17. పదునేడవ అధ్యాయము

జరాసంధ జననవృత్తాంతము.

వాసుదేవ ఉవాచ
జాతస్య భారతే వంశే తథా కుంత్యాః సుతస్య చ ।
యా వై యుక్తా మతిః సేయమ్ అర్జునేన ప్రదర్శితా ॥ 1
వాసుదేవుడిలా అన్నాడు -
భారతవంశంలో పుట్టిన వానికి, కుంతికొడుకుగా పుట్టినవానికి తగినరీతిగా అర్జునుడు తన బుద్ధిని ప్రదర్శించాడు. (1)
న స్మ మృత్యం వయం విద్మ రాత్రౌ వా యది దివా ।
న చాపి కంచిదమరమ్ అయుద్ధేనానుశుశ్రుమ ॥ 2
చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది పగలో, రాత్రో కూడా మనమెరుగము. యుద్ధం మానినంత మాత్రాన ఎవ్వడూ చిరంజీవిగా నిలువడు. నిలిచినట్లు ఎప్పుడూ వినలేదు. (2)
ఏతావదేవ పురుషైః కార్యం హృదయతోషణమ్ ।
నయేన విధిదృష్టేన యదుపక్రమతే పరాన్ ॥ 3
తమ హృదయానందం కోసం రాజనీతి శాస్త్రానుసారం శత్రువులపై ఆక్రమణ చేయటమే వీరపురుషుల కర్తవ్యం. (3)
సునయస్యానపాయస్య సంయోగే పరమః క్రమః ।
సంగత్యా జయతేఽసామ్యం సామ్యం చ న భవేద్ ద్వయోః ॥ 4
అపాయరహితమయిన రాజనీతి, మంత్రాంగమూ పరాక్రమమూ కలిస్తే కార్యం పూర్తిగా సఫలమవుతుంది. శత్రువులతో కలిసినప్పుడే ఇరువురి మధ్య గల తేడా తెలిసేది. ఏ రెండు బలాలు సర్వవిధాలా సమానంగా ఉండే అవకాశమే లేదు. (4)
అనయస్యానుపాయస్య సంయుగే పరమః క్షయః ।
సంశయో జాయతే సామ్యాత్ జయశ్చ న భవేద్ ద్వయోః ॥ 5
ఉత్తమనీతి, మంచి ఉపాయమూ లేకుండా యుద్ధాన్ని ఆరంభిస్తే వినాశమే జరుగుతుంది. రెండుపక్షాలూ సమానంగా ఉంటే జయాపజయాలు ఇద్దరికీ సంశయాస్పదాలుగానే ఉంటాయి. (5)
తే వయం నయమాస్థాయ శత్రుదేహసమీపగాః ।
కథమంతం న గచ్ఛేమ వృక్షస్యేవ నదీరయాః ।
పరరంధ్రే పరాక్రాంతాః స్వరంధ్రావరణే స్థితాః ॥ 6
మనం కూడా రాజనీతిని ఆశ్రయిమ్చి శత్రుశరీరానికి దగ్గరగా పోగలిగితే, నదీవేగం చెట్టును కూల్చినట్లు అంతం చేయవచ్చు. మనం మనలోపాలను కప్పిపుచ్చుకొని శత్రువులోని లోపాలను అన్వేషించాలి. అప్పుడే అదను చూచి దెబ్బతీయవచ్చు. (6)
వ్యూఢానీకైరతిబలైః న యుద్ధ్యేదరిభిః సహ ।
ఇతి బుద్ధిమతాం నీతిః తన్మమాపీహ రోచతే ॥ 7
అత్యంతబలవంతులై వ్యూహాలు పన్ని ఉన్న శత్రువుల నెదిరించి యుద్ధం చేయదగదని నీతివేత్తల అభిప్రాయం. ప్రస్తుతం అదే నాకు కూడా మంచిదిగా కనిపిస్తోంది. (7)
అనవద్యా హ్యసంబుద్ధాః ప్రవిష్టాః శత్రుసద్మ తత్ ।
శత్రుదేహ ముపాక్రమ్య తం కామం ప్రాప్నుయామహే ॥ 8
చాటుమాటుగా శత్రువు ఇంట ప్రవేశించి శత్రువు శరీరాన్ని ఆక్రమించి మనపని ముగించుకోవటం మంచిది. అది నిందింపదగినదేమీ కాదు. (8)
ఏకోహ్యేవ శ్రియం నిత్యం బిభర్తి పురుషర్షభః ।
అంతరాత్మేవ భూతానామ్ తత్షయం నైవ లక్షయే ॥ 9
పురుషశ్రేష్ఠుడైన జరాసంధుడు ప్రాణులలో నున్న అంతరాత్మవలె ఎప్పుడూ ఒంటరిగా సామ్రాజ్యలక్ష్మిని అనుభవిస్తున్నాడు. కాబట్టి మరే ఉపాయంతోనూ ఆయనను నశింపజేయలేము. (9)
అథ వైనం నిహత్యాజే శేషేణాపి సమాహతాః ।
ప్రాప్నుయామ తతః స్వర్గం జ్ఞాతిత్రాణపరాయణాః ॥ 10
యుద్ధంలో జరాసంధుని చంపి ఒకవేళ మిగిలిన సేనల ద్వారా మనమే మరణించినా మనకు నష్టమేమీ లేదు. చెరలోని జ్ఞాతులను రక్షించటంలో ఆసక్తులమయి మరణించినందువలన వీరస్వర్గమే లభిస్తుంది. (10)
యుధిష్ఠిర ఉవాచ
కృష్ణ కోఽయం జరాసంధః కింవీర్యః కింపరాక్రమః ।
యస్త్వాం స్వృష్ట్వాగ్నిసదృశం న దగ్ధః శలభో యథా ॥ 11
యుధిష్ఠిరుడిలా అన్నాడు - కృష్ణా! ఎవరీ జరాసంధుడు? ఆయన శౌర్యపరాక్రమాలు ఎటువంటివి? అగ్నివంటి నీతో కలబడి కూడా మిడతలా ఎందుకు మాడిపోలేదు. (11)
కృష్ణ ఉవాచ
శృణు రాజన్ జరాసంధః యద్వీర్యో యత్పరాక్రమః ।
యథా చోపేక్షితోఽస్మాభిః బహుశః కృతవిప్రియః ॥ 12
కృష్ణుడిలా అన్నాడు -
రాజా! జరాసంధుడెవరో, ఎటువంటి శౌర్యపరాక్రమాలు గలవాడో, మాకు చాలాసార్లు కీడు చేసినా ఎందుకు ఉపేక్షించవలసి వచ్చినదో చెపుతా విను. (12)
అక్షౌహిణీనాం తిసృణాం పతిః సమరదర్పితః ।
రాజా బృహద్రథో నామ మగధాధిపతిర్బలీ ॥ 13
మగధ దేశాన్ని బృహద్రథుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన బలవంతుడు. మూడు అక్షౌహిణులకు అధిపతి. (13)
రూపవాన్ వీర్యసంపన్నః శ్రీమానతులవిక్రమః ।
నిత్యం దీక్షాంకితతనుః శతక్రతురివాపరః ॥ 14
బృహద్రథుడు అందగాడు. బలసంపన్నుడు. ధనవంతుడు. సాటిలేని పరాక్రమం గలవాడు. ఆయన శరీరం ఇంద్రుని శరీరం వలె ఎప్పుడూ యాగదీక్షాచిహ్నాలతో ఉండేది. (14)
తేజసా సూర్యసంకాశః క్షమయా పృథివీసమః ।
యమాంతకసమః క్రోధే శ్రియా వైశ్రవణోపమః ॥ 15
ఆయన తేజస్సులో సూర్యసమానుడు. ఓర్పులో భూమివంటివాడు. కోపంలో కాలునివంటివాడు. కుబేరుని వలె సంపన్నుడు. (15)
తస్యాభిజనసంయుక్తైః గుణైర్భరతసత్తమ ।
వ్యాప్తేయం పృథివీ సర్వా సూర్యస్యేవ గభస్తిభిః ॥ 16
భరతశ్రేష్ఠా! సూర్యకిరణాలు భూమండలమంతా వ్యాపించినట్టు వంశోచితమయిన ఆ బృహద్రథుని గుణాలు జగమంతా వ్యాపించాయి. (16)
స కాశిరాజస్య సుతే యమజే భరతర్షభ ।
ఉపయేమే మహావీర్యః రూపద్రవిణసంయుతే ।
తయోశ్చకార సమయం మిథః స పురుషర్షభః ॥ 17
నాతివర్తిష్య ఇత్యేవం పత్నిభ్యాం సంనిధౌ తదా ।
స తాభ్యాం శుశుభే రాజా పత్నీభ్యాం వసుధాధిపః ॥ 18
ప్రియాభ్యామనురూపాభ్యాం కరేణుభ్యామివ ద్విపః ।
భరతశ్రేష్ఠా! మహాపరాక్రమశాలి అయిన ఆ బృహద్రథుడు రూపసంపదతో కూడిన కాశిరాజ పుత్రికలను వివాహమాడాడు. ఆ కన్యలు కవలలు. ఇద్దరినీ సమానంగానే చూస్తానని ఆయన వారి దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. తనకు నచ్చిన ఆడయేనుగులతో గజరాజు శోభించినట్లు తన ఇద్దరు భార్యలతో ఆ మగధాధీశుడు ప్రకాశించాడు. (17, 18 1/2)
తయోర్మధ్యగతశ్చాపి రరాజ వసుధాధిపః ॥ 19
గంగాయమునయోర్మధ్యే మూర్తిమానివ సాగరః ।
గంగాయమునల మధ్య మూర్తీభూత సాగరుని వలె ఆ ఇద్దరు భార్యల మధ్య ఆ రాజు రాజిల్లాడు. (19 1/2)
విషయేషు నిమగ్నస్య తస్య యౌవనమభ్యగాత్ ॥ 20
న చ వంశకరః పుత్రః తస్యాజాయత కశ్చన ।
మంగళైర్బహుభిర్హోమైః పుత్రకామాభిరిష్టిభిః ।
నాససాద నృపశ్రేష్ఠః పుత్రం కులవివర్ధనమ్ ॥ 21
విషయాసక్తిలో నిమగ్నుడైన ఆయనయౌవనం గడచిపోయింది. కాని వంశవృద్ధికోసమై ఒక్క కొడుకు కూడా పుట్టలేదు. శుభప్రదాలయిన హోమాలతో, పుత్రకామయాగాలతో కూడా ఆ రాజన్యుడు వంశవర్ధనుడైన కొడుకును పొందలేకపోయాడు. (20,21)
అథ కాక్షీవతః పుత్రం గౌతమస్య మహాత్మనః ।
శుశ్రావ తపసి శ్రాంతమ్ ఉదారం చండకౌశికమ్ ॥ 22
యదృచ్ఛయాఽఽగతం తం తు వృక్షమూలముపాశ్రితమ్ ।
పత్నీభ్యాం సహితో రాజా సర్వరత్నైరతోషయత్ ॥ 23
ఒకమారు గౌతమగోత్రమహాత్ముడయిన కాక్షీవంతుని కుమారుడు, ఉదారుడు అయిన చండకౌశికుడు తపస్సుమాని అనుకోకుండా అటువైపు వచ్చి ఒక చెట్టుక్రింద నిలిచాడు. బృహద్రథుడు భార్యలతో పాటు ఆయనను దర్శించి వివిధ రత్నాలను కానుక చేసి ఆ మహర్షిని సంతుష్టుని చేశాడు. (22,23)
(బృహద్రథం చ స ఋషిః యథావత్ ప్రత్యనందత ।
ఉపవిష్టశ్చ తేనాథ అనుజ్ఞాతో మహాత్మనా ॥
తమపృచ్ఛత్ తదా విప్రః కిమాగమనమిత్యథ ।
పౌరైరనుగతస్వైవ పత్నీభ్యాం సహితస్య చ ॥
ఆ ఋషి బృహద్రథుని తగు రీతిగా ఆదరించాడు. ఆ మహనీయుని అనుమతితో బృహద్రథుడు ఆసీనుడయ్యాడు. అప్పుడు ఆ విప్రుడు "రాజా! భార్యలతో, పురజనులతో కలిసి నీవిక్కడకు రావటానికి కారణమేమిటి?" అని అడిగాడు.
స ఉవాచ మునిం రాజా భగవాన్ నాస్తి మే సుతః ।
అపుత్రస్య వృథా జన్మ ఇత్యాహుర్మనిసత్తమ ॥
ఆ రాజు మునితో ఇలా అన్నాడు - స్వామీ! నాకు కుమారుడు లేడు. పుత్రులు లేని వారి జన్మ నిరర్థకమని అంటారు కదా!
తాదృశస్య హి రాజ్యేన వృద్ధత్వే కిం ప్రయోజనమ్ ।
సోఽహం తపశ్చరిష్యామి పత్నీభ్యాం సహితో వనే ॥
సంతానహీనుడనైన నాకు ఈ వార్థక్యంలో ఈ రాజ్యంతో అవసరమేముంది? భార్యలను వెంటబెట్టుకొని అడవులకు పోయి తపస్సు చేసికొంటాను.
నా ప్రజస్య మునే కీర్తిః స్వర్గశ్చైవాక్షమో భవేత్ ।
ఏవముక్తస్య రాజ్ఞా తు మునేః కారుణ్యమాగతమ్ ॥)
మహర్షీ! సంతతి లేకపోతే కీర్తిలేదు. అక్షయ స్వర్గసుఖమూ కలుగదు.
రాజు ఆ రీతిగా పలుకగానే మునికి దయ గలిగింది.
తమబ్రవీత్ సత్యధృతిః సత్యవాగృషిసత్తమః ।
పరితుష్టోఽస్మి రాజేంద్ర వరం వరయ సువ్రత ॥ 24
తతః సభార్యః ప్రణతః తమువాచ బృహద్రథః ।
పుత్రదర్శననైరాశ్యాద్ బాష్పసందిగ్ధయా గిరా ॥ 25
సత్యధృతి, సత్యవాక్కు గల ఆ మునిశ్రేష్ఠుడు రాజుతో 'సువ్రతా! రాజేంద్రా! సంతోషించాను. వరాన్ని కోరుకో' అన్నాడు.
అప్పుడు బృహద్రథుడు భార్యలతో సహా మునికి నమస్కరించి పుత్రహీనత వలన కలిగిన నైరాశ్యంతో కన్నీరు కారి గొంతు బొంగురు పోగా ఆ మునితో ఇలా అన్నాడు. (24,25)
రాజోవాచ
భగవన్ రాజ్యముత్సృజ్య ప్రస్థితోఽహం తపోవనమ్ ।
కిం వరేణాల్పభాగస్య కిం రాజ్యేనాప్రజస్య మే ॥ 26
రాజు ఇలా అన్నాడు.
స్వామీ! రాజ్యాన్ని వీడి నేను తపోవనానికి బయలుదేరాను. అల్పభాగ్యుడైన నాకు వరమెందుకు? సంతానహీనుడనైన నాకు రాజ్యమెందుకు? (26)
కృష్ణ ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా మునిర్ధ్యానమ్ అగమత్ క్షుభితేంద్రియః ।
తస్వైవ చామ్రవృక్షస్య చ్ఛాయాయాం సముపావిశత్ ॥ 27
శ్రీకృష్ణుడిలా అన్నాడు -
ఈ మాటలు వినిన మునిమనస్సు ద్రవించింది. ఆ మామిడిచెట్టు నీడలోనే ఆయన ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. (27)
తస్యోపవిష్టస్య మునేః ఉత్సంగే నిపపాత హ ।
అవాతమశుకాదష్టమ్ ఏకమామ్రఫలం కిల ॥ 28
ఆ రీతిగా కూర్చున్న మునిఒడిలో ఒక మామిడి పండు పడింది. అది గాలికి రాలి పడినదీ కాదు. ఏ చిలుకో కొరికినదీ కాదు. (28)
తత్ ప్రగృహ్య మునిశ్రేష్ఠః హృదయేనాభిమంత్ర్య చ ।
రాజ్ఞే దదావప్రతిమం పుత్రసంప్రాప్తికారణమ్ ॥ 29
దానిని స్వీకరించి ఆ మునిశ్రేష్ఠుడు మనసా మంత్రించి పుత్రసంప్రాప్తి కారణమైన ఆ సాటిలేని పండును బృహద్రథమహారాజున కిచ్చాడు. (29)
ఉవాచ చ మహాప్రాజ్ఞః తం రాజానం మహామునిః ।
గచ్ఛ రాజన్ కృతార్థోఽసి నివర్తస్య నరాధిప ॥ 30
"రాజా! ధన్యుడవయ్యావు. ఇక వెనుకకౌ మళ్ళు" అని మహాప్రాజ్ఞుడైన ఆ మహాముని రాజుతో అన్నాడు. (30)
(ఏష తే తనయా రాజన్ మా తప్సీస్త్వం తపోవనే ।
ప్రజాః పాలయ ధర్మేణ ఏషధర్మో మహీక్షితామ్ ॥
రాజా! ఈ పండు వలన నీకు కుమారుడు పుడతాడు. అడవులలో తపస్సు చేయనవసరం లేదు. ధర్మబద్ధంగా ప్రజలను పాలించు. రాజుల ధర్మమిదియే.
యజస్వ వివిధైర్యజ్ఞైః ఇంద్రం తర్పయ చేందునా ।
పుతం రాజ్యే ప్రతిష్ఠాప్య తత ఆశ్రమమావ్రజ ॥
వివిధయాగాలను చెయ్యి. సోమరసంతో దేవేంద్రునకు తృప్తి కలిగించు. పుత్రునకు పట్టాభిషేకం చేసి ఆ తర్వాత వానప్రస్థానికి వెళ్ళు.
అష్టౌ వరాన్ ప్రయచ్ఛామి తవ పుత్రస్య పార్థివ ।
బ్రహ్మణ్యతామజేయత్వం యుద్ధేషు చ తథా రతిమ్ ॥
రాజా! నీ కుమారునకు ఎనిమిది వరాలనిస్తున్నాను. బ్రాహ్మణభక్తి, యుద్ధంలో ఓటమిలేకపోవటం, యుద్ధాసక్తి నశించకపోవటం............
ప్రియాతిథేయతాం చైవ దీనానామన్వవేక్షణమ్ ।
తథా బలం చ సుమహత్ లోకే కీర్తిం చ శాశ్వతీమ్ ॥
అనురాగం ప్రజానాం చ దదౌ తస్మై స కౌశికః ।)
అతిథులను ప్రేమగాచూడటం, దీనులను కాపాడటం, మహాబలం, లోకంలో శాశ్వతకీర్తి, ప్రజానురాగం - ఈ ఎనిమిది వరాలనిచ్చాడు చండకౌశికుడు.
ఏతచ్ఛ్రుత్వా మునేర్వాక్యం శిరసా ప్రణిపత్య చ ।
మునేః పాదౌమహాప్రాజ్ఞః స నృపః స్వగృహం గతః ॥ 31
ఆ రీతిగా పలికిన ముని మాటలు విని మహాప్రాజ్ఞుడైన ఆ బృహద్రథుడు ఆ ముని పాదాలకు నమస్కరించి తన గృహానికి వెళ్ళిపోయాడు. (31)
యథాసమయమాజ్ఞాయ తదా స నృపసత్తమః ।
ద్వాభ్యామేకం ఫలం ప్రాదాత్ పత్నీభ్యాం భరతర్షభ ॥ 32
భరతర్షభా! తగినసమయాన్ని గుర్తించి ఆ రాజశ్రేష్ఠుడు ఆ ఒక్క పండును భార్యల కిద్దరికీ ఇచ్చాడు. (32)
తే తదామ్రం ద్విధాకృత్వా భక్షయామాసతుః శుభే ।
భావిత్వాదపి చార్థస్య సత్యవాక్యతయా మునేః ॥ 33
తయోః సమభవద్ గర్భః ఫలప్రాశనసంభవః ।
తే చ దృష్ట్వా స నృపతిః పరాం ముదమవాస హ ॥ 34
ఆ శుభాంగనలు దానిని రెండుగా కోసి తిన్నారు. జరుగవలసినది జరిగి తీరుతుంది. కాబట్టి ఆ ముని సత్యవచనుడు కాబట్టి ఆ పండు తిన్నందువలన వారిరువురూ గర్భవతులయ్యారు. (33,34)
అథ కాలే మహాప్రాజ్ఞ యథాసమయమాగతే ।
ప్రజాయేతాముభే రాజన్ శరీరశకలే తదా ॥ 35
మహాప్రాజ్ఞా! రాజా! ప్రసవవేళ సమీపించగానే ఆ ఇద్దరు భార్యలూ చెరొక ముక్కగా ఒక శిశివుకు జన్మనిచ్చారు. (35)
ఏకాక్షిబాహుచరణే అర్ధోదరముఖ స్ఫిచే ।
దృష్ట్వా శరీరశకలే ప్రవేపతురుభే భృశమ్ ॥ 36
ఒక కన్ను, ఒక చేయి, ఒక కాలు, సగం ముఖం, సగం పొట్ట, నడుం క్రింది సగభాగం కల ఆ రెండు శరీరాల ముక్కలను చూచి వారెంతో కంపించిపోయారు. (36)
ఉద్విగ్నే సహ సమ్మంత్ర్య తే భగిన్యౌ తదాబలే ।
సజీవే ప్రాణిశకలే తత్యజాతే సుదుఃఖితే ॥ 37
అబల లయిన ఆ అక్కచెల్లెళ్లు ఇద్దరు కలతపడి, కలసి ఆలోచించి, ఎంతో దుఃఖిస్తూ సజీవంగా ఉన్న ఆ శరీరపు ముక్కలను విడిచిపెట్టారు. (37)
తయోర్ధాత్రౌ సుసంవీతే కృత్వా తే గర్భసంప్లవే ।
నిర్గమ్యాంతః పురద్వారాత్ సముత్సృజ్యాభిజగ్మతుః ॥ 38
వారిదాదులు ఆ పిండపు ముక్కలను గుడ్డలలో గట్టిగా చుట్టి అంతఃపురద్వారాల నుండి బయటకు వచ్చి వాటిని పారవేసి వెళ్ళారు. (38)
తే చతుష్పథనిక్షిప్తే జరా నామాథ రాక్షసీ ।
జగ్రాహ మనుజవ్యాఘ్ర మాంసశోణితభోజనా ॥ 39
నరశ్రేష్ఠా! మాంసం, నెత్తురు ఆహారంగా ఉన్న జర అనే పేరుగల రాక్షసి కూడలిలో విసరివేయబడిన ఆ శరీరపు ముక్కలను తీసికొన్నది. (39)
కర్తుకామా సుకవహే శకలే సా తు రాక్షసీ ।
సంయోజయామాస తదా విధానబలచోదితా ॥ 40
విధిప్రేరణచేత ఆ రాక్షసి ఆ ముక్కలను మోసుకొనిపోవటానికి వీలుగా కలిపింది. (40)
తే సమానీతమాత్రే తు శకలే పురుషర్షభ ।
ఏకమూర్తిధరో వీరః కుమారః సమపద్యత ॥ 41
పురుషశ్రేష్ఠా! కలిపీ కలపగానే ఆ ముక్కలు ఒకే రూపాన్ని ధరించి వీరకుమారుడుగా రూపొందాయి. (41)
తతః సా రాక్షసీ రాజన్ విస్మయోత్ఫుల్లలోచనా ।
న శశాక సముద్వోఢుం వజ్రసారమయం శిశుమ్ ॥ 42
రాజా! అప్పుడా రాక్షసి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. వజ్రంతో చేసినట్టు అనిపించాడు ఆ శిశువు. ఆమె ఆ బరువు మోయలేకపోయింది. (42)
బాలస్తామ్రతలం ముష్టిం కృత్వా చాస్యే నిధాయ సః ।
ప్రాక్రోదశతిసంరబ్ధః సతోయ ఇవ తోయదః ॥ 43
ఆ శిశువు మరీ ఎర్రగా ఉన్న తన చేతుల పిడికిలి బిగించి ముఖంలో నుంచుకొని కోపంతో, నీలమేఘస్వనంతో ఏడవసాగాడు. (43)
తేన శబ్దేన సంభ్రాంతః సహసాంతఃపురే జనః ।
నిర్జగామ నరవ్యాఘ్ర రాజ్ఞా సహ పరంతప ॥ 44
పరంతపా! రాజా! ఆ శబ్దంతో అంతఃపురకాంతలంతా తొట్రుపడుతూ వెంటనే రాజుతో సహావెలుపలికి వచ్చారు. (44)
తే చాబలే పరిమ్లానే పయఃపూర్ణపయోధరే ।
నిరాశే పుత్రలాభాయ సహసైవాభ్యగచ్ఛతామ్ ॥ 45
అప్పటికే పుత్రలాభాన్ని గురించి నిరాశతో ఉన్న ఆ రాణులిద్దరూ పాలు నిండిన రొమ్ములతో, వాడిపోయిన ముఖాలతో వెంటనే వచ్చారు. (45)
అథ దృష్ట్వా తథాభూతే రాజానం చేష్టసంతతిమ్ ।
తం చ బాలం సుబలినం చింతయామాస రాక్షసీ ॥ 46
నార్హామి విషమే రాజ్ఞః వసంతీ పుత్రగృద్ధినః ।
బాలం పుత్రమిమం హంతుం ధార్మికస్య మహాత్మనః ॥ 47
ఉదాసీనంగా ఉన్న రాణులను, పుత్రప్రాప్తికై ముచ్చటపడుతున్న రాజును, బలిష్ఠుడైన ఆ బాలకుని చూచి ఆ రాక్షసి ఇలా ఆలోచించింది - నేను ఈ రాజు రాజ్యంలో ఉన్నాను. ఈ రాజు ధర్మాత్ముడు, మహాత్ముడు. సంతానాన్ని కోరుతున్నాడు. అటువంటి రాజుకొడుకును నేను హత్య చేయకూడదు. (46,47)
సా తమ్ బాలముపాదాయ మేఘలేఖేవ భాస్కరమ్ ।
కృత్వా చ మానుషం రూపమువాచ వసుధాధిపమ్ ॥ 48
ఆ తరువాత ఆ రాక్షసి మానుషరూపాన్ని ధరించి మేఘసముహం భాస్కరుని మోసినట్లు ఆ బాలుని తీసికొని రాజును సమీపించి ఇలా అన్నది. (48)
రాక్షస్యువాచ
బృహద్రథ సుతస్తేఽయం మయా దత్తః ప్రగృహ్యతామ్ ।
తవ పత్నీద్వయే జాతో ద్విజాతివరశాసనాత్ ।
ధాత్రీజనపరిత్యక్తః మయాయం పరిరక్షితః ॥ 49
రాక్షసి ఇలా అన్నది -
బృహద్రథా! ఈ శిశువు నీ కుమారుడు, నేనిస్తున్నాను. స్వీకరించు. బ్రహ్మర్షి అనుశాసనంతో నీ భార్యలిద్దరి యందు జన్మించాడు. దాదులు వదలివేస్తే నేను రక్షించాను. (49)
శ్రీకృష్ణ ఉవాచ
తతస్తే భరతశ్రేష్ఠ కాశిరాజసుతే శుభే ।
తం బాలమభిపద్యాశు ప్రస్రవైరభ్యషించతామ్ ॥ 50
శ్రీకృష్ణుడిలా అన్నాడు.
భరతశ్రేష్ఠా! ఆ తరువాత శుభాంగనలైన ఆ కాశిరాజు పుత్రికలు ఆ బాలుని వెంటనే ఎత్తికొని చనుబాలతో అభిషేకించారు. (50)
తతః స రాజా సంహృష్టః సర్వం తదుపలభ్య చ ।
అపృచ్ఛద్ధేమగర్భాభాం రాక్షసీం తామరాక్షసీమ్ ॥ 51
అదంతా చూచి, విని ఆనందించిన ఆ బృహద్రథనరపతి స్వర్ణకాంతులతో విరాజిల్లుతున్న ఆ మానుష వేష రాక్షసిని ఇలా అడిగాడు. (51)
రాజోవాచ
కా త్వం కమలగర్భాభే మమ పుత్రప్రదాయినీ ।
కామయా బ్రూహి కళ్యాణి దేవతా ప్రతిభాసి మే ॥ 52
రాజు ఇలా అన్నాడు.
కమలగర్భాభా! నాకు పుత్రప్రదానం చేసిన నీవు ఎవర్తెవు? చెప్పు. స్వేచ్ఛాచారిణివయిన ఏ దేవతవో అయి ఉంటావని నాకనిపిస్తోంది. (52)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి రాజసూయారంభపర్వణి జరాసంధోత్పత్తౌ సప్తదశోఽధ్యాయః ॥ 17 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున రాజసూయారంభపర్వమను ఉపపర్వమున జరాసంధోత్పత్తి అను పదునేడవ అధ్యాయము. (17)
(దాక్షిణాత్య అధికపాఠము 9 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 61 1/2 శ్లోకాలు)