23. ఇరువది మూడవ అధ్యాయము
భీమజరాసంధుల బాహు యుద్ధము.
వైశంపాయన ఉవాచ
తతస్తం నిశ్చితాత్మానం యుద్ధాయ యదునందనః ।
ఉవాచ వాగ్మీ రాజానం జరాసంధమధోక్షజః ॥ 1
వైశంపాయనుడు అన్నాడు - రాజైన జరాసంధుడు తన మనస్సులో యుద్ధం చేయనిశ్చయించాడు. అది చూసిన మాటకారి శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అన్నాడు. (1)
శ్రీకృష్ణ ఉవాచ
త్రయాణాం కేన తే రాజన్ యోద్ధుముత్సహతే మనః ।
అస్మదన్యతమేనేహ సజ్జీభవతు కో యుధి ॥ 2
శ్రీకృష్ణుడు పలికాడు - మా ముగ్గురిలో నీ మనస్సు ఎవరితో యుద్ధం చేయసంకల్పించింది? మాలో ఎవరు నీతో యుద్ధానికి సిద్ధం కావాలి? (2)
ఏవముక్తః స నృపతిర్యుద్ధం వవ్రే మహాద్యుతిః ।
జరాసంధస్తతో రాజా భీమసేనేన మాగధః ॥ 3
ఇది విని తేజోవంతుడైన, మగధేశుడు జరాసంధుడు భీమసేనునితో యుద్ధం చెయ్యాలి అని కోరాడు. (3)
ఆదాయ రోచనాం మాల్యం మంగల్యాన్యపరాణి చ ।
ధారయన్నగదాన్ ముఖ్యాన్ నిర్వృతీర్వేదనాని చ ।
ఉపతస్థే జరాసంధం యుయుత్సుం వై పురోహితః ॥ 4
జరాసంధుని యుద్ధోత్సాహాన్ని గమనించి పురోహితుడు గోరోచనం, మాలలు, మంగళద్రవ్యాలు, గొప్ప గొప్ప ఓషధులు, పీడను పోగొట్టగల వస్తువులను, మూర్ఛనుంచి తెలివి తేగల వస్తువులను తీసికొని అతని వద్దకు వచ్చాడు. (4)
కృతస్వస్త్వయనో రాజ్ బ్రాహ్మణేన యశస్వినా ।
సమనహ్యజ్జరాసంధః క్షాత్రం ధర్మమనుస్మరన్ ॥ 5
యశఃకారకుడైన బ్రాహ్మణుని స్వస్తివచనానంతరం జరాసంధుడు క్షత్రియ నియమాలు పాటించి సంసిద్ధుడయ్యాడు. (5)
అవముచ్య కిరీటం సః కేశాన్ సమనుగృహ్య చ ।
ఉదతిష్ఠజ్జరాసంధః వేలాతిగ ఇవార్ణవః ॥ 6
జరాసంధుడు కిరీటం తీసివేసి కేశాలను బంధించి సముద్రం తన ఒడ్డును దాటి తీరంపై పడేటట్లు యుద్ధానికి ఉద్యుక్తుడు అయ్యాడు. (6)
ఉవాచ మతిమాన్ రాజా భీమం భీమపరాక్రమః ।
భీమ యోత్స్యే త్వయా సార్థం శ్రేయసా నిర్జితం వరమ్ ॥ 7
భయానకపరాక్రమాన్ని ప్రదర్శించే బుద్ధిమంతుడు జరాసంధుడు భీమునివైపు తిరిగి 'భీమా! నీతో యుద్ధం చేస్తాను. శ్రేష్ఠుని చేతిలో ఓడిపోవటం కుడ మంచిదే అన్నాడు.' (7)
ఏవముక్త్వా జరాసంధః భీమసేనమరిందమః ।
ప్రత్యుద్యయౌ మహాతేజాః శక్రం బల ఇవాసురః ॥ 8
తేజోవంతుడు, శత్రుపీడకుడు అయిన జరాసంధుడు భీమునితో ఈ విధంగా పలికి బలుడు ఇంద్రుని ఓడించటానికి సిద్ధం అయినట్లు సిద్ధపడ్డాడు. (8)
తతః సమ్మంత్ర్య కృష్ణేన కృతస్వస్త్యయనో బలీ ।
భీమసేనో జరాసంధమ్ ఆససాద యుయుత్సయా ॥ 9
బలవంతుడైన భీమసేనుడు కూడ శ్రీకృష్ణునితో మాట్లాడి స్వస్తి వచనముల తరువాత యుద్ధకాంక్షతో జరాసంధుని దగ్గరకు చేరాడు. (9)
తతస్తౌ నరశార్దూలౌ బాహుశస్త్రౌ సమీయతుః ।
వీరౌ పరమసంహృష్టౌ అన్యోన్యజయకాంక్షిణౌ ॥ 10
సింహసమాన పరాక్రమం కల వారిరువురూ హర్షోత్సాహాలతో ఒకరినొకరు జయించాలనే కోరికతో బాహువులే శస్త్రాలుగా తలపడ్డారు. (10)
కరగ్రహణపూర్వం తు కృత్వా పాదాభివందనం ।
కక్షైః కక్షాం విధున్వానౌ ఆస్ఫోటం తత్ర చక్రతుః ॥ 11
ముందు వారిద్దరి చేతులు కలిశాయి. పిదప ఒకరికొకరు పాదాభివందనం చేశారు. బాహువుల మూలాలను కంపింపచేస్తూ పెద్దగా చరుపులు చరిచారు. (11)
స్కంధే దోర్భ్యాం సమాహత్య నిహత్య చ ముహుర్ముహుః ।
అంగమంగైః సమాశ్లిష్య పునరాస్ఫాలనమ్ విభో ॥ 12
భుజాలను చేతులతో మోదుకొని, మాటిమాటికి కొట్టికొని, శరీరాన్ని శరీరంతో గట్టిగా పట్టుకొని, తిరిగి తిరిగి చరుపులు చరుచుకొన్నారు. (12)
చిత్రహస్తాదికం కృత్వా కక్షాబంధం చ చక్రతుః ।
గలగండాభిఘాతేన సస్ఫులింగేన చాశనిమ్ ॥ 13
వారు వేగంగా చేతులను సంకోచించి, వ్యాకోచిమ్చి ఒకరిపై ఒకరు విసరుకొంటూ ముష్టిఘాతాలను చేశారు. చిత్రహస్తరూపమైన ఘాతాలు చూపి కక్షాబంధాన్ని చేశారు. వీపులపై చేతులు వేసి ఒకరినొకరు బంధింప తలపెట్టారు. మెడపై, చెక్కిళ్ళపై కొట్టిన దెబ్బలతో ఆ ప్రదేశం నిప్పురవ్వలతో కలిసిన పిడుగుపడినట్లు అయింది. (13)
బాహుపాశాదికం కృత్వా పాదాహితశిరావుభౌ ।
ఉరోహస్తం తతశ్చక్రే పూర్ణకుంభౌ ప్రయుజ్యతౌ ॥ 14
బాహుపాశ చరణపాశ విద్యలను ప్రదర్శించారు. పాదాలతో గట్టిగా శిరస్సులు నొక్కుకున్నారు. దాని కారణంగా నాడులన్నీ పీడింపబడ్డాయి. ఛాతీలపై మోదుకొనే ఉరోహస్తమనే మల్లయుద్ధాన్ని చేశారు. చేతివ్రేళ్ళ సాయంతో చేసే పూర్ణకుంభ విద్యను కూడ ఒకరిపై ఒకరు నిపుణంగా ప్రయోగించారు. (14)
కరసంపీడనం కృత్వా గర్జంతౌ వారణావివ ।
నర్దంతౌ మేఘసంకాశా బాహుప్రహరణావుభౌ ॥ 15
ఒకరిచేతుల్ని ఒకరు పీడించుకొంటూ గజరాజులవలె గర్జించారు. బాహుప్రహారాలు చేసే వారిరువురూ మేఘగర్జనల వంటి సింహనాదాలు చేశారు. (15)
తలేనాహన్యమానౌ తు అన్యోన్యం కృతవీక్షణౌ ।
సింహావివ సుసంక్రుద్ధౌ ఆకృష్యాకృష్య యుధ్యతామ్ ॥ 16
అరచేతులతో కొట్టుకొని గుర్రుగుర్రుగా ఒకరినొకరు చూసుకొన్నారు. క్రోధవశమైన రెండు సింహాలవలె అతి భయంకరంగా లాగుకొంటూ యుద్ధం చేసి చూపించారు. (16)
అంగేనాంగం సమాపీడ్య బాహుభ్యాముభయోరపి ।
ఆవృత్య బాహుభిశ్చాపి ఉదరం చప్రచక్రతుః ॥ 17
శరీరాన్ని శారీరంతో, చేతులను చేతులతో, ఎదుటివారి శారీరాలను పట్టిలాగి శత్రువు వెన్నుపై మెడపై బిగబట్టి దూరంగా విసరుకొన్నారు. (17)
ఉభౌ కట్యాం సుపార్శ్వే తు తక్షవంతౌ చ శిక్షితౌ ।
అధోహస్తం స్వకంఠే తు ఉదరస్యొరపి చాక్షిపత్ ॥ 18
ఇరువురు కటిప్రదేశంలో, ప్రక్కల చేతులుంచి ఎదుటి వారిని పడవేయటానికి యత్నించారు. తమ శరీరాన్ని బిగపట్టి ఎదుటివారిని పడవేసే విద్య ఇద్దరికీ తెలుసు. ఇద్దరు మల్లయుద్ధంలో ప్రవీణులు. పొట్ట అడుగున చేతులుమ్చి గట్టిగా వీపును పట్టి తమ కంఠం దాకా పైకెత్తి శత్రువును భూమికేసి కొట్టసాగారు. (18)
సర్వాతిక్రాంతమర్యాదం పృష్ఠభంగం చ చక్రతుః ।
సంపూర్ణమూర్ఛాం బాహుభ్యాం పూర్ణకుంభం ప్రచక్రతుః ॥ 19
వారు మల్లయుద్ధమర్యాదలలో ఉన్నతమైన పృష్ఠభంగం అనే విద్యను చూపసాగారు. ఒకరి వీపును ఒకరు నేలకు ఆనించే విద్య అది. రెండు భుజాలతో ఛాతీపై, పొట్టపై కొట్టి మూర్ఛ నొందించటానికి పూర్ణకుంభవిద్య ప్రదర్శించారు. (19)
తృణపీడం యథాకామం పూర్ణయోగం సముష్టికమ్ ।
ఏవమాదీని యుద్ధాని ప్రకుర్వం తౌ పరస్పరమ్ ॥ 20
వారి ఇచ్ఛానుసారం తాడును పేనినట్లుగా కాళ్ళను, చేతులను ముష్టిఘాతాలతో బాధిమ్చి పూర్ణయోగం. తృణపీడం అనే యుద్ధవిద్యలను చూపి ఒకరిపై ఒకరు ఆఘాతాలు మొదలైన యుద్ధకళలను ప్రదర్శించి పీడించుకొన్నారు. (20)
తయోర్యుద్ధం తతో ద్రష్టుం సమేతాః పురవాసినః ।
బ్రహ్మణా వణిజశ్చైవ క్షత్రియోశ్చ సహస్రశః ॥ 21
శూద్రాశ్చ నరశార్దూల స్త్రియో వృద్ధాశ్చసర్వశః ।
నిరంతరమభూత్ తత్ర జనౌఘైరభిసంవృతమ్ ॥ 22
ఆ సమయాన్ వారిమల్లయుద్ధమ్ చూడటానికి వేలకొలది నగరవాసులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, స్త్రీలు, వృద్ధులు, గుమికూడారు. మనుజుల గుంపులచే ఆ ప్రదేశం నిండిపోయింది. (21,22)
తయోరథ భుజాఘాతాత్ నిగ్రహప్రగ్రహాత్ తథా ।
ఆసీత్ సుభీమసంపాతః వజ్రపర్వతయోరివ ॥ 23
ఆ ఇద్దరి భుజాల దెబ్బల వలన, ఒకరిపై మరొకరు నిగ్రహప్రగ్రహాలను ప్రదర్శించటం వలన వజ్రాయుధమూ పర్వతమూ సంఘర్షించినట్లు ఘర్షణ ఏర్పడింది. (23)
ఉభౌ పరమసంహృష్టౌ బలేన బలినాం వరౌ ।
అన్యోన్యస్యాంతరం ప్రేప్సూ పరస్పరజయైషిణౌ ॥ 24
బలవంతులలో శ్రేష్ఠులైన వారు మిక్కిలి బలోత్సాహాలతో పరస్పరజయం ఆశించి పోరాటం చేత వారి మధ్య బలహీన, దుర్బలస్థితుల పరిశీలన సాగింది. (24)
తద్ భీమముత్సార్యజనం యుద్ధమాసీదుపప్లవే ।
బలినోః సంయుగే రాజన్ వృత్రవాసవయోరివ ॥ 25
యుద్ధభూమిలో వృత్ర, ఇంద్రులకు వలె సాగే ఆ పోరులో భయంకరస్థితి ఏర్పడటంతో జనులందరు దూరానికి పోయి నిలబడ్డారు. (25)
ప్రకర్షణాకర్షణాభ్యామ్ అనుకర్షవికర్షణైః ।
ఆచకర్షతురన్యోన్యం జానుభిశ్చావజఘ్నతుః ॥ 26
ప్రకర్షణం, ఆకర్షణమ్; అనుకర్షణం వికర్షణం చేసుకొంటూ వారిద్దరూ ఒకరి నొకరు మోకాళ్లతో పొడుచుకొంటున్నారు. (26)
తతః శబ్దేన మహతా భర్త్సయంతౌ పరస్పరమ్ ।
పాషాణసంఘాతనిభైః ప్రహారైరభిజఘ్నతుః ॥ 27
తరువాత గొప్ప గొప్ప గర్జన, నిందలతో రాళ్ళవర్షం కురిసినట్లు ముష్టిఘాతాలతో ఒకరినొకరు బాధించుకొన్నారు. (27)
వ్యూఢోరస్కౌ దీర్ఘభుజౌ నియుద్ధకుశలావుభౌ ।
బాహుభిః సమసజ్జేతామాయసైః పరిఘైరివ ॥ 28
ఇద్దరి వక్షఃస్థలాలు విశాలాలు, పెద్దవి, ఇద్దరు మల్లయుద్ధనిపుణులు, ఇనుపగడియల వంటి బాహువులతో కలియబడ్డారు. (28)
కార్తికస్య తు మాసస్య ప్రవృత్తం ప్రథమేఽహని ।
అనాహారం దివారాత్రమ్ అవిశ్రాంత మవర్తత ॥ 29
కార్తికమాసపు మొదటి రోజున ప్రారంభమైన ఆ యుద్ధం తిండిలేక, విశ్రాంతిలేక రాత్రింబగళ్ళు జరిగింది. (29)
తద్ వృత్తం తు త్రయోదశ్యాం సమవేతం మహాత్మనోః ।
చతుర్దశ్యామ్ నిశాయాం తు నివృత్తో మాగధఃక్లమాత్ ॥ 30
ఈవిధంగా మహాత్ములైన వారిమధ్య యుద్ధం త్రయోదశి వరకు కొనసాగింది. చతుర్దశినాటి రాత్రి మగధనరేశుడు అలసి యుద్ధం నుంచి మరలినాడు. (30)
తం రాజానం తథా క్లాంతం దృష్ట్వా రాజఞ్జనార్దనః ।
ఉవాచ భీమకర్మాణం భీమం సంబోధయన్నివ ॥ 31
ఆ అలసిన జరాసంధుని చూసి, శ్రీకృష్ణుడు భయంకర యుద్ధం చేసిన భీమునితో తెలియపరుస్తున్నట్లుగా ఇలా అన్నాడు. (31)
క్లాంతః శత్రుర్న కౌంతేయ లభ్యః పీడయితుం రణే ।
పీడ్యమానో హి కార్త్స్న్యేన జహ్యాజ్జీవితమాత్మనః ॥ 32
శత్రువు అలసినప్పుడు అతనిని అధికంగా పీడించటం ఉచితం కాదు. ఒకవేళ పీడిస్తే అతడు శీఘ్రంగా ప్రాణాలు వదులుతాడు. (32)
తస్మాత్ తే నైవ కౌంతేయ పీడనీయో జనాధిపః ।
సమమేతేన యుధ్యస్వ బాహుభ్యామ్ భరతర్షభ ॥ 33
భీమా! నీవు జరాసంధుని ఎక్కువగా బాధించవద్దు. అతనితో చేతులతో మాత్రమే సమానంగా యుద్ధం చెయ్యి. (33)
ఏవముక్తః స కృష్ణేన పాండవః పరవీరహా ।
జరాసంధస్య తద్ రూపం జ్ఞాత్వా చక్రే మతిం వధే ॥ 34
శత్రుసంహారి అయిన భీముడు శ్రీకృష్ణుని మాటలు విని జరాసంధుడు అలసినట్లు గ్రహించి ఆయనను చంపటాన్ని గూర్చి ఆలోచించాడు. (34)
తతస్తమజితం జేతుం జరాసంధం వృకోదరః ।
సంరంభం బలినాం శ్రేష్ఠః జగ్రాహ కురునందనః ॥ 35
కురుకులానికి ఆనందకారకుడైన భీముడు బలవంతులలో శ్రేష్ఠుడైన అజేయుడైన జరాసంధుని జయించుటకు కోపాన్ని తెచ్చుకున్నాడు. (35)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి జరాసంధవధ పర్వణి జరాసంధక్లాంతే త్రయోవింశోఽధ్యాయః ॥ 23 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున జరాసంధవధ పర్వమను ఉపపర్వమున జరాసంధక్లాంతి అను ఇరువది మూడవ అధ్యాయము. (23)