33. ముప్పది మూడవ అధ్యాయము

(రాజసూయపర్వము)

ధర్మరాజు రాజసూయయాగ దీక్ష వహించుట.

వైశంపాయన ఉవాచ
(ఏవం నిర్జిత్య పృథివీం భ్రాతరః కురునందన ।
వర్తామానాః స్వధర్మేణ శశాసుః ప్రథివీమిమామ్ ॥
వైశంపాయనుడు పలికాడు - ఈ విధంగా భూమండలమంతా జయించి స్వధర్మానువర్తులై ఐదుగురు సోదరులు ఈ భూమిని పాలించసాగారు.
చతుర్భిర్భీమసేనాద్యైః భ్రాతృభిః సహితో నృపః ।
అనుగృహ్య ప్రజాః సర్వాః సర్వవర్ణానగోపయత్ ॥
భీమసేనుడు మొదలైన నలుగురు స్నేహితులతో కూడి యుధిష్ఠిరుడు ప్రజలందర్నీ అనుగ్రహంతో చూస్తూ అన్నివర్ణాలవారినీ సంతుష్టిపరచాడు.
అవిరోధేన సర్వేషాం హితం చక్రే యుధిష్ఠిరః ।
ప్రీయతాం దీయతాం సర్వం ముక్త్వా కోశం బలం వినా ॥
సాధు ధర్మేతి పార్థస్య నాన్యఛ్చ్రూయేత భాషితమ్ ।
ఎవరితో విరోధం లేనివిధంగా అందరి హితసాధనలో నిమగ్నుడయ్యాడు. అందర్నీ తృప్తిపరచాడు. కోశాగారాన్ని తెరిపించి దానధర్మాలు చేయించాడు. ఎవరినీ బలప్రయోగంతో లొంగదీయలేదు. ధర్మమనుమాట తప్ప వేరొకమాట అతని నుండి వెలువడలేదు.
ఏవంవృత్తే జగత్ తస్మిన్ పితరీవాన్వరజ్యత ॥
న తస్య విద్యతే ద్వేష్టా తతోఽస్యాజాతశత్రుతా ।)
పుత్రుడు తండ్రిపై అనురాగం పెంచుకున్నట్లు ప్రజలందరు ధర్మరాజు పట్ల అనురాగం కలిగి ఉన్నారు. ధర్మజును ద్వేషించేవాడు ఒక్కడూ లేడు. అందులకే అతడిని అజాతశత్రువు అని కీర్తించారు.
రక్షణాద్ ధర్మరాజస్య సత్యస్య పరిపాలనాత్ ।
శత్రూణాం క్షపణాచ్చైవ స్వకర్మనిరతాః ప్రజాః ॥ 1
ధర్మజుడు ప్రజల్ని రక్షించటం, సత్యపాలనం, శత్రునాశం అనే పనులు నిర్వర్తించసాగాడు. ఈ కార్యాలపట్ల నిశ్చింత కలిగి ప్రజలంతా తమతమ కర్మలపట్ల ఆసక్తి పెంచుకుని జీవించారు. (1)
బలీనాం సమ్యగాదానాద్ ధర్మతశ్చానుశాసనాత్ ।
నికామవర్షీ పర్జన్యః స్ఫీతో జనపదోఽభవత్ ॥ 2
న్యాయపూర్వకంగా పన్నుగ్రహించటం వలన, ధర్మప్రధానంగా పరిపాలించటం వలన మేఘాలు ఇచ్ఛనుసారం వర్షించాయి. ఈ ప్రకారమ్ యుధిష్ఠిరుని జనపదాలన్నీ ధనధాన్యాలతో సమృద్ధం అయ్యాయి. (2)
సర్వారంభాః సుప్రవృత్తా గోరక్షా కర్షణం వణిక్ ।
విశేషాత్ సర్వమేవైతత్ సంజజ్ఞే రాజకర్మణః ॥ 3
గోరక్షణ, వ్యవసాయమ్, వ్యాపారం అన్ని పనులు చక్కగా సాగుతున్నాయి. ప్రత్యేకించి రాజవ్యవస్థచే ఉత్తమంగా సంపన్నమయ్యాయు. (3)
వి॥సం॥ రాజకర్మణః = రాజుయొక్క పుణ్యం చేత (నీల)(దేవ)
దస్యుభ్యో వంచకేభ్యో వా రాజన్ ప్రతి పరస్పరమ్ ।
రాజవల్లభతశ్చైవ నాశ్రూయంత మృషా గిరః ॥ 4
చోరుల నుండి వంచకుల నుండి, రాజవిశ్వాసపాత్రుల్ నుండి పరస్పరమ్ వ్యర్థమైన మాటలు వినపడటం లేదు. అబద్ధములు ప్రజల మధ్య కూడ లేవు. (4)
చోరుల నుండి వంచకుల నుండి, రాజవిశ్వాసపాత్రుల నుండి పరస్పరం వ్యర్థమైన మాటలు వినపడటం లేదు. అబద్ధములు ప్రజలమధ్య కూడ లేవు. (4)
అవర్షం చాతివర్షం చ వ్యాధిపావకమూర్ఛనమ్ ।
సర్వమేతత్ తదా నాసీద్ ధర్మనిత్యే యుధిష్ఠిరే ॥ 5
నిత్యమూ ధర్మాసక్తుడైన యుధిష్ఠిరుని రాజ్యంలో అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు, అగ్ని మొదలైన ఉపద్రవాల పేరు కూడ వినబడటం లేదు. (5)
ప్రియం కర్తుముపస్థాతుం బలికర్మ స్వభావజమ్ ।
అభిహర్తుం నృపా జగ్ముః నాన్యైః కార్యైః కథంచన ॥ 6
రాజులందరు స్వభావానుసారం యుధిష్ఠిరునికి కానుకలు ఇవ్వటానికి ప్రియం చేయటానికి మాత్రమే వచ్చారు. (యుద్ధాది) అన్యకార్యాల కోసం రాలేదు. (6)
ధర్మ్యైర్ధనాగమైస్తస్య వవృధే నిచయో మహాన్ ।
కర్తుం యస్య న శక్యేత క్షయో వర్షశతైరపి ॥ 7
ధర్మంగా సంపాదించిన ధనాగారం బాగా వృద్ధి చెందింది. వందల సంవత్సరాలు దానం కోసం కోశాగారం తెరచినా ఆ ధనం తరిగిపోదు. (7)
స్వకోష్ఠస్య పరీమాణం కోశస్య చ మహీపతిః ।
విజ్ఞాయ రాజా కౌంతేయః యజ్ఞాయైవ మనో దధే ॥ 8
కుంతీనందనుడు యుధిష్ఠిరుడు తన అన్నవస్త్రాగారాల్ని, కోశాగారాన్ని పూర్తిగా తెలిసికొని యజ్ఞం చేయాలని నిశ్చయించాడు. (8)
సుహృదశ్చైవ యే సర్వే పృథక్ చ సహ చాబ్రువన్ ।
యజ్ఞకాలస్తవ విభో క్రియతామత్ర సాంప్రతమ్ ॥ 9
అతని హితైషులందరు, వేరువేరుగా, అంతాకలిసి "యుధిష్ఠిరా! మీరు రాజసూయం చేయటానికి తగినసమయం ఆసన్నమైంది. కావున దానికి కావలసిన ప్రయత్నం చేయండి" అన్నారు. (9)
అథైవం బ్రువతామేవ తేషామభ్యాయయౌ హరిః ।
ఋషిః పురాణో వేదాత్మా దృశ్యశ్చైవ విజానతామ్ ॥ 10
వారందరు ఇలా విన్నవిస్తూండగనే శ్రీకృష్ణుడక్కడకు వచ్చాడు. శ్రీకృష్ణుడు పురాణపురుషుడు, నారాయణఋషి, వేదస్వరూపుడు, విజ్ఞానులకు కూడ ఆయన దర్శనం దుర్లభం. (10)
జగతస్తస్థుషాం శ్రేష్ఠః ప్రభవశ్చాప్యయశ్చ హ ।
భూతభవ్యభవన్నాథః కేశవః కేశిసూదనః ॥ 11
స్థావరజంగమాలన్నింటికీ శ్రీకృష్ణుడు ఉత్పత్తి స్థానం, అందరికీ ఆశ్రయం, భూతభవిష్యద్వర్తమానాల శాసకుడు. కేశి అనే రాక్షసుని చంపి కేశవుడు అయ్యాడు. (11)
ప్రాకారః సర్వవృష్ణీనామ్ ఆపత్స్వభయదోఽరిహా ।
బలాధికారే నిక్షిప్య సమ్యగానకదుందుభిమ్ ॥ 12
ఉచ్చావచముపాదాయ ధర్మరాజాయ మాధవః ।
ధనౌఘం పురుషవ్యాఘ్రః బలేన మహతాఽఽవృతః ॥ 13
కృష్ణుడు వృష్ణివంశస్థులందరికీ ప్రాకారం వంటివాడు. ఆపదలలో అభయమిచ్చేవాడు. శత్రుసంహారకుడు. అతడు తండ్రి వసుదేవుని బలాధిపతిని చేసి ఎన్నో కానుకలు ధర్మరాజుకై తెచ్చాడు. పురుషశ్రేష్ఠుడు శ్రీకృష్ణుడు తనతండ్రి సేననంతటిని యుధిష్ఠిరుని పక్షంలో నిలిపి ధనరాశులను కానుకలుగా తెచ్చి సేనతో సహా అక్కడకు సహాయంగా వచ్చాడు. (12,13)
తం ధనౌఘమపర్యంతం రత్నసాగరమక్షయమ్ ।
నాదయమ్ రథఘోషేణ ప్రవివేశ పురోత్తమమ్ ॥ 14
ఆ ధనరాశులకు అంతులేదు. రత్నాల సముద్రం ఉందేమో అనిపిస్తోంది. వాటినన్నింటిని గైకొన్న రథాలధ్వని దిశలన్నింటిని మారుమ్రోగిస్తూ కృష్ణుడు ఇంద్రప్రస్థంలో ప్రవేశించాడు. (14)
పూర్ణమాపూరయంస్తేషాం ద్విషచ్ఛోకావహోఽభవత్ ।
అసూర్యమివ సూర్యేణ నివాతమివ వాయునా ॥
కృష్ణేన సముపేతేన జహృషే భారతం పురమ్ ॥ 15
అప్పటికే నిండిన ధనాగారాన్ని శ్రీకృష్ణుడు తన అక్షయ ధనరాశులతో నింపాడు. అతని ఆగమనం పాండవుల శత్రువులకు శోకాన్ని పెంపొందించింది. శ్రీకృష్ణుని రాకతో ఇంద్రప్రస్ధమంతా సుర్యోదయమైనప్పుడు పొందే వెలుగువలె, గాలి తన స్థానంలో నిలిచినప్పుడు ఏర్పడే ప్రాణశక్తి వంటి హర్షోల్లాసాలు వెల్లివిరిశాయి. (15)
తం ముదాభిసమాగమ్య సత్కృత్య చ యథావిధి ।
స పృష్ట్వా కుశలం చైవ సుఖాసీనం యుధిష్ఠిరః ॥ 16
ధౌమ్యద్వైపాయనముఖైః ఋత్విగ్భిః పురుషర్షభ ।
భీమార్జునయమైశ్చైవ సహితః కృష్ణమబ్రవీత్ ॥ 17
రాజు యుధిష్ఠిరుడు మిక్కిలి ప్రసన్నుడై అతనిని కలిశాడు. శాస్త్రమర్యాదతో స్వాగత సత్కారాలు చేసి కుశలం అడిగాడు. సుఖాసీనుడై పిమ్మట శ్రీకృష్ణుని వద్దకు ధౌమ్యుడు, ద్వైపాయనుడు మొదలైన ఋషులతో, తన నలుగురు సోదరులతో ధర్మరాజు కలిసి వచ్చి ఇలా అన్నాడు. (16,17)
యుధిష్టిర ఉవాచ
త్వత్కృతే పృథివీ సర్వా మద్వశే కృష్ణ వర్తతే ।
ధనం చ బాహు వార్ష్ణేయ త్వత్ప్రసాదాదుపార్జితమ్ ॥ 18
యుధిష్ఠిరుడు పలికాడు - మీ దయవలన మీసేవకొరకు భూమండలమంతా ఇపుడు నా అధీనంలోకి వచ్చింది. శ్రీకృష్ణా! మీ అనుగ్రహంతో అనేక ధనరాశులు నన్ను చేరాయి. (18)
సోఽహమిచ్ఛామి తత్ సర్వం విధివద్ దేవకీసుత ।
ఉపయోక్తుం ద్విజాగ్ర్యేభ్యః హవ్యవాహే చ మాధవ ॥ 19
దేవకీనందనా! ఈ ధనాన్ని అంతటిని, బ్రాహ్మణులకూ, అగ్నికీ సమర్పించాలని అనుకొంటున్నాను. (19)
తదహం యష్టుమిచ్ఛామి దాశార్హం సహితస్త్వయా ।
అనుజైశ్చ మహాబాహో తన్మానుజ్ఞాతుమర్హసి ॥ 20
అందుకోసం దాశార్హ! నేనిప్పుడు నీతోని సోదరులతోను యజ్ఞం చేయ నిశ్చయించాను. దీనికి నీ అనుజ్ఞ కోరుతున్నాను. (20)
తద్ దీక్షాప గోవింద త్వమాత్మానం మహాభుజః ।
త్వయీష్టవతి దాశార్హ విపాప్మా భవితా హ్యహమ్ ॥ 21
గోవిందా! మీరు స్వయంగా యజ్ఞదీక్షను గ్రహించండి. మీరు యజ్ఞం చేస్తే నేను పాపరహితుణ్ణి అవుతాను. (21)
మాం వాప్యభ్యనుజానీహి స హైభిరనుజైర్విభో ।
అనుజ్ఞాతస్త్వయా కృష్ణ ప్రాప్నుయాం క్రతుముత్తమమ్ ॥ 22
లేదా నా ఈ సోదరులతో కలిసి యజ్ఞం చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి. శ్రీకృష్ణా! నీచే అనుజ్ఞను పొంది ఉత్తమయజ్ఞదీక్షను గ్రహిస్తాను. (22)
వైశంపాయన ఉవాచ
తం కృష్ణః ప్రత్యువాచేదం బహూక్త్వా గుణవిస్తరమ్ ।
త్వమేవ రాజశార్దూల సమ్రాడర్హో మహాక్రతుమ్ ।
సంప్రాప్నుహి త్వయా ప్రాప్తే కృతకృత్యాస్తతో వయమ్ ॥ 23
వైశంపాయనుడు అన్నాడు - అప్పుడు శ్రీకృష్ణుడు రాజసూయవిశిష్టతను విస్తరంగా వర్ణిస్తూ ఇలా అన్నాడు. రాజసింహమా! నీవే చక్రవర్తి అగుటకు అర్హుడవు. నీవే ఈ గొప్ప యజ్ఞదీక్షను గ్రహించు. నీవు దీక్షను స్వీకరిస్తే మేమందరం కృతకృత్యులం కాగలం. (23)
యజస్వాభీప్సితం యజ్ఞం మయి శ్రేయస్యవస్థితే ।
వియుంక్ష్వ త్వం చ మాం కృత్యే సర్వం కర్తాస్మి తే వచః ॥ 24
నీవు ఇష్టమైన యజ్ఞాన్ని ప్రారంభించు. నేను నీకు ఎల్లప్పుడు శుభం చేయటానికి సంసిద్ధుడనే. నాకు తగిన పనిలో నన్ను పెట్టు. నేను మీ అందరి ఆజ్ఞలు పాలిస్తాను. (24)
యుధిష్ఠిర ఉవాచ
సఫలః కృష్ణ సంకల్పః సిద్ధిశ్చ నియతా మమ ।
యస్య మే త్వ హృషీకేశ యథేప్సితముపస్థితః ॥ 25
యుధిష్ఠిరుడు పలికాడు - హృషీకేశా! నాకోరికను అనుసరించి నీవు స్వయంగా ఇక్కడకు విచ్చేశావు. శ్రీకృష్ణా! మా సంకల్పాలు అన్నీ సిద్ధించాయి. నాకు యాగసిద్ధి నిశ్చయం. (25)
వైశంపాయన ఉవాచ
అనుజ్ఞాతస్తు కృష్ణేన పాండవో భ్రాతృభిః సహ ।
ఈజితుం రాజసూయేన సాధనాన్యుపచక్రమే ॥ 26
వైశంపాయనుడు అన్నాడు - పూజ్యుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం సోదరసహితుడై ధర్మరాజు రాజసూయయాగం చేయటానికి కావలసిన సామగ్రిని సిద్ధం చేయసాగాడు. (26)
తతస్త్వాజ్ఞాపయామాస పాండవోఽరినిబర్హణః ।
సహదేవం యుధాం శ్రేష్ఠం మంత్రిభిశ్చైవ సర్వశః ॥ 27
అదే సమయంలో శాత్రునాశకుడైన ధర్మరాజు యోధాగ్రేసరుడైన సహదేవుని, మంత్రులను ఆజ్ఞాపించాడు. (27)
అస్మిన్ క్రతౌ యథోక్తాని యజ్ఞాంగాని ద్విజాతిభిః ।
తథోపకరణం సర్వం మంగళాని చ సర్వశః ॥ 28
అధియజ్ఞాంశ్చ సంభారాన్ ధౌమ్యోక్తాన్ క్షిప్రమేవ హి ।
సమానయంతు పురుషాః యథాయోగం యథాక్రమమ్ ॥ 29
ఈ రాజసూయంకోసం బ్రాహ్మణుల ఆదేశం మేరకు అంగభూతాలైన సామగ్రి, ఉపకరణాలు, మంగళద్రవ్యాలు, అలాగే ధౌమ్యునిచే ఆజ్ఞాపింపబడిన యజ్ఞోపయోగకరాలైన వస్తువులను, క్రమంగా దొరికినవి దొరికినట్లుగా మీమీ సేవకులను తీసుకొని సిద్ధం చేస్తూ ఉంటారు. (28,29)
ఇంద్రసేనో విశోకశ్చ పురుశ్చార్జునసారథిః ।
అన్నాద్యాహరణే యుక్తాః సంతు మత్ర్పియకామ్యయా ॥ 30
ఇంద్రసేనుడు కార్యంతాం రసగంధసమన్వితాః ।
మనోరథప్రీతికరా ద్విజానాం కురుసత్తమ ॥ 31
వేటిని తినాలని అనుకొంటున్నారో వాటినన్నింటిని రసగంధభరితంగా, మనస్సుకి ప్రీతికలిగేటట్లు బ్రాహ్మణులకై చేయించండి. (31)
తద్వాక్యసమకాలం చ కృతం సర్వం న్యవేదయత్ ।
సహదేవో యుధాం శ్రేష్ఠః ధర్మరాజే యుధిష్ఠిరే ॥ 32
అతని మాటలు పూర్తి అవుతుండగానే యోధాగ్రగణ్యుడు సహదేవుడు ధర్మరాజుకు 'ఈ వ్యవస్థ సర్వం చేయబడింది' అని నివేదించాడు. (32)
తతో ద్వైపాయనో రాజన్ ఋత్విజః సముపానయత్ ।
వేదానివ మహాభాగాన్ సాక్షాన్మూర్తిమతో ద్విజాన్ ॥ 33
ప్రధాన ఋత్విజుడు వ్యాసుడు తన శిష్యగణంతో ఋత్విజులతో వచ్చాడు. వారందరు మూర్తిమంతాలైన వేదాల వలె (వేదమూర్తుల్లా) ఉన్నారు. (33)
స్వయం బ్రహ్మత్వమకరోత్ తస్య సత్యవతీసుతః ।
ధనంజయానామృషభః సుసామా సామగోఽభవత్ ॥ 34
సత్యవతీదేవిపుత్రుడు వ్యాసుడు స్వయంగా బహ్మత్వాన్ని అంగీకరించాడు. ధనంజయగోత్రీయులైన బ్రాహ్మణులు సామగానం, సుసామకోసం నియమింపబడ్డారు. (34)
యాజ్ఞవల్క్యో బభువాథ బ్రహ్మిష్ఠోఽధ్వర్యుసత్తమః ।
పైలో హోతా వసోః పుత్రః ధౌమ్యేన సహితోఽభవత్ ॥ 35
యాజ్ఞవల్క్యుడు ఆ యజ్ఞానికి శ్రేష్ఠతముడైన అధ్వర్యువు. వసువు కుమారుడు పైలుడు ధౌమ్యునితో సహితంగా హోత అయినాడు. (35)
ఏతేషాం పుత్రవర్గాశ్చ శిష్యాశ్చ భరతర్షభ ।
బభూవుర్హోత్రగాః సర్వే వేదవేదాంగపారగాః ॥ 36
వీరి పుత్రులు, శిష్యులు మిగిలిన వేదవేదాంగ నిష్ణాతులందరూ సప్తహోత్రగులు అయ్యారు. (36)
తే వాచయిత్వా పుణ్యాహమ్ ఊహాయిత్వా చ తం విధిమ్ ।
శాస్త్రోక్తమ్ పూజయామాసుః తద్ దేవయజనం మహత్ ॥ 37
వారందరు పుణ్యాహవాచనమ్ చేసి శాస్త్రోక్తవిధితో ఆ యజ్ఞశాలను పవిత్రం చేసి యజ్ఞానికి అనువుగా చేశారు. (37)
తత్ర చక్రురనుజ్ఞాతాః శరణాన్యుత శిల్పినః ।
గంధవంతి విశాలాని వేశ్మానీవ దివౌకసామ్ ॥ 38
ఆస్థానంలో రాజాజ్ఞానుసారం శిల్పులందరు దేవమందిరాల వంటి మందిరాలను నిర్మించారు. అవి విశాలంగా సుగంధభరితంగా ఉన్నాయి. (38)
తత ఆజ్ఞాపయామాస స రాజా రాజసత్తమః ।
సహదేవం తదా సద్యః మంత్రిణం పురుషర్షభః ॥ 39
ఆ మంత్రణార్థం దూతాంస్త్వం ప్రేషయస్వాశుగాన్ ద్రుతమ్ ।
ఉపశ్రుత్య వచో రాజ్ఞః స దూతాన్ ప్రాహిణోత్ తదా ॥ 40
రాజశ్రేష్ఠుడైన ధర్మరాజు వెంటనే మంత్రి సహదేవుని పిలిపించి రాజులందరినీ, ఆహ్వానించటానికి అరుదైన దూతలను పంపమని ఆదేశించాడు. రాజు మాటలు విని సహదేవుడు వెంటనే దూతలను పంపాడు. (39,40)
ఆమంత్రయధ్వం రాష్ట్రేషు బ్రాహ్మణాన్ భూమిపానథ ।
విశశ్చ మాన్యాన్ శూద్రాంశ్చ సర్వానానయతేతి చ ॥ 41
దూతలారా! దేశాలు తిరిగి అక్కడి రాజులను, బ్రాహ్మణులను, వైశ్యులను, మాననీయులు అయిన శూద్రులను కూడ పిలవండి. (41)
వైశంపాయనుడు పలికాడు - ధర్మజుని ఆజ్ఞను అనుసరించి సహదేవుని ఆనతిపై శీఘ్రంగా పోగల దూతలు దేశాలన్నిటినీ తిరిగి బ్రాహ్మణులను, క్షత్రియులను అందరినీ ఆహ్వానించారు. చాలామందిని తమవెంటపెట్టుకు వచ్చారు. తమ సంబంధం కలవారిని తీసుకొని రావటంలో ఎవరినీ మరచిపోలేదు. (42)
తతస్తే తు యథాకాలం కుంతీపుత్రం యుధిష్ఠిరమ్ ।
దీక్షయాంచక్రిరే విప్రా రాజసూయాయ భారత ॥ 43
అక్కడకు వచ్చిన బ్రాహ్మణులందరు కలిసి సరియైన సమయంలో కుంతీనందనుడైన యుధిష్ఠిరునికి యజ్ఞదీక్ష నిచ్చారు. (43)
దీక్షితం స తు ధర్మాత్మా ధర్మరాజో యుధిష్ఠిరః ।
జగామ యజ్ఞాయతనం వృతో విప్రైః సహస్రశః ॥ 44
యజ్ఞదీక్షను తీసుకొని ధర్మరాజు వేలకొద్దీ బ్రాహ్మణులు వెంటరాగా యజ్ఞశాలను చేరాడు. (44)
భ్రాతృభిర్ జ్ఞాతిభిశ్చైవ సుహృద్భిః సచివైః సహ ।
క్షత్రియైశ్చ మనుష్యేంద్రైః నానాదేశ సమాగతైః ॥ 45
అమాత్యైశ్చ నరశ్రేష్ఠః ధర్మోవిగ్రహవానివ ।
ఆ సమయంలో నలుగురు సోదరులు, జ్ఞాతులు, మిత్రులు, మంత్రులు, నానాదేశాల నుంచి వచ్చిన ఇతర క్షత్రియులు, మంత్రిగణం అతని వెనుక ఉన్నారు. అప్పుడు నరశ్రేష్ఠుఅడైన ధర్మరాజు రూపుదాల్చిన ధర్మదేవతవలె ఉన్నాడు. (45 1/2)
ఆజగ్ముర్ర్బాహ్మణాస్తత్ర విషయేభ్యస్తతస్తతః ॥ 46
సర్వవిద్యాసు నిష్టాతాః వేదవేదాంగపారగాః ।
వేరు వేరు దేశాల నుండి అన్కులు బ్రాహ్మణులు వచ్చారు. వారందరు అన్నివిద్యల్లో వేదేవేదాంగాల్లో ఆరితేరినవారు. (46 1/2)
తేషామావసథాంశ్చక్రుః ధర్మరాజస్య శాసనాత్ ॥ 47
బహ్వన్నాచ్ఛాదనైర్యుక్తాన్ సగణానాం పృథక్ పృథక్ ।
సర్వర్తుగుణసంపన్నాన్ శిల్పినోఽథ సహస్రశః ॥ 48
ధర్మజుని ఆజ్ఞానుసారం ఆత్మీయులతో బాటు బ్రాహ్మణుల నివాసానికై వేరువేరు ఇండ్లను నిర్మించారు. అవి అగ్ని, అన్న, పాన, వస్త్రాదులతో నిండి ఉన్నాయి. అన్ని ఋతువులకు అనుకూల వాతావరణాన్ని అక్కడ శిల్పులు కల్పించారు. (47,48)
తేషు తే న్యవసన్ రాజన్ బ్రాహ్మణా నృపసత్కృతాః ।
కథయంతః కథా బహ్వీః పశ్యంతో నటనర్తకాన్ ॥ 49
రాజుచే సత్కరింపబడిన ఆ బ్రాహ్మణులందరు అక్కడ నివసించసాగారు. వినోదభరితాలైన కథలు, నటనర్తకుల కాలక్షేపాలు అక్కడ ఉన్నాయి. (49)
భుంజతాం చైవ విప్రాణామ్ వదతాం చ మహాస్వనః ।
అనిశం శ్రూయతే తత్ర ముదితానాం మహాత్మనామ్ ॥ 50
వారు భోజనాలు చేస్తూ ఆనందమగ్నులై మాట్లాడుకోసాగారు. దానితో అక్కడ సంతోషించిన మహాత్ముల కోలాహలం ఎక్కువగా వినబడింది. (50)
దీయతాం దీయతామేషాం భుజ్యతాం భుజ్యతామితి ।
ఏవం ప్రకారాః సంజల్పాః శ్రూయంతే స్మాత్ర నిత్యశః ॥ 51
వీరికి ఇవ్వండి. వీరికి భోజనం పెట్టండొ అనే మాటలు అంతటా నిత్యమూ మారుమ్రోగాయి. (51)
గవాం శతసహస్రాని శయనానాం చ భారత ।
రుక్మస్య యోషితాం చైవ ధర్మరాజః పృథగ్ దదౌ ॥ 52
ధర్మరాజు ఒక లక్ష గోవులను, లక్ష పాన్పులను లక్షబంగారు నాణాలను అంతే సంఖ్యలో అవివాహితలైన యువతులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. (52)
ప్రావర్తతైవం యజ్ఞః సః పాండవస్య మహాత్మనః ।
పృథివ్యామేకవీరస్య శక్రస్యేవ త్రివిష్టపే ॥ 53
ఈ విధంగా స్వర్గంలో ఇంద్రుడు యజ్ఞం చేసినట్లు భూమిపై అద్వితీయుడైన ధర్మరాజు యజ్ఞం ప్రారంభమైంది. (53)
తతో యుధిష్ఠిరో రాజా ప్రేషయామాస పాండవమ్ ।
నకులం హాస్తినపురం భీష్మాయ పురషర్షభః ॥ 54
ద్రోణాయ ధృతరాష్ట్రాయ విదురాయ కృపాయ చ 7.
భ్రాతౄణాం చైవ సర్వేషాం యేఽనురక్తా యుధిష్ఠిరే ॥ 55
తర్వాత ధర్మరాజు ద్రోణుని, ధృతరాష్ట్రుని, భీష్ముని, విదురుని, కృపుని, దుర్యోధనుని, అతని సోదరులను, ఇంకను తనపై ప్రేమకలవారిని ఆహ్వానించటానికి నకులుని స్వయంగా హస్తినాపురానికి పంపాడు. (54,55)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి రాజసూయయపర్వణి రాజసూయదీక్షాయాం త్రయస్త్రింశోఽధ్యాయః ॥ 33 ॥
ఇది శ్రీమహాభారతమున రాజసూయపర్వమున ఉపపర్వమున రాజసూయదీక్ష అను ముప్పది మూడవ అధ్యాయము. (33)