38. ముప్పది ఎనిమిదవ అధ్యాయము

భీష్ముడు కృష్ణుని చరిత్రమును స్తుతించుట.

వైశంపాయన ఉవాచ
తతో యుధిష్ఠిరో రాజా శిశుపాలముపాద్రవత్ ।
ఉవాచ చైనమ్ మధురం సాంత్వపూర్వమిదం వచః ॥ 1
తరువాత యుధిష్ఠిరో రాజా శిశుపాలముపాద్రవత్ ।
ఉవాచ చైనం మధురం సాంత్వపూర్వమిదం వచః ॥ 1
తరువాత యుధిష్ఠిర మహారాజు శిశుపాలుని సమీపించాడు. అనునయపూర్వకంగా, మధురంగా అతనితో ఇలా అన్నాడు. (1)
వేదం యుక్తం మహీపాల యాదృశం వై త్వముక్తవాన్ ।
ఆధర్మశ్చ పరో రాజన్ పారుష్యం చ నిరర్థకమ్ ॥ 2
మహీపాలా! నీవు చెప్పిన మాటలవిధానం యుక్తంగా లేదు. అధర్మం కూడాను. రాజా! పరుషంగా మాట్లాడటం వ్యర్థం. (2)
న హి ధర్మం పరం జాతు నావబుధ్యేత పార్థివః ।
భీష్మః శాంతనవస్త్వేనం మావమంస్థాస్త్వమన్యథా ॥ 3
శాంతనుడైన భీష్ముడు ఉత్కష్టమైన ధర్మాన్ని తెలియనివాడు కాడు. నీవు అతనిని గురించి వేరొకవిధంగా భావించి అవమానింపరాదు. (3)
పశ్య చైతాన్ మహీపాలాన్ త్వత్తో వృద్ధతరాన్ బహూన్ ।
మృష్యంతే చార్హణం కృష్ణే తద్వత్ త్వం క్షంతుమర్హసి ॥ 4
నీ కంటె పెద్దవారైన మహిపాలురు చాలమంది ఇక్కడున్నారు. చూడు. వారంతా కృష్ణుని గౌరవించడాన్ని సహించారు. అలాగే నీవు కూడా సహించడం యుక్తం. (4)
వేదతత్త్వేన కృష్ణం హి భీష్మశ్చేదిపతే భృశమ్ ।
న హ్యేనం త్వం తథా వేత్థ యథైనం వేద కౌరవః ॥ 5
చేదిరాజా! భీష్ముడు కృష్ణుని యథార్థతత్త్వాన్ని బాగా తెలిసినవాడు. కృష్ణుని తత్త్వాన్ని భీష్ముడు తెలిసికొన్న విధంగా నీవు తెలిసికొనలేదు. (5)
భీష్మ ఉవాచ
నస్మై దేయో హ్యనునయః నాయమర్హతి సాంత్వనమ్ ।
లోకవృద్ధతమే కృష్ణే యోఽర్హణాం నాభిమన్యతే ॥ 6
భీష్ముడిలా అన్నాడు - ధర్మరాజా! లోకంలో అందరికంటె గొప్పవాడైన కృష్ణుని అర్చించడాన్ని అంగీకరించని ఈ శిశుపాలుడు అనునయానికి, సాంత్వనానికి యోగ్యుడు కాడు. (6)
క్షత్రియః క్షత్రియం జిత్వా రణే రణకృతాం వరః ।
యో ముంచతి వశే కృత్వా గురుర్భవతి తస్య సః ॥ 7
యుద్ధంలో ఒక రాజు వేరొకరాజును జయించిన తరువాత తన అధీనంలో ఉన్న శత్రువును విడిచిపెట్టేరాజు ఆ శత్రువుకు గురువు అవుతాడు. (7)
అస్యాం హి సమితౌ రాజ్ఞామ్ ఏకమప్యజిత యుధి ।
న పశ్యామి మహీపాలం సాత్వతీపుత్రతేజసా ॥ 8
ఈ క్షత్రియ సమూహంలో దేవకీనందనుడైన కృష్ణుని పరాక్రమం చేత యుద్ధంలో జయింపబడనివాడు ఒక్కడూ ఉండడు. (8)
న హి కేవలమస్మాకమ్ అయమర్చ్యతమోఽచ్యుతః ।
త్రయాణామపి లోకానామ్ అర్చనీయో మహాభుజః ॥ 9
ఈ అచ్యుతుడు కేవలం మనకు మాత్రమే అర్చింపదగినవాడు కాదు. ఈ మహాభుజుడు ఈ మూడు లోకాలకూ అర్చనీయుడే. (9)
కృష్ణేన హి జితా యుద్ధే బహవః క్షత్రియర్షభాః ।
జగత్ సర్వం చ వార్ష్ణేయే నిఖిలేన ప్రతిష్ఠితమ్ ॥ 10
యుద్ధంలో శ్రీకృష్ణుడు చాలామంది క్షత్రియశ్రేష్ఠులను జయించాడు. ఈ ప్రపంచమంతా వృష్ణివంశీయుడైన కృష్ణుని యందు పూర్తిగా ప్రతిష్ఠితమై ఉంది. (10)
తస్మాత్ సత్స్వపి వృద్ధేషు కృష్ణమర్చామ నేతరాన్ ।
ఏవం వక్తుం న చార్హస్త్వం మా తే భూద్ బుద్ధిరీదృశీ ॥ 11
అందువల్ల వయోవృద్ధులున్నప్పటికీ శ్రీకృష్ణునే ముందుగా పూజిస్తాం. ఇతరులనుకాదు. నీవు ఈ విధంగా మాట్లాడతగదు. నీకిటువంటి బుద్ధి ఉండకూడదు. (11)
జ్ఞానవృద్దా మయా రాజన్ బహవః పర్యుపాసితాః ।
తేషాం కథయతాం శౌరేః అహం స గుణవతో గుణాన్ ॥ 12
సమాగతనామశ్రౌషం బహూన్ బహుమతాన్ సతామ్ ।
రాజా! చాలామంది జ్ఞానవృద్ధులను నేను సేవించాను. ఇక్కడకు వచ్చిన ఆ పెద్దలు చెప్పగా గుణవంతుడైన కృష్ణుని సత్పురుషసమ్మతాలైన గుణాలను నేను విన్నాను. (12 1/2)
కర్మాణ్యపి చ యాన్యస్య జన్మప్రభృతి ధీమతః ॥ 13
బహుశః కథ్యమానాని నరైర్భూయః శ్రుతాని మే ।
పుట్టిన నాటి నుండి ఇతడు చేసిన పనులను ప్రజలు పలుమార్లు చెప్పగా ఎన్నో సార్లు నేను విన్నాను. (13 1/2)
న కేవలం వయం కామాత్ చేదిరాజ జనార్దనమ్ ॥ 14
న సంబంధం పురస్కృత్య కృతార్థం వా కథంచన ।
అర్చామహేఽర్చితం సద్భిః భువి భూతసుఖావహమ్ ॥ 15
చేదిరాజా! మేము శ్రీకృష్ణుని కామంవల్లగాని, బంధుత్వాన్ని పురస్కరించుకొనికాని, చేసిన ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకొని కాని పూజించటం లేదు. అతడు ఈ భూలోకంలో ప్రాణులన్నింటికి సుఖాన్ని కలిగించేవాడు. సత్పురుషులచే పూజింపబడిన వాడూను. అందువల్లే కృష్ణుని పూజించాం. (14,15)
యశః శౌర్యం జయం చాస్య విజ్ఞాయార్చాం ప్రయుంజ్మహే ।
న చ కశ్చిదిహాస్మాభిః సుబాలోఽప్యపరీక్షితః ॥ 16
ఇతని కీర్తిని, శౌర్యాన్ని, విజయాన్ని తెలిసికొని ఇతనిని పూజిస్తున్నాం. ఇక్కడ మేము పరీక్షించని చిన్నబాలుడు కూడా లేడు. (16)
గుణవృద్ధానతిక్రమ్య హరిరర్చ్యతమో మతః ।
జ్ఞానవృద్ధో ద్విజాతీనాం క్షత్రియాణాం బలాధికః ॥ 17
వయో(గుణ) వృద్ధులను కాదని కృష్ణుడు మిక్కిలి పూజింపదగినవాడుగా గ్రహించాం. బ్రాహ్మణులలో జ్ఞానవృద్ధుడు, క్షత్రియులలో బలాధికుడు పూజింపదగినవాడు కదా! (17)
వైశ్యానాం ధాన్యధనవాన్ శూద్రాణామేవ జన్మతః ।
పూజ్యతాయాం చ గోవిందే హేతూ ద్వావపి సంస్థితౌ ॥ 18
వైశ్యులలో ధనధాన్యాలు కలవాడు, శూద్రులలో జన్మవల్ల పెద్దవాడూ, పూజింపదగినవాడు. గోవిందునియందు పూజ్యత విషయంలో హేతువులైన విజ్ఞాన బలాలు రెండూ ఉన్నాయి. (18)
వేదవేదాంగ విజ్ఞానం బలం చాభ్యధికం తథా ।
నృణాం లోకే హి కోఽన్యోఽస్తి విశిష్టః కేశవాదృతే ॥ 19
వేదవేదాంగ విజ్ఞానం, అధికబలమూ రెండూ ఇతనిలో ఉన్నాయి. ఈ మానవలోకంలో కృష్ణుని కంటె విశిష్టుడు వేరొకడు ఎవడు ఉన్నాడు? (19)
దానం దాక్ష్యం శ్రుతం శౌర్యం హ్రీః కీర్తిర్బుద్ధిరుత్తమా ।
సన్నతిః శ్రీర్ధృతిస్తుష్టిః పుష్టిశ్చ నియతాచ్యుతే ॥ 20
దానం, సామర్థ్యం, శాస్త్రవిజ్ఞానం, శౌర్యం, లజ్జ, కీర్తి, ఉత్తమ బుధ్ధి, వినయం, సంపద, ధైర్యం, సంతోషం, బలం అనే ఈ గుణాలన్నీ కృష్ణునిలో నిత్యమూ ఉంటాయి. (20)
తమిమం గుణసంపన్నమ్ ఆర్యం చ పితరం గురుమ్ ।
అర్థ్యమర్చితమర్చార్హం సర్వే సంక్షంతుమర్హథ ॥ 21
సకలగుణ సంపన్నుడు, తండ్రి, గురుడు, పూజనీయుడు, అన్నివిధాలా పూజింపదగినవాడు అయిన శ్రీకృష్ణభగవానుని పూజించాం. అందువల్ల ఈ రాజులంతా దీన్ని సహించాలి. (21)
ఋత్విగ్ గురుస్తథాఽఽచార్యః స్నాతకో నృపతిః ప్రియః ।
సర్వమేతద్ధృషీకేశః తస్మాదభ్యర్చితోఽచ్యుతః ॥ 22
ఋత్విజుడు, గురువు, ఆచార్యుడు, స్నాతకుడు, రాజు మాకు ప్రియుడు, మిత్రుడు అన్నీ కూడ ఆ శ్రీకృష్ణుడే. అందువల్ల అతనిని పూజించాం. (22)
కృష్ణ ఏవ హి లోకానామ్ ఉత్పత్తిరపి చాప్యయః ।
కృష్ణస్య హి కృతే విశ్వమ్ ఇదం భూతం చరాచరమ్ ॥ 23
ఈ లోకాలన్నింటి ఉత్పత్తి, ప్రళయాలు ఆ కృష్ణుని యందే ఉన్నాయి. చరాచరాలతో నిండి ఉన్న ఈ విశ్వం ఆ కృష్ణుని కొరకే ఉంది. (23)
ఏష ప్రకృతిరవ్యక్తా కర్తా చైవ సనాతనః ।
పరశ్చ సర్వభూతేభ్యః తస్మాత్ పూజ్యతమోఽచ్యుతః ॥ 24
ఈ కృష్ణుడు అవ్యక్త ప్రకృతి, సనాతనుడైన కర్త, సర్వప్రాణులకంటె ఉత్కృష్టుడు. అందువల్ల అచ్యుతుడు మిక్కిలి పూజింపదగినవాడు. (24)
బుద్ధిర్మనో మహద్ వాయుః తేజోఽంభః ఖం మహీ చ యా ।
చతుర్విధం చ యద్ భూతం సర్వం కృష్ణే ప్రతిష్ఠితమ్ ॥ 25
బుద్ధి, మనస్సు, మహత్తు, వాయువు, తేజస్సు, నీరు, ఆకాశం, భూమి; జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జములచే నాలుగువిధాలైన ప్రాణులు అన్నీ కృష్ణునియందు ప్రతిష్ఠితమై ఉన్నాయి. (25)
ఆదిత్యశ్చంద్రమాశ్చైవ నక్షత్రాణి గ్రహాశ్చ యే ।
దిశశ్చ విదిశశ్చైవ సర్వం కృష్ణే ప్రతిష్ఠితమ్ ॥ 26
అగ్నిహోత్రముఖా వేదాః గాయత్రీ ఛందసాం ముఖమ్ ।
రాజా ముఖం మనుష్యాణాం నదీనాం సాగరో ముఖమ్ ॥ 27
నక్షత్రాణాం ముఖం చంద్రః ఆదిత్యస్తేజసాం ముఖమ్ ।
పర్వతానాం ముఖం మేరుః గరుడః పతతాం ముఖమ్ ॥ 28
ఊర్ధ్వం తిర్యగధశ్చైవ యావతీ జగతో గతిః ।
సదేవకేషు లోకేషు భగవాన్ కేశవో ముఖమ్ ॥ 29
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, దిక్కులు, విదిక్కులు, అన్నీ కృష్ణుని యందే ప్రతిష్ఠితమై ఉన్నాయి. వేదాలలో అగ్నిహోత్రం ప్రధానం. ఛందస్సులలో గాయిత్రి ముఖ్యం. మనుష్యులలో రాజు శ్రేష్ఠుడు. జలాశయాలలో సముద్రం శ్రేష్ఠం. నక్షత్రాలలో చంద్రుడు ముఖ్యుడు. తేజస్సులలో సూర్యుడు గొప్పవాడు. పర్వతాలలో మేరువు శ్రేష్ఠం. పక్షులలో గరుడుడు శ్రేష్ఠుడు అదే విధంగా అన్నివైపులకు వ్యాపించిన దేవలోకంతో సహా అన్ని లోకాలలో శ్రీకృష్ణుడు శ్రేష్ఠుడు. (26-29)
(వైశంపాయన ఉవాచ
తతో భీష్మస్య తచ్ఛ్రుత్వా వచః కాలే యుధిష్ఠిరః ।
ఉవాచ మతిమాన్ భీష్మం తతః కౌరవనందనః ॥
వైశంపాయనుడిలా అన్నాడు - ఆ తరువాత సమయోచితమైన భీష్ముని మాటలు విని బుద్ధిమంతుడైన యుధిష్ఠిరుడు భీష్మునితో ఇలా అన్నాడు.
యుధిష్ఠిర ఉవాచ
విస్తరేణాస్య దేవస్య కర్మాణీచ్ఛామి సర్వశః ।
శ్రోతుం భగవతస్తాః ప్రబ్రవీహి పితామహ ॥
కర్మణామానుపూర్వ్యం చ ప్రాదుర్భావాంశ్చ మే విభోః ।
యథా చ ప్రకృతిః కృష్ణే తన్మే బ్రూహి పితామహ ॥
యుధిష్ఠిరుడిలా అన్నాడు - పితామహా! ఈ శ్రీకృష్ణభగవానుని చరిత్ర సంపూర్ణంగా విస్తరంగా వినాలనుకొంటున్నాను. దయతో చెప్పండి. శ్రీకృష్ణుని అవతారాలను గురించి, కాలక్రమంలో ఆయన చేసిన పనుల గురించి, ఆయన స్వభావాన్ని గురించి వివరించి చెప్పండి.
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తదా భీష్మః ప్రోవాచ భరతర్షభమ్ ।
యుధిష్ఠిరమమిత్రఘ్నం తస్మిన్ క్షత్రసమాగమే ॥
సమక్షం వాసుదేవస్య దేవస్యేన శతక్రతోః ।
కర్మాణ్యసుకరాణ్యన్యైః ఆచచక్షే జనాధిపః ॥
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! యుధిష్ఠిరుడా విధంగా ప్రార్థిస్తే, భీష్ముడు ఆ రాజులందరి సమూహంలో దేవేంద్రునిలా ప్రకాశిస్తున్న ఆ శ్రీకృష్ణభగవానుని ఎదురుగా భరతశ్రేష్ఠుడు, శత్రుమర్దనుడు అయిన యుధిష్ఠిరునితో శ్రీకృష్ణుని చేష్టలను వివరించాడు. అవి అలౌకికాలు, ఇతరులకు అసాధ్యాలు.
శృణ్వతాం పార్థివానాం చ ధర్మరాజస్య చాంతికే ।
ఇదం మతిమతాం శ్రేష్ఠః కృష్ణం ప్రతి విశాంపతే ॥
సామ్నైవామంత్ర్య రాజేంద్ర చేదిరాజమరిందమమ్ ।
భీమకర్మా తతో భీష్మః భూయః స ఇదమబ్రవీత్ ॥
కురూణాం చాపి రాజానం యుధిష్ఠిరమువాచ హ ।
రాజా! ధర్మరాజు సభలో ఉన్న రాజులంతా వింటూండగా బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన భీష్ముడు శ్రీకృష్ణుని గురించి ఈ విధంగా సాంత్వన వచనాలతో శత్రుమర్దనుడైన శిశుపాలుని ఊరడించాడు. మరల కురుశ్రేష్ఠుడైన ధర్మరాజుతో ఇలా అన్నాడు.
భీష్మ ఉవాచ
వర్తమానామతీతాం చ శృణు రాజన్ యుధిష్ఠిర ।
ఈశ్వరస్యోత్తమస్యైనాం కర్మణాం గహనాం గతిమ్ ।
భీష్ముడిలా అన్నాడు - రాజా! యుధిష్ఠిరా! పురుషోత్తముడైన శ్రీకృష్ణుని యొక్క భూతవర్తమాన కర్మల రీతి మిక్కిలి గహనమైంది. దానిని చెపుతున్నాను. విను.
అవ్యక్తో వ్యక్తలింగస్థః య ఏషభగవాన్ ప్రభుః ॥
పురా నారాయణో దేవః స్వయంభూః ప్రపితామహః ।
అవ్యక్తమైన పరమాత్మతత్త్వమే, వ్యక్తరూపంలో ఉన్న ఈ శ్రీకృష్ణభగవానుడు. ఇతడే పురాతనకాలంలో నారాయణుడు. ఇతడే స్వయంభువు. ఇతడే సర్వలోకపితామహుడు.
సహస్రశీర్షః పురుషః ధ్రువో ఽవ్యక్తః సనాతనః ॥
సహస్రాక్షః సహస్రాస్యః సహస్రచరణో విభుః ।
సహస్రబాహుః సాహస్రః దేవో నామసహస్రవాన్ ॥
అవ్యక్తుడైన ఈ సనాతన పరమాత్మయే సహస్రశీర్షుడైన పురుషుడు. ఇతడే సహస్రాక్షుడు, సహస్రముఖుడు, సహస్రచరణుడు, సహస్రబాహువు, సహస్రరూపుడు, సహస్రనాముడు. ఇతడే సర్వవ్యాపి పరమేశ్వరుడు.
సహస్రముకుటో దేవః విశ్వరూపో మహాద్యుతిః ।
అనేకవర్ణో దేవాదిః అవ్యక్తాద్ వై పరే స్థితః ॥
సహస్ర కిరీటాలు కలవాడు. అనేక రూపాలు కలవాడు, గొప్ప తేజస్సు కలవాడు, అనేక వర్ణాలు కలవాడు. సమస్తదేవతలకు ఆదికారణమైనవాడు, అవ్యక్త ప్రకృతి కంటె ఉన్నతుడు అయిన పరమేశ్వరుడు ఇతడే.
అసృజత్ సలిలం పూర్వం స చ నారాయణః ప్రభుః ।
తతస్తు భగవాంస్తోయే బ్రహ్మాణమసృజత్ స్వయమ్ ॥
ఆ సర్వవ్యాపకుడైన నారాయణుడు మున్ముందుగా నీటిని సృష్టించాడు. తరువాత ఆ నీటిలో స్వయంగా బ్రహ్మను సృష్టించాడు.
బ్రహ్మా చతుర్ముఖో లోకాన్ సర్వాస్తానసృజత్ స్వయమ్ ।
ఆదికాలే పురా హ్యేవం సర్వలోకస్య చోద్భవః ।
చతుర్ముఖుడైన ఆ బ్రహ్మ స్వయంగా ఈ సర్వలోకాలనూ సృష్టించాడు. పూర్వం సృష్టికి మొదటికాలంలో ఈవిధంగా ఈ సమస్తలోకాల సృష్టి జరిగింది.
పురాథ ప్రళయే ప్రాప్తే నష్టే స్థావరజంగమే ।
బ్రహ్మాదిషు ప్రలీనేషు నష్టే లోకే చరాచరే ॥
మరల ప్రళయం జరిగినపుడు ఈ స్థావరజంగమాలు, బ్రహ్మాదులు, చరాచరలోకాలు మూలతత్త్వంలో లయమైపోయాయి.
ఆభూతసంప్లవే ప్రాప్తే ప్రలీనౌ ప్రకృతౌ మహాన్ ।
ఏకస్తిష్ఠతి సర్వాత్మా స తు నారాయణః ప్రభుః ॥
ఈవిధంగా సమస్త భూతాలూ ప్రళయకాలంలో మూలప్రకృతిలో లయం కాగా, సర్వాత్మస్వరూపుడైన నారాయణుడొక్కడే సర్వవ్యాపకుడై నిలిచి ఉన్నాడు.
నారాయణస్య చాంగాని సర్వదైవాని భారత ।
శిరస్తస్య దివం రాజన్ నాభిః ఖం చరణౌ మహీ ॥
భరతనందనా! ఆ నారాయణుని సర్వావయవాలే సర్వదేవతలును. అతని శిరస్సు స్వర్గం. నాభి ఆకాశం పాదాలు భూమి.
అశ్వినౌ ఘ్రాణయోర్దేవః చక్షుషీ శశిభాస్కరౌ ।
ఇంద్రవైశ్వానరౌ దేవౌ ముఖం తస్య మహాత్మనః ॥
ఆ నారాయణుని నాసిక అశ్వనీదేవతలు. కన్నులు సూర్యచంద్రులు. ఆ మహాత్ముని ముఖం ఇంద్రాగ్నులు.
అన్యాని సర్వదైవాని తస్యాంగాని మహాత్మనః ।
సర్వం వ్యాప్య హరిస్తస్థౌ సూత్రం మణిగణానివ ॥
తక్కిన సర్వదైవతాలు ఆ మహాత్ముని అవయవాలు. మణులలో దారం వ్యాపించి ఉన్నట్లుగా, ఆ శ్రీహరి అంతటా వ్యాపించి ఉన్నాడు.
ఆభూతసంప్లవాంతేఽథ దృష్ట్వా సర్వం తమోఽన్వితమ్ ।
నారాయణో మహాయోగీ సర్వజ్ఞః పరమాత్మవాన్ ॥
బ్రహ్మభూతస్తదాఽఽత్మానం బ్రహ్మాణమసృజత్ స్వయమ్ ।
సర్వభూతాలూ ప్రళయంలో లయంకాగా, అంతటా చీకటి వ్యాపించి ఉంది. దాన్ని చూసి సర్వజ్ఞుడు, మహాయోగి అయిన నారాయణ పరమాత్మ బ్రహ్మభూతుడై తన్ను తానే బ్రహ్మగా సృష్టించుకొన్నాడు.
సోఽధ్యక్షః సర్వభుతానాం ప్రభూతః ప్రభవోఽచ్యుతః ॥
సనత్కుమారం రుద్రం చ మనుం చైవ తపోధనాన్ ।
సర్వమేవాసృజద్ బ్రహ్మా తతో లోకాన్ ప్రజాస్తథా ॥
సర్వభూతాలకు అధ్యక్షుడు. అన్నింటికి మూలకారణం, అచ్యుతుడూ అయిన ఆ బ్రహ్మస్వరూపంలో ఉన్న నారాయణుడు సనత్కుమారుని, రుద్రుని, మనువును, తపోధనులను, ఈ సమస్తలోకాలను, ప్రజలను సృష్టించాడు.
తే చ తద్ వ్యసృజంస్తత్ర ప్రాప్తే కాలే యుధిష్ఠిర ।
తేభ్యోఽభవన్మహాత్మభ్యః బహునా బ్రహ్మ శాశ్వతమ్ ॥
యుధిష్ఠిరా! తగినసమయంలో మన్వాదులను సృష్టించాడు. మహాత్ములగు వారి వలన శాశ్వతమగు సనాతన బ్రహ్మం నానారూపాలను పొందింది.
కల్పానాం బహుకోట్యశ్చ సమతీతా హి భారత ।
ఆభూతసంప్లవాశ్చైవ బహుకోట్యోఽతిచక్రముః ॥
భరతనందనా! అనేక కోట్ల కల్పాంతాలు గడిచాయి. అనేక కోట్ల భూతప్రళయాలు గడిచాయి.
మన్వంతరయుగేఽజస్రం సకల్పా భూతసంప్లవాః ।
చక్రవత్ పరివర్తంతే సర్వం విష్ణుమయం జగత్ ॥
ఈ జగత్తంతా విష్ణుమయం. వేలకొలదీ మన్వంతరాలు, యుగాలు, కల్పాంతాలు, భూతప్రళయాలు నిరంతరం చక్రంలా ప్రవర్తిస్తుంటాయి.
సృష్ట్వా చతుర్ముఖమ్ దేవం దేవో నారాయణః ప్రభుః ।
స లోకానాం హితార్థాయ క్షీరోదే వసతి ప్రభుః ॥
శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపకుడై లోకహితం కోసం చతుర్ముఖబ్రహ్మను సృష్టించి, తాను క్షీరసముద్రంపై నివసిస్తాడు.
బ్రహ్మా చ సర్వదేవానాం లోకస్య చ పితామహః ।
తతో నారాయణో దేవః సర్వస్య ప్రపితామహః ॥
ఆ బ్రహ్మ సర్వదేవతలకు, లోకానికి పితామహుడు. అందువల్ల ఆ నారాయణుడు అందరికి ప్రపితామహుడు.
అవ్యక్తో వ్యక్తలింగస్థః య ఏష భగవాన్ ప్రభుః ।
నారాయణో జగచ్చక్రే ప్రభవాప్యయసంహితః ॥
అవ్యక్తుడు, వ్యక్తరూపంగలవాడూ, సృష్టిప్రళయాలలో నిత్యంగా ఉండేవాడు, సర్వవ్యాపకుడు అయిన నారాయణుడు ఈ జగత్తునంతా రచించాడు.
ఏష నారాయణో భూత్వా హరిరాసీద్ యుధిష్ఠిర ।
బ్రహ్మాణమ్ శశిసూర్యైశ్చ ధర్మం చైవాసృజత్ స్వయమ్ ॥
యుధిష్ఠిరా! ఇతడు నారాయణునిగా ఉంటూనే బ్రహ్మను, సూర్యచంద్రులను, ధర్మాన్ని స్వయంగా సృష్టించాడు.
బహుశః సర్వభూతాత్మా ప్రాదుర్భవతి కార్యతః ।
ప్రాదుర్భావాంస్తు వక్ష్యామి దివ్యాన్ దేవగణైర్యుతాన్ ॥
సర్వప్రాణులకు అంతరాత్మ అయిన నారాయణుడు కార్యవశాన అనేక రూపాల్లో ప్రాదుర్భవించాడు. దేవగణాలతో కూడిన ఆ దివ్యమైన ప్రాదుర్భావాలను అవతారాలను చెప్తాను విను.
సుప్త్వా యుగసహస్రం స ప్రాదుర్భవతి కార్యవాన్ ।
పూర్ణే యుగసహస్రేఽథ దేవదేవో జగత్పతిః ॥
బ్రహ్మాణం కపిలం చైవ పరమేష్ఠినమేవ చ ।
దేవాన్ సప్త ఋషీంశ్చైవ శంకరం చ మహాయశాః ॥
భగవంతుడైన శ్రీహరి సహస్రయుగాలు నిద్రించి, యుగసహస్రం పూర్తయిన తర్వాత పరమేష్ఠి బ్రహ్మ, కపిలుడు, దేవగణాలు, సప్తర్షులు, శంకరుడు అనేవారిని సృష్టించాడు.
సనత్కుమారం భగవాన్ మనుం చైవ ప్రజాపతిమ్ ।
పురా చక్రేఽథ దేవాదీన్ ప్రదీప్తాగ్నిసమప్రభః ॥
ఇదేవిధంగా సనత్కుమారుని, మనువును, ప్రజాపతిని, సృష్టించాడు. పురాతనకాలంలో అగ్నితో సమానమైన తేజస్సు గల నారాయణుడు దేవాదులను సృష్టించాడు.
యేన చార్ణవమధ్యస్థౌ నష్టే స్థావరజంగమే ।
నష్టదేవాసురనరే ప్రణష్టోరగరాక్షసే ॥
యోద్ ధుకామౌ సుదుర్ధర్షౌ భ్రాతరౌ మధుకైటభౌ ।
హతౌ భగవతా తేన తయోర్దత్త్వా వృతం వరమ్ ॥
ప్రళయకాలంలో చరాచరభూతప్రపంచమంతా లయమయింది. దేవతలు, రాక్షసులు, మనుష్యులు, నాగులు, అసురులు నశించారు. ఆ సమయంలో మధుకైటభులనే సోదరులైన రాక్షసులిరువురు సాగరమధ్యంలో యుద్ధానికి సిద్ధపడ్డారు. వారు కోరినవరాలిచ్చి, వారిని నారాయణుడు సంహరించాడు.
భూమిం బద్ ధ్వా కృతౌ పూర్వం మృన్మయౌ ద్వౌ మహాసురౌ ।
కర్ణస్రోతోద్భవౌ తౌ తు విష్ణోస్తస్య మహాత్మనః ॥
పూర్వకాలంలో, మహాత్ముడైన విష్ణువు చెవుల మలినాల నుండి పుట్టినవారు ఇద్దరు, రాక్షసులు. ఇద్దరు భూమిని బంధించి మట్టితో ఆకృతిని పొందారు.
మహార్ణవే ప్రస్వపతః శైలరాజసమే స్థితౌ ।
తౌ వివేశ స్వయం వాయుః బ్రహ్మణా సాధు చోదితః ॥
పర్వతరాజైన హిమవంతునితో సమానంగా ఉన్న వారు ఇద్దరూ సముద్రంలో నిద్రిస్తున్నారు. ఆ సమయంలో బ్రహ్మప్రేరణతో వాయువు వారిలో ప్రవేశించింది.
తౌ దివం ఛాదయిత్వా తు వవృథాతే మహాసురౌ ।
వాయుప్రాణౌ తు తౌ దృష్ట్వా బ్రహ్మా పర్యామృశచ్ఛనైః ॥
వారిరువురూ స్వర్గాన్ని కప్పివేసి, ఇంకావృద్ధి చెందసాగారు. వాయుదేవుడే ప్రాణంగా గలవారిని చూసి, బ్రహ్మ మెల్లగా వారిని స్పృశించాడు.
ఏకం మృదుతరం బుద్ ధ్వా కఠినం బుధ్య చాపరమ్ ।
నామనీ తు తయోశ్చక్రే స విభుః సజలోద్భవః ॥
వారిలో ఒకరిని మృదువైన వానిగా, వేరొకరిని కఠినమైన వానిగా స్పర్శ వల్ల గుర్తించి, జలోధ్భవుడైన ఆ బ్రహ్మ వారికి పేర్లు పెట్టాడు.
మృదుస్త్వయం మధుర్నామ కఠినః కైటభః స్వయమ్ ।
తౌ దైత్యౌ కృతనామానౌ చేరతుర్బలగర్వితౌ ॥
వారిలో మృదువుగా ఉన్నవాడు మధువు అనీ, కఠినంగా ఉన్నవాడు కైటభుడనీ పేరు పెట్టాడు. మిక్కిలి బలగర్వితులై వారు ఇద్దరూ సంచరించసాగారు.
తే పురాథ దివం సర్వం ప్రాప్తా రాజన్ మహాసురే ।
ప్రచ్ఛాద్యాథ దివం సర్వం చేరతుర్మధుకైటభౌ ।
రాజా! వారు ముందుగా స్వర్గలోకంచేరి, ఆలోకాన్నంతా కప్పివేసి, సంచరింపసాగారు.
సర్వమేకార్ణవం లోకం యోద్ధుకామౌ సునిర్భయౌ ।
తౌ గతావసురౌ దృష్ట్వా బ్రహ్మా లోకపితామహః ॥
ఏకార్ణవాంబునిచయే తత్రైవాంతరధీయత ।
ఆ సమయంళొ లోకమంతా జలమయంగా ఉంది. యుద్ధకాముకులైన ఆ ఇద్దరూ నిర్భయంగా తిరగసాగారు. వారిని చూసి లోకపితామహుడైన బ్రహ్మ ఆ ఏకార్ణవజలరాశిలో అంతర్ధానమయ్యాడు.
స పద్మే పద్మణాభస్య నాభిదేశాత్ సముతితే ॥
ఆసీదాదౌ స్వయం జన్మ తత్ పంకజమపంకజమ్ ।
పూజయామాస వసతిం బ్రహ్మా లోకపితామహః ॥
అతడు పద్మనాభుని నాభిదేశం నుండి పుట్టిన పద్మంలో నివసించాడు. ఆ పద్మం స్వయంగా పుట్టిన పంకజం. పంకజమేకాని పంకం నుండి పుట్టింది కాదు. నిర్మలమయింది. లోకపితామహుడైన బ్రహ్మ తన నివాసానికై దాన్ని పూజించాడు.
తావుభౌ జలగర్భస్థౌ నారాయణచతుర్ముఖౌ ।
బహూన్ వర్షాయుతానప్సు శయానౌ న చకంపతుః ॥
అథ దీర్ఘస్య కాలస్య తావుభౌ మధుకైటభౌ ॥
ఆజగ్మతుస్తౌ తం దేశం యత్ర బ్రహ్మా వ్యవస్థితః ॥
ఆ నారాయణ చతుర్ముఖులిరువురూ జలగర్భంలో అనేక సహస్రసంవత్సరాలు శయనించి చలించకుండా ఉన్నారు. ఆపై చాలాకాలం తర్వాత ఆ మధుకైటభులిడ్దరూ బ్రహ్మ ఉన్నచోటుకు వచ్చారు.
తౌ దృష్ట్వా లోకనాథస్తు కోపాత్ సంరక్తలోచనః ।
ఉత్పపాతాథ శయనాత్ పద్మనాభో మహాద్యుతిః ॥
తద్ యుద్ధమభవద్ ఘోరం తయోస్తస్య చ వై తదా ।
న చ తావసురౌ యుద్ధే తదా శ్రమమవాపతుః ॥
వారిద్దరినీ చూసి కోపంతో ఎర్రబడ్డ కళ్లతో మహాతేజస్సు గల పద్మనాభుడు శయనం మీది నుండి లేచాడు. అపుడు వారిరువురికి ఆ నారాయణునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ముల్లోకాలూ జలప్రళయంలో ఏకార్ణవంకాగా, వేలసంవత్సరాలు నారాయణునికి ఆ మధుకైటభులకూ ఘోరయుద్ధం జరిగింది. అయినా ఆ రాక్షసులిద్దరికి శ్రమ కలుగలేదు.
అథ దీర్ఘస్య కాలస్య తే దైత్యౌ యుద్ధదుర్మదౌ ।
ఊచతుః ప్రీతమనసా దేవం నారాయణం ప్రభుమ్ ॥
ప్రీతౌ స్వస్తవ యుద్ధేన శ్లాఘ్యస్త్వం మృత్యురావయోః ।
ఆవాం జహి న యత్రోర్వీ సలిలేన పరిప్లుతా ॥
యుద్ధకండూతితో ఉన్న ఆ రాక్షసులిద్దరూ చాలా కాలం తర్వాత మనస్సంతుష్టి పొంది సర్వవ్యాపకుడైన నారాయణునితో ఇలా అన్నారు - నీ యుద్ధంతో మేము ఆనందించాం. నీవు ప్రశంసించదగినవాడవు. మాకు మృత్యుస్వరూపుడవు. నీటిలో మునగకుండా ఉన్నభూమిపై మమ్మల్ని సంహరించు.
హతే చ తవ పుత్రత్వం ప్రాప్నుయావ సురోత్తమ ।
యో హ్యావాం యుధి నిర్జేతా తస్యావాం విహితౌ సుతౌ ॥
తయోః స వచనం శ్రుత్వా తదా నారాయణః ప్రభుః ।
తౌ ప్రగృహ్యమృధే దైత్యౌ దోర్భ్యాం తౌ సమపీడయత్ ॥
ఊరూభ్యాం నిధనం చక్రే తావుభౌ మధుకైటభౌ ।
సురశ్రేష్ఠా! నీచే చంపబడి నీకే పుత్రులుగా జన్మిస్తాం. యుద్ధంలో మమ్మల్ని జయించిన వారికే మేము పుత్రులుగా పుట్టవలసి ఉంది. వారి మాటను విన్న నారాయణుడు వారిద్దరిని పట్టి, చేతులతో హింసించి, తన తొడలపై పెట్టుకొని ఆ మధుకైటభులను సంహరించాడు.
తౌ హతౌ చాప్లుతౌ తోయే వపుర్భ్యామేకతాం గతౌ ॥
మేదో ముముచతుర్దైత్యౌ మధ్యమానౌ జలోర్మిభిః ।
మేదసా తజ్జలం వ్యాప్తం తాభ్యామంతర్దధే తదా ॥
నారాయణశ్చ భగవాన్ అసృజద్ వివిధాః ప్రజాః ।
దైత్యయోర్మేదసాచ్ఛన్నా సర్వా రాజన్ వసుంధరా ॥
తదా ప్రభృతి కౌంతేయ మేదినీతి స్మృతా మహీ ।
ప్రభావాత్ పద్మనాభస్య శాశ్వతీ చ కృతా నృణామ్ ॥
మరణించి ఆ రాక్షసులిద్దరి శరీరాలూ నీటిలో మునిగి ఒకటయ్యాయి. నీటి తరంగాల తాకిడికి వారి శరీరాల నుండి కొవ్వు వెలువడింది. ఆ కొవ్వు అంతా నీటిలో వ్యాపించింది. క్రమంగా వారు అంతర్ధానమయ్యారు. ఆ రాక్షసుల కొవ్వు భూమినంతా కప్పివేసింది. అప్పటి నుంచే భూమికి మేదినీ అనె పేరు కల్గింది. కౌంతేయా! ఆ పద్మనాభుని ప్రభావం వల్ల ఈ మేదిని మనుష్యులకు శాశ్వతమైన ఆధారంగా చేయబడింది.
భీష్మ ఉవాచ
ప్రాదుర్భావసహస్రాణి సమతీతాన్యనేకశః ।
యథాశక్తి తు వక్ష్యామి శృణు తాన్ కురునందన ॥
భీష్ముడిలా అన్నాడు - కురునందనా! శ్రీకృష్ణభగవానుని వేల వేల అవతారాలు గడిచాయి. యథాశక్తిగా వాటిని గురించి చెపుతాను విను.
పురా కమలనాభస్య స్వపతః సాగరాంభసి ।
పుష్కరే యత్ర సంభుతా దేవా ఋషిగణైః సహ ॥
పూర్వకాలంలో కమలనాభుడు సాగరజలంలో నిద్రిస్తూండగా పుష్కరం (పద్మం)లో దేవతలూ, ఋషిగణాలూ సంభవించారు.
ఏష పౌష్కరికో నామ ప్రాదుర్భావః ప్రకీర్తితః।
పురాణః కథ్యతే యత్ర వేదశ్రుతిసమాహితః॥
ఇది పౌష్కరికమనే అవతారంగా చెప్పబడుతోందొ. వేదశ్రుతి ప్రమాణంగా పురాతనమైంది అని చెప్పబడింది.
వారాహస్తు శ్రుతిముఖః ప్రాదుర్భావో మహాత్మనః।
యత్ర విష్ణుః సురశ్రేష్ఠః వారాహం రూపమాస్థితః।
ఉజ్జహార మహీం తోయాత్ సశైలవనకాననామ్॥
మహాత్ముడైన శ్రీహరి వరాహావతారం వైదిక శ్రుతి ప్రమాణం కలదే. అపుడు శ్రీమహావిష్ణువు వరాహరూపాన్ని ధరించి పర్వతవనకాననాలతో ఉన్న ఈ భూమిని నీటినుండి పైకి తీశాడు.
వేదపాదో యూపదంష్ట్రః క్రతుదంతశ్చితీముఖః।
అగ్నిజిహ్వో దర్భరోమా బ్రహ్మశీర్షో మహాతపాః॥
ఆ వరాహానికి నాలుగువేదాలు నాలుగుపాదాలు యజ్ఞసంబంధమైన యూపం కోర, క్రతువు దంతం, యజ్ఞంలోని అగ్నివేదిక ముఖం, అగ్నియే నాలుక. దర్భలు రోమాలు. బ్రహ్మయే శిరస్సు. అతడు మహాతపస్వి.
అహోరాత్రేక్షణో దివ్యః వేదాంగః శ్రుతిభూషణః।
ఆజ్యనాసః స్రువతుండః సామఘోషస్వనో మహాన్॥
అహోరాత్రులు నేత్రాలు. వేదాంగాలు దాని శ్రుతిముఖానికి దివ్య భూషణాలు. ఆజ్యమే ముక్కు. హోమోపకరణమైన స్రువం తుండం. సామమే దానినుండి వెలువడే గొప్పధ్వని.
ధర్మసత్యమయః శ్రీమాన్ కర్మవిక్రమసత్కృతః।
ప్రాయశ్చిత్తనఖో ధీరః పశుజానుర్మహావృషః॥
ధర్మసత్యాలు దాని స్వరూపం. కర్మవిక్రమాలచే కూడినది. ప్రాయశ్చిత్తమే గోళ్లు. ధైర్యం కలదది. పశువు(జానువు) మోకాలు. గొప్ప ధర్మరూపమైన వృషభమే దాని విగ్రహం.
ఔద్ గాత్రహోమలింగోఽసౌ ఫలబీజమహౌషధిః।
బాహ్యాంతరాత్మా మంత్రాస్థివికృతః సౌమ్యదర్శనః॥
ఉద్గాతకు సంబంధించిన హోమమే దానికి గుర్తు. అది ఫలమూ, బీజమూ కల మహావృక్షం. బయట లోపల వ్యాపించిన ఆత్మ కలది. మంత్రాలు అస్థికల రూపంలో వికృతిని పొందింది. చూడటానికి సౌమ్యస్వరూపం కలిగింది.
వేదిస్కంధో హవిర్గంధః హవ్యకవ్యాదివేగవాన్।
ప్రాగ్వంశకాయో ద్యుతిమాన్ నానాదీక్షాభిరాచితః॥
అతడు యజ్ఞవేది స్కంధంగా గలవాడు, హవిస్సు గంధంతో ఉన్నవాడు, హవ్యం, కవ్యం మున్నగువాని వేగం కలవాడు, యజమానవంశం శరీరంగా కలవాడు, తేజస్సుకలవాడు, అనేకవిధాలైన దీక్షలతో వ్యాపించినవాడు.
దక్షిణాహృదయో యోగో మహాశాస్త్రమయో మహాన్।
ఉపాకర్మోష్ఠరుచకః ప్రవర్గ్యావర్తభూషణః॥
దక్షిణ(దయ) హృదయమందున్నవాడు, యోగి, మహాశాస్త్రస్వరూపుడు, ఉపాకర్మ ఓష్ఠంగా కలవాడు, ప్రవర్గ్యకర్మ అతనికి రత్నాల ఆభరణం.
ఛాయాపత్నీసహాయో వై మణిశృంగ ఇవోచ్ఛ్రితః।
ఏవం యజ్ఞవరాహో నై భూత్వా విష్ణుః సనాతనః।
మహీం సాగరపర్యంతాం సశైలవనకాననామ్।
ఏకార్ణవజలే భ్రష్టామ్ ఏకార్ణవగతః ప్రభుః।
మజ్జితాం సలిలే తస్మిన్ స్వదేవీం పృథివీం తదా।
ఉజ్జహార విషాణేన మార్కండేయస్య పశ్యతః॥
ఈవిధంగా యజ్ఞవరాహరూపుడై సనాతనుడై విష్ణువు ఛాయాపత్నియే సహాయంగా కలిగి, మణిమయపర్వత శిఖరంలా ఉన్నతుడై, సముద్రపర్యంతం వ్యాపించి ఉన్న, పర్వత వనకాననాలతో కూడి ఉన్న ఏకార్ణవజలంలో మునిగిపోతున్న తనదేవి అయిన భూమిని మార్కండేయమహర్షి చూస్తూండగా తన కోరతో పైకెత్తాడు.
శృంగేణేమాం సముద్ ధృత్య లోకానాం హితకామ్యయా।
సహస్రశీర్షో దేవో హి నిర్మమే జగతీం ప్రభుః॥
లోకాలకు హితంచేకూర్చే కోరికతో తనకోరతో భూమిని నీటినుండి ఉద్ధరించిన సర్వవ్యాపకుడు, సహస్రశీర్షుడూ అయిన శ్రీ మహావిష్ణువు ఈ జగత్తును నిర్మించాడు.
ఏవం యజ్ఞవరాహేణ భూతభవ్యభవాత్మనా।
ఉద్ ధృతా పృథివీ దేవీ సాగరాంబుధరా పురా।
నిహతా దానవాః సర్వే దేవదేవేన విష్ణునా॥
ఈవిధంగా భూథభవిష్యద్వర్తమాన స్వరూపుడై యజ్ఞవరాహరూపుడైన విష్ణువు సముద్రజలం నుండి భూదేవిని ఉద్ధరించి, దానవులను సంహరించాడు.
వారాహః కథితో హ్యేష నారసింహమథో శృణు।
యత్ర భూత్వా మృగేంద్రేణ హిరణ్యకశిపుర్హతః।
ఈవిధంగా వరాహావతారం జరిగింది. ఇక నారసింహావతారం గురించి విను. అపుడు శ్రీమహావిష్ణువు సింహరూపంతో హిరణ్యకశిపుని సంహరించాడు.
దైత్యేంద్రో బలవాన్ రాజన్ సురారిర్బలగర్వితః।
హిరణ్యకశిపుర్నామ ఆసీత్ త్రైలోక్యకంటకః॥
రాజా! దేవతలకు శత్రువు, బలగర్వితుడు, ముల్లోకాలకు కంటకుడు అయిన హిరణ్యకశిపు డనే రాక్షసరాజు ఉండేవాడు.
దైత్యానామాదిపురుషః వీర్యవాన్ ధృతిమాన్ బలీ।
ప్రవిశ్య స వనం రాజన్ చకార తప ఉత్తమమ్॥
రాజా! దైత్యులకు ఆదిపురుషుడు, వీర్యవంతుడు, ధైర్యంకలవాడు, బలవంతుడు అయిన అతడు వనంలో ప్రవేశించి గొప్ప తపస్సు చేశాడు.
దశవర్ష సహస్రాణి శతాని దశ పంచ చ ।
జపోపవాసైస్తస్యాసీత్ స్ధాణుర్మౌనవ్రతో దృఢః ॥
అతడు జప - ఉపవాసాల చేత పదకొండువేల ఐదువందల సంవత్సరాలు తపస్సు చేసి, మౌనవ్రతుడై స్థాణువులా నిశ్చలంగా దృఢమ్గా అయ్యాడు.
తతో దమశమాభ్యాం చ బ్రహ్మచర్యేణ చానఘ ।
బ్రహ్మాప్రీతమనాస్తస్య తపసా నియమేన చ ॥
అనంతరం శమదమాలతో, బ్రహ్మచర్యంతో నియమపూర్వకమైన అతని తపస్సుచేత బ్రహ్మ పంతుష్టాంతరంగుడయ్యాడు, సంతోషించాడు.
తతః స్వయంభూర్భగవాన్ స్వయమాగమ్య భూపతే ।
విమానేనార్కవర్ణేన హంసయుక్తేన భాస్వతా ॥
రాజా! అనంతరం భగవంతుడైన స్వయంభువు హంసలు కూర్పబడిన సూర్యునిలా ప్రకాశించే విమానం మీద స్వయంగా వచ్చాడు.
ఆదిత్యైర్వసుభిః సాధ్యైః మరుద్భిర్దైవతైః సహ ।
రుద్రైర్విదిశాభిశ్చ నదీభిః సాగరైస్తథా ।
నక్షత్రైశ్చ ముహూర్తైశ్చ ఖేచరైశ్చాపరైర్ర్గహైః ॥
దేవర్షిభిస్తపోయుక్తైః సిద్ధైః సప్తర్షిభిస్తథా ।
రాజర్షిభిః పుణ్యతమైః గంధర్వైరప్సరోగణైః ॥
అతనితోపాటుగా ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, మరుత్తులు, దేవగణాలు, రుద్రులు, విశ్వేదేవులు, యక్షరాక్షస కిన్నరులు, దిశలు, విదిశలు, నదులు, సాగరాలు, నక్షత్రాలు, ముహూర్తాలు, ఖేచరులు, గ్రహాలు, దేవర్షులు, తపస్వులు, సిద్ధులు, సప్తర్షులు, రాజర్షులు, పుణ్యాత్ములు, గంధర్వులు, అప్సరోగణాలు కూడా వచ్చారు.
చరాచరులుః శ్రీమాన్ వృతః సర్వసురైస్తథా।
బ్రహ్మాబ్రహ్మవిదాంశ్రేష్ఠః దైత్యమాగమ్యచాబ్రవీత్ ॥
సర్వదేవతలతో కూడి, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, చరాచరాలకు గురువూ, శ్రీమంతుడూ అయిన బ్రహ్మ ఆ దైత్యుని సమీపించి ఇలా అన్నాడు.
బ్రహ్మోవాచ
ప్రీతోఽస్మి తవ భక్తస్య తపసానేన సువ్రత ।
వరం వరయ భద్రం తే యథేష్టం కామమాప్నుహి ॥
బ్రహ్మ ఇలా అన్నాడు - సుపుత్రా! భక్తుడవైన
నీ తపస్సు చేత సంతుష్టుడ నయ్యాను. మంగళకరమైన వరాన్ని కోరుకో. యథేచ్ఛగా నీ కోరికను పొందగలవు.
హిరణ్యకశిపు రువాచ
న దేవాసురగంధర్వాః న యక్షోరగరాక్షసాః ।
న మానుషాః పిశాచాశ్చ హన్యుర్మాం దేవసత్తమ ॥
హిరణ్యకశిపుడిలా అన్నాడు - దేవసత్తమా! దేవాసుర గంధర్వులు గాని, యక్షోరగరాక్షసులు కాని, మనుష్యులు గాని, పిశాచాలు గాని నన్ను చంపరాదు.
ఋషయో వా న మాం శాపైః క్రుద్ధా లోకపితామహ ।
శపేయుస్తపసా యుక్తాః వర ఏష వృతో మయా ।
లోకపితామహా! క్రుద్ధులైన ఋషులు తపోయుక్తులై శాపాల చేత నన్ను శపించరాదు. ఇట్టివరాన్ని నేను కోరుతున్నాను.
న శస్త్రేణ న చాస్త్రేణ గిరిణా పాదపేన చ ।
న శుష్కేణ న చార్ద్రేణ స్యాన్న వాన్యేన మే వధః ॥
శస్త్రం చేత గాని, అస్త్రం చేత గాని, పర్వతం చేత గాని, వృక్షం చేత గాని, ఎండిన దాని చేతగాని, తడిదానిచేగాని, ఇతరమైన దేని చేత గాని నావధ జరుగరాదు.
నాకాశే వా న భూమౌ వా రాత్రౌ వా దివసేఽపి వా ।
నాంతర్వా బహిర్వాపి స్యాద్ వధో మే పితామహ ॥
పితామహా! ఆకాశమందుగాని, భూమిపైగాని, రాత్రియందుగాని, పగటియందుగాని, లోపలగాని బయటగాని నావధ జరుగరాదు.
పశుభిర్వా మృగైర్నస్యాత్ పక్షిభిర్వా సరీసృపైః ।
దదాసి చేద్ వరానేతాన్ దేవదేవ వృణోమ్యహమ్ ॥
పశువుల చేత గాని, మృగాలచేతగాని, పక్షులచేతగాని, సర్పాలచేతగాని నావధ జరుగరాదు. దేవదేవా! నీవిచ్చేటట్లయితే ఈ వరాలను నేను కోరుకొంటున్నాను.
బ్రహ్మోవాచ
ఏతే దివ్యా వరాస్తాత మయా దత్తాస్తవాద్భుతాః ।
సర్వకామాన్ వరాంస్తాత ప్రాప్యసే త్వం న సంశయః ॥
అపుడు బ్రహ్మ ఇలా అన్నాడు - నాయనా! అద్భుతాలైన, దివ్యాలైన ఈ వరాలను నీకిస్తున్నాను. నీవన్ని కోరికలను పొందుతావు. సందేహం లేదు.
భీష్మ ఉవాచ
ఏవముక్త్యా స భగవాన్ ఆకాశేన జగామ హ ।
రరాజ బ్రహ్మలోకే స బ్రహ్మర్షిగణసేవితః ॥
భీష్ముడిలా అన్నాడు - ఇలా చెప్పి భగవానుడైన బ్రహ్మ ఆకాశమార్గంలో వెళ్ళి, బ్రహ్మలోకంలో బ్రహ్మర్షిగణాలచే సేవింపబడుతూ విరాజిల్లుతున్నాడు.
తతో దేవాశ్చ నాగాశ్చ గంధర్వా మునయస్తథా ।
వరప్రదానం శ్రుత్వా తే బ్రహ్మాణముపతస్థిరే ॥
అనంతరం దేవతలు, నాగులు, గంధర్వులు, మునులు ఈ వరప్రదానం గురించి విని బ్రహ్మదగ్గరకు వచ్చారు.
దేవా ఊచుః
వరేణానేన భగవన్ బాధిష్యతి స నోఽసురః ।
తత్ ప్రసీదస్వ భగవన్ వధోఽస్య ప్రవిచింత్యతామ్ ॥
దేవతలిలా అన్నారు - పూజ్యుడా! ఈ వరంచేత ఆ అసురుడు మమ్ము బాధిస్తాడు. అందువల్ల అనుగ్రహించు. అతని వధను గురించి ఆలోచించు.
భవాన్ హి సర్వభుతానామ్ స్వయంభూరాదికృద్ విభుః ।
స్రష్టా చ హవ్యకవ్యానామ్ అవ్యక్తప్రకృతిర్ద్రువః ॥
సర్వభూతాలకు మూలకారణం నీవే. స్వయంభువువు. విశ్వవ్యాపకుడవు. హవ్యకవ్యాల స్రష్టవు. అవ్యక్తప్రకృతివి. స్థిరుడవు.
భీష్మ ఉవాచ
తతో లోకహితం వాక్యం శ్రుత్వా దేవః ప్రజాపతిః ।
ప్రోవాచ భగవాన్ వాక్యం సర్వదేవగణాంస్తదా ॥
భీష్ముడిలా అన్నాడు - ఆ తర్వాత లోకహితమైన మాటను విని ప్రజాపతి బ్రహ్మదేవుడు సర్వదేవగణాలను ఉద్దేశించి ఇలా అన్నాడు.
బ్రహ్మోవాచ
అవశ్యం త్రిదశాస్తేన ప్రాప్తవ్యం తపసః ఫలమ్ ।
తపసోఽన్యేఽస్య భగవాన్ వధం కృష్ణః కరిష్యతి ॥
బ్రహ్మ ఇలా అన్నాడు - అతడు చేసిన తపస్సుకు తగిన ఫలితాన్ని అతడు తప్పక పొందాలి. ఆ తపఃఫలం పూర్తయ్యాక భగవంతుడైన కృష్ణుడు అతనిని వధిస్తాడు.
భీష్మ ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా సురాః సర్వే బ్రహ్మణా తస్య వై వధమ్ ।
స్వాని స్థానాని దివ్యాని జగ్ముస్తే వై ముదాన్వితాః ॥
భీష్ముడిలా అన్నాడు - బ్రహ్మ చెప్పిన అతనివధను గురించి విన్న దేవతలందరూ ఆనందంతో తమతమ దివ్యస్థానాలకు వెళ్లారు.
లబ్ధమాత్రే వరే చాపి సర్వాస్తా బాధతే ప్రజాః ।
హిరణ్యకశిపుర్దైత్యః వరదానేన దర్పితః ॥
హిరణ్యకశిపుడు వరదానంతో గర్వితుడై జనులందరినీ బాధపెట్టాడు.
రాజ్యం చకార దైత్యేంద్రః దైత్యసంఘైః సమావృతః ।
సప్తద్వీపా వశే చక్రే లోకాన్ లోకాంతరాన్ బలాత్ ॥
రాక్షస సంఘాలతో కలసి అతడు రాజ్యపాలన చేశాడు. సప్తద్వీపాలను, లోకాలను, లోకాంతరాలను తనబలం వల్ల తన వశం చేసికొన్నాడు.
దివ్యలోకాన్ సమస్తాన్ వై భోగాన్ దివ్యానవాప సః ।
దేవాంస్త్రిభువనస్థాంస్తాన్ పరాజిత్య మహాసురః ॥
ముల్లోకాలలో ఉన్న దేవతలను ఓడించి, ఆ మహాసురుడు దివ్యలోకాలను, దివ్యభోగాలను అనుభవించాడు.
త్రైలోకం వశమానీయ స్వర్గే వసతి దానవః ।
యదా వరమదోన్మత్తః న్యవసద్ దానవో దివి ॥
ముల్లోకాలను తన వశంచేసికొని స్వర్గంలో నివసించాడు. వరగర్వం వల్ల ఉన్మత్తుడై ఆ రాక్షసుడు దేవలోకంలో నివసించాడు.
అథ లోకాన్ సమస్తాంశ్చ విజిత్య స మహాసురః ।
భవేయమహమేవేంద్రః సోమోఽగ్నిర్మారుతో రవిః ॥
సలిలం చాంతరిక్షం చ నక్షత్రాణి దిశో దశ ।
అహం క్రోధశ్చ కామశ్చ వరుణో వసవోఽర్యమా ॥
ధనదశ్చ ధనాధ్యక్షః యక్షః కింపురుషాధిపః ।
ఏతే భవేయమిత్యుక్త్వా స్వయం భూత్వా బలాత్ స చ ॥
సమస్తలోకాలను జయించిన ఆ హిరణ్యకశిపుడు 'నేనే మహేంద్రుణ్ణి, చంద్రుణ్ణి, అగ్నిని, సూర్యుణ్ణి, వాయువును; జలం, అంతరిక్షం, నక్షత్రాలు, పది దిక్కులు, కామక్రోధాలు, వరుణుడు, వసువులు, అర్యమ, కుబేరుడు, ధనాధ్యక్షుడు, యక్షుడు, కింపురుషాధివుడు అన్నీ నేనే'. అని తన బలం వల్ల చాటించుకొన్నాడు.
తేషాం గృహీత్వా స్థానాని తేషాం కార్యాణ్యవాస సః ।
ఇజ్యశ్చాసీన్మఖవరైః స తైర్దేవర్షిసత్తమైః ॥
నరకస్థాన్ సమానీయ స్వర్గస్థాంస్తాంశ్చకార సః ।
ఏవమాదీని కర్మాణి కృత్వా దైత్యపతిర్బలీ ॥
ఆశ్రమేషు మహాభాగాన్ మునీన్ వై సంశ్రితవ్రతాన్ ।
సత్యధర్మపరాన్ దాంతాన్ పురా ధర్షితవాంశ్చ సః ।
వారి వారి స్థానాలను అతడు ఆక్రమించి, వారిపనులన్నీ తానే చేశాడు. దేవర్షిసత్తముల యజ్ఞాలతో పొందదగిన స్థానాలను అతడే ఆక్రమించాడు. నరకంలో ఉన్నవాళ్లందరినీ తీసికొని వచ్చి స్వర్గస్థులను చేశాడు. బలవంతుడైన ఆ రాక్షసరాజు ఇటువంటి పనులన్నీ చేసి, ఆశ్రమాల్లో నియమనిష్ఠలతో సత్యధర్మపరాయణులై, జితేంద్రియులై, మహానుభావులై ఉన్న మునులను అవమానించాడు.
యజ్ఞీయాన్ కృతవాన్ దైత్యాన్ అయజ్ఞీయాంశ్చ దేవతాః ।
యత్ర యత్ర సురా జగ్ముః తత్ర తత్ర వ్రజత్యుత ॥
స్థానాని దేవతానాం తు హృత్వా రాజ్యమపాలయత్ ।
రాక్షసులను యజ్ఞహవిస్సులను పొందే వారిగా చేశాడు. దేవతలకు యజ్ఞసంబంధం లేకుండా చేశాడు. సురలు ఎక్కడకు వెళితే అక్కడకు అతడూ వెళ్లాడు. దేవతల స్థానాలను లాక్కొని తాను రాజ్యపాలన చేశాడు.
పంచ కోట్యశ్చ వర్షాణి నియుతాన్యేకషష్టి చ ॥
షష్టిశ్చైవ సహస్రాణాం జగ్ముస్తస్య దురాత్మనః ।
ఏతద్ వర్షం స దైత్యేంద్రః భోగైశ్వర్యమవాప సః ॥
ఈవిధంగా ఐదుకోట్ల అరవైలక్షల అరవై వేల సంత్సరాలు దురాత్ముడైన ఆ రాక్షసరాజు భోగైశ్వర్యాలను అనుభవించాడు.
తేనాతిబాధ్యమానాస్తే దైత్యేంద్రేణ బలీయసా ।
బ్రహ్మలోకం సురా జగ్ముః సర్వే శక్రపురోగమాః ॥
పితామహం సమాసాద్య ఖిన్నాః ప్రాంజలయోఽబ్రువన్ ।
బలవంతుడైన ఆ రాక్షసరాజువల్ల చాలా బాధలు పడి, దేవతలంతా ఇంద్రుని ముందుపెట్టుకొని బ్రహ్మలోకం వెళ్ళి, పితామహుని దగ్గర దుఃఖితులై చేతులు జోడించి ఇలా అన్నారు.
దేవా ఊచుః
భగవద్ భూతభవ్యేశ నస్త్రాయస్వ ఇహాగతాన్ ।
భయం దితిసుతాద్ ఘోరం భవత్యద్య దివానిశమ్ ॥
దేవతలిలా అన్నారు - పూజ్యుడా! భూతభవిష్యాలకు అధిపతీ! దైత్యుడైన హిరణ్యకశిపుని వల్ల రాత్రింబవళ్లు ఘోరమైన భయం కలుగుతోంది. ఇక్కడకు వచ్చిన మమ్ము నీవు రక్షించు.
భగవన్ సర్వభూతానామ్ స్వయంభూరాదికృద్ విభుః ।
స్రష్టా త్వం హవ్యకవ్యానామ్ అవ్యక్తప్రకృతిర్ధ్రువః ॥
భగవంతుడా! సమస్తభూతాలకు మూలకారకుడవు, స్వయంభువువు, సర్వవ్యాపకుడవు, హవ్యకవ్యాల స్రష్టవు నీవే. నీవే అవ్యక్త ప్రకృతివి. నీవే స్థిరుడవు.
బ్రహ్మోవాచ
శ్రూయతామాపదేవం హి దుర్విజ్ఞేయా మయాపి చ ।
నారాయణస్తు పురుషః విశ్వరూపో మహాద్యుతిః ।
అవ్యక్తః సర్వభూతానామ్ అచింత్యో విభురవ్యయః ।
బ్రహ్మ ఇలా అన్నాడు - వినండి. ఇంతటి విపత్తును నేను కూడ తెలియలేకపోయాను. పురుషోత్తముడు, విశ్వరూపుడు, మహాతేజస్వి, అవ్యక్తుడు, సమస్తభూతాలకు అచింత్యుడు, సర్వవ్యాపకుడు, అవ్యయుడు అయిన శ్రీమన్నారాయణుడే ఎరుగును.
మమాపి స తు యుష్మాకం వ్యసనే పరమా గతిః ॥
నారాయణః పరోఽవ్యక్తాద్ అహమవ్యక్తసంభవః ।
మీకు, నాకు కూడ కష్టాలలో ఆ నారాయణుడే గొప్ప దిక్కు. నారాయణుడు అవ్యక్తం కంటె అతీతుడు. నేను అవ్యక్తం నుండి సంభవించాను.
మత్తో జజ్ఞుః ప్రజా లోకాః సర్వే దేవాసురాశ్చ తే ॥
దేవా యథాహం యుష్మాకం తథా నారాయణో మమ ।
పితామహోఽహం సర్వస్య స విష్ణుః ప్రపితామహః ॥
తమిమం విబుధా దైత్యం స విష్ణుః సంహరిష్యతి ।
తస్య నాస్తి హ్యశక్యం చ తస్మాద్ వ్రజత మా చిరమ్ ॥
ఈ ప్రజలు, లోకాలు, సర్వదేవతలు, రాక్షసులు, నా నుండి జన్మించారు. మీకు నేనెలాగో, నాకు ఆ నారాయణుడు అట్టివాడు. నేను అందరికి పితామహుణ్ణి. విష్ణువు ప్రపితామహుడు. దేవతలారా! ఈ రాక్షసుని ఆ విష్ణువు సంహరిస్తాడు. అతడికి శక్యంకానిది లేదు. అందువల్ల ఆలస్యం చేయక అతని దగ్గరకు వెళ్లండి.
భీష్మ ఉవాచ
పితామహవచః శ్రుత్వా సర్వే తే భరతర్షభ ।
విబుధా బ్రహ్మణా సార్ధం జగ్ముః క్షీరోదధిం ప్రతి ॥
భీష్ముడిలా అన్నాడు - భరతశ్రేష్ఠా! పితామహుని మాటలు విని దేవతలందరూ బ్రహ్మతోపాటు క్షీరసముద్రానికి వెళ్ళారు.
ఆదిత్యా మరుతః సాధ్యా విశ్వే చ వసవస్తథా ।
రుద్రా మహర్షయశ్చైవ అశ్వినౌ చ సురూపిణౌ ॥
అన్యే చ దివ్యా యే రాజన్ తే సర్వే సగణాః సురాః ।
చతుర్ముఖం పురస్కృత్య శ్వేతద్వీపముపస్థితాః ॥
రాజా! ఆదిత్యులు, మరుత్తులు, సాధ్యులు, విశ్వేదేవతలు, వసువులు, రుద్రులు, మహర్షులు, అశ్వినులు, తక్కిన దివ్యులు, దేవతలంతా చతుర్ముఖ బ్రహ్మను ముందిడుకొని శ్వేతద్వీపానికి చేరుకొన్నారు.
గత్వా క్షీరసముద్రం తం శాశ్వతీం పరమాం గతిమ్ ।
అనంతశయనం దేవమ్ అనంతం దీప్తతేజసమ్ ॥
శరణ్యం త్రిశదా విష్ణుమ్ ఉపతస్థుః సనాతనమ్ ।
దేవం బ్రహ్మమయం యజ్ఞం బ్రహ్మదేవం మహాబలమ్ ॥
భూతం భవ్యం భవిష్యచ్చ ప్రభుం లోకనమస్కృతమ్ ।
నారాయణం విభుం దేవం శరణ్యం శరణం గతాః ॥
క్షీరసముద్రానికి వెళ్ళి, శాశ్వతమైన గొప్పదిక్కు, అనంతశయనుడు, అనంతుడు, ఉద్దీప్తతేజస్సు కలవాడు, శరణ్యుడు, సనాతనుడు, బ్రహ్మమయుడు, యజ్ఞస్వరూపుడు, బ్రహ్మదేవుడు, మహాబలుడు, భూతభవిష్యద్వర్తమానాలకు ప్రభువు, సర్వలోకనమస్కృతుడు, సర్వవ్యాపకుడు అయిన నారాయణుని దేవతలందరు సమీపించి శరణువేడారు.
దేవా ఊచుః
త్రాయస్వ నోఽద్య దేవేశ హిరణ్యకశిపోర్వధాత్ ।
త్వం హి నః పరమో ధాతా బ్రహ్మాదీనాం సురోత్తమ ॥
దేవతలిలా అన్నారు - దేవేశా! సురోత్తమా! హిరణ్యకశిపుని చంపి ఇపుడు నీవే మమ్ము రక్షించాలి. నీవే మాకు, బ్రహ్మాదులకు సంపూర్ణ రక్షకుడవు. పోషకుడవు కూడ.
ఉత్ఫుల్లపద్మపత్రాక్ష శత్రుపక్షభయంకర ।
క్షయాయ దితివంశస్య శరణ్యస్త్వం భవాద్య నః ।
వికసించిన కమలపత్రాల వంటి కన్నులు కలవాడా! శత్రుపక్షభయంకరా! దితివంశనాశనం చేసి నీవే మాకిపుడు రక్షకుడవు కావాలి.
భీష్మ ఉవాచ
దేవానాం వచనం శ్రుత్వా తదా విష్ణుః శుచిశ్రవాః ।
అదృశ్యః సర్వభూతానాం వక్తుమేవోపచక్రమే ॥
భీష్ముడిలా అన్నాడు - అపుడు పవిత్రమగు కీర్తి గల విష్ణువు దేవతల మాటలు విని సర్వభూతాలకు అదృశ్యుడై ఇలా చెప్పనారంభించాడు.
శ్రీ భగవానువాచ
భయం త్యజధ్వమమరాః అభయం వో దదామ్యహమ్ ।
తదేవం త్రిదివం దేవాః ప్రతిపద్యత మా చిరమ్ ॥
శ్రీమహావిష్ణువిలా అన్నాడు - దేవతలారా! మీరు భయాన్ని విడిచిపెట్టండి. మీకు నేను అభయాన్నిస్తున్నాను. దేవతలారా! త్వరలోనే మీరు మీ స్వర్గాన్ని పొందుతారు.
ఏషోఽహం సగణం దైత్యం వరదానేన దర్పితమ్ ।
అవధ్యమమరేంద్రాణాం దానవేంద్రం నిహన్మ్యహమ్ ॥
వరదానం చేత గర్విష్ఠుడైన, రాక్షసరాజైన హిరణ్యకశిపుని రాక్షసగణంతో సహా నేను సంహరిస్తాను.
బ్రహ్మోవాచ
భగవన్ భూతభవ్యేశ ఖిన్నా హ్యేతే భృశం సురాః ।
తస్మాత్ త్వం జహి దైత్యేంద్రం క్షిప్రం కాలోఽస్య మా చిరమ్ ॥
బ్రహ్మ ఇలా అన్నాడు - భూత భవిష్యద్వర్తమానాలకు అధిపుడవైన భగవంతుడా! ఈ దేవతలు మిక్కిలి దుఃఖించి ఉన్నారు. అందువల్ల ఆ రాక్షసరాజును త్వరగా సంహరించు. అందుకు ఇది తగిన సమయం. ఆలస్యం చేయవద్దు.
శ్రీభగవానువాచ
క్షిప్రం దేవాః కరిష్యామి త్వరయా దైత్యనాశనమ్ ।
తస్మాత్ త్వం విబుధాశ్చైవ ప్రతిపద్యత వై దివమ్ ॥
శ్రీవిష్ణుభగవానుడిలా అన్నాడు - దేవతలారా! నేను త్వరలో వేగంగా ఆ దైత్యుని నాశనం చేస్తాను. అందువల్ల నీవు, దేవతలు త్వరగా స్వర్గానికి వెళ్లండి.
భీష్మ ఉవాచ
ఏవముక్త్వా స భగవాన్ విసృజ్య త్రిదివేశ్వరాన్ ।
నరస్యార్ధతనుః కృత్వా సింహస్యార్ధతనుం తథా ॥
నరసింహేన వపుషా పాణిం నిష్పిష్య పాణినా ।
భీమరూపో మహాతేజాః వ్యాదితాస్య ఇవాంతకః ॥
భీష్ముడిలా అన్నాడు - ఇలా చెప్పి శ్రీమహావిష్ణువు ఇంద్రాదిదేవతలను వీడ్కొల్పి, నరుని సగందేహాన్ని సింహం యొక్క సగం దేహాన్ని గ్రహించి నరసింహశరీరంతో చేతితో చేతిని గట్టిగపట్టి, భయంకరరూపం, గొప్ప తేజస్సు కలవాడై నోరు తెరిచిన మృత్యువు వలె అయ్యాడు.
హిరణ్యకశిపుం రాజన్ జగామ హరిరీశ్వరః ।
దైత్యాస్తమాగతం దృష్ట్వా నారసింహం మహాబలమ్ ॥
వవర్షుః శస్త్రవర్షైస్తే సుసంక్రుద్ధాస్తదా హరిమ్ ।
రాజా! ఆ నరసింహరూపుడైన విష్ణువు హిరణ్యకశిపుని పైకి వెళ్లాడు. దైత్యులనాశనానికి వచ్చిన మహాబలుడైన ఆ నారసింహుని చుచి క్రుద్ధులై దైత్యులు శ్రీహరిపై శస్త్రవర్షాన్ని కురిపించారు.
తైర్విసృష్టాని శస్త్రాణి భక్షయామాస వై హరిః ॥
జఘాన చ రణే దైత్యాన్ సహస్రాణి బహూన్యపి ।
వారు తనపై విడిచిన శస్త్రాలను శ్రీహరి భక్షింపసాగాడు. వేలవేల రాక్షసులను యుద్ధంలో సంహరించాడు.
తాన్ నిహత్య చ దైత్యేంద్రాన్ సర్వాన్ క్రుద్ధాన్ మహాబలాన్ ॥
అభ్యధావత్ సుసంక్రుద్ధః దైత్యేంద్రం బలగర్వితమ్ ।
మహాబలవంతులు, క్రుద్ధులు అయిన ఆ రాక్షసాధిపులను సంహరించి, క్రుద్ధుడైన శ్రీహరి బలగర్వితుడై రాక్షసరాజయిన హిరణ్యకశిపుని దగ్గరకు పరుగెత్తాడు.
జీమూతఘనసంకాశః జీమూతఘననిస్వనః ॥
జీమూత ఇవ దీప్తౌజా జీమూత ఇవ వేగవాన్ ।
మేఘంలా నల్లని శరీరచ్ఛాయ, మేఘంలా గంభీరమైన కంఠధ్వని, మేఘంలా ఉద్దీప్తమైన తేజస్సు, మేఘం వంటి వేగమూ కల ఆ శ్రీహరి, (హిరణ్యకశిపుని దగ్గరకు పరువెత్తాడు)
దేవారిర్దితో దుష్టః నృసింహం సముపాద్రవత్ ॥
దేవతల శత్రువు, దుష్టుడూ అయిన ఆ దైత్యుడు నృసింహుని చూచి అతడివైపు పెరుగెత్తాడు.
దైత్యం సోఽతిబలమ్ దృష్ట్వా క్రుద్ధశార్దూలవిక్రమమ్ ।
దీప్తై ర్దైత్యగణైర్గుప్తం ఖరైర్నఖముఖైరుత ॥
తతః కృత్వా తు యుద్ధం వై తేన దైత్యేన వై హరిః ।
కోపించిన సింహంలా పరాక్రమిస్తున్న రాక్షసగణాలచే రక్షింపబడుతున్న మహాబలవంతుడైన ఆ దైత్యుని చూసి నృసింహుడు ప్రకాశిస్తున్న తన నఖాగ్రాలతో ఎదుర్కొని అతనితో యుద్ధం చేశాడు.
సంధ్యాకాలే మహాతేజాః ప్రఘాణే చ త్వరాన్వితః ॥
ఊరౌ నిధాయ దైత్యేంద్రం నిర్బిభేద నఖైర్హి తమ్ ।
సంధ్యాసమయంకాగానే మహాతేజస్వి అయిన నృసింహుడు ఆ రాక్షరాజును పట్టి, శీఘ్రంగా సింహద్వారపు గడపపై, నిలిచి తన తొడపై అతడి నుంచుకొని గోళ్ళతో చీల్చాడు.
మహాబలం మహావీర్యం వరదానేన దర్పితమ్ ॥
దైత్యశ్రేష్ఠం సురశ్రేష్ఠః జఘాన తరసా హరిః ।
ఈవిధంగా మహాబలుడు, మహావీర్యుడు, వరదానం చేత గర్వితుడు, దైత్యశ్రేష్ఠుడూ అయిన హిరణ్యకశిపుని శ్రీహరి వేగంగా చంపాడు.
హిరణ్యకశిపుం హత్వా సర్వ దైత్యాంశ్చ వై తదా ॥
విబుధానాం ప్రజానం చ హితం కృత్వా మహాద్యుతిః ।
ప్రముమోద హరిర్దేవః స్థాప్య ధర్మం తదా భువి ॥
రాక్షసులందరినీ, హిరణ్యకశిపుని చంపి, దేవతలకు మనుష్యులకు హితాన్ని చేకూర్చి, ఈ భూమిపై ధర్మాన్ని నిలబెట్టి మహాతేజస్వి అయిన శ్రీహరి ఆనందించాడు.
ఏష తే నారసింహోఽత్ర కథితః పాండునందన ।
శృణు త్వం వామనం నామ ప్రాదుర్భావం మహాత్మనః ॥
పాండునందనా! ఇంతవరకు నారసింహావతారకథను నీకు చెప్పాను. ఇక మహాత్ముడగు శ్రీహరి వామనుడుగా అవతరించిన విధం చెప్తాను, విను.
పురా త్రేతాయుగే రాజన్ బలిర్వైరోచనో ఽభవత్ ।
దైత్యానాం పార్ధివో వీరః బలేనాప్రతిమో బలీ ॥
రాజా! పూర్వం త్రేతాయుగంలో విరోచనుని కుమారుడు 'బలి' అనే రాక్షసరాజుండేవాడు. అతడు వీరుడు, సాటిలేని బలవంతుడు.
తదా బలిర్మహారాజ దైత్యసంఘైః సమావృతః ।
విజిత్య తరసా శక్రమ్ ఇంద్రస్థానమవాప సః ॥
అతడు తన దైత్యసంఘాలతో కూడి ఇంద్రుని ఓడించి, ఇంద్రస్థానాన్ని కైవశం చేసికొన్నాడు.
తేన విత్రాసితా దేవాః బలినాఽఽఖండలాదయః ।
బ్రహ్మాణం తు పురస్కృత్య గత్వా క్షీరోదధిం తదా ॥
తుష్టువుః సహితాః సర్వే దేవం నారాయణం ప్రభుమ్ ।
బలిచే భీతినొందిన ఇంద్రాదిదేవతలు బ్రహ్మను ముందుపెట్టుకొని క్షీరసముద్రం దగ్గరికి వెళ్లి, శ్రీమన్నారాయణ ప్రభువును స్తుతించారు.
స తేషాం దర్శనం చక్రే విబాధానం హరిః స్తుతః ॥
ప్రసాదజం హ్యస్య విభోః అదిత్యాం జన్మ చోచ్యతే ।
దేవతలచే స్తుతింపబడిన శ్రీహరి వారికి దర్శనమిచ్చాడు. వారిపై అనుగ్రహంతో అదితికి జన్మించాడు.
అదితేరపి పుత్రత్వమ్ ఏత్య యాదవనందనః ॥
ఏష విష్ణురితి ఖ్యాతః ఇంద్రస్యావరజోఽభవత్ ।
యదునందనుడగు శ్రీకృష్ణుడు అదితికి పుత్రుడుగా జన్మించి ఇంద్రునికి తమ్ముడై, విష్ణువుగా విఖ్యాతి చెందాడు.
తస్మిన్నేవ చ కాలే తు దైత్యేంద్రో వీర్యవాన్ బలిః ॥
అశ్వమేధం క్రతుశ్రేష్ఠమ్ ఆహర్తుముపచక్రమే ।
ఆ సమయంలోనే రాక్షసరాజైన బలి అశ్వమేధయాగాన్ని మొదలుపెట్టాడు.
వర్తమానే తదా యజ్ఞే దైత్యేంద్రస్య యుధిష్ఠిర ॥
స విష్ణుర్వామనో భూత్వా ప్రచ్ఛన్నో బ్రహ్మవేషధృక్ ।
ముండో యజ్ఞోపవీతీ చ కృష్ణాజినధరః శిఖీ ॥
పలాశదండం సంగృహ్య వామనోఽద్భుతదర్శనః ।
ప్రవిశ్య స బలేర్యజ్ఞే వర్తమానే తు దక్షిణామ్ ॥
దేహీత్యువాచ దైత్యేంద్రః విక్రమాంస్త్రీన్ మమైవ హ ।
యుధిష్ఠిరా! రాక్షసరాజు యొక్క యజ్ఞం జరుగుతుండగా విష్ణువు వామనుడై బ్రాహ్మణవేషంతో యజ్ఞోపవీతం, కృష్ణాజినం, పలాశదండం ధరించి, శిఖతో చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తూ యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. రాక్షసరాజును 'నాకు మూడడగులు దక్షిణగా ఇమ్ము' అని అడిగాడు.
దీయతాం త్రిపదీమాత్రమ్ ఇత్యయాచన్మహాసురమ్ ॥
స తథేతి ప్రతిశ్రుత్య ప్రదదౌ విష్ణవే తదా ।
'మూడడుగుల భూమి మాత్రమే నాకు దానమిమ్ము' అని ఆ మహాసురుని యాచించాడు. అతడు 'సరే' అని విష్ణువును దానమిచ్చాడు.
తేన లబ్ధ్వా హరిర్భూమిం జృంభయామాస వై భృశమ్ ।
స శిశుః సదివం ఖం చ పృథివీం చ విశాంపతే ॥
త్రిభిర్విక్రమణైరేతత్ సర్వమాక్రమతాభిభూః ।
బలేర్బలవతో యజ్ఞే బలినా విష్ణునా పురా ॥
విక్రమైస్త్రిభిరక్షోభ్యాః క్షోభితాస్తే మహాసురాః ।
అతని ద్వారా భూమిని పొంది శ్రీహరి విజృంభించాడు. ఆ వామనుడు ఆకాశాణ్ణి, స్వర్గాన్ని భూమిని ఈ సమస్తాన్ని తన మూడడుగులతో ఆక్రమించాడు. రాజా! ఇలా ఆ బలి చేస్తున్న యజ్ఞంలో శ్రీమహావిష్ణువు మూడడుగులతో సమస్త రాక్షసలోకాన్ని క్షోభింపజేశాడు.
విప్రచిత్తిముఖాః క్రుద్ధాః దైత్యసంఘా మహాబలాః ॥
నానావక్త్రాః మహాకాయాః నానావేషధరా నృప ।
మహాబలులు, అనేక ముఖాలు కలవారూ, మహాకాయులూ, అనేక వేషాలు ధరించిన విప్రచిత్తి మున్నగు ప్రధాన రాక్షస సంఘాలు కోపించాయి.
నానాప్రహరణా రౌద్రా నానామాల్యానులేపనాః ॥
స్వాన్యాయుధాని సంగృహ్య ప్రదీప్తా ఇవ తేజసా ।
క్రమమాణం హరిం తత్ర ఉపావర్తంత భారత ॥
భరతనందనా! అనేక ఆయుధాలు మాల్యాలు, లేపనాలు ధరించి, కోపంతో రుద్రులై తమతమ ఆయుధాలను స్వీకరించి తేజస్సుతో జ్వలిస్తున్న ఆ రాక్షసగణాలు విక్రమిస్తున్న శ్రీహరిని సమీపించాయి.
ప్రమథ్య సర్వాన్ దైతేయాన్ పాదహస్తతలైస్తు తాన్ ।
రూపం కృత్వా మహాభీమం జహారాశు స మేదినీమ్ ॥
సంప్రాప్య పాదమాకాశమ్ ఆదిత్యసదనే స్థితః ।
అత్యరోచత భూతాత్మా భాస్కరం స్వేన తేజసా ॥
ఆ రాక్షసులందరిని తన పాదాలతో, హస్తాలతో పీడించాడు. మహాభయంకరరూపంతో ఈ భూమినంతా ఆక్రమించాడు. అనంతరం ఆకాశమాక్రమించి సూర్యమండలంలో ప్రవేశించాడు. తన తేజస్సుతో సూర్యుని మిక్కిలి ప్రకాశింపజేశాడు.
ప్రకాశయన్ దిశః సర్వాః ప్రదిశశ్చ మహాబలః ।
శుశుభే స మహాబాహుః సర్వలోకాన్ ప్రకాశయన్ ॥
తస్య విక్రమతో భూమిం చంద్రాదిత్యే స్తనాంతరే ।
నభః ప్రక్రమమాణస్య నాభ్యాం కిల తదా స్థితౌ ।
అన్నిదిక్కులను, విదిక్కులను సర్వలోకాలను ప్రకాశింపజేస్తూ మహాబలుడు, మహాబాహువు అయిన విష్ణువు శోభిల్లాడు. భూమిపై విజృంభిస్తున్న అతని వక్షఃస్థలం మీద సూర్యచంద్రులున్నారు. ఆకాశాన్ని ఆక్రమిస్తున్న విష్ణువు నాభిలో సూర్యచంద్రులున్నారు.
పరాక్రమమాణస్య జానుభ్యాం తే వ్యవస్థితే ॥
విష్ణోరమితవీర్యస్య వదంత్యేవం ద్విజాతయః ।
అథాసాద్య కపాలం సః అండస్య తు యుధిష్ఠిర ॥
తచ్ఛిద్రాత్ స్యందినీ తస్య పాదాద్ భ్రష్టా తు నిమ్నగా ।
ససార సాగరం సాఽఽశు పావనీ సాగరంగమా ॥
పైపైకి విక్రమిస్తున్న విష్ణువు యొక్క మోకాళ్ల దగ్గరికి సూర్యచంద్రులున్నారు. ఈ విధమ్గా అమితపరాక్రమం గల విష్ణువు గురించి ద్విజులు వర్ణించారు. అనంతరం ఆవిధంగా విక్రమిస్తున్న విష్ణువుపాదాలు బ్రహ్మాండం యొక్క కపాలాన్ని తాకాయి. దానివల్ల కపాలంలో ఏర్పడిన ఛిద్రం నుండి స్రవించిన నీరు విష్ణుపాదం నుండి క్రిందపడి సాగరంలో కలిసింది.
జహార మేదినీం సర్వాం హత్వా దానవపుంగవాన్ ।
ఆసురీం శ్రియమాహృత్య త్రీంల్లోకాన్ స జనార్దనః ॥
సపుత్రదారానసురాన్ పాతాలే తానపాతయత్ ।
నముచిః శంబరశ్చైవ ప్రహ్లాదశ్చ మహామనాః ॥
పాదపాతాభినిర్ధూతాః పాతాలే వినిపాతితాః ।
మహాభూతాని భూతాత్మా స విశేషణ వై హరిః ॥
కాలం చ సకలం రాజన్ గాత్రభుతాన్యదర్శయత్ ।
ఆ జనార్దుడు భూమినంతా ఆక్రమించాడు. దానవులందరిని సంహరించాడు. ఆసురసంపదదంతా హరించాడు. పుత్రదారాది సహితులైన రాక్షసులను పాతాళంలో పడవేశాడు. నముచి, శంబరుడు, ప్రహ్లాదుడు మున్నగు వారంతా విష్ణువుపాదస్పర్శచే పవిత్రులై పవిత్రులై పాతాళంలో పడ్డారు. రాజా! భూతాత్ముడైన ఆ శ్రీహరి తన శరీరావయావాలలో పంచమహాభూతాలను, భూతభవిష్యద్వర్తమానకాలాలను చూపించాడు.
తస్య గాత్రే జగత్ సర్వమ్ ఆనీతమివ దృశ్యతే ॥
న కించిదస్తి లోకేషు యదవ్యాప్తం మహాత్మనా ।
తద్ధి రూపం మహేశస్య దేవదానవమానవాః ॥
దృష్ట్వా తం ముముహుః సర్వే విష్ణుతేజోఽభిపీడితాః ।
జగత్తంతా అతని శరీరంలోనికి తీసికొనిరాబడినట్లుగా కనబడుతోంది. మహాత్ముడైన విష్ణువు వ్యాపించని ప్రదేశం మూడులోకాలలో కొంచెం కూడా లేదు. ఆ శ్రీమహావిష్ణువు యొక్క రూపం చూసిన దేవ, దానవ మానవులు ఆ తేజస్సును తట్టుకొనలేక మూర్ఛనొందారు.
బలిర్బద్ధోఽభిమానీ చ యజ్ఞవాటే మహాత్మనా ।
విరోచనకులం సర్వం పాతాళే వినిపాతితమ్ ॥
అభిమానవంతుడైన బలి యజ్ఞవాటికయందే విష్ణువుచే బంధింపబడ్డాడు. విరోచనుని వంశాన్నంతా పాతాళంలో పడవేశాడు విష్ణువు.
ఏవంవిధాని కర్మాణి కృత్వా గరుడవాహనః ।
న విస్మయముపాగచ్ఛత్ పారమేష్ఠ్యేన తేజసా ॥
గరుడవాహనుడైన విష్ణువు తన పరమేశ్వర సంబంధమయిన తేజస్సుతో ఇటువంటి సత్ కర్మలు చేసి కూడా అహంకారాన్ని పొందలేదు.
స సర్వ మమరైశ్వర్యం సంప్రదాయ శచీపతేః ।
త్రైలోక్యం చ దదౌ శక్రే విష్ణు ర్దానవసూదనః ॥
దానవఘాతకుడైన విష్ణువు సమస్తమైన దేవతల సంపదను, ముల్లోకాలను శచీపతియైన ఇంద్రుని కిచ్చాడు.
ఏష తే వామనో నామ ప్రాదుర్భావో మహాత్మనః ।
వేదవిద్భిర్ద్విజైరేతత్ కథ్యతే వైష్ణవం యశః ॥
మానుషేషు యథా విష్ణోః ప్రాదుర్భావం తథా శృణు ॥
ఈవిధంగా మహాత్ముడైన విష్ణువు యొక్క వామనావతార కీర్తి వేదవేత్తలైన ద్విజులచే చెప్పబడుతోంది. ఇక విష్ణువు మనుష్యులలో అవతరిమ్చిన విధాన్ని చెపుతాను, విను.
విష్ణోః పునర్మహారాజ ప్రాదుర్భావో మహాత్మనః ।
దత్తాత్రేయ ఇతి ఖ్యాతః ఋషిరాసీన్మహాయశాః ॥
మహారాజ్! మహాయశుడైన విష్ణువు దత్తాత్రేయమహర్షిగా అవతరించడం మిక్కిలి ప్రసిద్ధిచెందింది.
తేన నష్టేషు వేదేషు క్రియాసు చ మఖేషు చ ।
చాతుర్వర్ల్యే చ సంకీర్ణే ధర్మే శిథిలతాం గతే ॥
అభివర్ధతి చాధర్మే సత్యే నష్టే స్థితేఽనృతే ।
ప్రజాసు క్షీయమాణాసు ధర్మేచాకులతాం గతే ॥
సయజ్ఞాః సక్రియా వేదాః ప్రత్యానీతాశ్చ తేన వై ।
చాతుర్వర్ణ్యమసంకీర్ణం కృతం తేన మహాత్మనా ॥
స ఏవ వై యదా ప్రాదాద్ హైహయాధిపతేర్వరమ్ ।
తం హైహయానామధిపస్త్వర్జునో ఽభిప్రసాదయత్ ॥
వేదాలు, యజ్ఞక్రియలు నశించాయి. చాతుర్వర్ణ్య వ్యవస్థ సంకరం చెందింది. ధర్మమ్ శిథిలావస్థకు చేరుకొంది. అధర్మం వృద్ధి చెందింది. సత్యం నశించింది. అసత్యం స్థిరపడింది. ప్రజలు క్షీణిస్తూ ఉన్నారు. ధర్మం వ్యాకులపాటుకు లోనయింది. అపుడు శ్రీహరి అవతారమైన దత్తాత్రేయమహర్షి యజ్ఞక్రియను, వేదాలను తిరిగి తీసుకువచ్చాడు. చాతుర్వర్ణ్య వ్యవస్థను సంకీర్ణం కాకుండా నిలిపాడు. అతడే హైహయరాజగు అర్జునునకు వరాన్ని ప్రసాదించాడు. హైహయరాజగు అర్జునుడు తన కర్మల ద్వారా దత్తాత్రేయుని ప్రసన్నుని చేసికొన్నాడు.
వనే పర్యచరత్ సమ్యక్ శుశ్రూఘరనసూయకః ।
నిర్మమో నిరంహంకారః దీర్ఘకాలమతోషయత్ ॥
ఆరాధ్య దత్తత్రేయం హి అగృహ్ణత్ స వరానిమాన్ ।
ఆప్తాదాప్తతరాద్ విప్రాద్ విద్వాన్ విద్వన్నిదేవితాత్ ॥
ఋతేఽమరత్వం విప్రేణ దత్తాత్రేయేణ ధీమతా ।
వరైశ్చతుర్భిః ప్రవృత ఇమాం స్తత్రాభ్యనందత ॥
అతడు వనంలో సంచరిస్తూ అసూయలేకుండా దత్తాత్రేయుని సేవిస్తూ అహంకారమమకారాలు విడిచి చాలాకాలం దత్తాత్రేయుని ఆరాధించి సంతోషపెట్టి అతడి వల్ల వరాలను పొందాడు. దత్తాత్రేయమహర్షి మిక్కిలి ఆప్తుల కంటె ఆప్తుడు. గొప్ప గొప్ప విద్వాంసులతనిని సేవిస్తూన్నారు. ధీశాలి అయిన దత్తాత్రేయుడు అమరత్వం తప్ప, తక్కిన వరాలను నాల్గింటిని అర్జునునకు ఇచ్చాడు. అర్జునుడు వరాలిలా కోరాడు.
శ్రీమాన్ మనస్వీ బలవాన్ సత్యవాగనసూయకః ।
సహస్రబాహూర్భూయాసమ్ ఏష మే ప్రథమో వరః ॥
జరాయుజాండజం సర్వం సర్వం చైవ చరాచరమ్ ।
ప్రశాస్తుమిచ్ఛే ధర్మేణ ద్వితీయ స్త్వేష మే వరః ॥
శ్రీమంతుడను, మనస్విని, బలవంతుడను, సత్యవాక్కును, అసూయలేనివాడను, వేయి బాహువులు కలవాడను కావాలి. ఇది నా మొదటి వరం. జరాయుజాలు, అండజములు నివసించే సమస్త చరాచరవిశ్వాన్ని ధర్మంగా నేను పరిపాలింపగోరుతున్నాను. ఇది నా రెండవ వరం.
పితౄన్ దేవానృషీన్ విప్రాన్ యజేయం విపులై ర్మఖైః ।
అమిత్రాన్ నిశితై ర్బాణైః ఘాతయేయం రణాజిరే ॥
దత్తాత్రేయే హ భగవంస్తృతీయో వర ఏష మే ।
యస్య నాసీన్న భవితా న చాస్తి సదృశః పుమాన్ ।
ఇహ వా దివి వా లోకే స మే హంతా భవేదితి ॥
పితరులను, దేవతలను, ఋషులను, విప్రులను పెద్ద పెద్ద యజ్ఞాలచే పూజించాలి. యుద్ధంలో శత్రువులను తీక్ష్ణమైన బాణాలతో నేను సంహరించాలి. దత్తాత్రేయమహర్షీ! ఇది నా మూడో వరం. ఈ భూమిపైగాని, స్వర్గంలో గాని భూతభవిష్యత్తులలో సాటిలేనివాడే నన్ను చంపాలి.
సోఽర్జునః కృతవీర్యస్య వరః పుత్రోఽభవద్ యుధి ।
స సహస్రం సహస్రాణాం మాహిష్మత్యామ్ అవర్ధత ॥
హైహయరాజయిన ఆ అర్జునుడు కృతవీర్యుని జ్యేష్ఠకుమారుడు. అతడు యుద్ధంలో ఆరితేరినవాడు. అతడు మాహిష్మతీ నగరంలో ఉండి వేలవేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు.
పృథివీమఖిలాం జిత్వా ద్వీపాం శ్చాపి సముద్రిణః ।
నభసేవ జ్వలన్ సూర్యః పుణ్యైః కర్మభిరర్జునః ॥
సముద్రంలో ఉన్న ద్వీపాలతో పాటు సమస్తభూమండలాన్ని జయించాడు. తన పుణ్యకర్మలచేత కార్తవీర్యార్జునుడు ఆకాశంలో సూర్యునిలా ప్రసాశించాడు.
ఇంద్రద్వీపం కశేరుం చ తామ్రద్వీపం గభస్తిమత్ ।
గాంధర్వం వారుణం ద్వీపం సౌమాక్ష్యమితి చ ప్రభుః ॥
పూర్వైరజితపూర్వాశ్చ ద్వీపానజయదర్జునః ॥
సౌవర్ణ సర్వమప్యాసీద్ విమానవరముత్తమమ్ ।
చతుర్దా వ్యభజద్ రాష్ట్రం తద్ విభజ్యాన్వపాలయత్ ॥
ఇంద్రద్వీపం, కశేరుద్వీపం, తామ్రద్వీపం, గభస్తిమద్ద్వీపం, గంధర్వద్వీపం, వరుణద్వీపం, సౌమ్యాక్షద్వీపం మున్నగు తన పూర్వులు జయింపలేని ద్వీపాలను జయించి తన అధికారాన్ని విస్తరించాడు. అతని రాజభవనమంతా స్వర్ణమయం, శ్రేష్ఠం. అతడు రాజ్యంలోని ఆదాయాన్ని నాలుగు భాగాలుగా విభజించి, తదనుగుణంగా రాజ్యపాలన చేశాడు.
ఏకాంశేనాహరత్ సేనామ్ ఏకాంశేనావసద్ గృహాన్ ।
యస్తు తస్య తృతీయాంశః రాజాఽఽసీజ్జనసంగ్రహే ॥
ఆప్తః పరమకళ్యాణః తేన యజ్ఞానకల్పయత్ ॥
అందలి ఒక భాగంతో సేనను సంగ్రహించుకొనేవాడు, ఒక భాగం గృహస్థుల కోసం మూడవ భాగం జనుల సంక్షేమం కోసం ఉపయోగిస్తూ ఆప్తుడు, పరమకల్యాణకారి అయిన అర్జునుడు యజ్ఞాలను చేశాడు.
యే దస్యవో గ్రామచరాః అరణ్యే చ వసంతి యే ।
చతుర్థేన చ సోంఽశేన తాన్ సర్వాన్ ప్రత్యదేధయత్ ॥
సర్వేభ్యశ్చాంతవాసిభ్యః కార్తవీర్యోఽహరద్ బలిమ్ ।
ఆహృతం స్వబలైర్యత్ తదర్జునశ్చాభిమన్యతే ॥
కాకో వా మూషికో వాపి తం తమేవ న్యబర్హయత్ ।
ద్వారాణి నాపిధీయంతే రాష్ట్రేషు నగరేషు చ ॥
నాల్గవభాగంతో గ్రామాలలో అరణ్యంలో ఉండే దొంగలను, దోపిడీ దారులను అందరినీ కట్టడి చేశాడు. సరిహద్దులలో ఉన్నవారందరి నుండి పన్ను స్వీకరించేవాడు. తాను సైన్యబలంతో సంపాదించిన ధనాన్ని గొప్పదిగా భావించేవాడు. కాకిలా గాని, ఎలుకలా గాని ప్రజలధనాన్ని అపహరించేవారిని నియంత్రించేవాడు, రాజ్యంలోని గ్రామాలలోను, నగరాలలోను ద్వారాలను మూసేవారుకాదు.
స ఏవ రాష్ట్రపాలోఽభూత్ స్త్రీపాలో ఽభవదర్జునః ।
స ఏవాసీదజాపాలః స గోపాలో విశాంపతే ॥
రాజా! కార్తవీర్యార్జునుడే రాజ్యానికి పాలకుడు. అతడే స్త్రీలకు రక్షకుడు, అతడే మేకలకు సంరక్షకుడు, అతడే గోపాలకుడు కూడ.
స స్మారణ్యే మనుష్యాణాం రాజా క్షేత్రాణి రక్షతి ।
ఇదం తు కార్తవీర్యస్య బభూవాసదృశం జనైః ॥
అతడే అరణ్యంలో మనుష్యులను, పొలాలను రక్షించేవాడు. కార్తవీర్యార్జునుని ఈ కార్యవిధానం మానవులకు అసాధారణమైంది.
న పూర్వే నా పరే తస్య గమిష్యంతి గతిం నృపాః ।
యదర్ణవే ప్రయాతస్య వస్త్రం న పరిష్యతే ॥
శతం వర్షసహస్రాణామ్ అనుశిష్యార్జునో మహీమ్ ।
దత్తాత్రేయ ప్రసాదేవ ఏవం రాజ్యం చకార సః ॥
అతనికి ముందున్న రాజులు కాని, తరువాత నున్న రాజులు కాని అతని స్థితిని పొందలేదు. సముద్రంలో వెళ్ళినా అతని వస్త్రం తడవదు. ఈ విధంగా దత్త్రాత్రేయుని అనుగ్రహం చేత లక్షసంవత్సరాలు ఈ భూమిని శాసించి, రాజ్యపాలన చేశాడు.
ఏవం బహూని కర్మాణి చక్రే లోకహితాయ సః ।
దత్తాత్రేయ ఇతి ఖ్యాతః ప్రాదుర్భావస్తు వైష్ణవః ॥
కథితో భరతశ్రేష్ఠ శృణు భూయో మహాత్మనః ॥
యదా భృగుకులే జన్మ యదర్థం చ మహాత్మనః ।
జామదగ్న్య ఇతి ఖ్యాతః ప్రాదుర్భావస్తు వైష్ణవః ॥
ఈవిధంగా కార్తవీర్యార్జునుడు లోకహితం కోసం చాలా పనులు చేశాడు. ఇంతవరకు దత్తాత్రేయుడని ప్రసిద్ధి చెందిన విష్ణువు యొక్క అవతారాన్ని గురించి చెప్పాను. భరతశ్రేష్ఠా! భృగుకులంలో మహాత్ముడై జామదగ్న్యుడని ప్రసిద్ధి చెందిన విష్ణువు యొక్క అవతారం గురించి చెపుతాను. విను.
జమదగ్నిసుతో రాజన్ రామో నామ స వీర్యవాన్ ।
హైహయాంతకరో రాజన్ స రామో బలినాం వరః ॥
కార్తవీర్యో మహావీర్యః బలేనాప్రతిమస్తథా ।
రామేణ జామదగ్న్యేన హతో విషమమాచరన్ ॥
రాజా! జమదగ్ని కుమారుడు పరశురాముడు గొప్ప పరాక్రమవంతుడు. బలవంతులలో శ్రేష్టుడు. అటహ్డు హైహయరాజయిన కార్తవీర్యుని సంహరించాడు. కార్తవీర్యుడు మహాపరాక్రమవంతుడు. బలంలో అతనికి సాటి లేదు. కాని అనుచితంగా ప్రవర్తించటం చేత జమదగ్ని కుమారుడు పరశురాముడు అతనిని సంహరించాడు.
తం కార్తవీర్యం రాజానం హైయయానామరిందమమ్ ।
రథస్థం పార్థివం రామః పాతయిత్వావధీన్ రణే ॥
శత్రుమర్దనుడు, హైహయరాజగు కార్తవీర్యార్జునుడు రథస్థుడై ఉండగా పరశురాముడు అతనిని కిందపడవేసి సంహరించాడు.
జంభస్య మూర్థ్ని భేత్తా చ హంతా చ శతదుందుభేః ।
స ఏష కృష్ణో గోవిందః జాతో భృగుషు వీర్యవాన్ ॥
సహస్రబాహుముద్ధర్తుం సహస్రజితమాహవే ।
క్షత్రియాణాం చతుష్టష్టిమ్ అయుతానాం మహాయశాః ।
సరస్వత్యాం సమేతాని ఏష వై ధనుషాజయత్ ॥
బ్రహ్మద్విషాం వధే తస్మిన్ సహస్రాణి చతుర్దశ ।
పునర్జగ్రాహ శూరాణాం అంతం చక్రే నరర్షభః ॥
తతో దశసహస్రస్య హంతా పూర్వమరిందమః ।
సహస్రం ముసలేనాహన్ సహస్రముదకృంతత ॥
గోవిందుడే భృగువంశంలో పరశురామునిగా అవతరించాడు. అతడే జంభాసురుని, శతదుందుభిని సంహరించిన శ్రీకృష్ణుడు. సహస్రబాహువు అయిన కార్తవీర్యార్జునుని యుద్ధంలో సంహరించడానికి అవతరించాడు. మహాయశస్వి అయిన పర్శురాముడు సరస్వతీనదీ తీరాన ఆరు లక్షల నలభైవేల మంది క్షత్రియులను కేవలం వింటితో సంహరించాడు. వారంతా బ్రహ్మద్వేషులు. మరల పదునాల్గువేల వీరులను సంహరించాడు. అనంతరం పదివేల మంది క్షత్రియులను అంతమొందించాడు. వేయిమందిని ముసలంతో చంపాడు. వేయిమందిని శూలాలతో చంపాడు.
చతుర్దశ సహస్రాణి క్షణమాత్రమపాతయత్ ।
శిష్టాన్ బ్రహ్మద్విషశ్ఛిత్త్వా తతోఽస్నాయత భార్గవః ॥
రామ రామ్యేతభిక్రుష్టః బ్రాహ్మణైః క్షత్రియార్దితైః ।
న్యఘ్నద్ దశసహస్రాణి రామః పరశునాభిభూః ॥
పరశురాముడు పద్గునాల్గువేలమందిని క్షణకాలంలో పడగొట్టాడు. బ్రహ్మద్వేదులుగా మిగిలిన వారినందరిని సంహరించి తలపెట్టిన కార్యసమాప్తి సూచకంగా స్నానం చేశాడు. క్షత్రియులచే హింసింపబడిన బ్రాహ్మణులంతా 'రామా! రామా!' అని ఆక్రోశించగా, పరశురాముడు తన పరశువుతో పదివేలమందిని సంహరించాడు.
న హ్యమృష్యత తాః వాచమ్ ఆర్తైర్భృశముదీరితామ్ ।
భృగో రామాభిధావేతి యదాక్రందన్ ద్విజాతయః ॥
'భృగునందనా! రామా! పరిగెత్తుకురా!' అనే బ్రాహ్మణుల ఆర్తనాదాలను అతడు సహింపలేకపోయేవాడు.
కాశ్మీరాన్ దరదాన్ కుంతీన్ క్షుద్రకాన్ మాలవాన్ శకాన్ ।
చేది కాశి కరూషాంశ్చ ఋషికాన్ క్రథ కైశికాన్ ॥
అంగాన్ వంగాన్ కళింగాంశ్చ మాగధాన్ కాశి కోసలాన్ ।
రాత్రాయణాన్ వీతిహోత్రాన్ కిరాతాన్ మార్తికావతాన్ ॥
ఏతానన్యాంశ్చ రాజేంద్రాన్ దేశే దేశే సహస్రశః ।
నికృత్త్య నిశితైర్బాణైః సంప్రదాయ వివస్వతే ॥
కాశ్మీర, దరద, కుంతిభోజ, క్షుద్రక, మాలవ, శక, చేది, కాశి, కరూష, ఋషీక, క్రథ, కైశిక, అంగ, వంగ, కలింగ, మగధ, కాశీ, కోసల, రాత్రాయణ, వీతహోత్ర, కిరాత, మార్తి కావతాది క్షత్రియులను, ఇంకా వేలాది క్షత్రియులను తన వాడి బాణాలతో సంహరించి యమునికి అప్పజెప్పాడు.
కీర్ణా క్షత్రియకోటిభిః మేరుమందరభూషణా ।
త్రిః సప్తకృత్వః పృథివీ తేన నిఃక్షత్రియా కృతా ॥
మేరు, మంధర పర్వతాలు అలంకారంగా గల భూమండలంలో వ్యాపించి ఉన్న కోట్లమంది క్షత్రియులను ఇరువది ఒక్కమార్లు సంహరించి, భూమిని క్షత్రియరహితం చేశాడు.
ఏవమిష్ట్వా మహాబాహుః క్రతుభిర్భూరిదక్షిణైః ।
అన్యద్ వర్షశతం రామః సౌభే శాల్వమయోధయత్ ॥
తతః స భృగుశార్దూలస్తం సౌభం యోధయన్ ప్రభుః ।
సుబంధురం రథం రాజన్ ఆస్థాయ భరతర్షభ ॥
నగ్నికానాం కుమారీణాం గాయంతీనాముపాశృణోత్ ।
అనంతరం పరశురాముడు గొప్ప దక్షిణలతో యజ్ఞాలను చేశాడు. మరొక నూరు సంవత్సరాలు సౌభమనే పేరు గల విమానంలో ఎక్కిన సాల్వునితో యుద్ధం చేస్తూ, అప్రశురాముడు నగ్నికలయిన (రజస్వలలు కాని) కుమారికల నుండి వెలువడిన ఈ గానాన్ని విన్నాడు.
రామ రామ మహాబాహో భృగూణాం కీర్తివర్ధన ॥
త్యజ శస్త్రాణి సర్వాణి న త్వం సౌభం వధిష్యసి ।
చక్రహస్తో గదాపాణిః భీతానామభయంకరః ॥
యుధి ప్రద్యుమ్నసాంబాభ్యాం కృష్ణః సౌభం వధిష్యతి ।
'రామా! రామా! మహాబాహూ! భౄగవంశకీర్తివర్ధనా! నీవు శస్త్రాలను విడిచిపెట్టు. నీవు ఈ సౌభవిమానాన్ని నాశనం చేయలేవు. భీతులైనవారికి అభయాన్నిచ్చే చక్రహస్తుడు, గదాపాణి అయిన శ్రీకృష్ణుడు ప్రద్యుమ్న, సాంబులతో కలిసి ఈ సౌభాన్ని నాశనం చేస్తాడు.'
తచ్ఛ్రుత్వా పురుషవ్యాఘ్రః తత ఏవ వనం యయౌ ॥
న్యస్య సర్వాణి శస్త్రాణి కాలకాంక్షీ మహాయశాః ॥
రథం వర్మాయుధం చైవ శరాన్ పరశుమేవ చ ।
ధనూంష్యప్సు ప్రతిష్ఠాప్య రాజంస్తేపే పరంతపః ॥
ఆ గానం విని పురుషవ్యాఘ్రుడైన పరశురాముడు వనానికి వెళ్ళాడు. సర్వశస్త్రాలను, రథాన్ని, కవచాన్ని, ఆయుధాన్ని, ధనుర్ బాణాలను, పరశువును, నీళ్లలో పడవేసి, తగినకాలం కోసం ఎదురుచూస్తూ, గొప్ప తపస్సు చేశాడు.
హ్రియం ప్రజ్ఞాం శ్రియం కీర్తిం లక్ష్మీం చామిత్రకర్శనః ।
పంచాధిష్ఠాయ ధర్మాత్మా తం రథం విససర్జ హ ॥
ధర్మాత్ముడు, శత్రుమర్దనుడైన పరశురాముడు లజ్జ, ప్రజ్ఞ, సంపద, కీర్తి, లక్ష్మి, ఈ ఐదింటిని ఆశ్రయించి రథాన్ని విడిచిపెట్టాడు.
ఆదికాలే ప్రవృత్తమ్ హి విభజన్ కాలమీశ్వరః ।
నాహనచ్ఛ్రద్ధయా సౌభం న హ్యశక్తో మహాయశాః ॥
జామదగ్న్య ఇతి ఖ్యాతః యస్త్వసౌ భగవానృషిః ।
సోఽస్య భాగస్తపస్తేపే భార్గవో లోకవిశ్రుతః ॥
శృణు రాజంస్తతా విష్ణోః ప్రాదుర్భావం మహాత్మనః ।
చతుర్వింశే యుగే చాపి విశ్వామిత్రపురః సరః ॥
ఇది ఆదికాలంలో జరిగింది. ఆదికాలంలో నున్న కాలాన్ని విభజించి పరశురాముడు నగ్ని కల మాటపై శ్రద్ధ నుంచి సౌభుని నాశనం చేయలేదు. అంతేకాని అసమర్థుడై కాదు. జమదగ్ని కుమారుడై పరశురాముడని ప్రసిద్ధి చెందిన అమహర్షి ప్రస్తుతం తపోనిష్ఠలో ఉన్నాడు. ఈవిధంగా పరశురాముడు లోక విశ్రుతుడయ్యాడు.
రాజా! ఇరవై నాలుగో యుగంలో విశ్వామిత్రుని ఎదుటపెట్టుకొని మహాత్ముడైన శ్రీమహావిష్ణువు శ్రీరామునిగా అవతరించాడు. దాని గురించి చెప్తాను విను.
తిథౌ నావమికే జజ్ఞే తథా దశరథాదపి ।
కృత్వాఽఽత్మనం మహాబాహుః శ్చతుర్ధా విష్ణురవ్యయః ॥
అవ్యయుడైన శ్రీమహావిష్ణువు తన్ను తాను నాలుగుభాగాలుగా విభజించుకొని దశరథునికి నవమి రోజున జన్మించాడు.
లోకే రామ ఇతి ఖ్యాతః తేజసా భాస్కరోపమః ।
ప్రసాదనార్థం లోకస్య విష్ణుస్తస్య సనాతనః ॥
ధర్మార్థమేవ కౌంతేయ జజ్ఞే తత్ర మహాయశాః ।
కౌంతేయా! సనాతనుడైన విష్ణువు లోకాన్ని అనుగ్రహించడం కోసం, ధర్మం కోసం సూర్య తేజస్సుతో శ్రీరామునిగా జన్మించి కీర్తిమంతుడయ్యాడు.
తమప్యాహుర్మనుష్యేంద్రం సర్వభూతపతేస్తనుఅమ్ ॥
యజ్ఞవిఘ్నం తదా కృత్వా విశ్వామిత్రస్య భారత ।
సుబాహుర్నిహతస్తేన మారీచస్తాడితో భృశమ్ ॥
భారతా! మనుష్యేంద్రుడైన ఆ శ్రీరాముని సర్వభూతపతి అయిన విష్ణువు యొక్క స్వరూపంగా చెప్తారు. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్న సుబాహుని అతడు సంహరించాడు. అలాగే మారీచుని బాగా దెబ్బకొట్టాడు.
తస్మై దత్తాని శస్త్రాణి విశ్వామిత్రేణ ధీమతా ।
వధార్థం దేవశత్రూణాం దుర్వారాణి సురైరపి ॥
ధీశాలి అయిన విశ్వామిత్రుడు దేవశత్రుసంహారం కోసం ఆ శ్రీరామునికి దేవతలచే కూడ నివారింపశక్యంగాని శస్త్రాలు ఇచ్చాడు.
వర్తమానే తదా యజ్ఞే జనకస్య మహాత్మనః ।
భగ్నం మాహేశ్వరం చాపం క్రీడతా లీలయా పరమ్ ॥
తతో వివాహం సీతాయాః కృత్వా స రఘువల్లభః ।
నగరీం పునరాసాద్య ముముదే తత్ర సీతయా ॥
మహాత్ముడైన జనకుడు ధనుర్యాగంలో ఉండగా, రాముడు లీలగా శివధనుస్సును ఎక్కుపెడితే అది విరిగిపోయింది. తరువాత రాముడు సీతను వివాహం చేసికొని అయోధ్యనగరానికి వచ్చి సీతతో ఆనందంగా ఉన్నాడు.
కస్యచిత్ త్వథ కాలస్య పిత్రా తత్రాభిచోదితః ।
కైకేయ్యాః ప్రియమన్విచ్ఛన్ వనమభ్యవపద్యత ॥
కొంతకాలం తర్వాత కైకేయి కోరిక తీర్చటానికి తండ్రి పంపితే అరణ్యానికి వెళ్లాడు.
యః సమాః సర్వధర్మజ్ఞః చతుర్దశ వనే వసన్ ।
లక్ష్మణానుచరో రామః సర్వభూతహితే రతః ॥
చతుర్దశ వనే తప్త్వా తపో వర్షాణి భారత ।
రూపిణే యస్య పార్శ్వస్థా సీతేత్యభిహితా జనైః ॥
భరతనందనా! సర్వధర్మాలు తెలిసిన ఆ రాముడు లక్ష్మణుడు వెన్నంటి ఉండగా, సర్వప్రాణుల హితాన్ని కోరుతూ పదనాల్గు సంవత్సరాలు వనంలో నివసించసాగాడు. అతడు ఆ పదునాల్గు సంవత్సరాలు అడవిలో అపూర్వమైన తపస్సు చేశాడు. అతనితో కూడా ఉన్న రూపవతియైన స్త్రీని సీత అని జనులంతా అంటారు.
పూర్వోచితత్వాత్ సా లక్ష్మీః భర్తారమనుగచ్ఛతి ।
జనస్థానే వసన్ కార్యం త్రిదశానాం చకార సః ॥
మారీచం దూషణం హత్వా ఖరం త్రిశిరసం తథా ।
చతుర్దశ సహస్రాణి రక్షసామ్ ఘోరకర్మణామ్ ॥
జఘాన రామో ధర్మాత్మా ప్రజానాం హితకామ్యయా ।
మునుపే విష్ణుమూర్తి భార్యగా ఉన్న లక్ష్మి, యోగ్యమైనందువల్ల రామునిగా అవతరించినపుడు భర్తను సీతగా అనుసరించింది. జనస్థానంలో నివసిస్తూ దేవతల కార్యాన్ని రాముడు చేశాడు. మారీచుని, ఖర, దూషణులను, త్రిశిరసుని సంహరించాడు. ధర్మాత్ముడైన రాముడు ప్రజలహితాన్ని కోరుతూ పదునాల్గు సంవత్సరాలు రాక్షసులను సంహరించాడు.
విరాధం చ కబంధం చ రాక్షసౌ క్రూరకర్మిణౌ ।
జఘాన చ తదా రామః గంధర్వౌ శపవిక్షతౌ ॥
శాపగ్రస్తులైన గంధర్వులిద్దరు క్రూరకర్ములైన విరాధుడు, కబంధుడు అనే రాక్షసులలిద్దరిని రాముడు సంహరించాడు.
స రావణస్య భగినీ నాసాచ్ఛేదం చకార హ ।
భార్యావియోగం తం ప్రాప్య మృగయన్ వ్యచరద్ వనమ్ ॥
తతస్తమృష్యమూకం స గత్వా పంపామతీత్య చ ।
సుగ్రీవం మారుతిం దృష్ట్వా చక్రే మైత్రీం తయోః స వై ॥
అతడు రావణుని సోదరియైన శూర్పణఖ యొక్క ముక్కు కోశాడు. అందువల్ల భార్యావియోగాన్ని పొంది వనంలో ఆమెను వెతుకుతూ తిరిగాడు. తరువాత అతడు ఋష్యమూక పర్వతానికి చేరుకొని, పంపాసరోవరాన్ని దాటి, సుగ్రీవహనుమంతులను చూచి, వారితో మైత్రి చేశాడు.
అథ గత్వా స కిష్కింధాం సుగ్రీవేణ తదా సహ ।
నిహత్య వాలినం యుద్ధే వానరేంద్రం మహాబలమ్ ॥
అభ్యషించత్ తదా రామః సుగ్రీవం వానరేశ్వరమ్ ।
తతః స వీర్యవాన్ రాజన్ త్వరయన్ వై సముత్సుకః ।
విచిత్య వాయుపుత్రేన లంకాదేశం నివేదితమ్ ॥
పిమ్మట సుగ్రీవునితో కిష్కింధకు వెళ్లి, యుద్ధంలో బలవంతుడైన వానరేంద్రుని - వాలిని - చంపి, సుగ్రీవుని వానరేశ్వరునిగా అభిషిక్తుని చేశాడు. అనంతరం బలవంతుడైన శ్రీరాముడు సీతజాడ వెదకటానికి వారిని తొందరపెట్టాడు. వాయుపుత్రుడైన హనుమంతుడు వెదకి సీత లంకలో ఉన్నట్లుగా నివేదించాడు.
సేతుం బద్ ధ్వా సముద్రస్య వానరైః సహితస్తదా ।
సీతాయాః పదమన్విచ్ఛన్ రామో లంకాం వివేశహ ॥
సముద్రానికి సేతువును కట్టి, వానరులతో సహితంగా సీత ఉన్న స్థానాన్ని వెతుకుతూ రాముడు లంకలో ప్రవేశించాడు.
దేవోరగగణానాం హి యక్షరాక్షసపక్షిణామ్ ।
తత్రావధ్యం రాక్షసేంద్రం రావణం యుధి దుర్జయమ్ ॥
యుక్తం రాక్షసకోటీభిః భిన్నాంజనచయోపమమ్ ।
దేవతలకు, నాగగణాలకు, యక్ష, రాక్షస, పక్షి గణాలకు చంపశక్యంగాని, దుర్జయుడైన రావణుడు యుద్ధంలో ముక్కలైన పర్వతశకల సముదాయంలా ఉన్న రాక్షసకోటులతో కూడి ఉన్నాడు.
దుర్నిరీక్ష్యం సురగణైః వరదానేన దర్పితమ్ ।
జఘాన సచివైః సార్ధం సాన్వయం రావణం రణే ।
త్రైలోక్యకంటకం వీరం మహాకాయం మహాబలమ్ ॥
రావణం సగణం హత్వా రామో భూతపతిః పురా ॥
లంకాయాం తం మహాత్మానం రాక్షసేంద్రం విభీషణమ్ ।
అభిషిచ్య చ తత్రైవ అమరత్వం దదౌ తదా ॥
వరదానగర్వంతో దేవతలకు కుడా అశక్యుడై సచివులతో, వంశీయులతో ఉన్న ఆ త్రైలోక్యకంటకుడు, వీరుడు, మహాకాయుడు, మహాబలుడు అయిన రావణుని రాముడు రాక్షసగణసహితంగా యుద్ధంలో సంహరించాడు. అనంతరం సర్వభూతపతి అయిన శ్రీరాముడు మహాత్ముడైన విభీషణుని లంకలో రాక్షసరాజుగా అభిషిక్తుని చేసి అక్కడే అతడికి అమరత్వాన్ని ప్రసాదించాడు.
ఆరుహ్య పుష్పకం రామః సీతామాదాయ పాండవ ।
సబలం స్వపురం గత్వా ధర్మరాజ్యమపాలయత్ ॥
దానవో లవణో నామ మధోః పుత్రో మహాబలః ।
శత్రుఘ్నేన హతో రాజన్ తతో రామస్య శాసనాత్ ।
పాండునందనా! సీతతో పాటు రాముడు పుష్పకాన్ని ఎక్కి తనవారితో పాటు తన నగరానికి వెళ్ళి ధర్మరాజ్యాన్ని పాలించాడు. అటుపై రామశాసనం వల్ల శత్రుఘ్నుడు మధుపుత్రుడు, మహాబలవంతుడూ అయిన లవణాసురుని సంహరించాడు.
ఏవం బహూని కర్మాణి కృత్వా లోకహితాయ సః ।
రాజ్యం చకార విధివద్ రామో ధర్మభృతాం వరః ॥
ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఈవిధంగా లోకహితం కొరకు చాలా సత్ కర్మల నాచరించి, యథావిధిగా రాజ్యాన్ని పరిపాలించాడు.
దశాశ్వమేధానాజహ్రే జారుధిస్థాన్ నిరర్గలాన్ ॥
నాశ్రూయంతాశుభా వాచః నాత్యయః ప్రాణినాం తదా ।
న విత్తజం భయం చాసీద్ రామే రాజ్యం ప్రశాసతి ॥
ప్రాణినాం చ భయం నాసీజ్జలానలవిధానజమ్ ।
పర్యదేవన్న విధవా నానాథాః కాశ్చనా భవన్ ॥
సరయూనదీతీరంలో జారుధి అనే ప్రదేశంలో నిరాటంకంగా పది అశ్వమేధయాగాలు చేశాడు. అపుడు అశుభమైన మాటలు ఎవరూ వినలేదు. ప్రాణుల వినాశం జరగలేదు. రాముడు రాజ్యం పాలిస్తూండగా ధన భయం కలగలేదు. నీటివల్ల కాని నిప్పు వల్లగాని ప్రాణులకు భయం లేదు. భర్తలు మరణించి కాని, అనాథలై గాని స్త్రీలు ఎవరూ దుఃఖించలేదు.
సర్వమాసీత్ తదా తృప్తం రామే రాజ్యం ప్రశాసతి ॥
న సంకరకరా వర్ణాః నాకృష్టకరకృజ్జనః ।
రాముడు రాజ్యం పాలిస్తూండగా, అందరూ తృప్తిగా జీవించారు. వర్ణాలు సంకరం కాలేదు. జనులు వ్యవసాయం మానలేదు.
న చ స్మ వృద్ధా బాలానాం ప్రేత్యకార్యాణి కుర్వతే ॥
విశః పర్యచరన్ క్షత్రం క్షత్రం నాపీడయద్ విశః ।
నరా నాత్యచరన్ భార్యాః భార్యానాత్యచరణ్ పతీన్ ॥
నాసీదల్పకృషిర్లోకే రామే రాజ్యం ప్రశాసతి ।
ఆసన్ వర్షసహస్రాణి తథా పుత్రసహస్రిణః ।
అరోగాః ప్రాణినో ఽప్యాసన్ రామే రాజ్యం ప్రశాసతి ॥
రాముడు రాజ్యం చేస్తుండగా, వృద్ధులు చిన్నవారికి ప్రేతకర్మలు చేసే అవసరం రాలేదు. క్షత్రియులను వైశ్యులు సేవించేవారు. క్షత్రియులు వారిని పీడించేవారు కాదు. పురుషులు తమ భార్యలను అవమానించేవారు కాదు. స్త్రీలు కూడ తమ భర్తలను అవహేళన చేసేవారు కాదు. జనులు ఎక్కువగా వ్యవసాయం చేసేవాడు. జనులు వేలవేల పుత్రులతో ఉండి, రోగాలు లేకుండా, వేలసంవత్సరాలు జీవించేవారు.
ఋషీణాం దేవతానాం చ మనుష్యాణాం తథైవ చ ।
పృథివ్యాం సహవాసోఽభూద్ రామే రాజ్యం ప్రశసతి ॥
సర్వే హ్యాసంస్తృప్తరూపాః తదా తస్మిన్ విశాంపతే ।
ధర్మేణ పృథివీం సర్వామ్ అనుశాసతి భూమిపే ॥
రాముడు రాజ్యపాలన చేస్తూండగా ఈ భూమిపై ఋషులు, దేవతలు, మనుష్యులు సహజీవనం చేశారు. రాజా! అపుడు వారందరూ తృప్తితో జీవించారు. రాముడు ధర్మంతో భూమినంతా శాసించాడు.
తపస్వీవాభవన్ సర్వే సర్వే ధర్మమనువ్రతాః ।
పృథివ్యాం ధార్మికే తస్మిన్ రామే రాజ్యం ప్రశాసతి ॥
ధార్మికుడైన రాముడు రాజ్యం చేస్తూండగా అందరు తపస్సులో ఉన్నట్లుగా ఉండేవారు. అందరూ ధర్మాలను నియమంగా పాటించేవారు.
నాధర్మిష్ఠో నరః కశ్చిద్ బభూవ ప్రాణినాం క్వచిత్ ।
ప్రాణాపానే సమావాస్తాం రామే రాజ్యం ప్రశాసతి ॥
రాముడు రాజ్యం చేస్తుండగా అధార్మికుడు ఎవ్వడూ లేడు. జనులంతా ప్రాణాపానాలను సమం చేసి, యోగంతో జీవించేవారు.
గాథామప్యత్ర గాయంతి యే పురాణవిదో జనాః ।
శ్యామో యువా లోహితాక్షో మాతంగానామివర్షభః ॥
ఆజానుబాహుః సుముఖః సింహస్కంధో మహాబలః ।
దశ వర్షసహస్రాణి దశ వర్షశతాని చ ॥
రాజ్యం భోగం చ సంప్రాప్య శశాస పృథివీమిమామ్ ।
పౌరాణికులైన జనులు రాముని గాథను ఇలా గానం చేశారు. నల్లనివాడు, యువకుడు, ఎర్రనికన్నులు కలవాడు, ఏనుగు వలె ఉన్నతుడు, ఆజానుబాహువు, అందమైన ముఖం కలవాడు, సింహం వంటి స్కంధాలు కలవాడు, మహాబలుడు అయిన రాముడు పదుకొండు వేల సంత్సరాలు రాజ్యభోగాలను అనుభవిస్తూ ఈ భూమిని పాలించాడు.
రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథాః ॥
రామభూతం జగదిద రామే రాజ్యం ప్రశాసతి ।
ఋగ్యుజుః సామహీనాశ్చ న తదాసన్ ద్విజాతయః ॥
ప్రజలు మాటల్లో ఏ సందర్భంలోనైనా రాముడు రాముడు రాముడు అనేవారు. అతడు రాజ్యం పాలిస్తూండగా ఈ జగత్తంతా రామమయం అయిపోయింది. బ్రాహ్మణులలో ఋగ్ యజుస్సామవేదాలను చదువనివారు లేరు.
ఉషిత్వా దండకే కార్యం త్రిదశానాం చకార సః ।
పూర్వాపకారిణం సంఖ్యే స నిజఘాన హ ।
సత్యవాన్ గుణసంపన్నో దీప్యమానః స్వతేజసా ॥
ఏవమేవ మహాబాహుః ఇక్ష్వాకుకులవర్ధనః ॥
అట్టి శ్రీరాముడు దండకారణ్యంలో నివసించి దేవతల కార్యాన్ని చేశాడు. దేవగంధర్వనాగులకు శత్రువు, మునుపు అపకారం చేసినవాడూ పులస్త్యనందనుడు అయిన రావణుని మనుజశ్రేష్ఠుడు సత్త్వవంతుడు, గుణసంపన్నుడు, తన తేజస్సుతో ప్రకాశించే మహాబాహువు, ఇక్ష్వాకుకులవర్ధనుడు అయిన శ్రీరాముడు సంహరించాడు.
రావణం సగణం హత్వా దివమాక్రమతాభిభూః ।
ఇతి దాశరథేః ఖ్యాతః ప్రాదుర్భావో మహాత్మనః ॥
రాక్షసగణంతోపాటు రావణుని సంహరించి రాముడు దేవలోకానికి చేరుకొన్నాడు. ఈ విధంగా విష్ణువు దశరథకుమారుడైన రాముడుగా అవతరించి లోకవిఖ్యాతిని పొందాడు.
(కృష్ణావతారః)
తతః కృష్ణో మహాబాహుః భీతానామభయంకరః ।
అష్టావింశే యుగే రాజన్ జజ్ఞే శ్రీవత్సలక్షణః ॥
రాజా! అటు తరువాత ఇరవై ఎనిమిదో యుగంలో విష్ణువు మహాబాహుడు, శ్రీవత్సలాంఛనుడు, భీతులకు అభయంకరుడు అయిన శ్రీకృష్ణుడుగా అవతరించాడు.
పేశలశ్చ వదాన్యశ్చ లోకే బహుమతో నృషు ।
స్మృతిమాన్ దేశాకాలజ్ఞః శంఖచక్రగదాసిధృక్ ॥
అందమైనవాడు, ఉదారుడు, లోకంలోని చాలామంది మనుష్యులకు మిక్కిలి ఇష్టుడు, స్మరణశక్తిసంపన్నుడు, దేశకాలజ్ఞుడు, శంఖచక్రగదాఖడ్గాలను ధరించినవాడు ఆ శ్రీకృష్ణుడు......
వాసుదేవ ఇతి ఖ్యాతః లోకానాం హితకృత్ సదా ।
వృష్ణీనాం చ కులే జాతః భూమేః ప్రియచికీర్షయా ॥
భూదేవికి ఇష్టాన్ని చేయగోరి వృష్ణికులంలో జన్మించి, లోకాలకు హితాన్ని చేసి, వాసుదేవుడుగా ఖ్యాతి నొందాడు.
స నృణామభయం దాతా మధుహేతి స విశ్రుతః ।
శకటార్జునరామాణాం కిల స్థానాన్యసూదయత్ ॥
అతడు మానవులకు అభయప్రదాత, మధు వనే రాక్షసుని చంపినప్రసిద్ధుడు. శకటాసురుని, యమలార్జునుని, పూతనను మర్మస్థానాలను భేదించి సంహరించినవాడు.
కంసాదీన్ నిజఘానాజౌ దైత్యాన్ మానుషవిగ్రహాన్ ।
అయం లోకహితార్థాయ ప్రాదుర్భావో మహాత్మనః ॥
మానుషరూపంలో ఉన్న కంసాది రాక్షసులను యుద్ధంలో చంపాడు. లోకహితంకోసం ఈ మహాత్ముడు అవతరించాడు.
(కల్క్యవతారః)
కల్కీ విష్ణుయశా నామ భూయశ్చోత్పత్స్యతే హరిః ।
కలేర్యుగాంతే సంప్రాప్తే ధర్మే శిథిలతాం గతే ॥
పాఖండినాం గణానాం హి వధార్థం భరతర్షభ ।
ధర్మస్య చ వివృద్ధ్యర్ధం విప్రాణాం హితకామ్యయా ॥
కలియుగాంతంలో ధర్మం శిథిలం కాగా, పాఖండికుల వధకోసం, ధర్మాన్ని వృద్ధి చేయడం కోసం, బ్రాహ్మణులకు హితం చేయగోరి, శ్రీహరి 'కల్కి విష్ణుయశస్సు' అనే పేరుతో మరల అవతరిస్తాడు.
ఏత్యే చాన్యే చ బహవః దివ్యా దేవగణైర్యుతాః ।
ప్రాదుర్భావాః పురాణేషు గీయంతే బ్రహ్మవాదిభిః ॥
ఇవేగాక ఇంకా ఇతర దేవగణాలతో కూడిన విష్ణువు యొక్క దివ్యావతారాలను గురించి బ్రహ్మవాదులు పురాణాలలో గానం చేశారు.
వైశంపాయన ఉవాచ
ఏవముక్తోఽథ కౌంతేయః తతః పౌరవనందనః ।
ఆబభాషే పునర్భీష్మం ధర్మరాజో యుధిష్ఠిరః ॥
వైశంపాయనుడిలా అన్నాడు - భీష్ముడు ఈ విధంగా చెప్పాక, పూరువంశీయుడు, యుధిష్ఠిరుడు అయిన ధర్మరాజు భీష్మునితో ఇలా అన్నాడు.
యుధిష్ఠిర ఉవాచ
భూయ ఏవ మనుష్యేంద్ర ఉపేంద్రస్య యశస్వినః ।
జన్మ వృష్ణిషు విజ్ఞాతుమ్ ఇచ్ఛామి వదతాం వర ॥
యుధిష్ఠిరుడిలా అన్నాడు - మనుష్యేంద్రా! యశస్వి, ఉపేంద్రుడూ అయిన శ్రీకృష్ణుడు వృష్ణివంశంలో అవతరించటం గూర్చి ఇంకా తెలియగోరుతున్నాను.
యథైవ భగవాన్ జాతః క్షితావిహ జనార్దనః ।
మాధవేషు మహాబుద్ధిః తన్మే బ్రూహి పితామహ ॥
పితామహా! మహాబుద్ధిమంతుడు, భగవంతుడు జనార్దనుడు ఈ భూమిపై యదువంశంలో ఎలా పుట్టాడు? ఆ విషయాన్నంతా నాకు చెప్పు.
యదర్థం చ మహాతేజాః గాస్తు గోవృషభేక్షణః ।
రరక్ష కంసస్య వధాత్ లోకానామభిరక్షితా ॥
కంసుని వధద్వారా లోకాలను రక్షించిన మహాతేజస్వి గోవువలె విశాల నేత్రాలు కల కృష్ణుడు గోవులను కాస్తూ ఎందుకున్నాడు?
క్రీడతా చైవ యద్ బాల్యే గోవిందేన విచేష్టితమ్ ।
తదా మతిమతాం శ్రేష్ఠ తన్మే బ్రూహి పితామహ ॥
బుద్ధిశాలులలో శ్రేష్ఠుడవైన పితామహా! బాల్యంలో గోవిందుడు ఆడుతూ ఏమేం పనులు చేశాడు? వాటన్నింటిని నాకు చెప్పు.
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తతో భీష్మః కేశవస్య మహాత్మనః ।
మాధవేషు తదా జన్మ కథయామాస వీర్యవాన్ ॥
వైశంపాయనుడిలా అన్నాడు - ధర్మరాజు అలా అడుగగా, తేజోవంతుడు అయిన భీష్ముడు మహాత్ముడైన విష్ణువు మధువంశంలో అవతరించిన విధాన్ని ఇలా చెప్పాడు.
భీష్మ ఉవాచ
హంత తే కథయిష్యామి యుధిష్ఠిర యథాతథమ్ ।
యతో నారాయణస్యేహ జన్మ వృష్ణిషు కౌరవ ॥
భీష్ముడిలా అన్నాడు - నాయనా! కురునందనా! యుధిష్ఠిరా! నారాయంఉడు వృష్ణివంశంలో అవతరించడాన్ని ఉన్నదున్నట్లుగా నీకు చెప్తాను.
అజాతశత్రో జాతస్తు యథైష భువి భూమిపః ।
కీర్త్యమానం మయా తాత నిబోధ భరతర్షభ ॥
భరతకుల శ్రేష్ఠా! నాయనా! అజాతశత్రుడా! భూమిని రక్షించటానికి శ్రీహరి ఈ భూమిపై ఎలా పుట్టాడో చెప్తాను. నీవు జాగరూకతతో అర్థం చేసుకో.
సాగరాః సమకంపంత ముదా చేలుశ్చ పర్వతాః ।
జజ్వలుశ్చాగ్నయః శాంతా జాయమానే జనార్దనే ॥
జనార్దనుడు అవతరించినపుడు ఆనందంతో సముద్రాలు పులకరించాయి. పర్వతాలు చలించాయి. అగ్నులు ప్రశాంతంగా ప్రజ్వరిల్లాయి.
శివాః సంప్రవపుర్వాతాః ప్రశాంతమభవద్ రజః ।
జ్యోతీంషి సంప్రకాశంతే జాయమానే జనార్దనే ॥
జనార్దనుడు అవతరించినపుడు గాలులు మంగళకరంగా మెల్లగా వీచాయి. ధూళి శాంతించింది. నక్షత్రాలు బాగా ప్రకాశించాయి.
దేవదుందుభయశ్చాపి సస్వనుర్భృశమంబరే ।
అభ్యవర్షంస్తదాఽఽగమ్య దేవతాః పుష్పవృష్టిభిః ॥
ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి. దేవతలు వచ్చి పుష్పవృష్టులను కురిపించారు.
గీర్భిర్మంగళయుక్తాభిః అస్తువన్ మధుసూదనమ్ ।
ఉపతస్థుస్తదా ప్రీతాః ప్రాదుర్భావే మహర్షయః ॥
జనార్దనుడు అవతరించినపుడు దేవతలు మంగళకరాలైన వాక్కులతో మధుసూదనుని స్తుతించారు. మహర్షులు ప్రీతులై సమీపించారు.
తతస్తానభిసంప్రేక్ష్య నారదప్రముఖానృషీన్ ।
ఉపానృత్యన్నుపజగుః గంధర్వాప్సరసాం గణాః ।
నారదాది ప్రముఖులైన దేవర్షులు రావడం చూసి, గంధర్వులూ, అప్సరోగణాలూ నృత్యంచేస్తీ శ్రీహరిని గురించి పాడారు.
ఉపతస్థే చ గోవిందం సహస్రాక్షః శచీపతిః ।
అభ్యభాషత తేజస్వీ మహర్షీన్ పూజయంస్తదా ॥
శచీపతి దేవేంద్రుడు కూడ గోవిందుని సమీపించాడు. తేజస్వి అయిని ఇంద్రుడు మహర్షులను గౌరవించి గోవిందునితో ఇలా అన్నాడు.
ఇంద్ర ఉవాచ
కృత్యాని దేవకార్యాణి కృత్వా లోకహితాయ చ ।
స్వలోకం లోకకృద్ దేవ పునర్గచ్చ స్వతేజసా ॥
ఇంద్రుడిలా అన్నాడు - దేవా! దేవకార్యాలను నిర్వర్తించి లోకహితాన్ని కలుగచేసి, నీ తేజస్సుతో నీవు మరల నీ పరమధామానికి వెళ్ళవలసింది.
భీష్మ ఉవాచ
ఇత్యుక్త్వా మునిభిః సార్ధం జగామ త్రిదివేశ్వరః ।
భీష్ముడిలా అన్నాడు - ఈ విధంగా చెప్పి దేవేంద్రుడు మునులతో పాటు వెళ్ళాడు.
వసుదేవస్తతో జాతం బాలామాదిత్యసంనిభమ్ ।
నందగోపకులే రాజన్ భయాత్ ప్రాచ్ఛాదయద్ధరిమ్ ॥
రాజా! తరువాత వసుదేవుడు కంసుని భయం వల్ల తనకు పుట్టి, సూర్యునిలా ప్రకాశిస్తున్న బాలుని (కృష్ణుని) నందగోపకులంలో దాచాడు.
నందగొపకులే కృష్ణ ఉవాస బహుశాః సమాః ।
తతః కదాచిత్ సుప్తం తం శకటస్య త్వథః శిశుమ్ ॥
యశోదా సంపరిత్యజ్య జగామ యమునాం నదీమ్ ।
ఆ నందగోపకులంలో కృష్ణుడు చాలా సంవత్సరాలు నివసించాడు. ఒకసారి బండి క్రింద నిద్రిస్తూన్న ఆ బాలుని విడిచి, యశోద యమునానదికి వెళ్ళింది.
శిశులీలాం తతః కుర్వన్ స్వహస్తచరణౌ క్షిపన్ ॥
రురోద మధురం కృష్ణః పాదావూర్ధ్వం ప్రసారయన్ ।
పాదాంగుష్ఠేన శకటం ధారయన్నథ కేశవః ॥
తత్రాధైకేన పాదేన పాతయిత్వా తథా శిశుః ।
తరువాత బాలకృష్ణుడు బాలచేష్టలు చేస్తూ, కాలుసేతుల్ని ఆడిస్తూ మధురస్వరంతో ఏడ్చాడు. పాదాలు రెండూ పైకి చాచాడు. ఒక పాదం యొక్క అంగుష్ఠంతో బండిని ఎత్తిపట్టి, రెండవపాదంతో దాన్ని పడగొట్టాడు (తన్నాడు).
న్యుజ్జః పయోధరాకాంక్షీం చకార చ రురోద చ ॥
పాతితం శకటం దృష్ట్వా భిన్నభాండఘటీఘటమ్ ।
జనాస్తే శిశునా తేన విస్మయ పరమం యయుః ॥
ఆకలితో స్తన్యాన్ని కోరుతూ ఏడ్చాడు. అతడు పడగొట్టిన శకటాన్ని, అందులోని కుండలు పగిలిపోవటాన్ని చూసిన జనులు బాలుడు చేసిన పనికి ఆశ్చర్యయారు.
ప్రత్యక్షం శూరసేనానాం దృశ్యతే మహదద్భుతమ్ ।
పూతనా చాపి నిహతా మహాకాయా మహాస్తనీ ॥
పశ్యతాం సర్వదేవానాం వాసుదేవేన భారత ।
భరతనందనా! శూరసేనదేశ నివాసులంతా మహాద్భుతమైన ఈ కృత్యాన్ని ప్రత్యక్షంగా చూశారు. దేవతలంతా చూస్తుండగా బాలకృష్ణుడు వాసుదేవుడు మహాకాయ, మహాస్తని అయిన పూతనను కూడా సంహరించాడు.
తతః కాలే మహారాజసంసక్తౌ రామకేశవౌ ॥
విష్ణుః సంకర్షణశ్చోభౌ రింగిణౌ సమపద్యతామ్ ।
మహారాజా! ఆ తరువాత సంకర్షణుడూ, విష్ణువూ వలె ఉన్న బలరామకృష్ణుడు ఇద్దరూ కలిసి విజృంభించారు.
అన్యోన్యకిరణగ్రస్తౌ చంద్రసూర్యా వివాంబరే ॥
విసర్పయేతాం సర్వత్ర సర్పభోగభుజౌ తదా ।
ఆకాశంలో సూర్య చంద్రులిద్దరూ ఒకరి కిరణాలొకరు గ్రహించి ప్రవర్తించినట్లుగా, బలరామకృష్ణులిద్దరూ కలిసే సంచరించేవారు. వారి భుజాలు పాముపడగల్లా ప్రకాశిస్తూండేవి.
రేజతుః పాంశుదిగ్ధాంగౌ రామకృష్ణౌ తదా నృప ॥
క్వచిచ్చ జానుభిర్ఘృష్టా క్రీడమానౌ క్వచిద్ వనే ।
పిబంతౌ దధి కుల్యాశ్చ మధ్యమానే చ భారత ॥
రాజా! భరతనందనా! బలరామకృష్ణులిద్దరూ ధూళితో కూడిన శరీరాలతో ప్రకాశిస్తూండేవారు. ఒక్కొక్కచోట మోకాళ్ళతో కొట్టుకొనేవారు. అడవిలో ఆడుకొమ్ఠూ ఒకసారి కనబడేవారు. పెరుగు చిలుకుతూండగా త్రాగుతూండేవారు.
తతః స బాలో గోవిందః నవనీతం తదా క్షయే ।
గ్రసమానస్తు తత్రాయం గోపీభిర్దదృశే ఽథ వై ॥
ఒకసారి బాలగోపాలుడు ఒంటరిగా దాగి వెన్న తింటూండగా గోపికలు అతనిని చూశారు.
దామ్నాథోలూఖలే కృష్ణః గోపస్త్రీభిశ్చ బంధితః ।
తదాథ శిశునా తేన రాజంస్తావర్జునావుభౌ ॥
సమూలవిటపౌ భగ్నే తదద్భుతమివాభవత్ ।
రాజా! అపుడు ఆ గోపస్త్రీలు అతనిని తాడుతో రోలుకి కట్టేశారు. అపుడు ఆ బాలగోపాలుడు ఆ (ఉలూఖలం) రోటితో కొమ్మలతో వేళ్ళతో సహితంగా రెండు అర్జునవృక్షాలనూ పెకలించాడు. అది చాలా ఆశ్చర్యకరంగా జరిగింది.
తత్రాసురే మహాకాయౌ గతప్రాణౌ బభూవతుః ।
దానితో మహాకాయులైన ఇద్దరు రాక్షసులకు ప్రాణాలు పోయాయి.
తతస్తా బాల్యముత్తీర్ణౌ కృష్ణ సంకర్షణావుభౌ ।
తస్మిన్నేవ వ్రజస్థానే సప్తవర్షౌ బభూవతుః ॥
అటుపై శ్రీకృష్ణబలరాములు బాల్యదశను దాటి ఆ వ్రజస్థానంలోనే ఏడు సంవత్సరాలు ఉన్నారు.
నీలపీతాంబరధరౌ పీతశ్వేతానులేపనౌ ।
బభూవతుర్వత్సపాలౌ కాకపక్షధరావుభౌ ॥
బలరాముడు నీలాంబరాన్ని, కృష్ణుడు పీతాంబరాన్ని ధరించేవారు. ఒకరు పచ్చని లేపనాన్ని, ఒకరు తెల్లని లేపనాన్ని పూసుకొనేవారు. కాకపక్షాల జుట్టుతో పెరుగుతూ లేగలను రక్షిస్తున్నారు.
పర్ణవాద్యం శ్రుతిసుఖం వాదయంతౌ వరావనౌ ।
శుశుభాతే వనగతౌ ఉదీర్ణావివ పన్నగౌ ॥
వారిద్దరూ కూడ ఆకుబూరలను చెవికింపుగా ఊదుతూండేవారు. ఎదుగుతున్న (పాముల్లా) నాగకుమారుల్లా వనంలో తిరుగుతూ శోభిల్లుతూ ఉండేవారు.
మయూరాంగజకర్ణౌ తౌ పల్లవాపీధారిణౌ ।
వనమాలాపరిక్షిప్తౌ సాలపోతావివోద్గతౌ ॥
నెమలి ఈకలను చెవిలో ధరిస్తూ, చిగురుటాకులను శిరస్సుపై ధరిస్తూ, కంఠంలో వనమాలను ధరిస్తూ, సాలవృక్షాల్లా ఎదిగారు.
అరవింద కృతాపీడౌ రజ్జుయజ్ఞోపవీతినౌ ।
శిక్యతుంబధరౌ వీరౌ గోపవేణుప్రవాదకౌ ॥
పద్మాలు శిరోభూషణంగా, యజ్ఞోపవీతంగా త్రాళ్లను ధరిస్తూ, గోపజనుల కుచితమయిన వేణువును వాయించేవారు ఆ బాలరామకృష్ణులు.
క్వచిద్ వసంతావన్యోన్యం క్రీడమానౌ క్వచిద్ వనే ।
పర్ణశయ్యాసు సంసుప్తౌ క్వచిన్నిద్రాంతరైషిణౌ ॥
ఒకేచోట నివసించేవారు. ఇద్దరూ కలిసి ఒకేచోట ఆడేవారు వనంలో. ఆకుల సెజ్జపై ఒకేచోట పడుకొని నిద్రించేవారు.
తౌ వత్సాన్ పాలయంతౌ హి శోభయంతౌ మహద్ వనమ్ ।
చంచూర్యంతౌ రమంతౌ స్మ రాజన్నేవం తదా శుభే ॥
లేగదూడలను కాపుకాస్తూ వనానికంతటికి శోభ కలిగించేవారు. రాజా! మంగళస్వరూపులైన వారిద్దరూ కలిసి దొంగిలిస్తూండేవారు. తిరుగూతూండేవారు. ఆడుతూండేవారు.
తతో వృందావనం గత్వా వసుదేవసుతావుభౌ ।
గోవ్రజం తత్ర కౌంతేయ చారయంతౌ విజహ్రతుః ॥
ఆనంతరమ్ ఆ బలరామకృష్ణులిద్దరూ బృందావనానికి వెళ్ళి, అక్కడ ఆవులమందను త్రిప్పి తిరిగితీసికొని వచ్చేవారు.
భీష్మ ఉవాచ
తతః కదాచిద్ గోవిందః జ్యేష్ఠం సంకర్షణమ్ వినా ।
చచార తద్ వనం రమ్యం రమ్యరూపో వరాననః ॥
భీష్ముడిలా అన్నాడు - తరువాత ఒకానొకరోజున బలరాముడు లేకుండా అందమైన రూపమూ, శ్రేష్ఠమయిన ముఖమూ కల గోవిందుడు ఒంటరిగా వనంలో సంచరిస్తూ ఉన్నాడు.
కాకపక్షధరః శ్రీమాన్ శ్యామః పద్మనిభేక్షణః ।
శ్రీవత్సేనోరసా యుక్తః శశాంక ఇవ లక్ష్మణా ।
కాకపక్షధారి, నీలవర్ణుడు, పద్మనేత్రుడు, శ్రీమంతుడు అయిన కృష్ణుడు చంద్రునిలో మచ్చవలె వక్షంపై శ్రీవత్సచిహ్నాన్ని ధరించేవాడు.
రజ్జుయజ్ఞోపవీతీ స పీతాంబరధరో యువా ।
శ్వేతగంధేన పిప్తాంగః నీలకుంచితమూర్ధజః ॥
రాజతా బర్హిపత్రేణ మందమారుతకంపినా ।
క్వచిద్ గాయన్ క్వచిత్ క్రీడన్ క్వచిన్నృత్యన్ క్వచిద్ధసన్ ।
గోపవేషః స మధురమ్ గాయన్ వేణుం చ వాదయన్ ।
ప్రహ్లాదనార్థం తు గవాం క్వచిద్ వనగతో యువా ॥
గోకులే మేఘకాలే తు చచార ద్యుతిమాన్ ప్రభుః ।
బహురమ్యేషు దేశేషు వనస్య వనరాజిషు ॥
తాసు కృష్ణో ముదం లేభే క్రీడయా భరతర్షభ ।
స కదాచిద్ వనే తస్మిన్ గోభిః సహ పరివ్రజన్ ॥
అతడు రజ్జువు యజ్ఞోపవితంగా ధరించాడు. పచ్చనివస్త్రం ధరించిన యువకుడు. తెల్లగంధం ఒంటికి పూసుకొన్నాడు. నల్లని జుట్టు ముడికలవాడు. మందమారుతం తాకిడికి కదులుతున్న నెమలి పింఛం కలిగి ఒక్కొక్క చోట పాడుతూ, ఒక్కొక్క చోట ఆడుతూ, ఒక్కొక్క్ చోట నర్తిస్తూ, ఒక్కొక్క చోట నవ్వుతూ ఉంటాడు. గోపవేషంలో ఉన్న కృష్ణుడు మధురంగా పాడుతూ, వేణువుడ్ను వాయిస్తూ ఉంటాడు. వనంలో గోవులను ఆనందపరచడం కోసం ఇలా చేసేవాడు. వర్షకాలంలో కూడా తేజస్వి, సమర్థుడూ అయిన కృష్ణుడు అందమైన వనప్రదేశాల్లో గోకులంలో సంచరించేవాడు. అక్కడ ఆడుకొంటూ ఆనందాన్ని అనుభవించేవాడు. భరతశ్రేష్ఠా! అతడు ఒకానొకరోజున వనంలో గోవులతో తిరుగుతూ ఉన్నాడు.
భాండీరం నామ దృష్ట్వాథ న్యగ్రోధం కేశవో మహాన్ ।
తచ్ఛాయాయాం నివాసాయ మతిం చక్రే తదా ప్రభుః ॥
మహాత్ముడైన కేశవుడు అలా తిరుగుతూ భాండీరమనే మర్రిచెట్టును చూసి, దానినీడలో ఉండాలని అనుకొన్నాడు.
స తత్ర వయసా తుల్యైః వత్సపాలైః సహానఘ ।
రేమే స దివసాన్ కృష్ణః పురా స్వర్గపురే తథా ॥
అక్కడ తనతో సమానవయస్కులైన పనులకాపరులతో దేవతలతో స్వర్గంలో ఉన్నట్లుగా ఆ చెట్టుకింద కొన్ని రోజులు ఉన్నాడు.
తం క్రీడమానం గోపాలాః కృష్ణం భాండీరవాసినః ।
రమయంతిస్మ బహవో మాన్యైః క్రీడనక్తైస్తదా ॥
అన్యే స్మ పరిగాయంతి గోపాముదితమానసాః ।
గోపాలాః కృష్ణమేవాన్యే గాయంతి స్మ వనప్రియాః ॥
భాండీరవటవృక్షం క్రింద ఉంటూన్న గోపాలురు రకరకాల ఆటవస్తువులతో ఆడుతూన్న కృష్ణుని ఆనందపరుస్తూ ఉన్నారు. సంతోషించిన మనస్సుతో ఇతర గోపాలురు వనంలో తిరుగుతూ కృష్ణుని గురించి గానం చేస్తున్నారు.
తేషాం సంగాయతామేవ వాదయామాస కేశవః ।
పర్ణవాద్యాంతరే వేణుం తుంబం వీణాం చ తత్ర వై ॥
ఏవం క్రీడాంతరైః కృష్ణః గోపాలైర్విజహార సః ।
వారు పాడుతూండగానే కృష్ణుడు కూడ ఆకుబూర వాయించాడు. తరువాత వేణువును, తుంబాన్ని, వీణను మధ్యమధ్య మార్చి వాయించాడు. ఈ విధంగానే వేరే ఆటలతో కూడా కృష్ణుడు ఆ గోపాలురతో విహరించాడు.
తేన బాలేన కౌంతేయ కృతం లోకాహితం తదా ॥
పశ్యతాం సర్వభూతానాం వాసుదేవేన భారత ।
కుంతీనందనా! భరతనందనా! సర్వభూతాలు చూస్తూండగా బాలుడైన వాసుదేవుడు లోకహితాన్ని ఆచరించాడు.
హ్రదే నీపవనే తత్ర క్రీడితం నాగమూర్ధని ॥
కాళియం శాసయిత్వా తు సర్వలోకస్య పశ్యతః ।
విజహార తతః కృష్ణః బలదేవసహాయవాన్ ॥
ఆ బృందావనంలో కదంబవృక్షాల వనం దగ్గర్లోని సరస్సులో కాళియుడనే సర్పం శిరస్సుపై జనులంతా చూస్తుండగా ఆడి, దాన్ని శాసించి, శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి విహరించాడు.
ధేనుకో దారుణో దైత్యః రాజన్ రాసభవిగ్రహః ।
తదా తాళవనే రాజన్ బలదేవేన వై హతః ॥
రాజా! తాళవనంలో గాడిదరూపంలో ఉన్న ధేనుకాసురుని అపుడే బలరాముడు సంహరించాడు.
తతః కదాచిత్ కౌంతేయ రామకృష్ణౌ వనం గతౌ ।
చారయంతౌ ప్రవృద్ధాని గోధనాని శుభాననౌ ॥
కుంతీనందనా! తరువాత ఒకానొకరోజున బలరామకృష్ణులిద్దరూ వనంలో ఆవుల మందలను త్రిప్పుతూ ఉన్నారు.
విహరంతౌ ముదా యుక్తౌ వీక్షమాణౌ వనాని వై ।
క్ష్వేలయంతా ప్రగాయంతే విచిన్వంతౌ చ పాదపాన్ ॥
ఆనందంతో వనంలో విహరిస్తూ, ఆడుతూ, పాడుతూ రకరకాల చెట్లను వెతుకుతూ తిరుగుతూన్నారు.
నామభిర్వ్యాహరంతే చ వత్సాన్ గాశ్చ పరంతపా ।
చేరతుర్లోకసిద్ధాభిః క్రీడాఇరపరాజితే ॥
శత్రుమర్దనులైన వారిద్దరూ ఆవులను, దూడలనూ పేర్లతో పిలుస్తూ, లోకప్రసిద్ధాలై బలోచితాలైన ఆటలాడుతూన్నారు.
తౌ దేవౌ మానుషీం దీక్షాం వహంతౌ సురపూజితే ।
తజ్జాతిగుణయుక్తాభిః క్రీడాభిశ్చేరతుర్వనమ్ ॥
మనుష్యదీక్షను వహించి, సురపూజితులైన శ్రీకృష్ణబలరామదేవులు మానవస్వభావవానికి తగిన క్రీడలతో వనమంతా తిరిగారు.
తతః కృష్ణో మహాతేజాః తదా గత్వా తు గోవ్రజమ్ ।
గిరియజ్ఞం తమేవైషః ప్రకృతం గోపదారకైః ॥
బుభుజే పాయసం శౌరిః ఈశ్వరః సర్వభూతకృత్ ।
అనంతరం మహాతేజస్వి అయిన శ్రీకృష్ణుడు గోవ్రజానికి వెళ్ళాడు. అక్కడ గోపబాలురంతా గిరియజ్ఞాన్ని చేస్తున్నారు. అందులోకి వెళ్ళి శ్రీకృష్ణుడు సర్వభూత స్రష్ట అయిన పరమాత్మ తానే అని తెలిసేటట్లుగా గిరిరాజుకొరకు చేయబడిన పాయసాన్ని తాను ఆరగించాడు.
తం దృష్ట్వా గోపకాః సర్వే కృష్ణమేవ సమర్చయన్ ॥
పూజ్యమానస్తతో గోపైః దివ్యం వపురధారయత్ ।
అది చూసి గోపబాలురంతా శ్రీకృష్ణునే పూజింపసాగారు. వారు పుజిస్తూండగా శ్రీకృష్ణుడు దివ్యమైన శరీరాన్ని పొందాడు.
ధృతో గోవర్ధనో నామ సప్తానాం పర్వతస్తదా ॥
శిశునా వాసుదేవేన గవార్థమరిమర్దన ।
శత్రుమర్దనా! ఒకసారి బాలుడైన వాసుదేవుడు ఆవుల రక్షణ కోసం గోవర్ధన పర్వతాన్ని ఏడురోజులు ఎత్తిపట్టుకొన్నాడు.
క్రీడమానస్తదా కృష్ణః కృతవాన్ కర్మ దుష్కరమ్ ॥
తదద్భుతమివాత్రాసీత్ సర్వలోకస్య భారత ।
భరతనందనా! ఆ కృష్ణుడు ఆడుతూనే సర్వలోకానికి ఆశ్చర్యకరమై కష్టసాధ్యమైన ఈ పనిని చేశాడు.
దేవదేవః క్షితిం గత్వా కృష్ణం దృష్ట్వా ముదాన్వితః ॥
గోవింద ఇతి తం హుక్త్వా హ్యభ్యషించత్ పురందరః ।
ఇత్యుక్త్వాఽఽశ్లిష్య గోవిందం పురుహూతోఽభ్యయాద్ దివమ్ ।
దేవదేవుడైన ఇంద్రుడు ఆ పని చూసి ఆనందంతో భూమిమీదికి వచ్చి శ్రీకృష్ణుని గోవిందుడను పేరుతో పిలిచి అభిషేకించాడు. అనంతరం గోవిందుని కౌగించుకొని ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్లాడు.
అథారిష్ట ఇతి ఖ్యాతం దైత్యం వృషభవిగ్రహమ్ ।
జఘాన తరసా కృష్ణః పశూనాం హితకామ్యయా ॥
పశువుల హితాన్ని కోరి కృష్ణుడు వృషభరూపంలో ఉన్న అరిష్టుడనే రాక్షసుని చంపాడు.
కేశినం నామ దైతేయం రాజన్ వై హయవిగ్రహమ్ ॥
తథా వనగతం పార్థ గజాయుతబలం హయమ్ ॥
ప్రహితం భోజపుత్రేణ జఘాన పురుషోత్తమః ।
రాజా! పృథానందనా! వేయి ఏనుగుల బలం కల కేశి అనే రాక్షసుడుండేవాడు. అతడు గుర్రం రూపంలో ఉండేవాడు. ఒకసారి కృష్ణుడు వనంలో ఉండగా భోజకులంలో జన్మించిన కంసుడు ఆ రాక్షసుని కృష్ణుని మీదికి పంపాడు. పురుషోత్తముడు అతనిని సంహరించాడు.
ఆంధ్రం మల్లం చ చాణూరం నిజఘాన మహాసురమ్ ॥
ఆంధ్రుడైన చాణూరమల్లుడనే మహారాక్షసుని శ్రీకృష్ణుడు సంహరించాడు.
సునామానమమిత్రఘ్నం సర్వసైన్యపురస్కృతమ్ ।
బాలరూపేణ గోవిందః నిజఘాన చ భారత ॥
భరతనందనా! శత్రుఘాతకుడైన కంసుని సోదరుడు సునాముడు సర్వసైన్యసమేతంగా రాగా, బాలకృష్ణుడు అతనిని కూడ సంహరించాడు.
బలదేవేన చాయత్తః సమాజే ముష్టికో హతః ।
జనసమూహంలో ఉండగా తనమీదికి వచ్చిన ముష్టికుడనే మల్లుని బలదేవుడు సంహరించాడు.
త్రాసి తశ్చ తదా కంసః స హి కృష్ణేన భారత ॥
భరతనందణా! ఆ సమయంలో శ్రీకృష్ణుని చూస్తే కంసుడిలో చాలా భయం కలిగింది.
ఐరావతం యుయుత్సంతం మాతంగానామివర్షభమ్ ।
కృష్ణః కువలయాపీడనం హతవాంస్తస్య పశ్యతః ॥
ఐరావతవంశంలో పుట్టిన కువలయాపీడమనే గజేంద్రాన్ని కంసుడు చూస్తూండగానే శ్రీకృష్ణుడు చంపాడు.
హత్వా కంసమమిత్రఘ్నః సర్వేషాం పశ్యతాం తదా ।
అభిషిచ్యోగ్రసేనం తం పిత్రోః పాదమవందత ॥
అనంతరం అందరూ చూస్తూండగా శత్రుసూదనుడైన శ్రీకృష్ణుడు కంసుని చంపి, ఉగ్రసేనుని రాజ్యాభిషిక్తుని చేసి, తన తల్లిదండ్రులైన దేవకీవసుదేవుల పాదాలకు నమస్కరించాడు.
ఏవమాదీని కర్మాణి కృతవాన్ వై జనార్దనః ।
ఉవాస కతిచిత్ తత్ర దినాని స హలాయుధః ॥
ఇటువంటి పనులుచేస్తీ జనార్దనుడు బలరామునితో పాటు అక్కడ కొన్నిరోజులు నివసించాడు.
తతస్తౌ జగ్మతుస్తాత గురుం సాందీపనిం పునః ।
గురుశుశ్రూషయా యుక్తౌ ధర్మజ్ఞౌ ధర్మచారిణౌ ॥
నాయనా! అటు తరువాత వాళ్ళిద్దరు గురువైన సాందీపని వద్దకు వెళ్ళారు. ధర్మజ్ఞులై, ధర్మాచరణం చేస్తూ బాలరామకృష్ణులు గురుశుశ్రూష చేస్తూ అక్కడున్నారు.
వ్రతముగ్రం మహాత్మానౌ విచరంతావతిష్ఠతామ్ ।
అహోరాత్రచతుష్షష్ట్యా షడంగం వేదమాపతుః ॥
అక్కడ ఆ మహాత్ములిద్దరూ కఠోరనియమాన్ని పాటిస్తీ అరవై నాలుగు రోజులలో షడంగాలతో కూడిన వేదాన్ని అధ్యయనం చేశారు.
లేఖ్యం చ గణితం చోభే ప్రాప్నుతాం యదునందనౌ ।
గాంధర్వవేదం వైద్యం చ సకలం సమవాపతుః ॥
యదునందనులైన బలరామకృష్ణులిద్దరూ చిత్రకళ, గణితం, గాంధర్వవేదం (సంగీతం), వైద్యం సమస్తమూ పొందారు.
హస్తిశిక్షామశ్వశిక్షాం ద్వాదశాహేన చాపతుః ।
తావుభౌ జగ్మతుర్వీరౌ గురుం సాందీపనిం పునః ॥
ధనుర్వేదచికీర్షార్థం ధర్మజ్ఞౌ ధర్మచారిణౌ ।
గజశిక్ష, అశ్వశిక్షలను పన్నెండు రోజులలో పూర్తిచేశారు. ధర్మజ్ఞులు, ధర్మచారులూ అయిన వారుభయులూ ధనుర్వేదాధ్యయనం కోసం మరల సాందీపనిని ఆశ్రయించారు.
తావిష్వస్త్ర వరాచార్యమ్ అభిగమ్య ప్రణమ్య చ ॥
తేన తౌ సత్కృతౌ రాజన్ విచరంతావవంతిషు ।
రాజా! ధనుర్వేదంలో ఆచార్యవరుడైన సాందీపనిని సమీపించి, నమస్కరించారు. వారిని సాందీపని సత్కారపూర్వకంగా చేరదీశాడు. అప్పటి నుండి మరలవారు అవంతిరాజ్యంలో నివసించారు.
పంచాశద్భిరహోరాత్రైః దశాంగం సుప్రతిష్ఠితమ్ ॥
సరహస్యం ధనుర్వేదం సకలం త్వావాపతుః ।
ఏభైరోజులలో దశాంగాలతో, రహస్యాలతో కూడిన ధనుర్వేదాన్నంతా నేర్చుకొన్నారు.
దృష్ట్వా కృతాస్ర్తౌ విప్రేంద్రః గుర్వర్థే తావచోదయత్ ॥
అయాచతార్థం గోవిందం తతః సాందీపనిర్విభుః ।
విప్రేంద్రుడైన సాందీపని అస్త్రవిద్యానిపుణులైన వారిని చూసి, గురుదక్షిణకై ఆజ్ఞాపించాడు.
సాందీపని రువాచ
మమ పుత్రః సముద్రే ఽస్మిన్ తిమినా చాపవాహితః ॥
పుత్రమానయ భద్రం తే భక్షితం తిమినా మమ ।
సాందీపని ఇలా అన్నాడు - ఈ సముద్రంలోని 'తిమి' అనే జలజంతువు నా కుమారుని మింగేసింది. ఆ నా కుమారుని భద్రంగా తీసికొనిరా!
భీష్మ ఉవాచ
ఆర్తాయ గురవే తత్ర ప్రతిశుశ్రావ దుష్కరమ్ ॥
అశక్యం త్రిషు లోకేషు కర్తుమన్యేన కేనచిత్ ।
భీష్ముడిలా అన్నాడు - పుత్రశోకంతో దురపిల్లుతున్న గురువుకు ముల్లోకాలలోను ఎవరికీ చేయశక్యంగాని దుష్కరమైన దాన్ని శ్రీకృష్ణుడు చేస్తానని మాటిచ్చాడు.
యశ్చ సాందీపనేః పుత్రం జఘాన భరతర్షభ ॥
సోఽసురః సమరే తాభ్యాం సముద్రే వినిపాతితః ।
భరతశ్రేష్ఠా! సాందీపనికుమారుని చంపిన అసురుని బలరామకృష్ణులు యుద్ధంలో చంపి సముద్రంలో పడవేశారు.
తతః సాందీపనేః పుత్రః ప్రసాదాదమితౌజసః ॥
దీర్ఘకాలం గతః ప్రేతం పునరాసీచ్ఛరీరవాన్ ।
అనంతరం మరణించి చాలకాలంగా ప్రేతంగా ఉన్న సాందీపనికుమారుని మరల జీవింపజేశాడు. అతడు మరల సశరీరుడయ్యాడు.
తదశక్యమచింత్యం చ దృష్ట్వా సుమహదద్భుతమ్ ॥
సర్వేషామేవ భూతానాం విస్మయః సమజాయత ।
చేయశక్యంగాని, ఊహింపశక్యంగాని మిక్కిలి అద్భుతమైన ఆపనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఐశ్వర్యాణి చ సర్వాణి గవాశ్వం చ ధనాని చ ॥
సర్వం తదుపజహ్రాతే గురవే రామకేశవౌ ।
తతస్తం పుత్రమాదాయ దదౌ చ గురవే ప్రభుః ॥
సకలైశ్వర్యాలు, గోవులను, అశ్వాలను, ధనాన్ని, పుత్రునితో బాటుగా బలరామకృష్ణులు గురువుగారి కిచ్చారు.
తం దృష్ట్వా పుత్రమాయాంతం సాందీపనిపురే జనాః ।
అశక్యమేతత్ సర్వేషామ్ అచింత్యమితిమేనిరే ॥
కశ్చ నారాయణాదన్యః చింతయేదిదమద్భుతమ్ ।
ఆ సాందీపని యొక్క పురంలోని జనులంతా మరల బ్రతికి వస్తున్న ఆ పుత్రుని చూసి "ఇది అందరికి శక్యంగాదు, కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. నారాయణుడు తప్ప వేరొకరెవరూ ఇటువంటి అద్భుతాన్ని గురించి ఆలోచింపలేరు. అనుకొన్నారు.
గదా పరిఘయుద్ధేషు సరాత్రేషు చ కేశవః ॥
పరమాం ముఖ్యతాం ప్రాప్తః సర్వలోకేషు విశ్రుతః ।
గదా పరిఘయుద్ధేషు సరాత్రేషు చ కేశవః ॥
పరమాం ముఖ్యతాం ప్రాప్తః సర్వలోకేషు విశ్రుతః ।
గదాపరిఘయుద్ధాలలో, అన్ని అస్త్రాల యందు కృష్ణుడు మిక్కిలి శ్రేష్ఠతను పొంది అన్నిలోకాలలోను ప్రసిద్ధుడయ్యాడు.
భోజరాజ తనూజోఽపి కంసస్త్త యుధిష్ఠిరః ॥
అస్త్రజ్ఞానే బలే వీర్యే కార్తవీర్యసమో ఽభవత్ ।
నాయనా! యుధిష్ఠిరా! భోజరాజకుమారుడైన కంసుడు కూడ అస్త్రజ్ఞానంలోను, బలంలోను, పరాక్రమంలోను కార్తవీర్యునితో సమానుడయ్యాడు.
తస్య భోజపతేః పుత్రాద్ భోజరాజ్యవివర్ధనాత్ ॥
ఉద్విజంతే స్మ రాజానః సుపర్ణాదివ పన్నగాః ।
ఆ భోజరాజ్యాన్ని వృద్ధిచేస్తున్న భోజవంశీయుడైన కంసుని వల్ల రాజులందరూ గరుత్మంతుని వల్ల సర్పాల వలె భయపడుతూండేవారు.
చిత్రకార్ముకనిస్త్రింశ విమలప్రాసయోధినః ॥
శతం శతసహస్రాణి పాదాతాస్తస్య భారత ।
భరతనందనా! ఆ కంసుని దగ్గర చిత్ర-కార్ముక-నిస్త్రింశ-విమల-ప్రాసాలతో యుద్ధం చేసే పదాతిదళాలవారు ఒకకోటి మంది ఉన్నారు.
అష్టౌ శతసహస్రాణి శూరాణామనివర్తినామ్ ॥
అభవన్ భోజరాజస్య జాంబూనదమయధ్వజాః ।
బంగారుధ్వజాలు గల రథికులై యుద్ధంలో వెనుదిరగని, శూరులు ఆ కంసుని వద్ద ఎనిమిది లక్షల మంది ఉన్నారు.
స్ఫురత్కాంచనకక్ష్యాస్తు గజాస్తస్య యుధిష్ఠిర ॥
తావంత్యేవ సహస్రాణి గజానామనివర్తినామ్ ।
యుధిష్ఠిరా! బంగారు కక్ష్యలు గలిగి యుద్ధంలో వెనుదిరగని, ఎనిమిదిలక్షల ఏనుగులు ఆ కంసుని దగ్గర ఉన్నాయి.
తే చ పర్వతసంకాశాః చిత్రధ్వజపతాకినః ॥
బభువుర్భోజరాజస్య నిత్యం ప్రముదితా గతాః ।
ఆ కంసుని దగ్గరున్న గజేంద్రాలు పర్వతాకారంలో ఉన్నాయి. అవి విచిత్రాలైన ధ్వజపతాకలు కలిగి, నిత్యం ఆనందంతో ఉండేవి.
స్వలంకృతానాం శీఘ్రాణాం కరేణూనాం యుధిష్ఠిర ।
అభవద్ భోజరాజస్య ద్విస్తావద్ధిమహద్ బలమ్ ॥
యుధిష్ఠిరా! బాగుగా అలంకరింపబడి, వేగంగా వెళ్లే ఆడుఏనుగుల యొక్క బలం ఏనుగుల బలం కంటె రెట్టింపు ఉంది.
షోడశాశ్వసహస్రాణి కింశుకాభాని తస్య వై ।
అపరస్తు మహావ్యూహః కిశోరాణాం యుధిష్ఠిర ॥
ఆరోహవరసంపన్నః దుర్ధర్షః కేనచిత్ బలాత్ ।
స చ షోడశసాహస్రః కంసభ్రాతృపురస్సరః ॥
యుధిష్ఠిరా! అతని దగ్గర మోదుగపూలులా ఎర్రగా ఉన్న గుర్రాలు పదహారువేలు ఉన్నాయి. కొదమగుర్రాలు మరొక పదహారువేలు ఉన్నాయి. అవి స్వారీ చేయటానికి శ్రేష్ఠమైనవి. బలవంతంగా వాటినెవరూ లొంగదీసికోలేరు. వాటన్నింటిని కంసుని సోదరుడు సునాముడు నడిపిస్తాడు.
సునామా సదృశస్తేన స కంసం పర్యపాలయత్ ।
కంసునితో సమానుడైన సునాముడు ఎల్లప్పుడు కంసుని రక్షన చూస్తూంటాడు.
య ఆసన్ సర్వవర్ణాస్తు హయాస్తస్య యుధిష్ఠిర ॥
స గణో మిశ్రకో నామ షష్టిసాహస్ర ఉచ్యతే ।
యుధిష్ఠిరా! అతని దగ్గర అన్ని వర్నాలు కలిగిన గుఱ్ఱాలు మిశ్రగణం పేరుతో అరవై వేలు వేరుగా ఉన్నాయి.
కంసరోషమహావేగాం ధ్వజానూపమహాద్రుమామ్ ॥
మత్తద్విపమహగ్రాహాం వైనస్వతవశానుగామ్ ।
కంసునితో జరుగబోయే యుద్ధం ఒక భయంకరమైన నదిలా ఉంది. అది కంసుని యొక్క రోషమనే మహావేగం కలది. ధ్వజాలనే నదీ తీర వృక్షాలు కలది. మదించిన ఏనుగులనే మొసళ్ళు కలది. యముని అధీనంలో ప్రవహిస్తున్నది.
శస్త్రజాలమహాఫేనాం సాదివేగమహాజలామ్ ॥
గదాపరిఘపాఠీనాం నానాకవచశైవలామ్ ।
శస్త్ర సముదాయమనే పెద్ద నురుగు కలది. గుర్రాలవేగమనే మహాజలం కలది. గదలు, పరిఘలు అనే పాఠీనమత్స్యాలు కలది. వివిధ కవచాలనే నాచు కలిగినది.
రథనాగమహావర్తాం నానారుధిరకర్దమామ్ ॥
చిత్రకార్ముకల్లోలాం రథాశ్వకలిలహ్రదామ్ ।
రథాలు, ఏనుగులు అనే పెద్ద సుడులు కలది. అనేక విధాలైన రక్తాలనే బురద కలది. విచిత్రాలైన ధనుస్సులనే తరంగాలు కలది. రథాల, అశ్వాల సముదాయమే మడుగులుగా గలది.
మహామృధనదీం ఘోరాం యోధావర్తననిఃస్వనామ్ ॥
కోవా నారాయణాదన్యః కంసహంతా యుధిష్ఠిర ।
యుధిష్ఠిరా! సైనికులు ఇటూ అటూ తిరుగుతూ చేసే ధ్వని యుద్ధంలో భయంకరంగా నదీప్రవాహ ఘోషలా ఉంది. నారాయణుడు తప్ప వేరెవరు కంసుని చంపగలరు?
ఏష శక్రరథే తిష్ఠన్ తాన్యనీకాని భారత ॥
వ్యధమద్ భోజపుత్రస్య మహాభ్రాణీవ మారుతః ।
భరతనందనా! పెనుగాలి దట్టమైన మేఘాలను చెల్లాచెదరుచేసినట్లు శ్రీకృష్ణుడు ఇంద్రుని రథంలో ఉండి కంసుని సేనలన్నింటిని సంహరించాడు.
తం సభాస్థం సహామాత్యం హత్వా కంసం సహాన్వయమ్ ॥
మానయామాస మానార్హం దేవకీం ససుహృద్గణామ్ ।
సభలో అమాత్యులతో, తన వంశీయులతో కూడి ఉన్న కంసుని శ్రీకృష్ణుడు సంహరించి, స్నేహితురాండ్రతో ఉన్న పూజ్యురాలగు, దేవకిని గౌరవించాడు.
యశోదాం రోహిణీం చైవ అభివాద్య పునః పునః ॥
ఉగ్రసేనం చ రాజానమ్ అభిషిచ్య జనార్దనః ।
అర్చితో యదుముఖ్యైశ్చ భగవాన్ వాసవానుజః ॥
కృష్ణుడు యశోదకు, రోహిణికి మరల మరల నమస్కరించి , ఉగ్రసేనుని రాజుగా అభిషిక్తుని చేశాడు. ఉపేంద్రుడైన శ్రీకృష్ణభగవానుని యదుముఖ్యులంతా పూజించారు.
తతః పార్థివమాయాంతం సహితం సర్వరాజభిః ।
సరస్వత్యాం జరాసంధమ్ అజయత్ పురుషోత్తమః ॥
అనంతరం సరస్వతీనదీతీరంలో రాజులందరితో కలిసివస్తూన్న జరాసంధుని పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు జయించాడు.
భీష్మ ఉవాచ
శూరసేనపురం త్యక్త్వా సర్వయాదవనందనః ।
ద్వారకాం భగవాన్ కృష్ణః ప్రత్యపద్యత కేశవః ॥
భీష్ముడిలా అన్నాడు - యాదవులందరికీ ఆనందం కలిగించిన శ్రీకృష్ణుడు శూరసేనపురాన్ని విడిచిపెట్టి, ద్వారకు వచ్చాడు.
ప్రత్యపద్యత యానాని రత్నాని చ బహూని చ ।
యథార్హం పుండరీకాక్షః నైరృతాన్ ప్రతిపాలయన్ ॥
పుండరీకాక్షుడైన (కమలనేత్రుడైన) శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరించి అనేకరత్నాలను, వాహనాలను పొంది యథాయోగ్యంగా వారినీ రక్షించాడు.
తత్ర విఘ్నం చరంతిస్మ దైతేయాః సహ దానవైః ।
తాం జఘాన మహాబాహుః వరమత్తాన్ మహాసురాన్ ॥
వరాలతో గర్వించిన మహాసురులను, దానవులతో కూడి విఘ్నాలు కలగజేస్తున్న దైత్యులను శ్రీకృష్ణుడు సంహరించాడు.
స విఘ్నమకరోత్ తత్ర నరకో నామ నైరృతః ।
త్రాసనః సురసంఘానాం విదితో వః ప్రభావతః ॥
దేవతాగణాలకు కూడా భయంకరుడై నరకుడనే రాక్షసుడు విఘ్నాలు కలుగజేశాడు. అతని ప్రభావం గురించి మీకూ తెలుసు.
స భూమ్యాం మూర్తిలింగస్థః సర్వదేవాసురాంతకః ।
మానుషాణామృషీణాం చ ప్రతీపమకరోత్ తదా ॥
అతడు సర్వదేవాసురులకు యమునిలాంటివాడు. మనుష్యులకు, ఋషులకు విరోధంగా ప్రవర్తించేవాడు, శత్రుదుర్భేద్యమైన మూర్తిలింగరూపమైన గుహను భూమిలో నిర్మించుకొని, అందులో ఉండేవాడు.
త్వష్టుర్దుహితరం భౌమః కశేరుమగమత్ తదా ।
గజరూపేణ జగ్రాహ రుచిరాంగీం చతుర్దశీమ్ ॥
నరకాసురుని భౌముడని కూడా అంటారు. అతడు ఏనుగురూపంలో త్వష్ట యొక్క కూతురు కశేరువును చేపట్టాడు. ఆమె చాలా అందమైంది. పదునాల్గుసంవత్సరాల ప్రాయం కలది.
ప్రమథ్య చ జహారైతాం హృత్వా చ నరకోఽబ్రవీత్ ।
నష్టశోకభయాబాధః ప్రాగ్జ్యోతిషపతిస్తదా ॥
నరకుడు ప్రాగ్ జ్యోతిషపురాన్ని పాలించేవాడు. అతనికి దుఃఖం కాని, భయం కాని, బాధలు కాని లేవు. అతడు కశేరువును బలవంతంగా చేపట్టి తనపురానికి ఎత్తుకొనివచ్చాడు. ఆమెతో ఇలా అన్నాడు.
నరక ఉవాచ
యాని దేవమనుష్యేషు రత్నాని వివిధాని చ ।
బిభర్తి చ మహీ కృత్స్నా సాగరేషు చ యద్ వసు ॥
అద్యప్రభృతి తద్ దేవి సహితాః సర్వనైరృతాః ।
తవైవోపహరిష్యంతి దైత్యాశ్చ సహ దానవైః ॥
నరకుడిలా అన్నాడు - దేవీ! దేవతల దగ్గర, మనుష్యుల దగ్గర ఉన్న వివిధ రత్నాలన్నింటిని , ఈ భూమి మీద, సముద్రాలలోను ఉన్న సంపదలను ఈ రోజు నుండి దైత్యులు, దానవులు, సర్వరాక్షసులు నీకు బహుమానంగా ఇస్తారు.
భీష్మ ఉవాచ
ఏవముత్తమరత్నాని బహూని వివిధాని చ ।
స జహార తదా భౌమః స్త్రీరత్నాని చ భారత ॥
భీష్ముడిలా అన్నాడు - భరతనందనా! ఈ విధంగా ఎన్నో ఉత్తమ రత్నాలను స్త్రీరత్నాలను కూడా నరకుడు ఎత్తుకొనివచ్చాడు.
గంధర్వాణాం చ యాః కన్యాః జహార నరకో బలాత్ ।
యాశ్చ దేవమనుష్యాణాం సప్త చాప్సరసాం గణాః ।
ఆ నరకుడు గంధర్వకన్యలను, దేవమనుష్యకన్యలను, ఏడు విధాల అప్సరోగణాలను బలవంతంగా ఎత్తుకొనివచ్చాడు.
చతుర్దశసహస్రాణాం చైకవింశచ్ఛతాని చ ।
ఏకవేణీధరాః సర్వాః సతాం మార్గమనువ్రతాః ॥
ఆ రీతిగా కొనిరాబడిన స్త్రీలు పదహారువేల వందమంది అతని దగ్గర ఉన్నారు. వారంతా సత్పురుషుల మార్గాన్ని అనుసరిస్తూ, ఏకవేణీధరలై నియమంగా ఉంటున్నారు.
తాసామంతఃపురం భౌమోఽకారయన్మణిపర్వతే ।
ఔదకాయామదీనాత్మా మురస్య విషయం ప్రతి ॥
నరకుడు వారందరికి మణిపర్వతం మీద అంతఃపురాన్ని నిర్మించాడు. దానిపేరు ఔదక. దాన్ని మురాసురుని అధీనంలో ఉంచాడు.
తాశ్చ ప్రాగ్జ్యోతిషో రాజా మురస్య దశచాత్మజాః ।
నైరృతాశ్చ యథా ముఖ్యాః పాలయంత ఉపాసతే ॥
వారిని ప్రాగ్జ్యోతిషపురరాజు నరకుడు, మురాసురుని పదిమంది కుమారులు, ఇతరులైన ముఖ్యరాక్షసులు రక్షిస్తూ సేవిస్తున్నారు.
స ఏవ తపసామ్ పారే వరదత్తో మహీసుతః ।
అదితిం ధర్షయామాస కుండలార్థం యుధిష్ఠిర ॥
యుధిష్ఠిరా! భూమిపుత్రుడైన నరకాసురుడు తపస్సు చివరిలో వరాన్ని పొందాడు. దానితో గర్వించి దేవమాత అదితిని కుండలాల కోసం అవమానించాడు.
న చాసురగణైః సర్వైః సహితైః కర్మ తత్ పురా ।
కృతపూర్వం మహాఘోరం యదకార్షీన్మహాసురః ॥
మునుపు రాక్షసులెవ్వరూ చేయని మహాఘోరమైన పాపాన్ని ఆ నరకాసురుడు చేశాడు.
యం మహీ సుషువే దేవీ యస్య ప్రాగ్జ్యోతిషం పురమ్ ।
విషయాంతపాలాశ్చత్వారః యస్యాసన్ యుద్ధదుర్మదాః ॥
భూదేవి అతనిని కన్నది. ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా అతడు రాజ్యమేలుతున్నాడు. యుద్ధ దుర్మదులైన నలుగురు దైత్యులు ఎల్లపుడు ఆ పురాన్ని రక్షిస్తూంటారు.
ఆదేవయానమావృత్య పంథానం పర్యవస్థితాః ।
త్రాసనాః సురసంఘానాం విరూపై రాక్షసైః సహ ॥
ఆ రాక్షసులు తక్కిన వికృతరూపాలు గల రాక్షసులతోపాటుగా భుమార్గం నుండి దేవమార్గం దాకా మార్గాన్నంతా ఆక్రమించి అందరినీ భయపెడుతూంటారు.
హయగ్రీవో నిశుంభశ్చ ఘోరః పంచజనస్తథా ।
మురః పుత్రసహస్రైశ్చ వరదత్తో మహాసురః ॥
హయగ్రీవుడు, నిశుంభుడు, క్రూరుడైన పంచజనుడు, వేయిమంది పుత్రులు గల మురుడు - వీరు నలుగురు వరదానం పొంది సంచరించేవారు.
తద్వధార్థం మహాబాహుః ఏష చక్రగదాసిధృక్ ।
జాతో వృష్ణిషు దేవక్యాం వాసుదేవో జనార్దనః ॥
వారిని చంపడం కోసం, మహాబాహువు, చక్రగదాఖడ్గధారి, జనార్దనుడూ అయిన వాసుదేవుడు వృష్ణివంశంలో జన్మించాడు.
తస్యాస్య పురుషేంద్రస్య లోకప్రథితతేజసః ।
నివాసో ద్వారకా తాత విదితో వః ప్రధానతః ॥
నాయనా! యుధిష్ఠిరా! లోకప్రసిద్ధ తేజస్సు గల ఆ పురుషోత్తముడు ద్వారకలో నివసిస్తూన్నాడు. ఈ విషయం మీకందరికీ తెలుసు.
అతీవ హి పురీ రమ్యా ద్వారకా వాసవక్షయాత్ ।
అతి వై రాజతే పృథ్వ్యాం ప్రత్యక్షం తే యుధిష్ఠిర ॥
యుధిష్ఠిరా! ఇంద్రుని నివాసమైన అమరావతి కంటె మిక్కిలి అందమైన నగరం ద్వారక. ఈ భుమిపై అన్నింటికంటె మిక్కిలి అందమైంది ద్వారక. నీవీ విషయం ప్రత్యక్షంగా ఎరుగుదువు.
తస్మిన్ దేవపురప్రఖ్యే సా సభా వృష్ణ్యుపాశ్రయా ।
యా దాశార్హీతి విఖ్యాతా యోజనాయతవిస్తృతా ॥
అమరావతిలా ప్రసిద్ధమైన ఆ ద్వారకానగరంలో వృష్ణివంశీయులంతా ఉండే పెద్దసభామండపం ఉంది. అది 'దాశార్హి' అను పేరుతో ప్రసిద్ధమైంది. అది ఒక యోజనవైశాల్యం కలది.
తత్ర వృష్ణ్యంధకాః సర్వే రామకృష్ణపురోగమాః ।
లోకయాత్రామిమాం కృత్స్నాం పరిరక్షంత ఆసతే ॥
బలరామకృష్ణులు ముందుండగా, వృష్ణి, అంధకవంశీయులంతా అక్కడుండేవారు. వారు సమస్తమైన జనుల జీవనాన్నీ రక్షిస్తూ ఉండేవారు.
తత్రాసీనేషు సర్వేషు కదాచిద్ భరతర్షభ ।
దివ్యగంధా వపుర్వాతాః కుసుమానాం చ వృష్ణయః ॥
భరతశ్రేష్ఠా! అక్కడి ఆసనాలన్నింటి యందు ఒకానొకప్పుడు దివ్యపరిమళం గల గాలులు వీచాయి. పూలవానలు కురిశాయి.
తతః సూర్యసహస్రాభః తేజోరాశిర్మహాద్భుతః ।
ముహూర్తమంతరిక్షేఽభూత్ తతో భూమౌ ప్రతిష్ఠితః ॥
తరువాత వేయిసూర్యుల సమానకాంతి గల మహాద్భుతమైన తేజోరాశి ముహూర్తకాలం అంతరిక్షంలో ఉండి, తరువాత భూమిపై అవతరించింది.
మధ్యే తు తేజసస్తస్య పాండర గజమాస్థితః ।
వృతో దేవగణైః సర్వైః వాసవః ప్రత్యదృశ్యత ।
ఆ తేజస్సు మధ్యలో తెల్లని ఎనుగుపై దేవగణాలతో పరివృతుడై ఇంద్రుడు కనబడ్డాడు.
రామకృష్ణౌ చ రాజా చ వృష్ణ్యంధకగణైః సహ ।
ఉత్పత్య సహసా తస్మై నమస్కారమకుర్వత ॥
బలరామకృష్ణులు, ఉగ్రసేనమహారాజు, వృష్ణ్యంధక గణాలు వెంటనే ఎదురేగి అతనికి నమస్కరించారు.
సోఽవతీర్య గజాత్ తూర్ణం పరిష్వజ్య జనార్దనమ్ ।
సస్వజే బలదేవం చ రాజానం చ తమాహుకమ్ ॥
అతడు ఏనుగు మీద నుండి వేగంగా దిగి, జనార్దనుని బలదేవుని, రాజును కౌగిలించుకొన్నాడు.
ఉద్ధవం వసుదేవం చ వికద్రుం చ మహామతిమ్ ।
ప్రద్యుమ్నసాంబనిశఠాన్ అనిరుద్ధం ససాత్యకిమ్ ॥
గదం సారణమక్రూరం కృతవర్మాణమేవ చ ।
చారుదేష్ణం సుదేష్ణం చ అన్యానపి యథోచితమ్ ॥
పరిష్వజ్య చ దృష్ట్వా చ భగవాన్ భుతభావనః ।
ఉద్ధవుని, వసుదేవుని, ధిశాలి వికద్రువుని, ప్రద్యుమ్నుని, సాంబుని, నిశఠుని, అనిరుద్ధుని, సాత్యకిని, గద, సారణ, అక్రూర, కృతవర్మ, చారుదేష్ణ, సుదేష్ణాది యాదవులను యథోచితంగా కౌగిలించుకొని అందరినీ చూశాడు.
వృష్ణ్యంధకమహామాత్రాన్ పరిష్వజ్యాథ వాసవః ॥
ప్రగృహ్య పూజాం తై ర్దత్తామ్ ఉవాచావనతాననః ।
అదేవిధంగా ఇంద్రుడు వృష్ణ్యంధకప్రధానులను కౌగిలించుకొ, వారు చేసిన పూజను స్వీకరించి, తలవంచుకొని ఈ విధంగా పలికాడు.
ఇంద్ర ఉవాచ
అదిత్యా చోదితః కృష్ణ తవ మాత్రాహమాగతః ॥
కుండలేఽపహృతే తాత భౌమేన నరకేణ చ ।
ఇంద్రుడిలా అన్నాడు - నాయనా! కృష్ణా! నీ తల్లి అదితి పంపగా వచ్చాను. భూమిపుత్రుడైన నరకుడు కుండలాలను అపహరించాడు.
నిదేశశబ్దవాచ్యస్త్వం లోకేఽస్మిన్ మధుసూదన ॥
తస్మాజ్జహి మహాభాగ భూమిపుత్రం నరేశ్వర ।
మధుసూదనా! మహాభాగా! నరేశ్వరా! ఈ లోకంలో తల్లి ఆదేశాన్ని ఆచరించేవాడిని నీవే. అందువల్ల నీవు నరకాసురుని సంహరించు.
భీష్మ ఉవాచ
తమువాచ మహాబాహుః ప్రీయమాణో జనార్దనః ।
నిర్జిత్య నరకం భౌమమ్ ఆహరిష్యామి కుండలే ॥
భీష్ముడిలా అన్నాడు - మహాబాహువైన జనార్దనుడు ప్రసన్నుడై అతనితో ఇలా అన్నాడు - ఆ నరకాసురుని సంహరించి కుండలాలను తీసికొని వస్తాను.
ఏవముక్త్వా తు గోవిందః రామమేవాభ్యభాషత ।
ప్రద్యుమ్నమనిరుద్ధం చ సాంబం చాప్రతిమం బలే ॥
ఏతాంశ్చోక్త్వా తదా తత్ర వాసుదేవో మహాయశాః ।
అథారుహ్య సుపర్ణం వై శంఖచక్రగదాసిధృక్ ॥
యయౌ తదా హృషీకేశో దేవానాం హితకామ్యయా ।
ఇలా పలికి బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు మున్నగువారితో గోవిందుడు మాట్లాడాడు. తర్వాత మహాయశస్వి అయిన వాసుదేవుడు దేవతలకు హితాన్ని చేయగోరి గరుడవాహనాన్ని అధిరోహించి వెళ్ళాడు.
తం ప్రయాంతమమిత్రఘ్నం దేవాః సహ పురందరాః ॥
పృష్ఠతోఽనుయయుః ప్రీతాః స్తువంతో విష్ణుమచ్యుతమ్ ।
శత్రుసంహర్త, అచ్యుతుడూ అయిన శ్రీకృష్ణుడు బయలుదేరగా వెనుకనే ఇంద్రుని ముందిడుకొని దేవతలందరు ఆనందంతో స్తుతిస్తూ వెళ్ళారు.
సోఽగ్ర్యాన్ రక్షోగణాన్ హత్వా నరకస్య మహాసురాన్ ॥
క్షురాంతాన్ మౌరవాన్ పాశాన్ షట్ సహస్రం దదర్శ సః ।
శ్రీకృష్ణభగవానుడు నరకాసురుని యొక్క ముఖ్యులైన రాక్షసగణాలను సంహరించాడు. మురాసురుడు సృష్టించిన ఆరువేల పాశాలను చూశాడు. ఆ పాశాల చివరల చురకత్తులుంటాయి.
సంచ్ఛిద్య పాశాంస్త్వ స్త్రేణ మురం హత్వా సహాన్వయమ్ ॥
శిలాసంఘానతిక్రమ్య నిశుంభమవపోధయత్ ।
శ్రీకృష్ణుడు అస్త్రంతో ఆ పాశాలను ఛేదించి, మురాసురునీ, అతని వంశీయులందరినీ సంహరించాడు. శిలాసంఘాలను అతిక్రమించి, నిశుంభుని సంహరించాడు.
యః సహస్రసమస్త్వేకః సర్వాన్ దేవానయోధయత్ ॥
తం జఘాన మహావీర్యం హయగ్రీవం మహాబలమ్ ।
అటుపై వేలయోధులకు సమానమైనవాడు, సర్వదేవతలతో ఒంటరిగా యుద్ధం చేయగల మహాబలవంతుడూ, తేజోవంతుడూ అయిన హయగ్రీవుని శ్రీకృష్ణుడు సంహరించాడు.
అపారతేజా దుర్ధర్షః సర్వయాదవనందనః ॥
మధ్యే లోహితగంగాయాం భగవాన్ దేవకీసుతః ।
ఔదకాయాం విరూపాక్షమ్ జఘాన భరతర్షభ ॥
పంచ పంచజనాన్ ఘోరాన్ నరకస్య మహాసురాన్ ।
భరతశ్రేష్ఠా! యదవులందరికీ ఆనందం కలిగించేవాడు, దేవకీసుతుడు, అమితతేజస్వి అయిన శ్రీకృష్ణుడు లోహితగంగమనేచోట ఉన్న ఔదకమనే ప్రదేశంలో విరూపాక్షుని, నరకుని వెంటనుంటూ క్రూరమైన పంచజనులుగా ప్రసిద్ధినొందిన రాక్షసులను సంహరించాడు.
తతః ప్రాగ్జ్యోతిషం నామ దీప్యమానమివ శ్రియా ॥
పురమాసాదయామాస తత్ర యుద్ధమవర్తత ।
అనంతరం సంపదలతో ప్రకాశిస్తూన్నట్లుగా ఉన్న ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది.
మహద్ దైవాసురం యుద్ధం యద్ వృత్తం భరతర్షభ ॥
యుద్ధం న స్యాత్ సమం తేన లోకవిస్మయకారకమ్ ।
భరతశ్రేష్ఠా! వారికి జరిగిన యుద్ధంతో దైవాసురులకు జరిగిన మహాయుద్ధం కూడా సమానమైంది కాదు. అది లోకానికంతటికి మిక్కిలి ఆశ్చర్యకరంగా ఉంది.
చక్రలాంఛానసంఛిన్నాః శక్తిఖడ్గహతాస్తదా ॥
నిపేతుర్దానవాస్తత్ర సమాసాద్య జనార్దనమ్ ।
జనార్దనుని ఎదుర్కొన్న దానవులు చక్రం, లాంఛనం, శక్తి, ఖడ్గం మున్నగు వానిచే పడిపోయారు.
అష్టౌ శతసహస్రాణి దానవానాం పరంతప ।
నిహత్య పురుషవ్యాఘ్రః పాతాళవివరం యయౌ ॥
త్రాసనం సురసంఘానాం నరకం పురుషోత్తమః ।
యోధయత్యతితేజస్వీ మధువన్మధుసూదనః ॥
పురుషశ్రేష్ఠుడు, పురుషోత్తముడు, మధుసూదనుడూ అయిన శ్రీకృష్ణుడు ఎనిమిది లక్షల మంది దానవులను సంహరించి, పాతాళగుహలోకి ప్రవేశించాడు. అక్కడ దేవతాసంఘాలకు భయంకరమైన నరకునితో అతితేజస్వియైన కృష్ణుడు మధురాక్షసునితో వలె యుద్ధం చేయసాగాడు.
తద్ యుద్ధమభవద్ ఘోరం తేన భౌమేన భారత ।
కుండలార్థే సురేశస్య నరకేణ మహాత్మనా ॥
భరతనందనా! దేవేంద్రుని కోరికపై అదితికుండలాల కొరకు మహాత్ముడైన శ్రీకృష్ణునికి, నరకునికి ఘోరమైన యుద్ధం జరిగింది.
ముహూర్తం లాలయిత్వాథ నరకం మధుసూదనః ।
ప్రవృత్తచక్రం చక్రేణ ప్రమమాథ బలాద్ బలీ ॥
సుదర్శన చక్రాన్ని ధరించి బలవంతుడై మధుసూదనుడు ముహూర్తకాలం నరకుని లాలనతో పలకరించి, పిమ్మట చక్రంతో అతని శిరస్సును ఖండించాడు.
చక్రప్రమథితం తస్య పపాత సహసా భువి ।
ఉత్తమాంగం హతాంగస్య వృత్రే వజ్రహతే యథా ॥
వజ్రాయుధం చేత వృత్రాసురునిలా చక్రం చేత ఖండింపబడిన అత్ని శిరస్సు హఠాత్తుగా భూమిపై పడింది.
భూమిస్తు పతితం దృష్ట్వా తే వై ప్రాదాచ్చ కుండలే ।
ప్రదాయ చ మహాబాహుమ్ ఇదం వచనమబ్రవీత్ ॥
భూదేవి నేలపై పడిన నరకుని చూసి, కుండలాలు తీసికొని శ్రీకృష్ణుని కిచ్చి, ఆ మహాబాహునితో ఇలా పలికింది.
స్పష్టస్త్వయైవ మధుహన్ త్వ యైవ నిహతః ప్రభో ।
యథేచ్ఛసి తథా క్రీడన్ ప్రజాస్తస్యానుపాలయ ॥
భూమి ఇలా అంది - ప్రభూ! మధుసూదనా! నీచేతనే సృష్టించబడ్డాడు. నీచేతనే చంపబడ్డాడు. నీవెలా కోరుకొంటే అలా ఆడుకో. అతని సంతానాన్ని మాత్రం రక్షించు.
శ్రీభగవానువాచ
దేవానాం చ మునీనాం చ పితౄణాం చ మహాత్మనామ్ ।
ఉద్వేజనీయో భూతానాం బ్రహ్మద్విట్ పురుషాధమః ॥
లోకద్విష్టః సుతస్తే తు దేవారిర్లోకకంటకః ।
శ్రీకృష్ణభగవానుడిలా అన్నాడు - నీ కుమారుడైన ఈ నరకుడు దేవతలను, మునులను, పితరులను, మహాత్ములను, సర్వప్రాణులను భయపెట్టినవాడు. బ్రహ్మద్వేషి, పురుషాధముడు, జనులచే ద్వేషింపబడినవాడు, దేవతలకు శత్రువు. లోక కంటకుడూను.
సర్వలోకనమస్కార్యామ్ అదితం బాధతే బలీ ॥
కుండలే గర్వసంఫూర్ణః తతోఽసౌ నిహతోఽసురః ।
సమస్తలోకాలకు నమస్కరింపదగిన అదితిని బాధించి బలవంతంగా, గర్వంతో కుండలాలను అపహరించినవాడు, అందువల్ల ఇతడు చంపబడినాడు.
వైవ మన్యుస్త్వయా కార్యః యత్ కృతం మయి భామిని ॥
మత్ర్పభావాచ్చ తే పుత్రః లబ్ధవాన్ గతిముత్తమామ్ ।
తస్మాద్ గచ్ఛ మహాభాగే భారావతరణం కృతమ్ ॥
భామినీ! నేను చేసిన పని వల్ల నీవు నాపట్ల కోపగించవద్దు. నా ప్రభావం వల్ల నీపుత్రుడు ఉత్తమగతిని పొందాడు. మహాభాగా! అందువల్ల ఇక నీవు వెళ్ళు. నీకు భారాన్ని తగ్గించాను.
భీష్మ ఉవాచ
నిహత్య నరకం భౌమం సత్యభామా సహాయవాన్ ।
సహితో లోకపాలైశ్చ దదర్శ నరకాలయమ్ ॥
భీష్ముడిలా అన్నాడు - సత్యభామ తోడుండగా, భూమికుమారుడైన నరకుని సంహరించి, లోకపాలురతోపాటు శ్రీకృష్ణుడు నరకుని నివాసాన్ని సందర్శించాడు.
అథాస్య గృహమాసాద్య నరకస్య యశస్వినః ।
దదర్శ ధనమక్షయ్యం రత్నాని వివిధాని చ ॥
యశ్వసి అయిన నరకుని ఇంట్లో అక్షయమైన ధనం, వివిధరత్నాలు ఉండటం చూశాడు.
మణిముక్తాప్రవాలాని వైడూర్య వికృతాని చ ।
అశ్మసారానర్కమణీన్ విమలాన్ స్ఫాటికానపి ॥
మణులు, ముత్యాలు, ప్రవాళాలు, వైడూర్యాలు పొదిగిన వస్తువులు, అశ్వసారాలు, సూర్యకాంతమణులు, స్వచ్ఛ స్ఫటికాలూ ఉన్నాయి.
జాంబూనదమయాన్యేవ శాతకుంభమయాని చ ।
ప్రదీప్తజ్వలనాభాని శీతరశ్మిప్రభాణి చ ॥
జాంబూనదం, శాంతకుంభం అనే బంగారాలతో చేయబడిన వస్తువులు, అశ్వసారాలు, సూర్యకాంతమణులు, స్వచ్ఛ స్ఫటికాలూ ఉన్నాయి.
జాంబూనదమయాన్యేవ శాతకుంభమయాని చ ।
ప్రదీప్తజ్వలనాభాని శీతరశ్మిప్రభాణి చ ॥
జాంబూనదం, శాంతకుంభం అనే బంగారాలతో చేయబడిన వస్తువులు, మండుతున్న అగ్నివలె ప్రకాశిస్తూ చంద్రకాంతి వంటి ప్రకాశం కల అనేక వస్తువులున్నాయి.
హిరణ్యవర్ణం రుచిరం శ్వేతమభ్యంతరం గృహమ్ ।
యదక్షయం గృహే దృష్టం నరకస్య ధనం బహు ॥
న హి రాజ్ఞః కుబేరస్య తావద్ ధనసముచ్ఛ్రయః ।
దృష్టపూర్వః పురా సాక్షాత్ మహేంద్రసదనేష్వపి ॥
అంతఃపురభవనం బంగారువర్ణంతో స్వచ్ఛంగా ప్రకాశిస్తున్నది. ఆ గృహంలో నరకుని అక్షయసంపదలు ఉన్నాయి. అంతటి సంపద కుబేరుని దగ్గర కూడా ఉండదు. సాక్షాత్తూ మహేంద్రుని భవనాలలో కూడ అంత సంపదను పూర్వం చూసి ఉండలేదు.
ఇంద్ర ఉవాచ
ఇమాని మణిరత్నాని వివిధాని వసూని చ ॥
హేమసూత్రా మహాకక్ష్యాః తోమరైర్వీర్యశాలినః ।
భీమరూపాశ్చ మాతంగాః ప్రవాళనికృతాః కుథాః ॥
విమలాభిః పతాకాభిః వాసాంసి వివిధాని చ ।
తే చ వింశతిసాహస్రాః ద్విస్తావత్యః కరేణవః ॥
ఇంద్రుడిలా అన్నాడు - వివిధ మణిరత్నాలి, సంపదలు, బంగారు జలతారుగల పెద్ద పెద్ద అంబారీలు. తోమరాలతో భీమరూపం గల ఏనుగులు, పగడాలు పొదిగిన కంబళ్ళు/బొంతలు, నిర్మలమైన పతాకాలు, వివిధ వస్త్రాలు, (వీటన్నింటిపై నీకే అధికరాం ఉంది) ఇరవై వేల ఏనుగులు, వాటికి రెట్టింపు ఆడ ఏనుగులూ ఉన్నాయి.
అష్టాశతసహస్రాణి దేశజాశ్చోత్తమా హయాః ।
గోభిశ్చావికృతైర్యానైః కామం తవ జనార్దన ॥
దేశీయాలై శ్రేష్ఠాలైన అశ్వాలు ఎనిమిది లక్షలున్నాయి. ఎద్దులతో కూడిన క్రొత్త క్రొత్త (వాహనాలు) బళ్ళు ఉన్నాయి. ఇవన్నీ నీవే.
ఆవికాని చ సూక్ష్మాణి శయనాన్యాసనాని చ ।
కామవ్యాహారిణశ్చైవ పక్షిణః ప్రియదర్శనాః ॥
చందనాగురుమిశ్రాణి యానాని వివిధాని చ ।
ఏతత్ తే ప్రాపయిష్యామి వృష్ణ్యావాసమరిందమ ॥
శత్రుదమనా! సన్నని ఉన్ని వస్త్రాలు, అనేక విధాలైన శయనాలు, ఆసనాలు, ఇచ్ఛానుసారం మాట్లాడే అందమైన పక్షులు, చందనాగురు మిశ్రితాలైన వివిధరథాలు ఉన్నాయి. వీటన్నింటిని వృష్ణివంశీయుల నివాసమైన ద్వారకకు తరలిస్తాను.
భీష్మ ఉవాచ
దేవగంధర్వరత్నాని దైతేయాసురజాని చ ।
యాని సంతీహ రత్నాని నరకస్య నివేశనే ॥
ఏతత్ తు గరుడే సర్వం క్షిప్రమారోప్య వాసవః ।
దాశార్హ పతినా సార్ధమ్ ఉపాయాన్మణిపర్వతమ్ ॥
భీష్ముడిలా అన్నాడు - నరకాసురభవనంలో ఉన్న దేవతల యొక్క, గంధర్వుల యొక్క, దైత్యుల యొక్కయు, అసురులయొక్కయు రత్నాలనన్నింటిని ఇంద్రుడు కృష్ణునితో పాటు గరుడునిపైకెక్కించి, మణిపర్వతం మీదికి వెళ్ళాడు.
తత్ర పుణ్యా వపుర్వాతాః ప్రభాశ్చిత్రాః సముజ్జ్వలాః ।
ప్రేక్షతాం సురసంఘానాం విస్మయః సమపద్యత ॥
అక్కడ స్వచ్ఛంగా గాలులు వీచాయి. విచిత్రాలైన ఉజ్జ్వలకాంతులు అంతట వ్యాపించాయి. వాటిని చూస్తూన్న దేవతా సమూహాలు ఆశ్చర్యం పొందారు.
త్రిదశా ఋషయశ్చైవ చంద్రాదిత్యౌ యథా దివి ।
ప్రభయా తస్య శైలస్య నిర్విశేషమివాభవత్ ॥
ఆ పర్వతకాంతి ఆకాశంలోని చంద్రసూర్య దేవతామహర్షుల కాంతిని తిరస్కరిస్తోంది. దానితో వాటి కాంతిలో విశేషమేమీ లేనట్లుంది.
అనుజ్ణాతస్తు రామేణ వాసవేన చ కేశవః ।
ప్రీయమాణో మహాబాహుః వివేశ మణిపర్వతమ్ ॥
బలరామునిచేత, ఇంద్రునిచేత అనుజ్ఞ పొంది మహాబాహువైన శ్రీకృష్ణుడు ప్రీతితో నరకాసురని నివాసమైన మణిపర్వతాన్ని ప్రవేశించాడు.
తత్ర వైడూర్యవర్ణాని దదర్శ మధుసూదనః ।
సతోరణపతాకాని ద్వారాణి శరణాని చ ॥
అక్కడ వైడూర్యవర్ణాలతో నున్న ద్వారాలను, తోరణపతాకాలు గల గృహాలను మధుసూదనుడు చూశాడు.
చిత్రగ్రథితమేఘాభః ప్రబభౌ మణిపర్వతః ।
హేమచిత్రపతాకైశ్చ ప్రాసాదైరుపశోభితః ॥
స్వర్ణమయమైన విచిత్ర పతాకాలు గల భవనాలతో శోభిల్లుతున్న మణిపర్వతము చిత్రమందు వ్రాయబడిన మేఘం వలె ప్రకాశిస్తోంది.
హర్మ్యాణి చ విశాలాని మణిసోపానవంతి చ ।
తత్రస్థా వరవర్ణాభా దదృశుర్మధుసూదనమ్ ॥
గంధర్వసురముఖ్యానాం ప్రియా దుహితరస్తదా ।
త్రివిష్టపసమే దేశే తిష్ఠంతమపరాజితమ్ ॥
మణులు పొదిగిన మెట్లు గల విశాలహర్మ్యములున్నాయి. వాటిలో ఉన్న అందమైన మేనిఛాయగల గంధర్వ, సురముఖ్యుల ప్రియురాండ్రు, కూతుళ్లు, స్వర్గసమానమైన ఆ ప్రదేశంలో ఉన్న అపరాజితుడైన మధుసూదనుని చూశారు.
పరివప్రుర్మహాబాహుమ్ ఏకవేణీధరాః స్త్రియః ।
సర్వాః కాషాయవాసిన్యః సర్వాశ్చ నియంతేంద్రియాః ॥
అతనిని చూడగానే వారంతా శ్రీకృష్ణుని దగ్గరకు పరుగెత్తుకొని వచ్చారు. వారంతా కాషాయ వస్త్రాలు ధరించి, ఇంద్రియ నిగ్రహంతో ఒంటిజడతో తపస్సు చేస్తూ ఉన్నారు.
వ్రతసంతాపజః శోకః నాత్ర కాశ్చిదపీడయత్ ।
అరజాంసి చ వాసాంసి బిభ్రత్యః కౌశికాన్యపి ॥
సమేత్య యదుసింహస్య చక్రురస్యాంజలిం స్త్రియః ।
ఊచుశ్చైనం హృషీకేశం సర్వాస్తాః కమలేక్షణాః ॥
వ్రతాన్ని పాటించడం వల్ల కలిగిన దుఃఖం వారినెవ్వరినీ బాధపెట్టలేదు. నిర్మలమైన, ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించిన ఆ స్త్రీలు యదుసింహుడైన హృషీకేశుని వద్దకు వెళ్ళి చేతులు జోడించి, నమస్కరించి, ఇలా అన్నారు.
కన్యకా ఊచుః
నారదేన సమాఖ్యాతమ్ అస్మాకం పురుషోత్తమ ।
ఆగమిష్యతి గోవిందః సురకార్యార్థసిద్ధయే ॥
ఆ కన్యకలిలా అన్నారు - పురుషోత్తమా! దేవతల కార్యసిద్ధికై గోవిందుడు వస్తాడని నారదుడు మాకు చెప్పాడు.
సోఽసురం నరకం హత్వా నిశుంభం మురమేవ చ ।
భౌమం చ సపరివారం హయగ్రీవం చ దానవమ్ ॥
తథా పంచజనం చైవ ప్రాప్స్యతే ధనమక్షయమ్ ।
అతడు సపరివారంగా నరకుని, నిశంభుని, మురాసురుని, హయగ్రీవుని, పంచజనులను సంహరించి, ఈ అనంత సంపదను పొందుతాడు.
సోఽచిరేణైవ కాలేన యుష్మన్మోక్తా భవిష్యతి ॥
ఏవముక్త్వాగమద్ ధీమాన్ దేవర్షిర్నారదస్తథా ।
అతడు చిరకాలంలోనే మిమ్ము విడిపిస్తాడు. అని దేవర్షి నారదుడు చెప్పి వెళ్లాడు.
త్వాం చింతయానాః సతతం తపో ఘోరముపాస్మహే ॥
కాలేఽతీతే మహాబాహుం కదా ద్రక్ష్యామ మాధవమ్ ।
నిన్ను తలుచుకొంటూ నిత్యం ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాము. చాలాకాలం గడచింది. మహాబాహువు అయిన మాధవుని ఎపుడు చూస్తామో!
ఇత్యేవం హృది సంకల్పం కృత్వా పురుషసత్తమ ॥
తపశ్చరామ సతతం రక్ష్యమాణా హి దానవైః ।
అని మనసులో సంకల్పం చేసికొని, పురుషోత్తమా! ఈ రాక్షసులచే రక్షింపబడుతూ, ఎల్లపుడూ తపస్సు చేస్తున్నాము.
గాంధేర్వేణ వివాహేన వివాహం కురు నః ప్రియమ్ ॥
తతోఽస్మత్ర్పియకామార్థం భగవాన్ మారుతోఽబ్రవీత్ ।
యథోక్తం నారదేనాద్య న చిరాత్ తద్ భవిష్యతి ।
గాంధర్వవిధితో వివాహం చేసికొని మాకు ప్రియాన్ని కల్గించు. మాకు ప్రియమైన కోరిక సిద్ధించటం కొరకు వాయుదేవుడు కూడా 'దేవర్షి నారదుడు చెప్పింది త్వరలో జరుగుతుంది' అని చెప్పాడు.
భీష్మ ఉవాచ
తాసాం పరమనారీణామ్ ఋషభాక్షం పురస్కృతమ్ ।
దదృశుర్దేవగంధర్వాః గృష్ణీనామివ గోపతిమ్ ॥
భీష్ముడిలా అన్నాడు - యుధిష్ఠిరా! దేవగంధర్వాది స్త్రీలచే గౌరవింపబడిన ఆ వృషభాక్షుడైన శ్రీకృష్ణుని దేవగంధర్వులంతా నూతనగోవులతో కూడిన గోపాలునిలా చూశారు.
తస్య చంద్రోపమం వక్ర్తమ్ ఉదీక్ష్య ముదితేంద్రియాః ।
సంప్రహృష్టా మహాబాహుమ్ ఇదం వచనమబ్రువన్ ॥
చంద్రునిలా ఉన్న అతని ముఖాన్ని చూసి సంతుష్టమనస్కలై ఆ కన్యలు ఆనందంతో మహాబాహువైన శ్రీకృష్ణునితో ఇలా అన్నారు.
కన్యకా ఊచుః
సత్యం బత పురా వాయుః ఇదమస్మానిహాబవీత్ ।
సర్వభూతకృతజ్ఞశ్చ మహర్షిరపి నారదః ॥
కన్యకలు ఇలా అన్నారు - పూర్వమెప్పుడో వాయుదేవుడు ఈ మాట మాకు చెప్పాడు. అది నిజమైంది. ప్రాణులందరి పనులూ తెలిసికొన గల నారదమహర్షి కూడా ఇలా చెప్పాడు.
విష్ణుర్నారాయణో దేవః శంఖచక్రగదాసిధృక్ ।
స భౌమం నరకం హత్వా భర్తా వో భవితా హ్యతః ॥
సర్వవ్యాపకుడైన నారాయణుడు శంఖ, చక్ర, గదా, ఖడ్గాలను ధరించి, భూమికుమారుడైన నరకుని చంపి మీకు భర్త కాగలడు.
దిష్ట్యా తస్యర్షిముఖ్యస్య నారదస్య మహాత్మనః ।
వచనం దర్శనాదేవ సత్యం భవితుమర్హతి ॥
మా సౌభాగ్యం వల్ల ఆ దేవర్షి ముఖ్యుడైన నారదమహాత్ముని వచనం నీ దర్శనం చేతనే నిజం కాదగింది.
యత్ ప్రియం బత పశ్యామ వక్ర్తం చంద్రోపమం తు తే ।
దర్శనేన కృతార్థాః స్మః వయమద్య మహాత్మానః ॥
మహాత్ముడవైన చంద్రుని వంటి నీముఖం చూడటం చేతనే ఈ రోజు మేము కృతార్థులమయ్యాము.
భీష్మ ఉవాచ
ఉవాచ స యదుశ్రేష్ఠః సర్వా స్తా జాతమన్మథాః ।
భీష్ముడిలా అన్నాడు - భగవంతుని పట్ల కామభావం కలిగిన వారందరితో యదుశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడిలా అన్నాడు.
శ్రీ భగవానువాచ
యథా బ్రూత విశాలాక్ష్యః తత్ సర్వం వో భవిష్యతి ॥
శ్రీ భగవంతుడు ఇలా అన్నాడు - సుందరీమణులారా! మీరు కోరినవిధంగానే అంతా మీకు జరుగుతుంది.
భీష్మ ఉవాచ
తాని సర్వాణి రత్నాని గమయుత్వాథ కింకరైః ।
స్ర్తియశ్చ గమయిత్వాథ దేవతా నృపకన్యకాః ॥
వైనతేయభుజే కృష్ణః మణిపర్వతముత్తమమ్ ।
క్షిప్రమారోపయాంచక్రే భగవాన్ దేవకీసుతః ॥
భీష్ముడిలా అన్నాడు - ఆ సమస్త రత్నాలను, దేవతానృపకన్యకలను, ఇతర స్త్రీలను సేవకులచే ద్వారకకు పంపి, దేవకీసుతుడైన శ్రీకృష్ణుడు శ్రేష్ఠమగు మణిపర్వతాన్ని వైనతేయుని భుజాలపై వేగంగా ఎక్కించాడు.
సపక్షిగణమాతంగం సవ్యాలమృగపన్నగమ్ ।
శాఖామృగగణైర్జుష్టం సప్రస్తరశిలాతలమ్ ॥
న్యంకుభిశ్చ వరాహైశ్చ రురుభిశ్చ నిషేవితమ్ ।
సప్రపాతమహాసానుం విచిత్రశిఖిసంకులమ్ ॥
తం మహేంద్రానుజం శౌరిః చకార గరుడోపరి ।
పశ్యతాం సర్వభూతానామ్ ఉత్పాట్య మణిపర్వతమ్ ॥
సర్వప్రాణులు చూస్తుండగా, పక్షిగణాలతో, ఏనుగులతో, సర్ప, మృగ, పన్నగాల సమూహాలతో శిలలతో న్యంకువులతో, వరాహాలతో, రురుమృగాలతో కూడి, సెలయేళ్ళతో, పెద్దసానువులతో, విచిత్రాలైన నెమళ్ళ సమూహంతో ఆ మణిపర్వతాన్ని పెకలించి శ్రీకృష్ణుడు గరుడునిపై పెట్టాడు.
ఉపేంద్రం బలదేవం చ వాసవం చ మహాబలమ్ ।
తం చ రత్నౌఘమతులం పర్వతం చ మహాబలః ॥
వరుణస్యామృతం దివ్యం ఛత్రం చంద్రోపమం శుభమ్ ।
స్వపక్షబలవిక్షేపైః మహాద్రిశిఖరోపమః ॥
దిక్షు సర్వాసు సంరావం స చక్రే గరుడో వహన్ ।
మహాపర్వతమును పోలిన మహాబలుడైన గరుడుడు బలరామకృష్ణులను, మహాబలుడైన ఇంద్రుని, రత్నరాసులను, మణిపర్వతాన్ని, వరుణుని అమృతాన్ని, చంద్రుని పోలిన దివ్యఛత్రాన్ని మోస్తూ, తన రెక్కల కదలికలచే అన్ని దిక్కుల యందు వింతధ్వనిని కలిగించాడు.
ఆరుజన్ పర్వతాగ్రాణి పాదపాంశ్చ సముత్షిపన్ ॥
సంజహార మహాభ్రాణి వైశ్వానరపథం గతః ।
ఎగురుతూన్న గరుడుడు పర్వతాగ్రాలను పడగొడుతూ, వృక్షాలను పెకలిస్తూ, జోతిష్పథంలోకి వెళుతూ పెద్దపెద్ద మేఘాలను కూడా తనతో లాక్కువెళుతున్నాడు.
గ్రహనక్షత్రతారాణాం సప్తర్షీణాం స్వతేజసా ॥
ప్రభాజాలమతిక్రమ్య చంద్రసూర్యపథం యయౌ ।
గరుడుడు తన తేజస్సుతో గ్రహనక్షత్రతారల యొక్కయు, సప్తర్షులయొక్కయు ప్రభలసముదాయాన్ని అతిక్రమించి చంద్రసూర్యమార్గానికి వెళ్ళాడు.
మేరోః శిఖరమాసాద్య మధ్యమం మధుసూదనః ॥
దేవస్థానాని సర్వాణి దదర్శ భరతర్షభ ।
భరతశ్రేష్ఠా! మేరుపర్వతం యొక్క మధ్యమశిఖరానికి చేరేసరికి మధుసూదనుడు సమస్తదేవస్థానాలను చూశాడు.
విశ్వేషాం మరుతాం చైవ సాధ్యానాం చ యుధిష్ఠిర ॥
భ్రాజమానాన్యతిక్రమ్య అశ్వినోశ్చ పరంతప ।
ప్రాప్య పుణ్యతమం స్థానం దేవలోకమరిందమః ॥
యుధిష్ఠిరా! శత్రుమర్దనా! విశ్వేదేవతల యొక్క, మరుద్గణాల యొక్క, సాధ్యుల యొక్క ప్రకాశమయస్థానాలను అతిక్రమించి, అశ్వినీకుమారుల పుణ్యతమలోకం చేరి, తరువాత శ్రీకృష్ణుడు దేవలోకం చేరాడు.
శక్రసద్మ సమాసాద్య చావరుహ్య జనార్దనః ।
సోఽభివాద్యాదితేః పాదౌ అర్చితః సర్వదేవతైః ॥
బ్రహ్మదక్షపురోగైశ్చ ప్రజాపతిభిరేవ చ ।
ఇంద్రుని భవనం చేరిన జనార్దనుడు గరుడుని పై నుండి క్రిందికి దిగి, అదితి పాదాలకు నమస్కరించాడు. సమస్తదేవతలు, బ్రహ్మ, దక్షుడు మున్నగు ప్రజాపతులందరు అతనిని పూజించారు.
అదితేః కుండలే దివ్యే దదావథ తదా విభుః ॥
రత్నాని చ పరార్థ్యాణి రామేణ సహ కేశవః ।
అటు తరువాత బలరామునితో పాటు కేశవుడు దివ్యాలయిన అదితి కుండలాలను, అమూల్యరత్నాలను ఇచ్చాడు.
ప్రతిగృహ్య చ తత్ సర్వమ్ అదితిర్వాసవానుజమ్ ॥
పూజయామాస దాశార్హం రామం చ విగతజ్వరా ।
అదితి వాటినన్నింటినీ స్వీకరించి, మానసిక దుఃఖం శాంతించగా, బలరామకృష్ణులను గౌరవించింది.
శచీ మహేంద్రమహిషీ కృష్ణస్య మహిషీం తదా ॥
సత్యభామాం తు సంగృహ్య అదిత్యై వై న్యవేదయత్ ।
ఇంద్రుని పట్టమహిషి శచీదేవీ శ్రీకృష్ణుని పట్టమహిషి సత్యభామను తీసికొనివచ్చి అదితికి పరిచయం చేసింది.
సా తస్యాః సత్యభామాయాః కృష్ణప్రియచికీర్షయా ॥
వరం ప్రాదాద్ దేవమాతా సత్యాయై విగతజ్వరా ।
దుఃఖోపశమనం పొందిన దేవమాత అదితి కృష్ణునికి ఇష్టం చేయగోరి, సత్యభామకు వరమిచ్చింది.
అదితిరువాచ
జరాం న యాస్యసి వధూః యావద్ వై కృష్ణమానుషమ్ ॥
సర్వంగధగుణోపేతా భవిష్యసి వరాననే ।
అదితి ఇలా అంది - వరాననా! (సుందరీ!) కృష్ణుడు మానవుడుగ ఉన్నంతవరకు నీవు ముసలితనం పొందవు. దివ్యగంధం, ఉత్తమగుణాలను కలిగి ఉంటావు.
భీష్మ ఉవాచ
విహృత్య సత్యభామా వై సహ శచ్యా సుమధ్యమా ॥
శచ్యాపి సమనుజ్ఞాతా యయౌ కృష్ణనివేశనమ్ ॥
భీష్ముడిలా అన్నాడు - సౌందర్యవతి అయిన సత్యభామ శచీదేవితో విహరించి, ఆమె అనుమతి గైకొని కృష్ణుని మందిరానికి వెళ్లింది.
సంపూజ్యమానస్త్రిదశైః మహర్షిగణసేవితః ।
ద్వారకాం ప్రయయౌ కృష్ణః దేవలోకాదరిందమః ॥
దేవతలచేతను, మహర్షిగణాలచేతను పూజింపబడి శ్రీకృష్ణుడు దేవలోకం నుండి ద్వారకకు బయలుదేరాడు.
సోఽతిపత్య మహాబాహుః దీర్ఘమధ్వానమచ్యుతః ।
వర్ధమానపురద్వారమ్ ఆససాద పురోత్తమమ్ ॥
మహాబాహువైన అచ్యుతుడు దీర్ఘమైన మార్గాన్నంతా దాటి, వర్ధమాన మనే ద్వారకా పురద్వారానికి చేరుకొన్నాడు.
భీష్మ ఉవాచ
తాం పురీం ద్వారకాం దృష్ట్వా విభుర్నారాయణో హరిః ।
హృష్ణః సర్వార్థసంపన్నాం ప్రవేష్టుముపచక్రమే ॥
భీష్ముడిలా అన్నాడు - సర్వవ్యాపకుడైన నారాయణుడు సర్వార్థసంపన్నమైన ఆ ద్వారకాపురిని చూసి సంతోషించి లోనికి ప్రవేశింపనారంభించాడు.
సోఽపశ్యద్ వృక్షషండాంశ్చ రమ్యానారామజాన్ బహూన్ ।
సమంతతో ద్వారవత్యాం నానాపుష్పఫలాన్వితాన్ ॥
ఆ ద్వారవతి చుట్టూ అనేకపుష్పఫలాలతో అందంగా ఉన్న ఉద్యానవనాలలోని వృక్షసమూహాలను అతడు చూశాడు.
అర్కచంద్రప్రతీకాశైః మేరుకూటనిభైర్గృహైః ।
ద్వారకా రచితా రమ్యైః సుకృతా విశ్వకర్మణా ॥
సూర్యచంద్రుల వంటి ప్రకాశంలో, మేరుశిఖరం వంటి కాంతులు గల, అందమైన గృహాలతో విశ్వకర్మ ద్వారకను నిర్మించాడు.
పద్మషండాకులాభిశ్చ హంససేవితవారిభిః ।
గంగాసింధుప్రకాశాభిః పరిఖాభిరలంకృతా ॥
పద్మలతల సముదాయాలతో నిండి, హంసలు తిరుగుతూన్న గంగాసింధునదుల వలె ప్రకాశిస్తున్న అగడ్తలతో అలరారుతూ ఉన్నది ఆ ద్వారకాపురి.
ప్రాకారేణార్కవర్ణేన పాండరేన విరాజితా ।
వియమ్మార్ధ్ని నివిష్టేన ద్యౌరివాభ్రపరిచ్ఛదా ॥
సూర్యకాంతి వంటి తెల్లని కాంతితో ప్రకాశిస్తున్న ప్రాకారంతో అది మేఘాలతో కప్పబడిన, ఆకాశశిఖరం మీద ఉంచబడిన స్వర్గం వలె ప్రకాశించింది.
నందనప్రతిమైశ్చాపి మిశ్రకప్రతిమైర్వనైః ।
భాతి చైత్రరథం దివ్యం పితామహవనం యథా ॥
వైభ్రాజప్రతిమైశ్చైవ సర్వర్తుకుసుమోత్కటైః ।
భాతి తారాపరిక్షిప్తా ద్వారకా ద్యౌరివాంబరే ॥
నందనవనాన్ని, మిశ్రకవనాలను పోలిన వనాలతో ఆ పురం ప్రకాశిస్తున్నది. దివ్యమైన బ్రహ్మయొక్క వనం వలె ప్రకాశిస్తున్నది. అన్ని ఋతువులలోని పూలతో సమృద్ధమైన వైభ్రాజమనే దివ్య వనం వలె మనోహరాలైన ఉపవనాలతో ఆకాశంలో వెదజల్లబడిన నక్షత్రాలు గల స్వర్గం వలె ద్వారకాపురి ఉంది.
భాతి రైవతకః శైలః రమ్యసానుర్మహాజిరః ।
పూర్వస్యాం దిశి రమ్యాయాం ద్వారకాయాం విభూషణమ్ ॥
అందమైన ఆ ద్వారకాపురానికి తూర్పు దిక్కున ఆ పట్టణానికే అలంకారమై చక్కని కొండచరియలతో విశాలమైన రైవతక పర్వతం ప్రకాశిస్తున్నది.
దక్షిణస్యాం లతావేష్టః పంచవర్ణో విరాజతే ।
ఇంద్రకేతుప్రతీకాశః పశ్చిమాం దిశమాశ్రితః ॥
సుకక్షో రాజతః శైలః చిత్రపుష్పమహావనః ।
ఉత్తరస్యాం దిశి తథా వేణుమంతో విరాజతే ॥
మందరాద్రిప్రతీకాశః పాండరః పాండవర్షభ ।
పాండవోత్తమా! ఆ పురానికి దక్షిణదిక్కున లతావేష్టమను పర్వతం ఉంది. అది పంచవర్ణాలతో ఇంద్రధనుస్సులా ప్రకాశిస్తున్నది. పశ్చిమ దిక్కున సుకక్షమనే పర్వతరాజమున్నది. అది చిత్రాలైన పూలతోటలతో శోభిల్లుతూన్నది. ఉత్తరపు దిక్కున మందరపర్వతంలో సమానంగా ప్రకాశించే తెల్లని వేణుమంత పర్వతం విరాజిల్లుతూన్నది.
చిత్రకంబళ వర్ణాభం పాంచజన్యవనం తథా ।
సర్వర్తుకవనం చైవ భాతి రైవతకం ప్రతి ॥
రైవతకవపర్వతానికి దగ్గర్లో చిత్రకంబలం వంటి రంగులతో ప్రకాశించే పాంచజన్యవనమూ, సర్వర్తుకవనమూ ప్రకాశిస్తూన్నవి.
లతావేష్టం సమంతాత్ తు మేరుప్రభనం మహత్ ॥
భాతి తాళవనం చైవ పుష్పకం పుండరీకవత్ ।
లతావేష్ట పర్వతానికి నాలుగుదిక్కులా మేరు ప్రభవనం, తాళవనం, తెల్లతామర పూలవలె ప్రకాశిమ్చే పుష్పకవనమూ ఉన్నాయి.
సుకక్షం పరివార్యైనం చిత్రపుష్పం మహావనమ్ ॥
శతపత్రవనం చైవ కరవీరకుసుంభి చ ।
సుకక్షపర్వతానికి చుట్టూ చిత్రపుష్పమనే పెద్దవనం, శతపత్రవనమూ, కరవీరవనమూ, కుసుంభివనమూ ఉన్నాయి.
భాతి చైత్రరథం చైవ నందనం చ మహావనమ్ ॥
రమణం భావనం చైవ వేణుమంతం సమంతతః ।
వేణుమంత పర్వతానికి నాలుగువైపులా చైత్రరథం, నందనం, రమణం, భావనం అనే మహావనాలు ఉన్నాయి.
భాతి పుష్కరిణీ రమ్యా పూర్వస్యాం దిశి భారత ॥
ధనుః శతపరీణాహా కేశవస్య మహాత్మనః ॥
భరతనందనా! శ్రీకృష్ణుని యొక్క ఆ నగరానికి తూర్పుదిక్కున అందమైన పుష్కరిణి ఉంది. అది నూరు ధనుస్సుల వైశాల్యం కలది.
మహాపురీం ద్వారవతీం పంచాశద్భిర్ముఖైర్యుతామ్ ।
ప్రవిష్టో ద్వారకాం రమ్యాం భాసయంతీం సమంతతః ॥
ద్వారవతీ మహాపురం ఏభైముఖద్వారాలు కలిగి ఉంది. చుట్టూ వెలుగులు వెదజల్లే పురంలోకి కృష్ణుడు ప్రవేశించాడు.
అప్రమేయాం మహోత్సేథాం మహాగాధపరిప్లుతామ్ ।
ప్రాసాదవరసంపన్నాం శ్వేతప్రాసాదశాలినీమ్ ॥
అపరిమితమై, మహోన్నతమై, అగాధజలప్రవాహాలతో, తెల్లని ఉన్నత ప్రాసాదాలతో ద్వారకాపురి శోభిల్లుతున్నది.
తీక్ష్ణయంత్రశతఘ్నీభిః యంత్రజాలైః సమన్వితామ్ ।
ఆయసైశ్చ మహాచక్రైః దదర్శ ద్వారకాం పురీమ్ ॥
తీక్ష్ణయంత్రాలు, శతఘ్నులు, వివిధయంత్రసమూహాలతో, పెద్ద పెద్ద ఇనుపచక్రాలతో కుడి ఉన్న ద్వారకాపురిని చూశాడు.
అష్టౌ రథసహస్రాణి ప్రకారే కింకిణీకినః ।
సముచ్ఛ్రితపతాకాని యథా దేవపురే తథా ॥
అమరావతిలో వలె ప్రాకారాల వద్ద క్షుద్రఘంటికలతో, ఎగురుతున్న పతాకలతో ఎనిమిది వేల రథాలు ఉన్నాయి.
అష్టయోజనవిస్తీర్ణామ్ అచలామ్ ద్వాదశాయతామ్ ।
ద్విగుణోపనివేశాం చ దదర్శ ద్వారకాం పురీమ్ ॥
ఎనిమిది యోజనాల వెడల్పు, పన్నెండు యోజనాల పొడవు కలిగినది. దాని పరిసర ప్రాంతం దాని వైశాల్యానికి రెట్టింపు కలది. అన్ని విధాల అచంచలమైన ఆ పురిని కృష్ణుడు చూశాడు.
అష్టమార్గాం మహాకక్ష్యాం మహాషోడశచత్వరామ్ ।
ఏవం మార్గపరిక్షిప్తాం సాక్షాదుశనసా కృతమ్ ॥
ఎనిమిది ప్రధాన మార్గాలు పెద్దపెద్దకక్ష్యలు, పదహారు చతుష్పథాలు కలది ఆ నగరం. అట్టి మార్గాలతో నిర్మింపడిన ఆ నగరం సాక్షాత్తు శుక్రనీతిననుసరించి ఉన్నది.
వ్యూహానామంతరా మార్గాః సప్త చైవ మహాపథాః ।
తత్ర సా విహితా సాక్షాన్నగరీ విశ్వకర్మణా ॥
వ్యూహాల నడుమ మార్గాలున్నాయి. ఏడు ప్రధాన రహదారులున్నాయి. ఆ నగరం సాక్షాత్తూ విశ్వకర్మచే నిర్మింపబడినది.
కాంచనైర్మణిసోపానైః ఉపేతా జనహర్షిణీ ।
గీతఘోషమహాఘోషైః ప్రాసాదప్రవరైః శుభా ॥
మణులు పొదిగిన బంగారు సోపానాలతో, గీతాల మధుర ఘోషలతో శ్రేష్ఠాలైన భవనాలతో ఆ నగరం జనులకు ఆనందం కలిగిస్తోంది.
తస్మిన్ పురవరశ్రేష్ఠే దాశార్హాణాం యశస్వినామ్ ।
వేశ్మాని జహృషే దృష్ట్వా భగవాన్ పాకశాసనః ॥
శ్రేష్ఠమైన ఆ ద్వారకానగరంలో దాశార్హ వంశీయుల భవనాలను చూసి ఇంద్రుడు చాలా ఆనందించాడు.
సముచ్ర్ఛితపతాకాని పారిప్లవనిభాని చ ।
కాంచనాభాని భాస్వంతి మేరుకూటనిభాని చ ॥
ఆ నగరంలోని భవనాలపై ఎత్తుగా పతాకాలు ఎగురుతున్నాయి. అవి మేఘాలతో సమానంగా ఉన్నాయి. బంగారు రంగుతో ప్రకాశిస్తూ మేరుపర్వత శిఖరాల వలె ఉన్నాయి.
సుధాపాండరశృంగైశ్చ శాతకుంభపరిచ్ఛదైః ।
రత్నసానుగుహాశృంగైః సర్వరత్నవిభూషితైః ॥
వెల్ల వలె తెల్లని శిఖరాలతో, తెల్లని కుంభాలతో అలంకరింపబడి, రత్నమయగుహలు గల శిఖరాలతో అంతటా రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి.
సహర్మ్యైః సార్ధచంద్రైశ్చ సనిర్యూహైః సపంజరైః ।
సయంత్రగృహసంబాధైః సధాతుభిరివాద్రిభిః ॥
ఉన్నతమైన అమ్తరువులతో, అర్ధచంద్రాకారపు భవనాల మీది సెజ్జలతో, అక్కడ సంచరించే పక్షులతో, యంత్రగృహాలతో గైరికాది ధాతువులతో కూడిన పర్వతాల వలె ఆ నగర భవనాలు ప్రకాశిస్తున్నాయి.
మణికాంచనభౌమైశ్చ సుధామృష్టతలైస్తథా ।
జాంబూనదమయైః ద్వారైః వైడూర్యవికృతార్గళైః ॥
మణులతో, బంగారంతో, మట్టితో నిర్మింపబడి సున్నం వేయబడిన తెల్లని క్రింది భాగాలతో బంగారంతో చేయబడిన ద్వారాలతో, వైడూర్యాలు పొదిగిన గడియలతో కూడినవి ఆ భవనాలు.
సర్వర్తుసుఖసంస్పర్శైః మహాధనపరిచ్ఛదైః ।
రమ్యసానుగుహాశృంగైః విచిత్రైరివ పర్వతైః ॥
అక్కడ అన్ని ఋతువులలో సుఖంగా గాలులు వీస్తాయి. అవి మహాసంపదలతో నిండి ఉన్నాయి. అందమైన సానువులతో, గుహలతో శిఖరాలతో విచిత్రాలైన పర్వతాలవలె ఆ భవనాలు అందముగా ఉన్నాయి.
పంచవర్ణసుర్ణైశ్చ పుష్పవృష్టిసమప్రభైః ।
తుల్యపర్జన్యనిర్ఘోషైః నానావర్ణైరివాంబుదైః ॥
అచటి భవనాలు ఐదురంగులలో గల సువర్ణవిశేషాలతో, పూలవానలతో సమానమైన కాంతులతో, గర్జనవంటి ధ్వనులతో నిండి రంగురంగుల మేఘాల వలె ఉన్నాయి.
మహేంద్రశిఖరప్రఖ్యైః విహితైర్విశ్వకర్మణా ।
ఆలిఖద్భిరివాకాశమ్ అతిచంద్రార్కభాస్వరైః ॥
మహేంద్రపర్వత శిఖరాలను పోలి విశ్వకర్మచే నిర్మింపబడిన ఆ భవనాలు సూర్యచంద్రుల కాంతులతో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్నాయి.
తైర్దాశార్హమహాభాగైః బభాసే భవనహ్రదైః ।
చండనాగాకులైర్ఘోరైః హ్రదైర్భోగవతీ యథా ॥
భోగవతి అయిన గంగ భయంకరులైన సర్పగణాలతోనూ మడుగులతోనూ శోభిల్లుతూన్నట్లు, ఆ ద్వారకాపురి దాశార్హశ్రేష్ఠులైన మహానుభావులతో నిండిన భవనాలనే హ్రదాలతో శోభిల్లుతోంది.
కృష్ణధ్వజోపవాహ్యైశ్చ దాశార్హాయుధరోహితైః ।
వృష్ణీమత్తమయూరైశ్చ స్త్రీసహస్రప్రభాకులైః ॥
వాసుదేవేంద్రపర్జన్యైః గృహమేఘైరలంకృతా ।
దదృశే ద్వారకాతీవ మేఘైర్ద్యౌరివ సంవృతా ।
మేఘాలచే ఆవరింపబడిన ఆకాశంలా ఆ ద్వారకాపురి భవనాలనే మేఘాలతో అలంకరింపబడి ఉంది. ఇంద్ర, ఉపేంద్రులే అక్కడ ప్రథానమేఘాలు. వేలస్త్రీల కాంతులే మెరుపులు. వృష్ణివంశీయ యువకులే మదించిన నెమళ్ళు. కృష్ణధ్వజం కల్గిన వాహనాలతో ఉన్నవి. దాశార్హుల వివిధ అస్త్రశస్త్రాలు వివిధ వర్ణాలతో భవనాలపై ఇంద్రధనుస్సులా ప్రకాశిస్తూన్నవి.
సాక్షాద్ భగవతో వేశ్మ విహితం విశ్వకర్మణా ॥
దదృశుర్దేవదేవస్య చతుర్యోజనమాయతమ్ ।
తావదేవ చ విస్తీర్ణమ్ అప్రమేయం మహాధనైః ॥
ప్రాసాదవరసంపన్నం యుక్తం జగతి పర్వతైః ।
ఆ శ్రీకృష్ణభగవానుని భవనాన్ని సాక్షాత్తూ విశ్వకర్మ నిర్మించాడు. దేవదేవుడైన కృష్ణుని భవనం నాలుగు యోజనాలు పొడవు, నాలుగు యోజనాలు వెడల్పు వ్యాపించి, ఉన్నతాలైన ప్రాసాదాలతో ధనరాశులతో నిండి ఉంది. లోకంలోని పర్వతాల దృశ్యాలతో భవనం నిండి ఉన్నది.
యం చకార మహాబాహుః త్వష్టా వాసవచోదితః ॥
ప్రాసాదం పద్మనాభస్య సర్వతో యోజనాయతమ్ ।
మేరోరివ గిరేః శృంగమ్ ఉచ్ర్ఛితం కాంచనాయుతమ్ ।
రుక్ష్మిణ్యాః ప్రవరో వాసః విహితః సుమహాత్మనా ॥
ఇంద్రునిచే ప్రేరేపింపబడ్డ, త్వష్ట (విశ్వకర్మ) పద్మనాభుని ప్రాసాదాన్ని నిర్మించాడు. అది అన్ని వైపుల యోజనం మేర వ్యాపించి ఉంది. మెరు పర్వతశిఖరంగా ఉన్నతమై, బంగారుపూత పూయబడి ఉంది. మహాత్ముడైన విశ్వకర్మ రుక్మిణికి మరొక శ్రేష్ఠమైన భవనాన్ని నిర్మించాడు.
సత్యభామా పునర్వేశ్మ సదా వసతి పాండరమ్ ।
విచిత్రమణిసోపానం యం విదుః శీతవానితి ॥
సత్యభామ వేరొక శ్వేతభవనంలో నివసిస్తూ ఉంది. అది విచిత్రాలైన మణులు పొదగబడిన సోపానాలతో ఉంది. దాన్ని శీతలభవనం అంటారు.
విమలాదిత్యవర్ణాభిః పతాకాభిరలంకృతమ్ ।
వ్యక్తబద్ధం వనోద్దేశే చతుర్దిశి మహాధ్వజమ్ ॥
నిర్మలమైన సూర్యకాంతిలా ప్రకాశించే పతాకాలతో వనప్రదేశంలో నిర్మింపబడి నాలుగుదిక్కులా ఉన్నతమైన ధ్వజాలతో కూడి వేరొకభవనం శోభిల్లుతోంది.
స చ ప్రాసాదముఖ్యోఽత్ర జాంబవత్యా విభూషితః ।
ప్రభయా భుషణైశ్చిత్రైః త్రైలోక్యమివ భాసయన్ ॥
యస్తు పాండరవర్ణాభః తయోరంతరమాశ్రితః ।
విశ్వకర్మాకరోదేనం కైలాసశిఖరోపమమ్ ॥
ఆ ప్రధానప్రాసాదంలో జాంబవతి ఉంటోంది. అది విచిత్రాలంకారాల కాంతితో ముల్లోకాలను భాసింపజేస్తుంది. అది సత్యభామారుక్మిణుల భవనాల మధ్య ఉంది. కైలాసశిఖరంలా స్వచ్ఛంగా ఉన్న ఆ భవనాన్ని కూడా విశ్వకర్మ నిర్మించాడు.
జాంబూనదప్రదీప్తాగ్రః ప్రదీప్తజ్వలనోపమః ।
సాగరప్రతిమోఽతిష్ఠత్ మేరురిత్యభివిశ్రుతః ॥
తస్మిన్ గాంధారరాజస్య దుహితా కులశాలినీ ।
సుకేశీ నామ విఖ్యాతా కేశవేన నివేశితా ॥
ఆ భవనద్వారాలు జాంబూనదసువర్ణంతో చేయబడి ప్రజ్వలిస్తున్న అగ్నిలా ప్రకాశిస్తున్నాయి. ఆ భవనం సముద్రమంతవిశాలమై మేరువనే పేరుతో ప్రసిద్ధి చెందింది. కులీన, గాంధారరాజు కూతురూ అయిన సుకేశి అనే ఆమెను శ్రీకృష్ణుడు ఆ భవనంలో ఉంచాడు.
పద్మకూట ఇతి ఖ్యాతః పద్మవర్ణో మహాప్రభః ।
సుప్రభాయా మహాబాహో నివాసః పరమార్చితః ॥
పద్మకూటమని ప్రసిద్ధిచెంది, పద్మం వంటి ఛాయ గొప్పకాంతి గల భవనం సుప్రభ అనే మహారాణికి నివాసం.
యస్తు సూర్యప్రభో నామ ప్రాసాదవర ఉచ్యతే ।
లక్ష్మణాయాః కురుశ్రేష్ఠ స దత్తః శార్ ఙ్గధన్వనా ॥
కురుశ్రేష్ఠా! 'సూర్యప్రభ' అనే పేరు గల శ్రేష్ఠమైన ప్రాసాదం శ్రీకృష్ణుడు లక్ష్మణకు ఇచ్చాడు.
వైడూర్యవరవర్ణాభః ప్రాసాదో హరితప్రభః ।
యం విదుః సర్వభూతాని హరిరిత్యేవ భారత ।
వాసః స మిత్రవిందాయాః దేవర్షిగణపూజితః ॥
మహిష్యా వాసుదేవస్య భూషణం సర్వవేశ్మనామ్ ।
వైడూర్యమణి సమానమయిన పచ్చని కాంతితో ఉన్న భవనాన్ని వాసుదేవుడు తనరాణి మిత్రవిందకు ఇచ్చాడు. దాన్ని ప్రాణులన్నీ హరియే అని అనుకొంటాయి. అందుచేత అది అన్నిభవనాలకు భూషణంగా నిలిచింది.
యస్తు ప్రాసాదముఖ్యోఽత్ర విహితః సర్వశిల్పిభిః ॥
అతీవ రమ్యః సోఽప్యత్ర ప్రహసన్నివ తిష్ఠతి ।
సుదత్తాయాః సువాసస్తు పూజితః సర్వశిల్పిభిః ॥
మహిష్యా వాసుదేవస్య కేతుమానితి విశ్రుతః ।
ద్వారకలో వేరొక ప్రముఖమైన ప్రాసాదం శిల్పులందరిచేత నిర్మింపబడింది. అది మిక్కిలి అందమైంది. నవ్వుతూన్నట్లుగా ఉంటుంది. అది కేతుమంతమని ప్రసిద్ధిగలది. వాసుదేవుని పట్టమహిషి సుదత్త అందులో నివసిస్తూ ఉంటుంది.
ప్రాసాదీ విరజో నామ విరజస్కో మహాత్మనః ॥
ఉపస్థానగృహం తాత కేశవస్య మహాత్మనః ।
నాయనా యుధిష్ఠిరా! విరజ మనే ప్రాసాదం ఉంది. అది రజోగుణరహితమై నిర్మలంగా ఉంటుంది. అది మహాత్ముడైన కేశవుని ఉపస్థానగృహం.
యస్తు ప్రాసాదముఖ్యోఽత్ర యం త్వష్టా వ్యదథాత్ స్వయమ్ ।
యోజనాయత విష్కుంభం సర్వరత్నమయం విభోః ।
ఇదేవిధంగా అక్కడ మరొక ముఖ్యమైన ప్రాసాదం ఉంది. దాన్ని స్వయంగా త్వష్ట నిర్మించాడు. యోజనవైశాల్యం కలది. అంతా రత్నాలు పొదగబడి ఉంది.
తేషాం తు విహితాః సర్వే రుక్మదండాః పతాకినః ।
సదనే వాసుదేవస్య మార్గసంజననా ధ్వజాః ॥
వాసుదేవుని భవనంలో మార్గాన్ని చూపే ధ్వజాలున్నాయి. వాటి కర్రలన్నీ బంగారంతో చేయబడ్డవి.
ఘంటా జాలాని తత్రైవ సర్వేషాం చ నివేశనే ।
ఆహృత్య యదుసింహేన వైజయంత్యచలో మహాన్ ॥
ద్వారకలోని ఇళ్లన్నింటికీ ఘంటలు వ్రేలాడదీయబడి ఉన్నాయి. యదుసింహుడు వైజయంతి అనే పెద్ద పర్వతాన్ని తెచ్చి అక్కడ పెట్టాడు.
హంసకూటస్య యచ్ఛృంగమ్ ఇంద్రద్యుమ్నసరో మహత్ ।
షష్ఠితాళసముత్సేధమ్ అర్ధయోజనవిస్తృతమ్ ॥
ఆ ద్వారకలో హంసకూటమనే పర్వతం ఉంది. అది ఆరు తాటి చెట్ల ఎత్తయినది. అర్ధయోజన విశాలమైంది. దాని మీద ఇంద్రద్నుమ్నమనే పెద్ద సరోవరం ఉంది.
స కిన్నర మహానాదం తదప్యమితతేజసః ।
పశ్యతాం సర్వభూతానాం త్రిషు లోకేషు విశ్రుతమ్ ॥
కిన్నరుల మహానాదంతో కూడిన ఆ పర్వతం తేజస్వియైన శ్రీకృష్ణుని లీలాస్థలం. ప్రాణులన్నీ దర్శించేదిగా అది ముల్లోకాలలోను ప్రసిద్ధి కెక్కింది.
ఆదిత్య పథగం యత్ తత్ మేరోః శిఖరముత్తమమ్ ।
జాంబూనదమయం దివ్యం త్రిషు లోకేషు విశ్రుతమ్ ॥
తదప్యుత్పాట్య కృచ్ర్ఛేణ స్వం నివేశనమాహృతమ్ ।
భ్రాజమానం పురా తత్ర సర్వౌషధివిభూషితమ్ ॥
ఆదిత్యమార్గం దాకా వ్యాపించి స్వర్ణమయమై, దివ్యమై, ముల్లోకాలలో ప్రసిద్ధి చెందిన మేరుపర్వతశిఖరాన్ని పెకలించి శ్రీకృష్ణుడు కష్టపడి తమ నివాసానికి (ద్వారక) తీసికొని వచ్చాడు. పూర్వం అది అన్ని ఔషధులతో అలంకృతమై ప్రకాశిస్తూన్నది.
యమింద్రభవనా చ్ఛౌరిః ఆజహార పరంతపః ।
పారిజాతః స తత్రైవ కేశవేన నివేశితః ॥
శత్రుమర్దనుడైన శౌరి ఇంద్రభవనం నుండి తీసికొని వచ్చిన పారిజాతవృక్షాన్ని అక్కడే ప్రతిష్ఠించాడు.
విహితా వాసుదేవేన బ్రహ్మస్థలమహాద్రుమాః ॥
శాలతాళాశ్వకర్ణాశ్చ శతశాఖాశ్చ రోహిణాః ।
భల్లాతకకపిత్థాశ్చ చంద్రవృక్షాశ్చ చంపకాః ॥
ఖర్జూరాః కేతకాశ్చైవ సమంతాత్ పరిరోపితాః ।
వాసుదేవుడు బ్రహ్మలోకం నుండి గొప్పగొప్ప వృక్షాలను తీసికొని వచ్చి ద్వారకలో ప్రతిష్ఠించాడు. సాల, తాళ, అశ్వ, కర్ణ వృక్షాలను, అనేక శాఖలతో ఉన్న వటవృక్షాన్ని, భల్లాతక, కపిత్థ, చంద్ర, చంపక, ఖర్జూర, కేతకవృక్షాలను అక్కడ అన్ని వైపులా ప్రతిష్ఠించాడు.
పద్మాకులజలోపేతా రక్తాః సౌగంధికోత్పలాః ॥
మణిమౌక్తికవాలూకాః పుష్కరిణ్యః సరాంసి చ ।
తాసామ్ పరమకూలాని శోభయంతి మహాద్రుమాః ॥
ఆ ద్వారకలో పుష్కరిణులు, సరస్సులూ ఉన్నాయి. వాటిలో పద్మలతలతో నిండి జలాలు ఉన్నాయి. ఎర్రని సౌంగధిక కుసుమాలున్నాయి. అందలి జలకణాలు మణి మౌక్తికాలవలె ప్రకాశిస్తున్నాయి. ఆ పుష్కరిణుల, సరస్సుల ఒడ్డులు పెద్దపెద్ద వృక్షాలతో శోభిల్లుతూ ఉన్నాయి.
యే చ హైమవతా వృక్షా యే చ నందనజాస్తథా ।
ఆహృత్య యదుసింహేన తేఽపి తత్ర నివేశితాః ॥
యదుసింహుడైన శ్రీకృష్ణుడు హిమవత్పర్వతం మీది వృక్షాలను, నందనవనంలోని వృక్షాలను తీసికొనివచ్చి అక్కడ ప్రతిష్ఠించాడు.
రక్తపీతారుణప్రఖ్యాః సితపుష్పాశ్చ పాదపాః ।
సర్వర్తుఫలపూర్ణాస్తే తేషు కాననసంధిషు ॥
ద్వారకలోని ఉపవనాలలో ఉన్న వృక్షాలు ఎరుపు, పసుపు, లేత ఎరుపు, తెలుపు రంగుల పూలతో, అన్ని ఋతువులలోని ఫలాలతో శోభిల్లుతున్నాయి.
సహస్రపత్రపద్మాశ్చ మందరాశ్చ సహస్రశః ।
అశోకాః కర్ణికారాశ్చ తిలకానాగమల్లికాః ॥
కురవా నాగపుష్పాశ్చ చంపకాస్తృణగుల్మకాః ।
సప్తపర్ణాః కదంబాశ్చ నీపాః కురవకాస్తథా ॥
కేతక్యః కేసరాశ్చైవ హింతాలతలతాటకాః ।
తాలాః ప్రియంగువకుళాః పిండిలా బీజపూరకాః ॥
ద్రాక్షామలకఖర్జూరాః మృద్వీకా జంబుకాస్తథా ।
ఆమ్రాః పనసవృక్షాశ్చ క్షీరికాకంటకీ తథా ।
నాలికేరేంగుదాశ్చైవ ఉత్ర్కోశకవనాని చ ॥
వనాని చ కదల్యాశ్చ జాతిమల్లికపాటలాః ।
భల్లాతక కపిత్థాశ్చ తైతభా బంధుజీవకాః ॥
ప్రవాళాశోకకాశ్మీర్యః ప్ఱాచీనాశ్చైవ సర్వశః ।
ప్రియంగుబదరీభిశ్చ యవైః స్పందనచందనైః ॥
శమీబిల్వపలాశైశ్చ పాటలావటపిప్పలైః ।
ఉదుంబరైశ్చ ద్విదళైః పాలాశైః పారిభద్రకైః ॥
ఇంద్రవృక్షార్జునైశ్చైవ అశ్వత్థైశ్చిరిబిల్వకైః ।
సౌభంజనకవృక్షైశ్చ భల్లటైరశ్వసాహ్వాయైః ॥
సర్జైస్తాంబూలవల్లీభిః లవంగైః క్రముకైస్తథా ।
వంశైశ్చ వివిధైస్తత్ర సమంతాత్ పరిరోపితైః ॥
సహస్రదళపద్మాలు, వేలకొద్దీమందారాలు, అశోక, కర్ణికార, తిలక, నాగమల్లికా, కురువ, నాగపుష్ప, చంపక, తృణ, గుల్మ, సప్తవర్ణ, కదంబ, నీప, కురవక, కేతకీ, కేసర, హింతాల, తల, తాటక, తాల, ప్రియంగు, వకుల, పిండికా, బీజపూర, ద్రాక్షా, ఆమలక, ఖర్జూర, మృద్వీకా, జంబుక, ఆమ్ర, పనస, అంకోట (ఊడుదు), తిల, తిందుక, లిద్రుచ, ఆమ్రాతక, క్షీరికా, కంటకీ, నాలికేర, ఇంగుద, ఉత్ర్కోశక, కదలీవన, జాతి, మల్లికా, పాటల, భల్లాతక, కపిత్థ, తైతభ, బంధుజీవక, ప్రవాల, అశోక, కాశ్మరీ, ప్రియంగు, బదరీ, యవ, స్పందన, చందన, శమీ, బిల్వ, పలాశ, పాటల, వట, పిప్పట, ఉదుంబర, ద్విదలపలాశ, పారిభద్రక, ఇంద్ర, అర్జున, అశ్వత్థ, చిరిబిల్వ, సౌభంజన, భల్లట, అశ్వపుష్ప, సర్జ, తాంబూల లతా, లవంగ, క్రముక మున్నగు ఫల, పుష్పజాతి వృక్షాలతో, వివిధాలైన వెదురు వృక్షాలతో ద్వారకా నగరపు చుట్టుప్రక్కల వనాలన్నీ నిండి ఉన్నాయి.
యే చ నందనజా వృక్షా యే చ చైత్రరథే వనే ।
సర్వే తే యదునాథేన సమంతాత్ పరిరోపితాః ॥
నందనవనంలో ఉన్న వృక్షాలు, చైత్రరథవనంలోని వృక్షాలూ యదునాథుడు శ్రీకృష్ణుడు ఆపురానికి చుట్టూ పాతాడు.
కుముదోత్పలపూర్ణాశ్చ వాప్యః కూపాః సహస్రశః ।
సమాకులమహావాప్యః పీతాలోహితవాలుకాః ॥
ఆ నగరంలోని దిగుడుబావులు, బావులు, పెద్దబావులు, వేలకొద్దీ పద్మాలతో, కలువలతో, పసుపు, ఎరుపు పుప్పొడులతో నిండి ఉన్నాయి.
తస్మిన్ గృహవనే నద్యః ప్రసన్నసలిలా హ్రదాః ।
ఫుల్లోత్పలజలోపేతాః నానాద్రుమసమాకులాః ॥
ద్వారకలోని గృహోపవనంలో నిర్మలమైన నీటితో నిండిన నదులు, సరస్సులూ ఉన్నాయి. అవి వికసించిన కలువలతో కూడి ఉన్నాయి. అనేక ద్రుమాలతో వ్యాపించి ఉన్నాయి.
తస్మిన్ గృహవనే నద్యః మణిశర్కరవాలుకాః ।
మత్తబర్హిణసంఘాశ్చ కోకిలాశ్చ మదోద్వహాః ॥
ఆ గృహోపవనంలో నదులు మణుల రజనుతో కూడిన ఇసుకతో నిండి ఉన్నాయి. మదించిన నెమలి సమూహాలు, కోకిలలు ఉన్నాయి.
బభూవుః పరమోపేతాః సర్వే జగతి పర్వతాః ।
తత్రైవ గజయూథాని తత్ర గోమహిషాస్తథా ॥
నివాసాశ్చ కృతాస్తత్ర వరాహమృగపక్షిణామ్ ।
లోకంలోని పర్వతాలన్నీ వాటి అంశలతో ద్వారకలో ఉన్నాయి. అక్కడే ఏనుగుల గుంపులు, గోవులు, మహిషాలు, వరాహాలు, మృగాలు, పక్షులు నివసిస్తూ ఉన్నాయి.
విశ్వకర్మకృతః శైలః ప్రాకారస్తస్య వేశ్మనః ॥
వ్యక్తం కిష్కుశతోద్యామః సుధాకరసమప్రభః ।
ఆ శ్రీకృష్ణుని భవనానికి చుట్టూ పర్వతం వంటి ప్రాకారాన్ని విశ్వకర్మ నిర్మించాడు. అది నూరు హస్తాలప్రమానం గల ఎత్తు ఉంది. చంద్రునిలా తెల్లని కాంతులతో ఉంది.
తేన తే చ మహాశైలాః సరితశ్చ సరాంసి చ ॥
పరిక్షిప్తాని హర్మ్యస్య వనాన్యుపవనాని చ ।
నగరానికి చుట్టూ వనాలు, ఉపవనాలు, మహాశైలాలు, సరిత్తులు, సరస్సులు అతడే ఏర్పాటు చేశాడు.
ఏవం తచ్ఛిల్పివర్యేణ విహితం విశ్వకర్మణా ॥
ప్రవిశన్నేవ గొవిందః దదర్శ పరితో ముహుః ।
ఈవిధంగా శిల్పిశ్రేష్ఠుడైన విశ్వకర్మ నిర్మించిన ఆ నగరాన్ని ప్రవేశిస్తూనే గోవిందుడు చుట్టూ మరల మరల చూశాడు.
ఇంద్రః సహామరైః శ్రీమాన్ తత్ర తత్రావలోకయత్ ।
ఇంద్రుడు దేవతలతో పాటుగా అక్కడక్కడ ఆ నగరమంతా చూశాడు.
ఏవమాలోకయాంచక్రుః ద్వారకామృషభాస్త్రయః ।
ఉపేంద్ర బలదేవౌ చ వాసవశ్చ మహాయశాః ॥
మహాయశస్కులు, శ్రేష్ఠులు అయిన బలరామకృష్ణులు, దేవేంద్రుడూ ముగ్గురూ ఆ నగరాన్ని చూశారు.
తతస్తం పాండరం శౌరిః మూర్ధ్ని తిష్ఠన్ గరుత్మతః ॥
ప్రీతః శంఖముపాదధ్మౌ విద్విషాం రోమహర్షణమ్ ।
అనంతరం శ్రీకృష్ణుడు గరుత్మంతుని శిరస్సుపై నిల్చి ఆనందంతో, శత్రువుల ఒళ్ళు జలదరింపజేసే శంఖాన్ని పూరించాడు.
తస్య శంఖస్య శబ్దేన సాగరశ్చుక్షుభే భృశమ్ ॥
రరాస చ నభః సర్వే తచ్చిత్రమభవత్ తదా ।
ఆ శంఖధ్వనిచేత సముద్రం సంచలించింది. ఆకాశం ప్రతిధ్వనించింది. అందరూ ఆశ్చర్యపోయారు.
పాంచజన్యస్య నిర్ఘోషం నిశమ్య కుకురాంధకాః ॥
విశోకాః సమపద్యంత గరుడస్య చ దర్శనాత్ ।
పాంచజన్యం యొక్క ధ్వనిని విని, గరుడుని చూసి కుకురాంధకులు ధుఃఖరహితులయ్యారు.
శంఖచక్రగదాపాణిం సుపర్ణశిరసిస్థితమ్ ॥
దృష్ట్వా జహృషిరే కృష్ణం భాస్కరోదయతేజసమ్ ।
ఆ గరుత్మంతునిపై, సూర్యిని వంటి తేజస్సుతో, శంఖచక్రగదలను ధరించి నిలిచిన శ్రీకృష్ణుని చూసి ఆనందించారు.
తతస్తూర్యప్రణాదశ్చ భేరీనాం చ మహాస్వనః ॥
సింహనాదశ్చ సంజజ్ఞే సర్వేషామ్ పురవాసినామ్ ।
అనంతరం ఆ పురజనులందరికి తూర్య, భేరీవాద్యాల మహాధ్వని వినబడింది. పురజనులంతా సింహనాదం చేశారు.
తతస్తే సర్వదాశార్హాః సర్వే చ కుకురాంధకాః ॥
ప్రీయమాణాః సమాజగ్ముః ఆలోక్య మధుసూదనమ్ ।
అటు తరువాత దాశార్హులు, కుకురాంధకులంతా మధుసూదనుని చూసి ఆనందించి అక్కడకు చేరారు.
వాసుదేవం పురస్కృత్య వేణుశంఖరవైః సహ ॥
ఉగ్రసేనో యయౌ రాజా వాసుదేవనివేశనమ్ ।
రాజైన ఉగ్రసేనుడు వాసుదేవుని ముందుంచుకొని, వేణుశంఖధ్వనులతో వాసుదేవుని భవనానికి వెళ్ళాడు.
ఆనందితుం పర్యచరన్ స్వేషు వేశ్మసు దేవకీ ॥
రోహిణీ చ యధోద్దేశమ్ ఆహుకస్య చ యాః స్త్రియః ।
దేవకి, రోహిణి, ఉగ్రసేనుని స్త్రీలు శ్రీకృష్ణుని అభినందించడానికి వారివారి స్థానాల్లో ఉన్నారు. అతడు సమీపించగానే వారు యథోచితంగా సత్కరించారు.
హతా బ్రహ్మద్విషః సర్వే జయంత్యంధకవృష్ణయః ॥
ఏవముక్తః సహ స్త్రీభిః ఈక్షితో మధుసూదనః ।
'బ్రహ్మద్వేషులంతా మరణించారు. అంధకవృష్ణి వంశీయులంతా విజయులయ్యారు' అని పలుకుతూ స్త్రీలందరూ మధుసూదనుని సాదరంగా చూశారు.
తతః శౌరిః సుపర్ణేన స్వం నివేశనమభ్యయాత్ ॥
చకారాథ యథోద్దేశమ్ ఈశ్వరో మణిపర్వతమ్ ।
అనంతరం శౌరి గరుత్మంతునితో తన భవనానికి వెళ్లాడు. శ్రీకృష్ణుడు మణిపర్వతాన్ని సముచితమైనచోట ఉంచాడు.
తతో ధనాని రత్నాని సభాయాం మధుసూదనః ॥
నిధాయ పుండరీకాక్షః పితుర్దర్శనలాలసః ।
పుండరీకాక్షుడయిన శ్రీకృష్ణుడు తీసికొని వచ్చిన ధనాలను, రత్నాలను సభయందుంచి, తాను తండ్రిని చూడగోరాడు.
తతః సాందీపనిం పూర్వమ్ ఉపస్పృష్ట్వా మహాయశాః ॥
వవందే పృథుతామ్రాక్షః ప్రీయమాణో మహాభుజః ।
అటుపై మహాయశస్వి, మహాభుజుడు, విశాలమైన ఎర్రని కన్నులు కల మధుసూదనుడు ముందుగా గురువయిన సాందీపని పాదాలను స్పృశించాడు.
తథాశ్రుపరిపూర్ణాక్షమ్ ఆనందగతచేతసమ్ ॥
వవందే సహ రామేణ పితరం వాసవానుజః ।
ఆశ్రువులు నిండిన కన్నులతో, ఆనందమగ్నమైన మనస్సుతో ఉన్న తండ్రికి శ్రీకృష్ణుడు బలరామునితో పాటు నమస్కరించాడు.
రామకృష్ణౌ సమాశ్లిష్య సర్వే చాంధకవృష్ణయః ॥
అంధకవృష్ణి వంశీయులంతా బలరామకృష్ణులను కౌగిలించుకొన్నారు.
తం తు కృష్ణః సమాహృత్య రత్నౌఘధనసంచయమ్ ॥
వ్యభజత్ సర్వవృష్ణిభ్యః ఆదధ్వమితి చాబ్రవీత్ ।
శ్రీకృష్ణుడు తాను తీసికొనివచ్చిన రత్నరాసులను ధనసంచయాన్ని వృష్ణివంశీయులందరికి విభజించి, "తీసికోండి" అని అన్నాడు.
యథా శ్రేష్ఠముపాగమ్య సాత్వతాన్ యదునందనః ॥
సర్వేషాం నామ జగ్రాహ దాశార్హాణామధోక్షజః ।
తతః సర్వాణి విత్తాని సర్వరత్నమయాని చ ॥
వ్యభజత్ తాని తేభ్యోఽథ సర్వేభ్యో యదునందనః ।
శ్రేష్ఠానుక్రమంలో సాత్వతులందరిని పేరుపేరున పిలిచి యదునందనుడైన శ్రీకృష్ణుడు ఆ ధనసంపదలను, రత్నరాసులను విభజించి ఇచ్చాడు. దాశార్హులకు కూడా అలాగే ఇచ్చాడు.
సా కేశవమహామాత్రైః మహేంద్రప్రముఖైః సహ ॥
శుశుభే వృష్ణిశార్దూలైః సింహైరివ గిరేర్గుహా ।
ఆ ద్వారకాపురి కేశవాదిముఖ్యులతో మహేంద్ర ప్రముఖులతో వృష్ణివంశీయశ్రేష్ఠులతో సింహాలతోనున్న పర్వతగుహవలె శోభిల్లుతోంది.
అథాసనగతాన్ సర్వాన్ ఉవాచ విబుధాధిపః ॥
శుభయా హర్షయన్ వాచా మహేంద్రస్తాన్ మహాయశాః ।
కుకురాంధకముఖ్యాంశ్చ తం చ రాజానమాహుకమ్ ॥
అటు పిమ్మట మహాయశస్వి దేవతల అధిపతి అయిన మహేంద్రుడు ఆసనాలపై కూర్చుని ఉన్న కుకుర, అంధక ముఖ్యులను, మహారాజైన ఉగ్రసేనుని ఉద్దేశించి ఆనందంతో శుభవచనా లిలా పలికాడు.
ఇంద్ర ఉవాచ
యదర్థం జన్మ కృష్ణస్య మానుషేషు మహాత్మనః ।
యత్ కృత వాసుదేవేన తద్ వక్ష్యామి సమాసతః ॥
ఇంద్రుడిలా అన్నాడు - మహాత్ముడైన శ్రీకృష్ణుడు మనుష్యులలో ఎందుకుపుట్టాడో, పుట్టి వాసుదేవుడేమి చేశాడో సంగ్రహంగా చెప్తాను.
అయం శతసహస్రాణి దానవానామరిందమః ।
నిహత్య పుండరీకాక్షః పాతాళవివరం యయౌ ॥
యచ్చ నాధిగతం పూర్వైః ప్రహ్లాదబలిశంబరైః ।
తదిదం శౌరిణా విత్తం ప్రాపితం భవతామిహ ॥
ఇతడు శత్రుమర్దనుడై లక్షమంది దానవులను సంహరించి, పాతాళవివరానికి వెళ్ళాడు. మునుపు ప్రహ్లాద, బలి, శంబరులు కూడా వెళ్ళనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడి నుండి ఈ ధనరాసులన్నింటినీ మీకు తీసికొని వచ్చాడు.
సపాశమ్ మురమాక్రమ్య పాంచజన్యం చ ధీమతా ।
శిలాసంఘానతిక్రమ్య నిశుంభః సగణో హతః ।
శ్రీకృష్ణుడు పాశసహితుడైన మురాసురుని, పంచజనులను, శిలాసమూహాలను అతిక్రమించి సపరివారంగా నిశుంభుని సంహరించాడు.
హయగ్రీవశ్చ విక్రాంతః నిహతో దానవో బలీ ॥
మథితశ్చ మృథే భౌమః కుండలే చాహృతే పునః ।
ప్రాప్తం చ దివి దేవేషు కేశవేన మహద్ యశః ॥
అట్లే హయగ్రీవుని సంహరించాడు. రాక్షసరాజైన బలిని సంహరించాడు. నరకాసురుని చంపి అదితికుండలాలను తిరిగి తీసికొని వచ్చి ఇచ్చాడు. దేవతలందరిలో కేశవుడు గొప్ప కీర్తిని పొందాడు.
వీతశోకభయాబాధాః కృష్ణబాహుబలాశ్రయాః ।
యజం తు వివిధైః సోమైః మఖైరంధకవృష్ణయః ॥
ఇకపై కృష్ణుని బాహుబలాశ్రయం పొందిన అంధకవృష్ణి వంశీయులు శోక భయ బాధలు తొలగి వివిధసోమయాగాలు చేయుదురుగాక.
పునర్బాణవధే శౌరిమ్ ఆదిత్యా వసుభిః సహ ।
మన్ముఖా హి గమిష్యంతి సాధ్యాశ్చ మధుసూదనమ్ ॥
మరల బాణాసురవధకోసం నన్ను ముందుపెట్టుకొని దేవతలు, వసువులు, సాధ్యులు, ఈ మధుసూదనుని దగ్గరకు వస్తారు.
భీష్మ ఉవాచ
ఏవముక్త్వా తతః సర్వాన్ ఆమంత్ర్య కుకురాంధకాన్ ।
సస్వజే రామకృష్ణౌ చ వసుదేవం చ వాసవః ॥
భీష్ముడిలా అన్నాడు - అలా చెప్పి ఇంద్రుడు బలరామకృష్ణులను, వసుదేవుని, కుకురాంధక ముఖ్యులందరిని కౌగిలించుకొన్నాడు.
ప్రద్యుమ్నసాంబనిశఠాన్ అనిరుద్ధం చ సారణమ్ ।
బభ్రుం ఝల్లిం గదం భానుం చారుదేష్ణం చ వృత్రహా ॥
సత్కృత్య సారణాక్రూరౌ పునరాభాష్య సాత్యకీమ్ ।
సస్వజే వృష్ణిరాజానమ్ ఆహుకం కుకురాధిపమ్ ॥
వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు ప్రద్యుమ్న, సాంబ, నిశఠ, అనిరుద్ధ, సారణ, బభ్రు, ఝల్లి, గద, భాను, చారుదేష్ణ, సారణ, అక్రూరులను సత్కరించి, మరల సాత్యకితో మాట్లాడాడు. అటుపై వృష్ణి కుకురవంశాలకు అధిపతి, రాజు అయిన ఉగ్రసేనుని కౌగిలించుకొన్నాడు.
భోజం చ కృతవర్మాణమ్ అన్యాంశ్చాంధక వృష్ణిషు ।
ఆమంత్ర్య దేవప్రవరః వాసవో వాసవానుజమ్ ॥
అంధకవృష్ణివంశీయులలోని ఇతరుల దగ్గర, భోజ, కృతవర్మల వద్ద, ఉపేంద్రుడైన శ్రీకృష్ణుని వద్ద ఇంద్రుడు సెలవు తీసికొన్నాడు.
తతః శ్వేతాచలప్రఖ్యం గజమైరావతం ప్రభుః ।
పశ్యతాం సర్వభూతానామ్ ఆరురోహ శచీపతిః ॥
అనంతరంఆ సర్వభూతాలు చూస్తుండగా, ఇంద్రుడు శచీసమేతంగా శ్వేతాచలాన్ని పోలిన ఐరావతాన్ని అధిరోహించాడు.
పృథివీం చాంతరిక్షం చ దివం చ వరవారణమ్ ।
ముఖాడంబరనిర్ఘీషైః పూరయంతమివాసకృత్ ॥
ఐరావతం తన నోటి నుండి వెలువడే ఘీంకారాలతో భూమిని, అంతరిక్షాన్ని, స్వర్గాన్ని ప్రతిధ్వనింపజేస్తున్నట్లుగా ఉంది.
హైమయంత్రమహాకక్ష్యం హిరణ్మయవిషాణినమ్ ।
మనోహరకుథాస్తీర్ణం సర్వరత్నవిభూషితమ్ ॥
దాని కిరువైపుల బంగారు యంత్రాలు కూర్చబడ్డాయి. దాని కొమ్ములు బంగారంతో చేయబడ్డాయి. దానిపై కప్పబడిన కంబళి నవరత్నాలతో అలంకరింపబడింది.
అనేకశతరత్నాభిః పతాకాభిరలంకృతమ్ ।
నిత్యస్రుతమదస్రావం క్షరంతమివ తోయదామ్ ॥
వందలకొద్దీ రత్నాలతో కూర్చబడిన పతాకాలతో అలంకరింపబడింది. మేఘం నీటిని కురుస్తున్నట్లుగా అది నిరంతరం మదజలాన్ని స్రవిస్తూంటుంది.
దిశాగజం మహామాత్రం కామ్చనస్రజమాస్థితః ।
ప్రబభౌ మందరాగ్రస్థః ప్రతపన్ భానుమానివ ॥
మహాకాయం గల ఆ దిగ్గజం స్వర్ణమాలను ధరించి ఉంది. దానిపై నున్న ఇంద్రుడు మందరాచలాగ్రానికి వెళ్లేసరికి, సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు.
తతో వజ్రమయం భీమం ప్రగృహ్య పరమాంకుశమ్ ।
యయౌ బలవతా సార్థం పావకేన శచీపతిః ॥
అనంతరం శచీపతి అయిన ఇంద్రుడు వజ్రమయం, భయంకరం, విశాలం అయిన అంకుశాన్ని తీసికొని, అగ్నిదేవునితో పాటు స్వర్గలోకానికి వెళ్ళాడు.
తం కరేణుగజవ్రాతైః విమానైశ్చ మరుద్గణాః ।
పృష్ఠతో-నుయయుః ప్రీతాః కుబేరవరుణగ్రహాః ॥
అతని వెనుకనే మరుద్గణాలు కరేణుగజసమూహాలతో, కుబేర వరుణాదులు విమానాలతో ప్రీతులై అనుసరించి వెళ్ళారు.
స వాయుపథమాస్థాయ వైశ్వానరపథం గతః ।
ప్రాప్య సూర్యపథం దైవః తత్రైవాంతరధీయత ॥
ఆ ఇంద్రుడు వాయుపథాన్ని, అటుపై వైశ్వానరపథాన్ని, ఆపై సూర్యపథాన్ని చేరి, అక్కడే అంతర్ధానమయ్యాడు.
తతః సర్వదశార్హాణామ్ ఆహుకస్య చ యాః స్త్రియః ।
నందగోపస్య మహిషీ యశోదా లోకవిశ్రుతా ॥
రేవతీ చ మహాభాగా రుక్ష్మిణీ చ పతివ్రతా ।
సత్యా జాంబవతీ చోభే గాంధారీ శింశుమాపి వా ॥
విశోకా లక్ష్మణా సాధ్వీ సుమిత్రా కేతుమా తథా ।
వాసుదేవమహిష్యోఽన్యాః శ్రియా సార్ధం యయుస్తదా ॥
విభూతిం ద్రష్టుమనసః కేశవస్య వరాంగనాః ।
ప్రీయమాణాః సభాం జగ్ముః ఆలోకయితుమచ్యుతమ్ ॥
అనంతరం దాశార్హుల యొక్క, ఉగ్రసేనుని యొక్క, స్త్రీలు, నందునిభార్య యశోద, బలరాముని భార్య రేవతి, పతివ్రత అయిన రుక్మిణి, సత్యభామ, జాంబవతి, గాంధారరాజకన్య శింశుమ, విశోక, లక్ష్మణ, సాధ్వి సుమిత్ర, కేతుమ ఇంకా శ్రీకృష్ణుని ఇతర భార్యలూ ప్రీతితో శ్రీకృష్ణుని చూడటానికి సభామండపానికి వెళ్ళారు.
దేవకీ సర్వదేవీనాం రోహిణీ చ పురస్కృతా ।
దదృశుర్దేవమాసీనం కృష్ణం హలభృతా సహ ॥
దేవకి, రోహిణి ముందుండగా ఆస్త్రీలందరూ బలరామునితో పాటు కూర్చుని ఉన్న శ్రీకృష్ణుని చూశారు.
తౌ తు పూర్వముపక్రమ్య రోహిణీమభివాద్య చ ।
అభ్యవాదయతాం దేవౌ దేవకీం రామకేశవౌ ॥
దేవకీం సప్తదేవీనాం యథాశ్రేష్ఠం చ మాతరః ।
ఆ బలరామకృష్ణులిరువురూ ఆసనం నుండి లేచి వచ్చి ముందుగా రోహిణికి అభివాదం చేసి, అటుపై దేవకికి, జ్యేష్ఠానుక్రమంలో తల్లులందరికీ నమస్కరించారు.
వవందే సహ రామేణ భగవాన్ వాసవానుజః ॥
అథాసనవరం ప్రాప్య వృష్ణిదారపురస్కృతా ॥
ఉభావంకగతౌ చక్రే దేవకీ రామకేశవౌ ।
బలరామునితోపాటుగ శ్రీకృష్ణుడు అందరికీ నమస్కరించాడు. తరువాత వృష్ణివంశీయస్త్రీలలో పెద్దదైన దేవకి ఒక శ్రేష్ఠమయిన ఆసనంపై కూర్చొని, రామకృష్ణులను తన ఒడిలో కూర్చుండబెట్టుకొంది.
సా తాభ్యామృషభాక్షాభ్యాం పుత్రాభ్యాం శుశుభే తదా ॥
దేవకీ దేవమాతేవ మిత్రేణ వరుణేన చ ।
మిత్రావరుణులతో దేవమాతవలె, పుత్రులైన ఆ రామకృష్ణులిరువురితో దేవకీదేవి శోభిల్లింది.
తతః ప్రాప్తా యశోదాయాః దుహితా వై క్షణేన హి ॥
జాజ్వల్యమానా వపుషా ప్రభయాతీవ భారత ।
భరతనందనా! ఆ పిమ్మట యశోదయొక్క కూతురు క్షణంలో అక్కడకు వచ్చింది. ఆమె శరీరం మహోజ్జ్వలంగా ప్రకాశిస్తూన్నది.
ఏకానంగేతి యామాహుః కన్యాం తాం కామరూపిణీం ॥
యత్కృతే సగణం కంసం జఘాన పురుషోత్తమః ।
కామరూపిణి అయిన ఆమెను 'ఏకానంగ' అని అంటారు. ఆమెనిమిత్తం గానే శ్రీకృష్ణుడు సపరివారంగా కంసుణ్ణి సంహరించాడు.
తతః స భగవాన్ రామస్తాముపాక్రమ్య భామినీమ్ ॥
మూర్ధ్న్యుపాఘ్రాయ సవ్యేన పరిజగ్రాహ పాణినా ।
దక్షిణేన కరాగ్రేణ పరిజగ్రాహ మాధవః ॥
ఆ తరువాత బలరాముడు ఆమెని సమీపించి, శిరస్సుపై ఆఘ్రాణించి, ఆమె ఎడమచేతిని పట్టుకొన్నాడు. శ్రీకృష్ణుడు ఆమె కుడిచేతిని పట్టుకొన్నాడు.
దదృశుస్తామ్ సభామధ్యే భగినీం రామకృష్ణయోః ॥
రుక్మపద్మశయాం పద్మామ్ శ్రీమివోత్తమనాగయోః ।
బలరామకృష్ణులిద్దరూ తమ సోదరిని అలా తీసికొనివస్తూంటే ఆ సభలో వారంతా రెండు గజేంద్రాల నడుమ బంగారు పద్మంపై నున్న లక్ష్మీదేవిని వలె చూశారు.
అధాక్షతమహావృష్ట్యా లాజపుష్పఘృతైరపి ॥
వృష్ణయోఽవాకిరన్ ప్రీతాః వృష్నయో మధుసూదనమ్ ।
అనంతరం వృష్ణివంశీయులంతా బలరామకృష్ణులపై పేలాలు, పుష్పాలు, నేతితో కూడిన అక్షతలను మహావృష్టిగా చల్లారు.
సబాలాః సహవృద్ధాశ్చ సజ్ఞాతికులబాంధవాః ।
ఉపోపవివిశుః ప్రీతాః వృష్ణయో మధుసూదనమ్ ।
బాలురు, వృద్ధులు, జ్ఞాతులు, బంధువులు, తనవంశీయులు అంతా ఆనందంతో శ్రీకృష్ణుని దగ్గర కూర్చున్నారు.
పూజ్యమానో మహాబాహుః పౌరాణాం రతివర్ధనః ॥
వివేశ పురుషవ్యాఘ్రః స్వవేశ్మ మధుసూదనః ।
పౌరులందరికి ప్రీతిని వృద్ధిచేసే పురుషసింహుడైన మధుసూదనుడు తన నివాసాన్ని ప్రవేశించాడు.
రుక్మిణ్యా సహితో దేవ్యా ప్రముమోద సుఖీ సుఖమ్ ।
అనంతరం చ సత్యాయా జాంబవత్యాశ్చ భారత ।
సర్వాసాం చ యదుశ్రేష్ఠః సర్వకాలవిహారవాన్ ॥
రుక్మిణీదేవితో కూడి సుఖంగా ఆనందించాడు. తరువాత సత్యభామ, జాంబవతి మున్నగు తన భార్యలందరితో యథాకాలంగా విహరించాడు.
జగామ చ హృషీకేశః రుక్మిణ్యాః స్వం నివేశనమ్ ।
తదుపరి శ్రీకృష్ణుడు రుక్మిణి గృహానికి వెళ్లాడు.
ఏష తాత మహాబాహో విజయః శార్ ఙ్గధన్వనః ॥
ఏతదర్థం చ జన్మాహుః మానుషేషు మహాత్మనః ।
నాయనా! యుధిష్ఠిరా! ఇది ఆ శార్ ఙ్గధన్వుడైన కృష్ణుని విజయగాథ. ఇందుకొరకే ఆ మహాత్ముడు మనుష్యులలో జన్మించాడు.
భీష్మ ఉవాచ
ద్వారకాయాం తతః కృష్ణః స్వదారేషు దివానిశమ్ ।
సుఖం లబ్ధ్వా మహారాజ ప్రముమోద మహాయశాః ॥
భీష్ముడిలా అన్నాడు - మహారాజ! అటుపై శ్రీకృష్ణుడు ద్వారకలో రాత్రింబవళ్లు తన భార్యలతో సుఖాన్ని పొంది ఆనందించాడు.
పౌత్రస్య కారణాచ్చక్రే విబుధానాం హితం తదా ।
సవాసవైః సురైః సర్వైః దుష్కరం భరతర్షభ ॥
భరతశ్రేష్ఠా! పౌత్రుని కారణంగా ఇంద్రాది దేవతలందరికి దుష్కరమూ, హితమూ అయిన కార్యాన్ని చేశాడు.
బాణో నామాభవద్ రాజా బలేర్జ్యేష్ఠసుతో బలీ ।
వీర్యవాన్ భరతశ్రేష్ఠ స చ బాహుసహస్రవాన్ ॥
భరతశ్రేష్ఠా! బలిచక్రవర్తికి పెద్దకొడుకైన బాణుడనే వాడుండేవాడు. అతడు చాలా బలవంతుడు. పరాక్రమవంతుడూను. అతనికి వేయిచేతలున్నాయి.
తతశ్చక్రే తపస్తీవ్రం సత్యేన మనసా నృప ।
రుద్రమారాధయామాస స చ బాణః సమా బహూః ॥
రాజా! అతడు సత్యనిష్ఠమైన మనస్సుతో తీవ్రమైన తపస్సు చేశాడు. చాలా సంవత్సరాలు ఆ బాణుడు రుద్రుని ఆరాధించాడు.
తస్మై బహువరా దత్తాః శంకరేణ మహాత్మనా ।
తస్మాల్లబ్ధ్వా వరాన్ బాణః దుర్లభాన్ ససురైరైపి ॥
స శోణితపురే రాజ్యం చకారాప్రతిమో బలీ ।
మహాత్ముడైన శంకరుడు అతనికి చాలా వరాలు ఇచ్చాడు. దేవతలకు కూడా దుర్లభాలైన ఆ వరాలన్నీ పొంది బలవంతుడైన బాణుడు శోణితపురంలో సాటిలేనివిధంగా రాజ్యం చేశాడు.
త్రాసితాశ్చ సురాః సర్వే తేన బాణేన పాండవ ॥
విజిత్య విబుధాన్ సర్వాన్ సేంద్రాన్ బాణః సమా బహూః ।
అశాసత మహద్ రాజ్యం కుబేర ఇవ భారత ॥
పాండునందనా! ఆ బాణుడు దేవతలందర్నీ భయపెట్టేవాడు. అతడు ఇంద్రునితోపాటు దేవతలందరీనీ జయించి, కుబేరునిలా మహారాజ్యాన్ని శాసించేవాడు.
ఋద్ధ్యర్థం కురుతే యత్నం తస్య చైవోశనా కవిః ।
జ్ఞాని అయిన శుక్రాచార్యుడు అతని సమృద్ధికొరకు ప్రయత్నించేవాడు.
తతో రాజన్నుషా నామ బాణస్య దుహితా తథా ॥
రూపేణాప్రతిమా లోకే మేనకాయాః సుతా యథా ।
రాజా! ఆ బాణునికి ఉష అనే కూతురుంది. లోకంలో రూపంలో ఆమెకు సాటి ఎవరూ లేరు. మేనక యొక్క కూతురిలా (శకుంతల వలె) ఉంటుంది ఆమె.
అథోపాయేన కౌంతేయ అనిరుద్ధో మహాద్యుతిః ॥
ప్రాద్యుమ్నిస్తాముషాం ప్రాప్య ప్రచ్ఛన్నః ప్రముమోద హ ।
కుంతీనందనా! మహాతేజస్వి ప్రద్యుమ్నుని కుమారుడు అయిన అనిరుద్ధుడు ఉపాయంతో ఉషను చేరి రహస్యంగా ఆమెతో ఆనందించాడు.
అథ బాణో మహాతేజాః సదా తత్ర యుధిష్ఠిర ॥
తం గుహ్యనిలయం జ్ఞాత్వా ప్రాద్యుమ్నిం సుతయా సహ ।
గృహీత్వా కారయామాస వస్తుం కారాగృహే బలాత్ ॥
యుధిష్ఠిరా! మహాతేజస్వి అయిన బాణుడు తన కూతురు ఉషతో రహస్యగృహంలో ఉన్న అనిరుద్ధుని గురించి తెలిసికొని, బలవంతంగా వారిద్దరినీ కారాగృహంలో బంధించాడు.
సుకుమారః సుఖార్హోఽథ తదా దుఃఖమవాప సః ।
బాణేన ఖేదితో రాజన్ అనిరుద్ధో ముమోహ చ ॥
రాజా! సుకుమారుడు, సుఖమ్గా ఉండదగినవాడూ అయిన అనిరుద్ధుడు అపుడు దుఃఖాన్ని పొందాడు. బాణునిచే బాధింపబడి అనిరుద్ధుడు మూర్ఛనొందాడు.
ఏతస్మిన్నేవ కాలే తు నారదో మునిపుంగవః ।
ద్వారకాం ప్రాప్య కౌంతేయ కృష్ణం దృష్ట్వా వచోఽబ్రవీత్ ॥
కుంతీనందనా! అదే సమయంలో మునిపుంగవుడైన నారదుడు ద్వారకకు వచ్చి కృష్ణుని దర్శించి, ఈ మాటలు చెప్పాడు.
నారద ఉవాచ
కృష్ణ కృష్ణ మహాబాహో యదూనాం కీర్తివర్ధన ।
త్వత్పుత్రో బాధ్యమానోఽథ బానేనామితతేజసా ॥
కృచ్ఛ్రం ప్రాప్తోఽనిరుద్ధో వై శేతే కారాగృహే సదా ।
నారదుడిలా అన్నాడు - కృష్ణా! కృష్ణా! మహాబాహూ! యదువంశీయుల కీర్తిని వృద్ధిచేయువాడా! నీపౌత్రుడైన అనిరుద్ధుని మహాశక్తిశాలి అయిన బాణుడు బాధిస్తున్నాడు. అనిరుద్ధుడు ఇపుడు కష్టం పొందాడు. కారాగారంలో ఉంటున్నాడు.
భీష్మ ఉవాచ
ఏవముక్త్వా సురర్షిర్వై బాణస్యాథపురం యయౌ ॥
నారదస్య వచః శ్రుత్వా తతో రాజన్ జనార్దనః ।
ఆహూయ బలదేవం వై ప్రద్యుమ్నం చ మహాద్యుతిమ్ ॥
ఆరురోహ గరుత్మంతం తాభ్యాం సహ జనార్దనః ।
భీష్ముడిలా అన్నాడు - దేవర్షి నారదుడిలా చెప్పి బాణాసురరాజధాని శోణితపురానికి వెళ్లాడు. శ్రీకృష్ణుడు బలదేవుని, మహాతేజస్వి అయిన ప్రద్యుమ్నుని పిలిచి, వారితోపాటు గరుత్మంతుని ఎక్కాడు.
తతః సుపర్ణమారుహ్య త్రయస్తే పురుషర్షభాః ॥
జగ్ముః క్రుద్ధా మహావీర్యా బాణస్య నగరం ప్రతి ।
మహాతేజస్వులైన ఆ మువ్వురు పురుషశ్రేష్ఠులు క్రుద్ధులై గరుత్మంతునిపై బాణుని నగరానికి వెళ్లారు.
అథాసాద్య మహారాజ తత్పురీం దదృశుశ్చ తే ॥
తామ్రప్రాకారసంవీతాం రూప్యద్వారైశ్చ శోభితామ్ ।
మహారాజ! అనంతరం వారు రాగి ప్రాకారాలతోనూ, వెండి ద్వారాలతోనూ శోభిల్లుతున్న ఆ పురాన్ని చూశారు.
హేమప్రాసాదసంబాధాం ముక్తామణివిచిత్రితామ్ ॥
ఉద్యానవనసంపన్నాం నృత్తగీతైశ్చ శోభితామ్ ।
ఆ పురం బంగారు ప్రాసాదాలతో, పొదిగిన ముక్తామణులతో, ఉద్యానవనాల సమృద్ధితో, నృత్తగీతాలతో శోభిల్లుతూ ఉన్నది.
తోరణైః పక్షిభిః కీర్ణాం పుష్కరిణ్యా చ శోభితామ్ ॥
తాం పురీమ్ స్వర్గసంకాశాం హృష్టపుష్టజనాకులామ్ ।
దృష్ట్వా ముదాయుతాం హైమాం విస్మయం పరమం యయుః ॥
పక్షులతో, తోరణాలతో నిండి పుష్కరిణులతో శోభిల్లుతూ, ఆరోగ్యవంతులైన జనాలతో కూడి, స్వర్గంలా ప్రకాశిస్తున్న స్వర్ణమయమైన ఆ పురాన్ని చూసి, వారు మిక్కిలి ఆశ్చర్యాన్ని పొందారు.
తస్య బాణపురస్యాసన్ ద్వారస్థా దేవతాః సదా ।
మహేశ్వరో గుహశ్చైవ భద్రకాళీ చ పావకః ॥
ఏతా వై దేవతా రాజన్ రరక్షుస్తాం పురీం సదా ।
ఆ బాణపురాన్ని దేవతలు ద్వారపాలకులై రక్షిస్తూ ఉన్నారు. మహేశ్వరుడు, కుమారస్వామి, భద్రకాళి, అగ్ని - ఈ దేవతలంతా ఆ పురాన్ని రక్షిస్తూన్నారు.
అథ కృష్ణో బలాజ్జిత్వా ద్వారపాలాన్ యుధిష్ఠిర ॥
సుసంక్రుద్ధో మహాతేజాః శంఖచక్రగదాధరః ।
ఆససాదోత్తరద్వారం శంకరేణాభిపాలితమ్ ॥
యుధిష్ఠిరా! పిమ్మట శ్రీకృష్ణుడు శంఖచక్రగదాధరుడై మిక్కిలి క్రుద్ధుడై బలంతో ద్వారపాలురను జయించి, శంకరునిచే రక్షింపబడుతున్న ఉత్తరద్వారానికి చేరాడు.
తత్ర తస్థౌ మహాతేజాః శూలపాణిర్మహేశ్వరః ।
పినాకమ్ సశరం గృహ్య బాణస్య హితకామ్యయా ॥
జ్ఞాత్వా తమాగతం కృష్ణం వ్యాదితాస్యమివాంతకమ్ ।
మహేశ్వరో మహాబాహుః కృష్ణాభిముఖమాయయౌ ॥
అక్కడ మహాతేజస్వి, మహేశ్వరుడు శూలం చేతిలో ధరించి ఉన్నాడు. బాణాన్ని సంధించి పినాకధనుస్సుని పట్టుకొని బాణునికి హితాన్ని చేయదలచి ఉన్నాడు. కృష్ణుని రాకను తెలిసిన మహాబాహువైన మహేశ్వరుడు నోరుతెరచిన మృత్యువులా ఉన్న కృష్ణునికి ఎదురుగా వచ్చాడు.
తతస్తౌ చక్రతుర్యుద్ధం వాసుదేవమహేశ్వరౌ ।
తద్ యుద్ధమభవద్ ఘోరమ్ అచింత్యం రోమహర్షణమ్ ॥
అనంతరమ్ ఆ శివకేశవులిద్దరూ యుద్ధం చేశారు. ఆ యుద్ధం చాలా ఘోరంగా, ఊహింప శక్యంకానిదిగా ఉండి, గగుర్పాటు కలిగించింది.
అన్యోన్యం తౌ తతక్షాతే అన్యోన్యజయకాంక్షిణౌ ।
దివ్యాస్త్రాణి చ తౌ దేవౌ క్రుద్ధౌ ముముచతుస్తదా ॥
ఒకరినొకరు జయించాలనే కోరికతో ఉన్న వారిరువురూ ఒకరినొకరు కొట్టుకొంటున్నారు. క్రుద్ధులై వారిరువురూ దివ్యాస్త్రాలను ప్రయోగిస్తున్నారు.
తతః కృష్ణో రణం కృత్వా ముహూర్తం శూలపాణినా ।
విజిత్య తం మహాదేవం తతో యుద్ధే జనార్దనః ॥
అన్యాంశ్చ జిత్వా ద్వారస్థాన్ ప్రవివేశ పురోత్తమమ్ ।
అనంతరం కృష్ణుడు ముహూర్తకాలం శూలపాణితో యుద్ధం చేసి, యుద్ధంలో మహాదేవుని జయించాడు. ద్వారం వద్ద ఉన్న ఇతరులను కూడా జయించి, ఆ పురవరాన్ని ప్రవేశించాడు.
ప్రవిశ్య బాణమాసాద్య స తత్రాథ జనార్దనః ॥
చక్రే యుద్ధం మహాక్రుద్ధః తేన బాణేన పాండవ ।
పాండునందనా! శ్రీకృష్ణుడు బాణపురంలో ప్రవేశించి, మిక్కిలి కోపంతో బాణుని సమీపించి, అతనితో యుద్ధం చేశాడు.
బాణోఽపి సర్వశస్త్రాణి శితాని భరతర్షభ ॥
సుసంక్రుద్ధస్తదా యుద్ధే పాతయామాస కేశవే ।
భరతశ్రేష్ఠా! బాణుడు కూడా మిక్కిలి కోపంతో తీక్ష్ణమైన అన్ని శస్త్రాలను ఆ యుద్ధంలో కృష్ణుని మీద ప్రయోగించాడు.
పునరుద్యమ్య శస్త్రాణాం సహస్రం సర్వబాహుభిః ॥
ముమోచ బాణః సంక్రుద్ధః కృష్ణం ప్రతి రణాజిరే ।
యుద్ధంలో మరల ఉద్యమించి తనవేయి చేతులతో శస్త్రాలను ధరించి, బాణుడు మిక్కిలి క్రుద్ధుడై కృష్ణుని మీదకి వదిలాడు.
తతః కృష్ణస్తు సంఛిద్య తాని సర్వాణి భారత ॥
కృత్వా ముహూర్తం బాణేన యుద్ధం రాజన్నధోక్షజః ।
చక్రముద్యమ్య రాజన్ వై దివ్యం శస్త్రోత్తమం తతః ॥
సహస్రబాహూంశ్చిచ్ఛేద బాణస్యామితతేజసః ।
భరతనందనా! కృష్ణుడు వాటన్నింటిని ఛేదించి, బాణునితో క్షణకాలం యుద్ధం చేసి, దివ్యమైన, ఆయుధశ్రేష్ఠమైన తన చక్రాన్ని సంధించి మేరలేని పరాక్రమం గల బాణుని వేయి చేతులను నరికాడు.
తతో బాణో మహారాజ కృష్ణేన భృశపీడితః ॥
ఛిన్నబాహుః పపాతాశు విశాఖ ఇవ పాదపః ।
మహారాజా! అపుడు బాణుడు కృష్ణుని వలన మిక్కిలి బాధనొంది, తెగినచేతులతో కొమ్మలు నరికిన చెట్టువలె వెంటనే క్రిందపడ్డాడు.
స పాతయిత్వా బాలేయం బాణం కృష్ణస్త్వరాన్వితః ॥
ప్రాద్యుమ్నిం మోక్షయామాస క్షిప్తం కారాగృహే తదా ।
ఈవిధంగా బలిపుత్రుడైన బాణుని యుద్ధంలో పడగొట్టి, కారాగృహంలో ఉంచిన అనిరుద్ధుని విడిపించాడు.
మోక్షయుత్వాథ గోవిందః ప్రాద్యుమ్నిం సహ భార్యయా ।
బాణస్య సర్వరత్నాని అసంఖ్యాని జహార సః ॥
గోవిందుడు అనిరుద్ధుని భార్యతోపాటుగా విడిపించి, అసంఖ్యాకాలైన బాణుని రత్నాలన్నింటిని తీసికొని వెళ్ళాడు.
గోధనాన్యథ సర్వస్వం స బాణస్యాలయే బలాత్ ।
జహార చ హృషీకేశః యదూనాం కీర్తివర్ధనః ॥
తతః స సర్వరత్నాని చాహృత్య మధుసూదనః ।
క్షిప్రమారోపయాంచక్రే తత్ సర్వం గరుడోపరి ॥
అటుపై బాణుని నివాసంలో ఉన్న గోసంపదలను, సర్వసంపదలను బలవంతంగా హృషీకేశుడు, యదువంశకీర్తివర్ధనుడూ అయిన కృష్ణుడు తీసికొని వెళ్ళాడు. మధుసూదనుడు సమస్తరత్నాలను గరుత్మంతుని పైకి ఎక్కించాడు.
త్వరయాథ స కౌంతేయ బలదేవం మహాబలమ్ ।
ప్రద్యుమ్నం చ మహావీర్యమ్ అనిరుద్ధం మహాద్యుతిమ్ ॥
ఉషాం చ సుందరీం రాజన్ భృత్యదాసీగణైః సహ ।
సర్వానేతాన్ సమారోప్య రత్నాని వివిధాని చ ॥
కుంతీనందనా! రాజా! మహాబలుడైన బలదేవుని, మహాతేజస్వి అయిన ప్రద్యుమ్నుని, మహాతేజస్వి అయిన అనిరుద్ధుని, ఉషాసుందరిని, సేవకులను, దాసీగణాలను, నేతలందరిని, వివిధ రత్నాలను గరుడునిపై ఎక్కించాడు.
ముదా యుక్తో మహాతేజాః పీతాంబరధరో బలీ ।
దివ్యాభరణచిత్రాంగః శంఖచక్రగదాసిభృత్ ॥
ఆరురోహ గరుత్మంతమ్ ఉదయం భాస్కరోయథా ।
మహాతేజస్వి, బలవంతుడు, పీతాంబరధరుడు, దివ్యాభరణాలను ధరించి చిత్రమైన శరీరంతో, శంఖచక్రగదా ఖడ్గాలను ధరించి శ్రీకృష్ణుడు సూర్యుడు ఉదయాద్రిని ఎక్కినట్లు, గరుత్మంతునిపై ఆరోహించాడు.
అథారుహ్య సుపర్ణమ్ స ప్రయయౌ ద్వారకాం ప్రతి ॥
ప్రవిశ్య స్వపురం కృష్ణః యాదవైః సహితస్తతః ।
ప్రముమోద తదా రాజన్ స్వర్గస్థో వాసవో యథా ॥
రాజా! గరుత్మంతుని పైకెక్కి, ద్వారకానగరానికి ప్రయాణమై వెళ్ళాడు. కృష్ణుడు యాదవులతో పాటుగ తన ద్వారకాపురాన్ని ప్రవేశించి, స్వర్గంలో ఉన్న ఇంద్రునిలా ఆనందించాడు.
సూదితా మౌరవాః పాశా నిశుంబనరకౌ హతౌ ।
కృతక్షేమః పునః పంథాః పురం ప్రాగ్జ్యోతిషం ప్రతి ॥
శౌరిణా పృథివీపాలాః త్రాసితా భరతర్షభ ।
ధనుషశ్చ ప్రణాదేన పాంచజన్యస్వనేన చ ॥
భరతశ్రేష్ఠా! మురాసురుడు వేసిన పాశాలను శ్రీకృష్ణుడు ఖండించాడు. నిశంభుని, నరకుని సంహరించాడు. ప్రాగ్జ్యోతిషపురమార్గాన్ని నిష్కంటకం చేశాడు. శ్రీకృష్ణుడు తన ధనుష్టంకారం చేత, పాంచజన్య హుంకారం చేత రాజులందరినీ భీతావహులను చేశాడు.
మేఘప్రఖ్యైరనీకైశ్చ దాక్షిణాత్యైః సుసంవృతమ్ ।
రుక్మిణం త్రాసయామాస కేశవో భరతర్షభ ॥
భరతశ్రేష్ఠా! మేఘసముదాయమ్ వంటి దాక్షిణాత్యసేనలతో కూడి ఉన్న రుక్మిని కూడ శ్రీకృష్ణుడు భయపెట్టాడు.
తతః పర్జన్యఘోషేణ రథేనాదిత్యవర్చసా ।
ఉవాహ మహిషీం భోజ్యామ్ ఏష చక్రగదాధరః ॥
ఆ తరువాత చక్రగదాధరుడైన శ్రీకృష్ణుడు మేఘం వలె ధ్వని, సూర్యుని వంటి కాంతి గల రథంతో భోజకస్య అయిన రుక్మిణిని వివాహమాడి తన పట్టమహిషిని చేసుకొన్నాడు.
జారూథ్యామాహుతిః క్రాధః శిశుపాలశ్చ నిర్జితః ।
వక్రశ్చ సహ శైబ్యేన శతధన్వా చ క్షత్రియః ॥
జారూథినగరంలో ఆహుతి, క్రాథుడు, శిశుపాలుడు, దంతవక్ర్తుడు, శైబ్యుడు, శతధన్వుడు అనే రాజులను జయించాడు.
ఇంద్రద్యుమ్నో హతః క్రోధాద్ యవనశ్చ కశేరుమాన్ ।
అదేవిధంగా కోపంతో ఇంద్రద్యుమ్నుని, యవనుని, కశేరుమంతుని సంహరించాడు.
పర్వతానాం సహస్రం చ చక్రేణ పురుషోత్తమః ॥
విభిద్య పుండరీకాక్షః ద్యుమత్సేనమయోధయత్ ।
పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు తనచక్రంతో వేయిపర్వతాలను ఛేదించి, ద్యుమత్సేనునితో యుద్ధం చేశాడు.
మహేంద్రశిఖరే చైవ నిమేషాంతరచారిణౌ ॥
జగ్రాహ భరతశ్రేష్ట వరుణస్యాభితశ్చరౌ ।
ఇరావత్యాముభౌ చైతౌ అగ్నిసూర్యసమౌ బలే ॥
గోపతిస్తాళకేతుశ్చ నిహతౌ శార్ ఙ్గధన్వనా ।
భరతశ్రేష్ఠా! ఒక్కనిమిషంలో ఎక్కడికైనా సంచరింపగల వరుణుని రెండువైపులా తిరుగుతూన్న గోపతి, తాలకేతువు అనే రాక్షసులను శార్ ఙ్గధన్వుడైన శ్రీకృష్ణుడు మహేంద్రపర్వతశిఖరం మీద పట్టుకొని, ఇరావతీనదీతీరాన సంహరించాడు.
అక్షప్రపతనే చైవ నేమిహంసపథేషు చ ॥
ఉభౌ తావపి కృష్ణేన స్వరాష్ట్రే వినిపాతితౌ ।
అక్షప్రపతనమనే ప్రదేశంలో ఉన్న నేమిహంసపథమనే చోట ఉన్న ఇద్దరిని వారి స్వరాష్ట్రంలోనే పడగొట్టి కృష్ణుడు సంహరించాడు.
ప్రాగ్జ్యోతిషం పురశ్రేష్ఠమ్ అసురైర్బ హుభిర్వృతమ్ ।
ప్రాప్య లోహితకూటాని కృష్ణేన వరుణో జితః ॥
అజేయో దుష్ర్పధర్షశ్చ లోకపాలో మహాద్యుతిః ।
ప్రాగ్జ్యోతిషపురంనిండా చాలమంది రాక్షసులు ఆక్రమించి ఉన్నారు. కృష్ణుడు అక్కడున్న ఎర్రని పర్వతశిఖరాల పైకి వెళ్ళి ఇతరులకు ఎదిరింపశక్యంకాని, మహాతేజస్వి, లోకపాలుడు అయిన వరుణుని జయించాడు.
ఇంద్రద్వీపో మహేంద్రేణ గుప్తో మఘవతా స్వయమ్ ॥
పారిజాతో హృతః పార్థ కేశవేన బలీయసా ।
మహేంద్రుడు పారిజాతరక్షణ కోసం ఇంద్రద్వీపాన్ని స్వయంగా రక్షిస్తూండేవాడు. అయినప్పటికి బలవంతుడైన కేశవుడు ఆ పారిజాతాన్ని అపహరించి తీసికొని వచ్చాడు.
పాండ్యం పౌండ్రం చ మాత్స్యం చ కళింగం చ జనార్దనః ॥
జఘాన సహితాన్ సర్వాన్ అంగరాజం చ మాధవః ।
జనార్దనుడు పాండ్య, పౌండ్ర, మత్స్య, కళింగ, అంగ, రాజులను అందరినీ జయించాడు.
ఏష చైకశతం హత్వా రథేన క్షత్రపుంగవాన్ ॥
గాంధారీమనహత్ కృష్ణః మహిషీం యాదవర్షభః ।
కేవల రథసహాయంతో శ్రీకృష్ణుడు నూటొక్క క్షత్రియ శ్రేష్ఠులను సంహరించి, గాంధారరాజకుమారి అయిన శింశుమను తన పట్టమహిషిని చేసికొన్నాడు.
బభ్రోశ్చ ప్రియమన్విచ్ఛన్ ఏష చక్రగదాధరః ॥
వేణుదారిహృతాం భార్యామ్ ఉన్మమాథ యుధిష్ఠిర ।
యుధిష్ఠిరా! చక్రగదాధరుడైన శ్రీకృష్ణుడు బభ్రువునకు ప్రియాన్ని చేయగోరి వేణుదారిచే అపహరింపబడిన అతని భార్యను తిరిగి తీసికొని వచ్చాడు.
పర్యాప్తాం పృథివీమ్ సర్వాం సాశ్వాం సరథకుంజరామ్ ॥
వేణుదారివశే యుక్తాం జిగాయ మధుసూదనః ।
మధుసూదనుడు వేణుదారి వశంలో ఉన్న సమస్తభూమిని అశ్వరథ కుంజరాలతో సహా జయించాడు.
అవాప్య తపసా వీర్యం బలమోజశ్చ భారత ॥
త్రాసితాః సగణాః సర్వే బాణేన విబుధాధిపాః ।
వజ్రాశనిగదాపాశైః త్రాసయద్భిరనేకశః ॥
తస్య నాసీద్ రణే మృత్యుః దేవైరపి సవాసవైః ।
సోఽభిభూతశ్చ కృష్ణేన నిహతశ్చ మహాత్మనా ॥
ఛిత్త్వా బాహుసహస్రం తద్ గోవిందేన మహాత్మనా ।
భరతనందనా! తపస్సుచేత బలపరాక్రమతేజస్సులను పొందిన బాణాసురుడు దేవేంద్రునితో పాటు దేవతాగణాలన్నింటిని భయపెట్టాడు. యుద్ధంలో ఇంద్రునితో పాటు దేవతలంతా వజ్రాశని గదాపాశాస్త్రాలతో భయపెట్టినా అతడు మరణించలేదు. మహాత్ముడైన శ్రీకృష్ణుడు అతని సహస్రబాహువులను నరికి అతనిని చంపివేశాడు.
ఏష పీఠం మాహాబాహుః కంసం చ మధుసూదనః ॥
పైఠకం చాతిలోమానం నిజఘాన జనార్దనః ।
మధుసూదనుడైన జనార్దనుడు పీఠ, కంస, పైఠక, అతిలోములను సంహరించాడు.
జంభమైరావతం చైవ విరూపం చ మహాయశాః ॥
జఘాన భరతశ్రేష్ఠ శంబరం చారిమర్దనమ్ ।
భరతశ్రేష్ఠా! మహాయశస్వి శ్రీకృష్ణుడు జంభ, ఐరావత, విరూపులను, శత్రుమర్దనుడైన శంబరాసురుని సంహరించాడు.
ఏష భోగవతీం గత్వా వాసుకిం భరతర్షభ ॥
నిర్జిత్య పుండరీకాక్షః రౌహిణేయమమోచయత్ ।
భరతశ్రేష్ఠా! పుండరీకాక్షుడైన ఈ కృష్ణుడు పాతాళలోకానికి వెళ్ళీ, వాసుకిని జయించి, రోహిణీకుమారుని బంధవిముక్తిని చేశాడు.
పర్వతానాం సహస్రం చ చక్రేణ పురుషోత్తమః ॥
విభిద్య పుండరీకాక్షః ద్యుమత్సేనమయోధయత్ ।
పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు తనచక్రంతో వేయిపర్వతాలను ఛేదించి, ద్యుమత్సేనునితో యుద్ధం చేశాడు.
మహేంద్రశిఖరే చైవ నిమేషాంతరచారిణౌ ॥
జగ్రాహ భరతశ్రేష్ట వరుణస్యాభితశ్చరౌ ।
ఇరావత్యాముభౌ చైతౌ అగ్నిసూర్యసమౌ బలే ॥
గోపతిస్తాళకేతుశ్చ నిహతౌ శార్ ఙ్గధన్వనా ।
భరతశ్రేష్ఠా! ఒక్కనిమిషంలో ఎక్కడికైనా సంచరింపగల వరుణుని రెండువైపులా తిరుగుతూన్న గోపతి, తాలకేతువు అనే రాక్షసులను శార్ ఙ్గధన్వుడైన శ్రీకృష్ణుడు మహేంద్రపర్వతశిఖరం మీద పట్టుకొని, ఇరావతీనదీతీరాన సంహరించాడు.
అక్షప్రపతనే చైవ నేమిహంసపథేషు చ ॥
ఉభౌ తావపి కృష్ణేన స్వరాష్ట్రే వినిపాతితౌ ।
అక్షప్రపతనమనే ప్రదేశంలో ఉన్న నేమిహంసపథమనే చోట ఉన్న ఇద్దరిని వారి స్వరాష్ట్రంలోనే పడగొట్టి కృష్ణుడు సంహరించాడు.
ప్రాగ్జ్యోతిషం పురశ్రేష్ఠమ్ అసురైర్బ హుభిర్వృతమ్ ।
ప్రాప్య లోహితకూటాని కృష్ణేన వరుణో జితః ॥
అజేయో దుష్ర్పధర్షశ్చ లోకపాలో మహాద్యుతిః ।
ప్రాగ్జ్యోతిషపురంనిండా చాలమంది రాక్షసులు ఆక్రమించి ఉన్నారు. కృష్ణుడు అక్కడున్న ఎర్రని పర్వతశిఖరాల పైకి వెళ్ళి ఇతరులకు ఎదిరింపశక్యంకాని, మహాతేజస్వి, లోకపాలుడు అయిన వరుణుని జయించాడు.
ఇంద్రద్వీపో మహేంద్రేణ గుప్తో మఘవతా స్వయమ్ ॥
పారిజాతో హృతః పార్థ కేశవేన బలీయసా ।
మహేంద్రుడు పారిజాతరక్షణ కోసం ఇంద్రద్వీపాన్ని స్వయంగా రక్షిస్తూండేవాడు. అయినప్పటికి బలవంతుడైన కేశవుడు ఆ పారిజాతాన్ని అపహరించి తీసికొని వచ్చాడు.
పాండ్యం పౌండ్రం చ మాత్స్యం చ కళింగం చ జనార్దనః ॥
జఘాన సహితాన్ సర్వాన్ అంగరాజం చ మాధవః ।
జనార్దనుడు పాండ్య, పౌండ్ర, మత్స్య, కళింగ, అంగ, రాజులను అందరినీ జయించాడు.
ఏష చైకశతం హత్వా రథేన క్షత్రపుంగవాన్ ॥
గాంధారీమనహత్ కృష్ణః మహిషీం యాదవర్షభః ।
కేవల రథసహాయంతో శ్రీకృష్ణుడు నూటొక్క క్షత్రియ శ్రేష్ఠులను సంహరించి, గాంధారరాజకుమారి అయిన శింశుమను తన పట్టమహిషిని చేసికొన్నాడు.
బభ్రోశ్చ ప్రియమన్విచ్ఛన్ ఏష చక్రగదాధరః ॥
వేణుదారిహృతాం భార్యామ్ ఉన్మమాథ యుధిష్ఠిర ।
యుధిష్ఠిరా! చక్రగదాధరుడైన శ్రీకృష్ణుడు బభ్రువునకు ప్రియాన్ని చేయగోరి వేణుదారిచే అపహరింపబడిన అతని భార్యను తిరిగి తీసికొని వచ్చాడు.
పర్యాప్తాం పృథివీమ్ సర్వాం సాశ్వాం సరథకుంజరామ్ ॥
వేణుదారివశే యుక్తాం జిగాయ మధుసూదనః ।
మధుసూదనుడు వేణుదారి వశంలో ఉన్న సమస్తభూమిని అశ్వరథ కుంజరాలతో సహా జయించాడు.
అవాప్య తపసా వీర్యం బలమోజశ్చ భారత ॥
త్రాసితాః సగణాః సర్వే బాణేన విబుధాధిపాః ।
వజ్రాశనిగదాపాశైః త్రాసయద్భిరనేకశః ॥
తస్య నాసీద్ రణే మృత్యుః దేవైరపి సవాసవైః ।
సోఽభిభూతశ్చ కృష్ణేన నిహతశ్చ మహాత్మనా ॥
ఛిత్త్వా బాహుసహస్రం తద్ గోవిందేన మహాత్మనా ।
భరతనందనా! తపస్సుచేత బలపరాక్రమతేజస్సులను పొందిన బాణాసురుడు దేవేంద్రునితో పాటు దేవతాగణాలన్నింటిని భయపెట్టాడు. యుద్ధంలో ఇంద్రునితో పాటు దేవతలంతా వజ్రాశని గదాపాశాస్త్రాలతో భయపెట్టినా అతడు మరణించలేదు. మహాత్ముడైన శ్రీకృష్ణుడు అతని సహస్రబాహువులను నరికి అతనిని చంపివేశాడు.
ఏష పీఠం మాహాబాహుః కంసం చ మధుసూదనః ॥
పైఠకం చాతిలోమానం నిజఘాన జనార్దనః ।
మధుసూదనుడైన జనార్దనుడు పీఠ, కంస, పైఠక, అతిలోములను సంహరించాడు.
జంభమైరావతం చైవ విరూపం చ మహాయశాః ॥
జఘాన భరతశ్రేష్ఠ శంబరం చారిమర్దనమ్ ।
భరతశ్రేష్ఠా! మహాయశస్వి శ్రీకృష్ణుడు జంభ, ఐరావత, విరూపులను, శత్రుమర్దనుడైన శంబరాసురుని సంహరించాడు.
ఏష భోగవతీం గత్వా వాసుకిం భరతర్షభ ॥
నిర్జిత్య పుండరీకాక్షః రౌహిణేయమమోచయత్ ।
భరతశ్రేష్ఠా! పుండరీకాక్షుడైన ఈ కృష్ణుడు పాతాళలోకానికి వెళ్ళీ, వాసుకిని జయించి, రోహిణీకుమారుని బంధవిముక్తిని చేశాడు.
ఏవం బహూని కర్మాణి శిశురేవ జనార్దనః ॥
కృతవాన్ పుండరీకాక్షః సంకర్షణసహాయవాన్ ।
ఈవిధంగా బాలుడుగా ఉండగానే పుండరీకాక్షుడు, జనార్దనుడు అయిన కృష్ణుడు బలరాముడుతోడు కాగా, చాలా పనులు చేశాడు.
ఏవమేషోఽసురాణాం చ సురాణాం చాపి సర్వశః ॥
భయాభయకరః కృష్ణః సర్వలోకేశ్వరః ప్రభుః ।
ఈవిధంగా శ్రీకృష్ణుడు అసురులకు భయంకరునిగ, సురలకు అభయంకరునిగా ఉంటూ సర్వలోకేశ్వరుడు, సర్వవ్యాపకుడు అయ్యాడు.
ఏవమేష మహాబాహుః శాస్తా సర్వదురాత్మనామ్ ॥
కృత్వా దేవార్థమమితం స్వస్థానం ప్రతిపత్స్యతే ।
ఈవిధంగా మహాబాహువైన ఈ కృష్ణుడు దురాత్ములందరిని శాసించి దేవతల కొరకు ఎంతో చేసి, స్వస్థానికి చేరుకొంటాడు.
ఏష భోగవతీమ్ రమ్యామ్ ఋషికాంతాం మహాయశాః ॥
ద్వారకామాత్మసాత్ కృత్వా సాగరం గమయిష్యతి ।
ఈ కృష్ణుడు భోగసంపన్నం, రమ్యం, మునులకు ఇష్టం అయిన ద్వారకానగరాన్ని శ్రీకృష్ణుడు ఆత్మ సాత్ కరించి సాగరంలో లయం చేస్తాడు.
తాం సూర్య సదనప్రఖ్యాం మనోజ్ఞాం శార్ ఙ్గధన్వనా ॥
విశ్లిష్టాం వాసుదేవేన సాగరః ప్లావయిష్యతి ।
సూర్యసదనం అని ప్రసిద్ధి వహించిన ఆ ద్వారకను కృష్ణుడు విడిచిపెట్టిన తరువాత సముద్రుడు తనలో ముంచెత్తుతాడు.
సురాసురమనుష్యేషు నాభూన్న భవితా క్వచిత్ ॥
యస్తామధ్యవసద్ రాజా అన్యత్ర మధుసూదనాత్ ।
మధుసూదనుని కంటె వేరొకరు సురాసుర మనుష్యులలో ద్వారకను అధివసింపగల రాజు మునుపు లేడు. ఇకపై ఉండబోడు.
భ్రాజమానాస్తు శిశవః వృష్ణ్యంధకమహారథాః ॥
తజ్జుష్టం ప్రతిపత్స్యంతే నాకపృష్ఠం గతాసవః ।
ఆ సమయంలో వృష్ణ్యంధకమహారథులు, వారి పిల్లలు ప్రాణత్యాగం చేసి భగవంతునితో పాటుగ పరమధామానికి చేరుతారు.
ఏవమేవ దశార్హాణాం విధాయ విధినా విధిమ్ ॥
విష్ణుర్నారాయణః సోమః సూర్యశ్చ సవితా స్వయమ్ ।
ఇదేవిధంగా దాశార్హవంశీయులందరికి విధిపూర్వకంగా అన్నికర్మలు నిర్వహిస్తాడు. ఇతడే విష్ణువు, నారాయణుడు, సోముడు, సూర్యుడు, సవిత కూడ.
అప్రమేయోఽనియోజ్యశ్చ యత్ర కామగమో వశీ ॥
మోదతే భగవాన్ భూతైః బాలః క్రీడనకైరివ ।
బాలుడు ఆటవస్తువులతో ఆనందించినట్లుగా భగవంతుడైన కృష్ణుడు ప్రాణులతో ఆనందంగా ఆడుకొంటాడు. అతడు ఎట్టి నియంత్రణ లేనివాడు. హద్దులేనివాడు. ఇచ్ఛానువర్తనం కలవాడు. అన్నింటిని తన వశంలో ఉంచుకొనేవాడూను.
నైష గర్భత్వమాపేదే న యోన్యామవసత్ ప్రభుః ॥
ఆత్మనస్తేజసా కృష్ణః సర్వేషామ్ కురుతే గతిమ్ ।
ఇతడు గర్భవాసమెరుగనివాడు, అయోనిజుడు. శ్రీకృష్ణుడు ఆత్మతేజస్సుచే అందరికి గతిని కల్పిస్తాడు.
యథా బుద్బుద ఉత్థాయ తత్రైవ ప్రవిలీయతే ॥
చరాచరాణి భూతాని తథా నారాయణే సదా ।
నీటి బుడగ ఉత్పన్నమై నీటిలోనే లీనమైనట్లుగా చరాచరభూతాలన్నీ నారాయణునిలోనే లీనమౌతాయి.
న ప్రమాతుం మహాబాహుః శక్యో భారత కేశవః ॥
పరం హ్యపరమేతస్మాద్ విశ్వరూపాన్న విద్యతే ।)
భరతనందనా! మహాబాహువైన కేశవుడు ఇదమిత్థంగా ఎవరికీ చెప్పశక్యం కాడు. ఈ సమస్త విశ్వంలో పరమాత్మకంటె వేరైన దేదీ లేదు.
అయం తు పురుషో బాలః శిశుపాలో న బుధ్యతే ।
సర్వత్ర సర్వదా కృష్ణం తస్మాదేవం ప్రభాషతే ॥ 30
ఈ బాలుడైన శిశుపాలుడు ఈ విషయం తెలియజాలడు. అందువల్ల అన్నిచోట్లా, ఎల్లపుడు కృష్ణుని గురించి ఈవిధంగా మాట్లాడుతుంటాడు. (30)
యో హి ధర్మం విచినుయాద్ ఉత్కృష్టం మతిమాన్ నరః ।
స వై పశ్యేద్ యథా ధర్మం న తథా చేదిరాడయమ్ ॥ 31
ఉత్కృష్టమైన ధర్మాన్ని వెతకగల్గిన బుద్ధిమంతుడే ధర్మాన్ని చూడగలడుగాని, చేదిరాజు శిశుపాలుడు చూడలేడు. (31)
స వృద్ధబాలేష్వథవా పార్థివేషు మహాత్మసు ।
కోనార్హం మన్యతే కృష్ణం కో వాప్యేనం న పూజయత్ ॥ 32
వృద్ధుల యందుకాని, బాలురయందుకాని, మహామతులైన రాజులందుగాని కృష్ణుని అనర్హునిగా ఎవడు భావిస్తాడు? ఎవడు ఇతనిని పూజించకుండా ఉంటాడు? (32)
అథైనాం దుష్కృతాం పూజాం శిశుపాలో వ్యవస్యతి ।
దుష్కృతాయాం యథాన్యాయం తథాయం కర్తుమర్హతి ॥ 33
ఇంకా ఈ శిశుపాలుడు ఈ గౌరవాన్ని దుష్కృతమని భావిస్తే, అనిచితపూజావిషయంలో ఏంచేస్తే ఉచితమో అలాగే చేసుకోవచ్చు. (33)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి అర్ఘాభిహరణపర్వణి భీష్మవాక్యే అష్టాత్రింశోఽధ్యాయః ॥ 38 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున అర్ఘాభిహరణపర్వమను ఉపపర్వమున భీష్మవాక్యమను ముప్పది ఎనిమిదవ అధ్యాయము. (38)
(దాక్షిణాత్య అధికపాఠము 728 1/2 శ్లోకములతో కలిపి మొత్తం 761 1/2 శ్లోకములు)