16. పదునారవ అధ్యాయము

జరాసంధవధను గురించి ఆలోచించుట.

యుధిష్ఠిర ఉవాచ
సమ్రాడ్గుణమభీప్సన్ వై యుష్మాన్ స్వార్థపరాయణః ।
కథం ప్రహిణుయాం కృష్ణ సోఽహం కేవలసాహసాత్ ॥ 1
యుధిష్ఠిరుడిలా అన్నాడు - కృష్ణా! నేను సమ్రాట్టును కావాలన్న స్వార్థదృష్టితో ఇంత సాహసాన్ని చేసి మిమ్ములను జరాసంధుని దగ్గరకు ఎలా పంపగలను? (1)
భీమార్జునావుభౌ నేత్రే మనో మన్యే జనార్దనమ్ ।
మనశ్చక్షుర్విహీనస్య కీదృశం జీవితం భవేత్ ॥ 2
భీమార్జునులు ఇద్దరూ నాకు కళ్ళు. శ్రీకృష్ణుడు మనస్సు. మనస్సు, కళ్ళు కోల్పోతే ఇక నా జీవితమెలా ఉంటుంది? (2)
జరాసంధబలం ప్రాప్య దుష్పారం భీమవిక్రమమ్ ।
యమోఽపి న విజేతాజౌ తత్ర వః కిం విచేష్టితమ్ ॥ 3
భీకరపరాక్రమంతో అంతులేని ఆ జరాసంధుని సేనను ఎదిరించి యముడు కూడా గెలువలేడు. ఆ తావున మీరేమి చేయగలరు? (3)
(కథం జిత్వా పునర్యూయమ్ అస్మాన్ సంప్రతి యాస్యథ ।)
అస్మిం స్త్వర్థాంతరే యుక్తమ్ అనర్థః ప్రతిపద్యతే ।
తస్మాన్న ప్రతిపత్తిస్తు కార్యా యుక్తా మతా మమ ॥ 4
మీరు ఆ జరాసంధుని గెలిచి తిరిగి ఇక్కడకు రాగలరా? ఈ ప్రయత్నం మనకు అభీష్టఫలం కన్న విపరీతమైన ఫలితాన్ని ఇవ్వవచ్చు. అనర్థాలు కలుగవచ్చు. కాబట్టి రాజసూయయాగాన్ని గురించిన ఆలోచన తగదేమో అని నాకనిపిస్తోంది. (4)
యథాహమ్ విమృశామ్యేకః తత్ తావచ్ఛ్రూయతాం మమ ।
సంన్యాసం రోచయే సాధు కార్యస్యాస్య జనార్దన ।
ప్రతిహంతి మనో మేఽద్య రాజసూయే దురాహరః ॥ 5
జనార్దనా! ఈ విషయంలో నేను ఒంటరిగా చేస్తున్న ఆలోచనను విను. ఈ ప్రయత్నాన్ని విరమించటమే నాకు మంచిదనిపిస్తోంది. రాజసూయానుష్ఠానం చాలాకష్టం. నా మనస్సులో నిరుత్సాహమలముకొన్నది. (5)
వైశంపాయన ఉవాచ
పార్థః ప్రాప్య ధనుఃశ్రేష్ఠమ్ అక్షయ్యే చ మహేషుధీ ।
రథం ధ్వజం సభాం చైవ యుధిష్ఠిరమభాషత ॥ 6
వైశంపాయనుడిలా అన్నాడు.
జనమేజయా! అర్జునుడు శ్రేష్టధనుస్సును, రెండు అక్షయతూణీరాలను, దివ్యరథాన్ని, ధ్వజాన్ని స్వీకరించి యుధిష్ఠిరుని సమీపించి ఇలా అన్నాడు. (6)
అర్జున ఉవాచ
ధనుః శస్త్రం శరా వీర్యం పక్షో భూమిర్యశో బలమ్ ।
ప్రాప్తమేతన్మయా రాజన్ దుష్ప్రాపం యదభీప్సితమ్ ॥ 7
అర్జునుడిలా అన్నాడు. రాజా! ధనుస్సు, శాస్త్రాలు, బాణాలు, పరాక్రమం, సహాయకులు, భూమి, కీర్తి, బలం - వీటిని పొందటం కష్టం. అయితే ఈ దుర్లభ వస్తువులన్నీ నాకు సంక్రమించాయి. (7)
కులే జన్మ ప్రశంసంతి వైద్యాః సాధు సునిష్టితాః ।
బలేన సదృశం నాస్తి వీర్యం తు మమ రోచతే ॥ 8
అనుభవం గల పండితులు ఉత్తమవంశంలో జన్మించటాన్ని ప్రశంసిస్తారు. కానీ బలంతో సమానమైనది లేదు. పరాక్రమమే శ్రేష్ఠమని నా అభిప్రాయం. (8)
కృతవీర్యకులే జాతః నిర్వీర్యః కిమ్ కరిష్యతి ।
నిర్వీర్యే తు కులే జాతః వీర్యవాంస్తు విశిష్యతే ॥ 9
పరాక్రమసంపన్నుల వంశంలో పుట్టినా బలహీనుడు ఏమీ చేయలేదు. పరాక్రమహీనుల వంశంలో పుట్టినా పరాక్రమశాలి గొప్పవాడు కాగలడు. (9)
క్షత్రియః సర్వశో రాజన్ యస్య వృత్తిర్ద్విషజ్జయే ।
సర్వైర్గుణైర్విహీనోఽపి వీర్యవాన్ హి తరేద్ రిపూన్ ॥ 10
రాజా! శత్రువులను జయించాలన్న ప్రవృత్తిగలవాడే ఉత్తమక్షత్రియుడు. అటువంటివాడు ఏ గుణాలు లేకపోయినా పరాక్రమించి శత్రుసంకటాల నుండి బయటపడగలడు. (10)
సర్వైరపి గుణైర్యుక్తః నిర్వీర్యః కిమ్ కరిష్యతి ।
గుణీభూతా గుణాః సర్వే తిష్ఠంతి హి పరాక్రమే ॥ 11
అన్ని మంచి గుణాలున్నా పరాక్రమం లేకపోతే ఏం చేయగలడు? పరాక్రమం ముందు మిగిలిన గుణాలన్నీ అప్రధానమే. (11)
జయస్య హేతుః సిద్ధిర్హి కర్మ దైవం చ సంశ్రితమ్ ।
సంయుక్తో హి బలైః కశ్చిత్ ప్రమాదాన్నోపయుజ్యతే ॥ 12
మనస్సంకల్పమూ, ప్రారబ్ధానికి తగిన పురుషప్రయత్నమూ విజయహేతువులు. బలవంతుడై కూడా ఎవడైనా కర్తవ్యంలో మనస్సును లగ్నం చేయకపోతే కార్యాన్ని సాధించలేడు. (12)
తేన ద్వారేణ శత్రుభ్యః క్షీయతే సబలో రిపుః ॥ 13
ఆ ఏమరుపాటు కారణమై బలవంతుడైన శత్రువు కూడా తన శత్రువుల చేత చంపబడతాడు. (13)
దైన్యం యథా బలవతి తథా మోహో బలాన్వితే ।
తావుభౌ నాశకౌ హేతూ రాజ్ఞా త్యాజ్యౌ జయార్థినా ॥ 14
బలవంతునిలో దైన్యం, బలహీనునిలో మోహం రెండూ దోషాలు. ఆ రెండూ వినాశ కారణాలు. విజయార్థి అయిన రాజు వాటిని వదలివేయాలి. (14)
జరాసంధవినాశాం చ రాజ్ఞాం చ పరిరక్షణమ్ ।
యది కుర్యామ యజ్ఞార్థం కిం తతః పరమం భవేత్ ॥ 15
రాజసూయయాగం కోసం జరాసంధుని చంపి, రాజులను రక్షించగలిగితే అంతకన్న మంచిపని ఏముంటుంది? (15)
అనారంభే హి నియతః భవేదగుణనిశ్చయః ।
గుణాన్నిఃసంశయాద్ రాజన్ నైర్గుణ్యం మన్యసే కథమ్ ॥ 16
రాజా! రాజసూయాన్ని ఆరంభించకపోతే మన బలహీనత నిరూపింపబడినట్లే. కాబట్టి సందేహానికి అవకాశం లేని నిశ్చయగుణాన్ని వీడి, నిర్గుణత్వకలంకాన్ని స్వీకరించటమెందుకు? (16)
కాషాయం సులభం పశ్చాత్ మునీనాం శమమిచ్ఛతామ్ ।
సామ్రాజ్యం తుభవేచ్ఛక్యం వయం యోత్స్యామహే పరాన్ ॥ 17
శాంతిని కోరుకొనే మునులకు వలె మనకు కాషాయవస్త్రాలు సులభంగా దొరుకుతాయి. కానీ మనం సామ్రాజ్యాన్ని పొందదగినవారం. శత్రువులతో యుద్ధమే చేస్తాం. (17)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి రాజసూయారంభపర్వణి జరాసంధవధమంత్రణే షోడశోఽధ్యాయః ॥ 16 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున రాజసూయారంభపర్వమను ఉపపర్వమున జరాసంధవధ మంత్రణమను పదునారవ అధ్యాయము. (16)