22. ఇరువది రెండవ అధ్యాయము
జరాసంధుడు యుద్ధమునకు సిద్ధమగుట, కృష్ణ జారాసంధుల వైరకారణము.
జరాసంధ ఉవాచ
న స్మరామి కదా వైరం కృతం యుష్మాభిరిత్యుత ।
చింతయంశ్చ న పశ్యామి భవతాం ప్రతి వైకృతమ్ ॥ 1
జరాసంధుడు పలికాడు - బ్రాహ్మణులారా! మీతో నాకు యుద్ధకారణం ఎంత ప్రయత్నించినా గుర్తురావటం లేదు. ఎంత ఆలోచించినా నాకు మీకు మధ్య వైరకారణం తెలియటం లేదు. (1)
వైకృతే వా సతి కథం మన్యధ్వం మామనాగసమ్ ।
అరిమ్ వై బ్రూత హే విప్రాః సతాం సయమ ఏష హి ॥ 2
బ్రాహ్మణులారా! నేను మీపట్ల అపకారం చేయనప్పుడు మీకు నేను శత్రువును ఎలా అవుతాను? చెప్పండి. ఇది సత్పురుషుల నియమమేనా! (2)
అథ ధర్మోపఘాతాద్ధి మనః సముపతప్యతే ।
యోఽనాగసి ప్రసజతి క్షత్రియో హి న సంశయః ॥ 3
అతోఽన్యథా చరం ల్లోకే ధర్మజ్ఞః సన్ మహారథః ।
వృజినాం గతి మప్నోతి శ్రేయసోఽప్యుపహంతి చ ॥ 4
ధర్మానికి పీడ కలిగినప్పుడు తప్పక మనస్సునకు సంతాపం కల్గుతుంది. ధర్మజ్ఞుడైన క్షత్రియుడు నిరపరాధి పట్ల విపరీత ఆచరణం చేయడు. నిరపరాధులను బాధించిన మహారథుడైన క్షత్రియుడు ధనాన్ని, ధర్మాన్ని పోగొట్టుకొని కష్టాన్ని పొందుతాడు. తన శ్రేయస్సుకు దూరమౌతాడు. ఇది సత్యం. (3,4)
త్రైలోక్యే క్షత్రధర్మో హి శ్రేయాన్ వై సాధుచారిణామ్ ।
నాన్యం ధర్మం ప్రశంసంతి యే చ ధర్మవిదో జనాః ॥ 5
సజ్జనధర్మాన్ని చక్కగా పాలించేవారికి ముల్లోకాల్లోను క్షత్రియధర్మమే శ్రేష్ఠమైంది. ధర్మజ్ఞులు క్షత్రియులు ఇతర ధర్మాలను ప్రశంసించారు. (5)
తస్య మేఽద్య స్థితస్యేహ స్వధర్మే నియతాత్మనః ।
అనాగసం ప్రజానాం చ ప్రమాదాదివ జల్పథ ॥ 6
నేను నా మనస్సును వశపరచుకొని స్వధర్మపాలనం చేస్తున్నాను. ప్రజలపట్లకూడ అపరాధిని కాను. అలాంటి నన్ను మీరెందుకో అపరాధిగా భావిస్తున్నారు. (6)
శ్రీకృష్ణ ఉవాచ
కులకార్యే మహాబాహో కశ్చిదేకః కులోద్వహః ।
వహతే యస్తన్నియోగాద్ వయమభ్యుద్యతాస్త్వయి ॥ 7
శ్రీకృష్ణుడు అన్నాడు. మహాబాహు! మంచికులంలో ఒకే ఒకడు ఆ వంశభారాన్ని మోస్తాడు. ఆ కులరక్షన అతనిపై ఆధారపడింది. అలాంటి మహాపురుషుని ఆజ్ఞానుసారం మేము నిన్ను శిక్షించటానికి వచ్చాం. (7)
త్వయా చోపహృతా రాజన్ క్షత్రియా లోకవాసినః ।
తదాగః క్రూరముత్పాద్య మన్య్సే కిమనాగసమ్ ॥ 8
రాజా! నీచే భూలోకవాసులైన రాజేంద్రులెందరో బందీలుగా చేయబడ్డారు. అంత అపరాధం చేసినా నిన్ను నీవు నిరపరాధిగా భావించుకొంటున్నావు. (8)
రాజా రాజ్ఞః కథం సాధూన హింస్యాన్నృపతిసత్తమ ।
తద్రాజ్ఞః సంనిగృహ్య త్వం రుద్రాయోపజిహీర్షసి ॥ 9
రాజా! శ్రేష్ఠుడైన రాజు శ్రేష్ఠులైన ఇతర రాజులను ఎందుకు చంపాలి? ఆ రాజులను బంధిమ్చి రుద్రునికి కానుకగా సమర్పిస్తున్నావు. (9)
అస్మాంస్తదేనో గచ్ఛేద్ధి కృతమ్ బార్హద్రథత్వయా ।
వయం హి శక్తా ధర్మస్య రక్షణే ధర్మచారిణః ॥ 10
జరాసంధా! నీచే చేయబడ్డ పాపం అందరిపైనా పడుతోంది. మేము ధర్మరక్షణంలో, పాలనంలో సమర్థులం. (10)
మనుష్యాణాం సమాలంభః న చ దృష్టః కదాచన ।
స కథం మానుషైర్దేవం యష్టుమిచ్ఛసి శంకరమ్ ॥ 11
దేవతలను పూజించటం కోసం మనుష్యులను వధించటం ఎక్కడా చూడలేదు. కళ్యాణకరుడైన శంకరుని పూజించటానికి మనుష్యులను హింసించడం ఎందుకు? (11)
సవర్ణో హి సవర్ణానాం పశుసంజ్ఞాం కరిష్యసి ।
కోఽన్య ఏవం యథా హి త్వం జరాసంధ వృథామతిః ॥ 12
జరాసంధా! నీ బుద్ధి నశించింది. నీవెలా క్షత్రియుడవో అలాగే వారూ క్షత్రియులు. వారిని పశువులుగా చేసి చంపుతున్నావు. నీవంటి క్రూరుడు వేరొకడు లేడు. (12)
యస్యాం యస్యామవస్థాయాం యద్ యత్ కర్మ కరోతి యః ।
తస్యాం తస్యామవస్ధాయాం తత్ ఫలం సమవాప్నుయాత్ ॥ 13
ఎవడు ఏ ఏ అవస్థలో ఏ ఏ కర్మలు చేస్తాడో వాడు ఆయా అవస్థలలో అలాంటి ఫలాలనే పొందుతాడు. (13)
తే త్వాం జ్ఞాతిక్షయకరం వయమార్తానుసారిణః ।
జ్ఞాతి వృద్ధినిమిత్తార్థం వినిహంతుమిహాగతాః ॥ 14
నీవు నీజాతి వారిని చంపే హంతకుడవు. మేము ఆపదలలో ఉన్న దీనులను రక్షించే శీలం కలవారం. సజాతీయులైన క్షత్రియుల అభివృద్ధికై నిన్ను చంపటానికి ఇక్కడకు వచ్చాం. (14)
నాస్తి లోకే పుమానన్యః క్షత్రియేష్వితి చైవ తత్ ।
మన్యసే స చ తే రాజన్ సుమహాన్ బుద్ధివిప్లవః ॥ 15
రాజా! క్షత్రియులలో నావంటి వీరుడు వేరొకడు ఈ లోకంలో లేడని నీవు భావిస్తున్నావు. అది అంతా నీ బుద్ధి వలన ఏర్పడిన భ్రమ మాత్రమే. (15)
కో హి జానన్నభిజనమ్ ఆత్మవాన్ క్షత్రియో నృప ।
వావిశేత్ స్వర్గమతులం రణానంతరమవ్యయమ్ ॥ 16
రాజోత్తమా! స్వాభిమాని అయిన రాజు ఎవరయినా అయినవారిని తెలిసి చంపటానికి ప్రయత్నిస్తాడా? దీనిద్వారా అక్షయమైన స్వర్గాన్ని దూరం చేసుకొంటాడా? (16)
స్వర్గం హ్యేవ సమాస్థాయ రణయజ్ఞేషు దీక్షితాః ।
జయంతి క్షత్రియా లోకాన్ తద్ విద్ధి మనుజర్షభ ॥ 17
రాజశ్రేష్ఠా! స్వర్గప్రాప్తికై యుద్ధమనే యజ్ఞంలో దీక్షగైకొని క్షత్రియులు తమకిష్టమైన లోకాలను జయిస్తున్నారు. దీనిని నీవు తెలుసుకో. (17)
స్వర్గయోనిర్మహద్ బ్రహ్మ స్వర్గయోనిర్మహద్ యశః ।
స్వర్గయోనిస్తపో యుద్ధే మృత్యుః సోఽవ్యభిచారవాన్ ॥ 18
వేదాధ్యయనం స్వర్గాన్నిస్తుంది. పరోపకారం వల్ల కలిగిన కీర్తి స్వర్గానిస్తుంది. తపస్సు స్వర్గాన్ని స్థిరం చేస్తుంది. ఈ మూడింటికంటె యుద్ధంలో మరణించటం ద్వారా స్వర్గాన్ని పొందటం క్షత్రియునికి ఉత్తమం. (18)
ఏష హ్యైంద్రో వైజయంతః గుణైర్నిత్యం సమాహితః ।
యేనాసురాన్ పరాజిత్య జగత్ పాతి శతక్రతుః ॥ 19
క్షత్రియునికి యుద్ధంలో మరణించటం ఇంద్రుని వైజయంతీ భవనంలో నివసించటంతో సమానం. ఇది ఎల్లప్పుడు గుణాలతో నిండి ఉంటుంది. ఈ యుద్ధం ద్వారానే ఇంద్రుడు రాక్షసులను జయించి సర్వరక్షణం చేస్తున్నాడు. (19)
స్వర్గమార్గాయ కస్య స్యాద్ విగ్రహో వై యథా తవ ।
మాగధైర్విపులైః సైన్యైః బాహుళ్యబలదర్పితః ॥ 20
మావమంస్థాః పరాన్ రాజన్ అస్తి వీర్యం నరే నరే ।
సమం తేజస్త్వయా చైవ విశిష్టం వా నరేశ్వర ॥ 21
మాతో నీకు జరుగబోయే యుద్ధం నీకు స్వర్గప్రాప్తికి కారణం అవుతుంది. అట్టి యుద్ధం ఎవరికి చిక్కుతుంది? 'నా వద్ద చాలాసేన ఉంది' అని గర్వంతో మగధసేనలతో లోకాన్ని జయించి ఇతర రాజుల్ని అవమానింపవద్దు. ప్రతిమనుజుని యందు బలపరాక్రమాలు ఉన్నాయి. కొందరిలో నీతో సమానంగానూ, కొందరిలో నీకంటె అధికంగాను తేజస్సు ఉంది. (20,21)
యావదేతదసంబుద్ధం తావదేవ భవేత్ తవ ।
విషహ్యమేతదస్మాకమ్ అతో రాజన్ బ్రవీమి తే ॥ 22
ఎంతవరకు ఈ విషయాన్ని నీవు గుర్తింపవో, అంతవరకు నీ గర్వం వృద్ధి చెందుతుంది. ఈ నీ గర్వం మావంటివారికి సహింపరానిది. అందుచే నీకీ హితవు చెప్తున్నాను. (22)
జహి స్వం సదృశేష్వేవ మానం దర్పం చ మాగధ ।
మా గమః ససుతామాత్యః సబలశ్చ యమక్షయమ్ ॥ 23
మగధరాజా! నీవు నీ సమానవీరుల పట్ల అభిమానాన్ని, గర్వాన్ని విడచిపెట్టు. ఈ గర్వంతో పుత్ర, మంత్రి, సేనాసహితంగా యమలోకానికి పోవద్దు. (23)
దంభోద్భవః కార్తవీర్యః ఉత్తరశ్చ బృహద్రథః ।
శ్రేయసో హ్యవమన్యేహ వినేశుః సబలా నృపాః ॥ 24
దంభోద్భవుడు, కార్తవీర్యార్జునుడు, ఉత్తరుడు, బృహద్రథుడు తమ కంటె ఉత్తములను అవమానించి సేనలతో సహా నశించిపోయారు. (24)
యుయుక్షమాణాస్త్వత్తో హి న వయం బ్రాహ్మణా ధ్రువమ్ ।
శౌరిరస్మి హృషీకేశః నృవీరౌ పాండవావిమౌ ।
అనయోర్మాతులేయం చ కృష్ణం మాం విద్ధి తే రిపుమ్ ॥ 25
నీతో యుద్ధాన్ని కోరే మేము నిశ్చయంగా బ్రాహ్మణులం కాము. నేను వసుదేవుని పుత్రుడనైన హృషీకేశుడను. వీరిరువును పాండుపుత్రులు భీమార్జునులు. నేను వీరిరువురి మామకొడుకును. నికు ప్రసిద్ధుడైన శత్రువును. నన్ను బాగుగా గుర్తించు. (25)
త్వామాహ్వయామహే రాజన్ స్థిరో యుధ్యస్వ మాగధ ।
ముమ్చ వా నృపతీన్ సర్వాన్ గచ్ఛ వా త్వం యమక్షయమ్ ॥ 26
మగధరాజా! మేము నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాం. నీవు రాజులందరినీ విడిచిపెట్టు లేదా యమలోకానికి పో. (26)
జరాసంధ ఉవాచ
నాజితాన్ వై నరపతీన్ అహమాదద్మికాంశ్చన ।
అజితః పర్యవస్థాతా కోఽత్ర యో న మయా జితః ॥ 27
జరాసంధుడు అన్నాడు - శ్రీకృష్ణా! నేను యుద్ధంలో జయించి రాజులందరినీ బందీలుగా చేశాను. నేను జయింపని శత్రురాజొక్కడైనా ఇక్కడ లేడు. (27)
క్షత్రియస్యైతదేవాహుః ధర్మ్యం కృష్ణోపజీవనమ్ ।
విక్రమ్య వశమానీయ కామతో యత్ సమాచరేత్ ॥ 28
శ్రీకృష్ణా! క్షత్రియునకు ఇదే జీవితమ్ నిర్ణయింపబడి ధర్మబద్ధమైంది. పరాక్రమంతో శత్రువులను వశపరచుకొని వారితో స్వేచ్ఛగా ప్రవర్తించాలి. (28)
దేవతార్థముపాహృత్య రాజ్ఞః కృష్ణ కథం భయాత్ ।
అహమద్య విముచ్యేయం క్షాత్రంవ్రతమనుస్మరన్ ॥ 29
నేను క్షత్రియనియమాలను గుర్తుంచుకుని పాటిస్తూ ఎల్లప్పుడు దేవతల కొరకు బలిగా ఇచ్చేరాజులను కానుకగా తెచ్చి మీభయంతో వరినిప్పుడు ఎట్లు విడిచిపెడతాను? (29)
సైన్యం సైన్యేన వ్యూఢేన ఏక ఏకేన వా పునః ।
ద్వాభ్యాం త్రిభిర్వా యోత్స్యేఽహమ్ యుగపత్ పృథగేవ వా ॥ 30
మీసేన వ్యూహనిర్మితమైన నా సేనతోగాని, నేను మీలో ఒక్కరితో గాని, ఇద్దరితో, ముగ్గురుతోగాని విడివిడిగా గాని, కలిపిగాని యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. (30)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా జరాసంధః సహదేవాభిషేచనమ్ ।
ఆజ్ఞాపయత్ తదో రాజా యుయుత్సుర్భీమకర్మభిః ॥ 31
వైశంపాయనుడు అన్నాడు. - ఇలా పలికి భయానక కర్మలను ఆచరించే ఆ ముగ్గురు యోధులతో యుద్ధం చేయ పూనుకొని జరాసంధుడు తన పుత్రుడైన సహదేవుని పట్టాభిషేకానికై ఆజ్ఞ ఇచ్చినాడు. (31)
స తు సేనాపతిం రాజా సస్మార భరతర్షభ ।
కౌశికం చిత్రసేనం చ తస్మిన్ యుద్ధ ఉపస్థితే ॥ 32
పిమ్మట యుద్ధం సమీపింపగా జరాసంధుడు కౌశికుడు, చిత్రసేనుడు అనే నిర్జీవులైన తన సేనాపతులను స్మరించాడు. (32)
యయోస్తే నామనీ రాజన్ హంసేతి డింభకేతి చ ।
పూర్వం సంకథితం పుంభిః నృలోకే లోకసత్కృతే ॥ 33
ఎవరిపేర్లను పూర్వం హంస, డింభకులని కీర్తించామో వారే వీరు. మనుజలోకంలో ప్రతివాడు వీరిపట్ల పెద్ద ఆదరభావం కలవాడే. (33)
తం తు రాజన్ విభుః శౌరీ రాజానం బలినాం వరమ్ ।
స్మేఏఉత్వా పురుషశార్దూలః శార్దూలసమవిక్రమమ్ ॥ 34
సత్యసంధో జరాసంధం భువి భీమపరాక్రమమ్ ।
భాగమన్యస్య నిర్దిష్టమవధ్యం మధుభిర్మృధే ॥ 35
నాత్మనాఽఽత్మవతాం ముఖ్యమ్ ఇయేష మధుసూదానః ।
బ్రాహ్మీమాజ్ఞాం పురస్కృత్య హంతుం హలధరానుజః ॥ 36
అదే సమయంలో పురుషులలో శ్రేష్ఠుడు, అభిమానవంతుడు, సత్యప్రతిజ్ఞకలవాడు, సింహపరాక్రమవంతుడు, వసుదేవకుమారుడు, బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు దివ్యదృష్టిచే జరాసంధుని పూర్వచరిత్రను స్మరించాడు. సింహంతో సమానపరాక్రమం, భయానక పురుషార్థాలు ప్రదర్శింపగల జరాసంధుని వధను గూర్చి తెలిసికొన్నాడు. యదు వంశీయులకు ఇతడు అవధ్యుడు. బ్రహ్మవరానుసారం స్వయంగా అతడిని చంపటానికి ఇష్టపడలేదు. (34-36)
(జనమేజయ ఉవాచ
కిమిర్థం వైరిణావాస్తామ్ ఉభౌ తౌ కృష్ణమాగధౌ ।
కథం చ నిర్జితః సంఖ్యే జరాసంధేన మాధవః ॥
జనమేజయుడు అడిగాడు - శ్రీకృష్ణజరాసంధులకు పరస్పరం కలహం ఎలా ఏర్పడింది. అప్పుడు జరాసంధుడు యదుశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని ఎలా జయించాడు.
కశ్చ కంసో మాగధస్య యస్య హేతోః స వైరవాన్ ।
ఏతదాచక్ష్వ మే సర్వం వైశంపాయన తత్త్వతః ॥
కంసుడు మగధరాజు జరాసంధునకు ఏమవుతాడు? ఏకారణమ్గా శ్రీకృష్ణునితో శత్రుత్వం కలిగింది? వైశంపాయనా! ఈ వృత్తాంతాన్ని పూర్తిగా నాకు వినిపించు.
వైశంపాయన ఉవాచ
యాదవానామన్వవాయే వసుదేవో మహామతిః ।
ఉదపద్యత వార్ష్ణేయ హ్యుగ్రసేనస్య మంత్రభృత్ ॥
వైశంపాయనుడు అన్నాడు - రాజా! యాదవవంశంలో బుద్ధిమంతుడు వసుదేవుడు పుట్టాడు. అతడు యాదవుల రాజైన ఉగ్రసేనునికి నమ్మకమైన మంత్రి.
ఉగ్రసేనస్య కంసస్తు బభూవ బలవాన్ సుతః ।
జ్యేష్ఠో బహూనాం కౌరవ్య సర్వశాస్త్రవిశారదః ॥
ఉగ్రసేనుని పుత్రులలో బలవంతుడు కంసుడు అందరికంటె పెద్దవాడు. అతడు అన్ని శస్త్ర విద్యలలో ఆరితేరాడు.
జరాసంధుని కుమార్తె అతని భార్య, మిక్కిలి ప్రసిద్ధమైనది. రాజ్యశుల్కంగా తన భర్తను పట్టాభిషిక్తుని చేసే నియమంతో ఆమె జరాసంధునిచే ఇవ్వబడింది.
తదర్థముగ్రసేనస్య మథురాయాం సుతస్తదా ।
అభిషిక్తస్తదామాత్యైః స వై తీవ్రపరాక్రమః ॥
ఆ నియమపాలనానికై ఉగ్రసేనుని పెద్దకుమారుడు, అమోఘపరాక్రమవంతుడు కంసుడు మథురానగరానికి మంత్రుల ద్వారా పట్టాభిషిక్తుడు అయ్యాడు.
ఐశ్వర్యబలమత్తస్తు స తదా బలమోహితః ।
నిగృహ్య పితరం భుంక్తే తద్ రాజ్యం మంత్రిభిః సహ ॥
ఐశ్వర్యబలమత్తుడై అతడు తన తండ్రిని బందీని కావించి ఆ రాజ్యాన్ని మంత్రులతో కలిసి అనుభవించసాగాడు.
వసుదేవస్య తత్ కృత్యం న శృణోతి స మందధీః ।
స తేన సహ తద్ రాజ్యం ధర్మతః పర్యపాలయత్ ॥
తెలివితక్కువవాడైన కంసుడు వసుదేవుని మంచి ఆదేశాలను పాటించటం లేదు. అయినా ధర్మబుద్ధికల వసుదేవుడు ఆ రాజ్యాన్ని ధర్మంగా పరిపాలింపజేస్తున్నాడు.
ప్రీతిమాన్ స దైత్యేంద్రః వాసుదేవస్య దేవకీమ్ ।
ఉవాహ భార్యాం స తదా దుహితా దేవకస్య యా ॥
దైత్యేంద్రుడైన కంసుడు మిక్కిలి ప్రసన్నుడై వసుదేవునికి దేవకుని పుత్రిక అయిన దేవకితో వివాహం జరిపించాడు. దేవకుడు ఉగ్రసేనుని సోదరుడు.
తస్యాముద్వాహ్యమానాయాం రథేన జనమేజయ ।
ఉపారురోహ వార్ష్ణేయం కంసో భూమిపతిస్తదా ॥
వసుదేవుడు దేవకీదేవిని రథమెక్కించి తీసికొనిపోతున్నప్పుడు మహారాజు కంసుడు కూడ రథమెక్కి బయలుదేరాడు.
తతోంతఽరిక్షే వాగాసీద్ దేవదూతస్య కస్యచిత్ ।
వసుదేవశ్చ శుశ్రావ తాం వాచం పార్థివశ్చ సః ॥
ఆకాశంలో ఒక దేవదూత వాణి స్పష్టంగా వినిపించింది వసుదేవుడు, కంసుడు ఆ అశరీరవాణిని విన్నారు.
యామేతాం వహమానోఽద్య కంసోద్వహడి దేవకీమ్ ।
అస్యా యశ్చాష్టమో గర్భః స తే మృత్యుర్భవిష్యతి ॥
కంసుడా! నేడు ఏ దేవకిని నీవు రథంపై తీసుకొని మధురకు పోతున్నావో ఆమె ఎనిమిదవ గర్భంలో నీ మృత్యువు జన్మిస్తాడు.
సోఽవతీర్య తతో రాజా ఖడ్గముద్ ధృత్య నిర్మలమ్ ।
ఇయేష తస్యా మూర్ధానం ఛేత్తుం పరమదుర్మతిః ॥
ఆ ఆకాశవాణి మాటలను విని కంసుడు పరమదుర్బుద్ధి కలవాడై పదునైన ఖడ్గాన్ని తీసి ఆమె శిరస్సును ఖండింపబోయాడు.
స సంత్వాయంస్తదా కంసం హసన్ క్రోధవశానుగమ్ ।
రాజన్ననునయామాస వసుదేవో మహామతిః ॥
అదే సమయాన వివేకి అయిన వసుదేవుడు నవ్వుతూ క్రోధవశుడైన కంసుని ఊరడిస్తూ అతనిని బ్రతిమాలుకొన్నాడు.
అహింస్యాం ప్రమదామాహుః సర్వధర్మేషు పార్థివ ।
అకస్మాదబలాం నారీం హంతాసీమామనాగసీమ్ ॥
రాజా! అన్ని ధర్మములందు స్త్రీ చంపగూడనిదని నిర్ణయం. హఠాత్తుగా నిరపరాధి, అబల అయిన ఈమెను ఎందుకు చంప బోతున్నావు?
యచ్చ తేఽత్ర భయం రాజన్ శక్యతే భాధితుం త్వయా ।
ఇయం చ శక్యా పాలయితుం సమయశ్చైవ రక్షితుమ్ ॥
రాజా! నీకు దేనివల్ల భయమో దానిని నీవు తొలగించుకోవచ్చును. ఈమెనూ రక్షించుకోవచ్చు. నీ ప్రతిజ్ఞనూ రక్షించుకోవచ్చును.
అస్యాస్త్వమష్టమం గర్భం జాతమాత్రం మహిపతే ।
విధ్వంసయ తదా ప్రాప్తమ్ ఏవం పరిహతం భవేత్ ॥
ఈమె ఎనిమిదవ గర్భంలోని పుత్రుని వెంటనే నాశనం చేయి. నీకు రాగల ఆపద నివారింపబడుతుంది.
ఏవం స రాజా కథితః వసుదేవేన భారత ।
తస్య తద్ వచనం చక్రే శూరసేనాధిపస్తదా ॥
తతస్తస్యాం సంబభూవుః కుమారాః సూర్యవర్చసః ।
జాతాన్ జాతాంస్తు తాన్ సర్వాన్ జఘాన మధురేశ్వరః ॥
వసుదేవుని వచనానుసారం శూరసేనదేశపు రాజైన కంసుడు ఆ మాటలను అంగీకరించాడు. పిమ్మట ఆ మాటలను అంగీకరించాడు. పిమ్మట సూర్యసమతేజోవంతులు కుమారులు పుట్టారు. పుట్టినవారిని పుట్టినట్లుగా అందరినీ మధురాధిపుడు చంపివేశాడు.
అథ తస్యాం సమభవద్ బలదేవస్తు సప్తమః ।
యామ్యయా మాయయా తం తు యమో రాజా విశాంపతే ॥
దేవక్యా గర్భమతులం రోహిణ్యా జఠరేఽక్షిపతే ।
ఆకృష్య కర్షణాత్ సమ్యక్ సంకర్షణ ఇతి స్మృతః ॥
బలశ్రేష్ఠతయా తస్య బలదేవ ఇతి స్మృతః ।
అనంతరం దేవకీగర్భాన ఏడవవాడుగా బలరాముడు పుట్టాడు. యముడు తన మాయచే సాటిలేని ఆ గర్భాన్ని రోహిణి దేవి ఉదరంలో ప్రవేశపెట్టాడు. ఆకర్షణ కల్గియుండటం చేత అతడు సంకర్షణుడనే పేరు పొందాడు. బలప్రధానుడైనందున బలదేవుడనే పేరు వచ్చింది.
పునస్తస్యాం సమభవద్ అష్టమో మధుసూదనః ॥
తస్య గర్భస్య రక్షాం తు చక్రే సోఽభ్యధికం నృపః ।
తిరిగి దేవకీ గర్భాన ఎనిమిదవవాడుగా మధుసూదనుడు పుట్టాడు. రాజైన కంసుడు ఆ గర్భాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షించాడు.
తతః కాలే రక్షణార్థం వసుదేవస్య సాత్వతః ।
ఉగ్రః ప్రయుక్తః కంసేన సచివః క్రూరకర్మకృత్ ।
విమూఢేషు ప్రభావేన బాలస్యోత్తీర్య తత్ర వై ॥
ఉపాగమ్య స ఘోషే తు జగామ సమహాద్యుతిః ।
జాతమాత్రం వాసుదేవమ్ అథాకృష్య పితా తతః ॥
ఉపజహ్రే పరిక్రీతాం సుతాం గోపస్య కస్యచిత్ ।
దేవకి ప్రసవకాలం సమీపించగా సాత్వతుడైన వసుదేవుని రక్షణకై ఉగ్రస్వభావం, క్రూరకర్మగల మంత్రిని కంసుడు నియమించాడు. కాని బాలుడైన శ్రీకృష్ణుని ప్రభావంచే రక్షకులు నిద్రించిన పిదప అక్కడ నుంచి తేజోవంతుడు వసుదేవుడు బాలకునితో కలిసి నందకులానికి వెళ్లాడు. అప్పుడే పుట్టిన వాసుదేవుని మధుర నుంచి దూరం చేసి తండ్రి వసుదేవుడు తెచ్చి కంసునికి కానుకగా ఇచ్చాడు.
మముక్షమాణస్తం శబ్దం దేవదూతస్యపార్థివః ॥
జఘానకంసస్తాం కన్యాం ప్రహసంతీ జగామ సా ।
ఆర్యేతి వాశతీ శబ్దం తస్మాదార్యేతి కీర్తితా ॥
దేవదూతమాటను గుర్తు తెచ్చుకొని కంసుడు భయంతో ఆమెను చంపాలని ఆ కన్యకను భూమికేసి గట్టిగా కొట్టాడు. ఆమె అతని చేతి నుంచి విడిపించుకొని నవ్వుతూ ఆర్యా అను శబ్దాన్ని ఉచ్చరిస్తూ అదృశ్య అయింది. అప్పటి నుంచి ఆమె పేరు 'ఆర్య' అయింది.
ఏవం తం వంచయిత్వా చ రాజానం స మహామతిః ।
వాసుదేవం మహాత్మానమ్ వర్ధయామాస గోకులే ॥
ఈ విధంగా బుద్ధిమంతుడైన వసుదేవుడు ఆ కంసుని మోసపుచ్చి తన పుత్రుని గోకులంలో పెంచసాగాడు.
వాసుదేవోఽపి గోపేషు వవృధేఽబ్జ మివాంభసి ।
అజ్ఞాయమానః కంసేన గూఢోఽగ్నిరివ దారషు ॥
వాసుదేవుడు కూడ గోపకులలో నీటిలోని పద్మంవలె పెరిగాడు. కొయ్యలలో అగ్ని దాగినట్లు అతడు కంసునికి జాడ తెలియకుండానే పెరుగసాగాడు.
విప్రచక్రేఽథ తాన్ సర్వాన్ వల్లవాన్ మధురేశ్వరః ।
వర్ధమానో మహాబాహుఃతేజోబలసమన్వితః ॥
మధురేశ్వరుడైన కంసుడు ఆ గోపకులను మిక్కిలి బాధించాడు. ఇక్కడ బాహుసంపదకల శ్రీకృష్ణుడు తేజస్సు, బలాలతో వృద్ధిపొందాడు.
తతస్తే క్లిశ్యమానాస్తు పుండరీకాక్షమచ్యుతమ్ ।
భయేన కామాదపరే గణశః పర్యవారయన్ ॥
కంసునిచే పీడితులయిన గోపకులు భయంతో కొందరు, కోరికలతో కొందరు శ్రీకృష్ణుని చుట్టుముట్టారు.
స తు లబ్ధ్వా బలం రాజన్ ఉగ్రసేనస్య సమ్మతః ।
వసుదేవాత్మజః సర్వైః భ్రాతృభిః సహితం పునః ॥
నిర్జిత్య యుది భోజేంద్రం హత్వా కంసం మహాబలః ।
అభ్యషిఞ్చ్ త్ తతో రాజ్యే ఉగ్రసేనం విశాంపతే ॥
ఆ శ్రీకృష్ణుడు బలసంపదతో కూడి ఉగ్రసేనుని సమ్మతిపై అతని సోదరగణంతో సహా కంసుని చంపి తిరిగి ఉగ్రసేనుని రాజ్యాభిషిక్తుని కావించాడు.
తతః శ్రుత్వా జరాసంధో మాధవేన హతం యుధి ।
శూరసేనాధిపం చక్రే కంసపుత్రం తదా నృపః ॥
శ్రీకృష్ణుడు కంసుని చంపాడు అని జరాసంధుడు విని కంసుని పుత్రుని శూరసేనదేశానికి రాజుగా చేశాడు.
ససైన్యం మహదుత్థాప్య వాసుదేవం ప్రసహ్య చ ।
అభ్యషించత్ సుతం తత్ర సుతాయా జనమేజయ ॥
అతడు గొప్పసైన్యంతో ఆ రాజ్యాన్ని ఆక్రమించి శ్రీకృష్ణుని ఓడించి తనపుత్రిక కుమారుని రాజుగా చేశాడు.
ఉగ్రసేనమ్ చ వృష్ణీంశ్చ మహాబ్లసమన్వితః ।
స తత్ర విప్రకురుతే జరాసంధః ప్రతాపవాన్ ॥
ఏతద వైరం కౌరవేయ జరాసంధస్య మాధవే ।
ప్రతాపవంతుడైన జరాసంధుడు బలం, సేనలతో కూడి ఉగ్రసేనుని, యాదవులను అనేకసార్లు కష్టాలపాలు చేశాడు. శ్రీకృష్ణజరాసంధుల మధ్య వైరానికి ఇదే కారణం.
ఆశాసితార్థే రాజేంద్ర సంరురోధ వినిర్జితాన్ ।
పార్థివైస్తైర్నృపతిభిః యక్ష్యమాణః సమృద్ధిమాన్ ॥
దేవశ్రేష్ఠం మహాదేవం కృత్తివాసం త్రయంబకం ।
ఏతత్ సర్వం యథావృత్తం కథితం భరతర్షభ ॥
యథా తు స హతో రాజా భీమసేనేన తచ్ఛృణు ।)
తన మనోవాంభ తీర్చుకొనటానికి జయించిన రాజులందరిని దేవశ్రేష్ఠుడు, మహాదేవుడు, చర్మాంబరుడు, త్ర్యంబకుడు అయిన శివునికి బలియిచ్చి తన యజ్ఞాలను పూర్తి చేయసాగాడు. ఇది అంతా జరిగింది జరిగినట్లు చెప్పబడింది. ఇక భీమసేనునిచే ఆ జరాసంధుడు ఎలా చంపబడ్డాడో అది విను.
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి జరాసంధవధ పర్వణి జరాసంధ యుద్ధోద్యోగే ద్వావింశోఽధ్యాయః ॥ 22 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున జరాసంధవధ పర్వమను ఉపపర్వమున జరాసంధ యుద్ధోద్యోగమ్ అను ఇరువది రెండవ అధ్యాయము. (22)