27. ఇరువది ఏడవ అధ్యాయము

అర్జునుడు పర్వతీయ దేశములను జయించుట.

వైశంపాయన ఉవాచ
ఏవముక్తః ప్రత్యువాచ భగదత్తం ధనంజయః ।
అనేనైవ కృతం సర్వమ్ అనుజానీహి యామ్యహమ్ ॥ 1
వైశంపాయనుడు పలికాడు - అర్జునుడు అతని మాటలు విని ఇలా బదులు పలికాడు. మీ మాటతోనే అంతా చేసినట్లయింది. అనుజ్ఞ ఇవ్వండి వెళ్లివస్తాను. (1)
తం విజిత్య మహాబాహుః కుంతీపుత్రో ధనంజయః ।
ప్రయయావుత్తరాం తస్మాద్ దిశం ధనదపాలితామ్ ॥ 2
భగదత్తుని జయించి కుంతీపుత్రుడు ధనంజయుడు అక్కడి నుండి కుబేరపాలితమయిన ఉత్తరదిక్కుకు బయలుదేరాడు. (2)
అంతర్గిరిం చ కౌంతేయః తథైవ చ బహిర్గిరిమ్ ।
తథైవోపగిరిం చైవ విజిగ్యే పురుషర్భభః ॥ 3
అర్జునుడు క్రమంగా అంతర్గరి, బహిర్గిరి, ఉపగిరి అనే ప్రదేశాలు జయించాడు. (3)
విజిత్య పర్వతాన్ సర్వాన్ యే చ తత్ర నరాధిపాః ।
తాన్ వశే స్థాపయిత్వా సః ధనాన్యాదాయ సర్వశః ॥ 4
తిరిగి పర్వతప్రదేశాలన్నింటిని జయించి అక్కడి రాజులను తన అధీనంలోకి తెచ్చుకుని వారి నుండి అనేక ధనరాశుల్ని స్వాధీనం చేసుకొన్నాడు. (4)
తైరేవ సహితం సర్వైః అనురజ్య చ తాన్ నృపాన్ ।
ఉలూకవాసినం రాజన్ బృహంతీముపజగ్మివాన్ ॥ 5
పిమ్మట వారందరినీ ప్రసన్నులను చేసుకొని వారితో కలిసి ఉలూకదేశవాసియైన బృహంతుని పైకి యుద్ధానికి వెళ్ళాడు. (5)
మృదంగ వరనాదేన రథనేమిస్వనేన చ ।
హస్తినాం చ నినాదేన కంపయన్ వసుధామిమామ్ ॥ 6
మృదంగం మొదలయిన వాద్యాలధ్వని, రథపుటిరుసుల ఘోష, ఏనుగుల ఘీంకారాలతో భూమిని కంపింపజేస్తూ అర్జునుడు ముందుకు సాగాడు. (6)
తతో బృహంతస్త్వరితః బలేన చతురంగిణా ।
నిష్క్రామ్య నగరాత్ తస్మాద్ యోధయామాస ఫాల్గునమ్ ॥ 7
బృహంతుడు చతురంగబలాలతో కలిసి నగరం వెలుపలికి వచ్చి అర్జునునితో యుద్ధం చేయసాగాడు. (7)
సుమహాన్ సంనిపాతోఽభూద్ ధనంజయబృహంతయోః ।
న శశాక బృహంతస్తు సోఢుం పాండవవిక్రమమ్ ॥ 8
అర్జున బృహంతుల మధ్య పెద్దయుద్ధం ప్రారంభమైంది. కాని అర్జునుని పరాక్రమాన్ని బృహంతుడు తట్టుకో లేకపోయాడు. (8)
సోఽవిషహ్యతమం మత్వా కౌంతేయం పర్వతేశ్వరః ।
ఉపావర్తత దుర్ధర్షః రత్నాన్యాదాయ సర్వశః ॥ 9
కుంతీకుమారుని ఎదిరింపలే నని భావించి పర్వతేశ్వరుడు బృహంతుడు యుద్ధాన్ని ఆపి ఎన్నో రత్నరాసులను తీసుకొని సేవింప వచ్చాడు. (9)
స తద్రాజ్యమవస్థాప్య ఉలూకసహితో యయౌ ।
సేనాబిందుమథో రాజన్ రాజ్యాదాశు సమాక్షిపత్ ॥ 10
అర్జునుడు బృహంతుని రాజ్యానికి అతనినే రాజును చేసి ఉలూకునితో కూడి సేనాబిందుని రాజ్యంపై దాసిచేసి అతడిని పదవీచ్యుతుని చేశాడు. (10)
మోదాపురం వామదేవం సుదామానం సుసంకులమ్ ।
ఉలూకానుత్తరాంశ్చైవ తాంశ్చ రాజ్ఞః సమానయత్ ॥ 11
మోదాపురం, వామదేవం, సుదామ్నం, సుసంకులం అనే ఉలూకదేశపు ఉత్తరప్రాంతాలను, వాటి రాజులనూ వశపరచుకొన్నాడు. (11)
తత్రస్థః పురుషైరేవ ధర్మరాజస్య శాసనత్ ।
కిరీటీ జితవాన్ రాజన్ దేశాన్ పంచగణాంస్తతః ॥ 12
ధర్మరాజు ఆజ్ఞానుసారం అర్జునుడు అక్కడే ఉండి తన సేవకుల ద్వారా పంచగణదేశాలను జయించాడు. (12)
స దేవప్రస్ధమాసాద్య సేనాబిందోః పురం ప్రతి ।
బలేన చతురంగేణ నివేశామకరోత్ ప్రభుః ॥ 13
అక్కడ నుండి సేనాబిందుని రాజధాని దేవప్రస్థానికి చేరి చతురంగ బలాలతో అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. (13)
స తైః పరివృతః సర్వైః విష్వగశ్వం నరాధిపమ్ ।
అభ్యగచ్ఛన్మహాతేజాః పౌరవం పురుషర్షభ ॥ 14
పరాజితులైన రాజులందరితో గూడి పరాక్రమవంతుడైన విష్వగశ్వుడనే పౌరవదేశాధిపతిని ఎదిరించాడు. (14)
విజిత్య చాహవే శూరాన్ పర్వతీయాన్ మహారథాన్ ।
జిగాయ సేనయా రాజన్ పురం పౌరవరక్షితమ్ ॥ 15
ఆ యుద్ధంలో పరాక్రమవంతులు, మహారథులూ అయిన పర్వతీయులను ఓడించి పౌరవరక్షితమయిన రాజధానిని తన సేనతో జయించాడు. (15)
పౌరవం యుధి నిర్జిత్య దస్యూన పర్వతవాసినః ।
గణానుత్సవసంకేతాన్ అజయత్ సప్త పాండవః ॥ 16
పౌరవుని యుద్ధంలో జయించి పర్వతవాసులై ఉత్సవసంకేతులని పేరుబడ్డ బందిపోటు దొంగల గణాలను ఏడింటిని కూడా జయించాడు అర్జునుడు. (16)
తతః కాశ్మీరకాన్ వీరాన్ క్షత్రియాన్ క్షత్రియర్షభః ।
వ్యజయల్లోహితం చైవ మండలైర్దశభిః సహ ॥ 17
పిమ్మట రాజశ్రేష్ఠుడైన అర్జునుడు కాశ్మీరదేశ క్షత్రియులను, దశమండలాలతో కలిసిన రాజు లోహితుని తన అధీనంలోకి తెచ్చుకొన్నాడు. (17)
తతస్త్రిగర్తాః కౌంతేయం దార్వాః కోకనదాస్తథా ।
క్షత్రియా బహవో రాజన్నుపావర్తంత సర్వశః ॥ 18
త్రిగర్తులు, దార్వులు, కోకనదులు, చాలమంది ఇతరులైన రాజసమూహాలు అర్జునుని శరణువేడారు. (18)
అభిసారీం తతో రమ్యాం విజిగ్యే కురునందనః ।
ఉరగావాసినం చైవ రోచమానం రణేఽజయత్ ॥ 19
కురునందనుడు అర్జునుడు రమ్యమైన అభిసారీనగరాన్ని జయించి, ఉరగావాసిరాజైన రోచమానుని యుద్ధంలో వశపరచుకొన్నాడు. (19)
తతః సింహపురం రమ్యం చిత్రాయుధసురక్షితమ్ ।
ప్రాధమద్ బలమాస్థాయ పాకశాసనిరాహవే ॥ 20
ఇంద్రకుమారుడైన అర్జునుడు చిత్రాయుధునిచే రక్షింపబడే సింహపురాన్ని తనసేనతో ముట్టడించి, యుద్ధం చేసి, అధీనంలోకి తెచ్చాడు. (20)
తతః సుహ్మాంశ్చ చోలాంశ్చ కిరీటీ పాండవర్షభః ।
సహితః సర్వసైన్యేన ప్రామధత్ కురునందనః ॥ 21
పిమ్మట పాండవశ్రేష్ఠుడు కిరీటి సుహ్ములను, చోళులను తన సమస్తసేనతో చుట్టుముట్టి మధించాడు. (21)
తతః పరమవిక్రాంతః బాహ్లికాన్ పాకశాసనిః ।
మహతా పరిమర్దేన వశే చక్రే దురాసదాన్ ॥ 22
ఇంద్రపుత్రుడు అర్జునుడు మిక్కిలి పరాక్రమం గల సేనతో పోయి యుద్ధంలో జయింపవీలుకాని బాహ్లీకులను వశపరచుకొన్నాడు. (22)
గృహీత్వా తు బలం సారం ఫాల్గునః పాండునందనః ।
దరదాన్ సహ కాంబోజైః అజయత్ పాకశాసనిః ॥ 23
అతడు తన శక్తిమంతమైన సేనతో కాంబోజులను, దరదులను కుడ ఓడించాడు. (23)
ప్రాగుత్తరాం దిశం యే చ వసంత్యాశ్రిత్య దస్యవః ।
నివసంతి వనే యే చ తాన్ సర్వానజయత్ ప్రభుః ॥ 24
ఈశాన్యమూలలో వనవాసులై ఉన్న దస్యులందరినీ తనశక్తితో జయించి స్వాధీనం గావించుకొన్నాడు. (24)
లోహాన్ పరమకాంబోజాన్ ఋషికానుత్తరానపి ।
సహితాంస్తాన్ మహారాజ వ్యజయత్ పాకశాసనిః ॥ 25
లోహ, పరమకాంబోజ, ఋషిక ఉత్తరదేశాలన్నింటిని ఒక్కసారిగా జయించాడు. (25)
ఋషికేష్వసి సంగ్రామః బభువాతిభయంకరః ।
తారకామయసంకాశః పరస్త్వృషికపార్థయోః ॥ 26
ఋషిక, అర్జునుల మధ్య నక్షత్రాల్లా కనులు మిరుమిట్లు గొలిపే భయంకరమైన యుద్ధం ఋషికదేశంలో జరిగింది. (26)
స విజిత్య తతో రాజన్ ఋషికాన్ రామూర్ధని ।
శుకోదరసమాంస్తత్ర హయానష్టౌ సమానయత్ ॥ 27
యుద్ధభూమిలో ఋషికులందరినీ గెలిచి చిలుకల పొట్టవలె ఆకుపచ్చని రంగుగల ఎనిమిది గుఱ్ఱాలను కానుకగా పొందాడు. (27)
మయూరసదృశానన్యాన్ ఉత్తరానపరానపి ।
జవనానాశుగాంశ్చైవ కరార్థః సముపానయత్ ॥ 28
నెమలిరంగు గలిగి శీఘ్రగమనంతో పరుగెత్తే సామర్థ్యం గల గుఱ్ఱాలను పన్నుఆ ఉత్తరదేశాల నుంచి రాబట్టాడు. (28)
స విసిర్జిత్య సంగ్రామే హిమవంతం సనిష్కుటమ్ ।
శ్వేతపర్వతమాసాద్య న్యవిశత్ పురుషర్షభః ॥ 29
పురుషోత్తముడైన అర్జునుడు యుద్ధాన, హిమవంతుని, నిష్కుటదేశా అధిపతులను గెలిచి ధవళగిరిపై శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. (29)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి ఫాల్గునదిగ్విజయే నానాదేశజయే సప్తవింశోఽధ్యాయః ॥ 27 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున దిగ్విజయపర్వమను ఉపపర్వమున ఫాల్గున దిగ్విజయము, నానాదేశజయము అను ఇరువది ఏడవ అధ్యాయము. (27)