34. ముప్పది నాలుగవ అధ్యాయము
యుధిష్ఠిరయజ్ఞమున అందరు కలియుట.
వైశంపాయన ఉవాచ
స గత్వా హాస్తినపురం నకులః సమితింజయః ।
భీష్మమామంత్రయాంచక్రే ధృతరాష్ట్రం చ పాండవః ॥ 1
వైశంపాయనుడు పలికాడు - యుద్ధవిజేత అయిన నకులుడు హస్తినాపురానికి పోయి ధర్మజుని ఆజ్ఞగా భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలయిన వారిని ఆహ్వానించాడు. (1)
సత్కృత్యామంత్రితాస్తేన ఆచార్యప్రముఖాస్తతః ।
ప్రయయుః ప్రీతమనసః యజ్ఞం బ్రహ్మపురః సరాః ॥ 2
సత్కరించి నకులునిచే పిలువబడిన ఆచార్యవర్గమూ, మిగిలిన వారందరూ సంతుష్టులై బ్రాహ్మణులతో సహా హస్తినకు బయలుదేరారు. (2)
సంశ్రుత్య ధర్మరాజస్య యజ్ఞం యజ్ఞవిదస్తదా ।
అన్యే చ శతశస్తుష్టైః మనోభిర్భరతర్షభ ॥ 3
ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నాడని తెలిసి మిగిలిన యజ్ఞవేత్తలందరు ప్రీతచిత్తులై ఆ యాగప్రదేశానికి చేరారు. (3)
ద్రష్టుకామాః సభాం చైవ ధర్మరాజం చ పాండవమ్ ।
దిగ్భ్యః సర్వే సమాపేతుః క్షత్రియాస్తత్ర భారత ॥ 4
సముపాదాయ రత్నాని వివిధాని మహాంతి చ ।
ధర్మరాజును, అతని సభను చూడటానికి అన్నిదిక్కుల నుండి క్షత్రియులు, చాలా రకాలైన విలువైన రత్నాలను కానుకలుగా తీసుకువచ్చారు. (4 1/2)
ధృతరాష్ట్రశ్చ భీష్మశ్చ విదురశ్చ మహామతిః ॥ 5
దుర్యోధనపురోగాశ్చ భ్రాతరః సర్వ ఏవ తే ।
గాంధారరాజః సుబలః శకునిశ్చ మహాబలః ॥ 6
అచలో వృషకశ్చైవ కర్ణశ్చ రథినాం వరః ।
తథా శల్యశ్చ బలవాన్ బాహ్లికశ్చ మహాబలః ॥ 7
సోమదత్తోఽథ కౌరవ్యః భూరిర్భూరిశ్రవాః శలః ।
అశ్వత్థామా కృపో ద్రోణః సైంధవశ్చ జయద్రథః ॥ 8
యక్షసేనః సపుత్రశ్చ శాల్వశ్చ వసుధాధిపః ।
ప్రాగ్జ్యోతిషశ్చ నృపతిః భగదత్తో మహారథః ॥ 9
స తు సర్వైః సహ మ్లేచ్ఛైః సాగరానూపవాసిభిః ।
పర్వతీయాశ్చ రాజానః రాజా చైవ బృహద్బలః ॥ 10
పౌండ్రకో వాసుదేవశ్చ వంగః కాళింగకస్తథా ।
ఆకర్షాః కుంతలాశ్చైవ మాళవాశ్చాంధ్రకాస్తథా ॥ 11
ద్రావిడాః సింహళాశ్చైవ రాజా కాశ్మీరకస్తథా ।
కుంతిభోజో మహాతేజాః పార్థివో గౌరవాహనః ॥ 12
బాహ్లికాశ్చాపరే శూరా రాజానః సర్వ ఏవ తే ।
విరాటః సహ పుత్రాభ్యాం మావేల్లశ్చ మహాబలః ॥ 13
రాజానో రాజపుత్రాశ్చ నానాజనపదేశ్వరాః ।
ధృతరాష్ట్రుడు, భీష్ముడు, బుద్ధిమంతుడు విదురుడు, దుర్యోధనుడు, అతని సోదరులు, గాంధారరాజు సుబలుడు, మహాబలుడు శకుని, అచలుడు, వృషకుడు, రథికులలో శ్రేష్ఠుడు కర్ణుడు, బలవంతుడు శల్యుడు, మహాబలవంతుడు బాహ్లీకుడు, సోమదత్తుడు, కురునందనుడు భూరి, భూరిశ్రవసుడు, శలుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, సింధురాజు జయద్రథుడు, పుత్రసహితుడైన ద్రుపదుడు, శాల్వుడు, ప్రాగ్జ్యోతిషపురనరేశుడు మహారథుడు భగదత్తుడు, అతనితో సముద్రతీరవాసులు, మ్లేచ్ఛజాతీయులు, పర్వతీయులు అయిన రాజులు, బృహద్బలుడు, పౌండ్రకవాసుదేవుడు, వంగరాజు, కళింగనృపతి, ఆకర్షుణుడు, కుంతల, మాలవ, ఆంధ్ర, ద్రావిడ, సింహళదేశపురాజులు, కాశ్మీరరాజు, మహాతేజస్వి కుంతిభోజుడు, గౌరవాహనుడు, బాహ్లీకుడు, శూరులైన రాజులు, తన ఇద్దరు కుమారులతో విరాటుడు, మహాబలుడు మావేల్లుడు, నానాజనపద శాసకరాజులు, ఇంకా అనేక రాజులు ఆ యజ్ఞాన్ని చూడటానికి వచ్చారు. (5-13 1/2)
శిశుపాలో మహావీర్యః సహ పుత్రేణ భారత ॥ 14
ఆగచ్ఛత్ పాండవేయస్య యజ్ఞం సమరదుర్మదః ।
రామశ్చైవానిరుద్ధశ్చ కంకశ్చ సహ సారణః ॥ 15
గదప్రద్యుమ్నసాంబాశ్చ చారుదేష్ణశ్చ చారుదేష్ణశ్చ వీర్యవాన్ ।
ఉల్ముకో నిశఠశ్చైవ విరశ్చాంగావహస్తథా ॥ 16
వృష్ణయో నిఖిలాశ్చాన్యే సమాజగ్ముర్మహారథాః ।
మహావీరుడు, యుద్ధగర్వితుడైన శిశుపాలుడు, తనపుత్రునితో ఆ యజ్ఞానికి వచ్చాడు. బలరాముడు, అనిరుద్ధుడు, కంకుడు, సారణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, పరాక్రమవంతుడు చారుదేష్ణుడు, ఉల్ముకుడు శిశిరుడు, అంగావహుడు, ఇతర వృష్ణివంశజులందరు యజ్ఞ దర్శనానికై అక్కడికి చేరారు. (14-16 1/2)
ఏతే చాన్యే చ బహవో రాజానో మధ్యదేశజాః ॥ 17
వీరేకాక ఇంకా మధ్యదేశీయులైన నరేంద్రులు పాండునందనుడైన యుధిష్ఠిరుని యజ్ఞంలో కలిశారు. (17)
ఆజగ్ముః పాండుపుత్రస్య రాజసూయం మహాక్రతుమ్ ।
దదుస్తేషామావసథాన్ ధర్మరాజస్య శాసనాత్ ॥ 18
బహుభక్ష్యాన్వితాన్ రాజన్ దీర్ఘికావృక్షశోభితాన్ ।
తథా ధర్మాత్మజః పూజాం చక్రే తేషాం మహాత్మనామ్ ॥ 19
ధర్మజుని ఆజ్ఞానుసారం నిర్వాహకులందరు వారి విశ్రాంతికై ఉత్తమభవనాలు, తినటానికి భక్ష్య భోజనసామగ్రి సమకూర్చారు. ఆ ఇండ్లలోపమ స్నానాలకు దిగుడుబావులు, అలసట తీరటానికి చెట్లు కల్పించారు. ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు వారందరి స్వాగతసత్కారాల్లో నిమగ్నుడు అయ్యాడు. (18,19)
సత్కృతాశ్చ యథోద్దిష్టాం జగ్మురావసథాన్ నృపాః ।
కైలాసశిఖరప్రఖ్యాన్ మనోజ్ఞాన్ ద్రవ్యభుషితాన్ ॥ 20
అతనిచే సమ్మానితులై వారికుద్దేశింపబడిన భవనాల్లో రాజులందరు నివసించసాగారు. ఆ భవనాల శిఖరాలు కైలాసశిఖరాలవలె ఎత్తుగా, అందంగా ఉన్నాయి. ఎన్నో రకాలైన ద్రవ్యాలతో అలంకరింపబడి ఉన్నాయి. (20)
సర్వతః సంవృతానుచ్చైః ప్రాకారైః సుకృతైః సితైః ।
సువర్ణజాలసంవీతాన్ మణికుట్టిమభూషితాన్ ॥ 21
ఆ పవిత్రభవనాలు అన్నివైపుల అందంగా, తెల్లగా, ఎత్తుగా, గోడలచే ఆవరింపబడి ఉన్నాయి. వాటికి బంగారు జాలరులు వ్రేలాడదీశారు. వాటి ప్రాంగణం మణులు పొదిగి అందంగా ఉంది. (21)
సుఖారోహణసోపానాన్ మహాసనపరిచ్ఛదాన్ ।
స్రగ్దామసమవచ్ఛన్నాన్ ఉత్తమాగరుగంధినః ॥ 22
అనాయాసంగా అధిరోహించటానికి వీలుగా మెట్లు. లోపల చాలా విలువైన పెద్దపెద్ద ఆసనాలు, ఆవశ్యకవస్తువులు ఏర్పాటు చేశారు. ఆ ఇళ్లకు మాలలు కట్టారు. ఆ ప్రదేశాలు అగరుగంధంతో నిండి ఉన్నాయి. (22)
హంసేందువర్ణసదృశాన్ ఆయోజనసుదర్శనాన్ ।
అసంబాధాన్ సమద్వారాన్ యుతానుచ్చావచైర్గుణైః ॥ 23
ఆ అతిథిభవనాలన్నీ చంద్ర, హంసలతో సమానమయిన తెల్లదనం కల్గి ఉన్నాయి. ఒక యోజనం దూరం నుండి చూడముచ్చటగా, స్పష్టంగా కన్పిస్తున్నాయి. వాటిలో సంకీర్ణత లేదు. అన్ని గుమ్మాలు సమానంగా ఉన్నాయి. ఆ అన్ని ఇళ్లు ప్రత్యేకతలతో కూడి ప్రకాశించాయి. (23)
బహుధాతునిబద్ధాంగాన్ హిమవచ్ఛిఖరానివ ।
వాటి గోడలు అనేకప్రకారాలైన గైరికాదిధాతువులచే చిత్రితాలై హిమాలయ శిఖరాలవలె ప్రకాశించసాగాయి.
విశ్రాంతాస్తే తతోఽపశ్యన్ భూమిపా భూరిదక్షిణమ్ ॥ 24
వృతం సదస్యైర్బహుభిః ధర్మరాజం యుధిష్ఠిరమ్ ।
తత్ సదః పార్థివైః కీర్ణం బ్రాహ్మణైశ్చ మహర్షిభిః ।
భ్రాజతే స్మ తదా రాజన్ నాకపృష్ఠం యథామరైః ॥ 25
వారందరు విశ్రాంతిని గైకొని పిమ్మట ఆ రాజులందరు చాలాదక్షిణలు ఇస్తూ, సదస్యులతో కూడిన ధర్మజుని కలియవచ్చారు. ఆ సమయంలో రాజులు, బ్రాహ్మణులు, మహర్షులతో నిండిన ఆ యజ్ఞమండపం దేవతలతో నిండిన బ్రహ్మలోకంతో సమానంగా శోభిల్లింది. (24,25)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి రాజసూయయపర్వణి నియంత్రిత రాజాగమనే చతుస్త్రింశోఽధ్యాయః ॥34॥
ఇది శ్రీమహాభారతమున రాజసూయపర్వమున ఉపపర్వమున నియంత్రిత రాజాగమనము అను ముప్పది నాలుగవ అధ్యాయము. (34)