24. ఇరువది నాలుగవ అధ్యాయము

జరాసంధుని వధ.

వైశంపాయన ఉవాచ
భీమసేనస్తతః కృష్ణమ్ ఉవాచ యదునందనమ్ ।
బుద్ధిమాస్థాయ విపులాం జరాసంధవధేప్సయా ॥ 1
వైశంపాయనుడు అన్నాడు - పిమ్మట భీమసేనుడు జరాసంధుని వధపై పూర్తిగా బుద్ధిని నిలిపి యదునందనుడైన శ్రీకృష్ణునితో పలికాడు. (1)
నాయం పాపో మయా కృష్ణ యుక్త స్యాదనురోధితుమ్ ।
ప్రాణేన యదుశార్దూల బద్ధకక్షేణ వాససా ॥ 2
యదుశార్దూలా! ఇతడు మొలకు బిగించిన వస్త్రకారణంగా ఈ పాపాత్ముని ప్రాణాలు హరించాలని నాకు తోచటం లేదు. (2)
ఏవముక్తస్తతః కృష్ణః ప్రత్యువాచ వృకోదరమ్ ।
త్వరయన్ పురుషవ్యాఘ్రః జరాసంధవధేప్సయా ॥ 3
ఇట్లు పలికిన భీముని పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు జరాసంధుని వధకు ఉత్తేజపరుస్తూ ఇలా అన్నాడు. (3)
యత్ తే దైవమ్ పరం సత్త్వం యచ్చ తే మాతరిశ్వనః ।
బలం భీమ జరాసంధే దర్శయాశు తదద్య నః ॥ 4
నీవు సర్వోత్కృష్టుడవైన దేవతవు. పైగా వాయుబలంతో కూడి ఉన్నావు. ఆ బలాన్ని అంతటిని జరాసంధునిపై మా ఎదుట ఈ రోజున చూపు. (4)
(తవైష వధ్యో దుర్బుద్ధిః జరాసంధో మహారథః ।
ఇత్యంతరిక్షే త్వశ్రౌషం యదా వాయురపోహ్యతే ॥
ఈ మహారథుడు, దుర్బుద్ధి గల జరాసంధుడు నీ చేతులతోనే చంపతగినఆడు. ఈ మాటలు నాకు ఆకాశంలో వినిపించాయి. బలరాముని ద్వారా జరాసంధ వధకు అనుజ్ఞ చేయబడి, బలం ఇవ్వబడింది.
గోమంతే పర్వతశ్రేష్ఠే యేనైష పరిమోక్షితః ।
బలదేవబలం ప్రాప్య కోఽన్యో జీవేత మాగధాత్ ॥
ఈ కారణంగా గొప్ప పర్వతమైన గోమంతంపై ఇతడు విడువబడినాడు. బలదేవుని చేత చిక్కిన జరాసంధుడు తప్ప వేరొకడు బయటపడలేదు.
తదస్య మృత్యుర్విహితః త్వదృతే న మహాబలః ।
వాయుం చిన్త్య మహాబాహో జహీమం మగధాధిపమ్ ॥)
గొప్పబాహువులు గల భీమసేనా! నిన్ను విడచి ఇతని మృత్యువు వేరొకని చేతిలో లేదు. వాయువును తలచుకొని ఈ జరాసంధుని చంపు.
ఏవముక్తస్తదా భీమః జరాసంధమరిందమః ।
ఉతిప్య భ్రామయామాస బలవంతం మహాబలః ॥ 5
శత్రుసంహారి భీముడు జనార్దనుని మాటలు విని గొప్పబలం తెచ్చుకొని జరాసంధుని ఆకాశంలో ఎత్తి గిరగిరా త్రిప్పాడు. (5)
(తతస్తు భగవాన్ కృష్ణః జరాసంధజిఘాంసయా ।
భీమసేనం సమాలోక్య శీలం జగ్రాహ పాణినా ॥
ద్విధా చిచ్ఛేద వై తత్ తు జరాసంధవధం ప్రతి ।
జరాసంధుని చంపటానికి శ్రీకృష్ణుడు భీమసేనుని వైపు చూచి ఒకరకపు గడ్డిని తీసికొని రెండుగా చీల్చాడు. విసరివేశాడు. ఇదే జరాసంధుని వధకు సంకేతం .
భ్రామయిత్వా శతగుణమ్ జానుభ్యాం భరతర్షభ ।
బభంజ పృష్ఠం సంక్లిప్య నిష్పిష్య విననాద చ ॥ 6
వందసార్లు గిరిగిరా త్రిప్పు భీముడు భూమిపైకి వేసి నడుమును విరచి పిండి చేసి సింహనాదాలు చేశాడు. (6)
కరే గృహీత్వా చరణం ద్వేధా చక్రేమహాబలః ॥ 7
అతని చేతిలో ఒక పాదంపై పాదం పెట్టి మహాబలుడు భీముడు జరాసంధుని శరీరాన్ని రెండుగా చేశాడు. (7)
(పునః సంధాయ తు తదా జరాసంధః ప్రతాపవాన్ ॥
భీమేన చ సమాగమ్య బాహుయుద్ధం చకార హ ।
తయోః సమభవద్ యుద్ధం తుములం రోమహర్షణమ్ ॥
సర్వలోకక్షయకరం సర్వభూతభయావహమ్ ।
పునః కృష్ణస్తమిరిణం ద్విధా విచ్ఛిద్య మాధవః ॥
వ్యత్యస్య ప్రాక్షిపత్ తత్ తు జరాసంధవధేప్సయా ।
తిరిగి ఆ రెండు శరీరభాగాలు ఏకమై ప్రతాపవంతుడు జరాసంధుడు భీమునితో బాహుయుద్ధం చేశాడు. వారిమధ్య అత్యంతం భయంకరమైన దొమ్మియుద్ధం చూసేవారికి ఒళ్ళు గుగుర్పాటు చెందేటట్లు, సర్వలోకాలు నాశనమయ్యేట్లు జరిగింది. తిరిగి శ్రీకృష్ణుడు తృణవిశేషాన్ని గ్రహించి రెండుగా చీల్చి జరాసంధవధకై విపరీతదిశలో పడవేశాడు. జరాసంధుని వధకిది రెండవ సంకేతం.
భీమసేనుడు అప్పుడు అది గ్రహించి జరాసంధుని ఒక కాలిపై పెట్టి రెండుగా చీల్చి విపరీతదిశలో పడవేశాడు.
శుష్కమాంసాస్థిమేదస్త్వగ్ భిన్నమస్తిష్కపిండకః ॥
శవభూతస్తదా రాజన్ పిండీకృత ఇవాబభౌ ।)
ఆ సమయాన జరాసంధుని శరీరం నుండి మాంసం ముద్దలు బయటపడసాగాయి. ఆ శరీరం నుండి క్రొవ్వు, రక్తం, ఎముకలు, అన్నీ జారిపడ్డాయి. తల, శరీరం కూడ రెండుగా విడిపోయాయి.
తస్య నిష్పిష్యమాణస్య పాండవస్య చ గర్జతః ।
అభవత్ తుములో నాదః సర్వప్రాణిభయంకరః ॥ 8
విత్రేసుర్మాగధాః సర్వే స్త్రీణాం గర్భాశ్చ సుస్రువుః ।
భీమసేనస్య నాదేన జరాసంధస్య చై వహ ॥ 9
ముద్దయిపోయిన జరాసంధుడు ఒకవైపు - సింహనాదాలు చేస్తున్న భీముడు ఒకవైపు - ఆ నాదం సర్వప్రాణులకు భయంకరమైంది. మగధనివాసులందరూ భయపడ్డారు. గర్భవంతుల గర్భాలు స్రవించాయి. ఈ ఉపద్రవాలకు భీమసేనుని సింహనాదం, జరాసంధుని చీత్కారాలే కారణం. (8,9)
కిం ను స్యాద్ధిమవాన్ భిన్నః కిం ను స్విద్ దీర్యతే మహీ ।
ఇతి వై మాగధా జజ్ఞుః భీమసేనస్యనిఃస్వనాత్ ॥ 10
మగధదేశీయులందరి భీమసేనుని సింహగర్జనలు విని "హిమవత్పర్వతం చీలిందా? భూమి రెండుగా చీలుతోందా" అని అనుకొన్నారు. (10)
తతో రాజ్ఞః కులద్వారి ప్రసుప్తమివ తం నృపమ్ ।
రాత్రౌ గతౌ సుముత్సృజ్య నిశ్చక్రమురరిందమాః ॥ 11
శత్రువులను అవలీలగా చంపగల వారు ముగ్గురు నిద్రిస్తున్నవానివలె ఉన్న జరాసంధుని మృతశరీరాన్ని రాజద్వారం దగ్గర విడచి అక్కడ నుండి వెడలిపోయారు. (11)
జరాసంధరథం కృష్ణః యోజయిత్వా పతాకినమ్ ।
ఆరోప్య భ్రాతరౌ చైవ మోక్షయామాస బాంధవాన్ ॥ 12
శ్రీకృష్ణుడు జరాసంధుని రథాన్ని ధ్వజాలతో అలంకరించి భీమార్జునులను కూర్చుండబెట్టి కారాగారంలోని బంధువులందరినీ విడచిపెట్టాడు. (12)
తే వై రత్నభుజం కృష్ణమ్ రత్నార్హాః పృథివీశ్వరాః ।
రాజానశ్చక్రురాసాద్య మోక్షితా మహతో భయాత్ ॥ 13
రత్నభోగులైన రాజులందరు భయానికి దూరమై రత్నాలను అనుభవించదగిన శ్రీకృష్ణునికి కానుకలుగా రత్నాలను ఇచ్చారు. (13)
అక్షతః శస్త్రసంపన్నః జితారిః సహ రాజభిః ।
రథమాస్థాయ తం దివ్యం నిర్జగామ గిరివ్రజాత్ ॥ 14
భగవంతుడు శ్రీకృష్ణుడు గాయపడక, శస్త్రాస్త్రాలు కల్గి ప్రకాశించాడు. శత్రువులను జయించి దివ్యరథాన్ని అధిరోహించి గిరివ్రజపురం నుండి రాజులతో కలిసి బయలుదేరాడు. (14)
యః స సోదర్యవాన్ నామ ద్వియోధీ కృష్ణసారథిః ।
అభ్యాసఘాతీ సందృశ్యః దుర్జయః సర్వరాజభిః ॥ 15
ఆ రథంపేరు సోదర్యవంతం. ఇద్దరు మహారథులు ఒక్కసారే కూర్చుండి యుద్ధం చేయడానికి వీలైంది. శ్రీకృష్ణుడు ఆ సమయాన సారథి. ఆ రథం నుంచి మాటిమాటికి శత్రువులపై దాడి చేయటానికి అవకాశం ఉంది. చూడముచ్చటైన ఆ రథం శత్రువులెవరికీ జయింప వీలుకానిదై ఉంది. (15)
భీమార్జునాభ్యాం యోధాభ్యామ్ ఆస్థితః కృష్ణసారథిః ।
శుశుభే రథవర్యోఽసౌ దుర్జయః సర్వధన్విభిః ॥ 16
శక్రవిష్ణూ హి సంగ్రామే చేరతుస్తారకామయే ।
భీమార్జునులచే మహారథులతో శ్రీకృష్ణుడు సారథిగా ఉన్న ఆ రథం ధనుర్ధరులందరికీ ఎదిరింపశక్యం కానిది అయింది. ఇంద్రుడు, విష్ణువు ఇద్దరు ఒక్కసారి దానిపై కూర్చుంటే తారకామయమైన యుద్ధంలో సంచరిస్తున్నట్లు ప్రకాశిస్తోంది. (16 1/2)
రథేన తేన వై కృష్ణ ఉపారుహ్య యయౌ తదా ॥ 17
తప్తచామీకరాభేణ కింకిణీజాలమాలినా ।
మేఘనిర్ఘోషనాదేన జైత్రేణామిత్రఘాతినా ॥ 18
ఆ రథమ్ పుటంవేసిన బంగారపు రంగులో ప్రకాశిస్తోంది. చిరుమువ్వల జాలర్లు వ్రేలాడుతున్నాయి. మేఘధ్వని వలె గబీరమైన సవ్వడి చేస్తోంది. శత్రువులను జయించి జయాన్ని ప్రసాదించగలిగినది. అలాంటి రథంపై వారిరువురితో శ్రీకృష్ణుడు బయలుదేరాడు. (17,18)
యేన శక్రో దానవానాం జఘాన నవతీర్నవ ।
తం ప్రాప్య సమహృష్యంత రథం తే పురుషర్షభాః ॥ 19
ఈ రథాన్ని అధిరోహించి ఇంద్రుడు తొమ్మిదిసార్లు తొంభైమంది చొప్పున రాక్షసులను సంహరించాడు. అటువంటి రథాన్ని పొంది ఆ పురుషశ్రేష్ఠులు మిక్కిలి ప్రసన్నులయ్యారు. (19)
తతః కృష్ణమ్ మహాబాహుం బ్రాతృభ్యం సహితం తదా ।
రథస్థం మాగధా దృష్ట్వా సమపద్యంత విస్మితాః ॥ 20
ఆ ఇద్దరు సోదరులతో రథంపై కూర్చుండిన బాహుబలశాలి శ్రీకృష్ణుని చూచి మగధదేశవాసులంతా ఆశ్చర్యపోయారు. (20)
హయైర్దివ్యైః సమాయుక్తః రథో వాయుసమో జవే ।
అధిష్ఠితః స శుశుభే కృష్ణేనాతీవ భారత ॥ 21
ఆ రథం వాయువేగం కల్గి దివ్యాశ్వాలతో కూడి ఉంది. శ్రీకృష్ణుడు ఆసీనుడైనందున మిక్కిలిగా ప్రకాశిస్తోంది. (21)
అసంగో దేవవిహితః తస్మిన్ రథవరే ధ్వజః ।
యోజనాద్ దదృశే శ్రీమాన్ ఇంద్రాయుధసమప్రభః ॥ 22
ఉత్తమరథంపై దేవనిర్మితధ్వజం ఎగురసాగింది. అది ఆధారం లేకనే తగులుకున్నట్లు మాత్రం ఉంది. ఇంద్రధనుస్సు కాంతితో వెలిగే ఆ రథం చాలా రంగులు కలిగి ఆ ధ్వజకాంతి యోజనం (ఎనిమిది మైళ్ళు) దూరం నుంచి గుర్తించేలా ఉంది. (22)
చింతయామాస కృష్ణోఽథ గరుత్మంతం స చాభ్యయాత్ ।
క్షణే తస్మిన్ స తేనాసీచ్చైత్యవృక్ష ఇవోత్థితః ॥ 23
వ్యాధితాస్యైర్మహానాదైః సహ భూతైర్ధ్వజాలయైః ।
తస్మిన్ రథవరే తస్థౌ గరుత్మాన్ పన్నగాశనః ॥ 24
ఆ సమయాన శ్రీకృష్ణుడు గరుడుని తలచుకొన్నాడు. గరుడుడు క్షణంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రథంపై ఉన్న ధ్వజంలో చాలా భూతాలు వికృతగర్జనలు చేస్తూ కనిపించాయి. వాటి సమీపాన గరుడుడు రథారూఢుడయ్యాడు. అతనిద్వారా ఆ ధ్వజం పైకి ఎగురసాగింది. అది చైత్యవృక్షంలా ప్రకాశిస్తోంది. (23,24)
దుర్నిరీక్ష్యో హి భూతానాం తేజసాభ్యధికం బభౌ ।
ఆదిత్య ఇవ మధ్యాహ్నే సహస్రకిరణావృతః ॥ 25
న స సజ్జతి వృక్షేషు శస్త్రైశ్చాపి న రిష్యతే ।
దివ్యో ధ్వజవరో రాజన్ దృశ్యతే చేహ మానుషైః ॥ 26
ఈ ఉత్తమధ్వజం వేయి కిరణాలతో వ్యాప్తమైన మధ్యాహ్నకాలపు సూర్యునివలె ప్రకాశిస్తూ తేజస్సు కలిగి ఉంది. ప్రాణులకు దానివైపు చూడటం కష్టంగా ఉంది. వృక్షాలతో అడ్డగింపబడక, శస్త్రాస్త్రాలకు లొంగనిదై ఉంది. ఆ ధ్వజం ఇప్పుడు మనుజుల కళ్ళకు కనపడసాగింది. (25,26)
తమాస్థాయ రథం దివ్యం పర్జన్యసమనిఃస్వనమ్ ।
నిర్యయౌ పురుషవ్యాఘ్రః పాండవాభ్యాం సహాచ్యుతః ॥ 27
మేఘసమధ్వని గల ఆ దివ్యరథంపై శ్రీకృష్ణుడు భీమార్జునులతో కూర్చుండి నగరం వెలుపలికి వెళ్ళాడు. (27)
యం లేభే వాసవాద్ రాజా వసుస్తస్మాద్ బృహద్రథః ।
బృహద్రథాత్ క్రమేణైవ ప్రాప్తో బార్హద్రథం నృప ॥ 28
ఇంద్రుని నుంచి రాజైన వసువు ఆ రథాన్ని పొందాడు. క్రమంగా అతని నుంచి బృహద్రథునికి, బృహద్రథుని నుంచి జరాసంధునికి చేరింది. (28)
స నిర్యాయ మహాబాహుః పుండరీకేక్షణస్తతః ।
గిరివ్రజాద్ బహిస్తస్థౌ సమదేశే మహాయశాః ॥ 29
యశోవంతుడు జనార్దనుడు, పుండరీకాక్షుడు గిరివ్రజం నుంచి బయటకు వచ్చి సమానప్రదేశంపై నిలబడ్డాడు. (29)
తత్రైనం నాగరాః సర్వే సత్కారేణాభ్యయు స్తదా ।
బ్రాహ్మణప్రముఖా రాజన్ విధిదృష్టేన కర్మణా ॥ 30
అక్కడ బ్రాహ్మణులు మొదలైన నాగరికులు శాస్త్రీయ విధానంతో సత్కరించారు. (30)
బంధనాద్ విప్రముక్తాశ్చ రాజానో మధుసూదనమ్ ।
పూజయామాసురూచుశ్చ స్తుతిపూర్వమిదం వచః ॥ 31
కారాగారం నుండి విడిపింపబడిన రాజులందరు శ్రీకృష్ణుని స్తోత్రపురస్సరంగా ఇలా స్తుతించారు. (31)
నైతచ్చిత్రం మహాబాహో త్వయి దేవకినందనే ।
భీమార్జునబలోపేతే ధర్మస్య ప్రతిపాలనమ్ ॥ 32
మహాభుజుడా! దేవకిని ఆనందపరచగల మీరు ప్రత్యక్షదైవమే. భీమసేనార్జునుల బలం మీవెంట ఉంది. మీరు చేసే ధర్మరక్షణ వలన మీరు నిజంగా ధర్మావతారులే. (32)
జరాసంధహ్రదే ఘోరే దుఃఖపంకే నిమజ్జతామ్ ।
రాజ్ఞాం సమభ్యుద్ధరణం యదిదం కృతమద్య వై ॥ 33
దుఃఖపంకంతో గూడిన ఘోరజరాసంధుడనే మడుగులో మునిగిపోయే రాజుల సంరక్షణకు మీరే సమర్థులు. (33)
విష్ణో సమవసన్నానాం గిరిదుర్గే సుదారుణే ।
దిష్ట్యా మోక్షాత్ యశో దీప్తమ్ ఆప్తం తే యదునందన ॥ 34
అత్యంత భయంకరమయిన పర్వతగుహలో బందీలైన మేము దుఃఖంతో కాలం గడిపాము. కృష్ణా! మీరు మమ్ము ఈ ఆపద నుండి విడిపించి ఉజ్జ్వలమైన కీర్తిని పొందారు. (34)
కిం కుర్మః పురుషవ్యాఘ్ర శాధి నః ప్రణతిస్థితాన్ ।
కృతమిత్యేవ తద్ విద్ధి నృపైర్యద్యపి దుష్కరమ్ ॥ 35
మేం మీ పాదాలపై పడ్డాం. మీరు మమ్ము ఆజ్ఞాపించండి. మీకు మేం ఏ సేవైనా చేస్తాం. ఎంత చేయవీల్లేనిదైనా మేమంతా కలిసి పూర్తిచేస్తాం. (35)
తానువాచ హృషీకేశః సమాశ్వాస్య మహామనాః ।
యుధిష్ఠిరో రాజసూయం క్రతుమాహర్తుమిచ్ఛతి ॥ 36
గొప్ప మనస్సుతో శ్రీకృష్ణుడు వారిని ఊరడించి ఇలా పలికాడు. ధర్మరాజు రాజసూయయాగాన్ని చేయ సంకల్పించాడు. (36)
తస్య ధర్మప్రవృత్తస్య పార్థివత్వం చికీర్షతః ।
సర్వైర్భవద్భిర్విజ్ఞాయ సాహాయ్యం క్రియతామితి ॥ 37
ధర్మాన్ని అవలంబించే అతడు చక్రవర్తి కావాలి అని అనుకొన్నాడు. మీరందరు ఆ యజ్ఞంలో అతనికి సహాయం చేయండి. (37)
తతః సుప్రీతమనసస్తే నృపా నృపసత్తమ ।
తథేత్యేవాబ్రువన్ సర్వే ప్రతిగృహ్యాస్య తాం గిరమ్ ॥ 38
అప్పుడు ప్రీతులైన వారందరు 'తథాస్తు' అని పలికి భగవానుని ఆజ్ఞను శిరసావహించారు. (38)
రత్నభాజం చ దాశార్హం చక్రుస్తే పృథివీశ్వరాః ।
కృచ్ఛ్రాజ్జగ్రాహ గోవిందః తేషాం తదనుకంపయా ॥ 39
ఇంతేకాదు! దశార్హకులదీపకుడు శ్రీకృష్ణునికి రత్నాలను కానుకలుగా ఇచ్చారు. గోవిందుడు అతికష్టం మీద వారి యెడల దయతో వాటిని స్వీకరించాడు. (39)
జరాసంధాత్మజశ్చైవ సహదేవో మహామనాః ।
నిర్యయౌ సజనామాత్యః పురస్కృత్య పురోహితమ్ ॥ 40
జరాసంధుని కుమారుడు సహదేవుడు వినయంతో వాసుదేవుని పాదాలపై పడి శరణువేడాడు. (40)
స నీచైః ప్రణతో భూత్వా బహురత్నపురోగమః ।
సహదేవో నృణాం దేవం వాసుదేవముపాస్థితః ॥ 41
అతని ఎదుట రత్నాల భారం ఉంది. అది తీసుకొని సహదేవుడు వినయంతో వాసుదేవుని పాదాలపై పడి శరణువేడాడు. (41)
(సహదేవ ఉవాచ
యత్ కృతం పురుషవ్యాఘ్ర మమ పిత్రా జనార్దన ।
తత్ తే హృది మహాబాహో న కార్యం పురుషోత్తమ ॥
సహదేవుడు అన్నాడు - పురుషసింహమా! జనార్దనా! నా తండ్రి మీపట్ల చేసిన అపరాధాన్ని మీ మనసులో ఉంచుకోవద్దు.
త్వాం ప్రపన్నోఽస్మి గోవింద ప్రసాదం కురు మే ప్రభో ।
పితురిచ్ఛామి సంస్కారం కర్తుం దేవకినందన ॥
గోవిందా! నేను మీశరణు కోరాను. నాపై దయ చూపు. నేను నా తండ్రి దహనసంస్కారాలను మీరు అనుమతిస్తే చేస్తాను.
త్వత్తోఽభ్యనుజ్ఞాం సంప్రాప్య భీమసేనాత్ తథార్జునాత్ ।
నిర్భయో విచరిష్యామి యథాకామం యథాసుఖమ్ ॥
మీ నుండి, భీమసేనార్జునుల నుండి అనుజ్ఞపొంది నిర్భయుడనై యథేచ్ఛగా చరిస్తాను.
వైశంపాయన ఉవాచ
ఏవం విజ్ఞాప్యమానస్య సహదేవస్య మారిష ।
ప్రహృష్టో దేవకీపుత్రః పాండవౌ చ మహారథౌ ॥
వైశంపాయనుడు పలికాడు - సహదేవుని విన్నపానికి వాసుదేవుడు మహారథులు భీమార్జునులు మిక్కిలి ప్రసన్నులయ్యారు.
క్రియతాం సంస్క్రియా రాజన్ పితుస్త ఇతి చాబ్రువన్ ।
తచ్ఛ్రుత్వా వాసుదేవస్య పార్థయోశ్చ స మాగధః ॥
ప్రవిశ్య నగరం తూర్ణ సహ మంత్రిభిరప్యుత ।
చితాం చందనకాష్ఠైశ్చ కాలేయసరళైస్తథా ॥
ఘృతధారాక్షతైశ్చైవ సుమనోభిశ్చ మాగధమ్ ॥
సమంతాదవకీర్యంత దహ్యంతం మగధాధిపమ్ ।
నీవు నీతండ్రికి అంత్యేష్టి సంస్కారాన్ని ఆచరించు. శ్రీకృష్ణుని పాండవుల మాటలను విని శీఘ్రంగా నగరంలోకి మంత్రులతో కలిసి సహదేవుడు ప్రవేశించాడు. చితిని చందనపుకర్రలు, అగరు, వృద్ధి, వివిధ తైలాలు, నెయ్యి, సుగంధాలతో అలంకరించి దానిపై జరాసంధుని శవాన్ని ఉంచాడు. మండిపోయే అతని శరీరంపై అన్నివైపుల నుంచి పూలు, అక్షతలు చల్లారు.
ఉదకం తస్య చక్రేఽథ సహదేవః సహానుజః ॥
కృత్వా పితుః స్వర్గగతిం నిర్యయౌ యత్ర కేశవః ।
పాండవౌ చ మహాభాగౌ భీమసేనార్జునావుభౌ ॥
స ప్రహ్వః ప్రాంజలిర్భూత్వా విజ్ఞాపయత మాధవమ్ ।
శవదహనమైన తర్వాత సహదేవుడు తన సోదరునితో కలిసి జలాంజలి సమర్పించాడు. తండ్రికి శ్రాద్ధకర్మ ఆచరించి శ్రీకృష్ణుడన్న చోటికి వచ్చాడు. భీమసేనార్జునులకు, మాధవునికి వినమ్రుడై నమస్కరించి ఇలా విన్నవించుకొన్నాడు.
సహదేవ ఉవాచ
ఇమే రత్నాని భూరీణిగోఽజావిమహిషాదయః ।
హస్తినోఽశ్వాశ్చ గోవింద వాసాంసి వివిధాని చ ॥
దీయతాం ధర్మరాజాయ యథా వా మన్యతే భవాన్ ।)
సహదేవుడు పలికాడు - ఈ గోవులు, మేకలు, గొఱ్ఱెలు, దున్నలు, రత్నరాశులు, ఏనుగులు, గుఱ్ఱాలు, పట్టుబట్టలు ధర్మజునికి అందజెయ్యి. ఇంకను నీవు కోరినట్లు చేస్తాను.
భయార్తాయ తతస్తస్మై కృష్ణో దత్త్వాభయం తదా ।
ఆదదేఽస్య మహార్హాణి రత్నాని పురుషోత్తమః ॥ 42
భయపీడితుడైన సహదేవునికి శ్రీకృష్ణుడు అభయమిచ్చి అతడిచ్చిన గొప్పరత్నాలన్నింటిని శ్రీకృష్ణుడు తీసుకొన్నాడు. (42)
అభ్యషించత తత్రైవ జరాసంధాత్మజం ముదా ।
గత్వైకత్వమ్ చ కృష్ణేన పార్థాభ్యాం చైవ సత్కృతః ॥ 43
సంతోషంతో శ్రీకృష్ణుడు జరాసంధపుత్రుడైన సహదేవుని పట్టాభిషిక్తుని చేశాడు. స్నేహితుడుగా మన్నించాడు. భీమార్జునులచే అతడు సత్కరింపబడినాడు. (43)
వివేశ రాజా ద్యుతిమాన్ బార్హద్రథపురం నృప ।
అభిషిక్తో మహాబాహుః జారాసంధిర్మహాత్మభిః ॥ 44
మహాత్ముల ఆజ్ఞగైకొని తేజస్వి అయిన జరాసంధ కుమారుడు పట్టాభిషిక్తుడై తన బార్హద్రథపురంలోకి ప్రవేశించాడు. (44)
కృష్ణస్తు సహ పార్థాభ్యాం శ్రియా పరమయా యుతః ।
రత్నాన్యాదాయ భూరీణి ప్రయయౌ పురుషర్షభః ॥ 45
పురుషోత్తముడైన కృష్ణుడు ఆ కానుకలను తీసికొని రత్నశోభచే సంపన్నుడై భీమసేనార్జునులతో బయలుదేరాడు. (45)
ఇంద్రప్రస్థముపాగమ్య పాండవాభ్యాం సహాచ్యుతః ।
సమేత్య ధర్మరాజానం ప్రీయమాణోఽభ్యభాషత ॥ 46
పాండవులతో కలిసి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థనగరానికి చేరి ధర్మరాజును ఆనందపరుస్తూ మాట్లాడాడు. (46)
దిష్ట్యా భీమేన బలవాన్ జరాసంధో నిపాతితః ।
రాజానో మోక్షితాశ్చైవ బంధనాన్నృపసత్తమ ॥ 47
మన అదృష్టం వల్ల భీమునిచే జరాసంధుడు చంపబడినాడు. రాజులందరు కారాగారం నుండి విముక్తులయ్యారు. (47)
దిష్ట్యా కుశలినౌ చేమౌ భీమసేనధనంజయౌ ।
పునః స్వనగరం ప్రాప్తౌ అక్షతావితి భారత ॥ 48
భీమసేనార్జునులు భాగ్యవశంచే క్షేమంగా ఉన్నారు. వీరు పీడలు, గాయాలు లేకుండా తిరిగి ఈ నగరాన్ని చేరారు. (48)
తతో యుధిష్ఠిరః కృష్ణం పూజయిత్వా యథార్హతః ।
భీమసేనార్జునౌ చైవ ప్రహృష్టః పరిషస్వజే ॥ 49
యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని తగినట్లుగా పూజించి, సంతసించి, వారందరినీ విడివిడిగా కౌగిలించుకొన్నాడు. (49)
తతః క్షీణే జరాసంధే భ్రాతృభ్యాం విహితం జయమ్ ।
అజాతశత్రురాసాద్య ముముదే భ్రాతృభిః సహ ॥ 50
జరాసంధమరణానంతరం ఇరువురు సోదరులు సాధించిన విజయంతో యుధిష్ఠిరుడు అజాతశత్రువై సోదరులతో కలిసి ఆనందంలో మునిగాడు. (50)
(హృష్టశ్చ ధర్మరాడ్ వాక్యం జనార్దనమభాషత ।
సంతోషించిన ధర్మరాజు జనార్దనునితో ఇలా అన్నాడు.
యుధిష్టిర ఉవాచ
త్వాం ప్రాప్య పురుషవ్యాఘ్ర భీమసేనేన పాతితః ।
మాగధోఽసౌ బలీన్మత్తః జరాసంధః ప్రతాపవాన్ ॥
యుధిష్ఠిరుడు పలికాడు - నీ సహాయం వల్ల భీమసేనుడు బలాభిమానంచే ఉన్మత్తుడైన జరాసంధుని పడగొట్టాడు.
రాజసూయం క్రతుశ్రేష్ఠం ప్రాప్స్యామి విగతజ్వరః ।
త్వబుద్ధిబలమాశ్రిత్య యాగార్హోఽస్మి జనార్దన ॥
ఇప్పుడు నిశ్చింతంగా యజ్ఞాలలో శ్రేష్ఠమయిన రాజసూయాన్ని పూర్తిచేస్తాను. నీ బుద్ధిబలంతో అది నాకు సాధ్యమై యాగం చేయటానికి అర్హుడను అయ్యాను.
పీతం పృథివ్యాం యుద్ధేన యశస్తే పురుషోత్తమ ।
జరాసంధవధేనైన ప్రాప్తాస్తే విపులాః శ్రియః ॥
ఈ యుద్ధంతో భూమండలంపై నీ కీర్తి విస్తరించింది. జరాసంధునివధ వల్ల నీకు అపరిమితాలైన సంపదలు దక్కాయి.
వైశంపాయన ఉవాచ
ఏవం సంభాష్య కౌంతేయః ప్రాదాద్ రథవరం ప్రభోః ।
ప్రతిగృహ్య తు గోవిందః జరాసంధస్య తం రథమ్ ॥
ప్రహృష్టస్తస్య ముముదే ఫల్గునేన జనార్దనః ।
ప్రీతిమానభవద్ రాజన్ ధర్మరాజపురస్కృతః ॥)
వైశంపాయనుడు పలికాడు - ధర్మజుడు ఇలా పలికి ఆ దివ్యరథాన్ని శ్రీకృష్ణునికి సమర్పించాడు. అది తీసుకొని గోవిందుడు మిక్కిలి ప్రసన్నత పొందాడు. అర్జునితో దానిపై కూర్చుండి ఆనందాన్ని అనుభవించాడు. ధర్మరాజుచే సత్కరింపబడి ఆ కానుకను గైకొని అంతులేని ఆనందాన్ని పొందాడు.
యథావయః సమాగమ్య భ్రాతృభిః సహపాండవః ।
సత్కృత్య పూజయిత్వా చ విససర్జ నరాధిపాన్ ॥ 51
వారి వయోభేదాన్ని బట్టి యుధిష్ఠిరుడు సోదరులతో కూడి వారినందరినీ కలిశాడు. సత్కరిమ్చి, పూజించి ఆ రాజులందరినీ వారి రాజ్యాలకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. (51)
యుధిష్ఠిరాభ్యనుజ్ఞాతాః తే నృపా హృష్ణమానసాః ।
జగ్ముః స్వదేశాంస్త్వరితా యానైరుచ్చావచైస్తతః ॥ 52
యుధిష్ఠిరుని ఆజ్ఞానుసారం వారు ఆనందింది శీఘ్రంగా తమ వాహనాల పై వారివారి నగరాలకు చేరారు. (52)
ఏవం పురుషశార్దూలః మహాబుద్ధిర్జనార్దనః ।
పాండవైర్ఘాతయామాస జరాసంధమరిం తదా ॥ 53
ఈ విధంగా పురుషశ్రేష్ఠుడు, బుధ్ధిశాలి అయిన శ్రీకృష్ణుడు పాండవులచే తన శత్రువైన జరాసంధుని చంపించాడు. (53)
ఘాతయిత్వా జరాసంధం బుద్ధిపూర్వమరిందమః ।
ధర్మరాజమనుజ్ఞాప్య పృథాం కృష్ణాం చ భారత ॥ 54
సుభద్రాం భీమసేనం చ ఫల్గునం యమజౌ తథా ।
ధౌమ్యమామంత్రయిత్వా చ ప్రమయౌ స్వాం పురీంప్రతి ॥ 55
తేనైవ రథముఖ్యేన మనసస్తుల్యగామినా ।
ధర్మరాజవిసృష్టేన దివ్యేనానాదయన్ దిశః ॥ 56
శత్రువులను నాశనంచేసే శ్రీకృష్ణుడు తన తెలివితేటలతో జరాసంధుని చంపించి ధర్మరాజు, కుంతి, ద్రౌపదుల ఆజ్ఞగైకొని సుభద్ర, భీముడు, అర్జునుడు, కవలలు నకులసహదేవులు, ధౌమ్యుని వీడ్కొని మనోవేగం కల ఆ దివ్యరథంలో దిశల్ని ప్రతిధ్వనింపజేస్తూ ధర్మరాజును వీడి ద్వారకకు బయలుదేరాడు. (54-56)
తతో యుధిష్ఠిరముఖాః పాండవా భరతర్షభ ।
ప్రదక్షిణమకుర్వంత కృష్ణమక్లిష్టకారిణమ్ ॥ 57
తరువాత యుధిష్ఠిరుడు ఆదిగా గల పాండవులు శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి నమస్కారాలు చేశారు. (57)
తతో గతే భగవతి కృష్ణే దేవకినందనే ।
జయం లబ్ధ్వా సువిపులం రాజ్ఞాం దత్త్వాభయం తదా ॥ 58
సంవర్ధితం యశో భూయః కర్మణా తేన భారత ।
ద్రౌపద్యాః పాండవా రాజన్ పరాం ప్రీతిమవర్ధయన్ ॥ 59
రాజులందరికీ అభయమిచ్చి, గొప్ప విజయాన్ని సాధించి దేవకినందనుడూ, పూజ్యుడూ అయిన శ్రీకృష్ణుడు వెళ్లాడు. కీర్తి నలువైపులా వ్యాపించగా పాండవులు ద్రౌపదికి ఎక్కువ ఆనందాన్ని కలిగించారు. (58,59)
తస్మిన్ కాలే తు యద్ యుక్తం ధర్మకామార్థసంహితమ్ ।
తద్ రాజా ధర్మతశ్చక్రే ప్రజాపాలనకీర్తనమ్ ॥ 60
ఆ కాలానికి తగిన ధర్మ, అర్థ, కామ సిద్ధి కొరకైన అన్ని పనులను ధర్మరాజు ధర్మబద్ధంగా చేశాడు. ప్రజారక్షణం కోసం ధర్మోపదేశాన్ని చేయసాగాడు. (60)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి జరాసంధవధపర్వణి జరాసంధవధే చతుర్వింశోఽధ్యాయః ॥ 24 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున జరాసంధవధపర్వమను ఉపపర్వమున జరాసంధుని వధ అను ఇరువది నాలుగవ అధ్యాయము. (24)