వింటున్నావా? (117)
కచ్చిత్ తే కృషితంత్రేషు గోషు పుష్పఫలేషు చ ।
ధర్మార్థం చ ద్విజాతిభ్యో దీయేతే మధుసర్పిషీ ॥ 118
వ్యవసాయం వల్ల వచ్చే ఫలాలను, పుష్పాలను, గోవుల నుండి వచ్చే పాలు, నెయ్యి మొదలగు పదార్థాలు నీవు ఉపయోగించడానికి ముందు ధర్మార్థం బ్రాహ్మణులకు సమర్పిస్తున్నావా? (118)
ద్రవ్యోపకరణం కిమ్చిత్ సర్వదా సర్వశిల్పినామ్ ।
చాతుర్మాస్యావరం సమ్యక్ నియతం సంప్రయచ్ఛసి ॥ 119
మహారాజా! నీవు నియమించిన శిల్పులు అందరికీ ఒకే పర్యాయం నాలుగు నెలల వరకు సరిపడే వేతనం, ఉపకరణాలూ, సమకూర్చి ఇస్తున్నావా? (119)
కచ్చిత్ కృతం విజానీషే కర్తారం చ ప్రశంససి ।
పతాం మధ్యే మహారాజ సత్కరోషి చ పూజయన్ ॥ 120
మహారాజూ! నీవు ఉపకారం చేసిన వారిని మరచిపోవడం లేదు గదా? ఆ విధంగా నీకు మేలు చెసినవారిని సజ్జనుల సమక్షంలో ప్రశంసిస్తూ నీ కృతజ్ఞతగా సత్కరిస్తున్నావా? (120)
కచ్చిత్ సూత్రాణి సర్వాణి గృహ్ణాసి భరతర్షభ ।
హస్తిసూత్రాశ్వసూత్రాణి రథసూత్రాణి వా విభో ॥ 121
భరతవంశోత్తమా! నీవు సంక్షేపంగా సిద్ధాంత ప్రతిపాదన చేసే సూత్రగ్రంథాలయిన గజసూత్రం, అశ్వసూత్రం, రథసూత్రం మొదలగు గ్రంథాలను సంగ్రహంగా పఠిమ్చి అభ్యసించావా? (121)
కచ్చిదభ్యస్యతే సమ్యక్ గృహే తే భరతర్షభ ।
ధనుర్వేదస్య సూత్రం వై యంత్రసూత్రం చ నాగరమ్ ॥ 122
భరతశ్రేష్ఠా! నీ భవనంలో ధనుర్వేద సూత్రాన్ని, యంత్రసూత్రాన్నీ, అదేవిధంగా నాగరికసూత్రాన్ని చక్కగా అభ్యసించావా? (122)
కచ్చిదస్త్రాణి సర్వాణి బ్రహ్మదండశ్చ తేఽనఘ ।
విషయోగాస్తథా సర్వే విదితాః శత్రునాశనాః ॥ 123
పుణ్యాత్మా! నీవు మంత్రబలంతో అస్త్రాలను బ్రహ్మదండాన్ని ప్రయోగించి శత్రునాశనం చేస్తున్నావా? వేదోక్తంగా శిక్షను విధించడానికి, అలాగే శత్రునాశనానికీ విషప్రయోగ పరిశీలనం చేశావా? (123)
కచ్చిదగ్నిభయాచ్చైవ సర్వం వ్యాలభయాత్ తథా ।
రోగరక్షోభయాచ్చైవ రాష్ట్రం స్వం పరిరక్షసి ॥ 124
నీ రాజ్యంలో అగ్నిభయం నుండి, సర్పభయం నుండి, రోగభయం నుండి రాక్షసభయం నుండి ప్రజారంజకంగా రాజ్యాన్ని రక్షిస్తున్నావా? (124)
కచ్చిదంధాంశ్చ మూకాంశ్చ పంగూన్ వ్యంగానబాంధవాన్ ।
పితేవ పాసి ధర్మజ్ఞ తథా ప్రవ్రజితానపి ॥ 125
నోరులేని మూగవారిని, కన్నులు కనబడని గ్రుడ్డివారిని, వికలాంగులను, కుంటివారిని దిక్కులేని అనాథలను, సన్యాసులను తండ్రివలె ఆదరిస్తూ రక్షిస్తున్నావా? (125)
షడనర్థా మహారాజ కచ్చిత్ తే పృష్ఠతః కృతాః ।
నిద్రాఽఽలస్యం భయం క్రోధోఽమార్దవం దీర్ఘసూత్రతా ॥ 126
మహారాజా! నిద్ర, ఆలస్యం, భయం, కోపం, కాఠిన్యం, దీర్ఘాలోచనం అనే ఈ ఆరుదోషాల్ను విడిచి పెట్టావా? (126)
వైశంపాయన ఉవాచ
తతః కురూణామృషభో మహాత్మా
శ్రుత్వా గిరో బ్రాహ్మణసత్తమస్య ।
ప్రణమ్య పాదావభివాద్య తుష్టః
రాజాబ్రవీన్నారదం దేవరూపమ్ ॥ 127
వైశంపాయనుడు జనమేజయుడితో అంటున్నాడు.
రాజా! కౌరవశ్రేష్ఠుడూ, మహాత్ముడూ అయిన యుధిష్ఠిరుడు బ్రహ్మపుత్రులలో శ్రేష్ఠుడయిన నారదమహర్షి యొక్క ఆ మాటలు విని మహర్షి పాదాలపై పడి నమస్కరించాడు. ఆనందంతో ఆ దైవస్వరూపునితో ఇలా అన్నాడు. (127)
యుధిష్ఠిర ఉవాచ
ఏవం కరిష్యామి యథా త్వయోక్తం
ప్రజ్ఞా హి మే భూయ ఏవాభివృద్ధా ।
ఉక్త్వా తథా చైవ చకార రాజా
లేభే మహీం సాగరమేఖలాం చ ॥ 128
యుధిష్ఠిరుడు నారదమహర్షితో 'దేవర్షీ! మీరు ఏమి ఉపదేశించారో నేను ఆ విధంగా చేస్తాను. మీరు చేసిన ఈ ప్రబోధం వల్ల నాబుద్ధి, ప్రజ్ఞ ఎంతో పెరిగాయి.'
యుధిష్ఠిరుడు ఇలా చెప్పి సముద్ర పర్యంతం గల మహీమండలాన్ని చక్కగా పరిపాలించాడు. (128)
నారద ఉవాచ
ఏవం యో వర్తతే రాజా చాతుర్వర్ణ్యస్య రక్షణే ।
స విహృత్యేహ సుసుఖీ శక్రస్యైతి సాలోకతామ్ ॥ 129
నారదుడు అంటున్నాడు. "ఏ రాజైనా ఈ ప్రకారంగా చాతుర్వర్ణాల వారిని వారి వారి వర్ణాశ్రమధర్మాలను కాపాడుతూ రాజ్యాన్ని పరిపాలిస్తాడో అట్టివాడు ఈ లోకంలో అత్యంత సుఖాన్ని అనుభవించి చివరకు దేవరాజైన ఇంద్రలోకాన్ని చేరుతాడు." (129)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యానపర్వణి నారదప్రశ్నముఖేన రాజధర్మానుశాసనే పంచమోఽధ్యాయః ॥ 5 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున లోకపాల సభాఖ్యానపర్వమను
ఉపపర్వమున నారదప్రశ్నల రూపమున రాజధర్మానుశాసనమను అయిదవ అధ్యాయము. (5)