28. ఇరువది ఎనిమిదవ అధ్యాయము
కింపురుషాది దేశములను జయించి అర్జునుడు ఇంద్రప్రస్థమునకు వచ్చుట.
వైశంపాయన ఉవాచ
స శ్వేతపర్వతం వీరః సమతిక్రమ్య వీర్యవాన్ ।
దేశం కింపురుషావాసం ద్రుమపుత్రేణ రక్షితమ్ ॥ 1
మహతా సంనిపాతేన క్షత్రియాంతకరేణ హ ।
అజయత్ పాండవశ్రేష్ఠః కరే చైనం న్యవేశయత్ ॥ 2
వైశంపాయనుడు పలికాడు - ఆ వీరుడు శ్వేతపర్వతాన్ని దాటి ద్రుమపుత్రుని రక్షణలో ఉన్న కింపురుషనివాసాన్ని చేరాడు. క్షత్రియనాశకరమైన యుద్ధంలో ఆ దేశాన్ని జయించాడు. కప్పం కట్టే పద్ధతిపై మరల సింహాసనంపై అతనిని ఉంచాడు. (1,2)
తం జిత్వా హాటకం నామ దేశం గుహ్యకరక్షితమ్ ।
పాకశానిరవ్యగ్రః సహసైన్యః సమాసదత్ ॥ 3
కిన్నరదేశాన్ని జయించి శాంతచిత్తుడై అర్జునుడు గుహ్యకరక్షితమయిన హాటకదేశంపై దాడిచేశాడు. (3)
తాంస్తు సాంత్వేన నిర్జిత్య మానసం సర ఉత్తమమ్ ।
ఋషికుల్యాస్తథా సర్వాః దదర్శ కురునందనః ॥ 4
గుహ్యకులను సామోపాయంతో వశపరచుకొని కప్పానికై మానససరోవరానికి వెళ్లాడు. ఋషుల పేర్లతో ప్రసిద్ధికెక్కిన ప్రవాహాలను అక్కడ చూశాడు. (4)
సరోమానసమాసాద్య హాటకానభితః ప్రభుః ।
గంధర్వరక్షితం దేశమ్ అజయత్ పాండవస్తతః ॥ 5
మానస సరోవరాన్ని చేరి శక్తిశాలి అర్జునుడు హాటకదేశ సమీపంలోని గంధర్వులందరినీ జయించి వారి రాజ్యమందు వారినే సుప్రతిష్ఠితులను చేశాడు. (5)
తత్ర తిత్తిరి కల్మాషాన్ మండూకాఖ్యాన్ హయోత్తమాన్ ।
లేభే స కరమత్యంతం గంధర్వనగరాత్ తదా ॥ 6
గంధర్వదేశాల నుండి, తిత్తిరి, కల్మాష, మండూకాలనే పేర్లు గల గుఱ్ఱాలను కప్పం రూపంగా గ్రహించాడు. (6)
(హేమకూటమథాసాద్య న్యవిశత్ ఫాల్గునస్తథా ।
తం హేమకూటం రాజేంద్ర సమతిక్రమ్య పాండవః ॥
హరివర్షం వివేశాథ సైన్యేన మహతాఽఽవృతః ।
తత్ర పార్థో దదర్శాథ బహూనిహ మనోరమాన్ ॥
నగరాంశ్చ వనాంశ్చైవ నదీశ్చ విమలోదకాః ।
పిమ్మట హేమకూటపర్వతంపై విడిది (శిబిరం) చేశాడు. హేమకూటాన్ని దాటి అర్జునుడు హరివర్షాన్ని గొప్పసేనతో సహా చేరినాడు. అక్కడ సుందర నగరాలను వనాలను, జలాలతో నిండిన నదుల్ని చూశాడు.
పురుషాన్ దేవకల్పాంశ్చ నారీశ్చ ప్రియదర్శనాః ॥
తాన్ సర్వాంస్తత్రదృష్ట్వాథ ముదా యుక్తో ధనంజయః ।
అక్కడి పురుషులు దేవతలవలె తేజోవంతులు. స్త్రీలు పరమసుందరీమణులు. వారి నందర్నీ చూచిన అర్జునునికి మిక్కిలి ప్రసన్నత కలిగింది.
వశే చక్రేఽథ రత్నాని లేభే చ సుబహూని చ ॥
తతో నిషధమాసాద్య గిరిస్థానజయత్ ప్రభుః ।
అథ రాజన్నతిక్రమ్య నిషధం శైలమాయతమ్ ॥
వివేశ మధ్యమం వర్షం పార్థో దివ్యమిలావృతమ్ ।
హరివర్షదేశాలను వశపరచుకొని రత్నాలను పొందాడు. నిషధపర్వతం పైకి వెళ్ళి అక్కడివారిని జయించాడు. విశాలమైన నిషధపర్వతాన్ని దాటి దివ్యమయిన ఇలా వృతవర్షాన్ని చేరాడు. అది జంబూద్వీపంలో మధ్యనున్న భూభాగం.
తత్రదేవోపమాన్ దివ్యాన్ పురుషాన్ దేవదర్శనాన్ ॥
అదృష్టపూర్వాన్ సుభగాన్ స దదర్శ ధనంజయః ।
అక్కడ దేవతలవలె కనిపించే దివ్యపురుషులను తిలకించాడు. వారు మిక్కిలి సౌభాగ్యంతో కూడినవారు. అర్జునుడు ఇదివరకెన్నడు అట్టివారిని చూడలేదు.
సదనాని చ శుభ్రాణి నారీశ్చాప్సరసాం నిభాః ॥
దృష్ట్వా తానజయద్ రమ్యాన్ స తైశ్చ దదృశే తదా ।
అక్కడి భవనాలు శుభ్రంగా ఉన్నాయి. స్త్రీలు అప్సరసల అందం కలవారు. అందగతైలైన స్తీలను, అందం గల పురుషుల్ని చూశాడు. వారి దృష్టి కూడ అర్జునునిపై పడింది.
జిత్వా చ తాన్ మహాభాగాన్ కరే చ వినివేశ్య సః ॥
రత్నాన్యాదాయ దివ్యాని భూషణైర్వసనైః సహ ।
ఉదీచీమథ రాజేంద్ర యయౌ పార్థో ముదాన్వితః ॥
వారినందర్నీ యుద్ధంలో జయించి పన్ను కట్టేవారిగా చేశాడు. వస్త్రాలను, రత్నాలను ఆభరణాలను వారి నుండి కానుకలుగా పొంది ప్రసన్నుడై ఉత్తరడిక్కుగా సాగిపోయాడు.
స దదర్శ మహామేరుం శిఖరాణాం ప్రభుం మహత్ ।
తం కాంచనమయం దివ్యం చతుర్వర్ణం దురాసదమ్ ॥
ఆయతం శతసాహస్రం యోజనానాం తు సుస్థితమ్ ।
జ్వలంతమచలం మేరుం తేజోరాశిమనుత్తమమ్ ॥
ఆక్షిపంతం ప్రభాం భానోః స్వశృంగైః కాంచనోజ్జ్వలైః ।
కాంచనాభరణం దివ్యం దేవగంధర్వసేవితమ్ ॥
నిత్యపుష్పఫలోపేతం సిద్ధచారనసేవితమ్ ।
అప్రమేయ మనాధృష్యమ్ అధర్మబహులైర్జనైః ॥
ముందుకు సాగి పర్వతనాయకుడు, గిరిశ్రేష్ఠుడు అయిన మేరుపర్వతాన్ని చూశాడు. అది బంగారుమయం, నాలుగురంగులతో ప్రకాశిస్తోంది. చేర శక్యంగాక ఉంది. దాని పొడుగు ఒక లక్షయోజనాలు. ఆ ఉత్తమపర్వతం తేజః పుంజంలా ప్రకాశిస్తూ సూర్యుని తేజస్సును కూడ తనబంగారు శిఖరాల కాంతితో తిరస్కరిస్తోంది. సువర్ణ, దివ్యపర్వతం దేవతలకు, గంధర్వులకు నివాసభూమియై ఉంది. సిద్ధచారణులు ఎల్లప్పుడు అక్కడ నివసిస్తారు. ఆ పర్వతంపై ఫలపుష్ప సమృద్ధి ఎల్లవేళలా ఉంటుంది. దాని ఎత్తును ఎవ్వరూ కొలవలేరు. అధర్మంతో జీవించేవారు అకక్డికి చేరలేరు.
వ్యాళైరాచరితం ఘోరైః దివ్యౌషధివిదీపితమ్ ।
స్వర్గమావృత్య తిష్ఠంతమ్ ఉచ్ఛ్రయేణ మహాగిరిమ్ ॥
అగమ్యం మనసాప్యన్యైః నదీవృక్షసమన్వితమ్ ।
నానావిహగసంఘైశ్చ నాదితం సుమనోహరైః ॥
త్వం దృష్ట్వా ఫాల్గునో మేరుం ప్రీతిమానభవత్ తదా ।
మాహాభయంకర సర్పాలు అక్కడ సంచరిస్తాయి. దివ్యౌషధాలతో ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. తన శిఖరాలతో స్వర్గాన్ని తాకుతూ ఉంటుంది. అల్పులకు అది పొంద వీలుకానిది. ఎన్నోనదులు, చెట్లు దాని శోభను పెంచుతున్నాయి. చాలారకాలైన పక్షుల కిలకిలారావాలతో ఆ పర్వతం మార్మోగుతూ కనిపిస్తుంది. అలాంటి మేరుపర్వతాన్ని చూసిన అర్జునుని మనస్సు ఆనందంతో నిండిపోయింది.
మేరోరిలావృతం వర్షం సర్వతః పరిమండలమ్ ॥
మేరోస్తు దక్షిణే పార్శ్వే జంబూర్నామ వనస్పతిః ।
నిత్యపుష్పఫలోపేతః సిద్ధచారనసేవితః ॥
మేరుపర్వతానికి నాలుగువైపులా మండలాకారంలో ఇలా వృతవర్షం వ్యాపించి ఉంది. మేరువునకు కుడిభాగాన జంబువు అనే వృక్షం ఉంది. అది ఎల్లప్పుడు ఫలపుష్ప భరితమై ప్రకాశిస్తుంది. సిద్ధులు, చారణులు ఆ చెట్టును సేవిస్తూ ఉంటారు.
ఆస్వర్గముచ్ఛ్రితా రాజన్ తస్య శాఖా వనస్పతేః ।
యస్య నామ్నా త్విదం ద్వీపం జంబూద్వీపమితి శ్రుతమ్ ॥
ఆ జంబూవృక్షమ్ కొమ్మలు స్వర్గం దాకా వ్యాపించాయి. ఆ చెట్టు కొమ్మలను బట్టి ఈ ద్వీపానికి జంబూద్వీపం అనే పేరు వచ్చింది.
తాం చ జంబూం దదర్శాథ సవ్యసాచీ పరంతపః ।
తౌ దృష్ట్వాప్రతిమౌ లోకే జంబూం మేరుం చ సంస్థితౌ ।
ప్రీతిమానభవద్ రాజన్ సర్వతః స విలోకయన్ ।
తత్ర లేభే తతో జిష్ణుః సిద్ధైర్దివ్యైశ్చ చారణైః ॥
రత్నాని బహుసాహస్రం వస్త్రాణ్యాభరణాని చ ।
అన్యాని చ మహార్హాణి తత్ర లబ్ధ్వార్జునస్తదా ॥
ఆమంత్రయిత్వా తాన్ సర్వాన్ యజ్ఞముద్దిశ్య వై గురోః ।
అథాదాయ బహూన్ రత్నాన్ గమనాయోపచక్రమే ॥
శత్రుసంతాపశీలి అర్జునుడు ఆ జంబూవృక్షం చూశాడు. ఆ చెట్టు, మేరుపర్వతమూ కూడా ఈ భూమిపై సాటిలేనివి. వాటిని చూచిన అర్జునునికి ఆనందం కలిగింది. అక్కడ అన్నివైపులకు చూస్తూ అర్జునుడు సిద్ధులు, చారణుల నుండి విలువైన రత్నాలు, వస్త్రాలు, అలంకారాలు, ఇంకా ఇతర వస్తువులూ పొందాడు. అనంతరం వారికందరికీ తన అన్న యజ్ఞం గురించి చెప్పి వారి నుండి ఇంకా రత్నరాశులను పొంది అక్కడ నుంచి బయలుదేరటానికి సన్నద్ధుడైనాడు.
మేరుం ప్రదక్షిణం కృత్వా పర్వతప్రవరం ప్రభుః ।
యయౌ జంబూనదీతీరే నదీం శ్రేష్ఠాం విలోకయన్ ॥
స తాం మనోరమాం దివ్యాం జంబూస్వాదురసావహామ్ ।
పర్వతోత్తమమయిన మేరువుకి ప్రదక్షిణం ఆచరించాడు. జంబూనదీ తీరానికి చేరాడు. అక్కడ ఆ నదీశోభను తిలకించాడు. ఆ దివ్యనదీజలంతో జంబూవృక్షాలు స్వాదయోగ్యాలైన ఫలాలను ఇస్తున్నాయి.
హైమపక్షిగణైర్జుష్టాం సౌవర్ణజలజాకులామ్ ॥
హైమపంకాం హైమజలాం శుభాం సౌవర్ణవాలుకామ్ ।
ఆ చెట్టుకొమ్మలపై బంగారు రంగుపక్షులు విహరిస్తున్నాయి. అది బంగారు రంగు నీళ్ళతో ప్రకాశిస్తోంది. అక్కడి ఇసుక తిన్నెలు, బురద, ఇసుక అన్నీ బంగారపు రంగులో ప్రకాశిస్తున్నాయి.
క్వచిత్ సౌవర్ణపద్మైశ్చ సంకులాం హేమపుష్పకైః ॥
క్వచిత్ సుపుష్పితైః కీర్ణః సువర్ణకుముదోత్పలైః ।
క్వచిత్ తీరరుహైః కీర్ణాం హైమవృక్షైః సుపుష్పితైః ॥
అక్కడక్కడ బంగారు పుష్పాలతో, పద్మాలతో వ్యాపించి ఉంది. ఒక్కొక్కచోట బంగారు కలువలు, వికసించి ఉన్నాయి. ఆ నదీతీరం సుందరపుష్పాలతో నిండి బంగారు రంగు చెట్లతో అంతటా వ్యాపించింది.
తీర్థైశ్చ రుక్మసోపానైః సర్వతః సంకులాం శుభామ్ ।
విమలైర్మణిజాలైశ్చ నృత్యగీతరవైర్యుతామ్ ॥
బంగారుమెట్లతో, రేవులతో నిండి ఉంది. నిర్మలమణుల సముదాయాలు దాని శోభను పెంచాయి. నృత్య, గీత నాదాలతో ఆప్రదేశం మార్మ్రోగుతోంది.
దీప్తైర్హేమవితానైశ్చ సమంతాచ్ఛోభితాం శుభామ్ ।
తథావిధాం నదీం దృష్ట్వా పార్థస్తాం ప్రశశంస హ ॥
అదృష్టపూర్వాం రాజేంద్ర దృష్ట్వా హర్షమవాప చ ।
ప్రకాశిమ్చే బంగారు మంటపాలు అక్కడ ఉన్నాయి. వాటి వలన నదీశోభ పెరుగుతోంది. ఇది వరకు చూడని ఆ నదిని చూచి అర్జునుడు ప్రసన్నుడై ప్రశంసించకుండా ఉండలేకపోయాడు.
దర్శనీయాన్ నదీతీరే పురుషాన్ సుమనోహరాన్ ॥
తాన్ నదీసలిలాహారాన్ సదారానమరోపమాన్ ।
నిత్యం సుఖముదా యుక్తాన్ సర్వాలంకారశోభితాన్ ॥
ఆ నదీతీరంలో సుందరులైన పురుషులు అప్సరసల వంటి స్త్రీలతో విహరించటం గమనించాడు. వారి సౌందర్యం చూడయోగ్యంగా ఉంది. వారు అందరి మనస్సులకు మోహాన్ని కల్పిస్తున్నారు. జంబూనదీ జలాలే వారికి ఆహారం. వారు నిత్యమూ ఆనందంలో, సుఖంలో మునిగిపోయారు. చాలరకాల ఆభరణాలను ధరించారు.
తేభ్యో బహూని రత్నాని తదా లేభే ధనంజయః ।
దివ్యజాంబూనదం హేమ భూషణాని చ పేశలమ్ ॥
లబ్థ్వా తాన్ దుర్లభాన్ పార్థః ప్రతీచీం ప్రయయౌ దిశమ్ ।
వారి నుండి విలువైన రత్నాలను కానుకలుగా పొందాడు. దివ్యమైన జాంబూనదం అనే పేరుగల బంగారం, విలువైన ఆభరణాలు, దుర్లభాలైన వస్తువులు గ్రహించి పశ్చిమంగా బయలుదేరాడు అర్జునుడు.
నాగానాం రక్షితం దేశమ్ అజయచ్చార్జునస్తతః ॥
తతో గత్వా మహారాజ వారుణీం పాకశాసనిః ।
గంధమాదనమాసాద్య తత్రస్థానజయత్ ప్రభుః ॥
తం గంధమాదనం రాజన్ అతిక్రమ్య తతోఽర్జునః ।
కేతుమాలం వివేశాథ వర్షం రత్నసమన్వితమ్ ।
సేవితం దేవకల్పైశ్చ నారీభిః ప్రియదర్శనైః ॥
అచటికి పోయి, నాగులు రక్షిమ్చే ఆ దేశాన్ని జయించాడు. అక్కడి నుండి ఇంకా పశ్చిమంగా పోయి గంధమాదనపర్వతాన్ని చేరి అక్కడి వారినందరినీ గెలిచాడు. గంధమాదనాన్ని దాటి రత్నసంపదతో తులతూగే కేతుమాలవర్షాన్ని చేరాడు. అది దేవతుల్యులైన స్త్రీ, పురుషుల నివాసప్రదేశం.
తం జిత్వా చార్జునో రాజన్ కరే చ వినివేశ్య చ ।
ఆహృత్య తత్ర రత్నాని దుర్లభాని తథార్జునః ॥
పునశ్చ పరివృత్యాథ మధ్యం దేవమిలావృతమ్ ।
ఆ కేతుమాలవర్షాన్ని జయించి అర్జునుడు దాన్ని కప్పం కట్టే దేశంగా చేసి దుర్లభాలైన రత్నాలను తీసికొని తిరిగి ఇలా వృతవర్షానికి వచ్చాడు.
గత్వా ప్రాచీం దిశం రాజన్ సవ్యసాచి పరంతపః ॥
మేరుమందరయోర్మధ్యే శైలోదామభితో నదీమ్ ।
యే తే కీచకవేణూనాం ఛాయాం రమ్యాముపాసతే ॥
ఖశాం ఝషాంశ్చ నద్యోతాన్ ప్రఘసాన్ దీర్ఘవేణికాన్ ।
పశుపాంశ్చ కుళిందాంశ్చ తంగణాన్ పరతంగణాన్ ॥
రత్నాన్యాదాయ సర్వేభ్యః మాల్యవంతం తతో యయౌ ।
తం మాల్యవంతం శైలేంద్రం సమతిక్రమ్య పాండవః ॥
భద్రాశ్వం ప్రవివేశాథ వర్షం స్వర్గోపమం శుభమ్ ।
శత్రుదమనుడైన అర్జునుడు తుర్పుదిక్కుగా బయలుదేరి మేరుమందరపర్వతాలకు మధ్య ఉన్న శైలోదానది ఒడ్డున ఉన్న వెదుర్లు, వేణునామకాలైన చెట్ల నీడల్లో, వీశ్రాంతి తీసుకొన్నాడు. అక్కడి ఖశ, ఝష, నద్యోత, ప్రఘస, దీర్ఘవేణిక, పశుప, కుళింద, తంగణ, పరతంగణ జాతులను ఓడించి వారి నుండి కానుకలుగా రత్నాలు తీసుకొని మాల్యవంత పర్వతాన్ని చేరాడు. అ పర్వతాన్ని దాటి భద్రాశ్వ వర్షానికి చేరాడు. అది స్వర్గంతో సమానమైన అందమైన చోటు.
తత్రామరోపమాన్ రమ్యాన్ పురుషాన్ సుఖసంయుతాన్ ॥
జిత్వా తాన్ స్వవశే కృత్వా కరే చ వినివేశ్య చ ।
అహృత్య సర్వరత్నాని అసంఖ్యాని తతస్తతః ॥
నీలం నామ గిరిం గత్వా తత్రస్థానజయత్ ప్రభుః ।
ఆ దేశంలో దేవతల్లా సుందరులై, సుఖమనుభవించే పురుషులు నివసిస్తున్నారు. వారినందర్నీ అదుపులోనికి తెచ్చుకొని, కప్పంకట్టే వారిగా చేసి అసంఖ్యాకాలైన రత్నాలను గ్రహించి నీపర్వతం వైపు పోయి అక్కడి వారిని జయించాడు.
తతో జిష్ణురతిక్రమ్య పర్వతం నీలమాయతమ్ ॥
వివేశ రమ్యకం వర్షం సంకీర్ణం మిధునైః శుభైః ।
తం దేశమథ జిత్వా చ కరే చ వినివేశ్య చ ॥
అజయచ్చాపి బీభత్సుః దేశం గుహ్యకరక్షితమ్ ।
తత్ర లేభే చ రాజేంద్ర సౌవర్ణాన్ మృగపక్షిణః ॥
అగృహ్ణాద్ యజ్ఞభూత్యర్థం రమణీయాన్ మనోరమాన్ ।
జయశీలి అర్జునుడు నీలపర్వతాన్ని దాటి సుందరులైన స్త్రీ పురుషులతో నిండిన రమ్యకవర్షాన్ని ప్రవేశించాడు. ఆ దేశాన్ని గెలిచి వారికి కప్పాన్ని నిర్ణయించాడు. పిమ్మట గుహ్యక రక్షితమైన ప్రదేశాలను అర్జునుడు తన అధికారంలోకి తెచ్చాడు. అక్కడ బంగారు రంగు మృగాలను, పక్షులను పొందాడు. అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. యజ్ఞవైభవవృద్ధికై వాటినన్నింటినీ గ్రహించాడు.
అన్యాని లబ్ధ్వా రత్నాని పాండవోఽథ మహాబలః ॥
గంధర్వరక్షితం దేశమ్ అజయత్ సగణం తదా ।
తత్ర రత్నాని దివ్యాని లబ్ధ్వా రాజన్నథార్జునః ॥
శ్వేతపర్వతమాసాద్య జిత్వా పర్వతవాసినః ।
స శ్వేతం పర్వతం రాజన్ సమతిక్రమ్య పాండవః ॥
వర్షం హిరణ్యకం నామ వివేశాథ మహీపతే ।
బలవంతుడైన అర్జునుడు చాలారత్నాలను గ్రహించి గంధర్వరక్షితప్రదేశానికి చేరాడు. వారినందర్నీ తన అధీనంలోకి తెచ్చుకొన్నాడు. అక్కడ చాలా రత్నాలను పొంది ధవళగిరి పర్వతవాసులను జయించాడు. ధవళగిరి పర్వతాన్ని దాటి అతడు హిరణ్యకమనే వర్షానికి చేరాడు.
స తు దేశేషు రమ్యేషు గంతం తత్రోపచక్రమే ॥
మధ్యే ప్రాసాదవృందేషు నక్షత్రాణాం శశీ యథా ।
అక్కడకు చేరి సుందర ప్రదేశాలన్నింటిని చూడసాగాడు. చాలా భవనాల వరుసల్లో తిరుగుతూ శ్వేతాశ్వుడైన అర్జునుడు నక్షత్రాల మధ్య చంద్రునివలె వెలుగొందాడు.
మహాపథేషు రాజేంద్ర సర్వతో యాంతమర్జునమ్ ॥
ప్రాసాదవరశృంగస్థాః పరయా వీర్యశోభయా ।
దదృశుస్తాః స్త్రియః సర్వాః పార్థమాత్మయశస్కరమ్ ॥
తం కలాపధరం శూరం సరథం సానుగం ప్రభుమ్ ।
సవర్మసుకిరీటం వై సంనద్ధః సపరిచ్ఛదమ్ ॥
సుకుమారం మహాసత్త్వం తేజోరాశిమనుత్తమమ్ ।
శక్రోపమమమిత్రఘ్నం పరవారణవారణమ్ ॥
పశ్యంతః స్త్రీగణాస్తత్ర శక్తిపాణిం స్మ మేనిరే ।
గొప్పబలం, అందం గల హిరణ్యకవర్ష రాజమార్గాల్లో నడుస్తూ ఉంటే అకక్డ మేడలపై నిలబడిన సుందరస్త్రీలు అర్జునుని ఆసక్తితో చూశారు. అర్జునుడు తన కీర్తిని పెంచేవాడు. అతడు శూరుడు, వీరుడు, సేవకులతో కూడినవాడు, కీర్తికలవాడు. రథంపై తిరిగేవాడు. అతని శరీరంపై కవచం, తల మీద కిరీటం ప్రకాశిస్తున్నాయి. అతడు యుద్ధానికి సిద్ధమై యుద్ధసామగ్రితో ఎల్లప్పుడు కూడి ఉండేవాడు. సుకుమారుడు, ధైర్యవంతుడు, తేజోరాశి, సాటిలేనివాడు. ఇంద్రునితో సమానమైన పరాక్రమవంతుడు. శత్రునాశం చేసేవాడు, శత్రురాజుల ఏనుగుల గమనాన్ని నిరోధించేవాడు. అతడిని చూచిన స్త్రీలు అతనిని సాక్షాత్తుగా దేవసేనాని కార్తికేయునిగా భావించారు.
అయం స పురుషవ్యాఘ్రః రణేఽద్భుతపరాక్రమః ॥
అస్య బాహుబలం ప్రాప్య న భవంత్యసుహృద్గణాః ।
వారు వారితో ఇట్లనుకొనసాగారు. సఖులారా! మన ఎదురుగానున్న ఇతని పరాక్రమం యుద్ధంలో చూడాలి. ఇతని చేతిలో పడిన శత్రువులు నిర్వీర్యులై మరణించినట్లే భావించాలి.
ఇతి వాచో బ్రువన్త్యస్తాః స్త్రియః ప్రేమ్ణా ధనంజయమ్ ॥
తుష్టువుః పుష్పవృష్టిం చ ససృజుస్తస్య మూర్ధని ।
స్త్రీలు ఇలా పరస్పరం మాట్లాడుకొంటూ అర్జునుని ప్రేమగా చూస్తూ అతని గుణకీర్తనం చేస్తూ అత్ని తలపై పుష్పవృష్టి కురిపించారు.
దృష్ట్వా తే తు ముదా యుక్తాః కౌతూహలసమన్వితాః ॥
రత్నైర్విభూషణైశ్చైవ అభ్యవర్షంత పాండవమ్ ॥
అక్కడి వారందరు ప్రసన్నులై అర్జునుని చూచి అతని సమీపాన రత్నాలను అలంకారాలను ఎన్నింటినో కానుకలుగా ఉంచారు.
అథ జిత్వా సమస్తాంస్తాన్ కరే చ వినివేశ్య చ ॥
మణిహేమప్రవాలాని రత్నాన్యాభరణాని చ ।
ఏతాని లబ్ధ్వా పార్థోఽపి శృంగవంతం గిరిం యయౌ ॥
శృంగవంతం చ కౌంతేయః సమతిక్రమ్య ఫాల్గుణః ॥)
ఉత్తరం కురువర్షం తు స సమాసాద్య పాండవః ।
ఇయేష జేతుం తం దేశం పాకశాసననందనః ॥ 7
వారినందరినీ జయించి, వారిపై కప్పాన్ని నిర్ణయించి మణులు, బంగారం, రత్నాలు, ఆభరణాలు వారి నుంచి గ్రహించి అర్జునుడు శృంగవంతానికి చేరాడు. శృంగవంతం అనే పర్వతాన్ని దాటి, ఉత్తరకురు వర్షంలో ప్రవేశించాడు. ఆ దేశాన్ని జయించాలని కుడ నిర్ణయించాడు. (7)
తత ఏనం మహావీర్యం మహాకాయా మహాబలాః ।
ద్వారపాలాః సమాసాద్య దృష్ట్వా వచనమబ్రువన్ ॥ 8
ఇంతలోనే అర్జునుని సమీపానికి మహాబలవంతులు, విశాలకాయులూ అయిన ద్వారపాలకులు వచ్చి ప్రసన్నతో ఇలా పలికారు. (8)
పార్థ నేదం త్వయా శక్యం పురం జేతుం కథంచన ।
ఉపావర్తస్వ కళ్యాణ పర్యాప్తమిదమచ్యుత ॥ 9
ఇదం పురం యః ప్రవిశేద్ ధ్రువం న స భవేన్నరః ।
ప్రీయామహే త్వయా వీర పర్యాప్తో విజయస్తవ ॥ 10
అర్జునా! ఈ నగరం నీకు ఏవిధంగానైనా జయింప వీలుకాదు. కళ్యాణ స్వరూపుడా! వెనుకకు మరలు. నీవు ఇక్కడికి రావటమే పెద్ద విశేషం. ఈ నగరప్రవేశం చేసినవాడు ప్రాణాలతో మిగలడు. మేం నీయందు ప్రసన్నులమైనాం. (9,10)
న చాత్ర కించిజ్జేతవ్యమ్ అర్జునాత్ర ప్రదృశ్యతే ।
ఉత్తరాః కురవో హ్యేతో నాత్ర యుద్ధం ప్రవర్తతే ॥ 11
ప్రవిష్టోఽపి హి కౌంతేయ నేహ ద్రక్ష్యసి కించన ।
న హి మానుషదేహేన శక్యమత్రాభివీక్షితుమ్ ॥ 12
అర్జునా! ఇక్కడ జయించ తగిన వస్తువు కనపడదు. ఇది ఉత్తరకురుదేశం. ఇక్కడ యుద్ధానికి తావులేదు. దీనిలోనికి ప్రవేశించినా నీవు ఏమీ ఇక్కడ చూడలేవు. మానవశరీరంతో ప్రవేశిస్తే ఇక్కడ ఏ వస్తువూ చూడ వీలుకానిది. (11,12)
అథేహ పురుషవ్యాఘ్ర కించిదన్యచ్చికీర్షసి ।
తత్ ప్రబ్రూహి కరిష్యామః వచనాత్ తవ భారత ॥ 13
పురుషసింహమా! యుద్ధం విడిచి వేరే ఏదైనా పని చేయాలనుకుంటే చెప్పు. నీమాటపై దాన్ని స్వయంగా మేం నెరవేరుస్తాం. (13)
తతస్తానబ్రవీద్ రాజన్ అర్జునః ప్రహసన్నివ ।
పార్థివత్వం చికీర్షామి ధర్మరాజస్య ధీమతః ॥ 14
అర్జునుడు వారితో నవ్వుతూ అన్నాడు - నేను బుద్ధిమంతుడు, నా సోదరుడు అయిన ధర్మజుని ఈ భూమండలాని కంతకీ చక్రవర్తిని చేయసంకల్పించాను. (14)
న ప్రవేక్ష్యామి వో దేశమ్ విరుద్ధం యది మానుషైః ।
యుధిష్ఠిరాయ యత్ కించిత్ కరపణ్యం ప్రదీయతామ్ ॥ 15
మనుజులకు విరుద్ధమైన మీదేశంలోనికి నేను ప్రవేశించను. యుధిష్ఠిరునికి పన్నుల రూపంలో కొంత ధనాన్ని సమర్పించండి. (15)
తతో దివ్యాని వస్త్రాణి దివ్యాన్యాభరణాని చ ।
క్షౌమాజినాని దివ్యాని తస్య తే ప్రదదుః కరమ్ ॥ 16
అపుడు వారు దివ్యవస్త్రాలు, దివ్యాభరణాలు, నారబట్టలు అర్జునునికి కప్పంగా ఇచ్చారు. (16)
ఏవం స పురుషవ్యాఘ్రః విజిత్య దిశముత్తరామ్ ।
సంగ్రామాన్ సుబహూన కృత్వా క్షత్రియైర్దస్యుభిస్తథా ॥ 17
స వినిర్జిత్య రాజ్ఞస్తాన్ కరే చ వినివేశ్య తు ।
ధనాన్యాదాయ సర్వేభ్యః రత్నాని వివిధాని చ ॥ 18
హయాంస్తిత్తిరి కల్మాషాన్ శుకపత్రనిభానపి ।
మయూరసదృశానన్యాన్ సర్వాననిలరంహసః ॥ 19
వృతః సుమహతా రాజన్ బలేన చతురంగిణా ।
ఆజగామ పునర్వీరః శక్రప్రస్థం పురోత్తమమ్ ॥ 20
ఇలా పురుషశ్రేష్ఠుడు అర్జునుడు రాజులను, దొంగలను చాలామందిని యుద్ధంలో ఓడించి ఉత్తర దిక్కును పూర్తిగా వశపరచుకొన్నాడు. రాజులను జయించి కప్పానికి ఒప్పించి వారి రాజ్యాల్లో వారిని స్థాపించాడు. వారు అర్జునునికి ధనం, రత్నాలు, ఆభరణాలు, వాయువేగం గల తిత్తిరి, కల్మాష, శుకవర్ణపు గుఱ్ఱాలు, నెమలివర్ణం గల గుఱ్ఱాలు కానుకలుగా సమర్పించారు. తిరిగి తన చతురంగ బలాలతో అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరాడు. (17-20)
ధర్మరాజాయ తత్ పార్థః ధనం సర్వం సవాహనమ్ ।
వ్యవేదయదనుజ్ఞాతః తేన రాజ్ఞా గృహాన్ యయౌ ॥ 21
అర్జునుడు తన అన్న ధర్మరాజుకు వాహనాలతో సహా ధనాన్ని సమర్పించి అతని అనుజ్ఞ పొంది తన భవనానికి చేరాడు. (21)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి అర్జునోత్తరదిగ్విజయే అష్టావింశోఽధ్యాయః ॥ 28 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున దిగ్విజయపర్వమను ఉపపర్వమున అర్జునోత్తర దిగ్విజయమను ఇరువది ఎనిమిదవ అధ్యాయము. (28)